చలనం ప్రాణి లక్షణం. స్పందన జీవి స్వభావం.చీమను చూడండి తనకు అవరోధం ఎదురైనా, హానికరమనిపించినా వెంటనే కుట్టడం మొదలుపెడుతుంది. పాకుతూ వెళ్లే బండపురుగు సైతం పుల్లో పుడకో తగలగానే ముడుకుపోతుంది.
మనిషి కూడా అంతే.స్పందన ప్రతిఘటన, నిరసన,
ధిక్కారం జీవుల సహజ గుణం. అనేకానేక స్పందనలు నించి, ప్రతిఘటనల నుంచి, ప్రతిచర్యలు నుంచి ఇప్పుడిలా రూపొందిందే మనిషి బతుకు కూడా.
తమ బతుకు దారిలో ముళ్ళు కనబడితే ఎత్తిపారేసే మనిషి. దోవలో రాళ్ళూ రప్పలూ చూసుకుని, తొలగించి నడిచే మినిషి. ఇప్పుడు అచేతనం ఆవరించిన జీవిలా ఎందుకుట్టా అయ్యాడో ప్రశ్నార్థకంగా మారిన వర్తమాన మిది. దేశమంతా కుట్రపూరిత రాజకీయాలు మనుషుల్ని చీలికలు చేస్తూ మత,కుల విభజన చేస్తుంటే చూస్తూ చేస్తలుడిగి ఉండటం ఏమిటి? ప్రజల సంక్షేమం కోసం ,జీవన ప్రమాణాల అభివృద్ధి కోసం పాటుపడాల్సిన పాలకులు భక్తి, ధర్మం, సంస్కృతి సంప్రదాయం అంటూ ప్రజల్ని ప్రలోభపెట్టడం ఎందుకు? జనాన్ని,
వారి దృష్టిని దేశభక్తి వైపు,ధర్మరక్షణ వైపు మళ్లించి నిరాటంకంగా తమ ఎత్తులు పారించుకునే వ్యూహం కదా ఇది. ఇటువంటి అవగాహనను,చేతనని కాలం చేతిలోపెట్టి ఇటీవలే మన నుంచి దూరమైన అభ్యుదయ ఆలోచనాపరుడు, ప్రగతి శీలవాది. పౌరహక్కుల నేత,మూలవాసుల, ఆదివాసుల గొంతుక, ప్రొఫెసర్ సాయిబాబా.
సత్యాన్ని బిగ్గరగా మాట్లాడాలని, అన్యాయాన్ని సమూలంగా నిర్మూలించాలని తపన చెందిన మేధావి.ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన కార్పొరేట్ దుర్మార్గపు చర్యలను నిరసించిన బలమైన దిక్కార పతాక. నిరాధరమైన నిందలు వేసి జైలుపాలు చేస్తే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ మనకాలపు హక్కుల యోధుడు. చైతన్యశీలి సెల్ లో సమాజంలో వున్నా తన కార్యశీలతను విస్మరించడు అనే మాటకు ఉదాహరణగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం. కనుకనే అండా సెల్ కవిత్వంతో కాలానికి చైత్యాన్ని నూరిపోసాడు.నేను చావును నిరాకరిస్తున్నాను అని ప్రకటించినా, ది లవింగ్ కబీర్ అని తాత్వికతలో పోరాటాన్ని అన్వేషించినా అదంతా నిశబ్దం ఆవరించిన ఈ సమాజానికి,
నిస్తేజంగా పడివున్న ఈ నేలకు జవసత్వాలు కూడగట్టటమే తన యోచన కలిగిన సృజనకారుడు సాయి.ఆయన సృజించిన అనేక పార్శావ్
“ఏం జరుగుతూ ఉన్నదో బిగ్గరగా చెప్పడమే ఎవరైనా ఎప్పుడైనా చేయగల అత్యంత విప్లవాత్మకమైన పని” అన్న రోజా లగ్జంబర్గ్ మాటల్ని గుర్తుచేసుకుంటూ విద్వేషం వీధివీధినా వెల్లువై పారుతున్న ఈ వర్తమానంలో మీ ప్రేమను మీరు కాపడుకోవడానికి వీధులవెంబడి బిగ్గరగా అరుస్తూ వెళ్ళండి అంటున్న ది లివింగ్ కబీర్ సంపుటిలోని ఈ కవితను చదువుకుందాం.
వీధుల వెంట అరుస్తూ వెళ్ళండి
స్నేహితులారా,
నా హృదయంలో హృదయాల్లారా
మీ గుండెలోతుల్లో
అంత ప్రేమ ఉన్నప్పుడు
ఈ సంక్షుభిత వేళ
ఎందుకు మీ నిశ్శబ్దాన్ని
బద్దలు చేయరు?
మీరెందుకు ప్రతిసారీ
కీలక సమయాల్ని
చేజార్చుకుంటారు?
మీ కనురెప్పలను
కుంగదీసేంత భారం మీపై ఉన్నప్పుడు
మీరెందుకు ఈ నిశి రాత్రి
ప్రేమ గీతాలు ఆలపించరు?
స్నేహితులారా నా మాట వినండి
కబీర్ ఎప్పుడూ అంటాడు
మీ ప్రేమను మీరు రక్షించుకోవాలంటే
బహిరంగ వీధుల వెంబడి
బిగ్గరగా అరుస్తూ వెళ్ళాలని
జూలై 4, 2019
అనువాదం: పి. వరలక్ష్మి (ది లవింగ్ కబీర్ సంపుటి)
మతం మత్తు మందుని మెదళ్లల్లో కూరకుని మనిషితనాన్ని హననం గావించుకుంటున్న సమాజానికి సత్యం వైపు నిలబడమని పిలుపునిస్తున్న సాయిబాబా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడిన బుద్దజీవి. మేధావి.
ఆయన ఆశయాలకు,ఆలోచనలకు విరామం లేదని ప్రకటిస్తూ,పనుల్లో,ఆలోచనల్లో ముగింపు లేని ఆ ధిక్కార చేతనను అందుకోవడమే నిజమైన నివాళిగా భావిస్తూ…