యథార్థ జీవిత కథనాలు

అమెరికా న్యూ జెర్సీకి చెందిన యువ రచయిత్రి Isabel Bandeira చెప్పిన ‘Fiction is the best kind of reality’ అన్న మాట సాహిత్య ప్రపంచంలో యిటీవల చాలా ప్రాచుర్యం పొందింది కానీ కరుణ కరుణలాంటి మరి కొందరు రాస్తున్న కథలు చదివినప్పుడు యిందుకు వ్యతిరిక్తమైన అనుభవం కలుగుతుంది; వాస్తవికతని మించిన కాల్పనికత వేరే యేదీ లేదనిపిస్తుంది. ఆ కథల్లోని వాస్తవికతే పాఠకుల్ని కట్టిపడేస్తుంది. కంట తడి పెట్టిస్తుంది. ఆగ్రహాన్ని కలిగిస్తుంది. అంతర్ముఖుల్ని చేస్తుంది. ఆలోచనల్ని ప్రేరేపిస్తుంది. ఆచరణోన్ముఖుల్ని చేస్తుంది.

సాహిత్య పఠనానుభవాలు అందరికీ అన్ని సార్లూ వొకేలా వుండవు. ఒకే పాఠ్యం సైతం భిన్న సందర్భాల్లో భిన్న అనుభూతులకు కారణమౌతుంది. ఒక సారి వొక పఠనం మెదడుకి పనిపెడితే మరో సారి వుద్వేగాలకు ఆలవాలమవుతుంది. ఉదాహరణకి మిడ్కో ‘మెట్ల మీద’ కథల్ని తొలిసారి చదివినప్పుడు కల్గిన అనుభూతి గాఢత వేరు, మలిసారి వియ్యుక్క సంకలనంలో అధ్యయనం చేసినప్పుడు కల్గిన సాంద్రత వేరు. ఆమె మరణంలో అవే కథలు అలవి కాని దుఃఖ తీవ్రతకి నెలవయ్యాయి. ఇప్పుడు కరుణ వుద్యమ జీవితానుభవాలు వొకచోట చూసినప్పుడు అటువంటి వుద్వేగమే వుక్కిరిబిక్కిరి చేస్తోంది. విప్లవోద్యమం సంక్షోభ పరిస్థితులు యెదుర్కొంటున్న క్లిష్టకాలంలో కరుణ తన మెదడు పొరల్లో నుంచి తవ్వి పోస్తోన్న అనేక వుద్యమ అనుభవాలు జ్ఞాపకాలు వాటిలో ప్రసక్తమైన వ్యక్తుల ఆనవాళ్ళు తెలీని సంవేదనకు గురిచేస్తాయి. కరుణ కేవలం తనకు తెలిసిన ఘటనలని నమోదు చేయడానికి పరిమితం కాలేదు; వాటి చుట్టూ అల్లుకుని వున్న ఆలోచనల్నీ ఆచరణలో యెదురైన వైరుధ్యాల్నీ అందుకు మూలమైన సాంస్కృతిక సామాజిక కోణాల్నీ చర్చకు పెట్టింది. ఆ క్రమంలో పార్టీ విధానాల్నీ వ్యక్తుల బలాబలాల్నీ తన లోపలి ఘర్షణనీ నిర్మమంగా అక్షరీకరించింది. వాస్తవిక ఘటనలకు కాల్పనిక సాహిత్య రూపం యివ్వడంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంది. కథలో కథనంలో పాత్రగా వుంటూనే తాటస్త్యాన్ని (aesthetic distance) పాటించింది.

అందువల్ల యీ సంపుటిలో నమోదు చేసిన అంశాలన్నీ దాదాపు నోస్టాల్జియానే అయినప్పటికీ కరుణ చేతిలో అవి సృజనాత్మక కథనాలుగా రూపొందాయి. నిత్యం మృత్యువుతో తలపడే జీవిత నేపథ్యంలో రాసిన కరుణ మునుపటి రచనల కంటే యివి భిన్నమైనవి. గతానికి చెందిన తలపోతల నుంచి వెలువడ్డ యీ రచనల్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. అది గతమే అయినప్పటికీ వర్తమానానికి అన్వయించుకున్నప్పుడు విప్లవ పంథాకు చెందిన కొత్త యెరుక యేర్పడుతుంది. ఉద్యమ సాఫల్య వైఫల్యాలకు చెందిన భిన్న కోణాలు అర్థమౌతాయి. ఉద్యమం భవిష్యదాచరణ పాఠాలు సైతం కొన్ని చోట్ల వ్యక్తమౌతాయి.

పని మీద బయటికి వచ్చిన సందర్భంలో దీప (ఉద్యమ కథల్లో ఆమె పేరు) జీవిత సహచరుణ్ణి కోల్పోయింది. దిగ్భ్రాంతికి గురైంది. అలవి గాని దుఃఖంలో కూరుకుపోయింది. కాంటాక్ట్ దొరకబట్టుకొని లోపలి వెళ్ళింది. కొంతకాలం తర్వాత ఆరోగ్యం బాగోక చూయించుకోడానికి బయటికి వచ్చింది గానీ మళ్ళీ కాంటాక్ట్ తెగిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. కుటుంబమొక పద్మవ్యూహం. సమాజం మరొక యుద్ధక్షేత్రం. అరణ్యం కంటే దుర్గమం. సముద్రం కంటే అగాథం. అభద్రతకు నెలవు. ఒంటరిగానే బతుకు పోరాటంలోకి దిగింది. బయటి ప్రపంచంలోని సంక్లిష్టతలు ఆమెకు అగమ్య గోచరంగా అనిపించాయి. ‘జీవితం’ కొత్తగా పురుడుపోసుకోవాలి. ఆత్మగౌరవం కాపాడుకొంటూ సాహిత్య పరిచయాలతో నూత్న ప్రస్థానం మొదలుపెట్టింది. కొంత కుదురుకున్నాకా గతాన్ని నెమరువేసుకునే క్రమంలో యీ కథలు పుట్టాయి. ఆమె చిత్రించిన స్మృతులు సజీవమైనవే గానీ మధురమైనవేం కావు. చేదు జ్ఞాపకాలే యెక్కువ. ‘మంజీరా అడుగుజాడల అన్వేషణ’లో యిటీవలే రాసిన కథనం (కథ కానీ కథ) యెంత విషాదభరితమో చూడండి. దుఃఖపు బావి తోడుకున్నట్టే వుంటుంది. ఉద్యమ జీవితానుభవాల గురించి రాయడం ఆమెకు కొత్తేమీ కాదు. కానీ అప్పటి మానసిక స్థితిని యథాతథంగా నమోదు చేయడం ఆరిన గాయాన్ని కుళ్ళగించడమే. తవ్వుకోవడంలో యాతన అనుభవైకవేద్యం. కరుణ జ్ఞాపకాలు తనవి మాత్రమే కాదు. వాటిలో యెన్నో అజ్ఞాత రహస్య జీవితాలు దాగి వున్నాయి. పార్టీ విప్లవ పంథాలు దీర్ఘకాలిక ప్రణాళికలు తక్షణ వ్యూహాలు యిమిడి వున్నాయి. ప్రత్యామ్నాయ ఆలోచనలున్నాయి. సున్నితమైన తీక్ష్ణమైన గంభీరమైన చర్చలున్నాయి. వాటితో వెన్నంటి వచ్చే యెందరో అమరుల ఆచరణ ఆశయాలు ఆలోచనలు ముడివడి వున్నాయి. అన్నిటినీ ఫిల్టర్ చేయకుండా చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. అలా అన్జెప్పి మరుగు పరచి దాచి చెప్పడం ఆమెకు యిష్టం కాదు. విశ్వసనీయతకు విఘాతం కలగకుండా యిటువంటి రచన చేయడం కత్తి మీద సామే. దాన్ని ఆమె నిర్వహించిన తీరు యిదిగో మన ముందుంది.

