యుద్ధ జ్వాలలు లేస్తున్నవి

అవతలి వైపు
కాలం మారుతున్నది
గంటలు గడిచి పోతాయి
మెల్లగా చీకటి ముసురుకుంటది
ఆకాశం నల్లని దుస్తుల్ని విడిచేసి
ఉదయాన్ని తొడుక్కుంటది

కానీ
రక్తమోడుతున్న ఈ నెలకు
సంతాప సూచకంగా
మాకు నల్లని దుస్తులే శాశ్వతమయ్యాయి

నా రూములో
గోడ గడియారం పగిలిపోయింది
అందరి రూముల్లోనూ
పగిలిన గడియారాలే

అందరూ
అమృత ఘడియల కోసం
ఎదురుచూస్తున్నారంటుంది అమ్మ

అదేమో గాని
ఈ పుణ్యభూమిలో
మేము పడుకొని లేచేది
బాంబుల శబ్దాలతోనే

ఆకాశం ఎప్పుడు
అమరుల రక్తంతో
ఎర్రబడే ఉంటుంది

చావు
మా వెంట నడుస్తూ ఉంటది
మేం స్వేచ్ఛ కోసం నడుస్తాం

పగిలిన కిటికీ అద్దాల మీదుగా
మా కథల్నీ, జీవన రహస్యాల్నీ దాచిన
మా ఇండ్ల శిథిలాల మీదుగా
పిల్లల హాహాకారాల మధ్యన
తల్లుల మూలుగుల మధ్యన
మేము నడక
సాగిస్తూనే ఉంటాం
          ***

మూలం : నదీనే (Gaza Poets’ Society) కవిత “The Flames of War are Burning”కు స్వేచ్ఛానువాదం.

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply