భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక శతాబ్దం పైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత, కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు పోటీపడటం అపూర్వం. లక్షలాది ప్రజానీకం ఒకే నినాదం, ఒకే లక్ష్యం కోసం ఒకే బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.
ఈ పోరాటానికి భారతదేశపు అతి పెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై స్వాతంత్ర్యసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వ త్యాగాలతో, అసమాన బలిదానాలతో భారతీయ ముస్లింలు పునీతులయ్యారు. అయినప్పటికీ ముస్లిం సమాజం త్యాగమయ చరిత్ర పలు కారణాల మూలంగా మరుగున పడిపోయింది.
బ్రిటీష్ పాలకులు తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు విభజించు-పాలించు అను కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను మతం పేరుతో హిందువులు – ముస్లింలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.
ఆ తరువాత భారత విభజనకు దారితీసిన పరిస్థితులు, ఆ సందర్భంగా జరిగిన దారుణాలు, పొరుగుదేశంగా ఏర్పడిన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాలు, వివాదాలు స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి హిందూ – ముస్లింల ఐక్యతకు చిచ్చు పెట్టాయి. భారత విభజనానంతర పరిణామాల వలన అపరాధ భావనకు గురిచేయబడిన ముస్లిం సమాజం సుషుప్తావస్థలోకి నిష్క్రమించింది. యుద్దాలు, వివాదాలు, దేశంలో తరచుగా సాగిన మత కలహాలు మెజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య మానసిక విభజనకు కారణమయ్యాయి.
ప్రజల మత మనోభావాలను రెచ్చగొట్టి మతం పేరుతో మనుషులను చీల్చి, రాజకీయ ప్రయోజనాలను సాధించదలచిన మతోన్మాద రాజకీయశక్తులు, వ్యక్తులు ఈ చీలికను అగాధంగా మార్చాయి. పర్యవసానంగా బ్రిటీషర్ల బానిసత్వం నుండి మాతృ భూమిని విముక్తం చేసేందుకు సాగిన సుదీర్ఘ పోరాటచరిత్రలో ముస్లిం సమాజం త్యాగాలు మరుగున పడిపోయాయి.
ప్రజలకు చేరువకాని సమాచారం
చరిత్ర గ్రంథాలలో ముస్లింలు చాలా వరకు కన్పించరు. ఒకరిద్దరు కన్పించినా అనన్య సామాన్యమైన వారి త్యాగాలు, సాధారణ స్థాయి వివరణలతో వర్ణనలతో సరిపెట్టబడ్డాయి. ప్రాచుర్యంలో ఉన్న చరిత్ర గ్రంథాలలో ముస్లింల వీరోచిత గాధలు సరైన స్థానం పొందలేకపోయాయి. ఆయా కథనాలు సామాన్య చరిత్ర గ్రంథాలలోగాని, పాఠ్య పుస్తకాలలోగాని చోటు చేసుకోలేదు. ఫలితంగా భవిష్యత్తు తరాలకు అమూల్య సమాచారం అందకుండా పోయింది.
చరిత్ర ద్వారా తేలిగ్గా సమాచారం లభించే అవకాశం లేనందున, కళా రూపాలకు, సాహిత్య ప్రక్రియలకు, ప్రచార మాధ్యమాలకు ముస్లింల శ్లాఘనీయ చరిత్రలు కథా వస్తువు కాలేకపోయాయి. ఆ కారణంగా ముస్లింల త్యాగాలు, ఆనాటి వీరోచిత సంఘటనలు జనబాహుళ్యంలోకి వెళ్ళకపోవటంతో ఆ తరువాతి తరాలకు ఆ విషయాలు అందలేదు. ఈ పరిణామాలే భారతదేశంలోని హిందూ- ముస్లిం జనసమూహాల మధ్య మానసిక ఎడం ఏర్పడటానికి ప్రధాన కారణమయ్యాయి.
ఈ అగాధాన్ని మరింత పెంచి ఒక సాంఘిక జనసమూహానికి తామే ఏకైక ప్రతినిధులుగా ప్రకటించుకుని రాజ్యమేలాలని ఆశిస్తున్న శక్తులు వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి.