*

విప్లవోద్యమం ఆర్ధిక నియతివాదంలో కూరుకుపోవడం వల్ల దళ చర్యలకు పరిమితం కావడం వల్ల రాజకీయ పోరాటాలకు యిచ్చినంత ప్రాముఖ్యం సాంస్కృతిక పోరాటాలకు యివ్వలేదని సాధారణంగా వినిపించే ఆరోపణ. విప్లవ సాహిత్యం దాన్ని పరాస్తం చేసిందనడానికి యీ సంపుటిలో కరుణ చెప్పిన ‘ఆదివాసీలు అంటరానితనం’, ‘గొడ్డు మాంసం’, ‘జాకెట్ సోకా?’ కథలు వుదాహరణలుగా నిలుస్తాయి. ఆదివాసీ సమాజంలోని సాంస్కృతిక వైరుధ్యాల్ని పరిష్కరించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యీ కథలు అప్రమత్తం చేస్తాయి. నిన్నా మొన్నటి సల్వాజుడుం రౌడీ మూకలు దగ్గర్నుంచీ వారి నుంచి తయారైన యస్పీవోలు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి పాలకులు నిర్మించిన యివ్వాళ్టి డిఆర్జీ దళాల వరకూ అన్నీ ఆదివాసీలని అడవి నుంచి దూరం చేసి ప్రాకృతిక సంపదను కార్పొరేట్ కి అప్పగించడానికి వుద్దేశించినవే. ఆదివాసీ కళ్ళని వారి వేళ్ళతోనే పొడిచే యీ దుర్మార్గాన్ని వనవాసి కళ్యాణ పథకాలతో సంఘ పరివార శక్తులు యెప్పుడో మొదలుపెట్టాయి. మెజారిటీ హిందూ మతం దానికే సొంతమైన అసమానతల్నీ ఆధిపత్య భావనల్నీ మౌఢ్యాన్నీ ఆదివాసీ సమాజంలోకి సైతం చొప్పించింది. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీని సాంస్కృతికంగా పరాయీకరించే కుట్రలని విప్లవోద్యమం తొలి రోజుల్లోనే గుర్తించి దానికి విరుగుడు గురించి ఆలోచించిందని కరుణ కథనాలు తెలియజేస్తున్నాయి. పెళ్లయిన గోండి ఆదివాసీ స్త్రీలు జాకెట్ ధరించరాదు వంటి ఖాయిదాలని (రివాజులని) గుర్తించి ఆధునిక దృష్టితో సంస్కరించడానికి పూనుకున్నప్పుడు పాటించాల్సిన జాగరూకత పట్ల కూడా పార్టీకి స్పష్టమైన వైఖరి వుందని కరుణ మరోసారి రుజువుపరచింది. అలాగే ఆదివాసీల ఆహారపు అలవాట్లని గౌరవించి స్వీకరించినప్పుడే దళ సభ్యులు వారితో మమేకం కాగలరనీ ఆమె తన కథనాల ద్వారా బలపరిచింది.

అలాగే విప్లవోద్యమాల్లో స్త్రీపురుష సంబంధాల గురించి లోపలా బయటా యెంతో ఆసక్తి, యెన్నో సందేహాలు, అపోహలు. పాలక వర్గాలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారం వొక యెత్తయితే, వుద్యమ భావజాలాన్ని సైద్ధాంతికంగా యెదుర్కోలేక వుద్యమకారుల నైతిక వర్తనపై బురద జల్లడానికి మరీ ముఖ్యంగా పితృస్వామ్య విలువలతో స్త్రీల శీల హననానికి చేసే కువిమర్శలు మరో యెత్తు. ఇవి గాక కొన్నాళ్ళు వుద్యమ జీవితం గడిపి బయటకు వచ్చిన స్త్రీలు విధాన నిర్ణయాల్లో, యితరత్రా తామెదుర్కొన్న జెండర్ వివక్ష గురించి లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించిన అంశాలు కూడా సాహిత్యంలో చర్చకు కారణమయ్యాయి.

