ముదిగంటి సుజాతారెడ్డి – నవలా నాయిక పరిణామం

ముదిగంటి సుజాతారెడ్డి 1990ల నుండి సృజనాత్మక సాహిత్యరంగంలోకి ప్రవేశించారు. సంస్కృతాంధ్రా భాషల్లో పండితురాలైనా కూడా వాడుక భాషలో అలవోకగా రాస్తారు. వీరికి తెలంగాణ ప్రాంత రైతుల జీవితాల నుండి విదేశాలోని ప్రోఫెసర్‌ల జీవితాలవరకు సుపరిచితమే. విస్తృతమైన జీవితానుభవాలు వీరి స్వంతం. బహుశ ఈ కారణంగానే వీరి సాహిత్య వస్తువు ఎంపిక వైవిధ్యంగా ఉంటుంది. జీవితాలలోని మార్పులను సునిశితంగా పరిశీలిస్తూ అందుకు కారణమైన సూత్రాలనూ విశ్లేషించగల సామర్ద్యం వీరికి ఉందని వీరి రచనలు చూస్తే ఇట్టే చెప్పేయవచ్చు. పరిణామం అంటే మార్పు అని చెప్పవచ్చు. వీరి నవలలో నాయిక చిత్రికరణలో వచ్చిన పరిణామం ఈ వ్యాసంలో పరిశీలనాంశం. ఇప్పటి వరకు వీరు అనేక కథలు, మూడు నవలలు రాశారు. వీరి నవలలు. 1.మలుపు తిరిగిన రథచక్రాలు(1994), 2.సంకెళ్ళు తెగాయి(1994), 3.ఆకాశంలో విభజన రేఖల్లేవు(2004). మొదటి నవలలో వస్తువు తెలంగాణ రైతాంగ ఉద్యమం. ఇది వీరు రాసిన మొదటి నవల 1990లో పూర్తి చేశారు. దీని ముద్రణ కొంత ఆలస్యంగా జరిగింది. ముద్రణ పరంగా ముందు వచ్చిన నవల ‘సంకెళ్ళు తెగాయి’. ఈ వ్యాసంలో రాసిన క్రమంలోనే తీసుకున్నాను.

నవలా ఇతివృత్తాల పరిచయం
‘మలుపు తిరిగిన రథచక్రాలు’లో కథానాయిక సరళ. ఈమె ఇందూరు దొర రామచంద్రరావు కూతురు. సరళకి చదవడం రాయడం వచ్చు. ఒకసారి బతకమ్మ పండగప్పుడు జరిగిన గొడవలో గాయపడిన ఉద్యమ నాయకుడు రమేశ్‌ని తమ ఇంట్లోవారికి తెలియకుండా సేవకురాలు కస్తూరి సహాయంతో కాపాడుతుంది. ఈ సమయంలో వీరి మనస్సులు కలుస్తాయి. రమేశ్ తన ఆశయాల సాధన కోసం వెళ్లిపోతాడు. ఉద్యమం ఉదృతమై, ప్రజలు వీరి గడిని పగలగొట్టి సరళ తండ్రిని, అన్నని చంపుతారు. సరళ, రమేశ్ సహాయంతో ఆ దాడి నుండి తప్పించుకుంటుంది. ఆమె ధైర్యంగా తల్లిని, కస్తూరిని తీసుకొని హైదరాబాదు చేరుతుంది. తమతో తెచ్చుకున్న నగలు అమ్మి కొంతకాలం గడుపుతారు. ఆర్ధిక ఇబ్బందులు, తల్లి చనిపోవడంతో సరళ అయోమాయ స్థితి పడుతుంది. అనుకొని పరిస్థితిలో దూరపు బంధువు దాసుని పెళ్ళి చేసుకోవాల్సివస్తుంది. కొంతకాలనికి వారికి ఒక కూతురు పుడుతుంది. దాసుకి ఆడపిల్లంటే ఇష్టంలేక కూతుర్ని పట్టించుకోడు. సరళ ఒంటరిగానే కూతురు బాధ్యత వహిసుంది. ఆమెను చదివించి డాక్టర్ని చేస్తుంది. పై చదువుల కోసం వీదేశాలు వెళ్ళిన కూతురు అక్కడే ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. వారికి ఒక పాప. ఆ పాపను సరళ దగ్గర ఒదిలి వెళ్తూ అల్లుడు, కూతురు యాక్సిడెంట్లో మరణిస్తారు. పాప బాధ్యత పూర్తిగా సరళ మీదనే పడుతుంది. దాసు అనారోగ్యంతో మరణిస్తాడు. తన ఆరోగ్య పరిస్థితీ అంతంత మాత్రమేనని గ్రహించిన సరళ, ఇంకా ఉద్యమంలోనే ఉన్న రమేశ్‌కి కబురు చేసి అతని చేతిలో పాపను పెట్టి కన్నుముస్తుంది.