పురుషులకు దీటుగా మహిళలు
ఈ సమరోజ్వల చరిత్రలో ముస్లిం మహిళలు కూడా పురుషులతో దీటుగా తమదైన వీరోచిత పాత్ర నిర్వహించారు. ఆ త్యాగాలు కూడా పలు కారణాల మూలంగా మరుగున పడిపోయాయి. మతపరమైన ఆచార సంప్రదాయాలు ముస్లిం మహిళలను గడప దాటనివ్వవన్న అపోహల మూలంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్ర వైపు దృష్టి సారించటమే గగనమైపోయింది. చరిత్రకారుల అన్వేషణకు స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం మహిళల పాత్ర వస్తువు కాలేకపోయింది. ఆ కారణంగా విముక్తి పోరాటంలో ముస్లిం మహిళల అరుదైన పాత్ర చరిత్ర పుటలలో బందీగా మిగిలిపోయింది.
మాతృభూమి స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ముస్లిం మహిళలు ఆత్మబలిదానానికి సిద్ధపడిన దృష్టాంతరాలున్నాయి. విముక్తి పోరాట మైధానంలో శత్రువును సవాల్ చేసిన వీర వనితల చరిత్రలున్నాయి. సాహసోపేత సంఘటనలున్నాయి. ఆ సంఘటనలన్ని చరిత్ర అట్టడుగు పొరల నుండి బయటపడలేక పోయాయి.
ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో…
ప్రథమ స్వాతంత్ర సమరంలో ప్రధాన పాత్ర వహించిన ముస్లిం సమాజానికి చెందిన స్త్రీలు తమ అపూర్వ త్యాగాలతో, ఆత్మార్పణలతో చరిత్ర పుటలను ఎరుపెక్కించారు. అటువంటి వారిలో ప్రముఖులు అవధ్ రాణి బేగం హజరత్ మహాల్. బ్రిటీష్ పాలకులు కుయుక్తులతో ఆమె భర్త నవాబ్ వాజిద్ అలీషాను అరెస్టు చేసి అవధ్ ను స్వాధీనం చేసుకున్నారు. మాతృభూమి పరుల పాలవడంతో ఆగ్రహించిన ఆమె ప్రజల అండదండలతో బ్రిటీష్ సైన్యం పై విరుచుకుపడి తిరిగి తన రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాల తన బిడ్డడు బిర్జిస్ ఖదీరను నవాబుగా ప్రకటించి అతని సంరక్షకురాలిగా బాధ్యతలు చేపట్టారు. స్వదేశీ పాలకులను, ప్రముఖులను ప్రజలను ఐక్యపర్చారు. పరిపాలనలో హిందూ-ముస్లింలకు సమాన స్థాయి కల్పించారు. బ్రిటీష్ సైనికదళాల పడగ నీడలో కూడా ఎంతో సాహసంతో 14 మాసాల పాటు బ్రిటీష్ వలస పాలకుల ఎత్తులను చిత్తుచేస్తూ, సమర్థవంతమైన పాలన సాగించారు. బేగంపై కత్తి గట్టిన బ్రిటీష్ పాలకులు అవధ్ ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు. భారీ సంఖ్యతో చుట్టుముట్టిన బ్రిటీష్ సైనికమూకలను ఎదుర్కొనటం కష్టతరమైన తరుణంలో, తిరిగి దాడి చేసేందుకు తాత్కాలికంగా యుద్ధరంగం నుండి వైదొలిగి నేపాల్ పర్వతాల్లోకి నిష్క్రమించారు. ఆ అడవుల్లో నానాసాహెబ్, మొగల్ రాకుమారుడు ఫిరోజ్ షా లాంటి యోధులను కలసి బలగాలను మళ్ళీ సమీకరిస్తూ, 1879లో నేపాల్ అడవుల్లో సామాన్య మహిళగా కన్నుమూశారు.
ప్రథమ స్వాతంత్ర్య సమరంలో బేగం బాటన నడిచిన మహిళలు పలువురున్నారు. చరిత్ర పుటలు మనకు పలువుర్ని పరిచయం చేస్తాయి. ఆనాటి పోరాటంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి శత్రువును మట్టు పెట్టేందుకు కదనరంగానికి కదలిన వారిలో బేగం అజీజున్ ఒకరు. మాతృభూమి పట్ల అపార ప్రేమాభిమానాలు గల ఆమె ప్రభుభక్తి పరాయణురాలు. కాన్పూరు అధినేత నానాసా హెబ్ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించగానే ఆమె కూడా యుద్ధరంగ ప్రవేశం చేశారు. స్వయంగా శత్రుసైన్యాలను ఎదుర్కొన్నారు. సైనిక పటాలాలను, గూఢచారి దళాలను, ఆయుధాలు, ఆహారం అందించే బృందాలను నేర్పుతో ఏర్పాటుచేసి నానాసాహెబ్ పోరుకు ఎంతగానో తోడ్పడ్డారు. చివరి వరకు పోరాడుతూ యుద్ధభూమిలో గాయపడి శత్రువు చేత చిక్కారు. శత్రువు క్షమాభిక్ష ప్రకటించినా, తనకు ప్రాణం కంటే మాతృభూమి విముక్తికై సాగుతున్న పోరాటం ప్రధానమని ప్రకటిస్తూ, బ్రిటీష్ తుపాకి గుండ్లకు ఎదురు నిలిచి వీరమరణం పొందారు.