ఆ నేపథ్యంలో వుద్యమాల్లో వొకే మార్గంలో పయనించే క్రమంలో యిద్దరు స్త్రీ పురుషుల మధ్య యేర్పడే సాన్నిహిత్యం సాహచర్యంగా మారినప్పుడు ఆ బంధం యెలా వుంటుందో స్వేచ్ఛా సమానత్వ భావనలతో యెంత ప్రజాస్వామికంగా వుంటుందో అతి సున్నితంగా ఆవిష్కరించిన కథలు కరుణ యింతకు మునుపు కూడా చెప్పినప్పటికీ కఠినమైన క్రమశిక్షణ మధ్య నిత్య నిర్బంధాల మధ్య అనుక్షణం ప్రమాదాల అంచున నడిచే దళ జీవితంలో స్త్రీ పురుష సంబంధాలు యెంత సున్నితంగా వుద్వేగభరితంగా మానవీయంగా వుంటాయో ‘ప్చ్ ..’ కథలో కరుణ చాలా ‘ఆత్మీయం’గా పాఠకుల ముందుంచింది.

ఈ సంపుటిలో ఊర్మిళ ‘పెళ్ళి’ కథ ప్రత్యేకమైనది. ఇంట్లో పెళ్లి గొడవ భరించలేక వుద్యమంలో చేరితే అక్కడ కూడా పెళ్లి ప్రసక్తి తీసుకురావడం ఊర్మిళకు కోపం తెప్పిస్తుంది. ఇక్కడ ‘మీరూ అదే గోలా?’ అని నాయకత్వాన్ని నిలదీస్తుంది. పెళ్లి ప్రేమల చుట్టూ చోటు చేసుకునే పార్టీ పెద్దరికాలు యీ కథలో చర్చకు వస్తాయి. ఊర్మిళ పెళ్ళి నెపంతో వుద్యమం లోపల అమల్లో వున్న దంపతీ సంబంధాల గురించి ‘కట్టుబాట్లు’ గురించి రచయిత చేసిన పరిశీలనలు గమనార్హాలు. పెళ్ళి మానుకొని విప్లవోద్యమానికి జీవితం అంకితం చేసిన ఊర్మిళ కగార్ యుద్ధంలో అమరురాలైనప్పుడు ఎఫ్బీలో కరుణ పంచుకున్న దుఃఖపు చెమ్మ యింకా ఆరలేదు. ఈ యేడాది – రెండేళ్లలో మరణించిన వందలాది మంది వీరులు కరుణ కథలు చదువుతుంటే కళ్ళముందు కదలాడతారు. పౌర సమాజానికి యెన్నో ప్రశ్నలు సంధిస్తారు. తమ త్యాగాలు వృథా పోకూడదని హామీ అడుగుతారు. ఇద్దామా?

*

ఫలానా తేదీ లోపల విప్లవోద్యమాన్ని నిర్మూలిస్తామని పాలకులు అంతిమ యుద్ధాన్ని ప్రకటించి మారణకాండకు తెగబడిన వేళ, మారిన పరిస్థితుల్లో దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని కొందరు ప్రజా యుద్ధ పంథా విఫలమైండి కాబట్టి సాయుధపోరాట కొనసాగించరాదని మరి కొందరు దశాబ్దాల తమ విప్లవ జీవితాన్ని రద్దుచేసుకుంటున్న సమయంలో, విప్లవోద్యమ భవితవ్యం చుట్టూ అనేకానేక ప్రశ్నలు పొడచూపుతున్న సందర్భంలో వర్గపోరాట రాజకీయాలను అర్థం చేసుకునేందుకు, విప్లవోద్యమం సాధించిన విజయాలను, ఆదివాసీలు అందించిన పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకునేందుకు కరుణ రాస్తోన్న విప్లవావోద్యమ కథలు చదవాల్సిందే.

