ఆకాశం చిల్లులు పడ్డట్టు
ఒకటే వాన!
అయిన వాళ్ళందరినీ
పోగొట్టుకుని
తల్లులు వలసెల్లిన వో బిడ్డ
గుండెలు బాదుకుని
గుక్కపట్టి ఏడ్చినట్లు…
గాజా నుండి
గాడ్చిరోలి దాకా
వొరదెత్తిన పసిబిడ్డల
కొన్నెత్తురు చూడలేక
చరిత్ర విలపించినట్లూ…
వొదలకుండా పట్టిన వాన…
ఏడజూసినా నీళ్ళే…
ఎందు జూసినా కన్నీళ్లే…
ఎదో చెబుతున్నట్లూ…
మారేదో చెప్పలేక పోతునట్లూ…
వీధులు జలమయమై
దారులు దిగ్బంధమై
కాలంతో పోటీపడి
నిన్నటిదాకా…
పరుగులు తీసిన
బండ్లూ… కార్లూ… బస్సులూ…
ఆగినవి ఆగినట్లే…
ఉరికేవి ఉరికినట్లే…
కడుపెండుకుపోయిన
పసిబిడ్డల ఆకలి తీర్చలేక
ఆ లేత చేతుల్లోంచి జారిపడిన
సొట్టలుపడ్డ సత్తు గిన్నెల్లా
తేలియాడుతున్నాయి…
భారీ భారీ వాహనాల
భుజాలమీద చెయ్యేసి
తోసుకు పోతున్నది వొరద…
మింగిన కోట్ల నిధుల
రహస్యాల్ని దాచిన
రహదారుల్ని చిదిమేస్తూ..
పెట్రేగిన వొరదే ఏడజూసినా..
విలయం
అంటున్నారందరూ..
ప్రళయం
అంటున్నారు కొందరు..
పండి పొట్టకొచ్చిన
పంట పొలం మీద
బుల్లెట్లు వర్షిస్తున్నట్లు వాన..
వొదలని ముసురులో
నిండా నానిన గువ్వలా
ముదురుకున్న పల్లె
వొణుకు పట్టిన దేహాన్ని
వెచ్చబార్చే వేడికోసం..
తలవాకిలి దాకా
దిగబడ్డ బురదలోంచి..
మొగులు కమ్మిన
మబ్బుల్ని గాలిస్తున్నది..
విప్పారిన రెక్కలమీద
తొలిపొద్దును
మోసుకు వొచ్చే
వెచ్చని వెలుగు కోసం…
పచ్చని చిగురులు తొడిగే
వనాల కోసం…
చాలా బాగుంది