అజీజున్ మార్గాన సాగిన మరొకరు 60 సంవత్సరాల అనామిక. ఆమె పేరేమిటో తెలియదు. ఆమె ఎల్లవేళల ధరించే పచ్చరంగు దుస్తుల వలన ఆమె పచ్చరంగు దుస్తుల మహిళగా ఖ్యాతిగాంచారు. గెరిల్లా పోరాటం సాగించిన ఆమె బ్రిటీష్ సైనికదళాలలో భయోత్పాతం సృష్టించారు. గాయపడిన తరువాత గాని పట్టుబడని ఆమెను అంబాలాలో గల బ్రిటీషు సైనిక స్థావరానికి పంపారు. ఆమెను అంబాల పంపుతూ, ఈ వృద్ధురాలు బహు ప్రమాదకారి… జాగ్రత్త, అంటూ అక్కడి అధికారులను హెచ్చరిస్తూ ప్రత్యేకంగా లేఖ రాసి పంపి, ముందు జాగ్రత్తల గురించి హెచ్చరించారంటే ఆ పచ్చదుస్తుల మహిళ ఎంతటి ఘటికురాలో మనం ఊహించవచ్చు.
ఈ విధంగా శత్రువును సాయుధంగా ఎదుర్కొన్న మహిళలు, సాయుధ తిరుగుబాటు దళాలను ప్రోత్సహించినవారు, ఆశ్రయం కల్పించి ఆదుకున్న మహిళలు ఎందరో ఉన్నారు. ఈ కోవలో మాతృదేశ విముక్తి కోసం ఉరిని కూడా లెక్కచేయని సాహసి హబీబా బేగం, ఝాన్సీ రాణి వెన్నంటి నిలచి పోరాడి ప్రాణాలర్పించిన ముందర్, బ్రిటీషు సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైర్యశాలి బేగం రహిమా, తిరుగుబాటు యోధులక్షేమం కోరుతూ సజీవదహనమైన అగ్గరి బేగం, సాయుధంగా ఆంగ్ల సైన్యాలను నిలువరించిన బేగం జమిలా, కత్తిపట్టి కదనరంగాన శతృవును సవాల్ చేసిన సాహసి బేగం ఉమ్ద్దా తదితరులు ఎందరో ఉన్నారు.
చరిత్ర నమోదు ప్రకారం ఆనాడు ఇతర సాంఘిక జనసముదాల తోపాటుగా వందలాది ముస్లిం మహిళలు కాల్చి వేయబడ్డారు. సజీవ దహనమాయ్యారు. ఉరితీయబడ్డారు. అవమానాలకు, అత్యాచారాలకు గురయ్యారు. ఈ మేరకు ఆ సమాచారాన్ని బ్రిటీష్ అధికారుల డైరీలు, లేఖలు బహిర్గతం చేస్తున్నాయంటే, ఆ వీరనారీమణుల త్యాగాలు ఎంతటి మహత్తరమైనవో మనం అర్థం చేసుకోవచ్చు.
జాతీయోద్యమంలో…
ప్రథమ స్వాతంత్ర్యసమరం రగిల్చిన స్వాతంత్ర్య కాంక్ష లక్షలాది మహిళలను స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపింది. పూర్వీకుల అసమాన పోరాటాలను వారసత్వంగా స్వీకరించిన ముస్లిం మహిళలు ఖిలాఫత్ ఉద్యమం ద్వారా పెద్ద సంఖ్యలో జాతీయోద్యమంలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఖిలాఫత్ కమిటీ, జాతీయ కాంగ్రెస్ నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ, మద్యపాన నిషేధం లాంటి పలు కార్యక్రమాలలో ముస్లిం స్త్రీలు బృహత్తర పాత్ర నిర్వహించారు.
