రేణుకా అయోల తెచ్చిన రెండో దీర్ఘ కవిత పృధ- ఒక అన్వేషణ . దీనికి మూలం ఎస్.ఎల్ భైరప్ప,
అనువాదం ప్రొ. లక్ష్మీనారాయణ అని కవయిత్రి ముందుమాటలో చెప్పింది .ఇది చూసిన వెంటనే మూల రచన చదవాలని నాకు తీవ్రంగా అనిపించింది . కన్నడ భాష రానందుకు బాధపడ్డాను… ఇది నా తక్షణ స్పందన. ఆ మేరకు రేణుక ప్రయత్నం సఫలం అయింది. అంటే తెలుగు వచనాన్ని తెలుగు కవిత్వ పాఠకులకి చేర్చింది. కవిత్వ పాఠకులు వచనం చదవలేరని కాదు. కానీ తన ప్రేరణతో కలిపి చదువుకునేందుకు వీలు కలిగించింది. అనువాద రచయిత గంగిశెట్టి లక్ష్మీ నారాయణ కవి అవడం వల్ల అతని వాక్యం కవితాత్మకంగా వుంటుంది . ఆమేరకు రేణుకకి ప్రక్రియ పరంగా వున్న శ్రమ కూడా తగ్గిందనే అనాలి . కె. శ్రీనివాస్ చెప్పినట్టు ఇది పునర్ మూల్యాoకన కాదు. ఆపని బైరప్ప ఎలానో చేశాడు . తూముచర్ల రాజారాం చెప్పినట్టు పునర్ లిఖితమో లేక ఉల్లేఖనమో అనాలి .
ఏదయినా మన మనసుకి నచ్చే రచన చదివినప్పుడు దానికి పరిచయమో, సమీక్షో రాస్తాం కానీ రేణుక కవితా మార్గం ఎంచుకుని ఎంతో ఖర్చుపెట్టి స్వతంత్ర రచనకింద వెలుగు లోకి తెచ్చింది . తన వ్యక్తీకరణ వచనం కంటే కవిత్వంలో గాఢంగా వుంటు౦దనుకోవడం వల్లనా ? కాంట్రిబ్యూషన్ కి ఇంకో కూడిక కోసమా ? ఈ ధోరణిలో ప్రతి ప్రసిద్ధ రచనా అనేక ముఖాలవుతుంది కదా . అప్పుడు ఎవరి పిక్కబలాన్ని బట్టి వారిది ఎక్కువదూరం వెడతుంది కాబట్టి మూల రచయిత మూలనే వుంటాడు . సాంకేతిక సమస్యలు రావా ? కాపీరైటు ఎవరికి చెందుతుంది ? ఒకవేళ ఎవరి స్ఫూర్తి రచన అయినా ఇంకో భాషలోకి అనువాదించాలనుకోండి, లేదా పాట కట్టాలనుకోండి అప్పుడు మూల రచయిత లేక అనువాద రచయిత అనుమతి కూడా తీసుకోవాలి కదా , లేక స్ఫూర్తి రచయిత అనుమతి సరిపోతుందా ? ఇవన్నీ నా సందేహాలు . అయితే రామాయణ భారతాలు ఎన్నో రాలేదా అని అడగచ్చు . ప్రతి దాంట్లోనూ అది రాసినవారి ప్రాధాన్యతలు కనిపిస్తాయి. వాల్మీకి రాముడ్ని దేవుడిని చేస్తే, మొల్ల సీతని నాయిక చేసింది . ఎక్కడిదాకానో ఎందుకు? భైరప్ప పాత్రలు అయిన కుంతి మాద్రి విలువలు మూల కధ భారతానికి భిన్నంగానే వున్నాయి . రేణుక చేసినది ఆ ప్రయోగం కాదు . కాబట్టి ఇక్కడ మూలానికి జరిగిన అనువాదం, అనువాదం నుంచి తీసుకున్న ప్రేరణ ఏ మార్పుకి అవకాశ౦ లేని కొనసాగింపులు అయ్యాయి.
ప్రసిద్ధ విమర్శకుడు చేకూరి రామారావు ఎప్పుడూ ఒక మాట అనేవారు .” ఒకరు తీసుకున్న వస్తువును తిరగ రాయదల్చుకుంటే మూల రచయిత చూపించని కోణాన్ని కానీ దానికి భిన్న కోణాన్ని కానీ కొత్తగా మరింత సమర్ధవంతంగా చూపించగలగాలి . వున్నది వున్నట్టే రాయడంలో అర్ధo లేదు” అని , ఈ రచన విషయంలో రేణుక పట్టుదల మెచ్చుకోదగినది . “ ఎవరు ఏమనుకున్నా సరే నేను అన్నిటికీ సిద్ధపడి వున్నాను” అని ప్రకటించింది.
దీన్ని సృజనగా కాక స్ఫూర్తి రచన గానో అనుసృజననో మనం చూడాల్సివస్తుంది కనుక ఈ సాహసం ప్రయోగానికి మాత్రమే వర్తిస్తుంది.
“నక్షత్రాలు లెక్కపెడుతున్న కుంతి ఆలోచనలు \ నదీ ముఖాన్ని తాకుతున్నాయి\ ఆలలు తొడుగులు తొడుక్కున్న పాదాలు \ నక్షత్ర ధూళి రాల్చి గొడుగు కింద \వదలిన సంపెంగ వాసనాల రాత్రిలో \నడుస్తూ తూలిపడ్డాయి ..”
అంటూ కుంతి ఆలోచనా తరంగాలతో ఈ కవిత ప్రారంభం అవుతుంది .
“చరిత్ర జాతరలో వంశం కోసం తెచ్చుకున్న బలమైన పెయ్యి దూడలు ఆడవాళ్ళు ‘ అంటున్నప్పుడు రాజరిక బానిసత్వం కనిపిస్తుంది సరాసరి సందర్భమూ అర్ధంఅవుతుంది .
’ పిలవగానే వచ్చాడు \ భగ భగ మండే కవచాలు ఏవి లేవు \ఎవరితడు మనిషిగా వచ్చిన మగవాడు \ ఇంత దూరం వచ్చాక కొన్ని నిజాలు ఇలాగే వుంటాయని \ నీ దేహం బీజం కాయాలని అంటాడు \ తీరిపోయిన కోరిక మెట్టు ఎక్కి వెళ్ళిపోయాడు \”
ఉత్కంఠ కలిగించే వాక్యాలు కదా. ఋషుల సేవలకి కూతుళ్లని పంపినప్పుడు లేని లోక భీతి, గర్భవతి కాగానే ఎందుకు కనిపించింది అనే అడిగే కూతురి అంతరంగాన్ని చక్కగా ఆవిష్కరించింది .
“సేవలకి పంపినపుడు ఆడపిల్ల కనిపించలేదు \ పెళ్లి కాని పిల్లా కనిపించలేదు \ వయసు కనిపించలేదు \ అవసరం ఒక్కటే కనిపించింది \ ఎంతో నిర్దయగా కొన్ని పూలని \ దీపం పడవలని నదిలో వొదిలినట్టు \పసిబిడ్డని వదిలేయగానే న్యాయం జరిగినట్టేనా / అని ప్రశ్నిస్తుంది .
”సరే ఆడది పెట్టిన బిక్షకు ఒకరాజు దీపమై వెలిగాడు కానివ్వండి \ అని వ్యంగ్య బాణం విసురుతుంది.
రేణుక కవిత్వంలో కొన్నిసార్లు నాకు శిల్ప పరమైన ఇబ్బందులు కనిపిస్తాయి.
“‘గాయపు రాయి తగిలిన మనసు\ నీటి అద్దంలో పడి అలలతో కదులుతోంది” అని వుంది . గాయం అనే రాయి తగిలి.. అని కవయిత్రి ఉద్దేశం కావచ్చు . కానీ రాయి విసిరితే అయేది గాయం కదా , గాయం విసిరితే రాయి అవుతుందా? . గాయం రాయిలా కరకు బారింది అనే దశ వుండచ్చు. మొద్దుబారిన నా మనసు చూసి రాయి కూడా గాయమైంది అని కూడా వుండచ్చు . గాయపు రాయి తగిలిన మనసు – వాక్యంలో ఉపమేయ ఉపమాన సమన్వయం సరిగా లేదేమో అనిపించింది . ఇలాంటి పోరబాట్లు ఇటీవలి చాలామ౦ది కవిత్వంలో నేను చూస్తున్నాను.
. ‘ వోసే కుంతి ఇలారా| \ వికారపు పనులతో మీదపడిన \పాండురాజు దేహ౦ నిండా మరకలు \ కంచుకముడి అద్దంలో భంగపడిన ముఖం \
-ఈ వర్ణన బావుంది . ( ఓరి వీడ్ని తగలేయా , వీడు అచ్చం మనకి తెలిసనవాడిలానే వున్నాడే అనిపిస్తుంది పౌరాణిక రాజులు పద్యాలతో తిట్టుకోరా మన భాషే వాడతారా అని ఆశ్చర్యం వేస్తుంది .)
కంచుకముడి అద్దంలో భ౦గపడిన వాడి మొహం” అనడం చాలా దృశ్యాత్మకంగా వుంది . సరదాగా చెప్పాలంటే సినిమామొత్తం ఈ వాక్యంలో చూపించింది కవయిత్రి.
“పనికిరాని దేహమని చిందరవందరగా అడుకుని \పట్టు పరికిణి మీద \వోణి లేని వొంటినిండా అద్దకాలు చేతిగుర్తులు\అవమానించి హింసించి ఓడిన మొహంతో నిద్ర పోతున్నాడు “
సంతానం కోసమే దాంపత్య జీవితమని నమ్మబలికే సూక్తులు ఆ రాజులనుంచి ఇప్పటికీ వున్నాయి. నిజమే .
దీన్ని గురించి రేణుక కళ్లు తడిసే వాక్యాలు రాస్తుంది.
” అంత పుర చెవులన్నీ \బీజాన్ని నాటుకునే \ క్షేత్ర ఫలసాయ వార్త కోసం \ గోడలకి చెవి ఆనించి ఎదురు చూస్తున్నాయి\ కుంతి ఎదురుచూసే నెలసరి యుద్దం \భీభత్యం చీకటి వెనక దాక్కుంది \వరస బహిష్టులతో
కురువంశ౦ \ మొలవకనే నష్ట పోయింది \ బీజం కట్టని క్షేత్రం వణికి \ఖాళీ కడుపుమంట ఆర్పుకోలేనిది అయింది \ఆమె గర్భం పనికిరాదు \ మగవాడు అంటేనె వీర్యశక్తి వుంటుంది \ సరే ఈమె కాకపోతే ఇంకొకళ్ళు \వేట మొదలయింది \
పా౦డు రాజు కుంతి చెవిలో మరో భార్య మాద్రి గురించి “ గుసగుసగా అంటున్నాడు \నీకన్నా ఆమె సరయిన ఆడది \ ఎంత చవకబారు మాట \ కోపం కళ్ళతోనే అడిగింది \నాదగ్గర ఏదీ దాచలేవు ఆర్యా \ ఎందరి ఆడవాళ్ళతో రమించినా \వాళ్ళ బహిష్టు రక్తాన్ని ఆపలేవు \
మాద్రి నెలతప్పలేదనే విషయం కూడా కుంతి ఇలా చెప్పేసింది .
హతాశుడైన రాజు పట్టు తప్పి కుంతి కౌగిలిలో ఏడ్చాడు \
“రాజు తపస్సుకి అడవికి వెడతాడట \ లేని వీర్య వృద్ధి పెంచుకోవాలనే నీ తాపత్రయం నా మనసుని కలచివేస్తోంది ఆర్యా \రాణులు సేవలకి వెళ్ళాలి చెక్కపలకలమీద పాండురాజుతో దాంపత్యం.. “
పర్వ నుంచి రేణుక, పాత్రల స్వాభావాన్ని బాగానే తీసుకుంది కానీ పరిసరాల చిత్రణలో శ్రద్ధ చూపలేదేమో అనిపించింది . నెలసరి వస్త్రం , అవాంఛిత గర్భం , అభ్యంతర మ౦దిర మర్యాదలు, సఖుల అంతరంగం , విహారం , భోజనం ఇలాంటివి కూడా వుంటే ఆసక్తిగా వుండేది. మూల కధలో లేనిది ఏదీ తను రాయలేదు.
చివరిగా ఒకమాట. పురాణేతిహాసాలు మనం చరిత్ర అనుకుంటున్నామా , కల్పన అనుకుంటున్నామా లేక జీవిత సత్యాలని ఎప్పటికీ ఆచరించదగిన విలువలు అనుకుంటున్నామా అనేదాని మీద మన ప్రాపంచిక దృక్పధం, రాజకీయ విశ్వాసాలు ఆధారపడి వున్నాయి. రచన తాలూకు వ్యక్తీకరణ కూడా దాని మీదే ఆధారపడివుంటుంది .ఒకచేత్తో భారత రామాయణ స్త్రీ పాత్రలకి స్త్రీవాద విప్లవ శంఖం ఇచ్చి మరో చేత్తో వారి బాధలకి కారణమైన పురుష పాత్రలకి అంటే రామూడూ , కృష్ణుడూ వారి బావ మరుదులకి హారతులు ఇస్తున్నామా అనే గమనింపు కూడా మన సాహిత్య వ్యక్తిత్వమమవుతుంది .
రేణుకా అయోల లాంటి సృజనాత్మకత గల కవయిత్రి ఇకనుంచి కొత్త వస్తువులతో స్వతంత్ర రచనల మీద దృష్టి పెట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ …