మిణుగురుల కోసం..

నా ఊహలు మిణుగురులు
అవి చీకటిలో మిణుకుమిణుకుమనే 
సజీవ కాంతి కణాలు

  • రవీంద్రనాథ్ ఠాగూర్ 

చీకటే లేకుంటే, ఆ మిణుగురుల కాంతికి విలువేముంది?

  • హెన్రీ డేవిడ్ థరో 

‘అండాకారంలో ఆకులు దట్టంగా ఉన్న ముప్ఫై, నలభై అడుగుల ఎత్తైన చెట్టు, దాని ఆకులన్నిటి మీదా మిణుగురులు ఉన్నట్లు, కటిక చీకటిలో ఆ మిణుగురులు అన్నీ ఒకేసారి రెండు సేకన్లలో మూడు సార్లు మిణుకుమిణుకుమంటూ మెరుస్తున్నట్లు ఊహించుకోండి… నదీ తీరంలో, ఒక మైలు దూరంలో పదో వంతు పొడవున సందు ఖాళీ లేకుండా మడ అడవుల చెట్ల ఆకులన్నిటి మీదా మిణుగురులు ఒకేసారి మిణుకుమిణుకుమంటూ మెరుస్తూన్నట్లు ఊహించుకోండి… ఆ దృశ్యాన్ని గనక మీరు గనక సరిగ్గా, స్పష్టంగా ఊహించుకోగలిగితే, ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు కొంచెం ఊహించుకోగలుగుతారు.’ (ఎచ్. ఎం. స్మిత్, జంతు శాస్త్రవేత్త సైన్స్ పత్రికలో 1935 లో రాసిన వ్యాసం) 

కొన్ని సంవత్సరాల క్రితం, 2022 మే మాసంలో తమిళనాడు కోయంబత్తూర్ సమీపంలోని అన్నామలై టైగర్ రిజర్వ్ అడవులలో చెట్లు, మొక్కలన్నింటి కొమ్మలమీద కొన్ని లక్షల మిణుగురులు మిణుకుమిణుకుమంటూ మెరుస్తూ కనిపించాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చ రంగులలో అవి వెదజల్లిన కాంతితో ఆ అడవి ఒక అద్భుత ప్రపంచంగా కనిపించింది. ఛాయాగ్రాహక చిత్రనిర్మాత శ్రీరాం మురళి ఆ అద్భుత దృశ్యాన్ని డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరించాడు. కొంతమంది ఈ ప్రకృతి సహజమైన వాస్తవిక ప్రపంచ దృశ్యాన్ని, హాలీవుడ్ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ చిత్ర మాలికలోని పాండోరా కల్పిత ప్రపంచంతో పోల్చి చూశారు. కేవలం కొన్ని వారాల యుక్త వయసు జీవితకాలాన్ని కలిగి వుంది అస్తిత్వంలో ఉండే మిణుగురులు తమ జీవశక్తిని అత్యంత సమర్ధవంతంగా కాంతి రూపంలోకి మార్చి జీవకాంతిని వెదజల్లుతాయి. మిణుగురులు శతాబ్దాలుగా మనుషుల ఊహలకి, కల్పనలకి స్ఫూర్తిని అందించాయి. ప్రపంచవ్యాపితంగా వివిధ నాగరికతలలో మిణుగురుల ప్రేరణలని మనం గమనించవచ్చు. మృదువుగా మెరిసే వాటి అద్భుత కాంతి కవులు, రచయితల ఊహాలని ఉద్దీప్తం చేసింది. ‘అర్హస్యంతర్భవన పతితాం కర్తుమల్పాల్ప భాసం/ ఖద్యోతాలీ విలసితనిభాం విద్యుదున్మేష దృష్టిం’ (స్వల్పమైన వెలుతురుతో ప్రకాశించే మిణుగురుల కాంతితో సమానమైన చూపులని ఇంటి లోపల ప్రసరించు) అని కవి కాళిదాసు మేఘదూత కావ్యంలో యక్షుడు, మేఘుడితో అంటాడు. ‘ఇచ్చామతీ తీరాన’ నవలలో, ‘చీమల పుట్టమీద ముసురుకుని వెలుగుతూ ఉన్న మిణుగురులు, వెదురు తోటలో కూర్చుని ఉన్న మనిషిని తలపింపజేస్తున్నాయ’ని బెంగాలీ రచయిత విభూతిభూషణ్ బందోపాధ్యాయ రాశాడు. మెక్సికన్ జపాటిస్టా తిరుగుబాటుదారుల నాయకుడిగా ఉండిన సబ్ కమాండెంట్ మార్కోస్ మాయాన్ పురాగాథలో ఇద్దరు తిరుగుబాటుదారుల ప్రాణాలని కాపాడడానికి మిణుగురులు సహాయపడిన ఉదాహరణని ప్రస్తావిస్తాడు. ‘గిజిగాడు, మిణుగురులు’ అనే తెలుగు జానపద గాథ మనముందు ఉండనే ఉంది. బంగారు పిచ్చుకల గూళ్ళలో వెన్నెల రజనులా మిణుగురులు ఎలా మెరుస్తాయో గోపీని కరుణాకర్ కథనంలో, అతను రాయ్ అద్భుతమైన చిత్రాలలో దాన్ని మనం చూడవచ్చు. 