‘సంకెళ్ళు తెగాయి’లో కథపరంగా కథనాయకుడికి ప్రాధాన్యం ఉంది. మంగలీ కులంలో పుట్టిన నారాయణ బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటాడు. పట్నంలోని కాలేజీలో చెరతాడు. అనల అతని జూనియర్. అనల తండ్రి లాయర్. తల్లి సామాజిక కార్యకర్త. వీరు కులాలకాతీతంగా ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. అనల తల్లిదండ్రులు ఆమెని స్వతంత్ర వ్యక్తిత్వంతో వ్యవహరించేలా పెంచుతారు. అనల నారాయణ అతని అభివృద్ధికి సహాకరిస్తుంది. నారాయణ ఐ.ఎ.ఎస్ సాధిస్తాడు. అనల ఉన్నత స్థితిని సాధించడం కోసం పెద్దగా కష్టపడే అవసరం లేదు. కానీ ఏ వసతులు లేకపోయినా ఒక ఆశయంతో కష్టించే నారాయణకి ఆలంబనగా నిలిచి తన ప్రత్యేకత నిలబెట్టుకుంది.

రాగిణి రామారావు, నీరజల కూతురు. తండ్రి లాయర్. తల్లి గృహిణి. తల్లిదండ్రుల ప్రేమలో ఏ లోటు లేకుండా పెరిగింది. తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో చిన్న వయసులోనే తల్లిని, తమ్ముడిని చూసుకోవాల్సిన బాధ్యత ఆమెపై పడుతుంది. స్టెనొగ్రఫీ కోర్సు చేసి ఇంద్ర దగ్గర పి.ఎగా చేరుతుంది. ఇంద్ర పురుషుల అవసరం లేకుండానే జీవితం గడపాలనుకునే యువతి. కొంతవరకు ఆచరణలో కూడా విజయం సాధిస్తుంది. ఇంద్ర తమ్ముడు రాజేంద్ర ఒక సాఫ్ట్ వేర్ కంఫెనీ నడుపుతుంటాడు. రాగిణి, రాజేంద్రలు ఇష్టపడతారు. ఇంద్ర, రాగిణితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ప్రయత్నించి విఫలం అవడంతో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది. చివరికి రాగిణి రాజేంద్రలు కలుస్తారు.

ఆకారం/ఆహార్య వర్ణన:
పాత్ర చిత్రణలో ఆకారం, ఆహార్య వర్ణనలు ముఖ్యమైనవి. రచయిత్రి/రచయిత తాను మలచబోయే పాత్ర స్వభావాన్నీ అనుసరించి వర్ణనలు చేస్తారు. సుజాతారెడ్డి కథనాయికల వర్ణనలో వచ్చిన మార్పులు చూద్దాం.

“సరళ చాలా అందమైంది… ఆమెది సన్నగా తెల్లగా నాజూకుగా వుండే విగ్రహం. ఆమె పొడుగైంది. నడకలో హుందాతనం ఉట్టిపడ్తుంటుంది.”(మలుపు తిరిగిన రథచక్రాలు-8)

“అంతేగాక ఆమె చూపులు బాణాలవలె సునిశితమైనవి. ఎదుటి వాళ్ళను భేదించి లోతులను తెలుసుకుంటాయి. దేన్నైనా ఇట్టే పసిగట్టగల ఆమె సునిశితమైన బుద్ధికి ప్రతిబింబాలై ప్రకాశిస్తూ ఎదుటివాళ్ళను కట్టిపడేస్తాయి.!” (మలుపు తిరిగిన రథచక్రాలు-9) ఈ వర్ణనలు ఆమె శరీర సున్నిత్వాన్ని, అందాని తెలుపుతున్నాయి. ఆమె కళ్ళు సునిశితమైన బుద్ధికి ప్రతిబింబాలై కూడా ఎదుటివాళ్ళను ఆకర్షించడానికి మాత్రమే ఉపయోగపడాయి.

“అనల ఎప్పుడూ ప్యాంటు షర్టుల్లో వున్నా ఆమె డ్రెస్ చేసుకునే పద్ధతి క్యాజువల్‌గా వుంటుంది. షోకులు చేసుకుంటున్నట్లుగా వుండదు.” (సంకెళ్ళు తెగాయి-89,90)

“అనల చీరలో ఎంత హుందాగా అందంగా వుంది. …..లేత ఆకుపచ్చని చీర అదే రంగు బౌజ్లు వేసుకుంది. అనల సుకోమలస్నిగ్ధమైన ప్రకృతి-స్త్రీ ఆకారాన్ని ధరించి కదలివస్తున్నట్లుగా అనిపించింది నారాయణకు.”(సంకెళ్ళు తెగాయి-95) అనలకి సంబంధించి రెండు వర్ణనలోనూ అందానికి హుందతనానికి సమప్రాధాన్యం ఇచ్చారు. రెండోదాంట్లో ఆమెను ప్రకృతితో పోల్చి అన్యపదేశ్యంగా ఆమె శక్తిని కూడా వ్యక్తికరించారు.

“రాగిణి తల్లిలా అందంగా వుంటుంది. తండ్రిలా పొడుగు. రాగిణి సన్నగా వున్నా బలంగా వుంటుంది.”(ఆకాశంలో విభజన రేఖల్లేవు-32)

“రాగిణి మానసికమైన శారీరకమైన సంపూర్ణ వికాసానికి రామారావు ప్రోత్సహం బాగా పని చేసింది.” (ఆకాశంలో విభజన రేఖల్లేవు-33) రాగిణి దగ్గరికి వచ్చేటప్పటికి అందానికి కన్నా, ఆరోగ్యం ప్రధాన పాత్రవహించింది. అందులోనూ ఆమె శారీరక, మానసిక వికాసంపై తండ్రి ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టారు.

సరళ వర్ణన ఎదుటి వాళ్ళను కట్టిపడేయడానికి మాత్రమే పరిమితం అయితే, అనల వర్ణనలో అన్యపదేశ్యంగా ఉన్న శక్తి, రాగిణి వర్ణనలోకి వచ్చేటప్పటికి ప్రధానంగా మారింది. ఏ వ్యక్తికి అయినా తన ఆశలను, ఆశయాలను నెరవేర్చుకోవడానికి శరీరం ఒక సాధనం. ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండడమే ఒక అందం. సంప్రదాయం స్త్రీలని అందానికి మాత్రమే పరిమితం చేసింది. వీరి వర్ణనలు ‘స్త్రీ అంటే నాజుకుగా ఉండడమే అందం’ అనే సంప్రదాయ ప్రభావాన్ని క్రమంగా తొలగించుకున్నాయి. ఆహార్య వర్ణనలో కూడా ఈ మార్పు కనిపిస్తుంది. సంప్రదాయ వస్తాధారణకి మొదటి నవలలో ఇచ్చిన ప్రాముఖ్యం తర్వాత వాటిలో ఇవ్వలేదు. సౌకర్యంమే నిలిచింది.

వ్యక్తిగత నిర్ణయాలు:
సమయం వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో వాటిని అమలు పరిచే విధానంలోనూ ఆయా వ్యక్తుల సమర్ధత తెలుస్తుంది. ఈ అంశంలో ముదిగంటి సుజాత నాయికలను మలిచిన తీరు చూద్దాం.

సరళ రమేశ్ ఆశయాలు నచ్చి అతనిని ప్రేమించింది. కాని ఆమెకి ఆ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేదు. కనీసం తండ్రి పెళ్ళి ఖాయం చేసుకొచ్చినప్పుడు కూడా ప్రేమించిన విషయం చెప్పలేకపోయింది. ఆ పెళ్ళి జరగకుండా చూడమని రమేశ్‌ని కోరింది. తల్లిదండ్రులు చనిపోయే వరకు కూడా వారికి, సరళ ప్రేమించిన సంగతి తెలియదు. రమేశ్ తను పెళ్ళి చేసుకోలేనని చెప్పినప్పుడు “రమేశ్! నన్ను నా భాగ్యానికి వదిలివేయదలచుకున్నవా? అయితే! నేను ఇష్టంలేని పెండ్లి చేసుకొని సుఖపడ్తానని నువ్వనుకుంటున్నవా? రమేశ్! (మలుపు తిరిగిన రథచక్రాలు-232) అని ఏడుస్తూ అడుగుతుంది తప్ప తన ప్రేమని పండించుకోవడానికి కార్యచరణకి పూనుకోదు. ఆమెకి దాసు అంటే అసహ్యం. అతను ఆమె నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకొని పెళ్ళి చేసుకుంటాడు. అయినా అతనితో సర్దుకుపోయి జీవిస్తుంది. కానీ పెళ్ళికి ముందుగాని పెళ్ళి తర్వాతగాని దానిని తప్పించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయలేదు. పరిస్థితులకనుగుణంగా సర్దుకు పోతుంది.

అనల, నారాయణని అతను పరిస్థితులను ఎదుర్కొవడంలో చూపే పట్టుదల, కృషిలనూ చూసి ఇష్టపడుతుంది. ప్రేమించిన విషయం అతనితో చెప్పకముందే ఇంటికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులకి పరిచయం చేస్తుంది. అనల తండ్రి “ఒక వేళ అనల ఈ అబ్బాయిని ఇష్టపడ్తుందా? ఏమి! ఏదైనా చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా వుండేటట్లుగానే తాను తన భార్యా అనలను పెంచాము. ఒక్కతే కూతురని పిచ్చిగారాబంతో కాక క్రమశిక్షతోనే పెంచాము. స్వతంత్రంగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా సరియైన నిర్ణయమే అది తీసుకోగలుగుతుందని తనకు పూర్తి విశ్వాసముంది!”-(సంకెళ్ళు తెగాయి-86) అని ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తాడు. అనల నిర్ణయం తీసుకువడంలోగాని దాని ఆచరణలో పెట్టడంలోగాని ఎక్కడా త్రొటుపాటు లేదు. అది అతి సహజంగా జరిగిపోయింది. దానికి ఆమె నేపథ్యంతోపాటు స్వయం నిర్ణయం తీసుకునే ధైర్యం కూడా కారణమే.

రాగిణి, తండ్రి చనిపోయినాక రాగిణి మేనత్త విజయ తెచ్చిన సంబంధం వారు కట్నం అడగడంతో “డబ్బు కోసం పెళ్ళి జరగడం నాకిష్టంలేదు!” (ఆకాశంలో విభజన రేఖల్లేవు-31) అని అలాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా తన అభిప్రాయం స్పష్టంగా ప్రకటిస్తుంది. సరళలా పరిస్థితులకి తలవంచదు. ఏ పరిస్థితులలోనైనా తన ఉనికి కాపాడుకునే సామర్థ్యం రాగిణి స్వంతం. తర్వాత తను ఇష్టపడిన రాజేంద్రను ఏ సంకోచాలు లేకాండా తన కుటుంబానికి పరిచయం చేస్తుంది. అతనినే పెళ్ళి చేసుకుంది.
వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన ప్రేమ, పెళ్ళి విషయాలలో అనలకే సమస్యలు ఎదురు కాలేదు. సరళకు అన్నీ వైపుల నుండి సమస్యలే. రాగిణికి ఇబ్బందులు ఎదురైనా ఇష్టంలేనివాటికి తలవంచక నిలబడి తాను కోరుకున్నది సాధించుకుంది. అనల, రాగిణిలు నిర్ణయాలు తీసుకోవడం, వాటిని సాధించుకోవడంలో కనిపించిన పరిణితి సరళలో కనిపించదు.

