యువతే చోదకశక్తి

ఇటీవల కాలంలో అందరం గమనిస్తున్న విషయం ఒకటి ఉంది. అది ఏ ఒక్కరి ఆలోచనలని దాటిపోలేదనే అనుకుంటున్నా. ఎవరికి వారం మనుషులుగా మథన పడుతున్న అంశమే. ‘మన సమాజం మరింత సున్నితంగా మారుతుంది’. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద వాదనలు, అపార్థాలతో ఒకరి పట్ల మరొకరికి ద్వేషపూరిత వాతావరణం, దీనికి తోడు సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిజం-అబద్ధం తేడా లేకుండా నమ్మడం. ఆ నమ్మకాలతో వాదోపవాదాలు నిరాధారమైన కథనాలతో మతం, భాష, ప్రాంతం ఆధారంగా మనుషుల్ని వర్గీకరించే ధోరణి పెరుగుతుంది.

నేటి సమాజంలో కనిపిస్తున్న ఈ పరిస్థితుల వల్ల ప్రజలపై అనేక రూపాల్లో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. సామాన్యుడి జీవితం వివేచనాత్మక పరిశీలనతో కొనసాగించలేని దుస్థితికి దిగజారి పోతున్నది. ఇలా ప్రజల్లో అసంతృప్తి ప్రబలకుండా ఉండాలంటే నేటి యువత దృక్పథంలో వస్తున్న ఆలోచనలను పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఎంతైనా ఉంది.

యువత భవిష్యత్తు మీద ఆశతో, ఎన్నో ఆశయాలతో తమని తాము సమీకరించుకుంటూ సాగుతున్న తరుణంలో..

సామాజిక భద్రత పట్ల అవగాహన ఎంతమందికి ఉంది?! ఆ దారిలో నడుస్తున్న వారెవరు?!
సాహిత్య బాటలు పరుచుకుంటున్న వారెవరు?!
కొత్త తరం ఆలోచనలు ఎలా ఉన్నాయి?!
నేటి సాహిత్య అభిరుచి ఎలా మారుతుంది?! సామాజిక పరిణతిలో నేటి యువత పాత్ర ఏమిటి?!
ఇలా ఆలోచించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తూ యువకుల ప్రతిభకు వెలుగు బాటలు వేసేందుకు సమూహ సెక్యులర్ రైటర్ ఫోరం ఆధ్వర్యంలో ఈ “యూత్ లిటరేచర్ ఫెస్ట్” జరుపుతున్నారు.

సాహిత్యంలో యువత ప్రాముఖ్యత ఎంత అవసరమో చెబుతూనే యువతలోని ప్రతిభను, వారి మనోభావాలను ఒక వేదికగా పంచుకోవడానికి
‘words against walls – గోడల్ని ఛేదించే అక్షరాలు’ అన్న నినాదంతో వారిలోని సృజన శక్తిని పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ..

చదవడం- రాయడం- ఆలోచించడం అనే నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో భాగంగా యువ రచయితలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ఈ యూత్ లిటరేచర్ ఫెస్టు నిర్వహిస్తున్నారు.

యువత ఆలోచనలను పంచుకోవడంకోసమే..
సాహిత్యకారులతో ప్యానెల్ డిస్కషన్‌లు – ప్రసిద్ధ రచయితలతో చర్చా కార్యక్రమాలు., నాటకం, కవిత్వము, కథా రచనల ద్వారా వివిధ వేదికలను నిర్మిస్తోంది ‘సమూహ’.
ఈ వేదిక భిన్నతల్లోని అందం, సంఘీభావం లో బలం ఉందని చూపించే సాహిత్య వేదిక.

ఈ వేదిక యువత ఆలోచనలకు రూపం ఇవ్వాలని ఉద్దేశంతో యువత గళాన్ని ముక్తకంఠంలో వినిపించేలా సంగటిత పరుస్తోంది.

యువత ఆలోచనలు, విలువలు, సాంప్రదాయాలు,భాషా, కళలు జీవన విధానం శతాబ్దాలుగా ఉన్న పరిస్థితులను సమీకరించుకుంటూనే…ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే శక్తులపై నేటి సామాజిక ఆలోచనలను, ఫాసిజానికి వ్యతిరేకంగా వారి అభిప్రాయాలను సమీకరిస్తూనే ప్రజల హక్కులు, స్వేచ్ఛ ఎలా దుర్వినియోగం అవుతున్నాయో చర్చించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుకుందాం ఈ సందర్భంలో.

మాట్లాడే స్వేచ్చని, ప్రశ్నించే తత్వాన్ని అణిచివేయబడుతున్న తరుణంలో అత్యంత ఆవశ్యకత ఉన్నది సెక్యులర్ ఆలోచనలు రూపొందించుకోవడం.

