జనవరి 6, 2021: అమెరికా రాజ్యపీఠం (క్యాపిటల్ హిల్) గడగడలాడిన రోజు. ఎక్కడో వేరే దేశాల్లో ప్రభుత్వాల్ని పడగొట్టాల్సిన యు.ఎస్.ఏ సైనికులు, తమ దేశ రాజకీయనాయకుల రక్షణ కోసం రాజ్యపీఠంలో మొహరించాల్సివచ్చిన రోజు. ప్రపంచం నలుమూలల్లో, తనకు అనుకూలంగాలేని ప్రభుత్వాలను పడగొట్టి తన తోలుబొమ్మలుగా పనిచేసే నాయకులను గద్దెనెక్కిస్తుందని ఘనత గాంచిన యు.ఎస్.ఏ తన పనితనం తానే రుచి చూసిన రోజు.
‘ఇది మూడో ప్రపంచం కాదనీ, అమెరికా అంటే ఇది కాదనీ’ కొంతమంది రాజకీయ నాయకులు అంగలార్చారు. ‘ఇది యు ఎస్ ఏ, బనానా రిపబ్లిక్ కాదు’ అని మరికొందరు తల్లడిల్లారు.
ఇంతకీ బనానా రిపబ్లిక్ అంటే ఏమిటి? అదేదో అప్రజాస్వామిక దేశంలా అనిపిస్తుంది కదూ?
ఇప్పుడైతే రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్న ఏ దేశాన్నైనా బనానా రిపబ్లిక్ అని అంటున్నారు. కానీ అసలు కథ మధ్య అమెరికాలోని హండూరస్ దేశంలో మొదలైంది. మొదలుపెట్టింది యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అనే ఒక యు.ఎస్.ఏ కంపెనీ. ఇందుగలదందులేదని సందేహం వలదు అన్నట్లు హండూరస్ దేశం పండించే అరటిపళ్లను ఎగుమతిచేసే పని 1899లో మొదలుపెట్టి 1930 కల్లా మధ్య అమెరికా దేశాల్లోని 3.5 మిలియన్ ఎకరాల భూస్వామి అయింది యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ. ఆ దేశాల పోస్టల్, రోడ్లూ జలరవాణా సర్వీసులూ, అర్థిక పరిస్థితులనే కాకుండా ఏకంగా రాజకీయ పరిస్థితులను నియంత్రించే ఎత్తుకి ఎదిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి, తన వ్యాపారం లాభాలకు అడ్డురాని నియంతల్ని యు.ఎస్.ఏ ప్రభుత్వ సహకారంతో నాయకులుగా నిలబెట్టింది.
హండూరస్ లో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ చేస్తున్న దోపిడీని ప్రస్తావిస్తూ ఓ.హెన్రీ ‘బనానా రిపబ్లిక్ ‘ అని మొదటిసారి వాడారు. యు.ఎస్.ఏ ప్రభుత్వం అండదండలతో త్వరలోనే ఆ చుట్టుపక్కల దేశాల్లో బనానా రిపబ్లిక్ పరిస్థితులు ఏర్పాటుచేసుకున్న ఆ కంపెనీ, దానిలాంటి ఇతర మల్టీనేషనల్ కంపెనీలు ఎట్లాంటివో నెరూడా చెప్తాడు:
యునైటెడ్ ఫ్రూట్ కంపనీ
–పాబ్లో నెరూడ
బాకా మోగగానే
నేలమీద సమస్తమూ సిద్ధమయింది
ఇక అప్పుడు జహోవా ప్రపంచాన్నంతటినీ
కోక-కోలా, అనకొండ
ఫోర్డ్ మోటార్స్, ఇంకా కొన్ని కార్పోరేషన్లకు ఇచ్చేశాడు
అన్నిటికన్నా జ్యూసీ భాగం – అమెరికా సున్నితమైన నడుములాంటి నా ప్రపంచపు మధ్య తీరాన్ని తనకోసం అట్టిపెట్టుకుంది
యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ
అది ఈ దేశాలను బనానా రిపబ్లిక్కులని
మారుబాప్తిసం చేసింది
నిద్రపోతున్న శవాల సాక్షిగా,
పతాకాలనూ, స్వేచ్ఛనూ, గొప్ప కీర్తినీ
సంపాదించుకున్న చంచలమైన వీరుల సాక్షిగా
ఒక హాస్యనాటికను రచించింది.
అది స్వేచ్ఛను నిషేధించింది,
కిరీటాలను పంచింది, అసూయను ప్రోత్సహించింది,
దోమల్లాంటి నియంతలను ఆకర్షించింది:
ట్రూహియో దోమలు, టాచోస్ దోమలు,
కరియాస్ దోమలు, మార్టినెజ్ దోమలు,
ఉబికో దోమలు, అణిగిమణిగి ఉండడం అనే రక్త మిఠాయి అంటుకుని జిగట జిగటగా ఉన్న దోమలు
మనుషుల సమాధులపై ఝూమ్మంటూ ఎగిరే తాగుబోతు దోమలు,
సర్కస్ దోమలు, నిరంకుశపాలనలో నైపుణ్యం సాధించిన తెలివైన దోమలు
రక్తపిపాసి దోమలతోపాటే వచ్చింది
ఫ్రూట్ కంపెనీ
క్రుంగిపోయిన మా నేలనుంచి దోచిన ఖజానాతో నిండిన తట్టల్లా ఉన్న ఓడల్లో
కాఫీనీ, పండ్లనూ కూడబెట్టి సముద్రవ్యాపారానికి పంపింది.
ఈలోగా
ఇండియన్లు
ఓడరేవుల తీపి అగాథాల్లో పడి
తెలవారుఝాము పొగమంచులో కప్పబడిపోతారు .
ఒక శవం దొర్లిపోతుంది, అది
ఒక ఊరూ పేరులేని పదార్థం, అది
ఎవరో పారేసిన ఒక నంబరు, అది
చెత్తకుప్ప మీద పడేసిన కుళ్లిన పళ్ల గెల
యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ, దాని అండదండలతో అధికారంలోకి వచ్చిన రఫాయెల్ ట్రుహియో, హోర్హె ఉబిక్ వంటి నియంతలు దోమల్లా ప్రజలను ఎట్లా దోచుకుంటారో చెప్తుంది ఈ కవిత. అంతేకాదు, తమపై జరుగుతున్న దోపిడీపై తిరగబడకుండా అణిగిమణిగి పనిచేసే జనం కూడా ఈ దోమలు బలపడడానికి మంచి మిఠాయిలా దోహదం చేస్తారని అంటాడు. ప్రజల్ని పిప్పిచేసే ఈ కంపెనీలకు ఇండియన్లు (నేటివ్ అమెరికన్ తెగలకు చెందిన మనుషులు) వాడుకుని చెత్తకుప్పలో పడేసే ఒక వస్తువు లాంటి వారని అంటాడు.
తమ స్వంత భూమిలోనే బానిసల్లా పనిచేసే ప్రజలు తిరగబడో, ప్రజాస్వామికంగా ఎన్నికలలోనో నియంతల్ని తరిమెయ్యడం ఆ తిరుగుబాట్లనూ, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కి మరో నియంత అధికారంలోకి రావడం అన్నది మధ్య అమెరికా దేశాలకు నిత్యకృత్యమైపోయింది. ఈ నియంతలు తమ దేశాన్నే కాక చుట్టుపక్కల దేశాల్ని ఎట్లా నియంత్రిస్తారో ఎల్ సాల్వడోర్ కు చెందిన విప్లవకవి రోకె డాల్టన్ (Roque Dalton) ఇట్లా చెప్తాడు:
“నా దేశాధ్యక్షుడు
ప్రస్తుతానికి, కల్నల్ ఫిడెల్ సాంచెజ్ హెర్నాండెజ్
కానీ, నికరాగువా దేశాధ్యక్షుడు జనరల్ సొమోజా
కూడా నా దేశానికి అధ్యక్షుడే.