సామాజిక పాత్ర నిర్వహాణ:
సమాజంలో కుటుంబం ఒక యూనిట్ అయినాగాని కుటుంబంలో చేసే పనులు సామాజిక గుర్తింపు కన్నా వ్యక్తిగత కార్యాలుగానే పరిగణింపబడుతున్నాయి. సంప్రదాయంగా స్త్రీలను కుటుంబానికి పరిమితం చేసింది పితృస్వామ్య భావజాలం. స్త్రీలు కుటుంబంలో చేసే శ్రమ విలువ లేనిది నేటికి ఎక్కువ శాతం మంది పరిగణిస్తున్నారు. కుటుంబం నుండి బయటకి వచ్చి చేసే ఉత్పత్తికార్యాలే సామాజిక కార్యాలుగా గుర్తించబడుతున్నాయి. అవే సామాజికంగా ఆయా వ్యక్తుల పాత్రను నిర్ణయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్త్రీ సాధికారత నిర్ణయించడంలో సామాజికంగా వారు నిర్వహిస్తున్న పాత్ర కూడా పరిగణలోకి వస్తుంది.

సరళ దొర కూతురైనా, గడిలో వుండగా తల్లిదండ్రులకి ఇష్టంలేకపోయినా కుట్టుపనులు, తోటపని వంటివి సరదాగా చేసింది. కానీ పరిస్థితులు మారిపోయి ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు సరళ కనీసం ఉద్యోగ చెయలనే ఆలోచన ఆమెకి కలగదు. అంత క్లిష్టపరిస్థితుల్లో కూడా ఆమె ఉద్యోగ ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. రమేశ్ ఆశయాలను ఇష్టపడిన సరళ “రమేశ్ ఆదర్శాలను ఆశయాలను తన ఆదర్శాలుగా ఆశయాలుగా చేసుకొని బతకాలని అనుకుంది.”(మలుపు తిరిగిన రథచక్రాలు-81) అతని ఆశయాల కోసం ఉద్యమంలో పని చేద్దామనుకున్న సరళను ‘రమేశ్ నువ్వీ పని చేయలేవు’ అనడంతో ఆగిపోతుంది. సరళ పాత్రపై పితృస్వామ్య ప్రభావం ఉంది అనడానికి ఆమె పని చేయడానికి వ్యతిరేకం కాదు. ఇంట్లో వారు వద్దు అన్న పనులు మానలేదు. కానీ తమకి అవసరం అయినప్పుడు కూడా ఇంటి నుండి బయటి రావడానికి ప్రయత్నం చేయక పోవడమే నిదర్శనం. రమేశ్‌తో జీవితం పంచుకోవలనుకున్నప్పుడు కూడా ఆమే అతనితో పాటు కష్టపడటానికి సిద్ధపడలేదు. అతను వద్దు అంటే ఆగిపోయి ఒక అస్వతంత్రమైన వ్యక్తిగా మాత్రమే మిగిలింది.

అనల విద్యార్థి దశ నుండే రాజకీయాలలో కీలకపాత్ర పోషించింది. అందుకే కుల, అధికార అహంకారాలకి ప్రతీకగా ఉండే రామేశ్వర్రావు కాలేజ్ ఎలక్షన్‌లో ప్రెసిడెంటుగా నిలబడటం సహించలేక, సమాజం గురించి మంచి అభిప్రాయాలు, చదువుపట్ల శ్రద్ధ ఉన్న నారాయణని “నారాయణా; ప్లీజు నువ్వు ప్రెసిడెంటుగా నిలబడాలి. మేమంతా నీ తరపున పనిచేస్తాం. నీ వెనుక ఎవరూలేరని నువ్వు అధైర్యపడవద్దు!”(సంకెళ్ళు తెగాయి-62) అని అతనికి ధైర్యానిస్తుంది. అతనికి ఆ పనిలో తన పూర్తి మద్ధతు అందిస్తుంది. అతని గెలుపు కోసం రాత్రింబగళ్ళు పని చేస్తుంది.

అనల, నారాయణ స్వంత ఊళ్ళోనే కులం కారణంగా అతను అవమానలనేదుర్కొవడం చూసి చలించిపోతుంది. “….దీన్ని అధిగమించాలంటే నువ్వు సమాజంలో స్థానాన్ని కల్పించుకోవాలి. నువ్వు నీ గౌరవాన్ని నీ తోటివాళ్ళ గౌరవాన్ని పెంచాలి.”(సంకెళ్ళు తెగాయి-125) అని అతనికి దిశ నిర్ధేశనం చేస్తుంది. అతను ఆ స్థానానికి చేరుకోవడానికి కావాల్సిన సహాయ సహాకారాలను అందిస్తుంది.

రాగిణి తండ్రి మరణం తర్వాత పెళ్ళి చేసుకోమన్న అత్తతో “అత్తా! అమ్మ ఒకతే అయిపోతుంది. నేను ఉద్యోగం చేయదలచుకున్నాను. తమ్ముడు చిన్నవాడు. వాడి చదువు వుంది! ఆ తర్వాతే నా పెళ్ళి సంగతి ఆలోచిస్తాను! అంది రాగిణి ధృడంగా.”(ఆకాశంలో విభజన రేఖల్లేవు-27) తను చెప్పినట్టే ఉద్యోగంలో చేరి తల్లికి ఆసరాగా ఉంటుంది. రాగిణికి ఏ సపోర్టు లేకపోయినా అవసరమైనప్పుడు తానే ముందుండి కుటుంబాన్ని నడిపించడానికి పూనుకుంది.

సరళకి స్వయం సంపాదనకు అవసరమైన చదువు లేకపోవడంతోపాటు స్త్రీలు ఇంటికే పరిమితం అనే సంపదాయ భావనకి బంధిగా మారింది. అందుకు ఆమె చెల్లించిన మూల్యం ఇష్టంలేని దాసుతో జీవితం మొత్తం గడిపింది. ఇక అనల తన జీవితానికే పరిమితంకాక సమాజంలో అణచబడుతున్నవారిని చైతన్యపరచే కార్యక్రమం ఎంచుకోని వీరిద్దరికన్నా ఆదర్శంగా నిలిచింది.

ముగింపు:
సరళ ఆకార,ఆహార్య వర్ణనలలో కనపడిన సంప్రదాయ ప్రభావం క్రమంగా రాగిణి దగ్గరికి వచ్చేటప్పటికి మార్పు చెందింది. సరళలోని సున్నితత్వం రాగిణిలో బలంగా మారింది. దుస్తుల వర్ణనలో సౌకర్యం ప్రాధాన్యం వహించింది. ఈ మార్పులు చేయడంలో రచయిత్రి అవగాహన పరిణామం కనిపిస్తుంది. వ్యక్తిగత నిర్ణయాలలో సరళ స్వంతంగా నిర్ణాయాలు తీసుకుంది ఎక్కడా లేదు. ఆమె పరిస్థితులని అనుసరించి సర్దుకుపోయింది. అనల, రాగిణిలు ఇద్దరూ పరిస్థితులకి ఎదురు నిలచి పోరాడి తాము అనుకున్నది సాధించారు. వీరు కుటుంబానికే పరిమితం అవ్వకుండా సామాజిక పాత్రలో కూడా పాలుపంచుకున్నారు. అందులో విజయం అందుకున్నట్లు చిత్రించడంలో రచయిత్రి అవకాశం దొరికితే స్త్రీలు సాధించలేనిది ఎమి లేదనే విషయాన్ని ఈ పాత్రల ద్వారా నిరూపించారు.

పరిశోధక విద్యార్థి,
హైదరాబాద్ విశ్వవిద్యాలయం.

One thought on “ముదిగంటి సుజాతారెడ్డి – నవలా నాయిక పరిణామం

  1. తెలంగాణ సాహితీ జగత్తుకే గర్వ కారణం డా ” ముదిగంటి సుజాతారెడ్డి గారు.అటువంటి గొప్ప రచయిత్రి నవలా సాహిత్యంపై చక్కని వ్యాసం రాసిన ఈ సాహిత్య వ్యాసకర్తకు,ప్రచురించిన కొలిమి సంపాదకులకు వందన ధన్యవాదాలు ..

Leave a Reply