బ్రిటీష్ పాలకుల దమననీతి, నిర్బంధాలకు భీతిల్లకుండా జాతీయోద్యమబాటలో నడిచిన స్త్రీలలో బీబీ అమ్మకు తొలి స్థానం లభించింది. ఆమె అసలు పేరు ఆబాదీ బానో బేగం కాగా బీబీ అమ్మగా ఆమె చిరస్మరణీయ ఖ్యాతి గడించారు. అనితర సాధ్యమైన సాహసంతో, అద్భుతమైన ప్రసంగాలతో, ఆదర్శవంతమైన నేతృత్వంతో ఖిలాఫత్ ఉద్యమం కోసం దేశమంతా తిరిగి ఆమె నిధులను సమకూర్చారు. ఈ నిధులే భారత పర్యటన గావించిన గాంధీజీకి ఉపయోగపడ్డాయి. ఈ దేశపు కుక్కలు పిల్లులు కూడ బ్రిటీష్ బానిస బంధనాలలో నుండ వీలులేదని గర్జించిన ఆమె హిందూ-ముస్లింల ఐక్యతకు చివరి వరకు కృషి సల్పారు. జాతీయోద్యమకారులంతా తనను అమ్మ అని పిలుస్తున్నందున, బిడ్డల ఎదుట తనకు పర్గా అక్కరలేదని ప్రకటించి, పర్గాలేకుండా బహిరంగ సభలలో ప్రసంగించిన సాహసి ఆబాది బానో బేగం.
ఆబాది బానో బేగం బాటలో నడిచిన మరొక చిచ్చర పిడుగు నిషాతున్నీసా బేగం. ఆమె ఫైర్ బ్రాండ్ గా పిలువబడిన మౌలానా హస్రత్ మొహాని భార్య. భర్త పలుమార్లు జైలుకు వెళ్ళినా అధైర్యపడకుండా ఉద్యమబాటన చివరికంటా నడిచిన మహనీయురాలు. జాతీయోద్యమ ప్రధాన ఘట్టాలన్నిటిలో ఆమె ప్రముఖ పాత్ర వహించి సాహస మహిళగా ఖ్యాతిగాంచిన నిర్మొహమాటి. భర్త మౌలానా హస్రత్ మొహాని సంపూర్ణ స్వరాజ్యం తీర్మానాన్ని ప్రతిపాదించగా దానిని గాంధీజీ తిరస్కరించినందుకు ఆగ్రహించిన ఆమె గాంధీజీ వైఖరిని నిశితంగా విమర్శించి, చివరకు గాంధీజీ చే శభాష్ అన్పించుకున్న ప్రతిభాశీలి. మంచి రచయిత్రి.
ఈ వరుసలో అలీ సోదరులలోని షాకత్ అలీ భార్య అంజాదీ బేగం, మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు స్ఫూర్తిగా నిల్చిన జులేఖా బేగం, స్వాతంత్రేచ్ఛను రగిల్చే సాహిత్యాన్ని సృష్టించిన కవయిత్రి జాహిదా ఖాతూన్, ఆలోచనాత్మక ప్రసంగాలకు పెట్టింది పేరైన అక్బరీ బేగంలను పేర్కొనవచ్చును. బ్రిటీష్ పోలీసులు గుర్రాలచేత తొక్కించినా, లాఠీలతో రక్తసిక్తం చేసినా పోరుబాట వీడని హూదా తయ్యాఖీ, గాంధీజీచే మధ్యపాన నిషేధ ఉద్యమనేతగా నియుక్తురాలైన అమీనా తయ్యాఖీ, బ్రిటీష్ పోలీసు మూకల దాష్టీకాన్ని ఎదుర్కొన్న షఫాతున్నిసా బేగం, ఆదర్శ జాతీయవాదిగా ఖ్యాతిగాంచిన మజీదా బాను, జలియన్‌వాలా బాగ్ లో జనరల్ డయ్యర్ ఘాతుకానికి బలైన 55 సంవత్సరాల వీరమాత ఉమర్ బీబీ గౌరవప్రదమైన మరణం బానిస బతుకుకంటే మేలైనదని చాటిన బేగం మహమ్మద్ ఆలంలు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
జాతీయ కాంగ్రెస్ జనచైతన్య కార్యక్రమాలలో ప్రముఖపాత్ర నిర్వహించారు ఫాతిమా బేగం. జాతి ప్రయోజనాలకు తమ సంపద ఉపయోగపడకపోతే అది ఎంత ఉన్నా వ్యర్ధమంటూ షంషున్నీసా అన్సారీ తమ యావదాస్తిని జాతీయోద్యమానికి ధారపోశారు. భర్త పాలకుల కిరాతకానికి గురైనప్పటికీ ఆయన బాధ్యతలను స్వీకరించి ఉత్తేజపర్చే ఉత్తరాలతో స్వాతంత్ర్య సమరయోధులలో ఉత్సాహాన్ని నింపారు బేగం జాఫర్ అలీఖాన్. గాంధీజీ కోరిక మేరకు క్రమం తప్పక ఆయనకు లేఖలు రాస్తూ, ఆయన ఉర్దూభాషను బేగం జోహరా అన్సారి తీర్చిదిద్దారు. ఈ మహిళలంతా తాము కలలుగన్న “ స్వతంత్ర భారతాన్ని ‘ కళ్ళారా చూడకుండానే పరలోకగతులయ్యారు.
