మిత్ర పాటలు

సంస్కృతి

మనుషులంత ఒకటాని
సంఘర్షణె మార్పు అనీ
చరిత చాటుతుండ … మన
చరిత చాటుతుండా
మనిషికి ప్రకృతికి
జోడీ కుదిరిందిరా
నాగరికత ప్రగతికి
మూలం అయ్యిందిరా
అదే అదే అదేరా అదేరా సంస్కృతి
ఇదే ఇదే ఇదేరా ఇదేరా జన నీతి || అదే ||

  1. సూర్యుడొస్తె సాలు
    సీకటి తొలిగేనురా
    ఎన్నెలొస్తె మేలు
    ఆటలు సాగేనురా
    ఆకలైన వేటలో ఆడ జంతు నిషేధం
    దూపలై నదీ తీరమయ్యిందిరా నివాసం
    ఆడ మగ తేడాలేని
    అందరమొక గుంపురా
    గణరాజ్యమె సమభావం
    మనుషులంత ఒకటేరా || అదే ||
  2. వర్గదోపిడంతా…
    వర్గ కుల ముసుగురా
    స్వర్గ నరకమంటూ
    పురాణాల గోలరా
    జనహితం కోరుతూ లోకాయత వాదం
    బౌద్ధము జైనము సమధర్మ నాదం
    అవతరించె మార్క్సిజం
    శాంతి సమత సంఘమై
    పెట్టుబడుల కోట గూల్చె
    శ్రమజీవుల ఐక్యతై || అదే ||
  3. తలుపులకే తాళమేసి
    వేలమేసె భక్తిరా
    మతమే జాతీయతంటు
    చాటుతున్న కుట్రరా
    జన జాతులు గణరీతులు దగ్ధమైన చోటే
    వన సంపద సరుకులై సముద్రాలు దాటె
    స్వదేశీ కొంగ జపం
    విదేశాల హస్తగతం
    తిరుగుబాటు మన సమ్మతి
    జరుగుబాటె జయగీతి ||అదే ||
  4. నీలి గగనాన తారలన్ని
    ఎరుపులీను వేళరా
    కుల వర్గ జమిలి పోరు
    దేశానికి తోవరా
    నూరేళ్ల కమ్యూనిస్టు సాంస్కృతి సమర ఖ్యాతి
    సామాజిక విప్లవాలు సాధించిన పురోగతి
    మేళవించి రంగరించి
    సాగె సమయమిదే
  5. పితృస్వామ్య నిష్కృతి
    కుల వర్గ నిర్మూలన
    ఇదే ఇదే ఇదేరా ఇదేరా సంస్కృతి
    ఇదే ఇదే ఇదేరా ఇదేరా జన విముక్తి

(విరసం 28వ మహాసభల సందర్భంగా…)
…………………………

మళ్లీ వస్తుంది
………………

మళ్లీ వస్తుంది
కల్లోల దశాబ్దం రెక్కలు విప్పి
ఎక్కడ చూసిన హింసా ధ్వంసం
ఆందోళనలో జన సందోహం
విరసంకయినా విప్లవమయినా
మళ్లీ యవ్వనమై తిరిగొస్తూ
అదిగదిగో అదిగో అదిగో || మళ్లీ మళ్లీ ||

స్వరాజ్యమంటూ పోరిన తరమే
స్వరాష్ట్రమంటూ కోరిన జనమే
విప్లవమంటే పెనుమార్పంటూ
త్యాగాలన్ని గణిస్తమంటూ
రక్తం రగిలిన అక్షర జ్వాల
లక్షల మెదళ్ల కదలిక కాగా
రచయితలారా మీరెటువైపని
ప్రశ్నకు మళ్లీ ప్రాణం పోస్తూ || మళ్లీ మళ్లీ ||

మనిషిని మనిషీ దోపిడి చేసే
పిడికెడు మందే బిలియనీరులు
ఆకలి దప్పుల వేదనపైనే
కుల మతాల మత్తు మందులు
పాపభీతిలో బతుకుతున్నమని
ప్రాయశ్చిత్తం వెతుకుతున్నమని
నోట్లకు ఓట్లను అమ్ముకుంటునే
పాట్లను కొని తెచ్చుకున్నమని || మళ్లీ మళ్లీ ||

వియత్నాంలు హెచిమిన్లు
మళ్లీ మళ్లీ పుట్టుకురాగా
ప్రపంచ పోలీస్ అవతారాన్ని
ఎత్తిన అమెరికా చిత్తే కాగా
నక్సల్బరి శ్రీకాకుళంలు
విప్లవ కాంతులు కొత్తగ మెర్సి
కారంచెడులో నల్ల సూర్యుడు
విప్లవ తల్లికి జన్మించాలని || మళ్లీ మళ్లీ ||

విశ్వ విద్యకు చీకటి తొలుగా
చాటేను రోహిత్ జార్జి వెలుగై
ఆత్మ హత్యల ఉరితాళ్లొద్దని
కదిలిరి రైతులు లాంగ్ మార్చయి
నియంత పాలనకెదురు తిర్గుతూ
ఒక్కటి కాగా ప్రజల పక్షములు
అడవిలో మొల్సిన అంకురమొకటి
జనారణ్యమునల్లుకురాగా || మళ్లీ మళ్లీ ||

ఆలోచనపై నిషేధాజ్ఞలు
కలముకు తప్పని చెరసాలలు
గళం విప్పితే కుట్ర కేసులు
అడుగడుగున అణచివేతలు
విభజించి పాలించే నీతులు
విడివిడిగా ఓడించే రీతులు
ఆగవు ఆకలి కేకలు అంటూ
ఎగసెను లక్షల బిగి పిడికిళ్లని || మళ్లీ మళ్లీ ||

(యాభై ఏళ్ల విరసం 27 మహా సభల సందర్భంగా….)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply