మేం… గర్భసంచులమే గాదు

ఏడువొద్దు
మీ పతకాలు దప్ప
మీ గాయాలు, దుఃఖాలు దెలువని
సిగ్గులేని జాతి మీద నిప్పులు జిమ్ము

మీరెక్కల కత్తిరించి
మీ హాహాకారాలని
రక్త సిక్తపు దారుల్ని
తీయని నవ్వుల్తో సెలబ్రేట్ చేసుకుంటారు.

వాళ్ళకు
మాటే ఆయుధం
ప్రచారాలే
సింహాసనాలకు సోపానాలు.

మౌనం వేడుకైన చోట
మాట నిషేధించిన బడ్డ చోట
“హంతకుడు తీర్పు చెబుతున్న చోట”
నిప్పులై కురవండి… లేవండి!

మనం
అదృష్ట వంతుల్లో
దురదృష్ట వంతులం.
పుట్టినపుడే
మనల్ని పాలలో ముంచలేదు.

నీకు తెలుసా
ఈ భూమ్మీద పడ్డాక
చిన్నారి పెదవులు విచ్చుకు
తొలి ఏడ్పు పెగలక ముందే
నలభై ఐదువేల చిన్నారులు
చిదిమేయ బడ్తున్నారు.

పురిట్లోనే
లేత పూవులకు
సమాధి గడ్తున్న
పుణ్య భూమి మనది.

లే! లే…!
మేం
రింగులోనే గాదు
రింగుబయటా
మల్లయోధులమని నినదించు

మేం
గర్భ సంచులమేగాదు
పురుషాధిక్యతపై పిడికిలెత్తిన
సమరయోధులమని ప్రకటించు.
             ★

మూలం : మౌమితా ఆలం

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply