ముందుతరాల వాళ్లకి

I

నిజంగా నేను చీకటి రోజులలో జీవించాను!
నిజం మాట్లాడటం నేరం. నుదుటిపై ముడతలు పడకుంటే
ఆ చర్మం మొద్దుబారిపోయినట్టు. మనిషి నవ్వాడంటే
అతనింకా భయంకరమైన
వార్తలింకా వినలేదని అర్ధం

ఎలాంటి రోజులివి?
చెట్ల గురించి మాట్లాడటంకూడా ఒక నేరమే
ఎన్నెన్నో దుర్మార్గాల గురించి మాట్లాడని మౌనాన్ని అది తెలుపుతుంది
నెమ్మదిగా రోడ్డు దాటి నడుచుకుంటూ వెళుతున్న ఆ మనిషి
బహుశా సహాయం అవసరమైన
తన స్నేహితులకింక కనిపించడేమో?

నేనింకా నా జీవికకోసం సంపాదిస్తున్నానన్నది నిజమే
ఇది కేవలం కాకతాళీయమే, నమ్మండి
నేను చేస్తున్నపనేదీ నాకు కడుపునింపుకునే హక్కు ఇవ్వదు
నన్ను వాళ్ళు వదిలేయడం యాదృచ్ఛిక విషయం (నా అదృష్టం కరిగిపోతే, నేను మిగలను)

వాళ్ళు నాతో అంటారు: తినండి, తాగండి! అవి దొరుకుతున్నందుకు సంతోషించు!
ఆకలితో మాడిపోతున్న వాళ్ళ చేతిలోనుంచి
లాగేసుకున్న కూడు ఎలా తినాలి నేను?
దాహంతో గొంతెండిపోతున్న మనిషి నుంచి గుంజుకున్న గ్లాసు నాది
అయినా నేను తింటున్నాను, తాగుతున్నాను

నేను కూడా తెలివిగా ఉండాలనుకుంటున్నాను
తెలివి అంటే ఏమిటో పాత పుస్తకాలలో చెప్పారు
లోకంతో ఘర్షణ లేకుండా
ఉన్న కొద్దికాలం భయపడకుండా బ్రతకడం
హింస లేకుండా సర్దుకుపోవడం
చెడుకు బదులు మంచి చేయడం
కోరికలు తీర్చుకోకుండా వాటిని మర్చిపోవడం
తెలివిగా ఉండడమంటే ఇవేనని చెప్పారు
నేనివేవీ చేయలేను
నిజంగా నేను చీకటి రోజులలో బ్రతికాను

II

అస్తవ్యస్తమైన రోజులలలో నేను నగరాలలోకి అడుగుపెట్టాను
అక్కడ ఆకలి తాండవమాడేది
నేను జనాలు తిరగబడుతున్న కాలంలో మనుషులమధ్య గడిపాను
నేనూ వాళ్ళతో తిరగబడ్డాను
నేను భూమిమీద బ్రతికిన రోజులలో
కాలం అట్లా గడిచిపోయింది

చెలరేగే యుధ్ధాలమధ్య నేను కూడు తినాల్సి వచ్చింది
హంతకుల మధ్య నేను కునుకు తీయాల్సి వచ్చేది
నా ప్రేమనిండా జాగ్రత్తలేనితనమే
ప్రకృతి అందాలను నేను పట్టించుకోనేలేదు
నేను భూమిమీద బ్రతికిన రోజులలో
కాలం అట్లా గడిచిపోయింది

మా కాలంలో దారులు అన్నీ బురదగుంటలలోకే దారితీసాయి
నోరు తెరిస్తే నరహంతకులకు మేం బలి అవుతాం
నేను ఏమీ చేయలేకపోయాను. అధికారంలో వున్నవాళ్ళు
నేను లేకుంటే భద్రంగా వున్నారు. అదొక్కటే నా ఆశ
నేను భూమిమీద బ్రతికిన రోజులలో
కాలం అట్లా గడిచిపోయింది

మా బలగాలు చిన్నవి. మా లక్ష్యం
సుదూరంగా వుండేది
నేను ఆ లక్ష్యం చేరుకోలేకపోయినా
అది స్పష్టంగానే కనిపించేది
నేను భూమిమీద బ్రతికిన రోజులలో
కాలం అట్లా గడిచిపోయింది

III

ముంచెత్తే వరదలనుంచి తప్పించుకున్న మీరు
మేము ఎలా మునిగిపోయామో
గుర్తుంచుకోండి
మా లోపాలగురించి మాట్లాడేటప్పుడు
మీ అనుభవంలోకి రాని
మా చీకటి రోజులగురించి కూడా తలచుకోండి
చెప్పులు మార్చుకున్నదానికంటే త్వరగా మేము దేశాలు మారాల్సివచ్చింది
మేం వర్గాల మధ్య యుద్ధం జరుగుతున్నకాలంలో బ్రతికాం,
అన్యాయం తప్ప తిరుగుబాటు లేని రోజులలో నిరాశపడ్డాం

అయినా మాకు తెలుసు
ద్వేషం, ఆ ద్వేషాన్ని కుటిలత్వంపైనే ఎక్కుపెట్టినా
మనుషుల ముఖ కవళికలని వికారంగా మార్చేస్తుంది
కోపం, అది అన్యాయానికి వ్యతిరేకంగా కోపమే అయినా
అది మన గొంతు బొంగురుపోయేలా చేస్తుంది
స్నేహం పరిఢవిల్లే కాలంకోసమే పాటుపడినా
మేము మాత్రం స్నేహ పూర్వకంగా మెలగలేకపోయాం

మనిషికి మనిషి తోడుగా నిలిచి సాయంచేసే
కాలంలో జీవిస్తున్న మీరు
మా పట్ల
కొంచెం సహనంతో ఆలోచించండి

-బెర్తోల్ట్ బ్రెక్ట్
అనువాదం: సుధా కిరణ్

(బెర్తోల్ట్ బ్రెహ్ట్ (1898-1956) ప్రసిద్ధ జర్మన్ నాటక రచయితా, కవీ. నాటక రచనలతో పాటు, ప్రదర్శనల విషయంలో ప్రాచుర్యంలోకి తెచ్చిన తన ప్రతిపాదనల మూలంగా తనని ఎక్కువమంది ఆ కోణంలోనే చూశారు. బహుముఖమైన బ్రెహ్ట్ సాహిత్య సృజనలో విస్తారమైన కవిత్వం చాలా రోజులపాటు మరుగున పడిపోయింది కూడా.

జర్మనీలో నాజీలు అధికారాన్ని హస్తగతం చేసుకొన్న వెంటనే బ్రెహ్ట్ రచనల పైన పెద్ద ఎత్తున దాడి జరిగింది. తన పుస్తకాలని దగ్ధం చేశారు, నాటకాల ప్రదర్శనాలని నిషేధించారు, చివరికి జర్మన్ పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు. బ్రెహ్ట్ తన ప్రవాస జీవితంలో ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలమైన సృజనాత్మక కృషిని కొనసాగించాడు. స్థిరమైన శ్రామిక పక్షపాతం, సున్నితమైన అనుభూతులు, ప్రవాస జీవితపు విషాదం, యుద్ధ విధ్వంసం పట్ల ఆగ్రహం వంటి వాటిని బ్రెహ్ట్ కవిత్వంలో చూడవచ్చు.

‘చీకటి రోజులలో గానం ఉంటుందా, ఉంటుంది. చీకటి రోజుల గురించి గానం వుంటుంది’ అన్న బ్రెహ్ట్ కవితా పంక్తులు ప్రసిద్ధి పొందాయి. అదే కాలంలో చీకటి రోజుల కవిత్వం గురించీ, ఆ కాలం మన వ్యక్తీకరణలపైన నెరపే ప్రభావం గురించీ ముందుతరాల వాళ్ళకోసం రాసిన ఈ కవిత మళ్ళీ, మళ్ళీ చదువుకోవాల్సిన కవిత)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply