1959 లో ఫిలిప్పీన్స్ దేశం లోని అల్బె ప్రావిన్స్ లో జన్మించిన మెర్లిండా, ఆ దేశం లోనే ఉన్నత విద్య చదివి, ఆస్ట్రేలియా లో స్థిరపడింది. ఇంగ్లీష్ మరియు ఫిలిపినో భాషలలో రచనలు చేసే మెర్లిండా కవిత్వంతో పాటు అనేక కథలు, నవలలు కూడా రాసింది. ఫిలిప్పీన్స్ సంప్రదాయాలు, సంస్కృతి తో పాటు వలస జీవుల ఆధునిక అనుభవాలు ఆమె రచనలలో ప్రతిఫలిస్తాయి. తన రచనలకు, ఫిలిప్పీన్స్, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన అనేక పురస్కారాలు అందుకున్నది.
రచనలు చేయడం గురించి మెర్లిండా ఎంత సున్నితమైన అభిప్రాయం వ్యక్తం చేసిందో చూడండి –
‘రచన కరుణతో తాకుతుంది. అది మనలో పరివర్తన ఏదీ తేకపోయినా, ఒక అలౌకిక ఆనందాన్ని ఇస్తుంది. రచన ప్రేరేపించినా సమయంలో ఆగ్రహాన్ని నియంత్రించవచ్చని, అన్యాయాన్ని ఎదుర్కొనవచ్చని ఒక విశ్వాసం ఏదో కలుగుతుంది. అదృష్టం బాగుంటే, ఆనందం వంద రెట్లు అవుతుంది. మానసికంగా కుంగిపోయిన కాలంలో, చేయవలసిన రచనలు కొన్ని సొరుగులో చేరిపోతాయి’
రాజకీయాలు
గుడ్డివాళ్ళు హాలులో
సినిమాలు చూపిస్తున్నారు
చెవిటివాళ్ళు హాలులో గుమిగూడారు
ఇక నోరులేని వాళ్ళు
చర్చ మొదలుపెట్టవచ్చు
జైలు గది 9 నుండి
ఈ రాత్రి భరించదగినది కాదు
రంధ్రం నుండి చూస్తూ ఉండగానే
గడ్డ కట్టిన ఈ చీకటి కాంక్రీటు గోడ
ఒక నక్షత్రాన్ని ధరించింది
ఈ గోడ పగులును
ఒక తాయెత్తులా కళ్ళకు అద్దుకుంటాను
రేపు
స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తోన్న
మన ప్రపంచం
రేపు
ఈ పగులు గుండా బయటపడుతుంది