సాయుధపోరాట మార్గంలో…
అహింసా మార్గాన్నే కాకుండా ప్రమాదభరితమైన సాయుధపోరాట మార్గాన కూడా పలువురు ముస్లిం మహిళలు ఉద్యమించారు. ఖుదీరాం కి దీదిగా ఖ్యాతిగాంచిన విప్లవ వీరుడు మౌల్వీ అబ్దుల్ హదీమ్ సోదరి వీరిలో ఒకరు. ఆమె అసలు పేరు తెలియదు. విప్లవకారుల మీద, వారి సన్నిహితుల మీద, సానుభూతిపరుల మిద బ్రిటీష్ ప్రభుత్వం విరుచుకు పడుతున్న భయానక వాతావరణంలో విప్లవ వీరుడు ఖుదీరాంను రక్షించు కునేందుకు విఫల ప్రయత్నం చేశారామె. బ్రిటీష్ గూఢచారి వర్గాల కళ్ళుగప్పి జాతీయ ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేసే కొరియర్ గా సఫియా వాజిద్ చురుకైన పాత్ర నిర్వహించారు. ఈ వరుసలో కంటక ప్రాయమైన విప్లవబాటను ఎంచుకుని ఆత్మార్పణకు సిద్ధపడిన రజియా ఖాతూన్ లాంటి మహిళలు ఎందరో ఉన్నారు.
జాతీయోద్యమంలో పాల్గొనటమేకాక, జమిందార్ల జులుంను సాయుధంగా ఎదుర్కొన్న వారిలో కూడా ముస్లిం మహిళలున్నారు. సింధ్ ప్రాంతానికి చెందిన మాయి భక్తావర్ ఆ కోవకు చెందినవారు. తన గ్రామానికి చెందిన రైతుల కష్టార్జితాన్ని దోచుకో చూసిన జమీందారు గూండాలను, జమిందారుకు వత్తాసుగా వచ్చిన పోలీసులను సాయుధంగా ఎదుర్కొని ఆ పోరులో వీరమరణం పొందిందామె. ఈ విధంగా పోరాడిన వీరవనితలు ఎందరో ఉన్నా ప్రచారం లభించినవారు చాలా తక్కువ.
నవభారత నిర్మాణంలో…
స్వాతంత్ర్యోద్యమం వేగం అందుకుని లక్ష్యసాధన దిశగా పరుగులిడుతున్న దశలో ఉద్యమంలో భాగస్వాములైన ఆనాటి మహిళలంతా అదృష్టవంతులు. ఆ తల్లులంతా తాము కలలుగన్న స్వతంత్ర భారతావనిని కళ్ళారాగాంచటమేగాక, కొందరు నవభారత నిర్మాణంలో బృహత్తరమైన బాధ్యతలు నిర్వహించారు.
ఈ తరంలోని ముఖ్యలలో ఒకరు జుబేదా బేగం. చిన్ననాటనే ఉద్యమబాటన నడక ప్రారంభించిన ఆమె అద్భుత వక్త. సుసంపన్న కుటుంబంలో జన్మించిన ఆమె తన సర్వస్వం జాతీయోద్యమానికి సమర్పించారు. చివరి దశలో కటిక పేదరికం అనుభవిస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ స్వీకరించ నిరాకరించారు. పెన్షన్ స్వీకరించటమంటే తన మాతృదేశ సేవకు ఖరీదు కట్టడమేనంటూ, ఎటువంటి ఆర్థిక సహాయం స్వీకరించకుండా గడిపారు. ఈ రకంగా భారత ప్రభుత్వం ఇవ్వజూపిన అనేక రకాల ఆర్థిక సహాయాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించిన వారెందరో ఉన్నారు.
