ముడ్డెండి పోతూంది!

ముడ్డి అలగలేదు. చెరువెండలేదు. కాని ముడ్డెండిపోతూంది?!

ట్యాంకుడు నీళ్ళున్నాయి!

ఫ్లష్ చేశాను. నీళ్ళు గలగలా వస్తున్నాయి పై ట్యాంకులోంచి టాయిలెట్ ట్యాంకులో పడుతున్నాయి. సన్నటి శబ్దం. పోటీ పడుతూ నా నిట్టూర్పు శబ్దం.

“ఈ రోజుకు వస్తారా? ఆ బాత్ రూమ్‌లోనే ముసలయిపోతారా?” డోర్ అవతల మా ఆవిడ అరుపు.

‘నా అవస్థ నీకేం తెలుసు?’ అనుకుంటూ టాయిలెట్ బౌల్‌మీద మళ్ళీ కూర్చున్నాను. సమస్య కాన్స్టిపేషన్ కాదు. అది లేనిదెప్పుడు. ఉన్నా అలవాటయింది కాబట్టి లేనట్టే. గనుక అదిప్పుడు తక్షణ సమస్య కాదు.

ప్చ్… నా బద్దకమే నన్ను తింది?!

చూస్తే- చచ్చిన పాములా పడివుంది. బమ్ గన్ అన్నా కదల్లేదు. హెల్త్ ఫాసెట్ అని పిలిచినా కదల్లేదు. జెట్ స్ప్రే అన్నా – యే పేరు పెట్టినా యెంత తిరగేసినా చలనం లేకుండా వుంది. చేతిలోంచి జారి కిందపడి కూడా కదలకుండా వుంది. కన్నీరు వొలికినట్టు రంధ్రాలలోంచి నీళ్ళు వస్తున్నాయి.

ఒకప్పటి ఆ గన్ నా కళ్ళముందు తళతళమని కాంతితో కదలాడింది. బతికున్న రోజుల్లో బుసలుకొడుతూ బలమైన తాచుపాములా గంతులేసేది. చేయిజారి కిందపడితే పట్టుకు దొరికి కూడా ఆ వాటర్ ఫోర్సుకి తల వూపుతూ వూగిపోయేది.

అలాంటి వాటర్ గన్ యిప్పుడు చచ్చిన పాములా పడుంది. అక్కడక్కడా తుప్పు పట్టింది. వయసయింది. దానికా? నాకా?

ప్చ్… ముడ్డెండిపోతూంది?!

టాయిలెట్ బౌల్‌మీంచి లేచాను. నిలబడ్డాను. ఒంగాను. కడకు అతి కష్టమ్మీద మలాసనం వెయ్యడానికి ప్రయత్నిస్తూన్నట్టు కూర్చున్నాను. ఉహు లాభం లేదు. పొట్ట పెరిగిపోయింది. మోకాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. ‘నీ యయ్య… మొయ్యలేకే’ ఫ్రెండు పెద్ద ఎమ్బీబీయస్సు చేసినట్టు బుస్సుమని తిట్టినతిట్టు గుర్తుకు వచ్చింది. ఔను, వదిలేస్తే పెరగదా?

లేదు. వదిలెయ్యలేదు. ట్రై చేస్తూనే వున్నా. చెయ్యి అందడం లేదు… అల్లంత దూరాన అక్కడెక్కడో వున్నట్టు!

బాయిలర్ చికెన్ తిని బాయిలర్ కోడిలా అయిపోయింది బతుకు. నాకు తెలీకుండా వూపిరి ఆపి మరీ ప్రయత్నించానేమో పెద్ద వూపిరే తీశాను.

పెద్దగా గాలి పీలుస్తుంటే బాడ్ స్మెల్. రాత్రి యేమి తిన్నాను? ‘నోటంట తిన్నదేదయినా ముడ్డెంట వెళ్ళాల్సిందే’ చిన్నప్పుడెప్పుడో మామయ్య అన్నమాట యిప్పుడు గుర్తుకు వస్తోంది.

ఒక మనిషి జీవితకాలంలో యెంత తింటాడు? సముద్రమంత! సముద్రం చిన్నదై చేతుల్లోకి వచ్చింది…

పొట్ట నొక్కుకున్నాను!

ఊ…హ్…

ఆంధ్రా యూనివర్సిటీలో యోగా చేశాను. వదిలేశాను. గుర్తుగా కోర్సు పాసయినట్టు సర్టిఫికేట్ కూడా యిచ్చారు. మరిప్పుడు పరీక్ష పెడితే? ఫెయిలే!

‘ఎప్పుడూ చెయ్యడం కష్టమే. ఓ మనిషిని పెట్టండి’ యెప్పుడో అన్న మా ఆవిడగొంతు యిప్పుడు చొచ్చుకువచ్చి మరీ వినిపిస్తోంది.

మళ్ళీ చేతుల్లోకి గన్ తీసుకున్నాను. హెడ్ మీది బటన్ హేండిల్ నొక్కాను. చిమ్ముతోంది. చిరుకుతోంది. వారం క్రితం క్యాంపుకు వెళ్ళేదాక కొద్దిగయినా పనిచేసింది. ఇప్పుడు మొరాయిస్తోంది.

గన్ వంక చూశాను. అది నన్ను కాలుస్తున్నట్టే వుంది.

గన్ వదిలి మోకాళ్ళమీద భారంగా కూర్చున్నాను. చెయ్యి అందదే. ఇంకొకరి ముడ్డి కడగడం సులువు. మన ముడ్డి మనం కడుక్కోవడం కష్టం. నాలోని యిన్నర్ వాయిస్.

వెనుకపెట్టి ట్యాప్ కింద వంగాను. వంగదే. ‘ఒళ్ళు వంగని వాడికి వూరచ్చదు’ అమ్మ తిట్టిన తిట్టు జ్ఞాపకానికి వచ్చింది. ఊరు అచ్చుతుందో లేదో తర్వాత… నా వొళ్ళే నాకు అచ్చి రావడం లేదు?! పక్కకు కదిలి ట్యాప్ విప్పాను. మెల్లగా వంగాను. నీళ్ళధార వెన్నుమీద వీపుమీద పడుతోంది. ముందుకు జరిగాను. ప్చ్ లాభం లేదు. హు… మా ఆవిడ ఛీ ఛీ అంటూ అస్సలు వొప్పుకోదు… టాయిలెట్‌లో పేపర్రోల్ పెట్టనివ్వదు…

ఫారినర్సే బెటర్. తింటే మూతి తుడుచుకున్నట్టే వెళితే ముడ్డీ తుడుచుకుంటారు. నీళ్ళు కరువేమో? వాళ్ళు కారం తినరేమో? దానికీ దీనికీ సంబంధం యేమిటి? కాదు, మనలా కారం తింటే తుడుచుకున్నప్పుడు భగ్గుమని మంటకు పేపరు కాలిపోదూ? ఓహో అందుకేనా కారం తినరు? ఎంత మంటయినా ఆర్పేయవచ్చని మనం కడుక్కుంటాం… అంతేనా?

ఫ్రెండుతో మాట్లాడిన మాటల్ని చెవుల్లో సెట్టరు దించి డైవర్టు చేసుకున్నాను.

ప్చ్… ముడ్డెండిపోతూంది?!

చిన్నప్పుడూ టీనేజ్‌లోనూ యెడమ చేతికి చక్కగా అందేది. అప్పుడు యిండియన్ టాయిలెట్టే. ఇప్పుడు వెస్ట్రన్నూ. వాటర్ గన్నూ.

అసలీ గన్ బిట్వీన్ ద లైన్స్ యెలా వచ్చింది? కంఫర్ట్ కోసమేనా? కాదు. కొంతే ఔను. మరి? చెయ్యీ మనదే. ముడ్డీ మనదే. మన చెయ్యి మన ముడ్డిని ముట్టాలంటే నిరాకరిస్తుంది. అటువంటి పనులన్నీ అందుకేగా యెడమ చేతికి ప్రత్యేకించి కట్టబెట్టింది. లోపల వున్నదే బయటకు వస్తే అసహ్యం. మరి మనది మనకే యింత అసహ్యం అయినప్పుడు వాళ్ళు నెత్తిన పెట్టుకు యెలా మోసారో?

ఉహ్… ముందు నుండీ అందదే. వెనుకనుండీ అందదే. ఇంత యిరుకున పెట్టాడేమిటో యీ డిజైను?

“అయ్యిందా? లేదా?” మా ఆవిడ డోర్ నాక్ చేస్తోంది.

పలకలేదు.

పాస్‌కు వున్నట్టు వో గొట్టంలా ముందుకు వుండాల్సింది…

చింతించకు. బెడ్‌న పడ్డప్పుడు గొట్టామే పెడతారు…

అందరూ టూకి కావడం లేదని కాన్స్టిపేషన్‌మీద క్లాసుల మీద క్లాసులు తీసుకుంటారు. ‘పికు’లో అమితాబు బాధ మన బాధ అయ్యింది. అదే కాదు ముడ్డి కడుక్కోవడం కూడా సమస్యే. సమస్యంటే యెవరైనా కడిగిపెడతారా? దానికీ మిషను వస్తుంది. కడుగుతుంది. పేపరుతో తుడుస్తుంది. చార్లీ చాప్లిన్ ‘మోడరన్ టైమ్స్’లో తినిపించి మూతి తుడిచినట్టు. ముడ్డి తుడిచే మిషన్లూ వస్తాయి. ఈ దిశగా భవిష్యత్తులో స్టార్ట్ అప్స్ మొదలవుతాయి. పేటెంట్ యెవరిదో? అప్పుడు ముడ్డికింత అని పన్ను కట్టాలి. ప్రభుత్వం బతకొద్దూ? సారా తాగితే తప్పులేదు. ముడ్డులు కడుక్కున్నోళ్ళ మీద పన్ను వేస్తే తప్పులేదు.

“మీయయ్య పొద్దుకి పది దపాలు వెళ్తారు, ఫారిను” డాడీ కనబడ్డం లేదని అడిగిన కొడుకుకి మా ఆవిడ చెపుతున్నట్టుంది.

ఈ టైంలో బిరడా కొట్టి వరదలొస్తే యేమిటి పరిస్థితి? గన్ లేని రోజుల్లో విరోచనాలు అయితే పది దపాలు యెలా కడుక్కున్నారో మహానుభావులు?

ఎవరూ మాట్లాడరేం? ప్రపంచం పట్టించుకోదేం?

ప్చ్… ముడ్డి అందడం లేదు… అదేదో ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నట్టు!

నీకు ముడ్డి బరువయ్యింది… నన్ను నేనే తిట్టుకున్నా.

వాకింగ్ చెయ్యి. కనీసం యింటి పని చెయ్యి. ఒళ్ళు వంగితే అన్నీ అందుతాయి… నన్ను నేనే వోదార్చుకున్నా.

బాబోయ్… ముడ్డెండిపోతూంది?!

ఇన్నాళ్ళూ కడుక్కున్న ముడ్డే. నా ముడ్డి నాది కాకుండా పోయింది. గన్నును కోపంతో తన్నాను. నేలకేసి కొట్టాను. నిర్జీవి జీవం విడిచినట్టే వుంది!

‘ఏరా… నీయయ్య- నీ అయ్యకు బాలేనప్పుడు లేవలేనప్పుడు కడుక్కోలేనప్పుడు నేను కదా కడిగింది. ఆఖరి రోజుల్లో నేను కదా స్నానమాడించింది? మిమ్మల్నీ మీ టాయిలెట్‌నీ నేను కదా మూలమూలలా క్లీన్ చేసింది? నీకు శ్రమ తెలీకుండా చేసింది?’
ఉలిక్కిపడ్డాను.

‘నన్ను వాడడం మంచిదే. నిన్ను నువ్వు వాడుకోవడం మరీ మంచిది. అలా వాడుకోలేనిరోజు నా సాయం తీసుకో. తప్పితే నామీద ఆధారపడి యిలా హేండీకేప్ కాకు…’

గన్ నాకేసి గురిపెట్టినట్టుంది.

నాకే తెలీకుండా తలాడించాను. నేలమీది గన్‌ని చేతుల్లోకి తీసుకున్నాను. తడిమాను.

‘అర్జెంటుగా నిన్ను లోడ్ చేయించాలి. సారీ… రిపేర్ చేయించాలి. చేయించి…’ గొణిగినట్టుగా అన్నాను.

‘నిన్ను నువ్వు కాల్చుకోవాలా?’ గన్ అడిగినట్టయింది.

నేను తలవంచాను!

‘వంచాల్సినవి ముందు వంచు’ అన్నట్టు వినిపించింది!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. అయిదు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి, మనువాచకం. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. పిల్లల కథా సంపుటం: అల్లిబిల్లి కథలు. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- యింకా జాతీయాల మీద వచ్చిన ‘పురాణ పద బంధాలు’, పిల్లల సమస్యల మీద వచ్చిన ‘ఈ పెద్దాళ్ళున్నారే’, మంచిపుస్తకం తానా ప్రచురణ ‘నువ్వేమిస్తావు?’ తో కలిపి మొత్తం యిరవైతొమ్మిది వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్‌లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’, ప్రజాతంత్ర ‘శోభ’లో ‘మెరుపు తీగెలు’ కాలమ్స్‌కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

3 thoughts on “ముడ్డెండి పోతూంది!

  1. 😅😄😌
    ఉహ్… ముందు నుండీ అందదే. వెనుకనుండీ అందదే. ఇంత యిరుకున పెట్టాడేమిటో యీ డిజైను?

  2. ఎంత బాగా రాస్తావబ్బా. అందుకో నా వీర తాడు . నేను కూడా ఇదే టాపిక్ మీద ఇంకో యాంగిల్ లో ఒక రైట ప్ రాశాను . అక్కడికి వచ్చి కూడా విసిగించే జనం ఐమీన్ ఫోన్లు , ఎందుకు పనికిరాని టాయిలెట్ పేపర్లు .. వాటిమీద రాశాను. మరి అక్కడికెందుకు ఫోన్ మోసికెళ్లడం అని అడగండి . నా మనవడు నా ఫోన్ మీద అనేక ప్రయోగాలు చేస్తాడు . ఒకసారి నా ప్రొఫీల్ పిక్ ని కోతి బొమ్మగా మార్చేశాడు , మెసేజీలు ఈ మోజీలు ఎవరికేవారికో పెట్టేస్తున్నాడు . అప్పటినుంచీ ఎక్కడికెళ్లినా మోసికేడతాను ,

  3. ‘ముడ్డెండి పోతూంది!’
    ఈ కథ యిప్పుడు ఆడియోగానూ….
    ‘Voice of the People – ప్రజల గొంతుక’లో
    https://youtu.be/YcHAN5ESRPs

Leave a Reply