పల్లవి:
పల్లవి:
కడవెండి కడవెండి – నీ
గుండెల్లో బలముంది
ఇంటింటా రేణుకమ్మా
త్యాగాలై పండింది
ఆ కథలే అడివమ్మా చెబుతుంటే
మిడ్కొలా మిలమిలా మెరిసిందే
||కడవెండి||
1.
ఓయమ్మా రేణుకమ్మా-ఒకసారి మాట్లాడు
నీ నవ్వులు చిదిమేసి-గెలిచినా వేటగాడు
పొడిసిందా నెలవంకా-కనులారా నిను జూడ
తారలన్ని అక్షరాలై-నిను జేరి ముద్దాడా
కావడెత్తి మోసుకురాంగా-కాళ్లు కూడా తడబడ్తుండా
ఎండిన ఆకుల శబ్దం గలగలలే
రాలిన నీ రక్తచలన సంగీతాలే
||కడవెండి||
2.
కండలేని ఎముకల గూడే-కొండంత బలమనీ
కొమురయ్యతో మొదలయ్యింది-కడదాకా సాగుననీ
మనుషులతో అంతంగానీ- అధర్మామే ఓడాలని
నిదురించే తరమేలేసి-ఎదిరించి గెలువాలనీ
ఎదలెన్ని రగిలినో గానీ -నీ సాక్షిగా ప్రతినబూనే
లేదమ్మా నీకు మరణం లేదమ్మా…
రేణుకమ్మ మిడ్కోగా బతికేనా
||కడవెండి||
- రోజు ఒక మరణం చూసీ-వెక్కి వెక్కి ఏడ్వగలమా
కనురెప్పలు మూసుకున్న-ప్రపంచాన్ని చూడగలమా
ఆకురాలు కాలం పోయి-వసంతాలు పూయునని
పండిన ఆ ఫలాన్ని-కార్పొరేట్లకెందుకని కాని
ఆదివాసీ హక్కుల మీద-ఎవరి ఉక్కు పాదాలన్నా
ప్రతిఘటన మారుపేరు రేణుకనా…
ప్రజలదే విజయం అన్నా మిడ్కోనా
అడివమ్మా అడివమ్మా – నీ
బిడ్డా రేణుకమ్మా
మిడ్కోగా మారిందా
చరిత్రలో నిలిచిందా
ఆ కథలే వింటూనే పెరిగేము
ఈ గాథలే లోకానికి చాటేము
(దొడ్డి కొమురయ్య లాంటి వీరులను, రేణుకలాంటి వీర నారీమణులను గన్న కడవెండిలో పుట్టి పెరిగి, దండకారణ్యంలో మిడ్కోగా బూటకపు ఎన్కౌంటర్లో హత్య గావించబడ్డ కామ్రేడ్ రేణుక స్మృతిలో, ఆమె అంతిమ యాత్ర సందర్భంగా….)
02-04-2025