మా లచ్చక్క వరంగల్ దగ్గెర ములుగు పక్కన అడివి పల్లె. లచ్చక్కకు కొంచెం పోడు బూమి వుంది. సెరువు కింద పది కుంటల పొలమున్నది. తల్లిగారు కట్నంకిందిచ్చిన బూమి. లచ్చక్క తనకున్న బూమిల ఎవుసాయం జేసుకుంట వూరు ఆసాముల వందల ఎకరాల పొలాలల్ల నాట్లు, కోతలు గుత్తవట్టి పంజేస్తది. యింకా కూలి పనులకు, ఎండ పనులకు, కరువు పనులగ్గూడ బోతది. యెన్ని పనులు జేసినా, సేతిల తూటు పైస గూడ వుండదాయె అని నారాజయేది.
గీ మద్దె ఏమైందో ఏమో మా లచ్చక్క వరంగల్ స్టేషన్ రోడ్డు దిక్కు కారప్పొడి మిల్లుల పంజేత్తందని తెల్సింది. మా లచ్చక్క చాన కష్టబోతు. ఎవ్వలు కూలికి పిల్సినా రాను అనది. వూల్లెనే ఏదో పని పట్టుకొనే లచ్చక్క, సడన్ గా ఏమైందని కారప్పొడి మిల్లుల పంజేత్తంది? కూలికి బొయిన కాడ గూడ పని ఎగ్గొట్టది. పిల్సినోల్లని నొప్పియ్యది. వాల్లు సంతోషపడేటట్లు నమ్ముకంగ జేత్తది. అట్లా జేసే లచ్చక్క గూడ గీ వలసలు, బత్కుదెరువు కోసం వూరిడ్సి పోవుడనేది మా లచ్చక్కను గూడ యిడువలేదు. మా అందరు అక్కల కంటె లచ్చక్కంటెనే నాకు కాయిషు. లచ్చక్కకు ఏం కష్టమొచ్చిందో, ఏం కరువొచ్చిందో… గీ కరువు పాడుగాను, అక్కల కలల వచ్చింది. అక్కను సూడాలని మనుసు బాగ కొట్టుకొని లచ్చక్కను సూడనీకి బోయిన. మిల్లును జాడ దీస్కుంట.
ఆ మిరప కాయల మిల్లుకాడ మిరపకాయలలెండేసె గుంపుల దూరమునుంచే లచ్చక్కను గుర్తుబట్టి … ”లచ్చక్కా… ఓ లచ్చక్కా…” అని పిల్సిన. ఎర్రటి యెండల మిరపకాయలెండబోస్తూ… నల్లసీమ మాడినట్లు మాడిపోతుంది. నన్నుజూడంగనె ముందుగాల నమ్మలే… ఎండకు మస్కలైన కండ్లతోని ”ఎవలు పిల్సేద”ని సూసింది. నేను ఆ ఘాటుకు దగ్గుకుంట లచ్చక్క దగ్గరికి పోయెటాలకు… ”ఓ… సెల్లే… గీ యెండలబడి ఎందుకొచ్చినవ్?”
”గీ నిర్పకాయలు గాటు గాదు సెల్లే, గా సెట్టు నీడకు పా… ” అని నన్ను తీస్కపోయింది. నేను లచ్చక్కను పట్టుకోను బోతె… కారం సెల్లే మండుతదని దూరం జరుగబోతె… నేను లచ్చక్కను పట్టుకొని దుక్కమాగక బాగ ఏడ్సిన. యిద్దరం ఒగల మీద ఒగలము బడి బాగ ఏడ్సుకున్నం. లచ్చక్క సెమట పెయ్యి, గాటు పెయ్యి మా దుక్కంల సల్లవడ్డది. యిద్దరం సెట్టుకింద కూసున్నం. లచ్చక్క ”యెండల బడొచ్చినవ్ సెల్లే నీల్లుదెత్తాగని” పోయి, రెండు లీటర్ల ప్లాస్టిక్ సీసకు గంత సుట్టి తడిసిన నీల్లుదెచ్చి సల్లగుంటయి తాగు సెల్లే అని యిచ్చింది.
”బావెక్కడ?”…
మిల్లుల నిర్పకాయలు బోస్తాండు.
తర్వాత నేనే ఏందక్కా, ఏమైందే… గీడికెందుకొస్తిరి? మాకు వొక్కమాటజెప్పకుంట, మాకు దెలవకుంట గీ కష్టం పంజేద్దామనుకున్నరా? యిల్లు, జాగొదిలిపెట్టి, పిల్లలనొదిలిపెట్టి వొల్లంత మంటలేసే గీ కారప్పొడి మిల్లుల పంజేసే గాచారమేమొచ్చిందని వొచ్చిండ్రే? అడిగిన కండ్లు తూడ్చుకుంట.