కానీ, మనం చీకటి రోజులలో జీవిస్తున్నాం. మిణుగురులు వేగంగా కనుమరుగవుతున్న కాలమిది. భూమి మీద పది కోట్ల సంవత్సరాలుగా మిణుగురులు ఉనికిలో ఉంటూ వస్తున్నాయని శిలాజాలు మనకి చాటిచెబుతున్నాయి. అయితే, ఇప్పుడు మిణుగురుల సంఖ్య క్రమంగా, వేగంగా తగ్గిపోతూ వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మృదు కాంతితో మెరిసే మిణుగురుల సోయగాన్ని కనులారా చూసి పులకరించిన ఆఖరు తరం మనదే కావచ్చునని, మన తరం తర్వాత భవిష్యత్తు తరాలకి అవి ఇక కనిపించవేమోనని  అంటున్నారు. పట్టణాల విస్తరణ, వేగంగా సాగుతున్న పారిశ్రామికీకరణ మూలంగా మిణుగురుల సహజ ఆవాసాలు నాశనం అయిపోవడం, మిరుమిట్లు గొలిపే కాంతి కాలుష్యం, మితిమీరిన ఎల్ యి డి దీపాల వాడకం, పురుగు మందులు, క్రిమి సంహారకాల వాడకం – ఇవన్నీ కలిసి మిణుగురుల సంఖ్య బాగా తగ్గిపోవడానికి దారితీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. యుగయుగాలుగా మిణుగురుల కాంతి మనుషుల ఊహలని వెలిగిస్తూ వచ్చింది. ఇప్పుడు, అవి రాత్రి ముంచెత్తిన చీకటిలో విస్మృత కాంతి విషాద జ్ఞాపకాలుగా మారుతున్నాయి. మిణుగురులు, ఉనికి కనుమరుగవుతున్న విషాదపు జాడలు. కళ్ళు చెదిరే వెలుతురుతో రాత్రి ఆకాశంపైకి దండెత్తిన కాంతిలో అవి కనిపించని దీపాల కన్నీటి కాంతులు. చీకటి రోజులలో జీవిస్తున్నాం, అని కదూ మనం పైన అనుకున్నాం? లేదు, మిరుమిట్లు గొలిపే వెలుతురు కళ్ళు చెదిరేలా చేసి, ఇంక దేనినీ చూడనివ్వని నిరంకుశ కాలం అని చెప్పుకోవాలేమో!

మిణుగురులు మాయమవుతున్నాయా? 

మిణుగురులు అంత త్వరగా ఎందుకు చనిపోవాలి?

(‘ది గ్రేవ్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్’ జపాన్ నవల, చిత్రంలో సెట్సుకో ప్రశ్న) 

భూమి మీద ‘సహజ’ పరిణామ క్రమంలో అనేక జంతువులు, జీవరాశులు అంతరించి పోయాయి. ఇప్పుడు మనం మానవ చర్యల పర్యవసానంగా జీవరాశులు అంతరించి పోతూ వున్న ‘హోలోసీన్ లేదా ఆంత్రోపోసీన్’ అంతర్ధానపు ప్రారంభదశలో ఉన్నామని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతిలో మిణుగురులు అంతరించిపోవడాన్ని గుర్తించడంతో పాటు, ఒక పర్యావరణ అంశంగా ఆ పరిణామం గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే, మరొక స్థాయిలో మిణుగురులు అంతరించిన/ అంతరించిపోతూ ఉన్న క్రమాన్ని ఒక రాజకీయ సాదృశ్యంగా కూడా చూస్తున్నారు. 

1960 ల ప్రారంభంలో మనదేశంలో మిణుగురులు అంతరించిపోవడం మొదలయ్యింది. గాలి, స్వచ్ఛమయిన నదులు, కాలువలని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలని కాటేసిన కాలుష్యం ఫలితంగా మిణుగురులు మాయమవడం మొదలయ్యింది. అది కలవరపరిచే ఒక అత్యంత తీవ్రమైన పరిణామం. కొద్ది సంవత్సరాలలో అసలు మిణుగురులు అన్నవి కనిపించనే కనిపించకుండా అంతరించి పోయాయి. ఈ గతానికి సంబంధించిన విషాద జ్ఞాపకమే మన వర్తమానం.’ 

ఇటలీ దేశపు కవీ, రచయితా, చిత్ర దర్శకుడూ అయిన పియర్ పాలో పజోలిని ఈ మాటలని 1975 ఫిబ్రవరిలో రాశాడు. ‘ఇటలీలో అధికార శూన్యత’ అనే శీర్షికతో మొదట అచ్చయిన ఈ వ్యాసం, తర్వాత కాలంలో ‘మిణుగురుల వ్యాసం’ లేదా ‘అంతరించిన మిణుగురులు’ అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఇది పజోలిని చనిపోవడానికి కొద్ది నెలల ముందు రాసిన వ్యాసం. తనని అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఈ హత్య, కమ్యూనిస్టులని విపరీతంగా ద్వేషించిన తీవ్ర మితవాద బృందం చేసిన పనియని చెబుతారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇటలీ పరిణామంలో మూడు దశలని పజోలిని పేర్కొంటాడు. అవి – మిణుగురులు మాయం కాక మునుపు ఉండిన మొదటి దశ, మిణుగురులు మాయమవుతూ ఉండిన రెండవ దశ, మిణుగురులు పూర్తిగా అంతరించిపోయిన మూడవ దశ. మిణుగురులు అంతరించి పోవడం అనే మాటని పజోలిని, అవి ఒక జీవరాశిగా అంతరించిపోవడం అనే వాచ్యార్ధంలోనే కాకుండా, రాజకీయ సూచ్యార్ధంలో ఒక పోలికగా, రూఢి అయిన అర్ధంలో సూటిగా కూడా ఉపయోగించాడు. 

పజోలిని చెప్పిన విషయం ఇదీ: రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమితోనే 1945 లో ఇటలీలో ఫాసిజం అంతమైపోయిందని అనుకుంటే అది పొరపాటు. ఆ ఘటనలలో నుండి ఫాసిజం ఇంకొక కొత్త రూపంలో ముందుకొచ్చింది. 1945 తర్వాత అధికారం చలాయించిన క్రిస్టియన్ డెమోక్రసీ పార్టీ, మునుపటి ఫాసిస్టుల ఫాసిజానికి ‘సంపూర్ణమైన కొనసాగింపు’ మాత్రమే. ఆ తర్వాత కాలంలో అది ‘మౌలికంగానే మరింత భిన్నమైన, సంపూర్ణమైన, ముందుగా మనం ఊహించలేని మరొక నూతన తరహా ఫాసిజానికి’ దారితీసింది. మునుపటి ఫాసిస్టుల ఫాసిజానికి ‘సంపూర్ణమైన కొనసాగింపు’ గా ఉండిన కాలాన్ని పజోలిని మొదటిదశ, అంటే, మిణుగురులు ఇంకా అంతరించి పోకుండా ఉన్న దశ అనీ, ‘నూతన తరహా ఫాసిజం’ అవతరించిన దశని, మిణుగురులు అంతరించిపోయిన దశ అనీ పజోలిని పేర్కొన్నాడు. 1960 లలో వచ్చిన ఈ మార్పులని చాలామంది గుర్తించనే లేదనీ, మిణుగురులు అంతర్ధానమై పోవడాన్ని ఎవరూ గమనించనేలేదనీ పజోలిని పేర్కొన్నాడు. పజోలిని పుట్టింది 1922 లో. అది సరిగ్గా ఇటలీలో ఫాసిజం అధికారంలోకి వచ్చిన సంవత్సరం. పజోలిని హత్యకు గురయ్యింది 1975 లో. అంటే, యాభై మూడేళ్లకి చనిపోయిన పజోలిని జీవిత అనుభవంలో  ఎక్కువభాగం, ముఖ్యంగా యవ్వన కాలం అంతా ఫాసిజం అధికారం నెరపిన కాలానికి సంబంధించినదే. పజోలిని మిణుగురుల అంతర్ధానం గురించి వ్యాసం రాసిన ఇరవై సంవత్సరాలకి, అంటే 1995 లో, మరొక ప్రఖ్యాత ఇటలీ రచయిత ఉంబర్టో ఎకో ఫాసిజంపై ఇంకొక ముఖ్యమైన వ్యాసాన్ని రాశాడు. ‘అసలు ఫాసిజం’ లేదా ‘శాశ్వత ఫాసిజం’ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ వ్యాసంలో ‘యూరప్ ఖండాన్ని (ఇతర ప్రపంచ దేశాలనీ) వెంటాడుతున్న మరొక భూతం’ గురించి ఉంబర్టో ఎకో మాట్లాడాడు. (ఇక్కడ కమ్యూనిజం అనే భూతం ప్రపంచాన్ని వెంటాడుతున్నదన్న మార్క్స్, ఎంగెల్స్ ల కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభ వాక్యాలని ఉంబర్టో ఎకో పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు, 1995 లో వెంటాడుతున్న ఆ మరొక భూతం ఫాసిజం అని ఉంబర్టో ఎకో భావన – రచయిత). 1922 లో ఇటలీలో తొలిసారిగా ఫాసిజం అధికారంలోకి వచ్చిపోయిన న శతాబ్దం తర్వాత, ఇప్పుడు మనం మళ్ళీ మొదటికి వచ్చినట్లున్నాము. ఇటలీలో ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన అధినేత్రి, వారి పార్టీ మూలాలు ప్రత్యక్షంగా  1945 లో ఫాసిస్టు ముసోలిని సమర్ధకులు, ఆయన అనుయాయులు ప్రారంభించిన ఎం ఎస్ ఐ (ఇటాలియన్ సోషల్ మూవ్ మెంట్)లోనే ఉన్నాయి. 

స్వీడన్ లోని గోథెన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన వి-డెమ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచ జనాభాలో మూడింట రెండువంతులమందికి పైగా, 68% మంది నియంతృత్వ పాలనలో మగ్గుతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలని లోపలనుండీ, బయట నుండీ ధ్వంసం చేయడంతో, ప్రజాస్వామిక కార్యాచరణకు ఉండే అవకాశాలన్నిటినీ హరించి వేస్తున్నారు. ‘నియంతృత్వ పాలనని ఎన్నికల మార్గంలోనే నెలకొల్పడం అన్నది ఒక విషాదకరమైన వైచిత్రి. ప్రజాస్వామ్య హంతకులు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు ఆ ప్రజాస్వామ్యంలోని వ్యవస్థలనే ఉపయోగించుకుంటున్నారు. మెల్లగా, కుట్రపూరితంగా, చివరికి చట్టబద్ధ పద్ధతులని సైతం ఉపయోగించుకుంటున్నారు’ ( స్టీవెన్ లెవిస్కీ, డేనియల్ జిబ్లాట్ ల పుస్తకం హౌ డెమొక్రసీస్ డై  నుంచి). కప్పలు ఉన్న నీటిని మెల్లమెల్లగా వేడిచేస్తూ, తెలియకుండానే, అంతిమంగా వాటిని ఉడికించి చంపే పద్ధతి ఇది. ముసోలినిని కాల్చి చంపి, వాళ్ళ శవాలని తలకిందులుగా వేలాడదీయడంతోనో, హిట్లర్ తన బంకర్ లో స్వయంగా ఆత్మహత్య చేసుకోవడంతోనో  ఫాసిజం అంతం కాలేదు. అది ఆ తర్వాత వేర్వేరు రూపాలలో ప్రచ్ఛన్నంగా ముందుకొచ్చింది. ఇప్పుడు సూటిగా, ముసుగులని కూడా తొలగించుకుంటూ ముందుకొస్తున్నది. ఇక్కడ ఫాసిజం స్వభావం, దాని పరిణామం గురించి విస్తృత చర్చలోకి వెళ్ళాలని అనుకోవడంలేదు. కానీ, ఇటలీలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు మన వర్తమానానికి అద్దం పడతాయని గమనించాలి. మనం గుర్తించి, గ్రహించదలచుకుంటే ఇందులో మనకి చాలా పాఠాలు దొరుకుతాయి. పర్యావరణ పరిణామాలనీ, మిణుగురుల కవిసమయపు పోలికలనీ ప్రస్తావిస్తూ, మిణుగురులు అతరించిపోయిన ఉదాహరణ ద్వారా పజోలిని ఒక అంశాన్ని మన ముందుంచాడు. మునుపటి ఫాసిస్టుల ఫాసిజానికి కొనసాగింపుగా మొదట ప్రారంభమై, ఆ తర్వాత  రాజకీయంగా మరొక నూతన తరహా ఫాసిజం ముందుకొచ్చిందని పజోలిని వివరించిన విషయం ప్రస్తుత సంక్షుభిత ప్రపంచంలో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. 

మిణుగురుల మనుగడ కొనసాగింపు, పునరాగమనం 

మిణుగురులు మన మెరుగైన భవిష్యత్తుకి ద్వారపాలికలు. అంతర్ధానమైన చోటనే వాటి పునరాగమనాన్ని సాధించడంద్వారా, ప్రకృతి, మానవ సమాజం రెండింటి మధ్యా సమరస స్థితిని నెలకొల్పే కృషిని మనం ఎలా మళ్ళీ మొదలుపెట్టవచ్చునో  తెలుసుకోవచ్చు.’ (డాన్ రోజెగార్డే, డచ్ చిత్ర కారుడు, చిత్ర దర్శకుడు)

ఇప్పుడు మన ముందు ఒక ప్రశ్న ఉంది. మిణుగురులు ఇప్పటికే పూర్తిగా అంతరించి, మనముందునుంచి అంతర్ధానమై పోయాయా? ఒకవేళ అవి  పూర్తిగా అంతరించిపోతే, వాటిని మళ్ళీ తీసుకురావడానికి మనమేమైనా చేయగలమా? ఇంకా పూర్తిగా అంతరించిపోకుంటే, అంతరించకుండా కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రకృతి పరమైన అర్ధంలోనూ, రాజకీయ పోలిక అర్ధంలోనూ దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. 

ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలలో ‘మిణుగురుల పర్యాటక యాత్రలు’ ‘పండుగలు’ జరుగుతూ వున్నాయి. పర్యాటక వ్యాపారంతో, ఆమాటకొస్తే పర్యావరణ పరిరక్షణ పేరుతో జరిగే పర్యాటక యాత్రల వ్యాపారంతో మిణుగురుల ఆవాసాలకి మరింత ముప్పు ఏర్పడే మాట కొంతవరకూ నిజమే. అయితే, ఈ యాత్రలు మిణుగురులు అంతరించి పోకుండా కాపాడుకోవాలనే పరిరక్షణ స్పృహనీ, కొంత చైతన్యాన్నీ కూడా కలిగిస్తున్నాయి. కార్యాచరణకి ప్రేరేపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాపితంగా మిణుగురుల పరిరక్షణ ప్రయత్నాలలో, కృషిలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తున్నది. మలేసియా లోని సెలంగూర్ వేదికగా 2014 లో ‘మిణుగురుల పరిరక్షణ ప్రకటన’ వెలువడిన తర్వాత ఈ కృషి కొంచెం ఊపందుకుంది. ఇండోనీసియాలోని బాలి ప్రాంత కార్యకర్తలు కొంతమంది డచ్ కళాకారుడు, చిత్ర దర్శకుడు డాన్ రోజెగార్డే తో చేతులు కలిపి ఈ విషయంలో కొంత కీలకమైన కృషి చేశారు. మూడు సంవత్సరాల పాటు పరిశోధన జరిపి, బాలి పరిసరాలలో దాదాపు కనిపించకుండా పోయిన మిణుగురులని మళ్ళీ తీసుకొచ్చారు. ఈ కృషిని ‘రిటర్న్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్ (మిణుగురుల పునరాగమనం)’ అనే పేరుతో తీసిన డాక్యుమెంటరీలో దృశ్యమానంగా వివరించారు. ఈ డాక్యుమెంటరీకి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అలా చూస్తే, మిణుగురుల ఆవాసాలు ధ్వంసమై, అంతరించి పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని పరిరక్షించే ప్రయత్నాలు, కృషి అరకొరగానైనా, బలహీనంగానైనా కొనసాగడాన్ని కూడా మనం గమనించవచ్చు. ప్రకృతిలో మిణుగురులు ఇంకా పూర్తిగా కనిపించకుండా అంతర్ధానం కాలేదు. మన ప్రపంచంలో వాటి మృదు కాంతి ఇంకా మెరుస్తూనే వుంది. 

‘మిణుగురుల అంతర్ధానం’ అన్న పజోలిని వ్యాసం పూర్తి నిరాశలో కూరుకుపోయింది. ‘వినిమయ ఆధారిత సమాజపు శక్తి ఇటలీ ప్రజల అంతరాత్మలని మార్చివేసింది. వికృతంగా మలిచింది. అంతిమంగా, అది తిరిగి సరిదిద్దలేని పతనంలోకి నెట్టివేసింది’ అని పజోలిని అంటాడు. పజోలిని వ్యాసాన్ని వివరంగా చర్చిస్తూ ఫ్రెంచి తత్వవేత్త, రచయిత జార్జ్ డిడి-హ్యూబర్మన్ ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాశాడు. 2008 లో రాసిన ఆ వ్యాసం పేరు – ‘మిణుగురుల మనుగడ (సర్వైవల్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్). ఇందులో నిరాశకి ప్రతిగా, గతమూ, భవిష్యత్తు అనే రెండు శీర్షాల మధ్య వెలిగే వెలుతురు గురించి జార్జ్ డిడి-హ్యూబర్మన్ మాట్లాడుతాడు. అందులో, తప్పనిసరై వెనుకపట్టు పట్టిన స్థితీ, పూర్తిగా తిరోగమించకుండా కొనసాగే ప్రతిఘటన మిళితమై ఉంటాయని వివరిస్తాడు. పూర్తిగా దెబ్బతిని, చీకటి రాజ్యామేలుతున్న తరుణంలో, బలహీనంగా, రహస్యంగా కనిపించే వెలుతురు కొనసాగుతూనే ఉంటుంది. జార్జ్ డిడి-హ్యూబర్మన్ మాటల్లో చెప్పుకోవాలంటే, ‘మిణుగురులు అంతరించి అంతర్ధానమై పోయాయా? లేదు, అవి మనకి సమీపంలోనే మన చుట్టూనే ఉన్నాయి. అందులో కొన్ని మనలని తాకుతూనే  ఉంటాయి. మరికొన్ని ఇతర చోట్లకు తరలిపోయాయి. మన కనుచూపుమేరలని అధిగమించి, తమ సముదాయాలనీ, తమ అల్ప సంఖ్యలనీ, తమ కోరికలనీ మార్చుకోవడం కోసం మనం చూడలేని చోట్లకు తరలి పోయాయి.’ 

మరి మన ప్రపంచంలో మిణుగురులు అంతరించి అంతర్ధానమై పోయాయా? ఒక్క మాటలో చెప్పాలంటే, సమాధానం మన చేతులలో, చూపులలోనే వుంది. వాటిని గమనించడమా, గమనించలేక పోవడమా అన్న విషయం మన దగ్గరే ఉంది. మిణుగురుల ఉనికి ప్రమాదంలో ఉందనే విషయాన్ని మనం విధిగా గుర్తించాలి. అయితే, మిరుమిట్లు గొలిపే వెలుతురులో మన కళ్ళు చెదిరిపోకుండా మనం చూసుకోవాలి. చుట్టూ ముసురుకున్న దట్టమైన చీకటిలో, బలహీనంగానే కనిపించినా, ఇంకా మిణుకుమిణుకుమంటూనే ఉన్న మృదుకాంతిని మనం గుర్తించగలగాలి. గుర్తుంచుకోగలగాలి. 

మిణుగురులు భూమిపై వెలిగే నక్షత్రాలు

మిణుగురులు ముసురుకునే జ్ఞాపకాలు- 
చీకటి వలలో చిక్కుకున్న అడవి, 
శిథిల స్థూపంలా మోడైన చెట్టు,
రాలిన ఆకులలో వాడిన వసంతపు జాడలు.  

మిణుగురులు వెన్నెల కన్నీరైన జ్ఞాపకాలు-
మిణుగురులు వెలుతురు జాడలు-
ముళ్లకంచెలలో చివికిపోయిన గాలి, 
దావానలంలో దగ్దమైన మోదుగుపూలు, 
నిప్పులవానలో నివురైన కథలు.
మిణుగురులు చెదిరిన వెలుతురు జాడలు-

మిణుగురులు కాంతి నినాదాలు-
నగరాల ముట్టడిలో,  
మిరుమిట్లుగొలిపే వెలుతురు  దాడిలో,
విద్యుత్వ్యూహంలో కొడిగట్టిన దీపాలు. 
మిణుగురులు అదృశ్య మృదు కాంతి నినాదాలు-

మిణుగురులు స్వప్న సంకేతాలు- 
కాలం పరిచిన కత్తుల వంతెనపై, 
ఓటమి విసిరిన ఒంటరి దుఖఃపు రాత్రి,
మిణుకుమిణుకుమనే ఆశా దీపాలు. 
మిణుగురులు మాయమైన మనుషుల స్వప్న సంకేతాలు-

మిణుగురులు నేలలో ఒదిగిన నక్షత్రాలు, 
అడవి చెట్ల ఆకులపై మెరిసిన వెన్నెలలో,
కీచురాళ్ళ రొదలో నిశ్శబ్దంగా గొంతులు కలిపిన పాటలు,
వెలుగుతూ, ఆరిపోతూ ప్రకృతి పంపే ప్రేమ సందేశాలు.
మిణుగురులు భూమిపై వెలిగే నక్షత్రాలు-

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

Leave a Reply