సెక్యులర్ అనగానే మతం లేకపోవడం కాదు, మతాన్ని వ్యతిరేకించడం అంతకంటే కాదు. సెక్యులరిజం అంటే ఏ మతంలో ఉన్నా మనిషికి ఇచ్చే గౌరవం ఒక్కటే ఉండాలన్న భావన. ఈ భావనే మన “రాజ్యాంగంలో ఇవ్వబడిన మూల సూత్రం” కూడా ఇదే.

‘మన స్వేచ్ఛ, మన విలువలు, మన గౌరవం ఇవన్నీ సమానమైనవి అని చెప్పే అంశాలు’. ఈ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతదే.

“యువతే మార్పుని ముందుకు తీసుకెళ్లగలిగిన శక్తి” సామాజిక చైతన్యంతో కూడిన సమీకరణ ఎంతో అవసరం నేడు.
సమాజంలోని అభిప్రాయాలలో భిన్నత్వం సహజం. కానీ ద్వేషం సహజం కాదు. వివాదం సహజమే, కానీ విద్వేషాలు, విభజనలు మాత్రం సహజం కాదు.
ఈ చిన్న విషయాన్ని అందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

మన దేశానికి, మన సమాజానికి, మనం ఏమి ఇవ్వగలం?!
సమస్యలు వచ్చినప్పుడు మనం సంఘీభావంలోనే మన బలం ఉంటుంది. మన అందరిలోను వైవిధ్యమెంతవున్నా.. మానవత్వమే మన సంస్కృతిగా మార్చుకోవాలి. అందుకే భిన్నతలు ఎన్ని ఉన్నా మనందరి హక్కులు ఒక్కటే, మతం వ్యక్తిగతం సమానత్వం మన రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానం.

యూత్ లిటరరీ ఫెస్టివల్ పాల్గొనబోతున్న యువత..
మన సమాజంలో జరుగుతున్న మార్పుల్ని అర్థం చేసుకుని, అందులో మన పాత్ర ఏమిటో పట్టుదలగా ఆలోచించాల్సిన తరుణం ఇది.

మన దేశం, మన రాష్ట్రం- భిన్నతలతో పుట్టిన నేల.
ఎన్ని భాషలు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని మతాలు, ఎన్ని ఆచారాలు!
వాటన్నింటి మధ్య శాంతి, గౌరవం, పరస్పర సహజీవనం- ఇవే మన దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టాయి.

కానీ ఇంత భిన్నత ఉండే దేశంలో…
కొన్ని సార్లు అభిప్రాయాలలో, నమ్మకాలలో, గుర్తింపులలో తేడాలు వస్తాయి.
తేడాలు రావడం తప్పు కాదు
కానీ ఆ తేడాలను గొడవలుగా మార్చడం ప్రమాదం.

అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే వివేచనాపూర్వకమైన ఆలోచన ఎంతో ముఖ్యం.

ఆ దిశగా ప్రయాణిస్తూ…జరిగే
ఈ ఫెస్ట్, ఈ చర్చలు, ఈ వేదిక —
మనకు మాట చెప్పే ధైర్యం ఇస్తాయి.
మనకు ప్రశ్నించే హక్కు గుర్తు చేస్తాయి.
మనం సమాజం కోసం ఆలోచించేలా అవగాహనను పెంచుతాయి.

ఈ ఉత్సవంలో పాల్గొనటానికి రెండు రాష్ట్రాలలోని యువత ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం.. ఆరోజు మనందరం కూడా సమూహంలో భాగమై వారి భావాలను పంచుకునే వేదికలను విందాం రండి.

ఈ ఉత్సవం ఏ పార్టీ, ఏ సిద్ధాంతం, ఏ గుంపుకూ చెందింది కాదు. అందరికీ అందుబాటులో ఉండే ప్రజాస్వామ్య వేదిక అని తెలియజేసే ప్రయత్నం ‘సమూహా’ తలకెత్తుకుంది.
స్టేజ్ రీడింగ్ సెషన్లు – యువ రచయితలు తమ రచనలను ప్రత్యక్షంగా చదవడం.,
చిన్న చిన్న సమూహ చర్చలు.,
పుస్తక పఠనం, సమావేశాలు
ఇవి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయని నమ్మకంతో.

సామాజిక చైతన్యంతో నడిచే ఈ కార్యక్రమంలో భాగమవుదాం రండి.

  • రూప రుక్మిణి.కె (9441133071)
    కార్యవర్గ సభ్యులు
    సమూహ సెక్యులర్ రైటర్ ఫోరం

Leave a Reply