లచ్చక్కా ముక్కుల గాటంత పక్కకు సీది, దిగపోతల సెమటంత తూడ్సుకొని నీల్లు దాగి ”ఓ సెల్లె… ఏం జెప్పను? అప్పులు పాడుబడ సిన్నప్పులా… గా అప్పులు జెయ్యవట్టే గీ గతిల బడ్డం. వూల్లె అప్పుబుట్టదాయె ఏం జేత్తు”.
లచ్చక్క నువ్వు కాలుమలగని పంజేత్తువు, నీకప్పెందుకయింది? అడిగిన. ”నేనొక్కదాన్ని జేత్తే ఏంమొదలైతది, నలుగురు పిల్లలాయె, మీ బావనేటోడు యింట్లకొక్క పైసియ్యడాయె, సేసిన పైసంత తాగుడుకే కాలబెట్టె, ఏం జేత్త? గందికే గా సిట్టీలోల్ల దగ్గర సిట్టీలెసి బోర్లబడ్డము తెలువక. సోమారం పొద్దటి సిట్టీలోనికి, బుదారం మాపటి సిట్టీలోనికి, బ్యాంకోనికప్పులు గట్టాలె, తీస్కున్నకాడ వూకుంటారె సెల్లే…”
మొదట డాక్రా మయిలల గురూపులొచ్చిన కొత్తల మా వాడ దాక రానేలే. వూల్లెది వూల్లెనే పంచుకుండ్రు. యెంత వో పదేండ్లాయె మా వాడకట్టు మయిలలు గురూపుల జేరి. వో… మయిలల గురూపుల జేరితె బాగుపడుతరు, మూడు పూటల మంచిగ దింటరు, పైసకు కొత్తకు కొదువుండదు అని, బాకీలు వీజీగ, తక్కువ వడ్డీకె దొరుకుతయని వూదరగొట్టిండ్రు. రోజుకు ఒక్క రూపాయి కూడబెట్టి బ్యాంకుల గట్టి మల్ల అప్పులు దెచ్చుకున్నము. గా బ్యాంకులు మన అవసరానికి లోను యియ్యయి. గ్యారెంటియ్యాలె. ష్యూరిటి సూపియ్యాలె, కాల్లరిగే దాక బ్యాంకోల్ల సుట్టు దిరుగాలె. గా బ్యాంకులు మన వూల్లె వుంటయా?, పల్లెలుంటయా? వో మండలం బోవాలె. ఆ మండలం బోయి వొచ్చే కర్సులు తక్కువయితయా?, మల్ల పంజెడ దిరుగాలె. ఆ యిచ్చే లోన్లు గూడ కొసిరి కొసిరి యిత్తరాయె. మల్ల తొంబై తొమ్మిది అడుగుతరు, గీయేంది గయేందని గయన్ని సెప్పేటాల్లకు గుండెల పానం గుటుక్కున పోతది అని దగ్గుతూ చెప్పింది.
యింతల, మా బావొచ్చిండు. మూతికి గట్టుకున్న గుడ్డ యీడ్సుకుంట వొచ్చి బాగేనార ఎట్లున్నరు? గీడున్న జాడెవలు జెప్పిండ్రురా? ఎట్లొత్తివని ఆశీరపోయిండు. ”ఇగ సెల్లెంజూడంగనె సోదంత జెప్తున్నవా, సెప్పు సెప్పు నేను మల్లత్త. సెల్లెకేమన్న తిననీకి కొనుక్కత్త” అనుకుంట యెల్లిపోయిండు మా బావ. మా లచ్చక్క ఆ బ్యాంకుల లోనుల కత మల్ల మొదలుబెట్టింది. అయితె సెల్లే… బాగిను, గీడికెందుకొచ్చినమనే సంగతి మంచిగిను సెల్లే… గా బ్యాంకోడిచ్చే లోను సేతికి మూతికి సాలదాయె, సెరువులెండిపోయి పంటలన్ని ఎనక్కచ్చె. కూల్లు లేవు, నాల్లు లేవాయె. ఎడ్లకు గడ్డి గరక గూడ లేక బూములు బీడువడె. దావకాన కర్సులు, బువ్వ కూరకు బట్ట బాతలకు అన్నిటికి అప్పుజేసుడైంది. యిగ పోరగాండ్లకు హాస్టల్ నుంచి యింటికత్తె వాల్ల కర్సు, ఇగ పెద్ద బిడ్డె పెండ్లప్పు యింకా తీరకనే పాయె. బ్యాంకోడిచ్చేటియి ఏమిటికి మొదలుగాదాయె. ఏంజేత్తు?
