ఎప్పుడో ఒకప్పుడు
యుద్ధమాగిపోవొచ్చు
కాని..
శ్యామ్యూల్, బ్రూనోల
శవాలుగాలిన వాసన
గాలిలో తేలియాడుతూ
తల్లుల జ్ఞాపకాలమీద హోరెత్తుతుంటది
మెలమెల్లగా
“జ్ఞాపకాలనదిని
కాలపు ఒండ్రుమట్టి గప్పేస్తది”
మనుష్యుల స్వార్థం కింద
జ్ఞాపకాలు
శకలాలు శకలాలుగ రాలిపడ్తయ్
***
రేపు…
ఈ యుద్ధం ముగిసిపోవొచ్చు
ప్రత్యర్థులు ఒకేచోట
విందారగించవొచ్చు..
కాని..
ఓ గాజుకళ్ళ పిల్లమాత్రం
శూన్యంలోకి చూస్తో
తండ్రి ఇచ్చిన చివరిముద్దును
ప్రేమకానుకగ దాచుకుంటది
ఐనా… ఈయుద్ధమాగేదిగాదు
రూపంమార్చుకుని వెంటాడుతుంది..
నిన్నటి వసంతాలు గోల్పోయిన
వర్తమానం డొల్లగా మారుతుంది
భవిష్యత్ లో
కపాలాలు వేలాడేసుకు అఘోరాలు
సహస్ర శిరస్సుల వింత ఆకారాలు
బాకాలు మోగిస్తూ
వీధుల్లో వికృత నాట్యాలు జేస్తాయి
***
బతుకు మిథ్య
చావునిజం..
రోజులు గడిచిపోతాయి
హిట్లర్ లూ
పుతిన్ లూ
బుష్ లూ
గుజరాత్ పాలకులూ
మిగిలిపోతారు..
మనం మాత్రం
మౌన ప్రేక్షకులమై చూస్తుండిపోతాం..
నిరంతర నిరర్థక యుద్ధం సాక్షిగా
సముద్ర తీరానికి
బాలుని శవమొకటి* కొట్టుకువొస్తుంది
తుపాకి గుండుకు చెదిరిన పక్షుల్లా
శరణార్థులు
సరిహద్దులు దాటుతూ
శవాలుగ మారిపోతారు
ఫెలీనాలాంటి అమ్మాయిలు
సరిహద్దు ముళ్ళకంచెకు
చిరిగిన వస్త్రాలై వేలాడుతుంటారు
మతి మరుపే… సర్వరోగ నివారిణి
చరిత్ర…. ఓ మృత్యుగీతం
మానవజాతి… మహా శ్మశానం
****
మూలం : మోమితా ఆలం
గమనిక :
శ్యామ్యూల్, బ్రూనోలు: The boy striped in pajamas అనే సినిమాలోని పాత్రలు. యుద్ధభీభత్సంలో సమిధలుగా మారడాన్ని చూపిస్తారు.
*యుద్ధానికి బలైపోయి, సముద్రతీరానికి కొట్టుకు వొచ్చిన..ఆలాన్ కుర్ది.
*ఫెలానీ : భారతదేశం నుండి బంగ్లాదేశ్ పారిపోతూ, బి.ఎస్.ఎఫ్. జవాన్ల తూటాలకు బలైపోయిన పదిహేనేళ్ల బాలిక
*కొటేషన్ లోని వాక్యాలు: మహాశ్వేతాదేవి మాటలు
మతి మరుపే సర్వ రోగ నివారిణి