ఈ మేరకు ఉద్యమంలో భాగంగా గాంధీజీ అడుగుజాడల్లో నడిచిన ప్రముఖుల్లో శ్రీమతి అముతుస్సలాం ఒకరు. నౌఖాళి మతకలహాల నివారణకు గాంధీజీ ఆమెను పంపారు. కలహాల నివారణకు గ్రామాణులు సహకరించకుండా మంకుపట్టు పట్టడంతో 22 రోజులపాటు నిరాహారదీక్ష పూని ఆ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని నెలకొల్పిన ఆమె గాంధీజీ ప్రశంసలందుకున్నారు. బేగం రెహనా తయ్యబీ గాంధీజీకి ఉర్దూ భాషను నేర్పిన గురువయ్యారు. పండు వయస్సులో కూడా బేగం లుక్మాని పోరాట పటిమ చూపారు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే కార్యక్రమంలో బేగం ఫాతిమా ఇస్మాయిల్ చురుగ్గా వ్యవహరించారు. బొంబాయి నగరంలో 30 సంవత్సరాలపాటు అవిశ్రాంతంగా శ్రమించి ఐదు లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటంలో అనితర సాధ్యమైన విజయాన్ని బేగం కుల్సుం సయాని సొంతం చేసుకున్నారు. ఆమె వయోజన విద్యావ్యాప్తి కోసం ప్రత్యేకంగా పలు భాషలలో రహబర్ అను పత్రికను కూడా నడిపారు. జాతీయోద్యమంలోని ప్రతి ఘట్టంలోనూ పాల్గొన్నారు.
స్వాతంత్ర్య ఉద్యమకారులచే హాజఁరా ఆపాగా (హాజఁరా అక్కయ్య) హాజఁరా అహమ్మద్ పిలిపించుకున్నారు. రష్యాను సందర్శించిన తొలి భారతీయ మహిళగా ఆమె ఖ్యాతిగాంచారు. ఆంధ్ర రాష్ట్రంలోని మంతెనవారి పాలెంలో జరిగిన రాజకీయ శిక్షణా తరగతులలో ఆమె పాల్గొన్నారు. ఈ విధంగా అంకిత భావంతో విముక్తి పోరాటంలో పాల్గొన్న వారిలో ఆదర్శవంతమైన సేవలకు అంకితమైన బేగం సుఫియా సోం, ఆత్మరక్షణకు ఆయుధం ధరించిన బేగం సుల్తానా హయాత్, గాంధీజీ నేతృత్వంలో ఆదర్శ వివాహం చేసుకున్న బేగం ఆమనా ఖురేషి, పోరుబాటలో నడిచినందుకు అరెస్టయిన ఢిల్లీలోని తొలి మహిళా కార్యకర్త బేగం మహబూబ్ ఫాతిమా లాంటి వారెందరో ఉన్నారు.
తెలుగింటి ఆడపడుచులు
ఈ కోవకు చెందిన వారిలో తెలుగింటి ఆడపడుచులూ ఉన్నారు. అటువంటివారిలో మహమ్మద్ గౌస్ ఖాతూన్, హజఁరా బీబీ ఇస్మాయిల్, నఫీస్ ఆయేషా బేగం, రబియాబీ తదితరులు ఉన్నారు. చీరాల-పేరాల ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌస్ మెహిద్దీన్ భార్య ఖాతూన్, భర్తతో పాటుగా జైలుకు వెళ్ళకపోయినా, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పిస్తూ, ఆతిథ్యమిస్తూ, తన కుటుంబానికి చెందిన సర్వం ఉద్యమం కోసం వ్యయం చేసిన త్యాగశీలి. గాంధీజీ అనుచరుడుగా రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన ఖద్దర్ ఇస్మాయిల్ భార్య హాజఁరా బీబీ గాంధీజీ బాటన నడిచినందుకు ఆమె కుటుంబాన్ని వెలివేసినా వెరవని ధీమంతురాలు.
అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన రబియాబీ భర్త మొహిద్దీన్ సాహెబ్ తో కలసి సత్యాగ్రహంలో పాల్గొని చరిత్ర సృష్టించారు. ఆంధ్రావనిలో ఒక ముస్లిం మహిళ వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమంలో బహిరంగంగా పాల్గొనటం ఇదే ప్రథమమని ఆనాడు పలువురు శ్లాఘించారు. జాతీయోద్యమకారుడైన భర్త, ఆమెను పర్దాపద్ధతి నుండి విముక్తి చేయడంతో, రబియాబీ మరింత ఉత్సాహంతో స్వాతంత్ర్యోద్యమంలోని ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనాడు సాగిన యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలో స్వయంగా పాల్గొనటమేకాక యుద్ధ వ్యతిరేక నినాదాలిచ్చి పలువుర్ని ఆశ్చర్యచకితులను చేశారు. ఆనాడు మహిళలకు జైళ్ళల్లో ప్రత్యేక ఏర్పాట్లు లేనందున అరెస్టు కాకుండా తప్పించుకున్నారు. స్వజనుల చేత పలు విమర్శలకు గురైనప్పటికీ ఖాతరు చేయకుండా, చివరి శ్వాస వరకు జాతీయోద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ఆమె మానలేదు.