గిట్లున్న పరిస్థితిల యింటి ముందటికొచ్చి తక్కువ వడ్డీకి పైసలిత్తము తీసుకోండ్రని వొచ్చిన సిట్టీలోల్లు కొత్త కొత్తల దేవుల్ల తీరు కనిపిచ్చిండ్రు. సోమారం సిట్టోల్లు, మంగలారం సిట్టోల్లు పొద్దుగాల, మాపటి సిల్లోల్లు వొచ్చిండ్రు.
మొదాలు మొదాలు రేషన్ కారటి తెమ్మంటరు. పెండ్లం మొగడు దిగిన పోటువ తెమ్మంటరు. ఆల్లు అప్పులిచ్చే పద్దవతతులు, సంగతులు ఎట్లుంటయి? యెట్ల ఏ కిస్తిల కమానంగ కట్టాలె. యే రోజు గట్టాలెనని రెండు మూడు రోజులు టెయినింగిత్తరు. ఆ సిట్టీలోల్లు వొచ్చిన రోజు లైనుగ నిలబడాలె. అప్పుదీస్కున్న ఆడోల్లంత సేతులు గట్టుకొని రవుండుగ కోతులు గూసున్నట్టు కూసోవాలె. యేదో దొంగల్ని, దోషుల్ని కూసోబెట్టినట్లు కూసోబెడుతరు. లచ్చక్క సిట్టలప్పులోల్ల సంగతి చెప్తాంది దార తీరు. మద్దెల నేను అడ్డంబడకుంట, సెప్తాంటె… ఆ అప్పలు సొద యింటున్న.
తోల్త తోల్త అవుసరంల వుండి తెలువక, సెయ్యక మంచిగ తీస్కున్నవ్ తక్కువ వడ్డని. యిగ సెల్లె… తరువాత దెల్సింది ఆ సిట్టీలోల్ల కంటె యెములోల్లు నయం. యిగ అండ్ల యిరుక్కున్నమంటె… కూసున్నా, నిల్సున్నా ఆల్ల అప్పే బయపెడుతది. తిన్న పెయ్యికి వట్టది. కండ్లు మూసి తెరిసేటాల్లకు వారం రానే అత్తది. సేతిల సిల్లి గవ్వుండది. అవ్వనక్కను తిడుతరు గాడ్దులు. రౌడీలసొంటోల్లని యేస్కోని వూరిమీదికత్తరు. వాల్లనెవ్వడాపడు. పోలీసోల్లు గూడ అపరు. యీ సిట్టీల బాడ్కావ్ లకు సెల్లే… గింత దయ సెమలుండవు. యింటి మొగోల్లను గొడుతరు. యిజ్జతి మానం దీత్తరు. గురూపులున్న ఆడోల్లతోని గూడ తిట్టిత్తరు.
యెములోల్లన్న… బాంచెన్ కాల్మొక్తంటె యింటరేమొగని గీ సిట్టీల కొడుకులు యిననే యినరు. ఆల్ల బయానికి కడుపు నిండ దినలేము, కండ్లార నిద్రబోము. రూపాయ కర్సుబెడ్దామన్న… ఆల్లప్పలే యాదైతయి. బియ్యానికి బదులు నూకలు దిన్నము. కూర బందువెట్టి తొక్కు నూరుకొని దిన్నము.
అయితె సెల్లే… యిన్ని జేసినా సోమారపోని పొద్దటి సిట్టి, మంగలారపోని మాపటి సిట్టి కట్టలేకపోయినం. మనుసుకు గింత నమ్ముతము లేకుంట పంజేసి కట్టిన ఆల్ల బాకి పురుగ తీరలే… గందికే చానా మంది మన గూడెపోల్లము తలుపులు తాలాలేసి యిగో… గీ కంపిండ్ల జేరినము. తినక తాగక గా సిట్టీలోల్లకే రౌతం దారబోస్తున్నం. గీల్ల బయాలతోని జెరాలొత్తున్నయి. వార వారమూ అందరం కలిపి వో నమ్ముకమున్న మనిషికి పైసలిచ్చి వూరికి తోలిస్తము. సిట్టీల బాకి కట్టనీకి లేకుంటె గా సిట్టీల కొడుకులు యీడిగ్గూడచ్చి యిజ్జద్దీద్దురు. గీ గవురుమెంటోల్లు, బ్యాంకులోల్లు సక్కగుంటె… మాకు గీ గోసెందుకుండు. గంజో గట్కో తాగి వూల్లెనే వుందుము. గీ సిట్టీలోల్ల తిట్లకు అవమానాలకు మా సుట్టుపక్కల వూర్లల్ల సచ్చిపోతాండ్రట. గియన్ని గూడెపాడోల్ల మెడకే పడ్డయి. బువ్వ లేక సచ్చినా మంచిదే గని గా సిట్టీ తెరువుబోము యీ తాప. గా సిట్టీల సావ, మా రెక్కల కష్టమంత దిన్నయి. యాబై వెయిలకు డెబ్బై వెయిలు కడుతున్నం ఒర్రంగ. వారం వారం గడుతున్నం. యేదో ఆడోల్లనేందో వుద్దరిత్తున్నట్టు ఆడోల్ల పేరు మీద అప్పులు మొదలుబెట్టి మా వుసురుబోసుకుంటండ్రు. డాక్రన్నరు, ఆడోల్ల సంగాలన్నరు, అప్పులిచ్చి నిలబెడుతమన్నరు, యాడ కూలగొట్టుడెక్కువాయె అని మాట్లాడబోతె… అక్క… గీ మైక్రో సిట్టీలకాడికెండుకుబొయిండ్రే. గౌరుమెంటు ఫైనాన్స్ కార్పొరేషన్ లు గదె, పైసలిచ్చే కోపరేషండ్లంటవు సూడు గాటి కాడికే బోలేదా అన్న.
గౌరుమెంటు అప్పులిచ్చే కోపరేషండ్లు మాగున్నయి గాని గవి మాకాడికి సేర్తయా సెల్లే… వూరు ఆడోల్ల, మొగోల్ల కాడికే అచ్చి ఆగి పోతయాయె. యిగ గూడెపోల్ల అప్పుల కోపరేషండ్లు అంత మొగోల్లే తీస్కోవట్టిరి. అటు ఆడోల్లయంటే… వూరు ఆడోల్లే తీస్కుంటుండ్రు. యిటు గూడెం మొగోల్లే సదురుకోవట్టిరి. యిగ మా అసొంటి గూడెం ఆడోల్లకు ఎటు దిక్కులేక గీ పొద్దటి సిట్టే, మాపటి సిట్టీలోనికెంచి అప్పులుదీస్కోని గీ గతిల బడ్తిమి. యీ సారి బాకీలిత్తమని, లోండ్లిత్తమని అత్తె… సీపురుగట్టల తోని సింగారిత్తం… అన్నది లచ్చక్క ఆవేశంగ. మంచిపని గట్లనే జేయ్యుండ్రి యింటి ముంగటికొస్తె, అని నేను గూడ ఆవేశపడ్డ అక్కతోని గొంతు కలుపుత.
యింతల మా బావ మిక్చర్ పొట్లం యిచ్చి… నువ్వుండు నీంగూడుంటె సేటుగాడు పనిడ్సిపెట్టి యెంతసేపని లొల్లి బెడ్తడని దగ్గుకుంట మిల్లుకాడికి బోయిండు. లచ్చక్క గూడ మద్దె మద్దెల దగ్గుతనే మాట్లాడింది. అక్క సిట్టీల కష్టం ముందు దగ్గును గమనించుకోలే నేను. ఆ గాటుకు నాగ్గూడ దగ్గొస్తనే వుంది. అప్పుడప్పుడు ముక్కులు గొంతంత మంట మంటగున్నది.
”అక్కా… గీ గాటుల ఎట్టుంటున్నవే. ఏ మానేయుండ్రే ” అన్న బాదగ.
”యేమున్నది సెల్లే… రెండు వారాలయినంక సేటు పైసలిత్తడు. గప్పుడింటికి బోయి దావకాన్ల సూపిచ్చుకుంటము. దగ్గి దగ్గి బొచ్చెంత నొప్పి లేత్తాంది”. అని చాతి రుద్దుకుంటాంటె… నీంగూడ మెల్లెగ చాతంత రుద్దిన. లచ్చక్క యీ హాలతి జూసి అక్కా… నీ అప్పుదీరనీకి నీంగూడ సాయంజేత్తనే. అక్కా… నువేమి బుగులుబడకని జెప్తాంటె కండ్లల్ల నీల్లు దునికినయి అక్కకు నాకు
సేటు రెండుసార్లు మా దగ్గరికొచ్చి సూసి పోంగనె… అగో సేటు మల్లొత్తడు. యీ సేటుగాడు అరిగోస పుచ్చుకుంటాండు. పొద్దుగాల నాలుగ్గొట్టంగ లేసి సెరి సగం రాత్రి దాక సేసింది సేసినట్టే. బువ్వ కోసం మద్దెల ఓ గంటిడ్సిపెడ్తడు. యెమినోడున్నట్టుండడు. గీ సిట్టీలు పాడుగాను, గీటితోని గింత గోస బత్కాయె, నువ్వు పైలంగ బో అని దుక్కపడుతూ… ఆ కారప్పొడి మిల్లు గేటుదాక సాగదోలింది మా లచ్చక్క.