ఇక్కడో చెయ్యి
అక్కడో కాలు
ఊపిరి ఆగిపోయిన తల!
కదులుతుంటే
కాళ్ళకు తగిలే
ఖండిత వక్షోజాలు!
వీర గర్వం తో ఊపుతోంది
శతృ సింహం జూలు!
రాబందు పిలుస్తోంది
బంధు వర్గాన్ని
వైతరిణి స్నానానికి!
పసి మనసు కి
అర్ధం కాలేదు
పువ్వులు నవ్వులు
తుపాకి కింద ఎందుకు
నలిగి పోయాయో?
కొండ మీద నున్న
తాత వేణువు
పొగ రేణువుల్లో
ఎందుకు
చిక్కుకు పోయిందో?
నల్ల చీర తో
ఎర్ర నాలుక తో
తీతువుల మోత తో
ఆకాశం పారుతోంది!
కలల పావురాలు
ట్రిగ్గర్ అంచున
నేలకూలాయి!
నడిచే పసిపాదాలకు
నడకెటో తెలియని దారుల్లో
తెగి పడ్డ జ్ఞాపకాలు
ఆ మృత వీరులు!
కొండ అంచున
సైనికుడి బూటు కింద
ఒక గడ్డి పువ్వు నవ్వుతూ……
ఆశ మళ్ళీ చిగురేసింది
మానవత్వం మొలకొచ్చింది