కరుణ కథల్లో ప్రజల పట్ల విప్లవకారుల నిబద్ధత ఆచరణ హృదయాల్ని కదిలిస్తాయి. బసవరాజ్ అనిత కౌముది సుగుణ జూరీ కోస దాదా నర్మద రాజిరెడ్డి మంజీరా .. యెంత అద్భుతమైన మనుషులు వీళ్లంతా! సమాజాన్ని మానవీయంగా తీర్చిదిద్దడానికి జీవితాల్ని అర్పించిన కరుణ ఉద్యమ సహచరులంతా యీ కథల్లో పాత్రలై తమ వ్యక్తిత్వాలతో మనల్ని పలకరిస్తారు. పిడికిలి బిగించి లాల్ సలాం చెబుతారు. ఆ విధంగా విభజన రేఖలో కథలేవీ కట్టుకథలు కావు, యథార్థ ఘటనలే. ఆమె మాటల్లోనే చెప్పాలంటే కథ కాని కథలు యివి. ఉద్యమంతో తెంచుకోలేని మానసిక బంధమే కరుణతో యీ రాయిస్తుందని నా నమ్మకం. బయటి ప్రపంచంలోని సంక్లిష్టతలు ఆమెలోని రచయితను మరింతగా సాన పట్టడానికి తోడ్పడ్డాయేమో!

వాస్తవానికి లోపల బయట అని గీతలు గీయలేం. దేశమే నిర్బంధ శిబిరంగానో బహిరంగ కారాగారంగానో మారిన కాలంలో అందరం ప్రత్యక్ష పరోక్ష పీడననీ అణచివేతనీ యెదుర్కొంటున్నవాళ్ళమే. ఉద్యమం లోపలి కథల్లోనే కాదు: బయటి జీవితంలోని వ్యక్తుల అనుభవాలతో అల్లిన ‘ఏం జరిగింది’ కథ చూడండి. మగ్గాలు మూలబడి వృత్తి నైపుణ్యాలు వుపయోగించే అవకాశాలు నశించి చేనూ చెలకా కోల్పోయి మరొకరి పొలంలో కూలీగా మారిన చేనేత కార్మికుడు శీనయ్య, కాపురాలు పాడైపోయిన కన్న బిడ్డలు కళ్ళముందే వల్లకాడు లాంటి కొంపలో శవాల్లా నిష్క్రియగా తిరుగాడుతుంటే తట్టుకోలేని ఎల్లమ్మ .. వాళ్ళ బతుకులు బండలు కావడానికి కారణమైన దృశ్యాదృశ్య శక్తులేవి? కష్టాల నుంచి బయటపడే తండ్లాటలో వాళ్ళు మరిన్ని కష్టాల్లో యెందుకు కూరుకుపోయారు? అసలు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందీ విడమరిచి వివరం చెప్పగల, చెప్పి వోదార్చగల, వోదార్చి అండగా నిలబడగల మనసున్న మనుషులెవరైనా వున్నారా అన్న ప్రశ్నలు కథ చదివాకా మనల్ని వొదలవు. ‘రాత గట్లుంది’ అని వూరడించడమే పరిష్కారం కాదుగానీ ఆ మాత్రం మాట సాయం చేసేవాళ్ళు సైతం కరువైన కాలంలో మానవ సంబంధాల్లో కాపాడుకోవాల్సిన సున్నితత్వాల్ని కథ బలంగా ఆవిష్కరించింది. అంతా తలరాత అంటే మాటవరసకైనా ఎల్లమ్మ వొప్పుకోదు. ఏం జరిగింది అని రచయిత ప్రశ్నించింది కానీ ఏం జరిగిందో మనకు తెలుసు. అందుకు కారణాలు తెలుసు. దాన్నుంచి బయటపడేసే అనివార్యమైన ప్రాపంచిక చింతనని మనం రూపొందించుకున్నాం. మార్గం కూడా నిర్మించుకున్నాం. ఊర్మిళ నిర్మల నర్మద అనిత సుగుణ వీళ్ళందరూ ఆ మార్గంలో నడుస్తూనే అమరులయ్యారు. అయినా సంక్షోభం నివారించలేనితనం. అలవి కాని తాయమ్మ దుఃఖం, వొడవని కవులమ్మ మౌనం, ఎడతెగని ఎల్లమ్మ వుక్రోష ఆక్రోశాలు మనుషుల జీవితాలు యెంత కఠినంగా తయారవుతున్నాయో చెప్పడానికి కరుణ యెన్నుకున్న మాధ్యమాలు. వాటిని కథలు మలచడంలోనే ఆమె నేర్పు కనిపిస్తుంది. ఒక నిష్ఠుర వాస్తవికతని కాల్పనిక తలంలోకి సృజనాత్మకంగా మళ్ళించడానికి అవసరమైన కథన శిల్ప విద్య కరుణ సొంతం. లేకుంటే మహిళా కామ్రేడ్స్ యెదుర్కొనే నెలసరి సమస్యని వస్తువుగా ‘బలహీనులు’ వంటి కథ కట్టడం అసాధ్యం. అసలు విప్లవాచరణలోనే నిర్మాణంలోనే సృజనాత్మకత, శిల్పం వున్నాయని చెప్పక తప్పదు.