నైజాం విలీనోద్యమంలో…
స్వాతంత్ర్యం సాధించాక, ఇండియన్ యూనియన్లో నైజాం విలీనమవ్వాలన్న డిమాండ్ తో సాగిన పోరులో కూడా రాష్ట్రానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్న దాఖలాలున్నాయి. ముస్లిం మహిళలకు ఉన్న మత, సామాజిక బంధనాల మూలంగా పెద్ద సంఖ్యలో ఉద్యమ బాటన నడవలేకపోయినప్పటికీ, ఉద్యమకారులైన తమ బిడ్డలను, భర్తలను ఎంతగానో ప్రోత్సహించారు. పరోక్షంగా సహకరించారు. ఈ విధంగా పరోక్ష సహాయం అందచేసిన వారెందరో ఉన్నప్పటికీ అందరి వివరాలు తెలియరాలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వాతంత్ర్య సమరయోధుల గ్రంథంలో ఒకే ఒక ముస్లిం మహిళ పేరుంది. ఆ అదృష్టవంతురాలు నఫీస్ ఆయేషా బేగం. ఆమె హైదరాబాద్ నివాసి. ఆమె తండ్రి పేరు హామీద్ ఆలీఖాన్. ఆమె 16-9-1948 నుండి 17-9-1948 వరకు రెండురోజుల పాటు నిర్బంధంలో ఉన్నారు. నైజాం విలీనం కోరుతూ ఉద్యమించినందున ఆమె నిర్బంధానికి గురయ్యారు. ఆమె పేరు తప్ప మరే ముస్లిం మహిళ పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కన్పించపోవటం ఆశ్చర్యం కల్గించే అంశం.
తెలంగాణ పోరాటంలో…
ఆనాడు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ముస్లింలు తమ భాగస్వామ్యాన్ని అందించారు. స్త్రీ, పురుష భేదం లేకుండా ఆ పోరులో పాల్గొన్నారు. అటువంటి వారిలో రాజారాం గ్రామానికి చెందిన జైనాబి ఒకరు. పేద రైతు కుటుంబానికి చెందిన ఆమె పోరాట నాయకులకు తన ఇంట రక్షణ కల్పించారు. పోలీసుల నుండి కాపాడారు. చివరివరకు ఆమె ఉద్యమకారులకు చేయూత నిచ్చారు. వయస్సుతో నిమిత్తం లేకుండా, శరీరం సహకరించని వృద్ధాప్యంలో కూడా పోరాటయోధులను అటు రజకార్ల నుండి, భూస్వాముల స్వంత సాయుధ బలగాల నుండి, ఇటు మిలటరీ దాడులు, సోదాల నుండి రక్షించుకునేందుకు ప్రాణాంతక సహసాన్ని ప్రదర్శించిన మహిళలు మనకు తారసపడతారు. జాతీయోద్యమంలో పాల్గొనటం మాత్రమే కాకుండా సామ్యవాద భావాలతో ప్రభావితమై ఇటు ఇండియన్ యూనియన్లో నైజాం సంస్థానం విలీనం కోసం సాగిన పోరు, ఆ తరువాత అటు తెలంగాణా రైతాంగ పోరాటంలలో కూడా తమ త్యాగపూరిత భాగస్వామ్యాన్ని అందించిన మహిళలలో బేగం రజియా, జమాలున్నీసా బాజీ లాంటి వారున్నారు.
నైజాం వ్యతిరేకపోరాటం నుండి తెలంగాణా రైతాంగ పోరాటం వరకు ముస్లిం కుటుంబాలు ఉద్యమకారులను తమ కడుపులో పెట్టుకుని కాపాడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆయుధాలు చేతపూని రణం చేసిన సాహసులైన వీరవనితలు ఉన్నారు. వడిసెల గిరగిరా తిప్పుతూ శత్రువు మీద దాడి జరిపిన సమశీల మహిళలు ఉన్నారు. ఆనాడు సామాజిక జీవన బంధనాలలో ఉంటూ కూడా బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న మహిళలు చరిత్ర గ్రంథాలలో తమదైన స్థానాన్ని సంపాదించుకోలేక పోయారు. అందు వలన ఆ తల్లుల గురించి ప్రజలకు అతి తక్కువ మాత్రమే తెలిసింది. ప్రభుత్వం ప్రచురించిన గ్రంథాలలో కూడా మహిళామణులకు స్థానం లభించకపోవడం విచారకరం.
ఈ విధంగా పేర్కొంటూ పోతే అనేక మంది మణిపూసల్లాంటి మహిళలను మనం ప్రస్తావించుకోవచ్చు. ఈ మహిళల చరిత్రలు అక్కడక్కడా ఆయా ప్రాంతాలలో స్థానిక భాషలలో, స్థానిక చరిత్ర గ్రంథాలలో ఉన్నాయి. ఆనాటి వారి త్యాగాల గురించి అందరికి తెలియాలంటే జాతీయ స్థాయి ప్రామాణిక చరిత్ర గ్రంధాలలో అన్ని సాంఘిక జనసముదాయాలకు చెందిన స్వాతంత్ర్యసమరయోధులందరికి తగిన స్థానం కల్పించాలి. ఆ లక్ష్యంగా చరిత్ర గర్భంలో దాగిన మరెందరి చరిత్రలనో పరిశోధకులు వెలికి తీయాలి. ఆయా చరిత్రలను ఆయా ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలి. ఆ చరిత్రలను పాఠ్య గ్రంథాలలో పొందుపర్చాలి. ఆనాటి త్యాగాల పరంపరకు భవిష్యత్తరాలను వారసులను చేయాలి.
ప్రస్తుతం భారతీయ ప్రధాన జన సముదాయాల మధ్య మానసిక అంతరాలు, అపోహలు, అనుమానాలకు ప్రధాన కారణం ఆయా సాంఘిక జన సముదాయాల భారత స్వాతంత్ర్యోద్యమం: ముస్లిం మహిళలు – త్యాగమయ చరిత్రలను విస్మరించటమే. ఈ అవకాశాన్ని స్వార్ధపర రాజకీయ శక్తులు, వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారు.
ఈ ప్రమాదకర పరిస్థితికి ప్రతిగా, ఆ త్యాగాల స్పూర్తిగా ప్రతి ఒక్కరూ భారతదేశ బంగారు భవితకై నడుం కట్టేలా ప్రోత్సహించాలి. అందుకు ప్రజలు, ప్రభుత్వాలు సహకరించాలి. అప్పుడు మాత్రమే త్యాగసంపన్నులైన మన పూర్వీకులకు మనం ఘనమైన నివాళి అర్పించిన వారం కాగలుగుతాం.
త్యాగాల చరిత్ర అందరికి తెలియాలి
ప్రజలకు అన్ని సాంఘిక జనసముదాయాల త్యాగాలు తెలియాల్సి ఉంది. పలు సాంఘిక జనసముదాయాలు కలసిమెలసి సహజీవం సాగిస్తున్న గడ్డ అయినటువంటి భరతభూమిలో ఆయా జనసముదాయాల మధ్యన సుహృద్భావ వాతావరణం ఏర్పడడానికి ఒకరి త్యాగపూరిత చరిత్రలు మరొకరికి తెలియాల్సిన ఆవసరం ఎంతైనా ఉంది. మాతృభూమి సేవలో పునీతమైన ప్రజలందరి చరిత్ర ఆన్ని సాంఘిక జనసముదాయాలకు తెలిసినప్పుడు మాత్రమే ఆయా జనసముదాయాల మధ్యన పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఆ గౌరవం సదవగాహనకు కారణమౌతుంది. ఆ సదవగాహన నుండి సద్భావన, సహిష్ణుత ఉత్పన్నమౌతాయి. ఆ సహిష్ణుత, సామరస్యం, శాంతి-స్నేహాలకు బలమైన పునాది అవుతాయి.
ఈ వాతావరణంలో లౌకిక వ్యవస్థ పరిఢవిల్లుతుంది. మత విద్వేషాలు మట్టిలో కలసిపోయి మతసామరస్యం మరింతగా పటిష్టమౌతుంది. మతోన్మాద రాజకీయ శక్తుల కుట్రలు, కుయుక్తులకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా సామాన్య ప్రజలకు చేరువకాని ముస్లింల, ప్రధానంగా ముస్లిం మహిళల త్యాగమయ చరిత్రను ప్రజల చెంతకు చేర్చేందుకు సాగుతున్న కృషిలో అతి చిన్న ప్రయత్నమిది.
Very good article anna