ఇంకా, పరగ్వే దేశాధ్యక్షుడైన జనరల్ స్ట్రోస్నర్
కూడా నా దేశానికి ఒక మాదిరి అధ్యక్షుడు లాంటి వాడే
కానీ, హండూరస్ దేశాధ్యక్షుడైన జనరల్ లోపెజ్ అరెయానొ అంత కాదు
కానీ, హయీతీ దేశాధ్యక్షుడు మన్సియోర్ దువాలిఎర్ కంటే ఎక్కువ అధ్యక్షుడు.
అంతేకాదు, యునైటేడ్ స్టేట్స్ అధ్యక్షుడు నా దేశానికి
నా దేశాధ్యక్షుడు – అదే ఇందాక ప్రస్తుతానికి అధ్యక్షుడు అని చెప్పానే – ఆ కల్నల్ ఫిడెల్ సాంచెజ్ హెర్నాండెజ్ కంటే ఎక్కువ అధ్యక్షుడు.”
ఆ యునైటేడ్ స్టేట్స్ దేశాధ్యక్షుడికి అధ్యక్షుడు యునైటెడ్ ఫ్రూట్ కంపెనీలాంటి కంపెనీలు.
ఈ కంపెనీలు జనజీవనాన్ని ఎంత నియంత్రిస్తాయంటే స్థానికులు తాగునీటి మీద హక్కులకోసం కూడా పోరాడాల్సి వచ్చిన పరిస్థితి. ఈ దోపిడీ ఇప్పటికీ కొనసాగుతుందనడానికి గత సంవత్సరం బొలివియాలో ప్రభుత్వం పై జరిగిన కుట్ర ఒక ఉదాహరణ. దీనికి సూత్రధారి టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్. ఎలెక్ట్రిక్ కార్ల బ్యాటరీలకు అవసరమైన లిథియం డిపాజిట్లు బొలివియాలో బయటపడ్డాయి. ఇతర దేశాలకంటే తక్కువ ధరకూ, తక్కువ లేబర్ ఛార్జీలకూ దొరుకుతుందని ఆ లిథియం డిపాజిట్లపై కన్నేశాడు ఎలాన్ మస్క్. కానీ తమ దేశంలోని సహజ వనరులపై అధికారం బొలివియన్ ప్రజలకే చెందుతుందని బొలివియా ప్రెసిడెంట్ ఇవో మొరాలిస్ శాసించాడు. ఇంకేం, కుట్రతో ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి నయాఉదారవాద ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సహాయం చేసింది యు.ఎస్.ఏ ప్రభుత్వం. ప్రజలు సంవత్సరం పాటు రోడ్లమీదకు వచ్చి పోరాడితేగాని మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. ఆ ఎన్నికల్లో ఇవో మొరాలిస్ కు చెందిన పార్టీ బంపర్ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ దేశంలోని అస్థిర పరిస్థితి గురించి ఎలాన్ మస్క్ ను అడిగితే, ‘ఏ ప్రభుత్వాన్ని కావాలనుకుంటే ఆ ప్రభుత్వాన్ని పడగొడతాం” అని జవాబు ఇచ్చాడు. ఆ జవాబు అతనిది మాత్రమే కాదు, యు.ఎస్.ఏ రాజకీయులది కూడా. ఏమంటే ఆ రాజకీయం బయటిదేశాలకే కాదు, యు.ఎస్.ఏ లోకి ఎప్పుడో చొరబడింది. ఆ విషయం జనవరి 6న బయటపడింది అంతే.
ఇప్పుడు యు.ఎస్.ఏ లో రాజకీయసంక్షోభానికి ముఖ్య కారణం డొనల్డ్ ట్రంప్. అధ్యక్షపదవిని అంటిపెట్టుకుని తనూ, తన కుటుంబమూ చేసే అక్రమ వ్యాపారలను కాపాడుకోవడనికీ, మరిన్ని బిలియన్లు దండుకోవడానికే. ఇతర దేశాల్లోకి దాష్టికంగా చొచ్చొకుని వెళ్లి ఎట్లాంటి నరకాన్ని సృష్టిస్తున్నారో యు.ఎస్.ఏ నాయకులకు ఇప్పటికైనా తెలుస్తుందా?