*

విప్లవోద్యమాలు ఆటుపోట్లకు గెలుపోటములకు గురవడం సహజం. కొన్ని తప్పటడుగులు కూడా వుండొచ్చు. వ్యూహాత్మకంగా వెనుకంజ వేయాల్సి రావొచ్చు. వరుస పరాజయాలు యెదురు కావొచ్చు. అయితే అది అంతం అని గతి సూత్రాలు తెలిసినవారెవరూ అనరు. సమాజంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాలున్న వర్గాలున్నప్పుడు ఘర్షణ అనివార్యం. తాత్కాలికమైన ఓటములతోనో విజయాలతోనో రాజీలతోనో సర్దుబాట్లతోనో ఘర్షణ నెమ్మదించవచ్చునేమో గానీ వైరుధ్యాలు సమసిపోయేదాకా పోరాటం పునరావృతమవుతూనే వుంటుంది. వర్గాలు రద్దు కానంతవరకూ వర్గ పోరాటాల ప్రాసంగికత ముగియదు. ఇది మానవ సమాజానికి మార్క్సిజం అందించిన మౌలిక సూత్రం. దీనికి భిన్నంగా చేసే ఆలోచన నేలవిడిచి చేసే సాము లాంటిదే. ప్రజా వుద్యమాలు సెట్ బ్యాక్ కి గురైనప్పుడు భవిష్యత్తు పట్ల అనేక సందేహాలు కలుగుతాయి. అలాంటప్పుడు గతంలోకి వెళ్లి చూడాలి. చరిత్రను గతితార్కిక దృక్పథంతో అర్థం చేసుకోవాలి. పోరాటాల్లో ప్రజలు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి. అంతిమంగా ప్రజా యుద్ధాలన్నీ గెలిచాయి, గెలుస్తాయి అన్న భరోసా కోసం ఓటమి కలిగించే నైరాశ్యాన్ని జయించడం కోసం విప్లవాచరణకు పునరంకితమడానికీ విజయ గాథలని మననం చేసుకోవాలి. పాత పోరాటాల త్యాగాల జ్ఞప్తి కొత్త స్ఫూర్తికి పునరుత్తేజానికి దోహదం చేస్తుంది. అందుకు యిటువంటి కథలు తోడ్పడతాయి. ప్రేమంటే ఇదేనా, విభజన రేఖ కథల్లో చిత్రించిన విధంగా వుద్యమాన్ని కడుపున దాచుకుని కాపాడుకొనే తల్లులు వున్నంతకాలం ప్రజా యుద్ధం అజేయమనే విశ్వాసం చెదరదు. కరుణ తన జ్ఞాపకాల కథల్ని యిప్పుడు వెలువరించడంలో ఆశించిన ప్రయోజనం అదే.

రెడ్ సెల్యూట్స్. లాంగ్ లివ్ పీపుల్స్ రివల్యూషన్.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply