మారణహోమ కాలంలో గాజా కలలు

ఈ కరువు కాలంలో నా మేనకోడళ్లకు, మేనల్లుళ్లకు ఏదయినా స్వీట్ తినిపిస్తానని వాగ్దానం చేసి నేను పొరపాటు చేశానో నాకు తెలియదు.

నేను గాజా నగరంలో రోజుల తరబడి వెతికి, ఈ పాత నగర శిథిలాలలో నిధిలా దాగి ఉన్న ఒక చాక్లెట్ బార్‌ను దొరుకబట్టాను. నేను భారీ ధర చెల్లించి దానిని తెచ్చి, పిల్లల కోసం ఏడు చిన్న ముక్కలుగా విరిచి పంచాను. పెద్దలకు ఏమీ ఇవ్వలేదు.

పిల్లలు ఒక్కో చాక్లెట్ ముక్కను తీసుకుంటున్నప్పుడు, పిల్లలకు ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అని కోరుకుంటూ, నా నాలుకపై దాని మాధుర్యాన్ని ఊహించుకున్నాను.

కాసేపటికి, నా అందమైన అయిదేళ్ల మేనకోడలు లానా మెల్లగా, “అంకుల్ ఆసెమ్, నా కల నీకు తెలుసా?” అని అడిగింది.

నేను ఉత్సుకతతో, “చెప్పు, లానా” అన్నాను.

“మొత్తం చాక్లెట్ బార్‌ను తినడమే నా కల” అని చిన్ని లానా చెప్పింది.

ఒక్క క్షణం, నాకేం మాట్లాడాలో తెలియలేదు. 21వ శతాబ్దంలో ఒక బిడ్డకు చాక్లెట్ కలగా ఎలా మారింది? ఈ చిన్న కోరికను కూడా తీర్చడం ఎందుకు అసాధ్యమయింది?

ఆ క్షణం నాతో ఉండిపోయింది. ఆ తర్వాత నేను గ్రహించాను: మేము, మా పిల్లలు మామూలు కలలను కూడా నెరవేర్చుకోలేకపోవడానికి కారణం ఇజ్రాయెల్. పేదరికమో, విధో కాదు. ఆక్రమణ, ముట్టడి, యుద్ధం. ఇజ్రాయెల్!

అమాయక ఆశలు

ఆ క్షణం నాకీ జెనొసైడ్ కాలంలోని మరో రోజును గుర్తు చేసింది. నేను వీధిలో నిలబడి ఉన్నప్పుడు పిల్లలు తమ కలల గురించి మాట్లాడుకోవడం విన్నాను – వాళ్లు బతికి బయటపడితే వాళ్లకున్న చిన్న అమాయకమైన ఆశలు.

కొందరు అమరులైన తమ తోబుట్టువులను మళ్ళీ చూడాలని కోరుకున్నారు. మరికొందరు వేడి రొట్టె లేదా చికెన్ తినాలని కలలు కన్నారు. ఒక చిన్న పాప తాను చాలా దూరం బరువైన బకెట్లు మోయాల్సిన అవసరం లేకుండా తన బాత్రూంలో నీళ్ళు రావాలని కోరుకుంది.

ఇవన్నీ ప్రాథమిక మానవ హక్కులు, ఏ బిడ్డ కూడా కోరుకునే అవసరం ఉండకూడనివి.

అయితే బంగారు రంగు జుట్టున్న ఒక చిన్న బాబు మాటలు నన్ను నిజంగా తాకాయి. అతను గుసగుసగా ఇలా అన్నాడు: “మా అమ్మ పొద్దున్నే స్కూలు కోసం నన్ను పిలిస్తే ఆమె గొంతు వినాలి. అదే నా కల.”

నేను అతని పక్కన కూర్చుని, “నిజంగా నీకు అదే అన్నింటికన్నా పెద్ద కలా, చిన్నవాడా?” అని అడిగాను.

అతను తల వూపి, “అది అసాధ్యమైన కల. మా స్కూలును నాశనం చేశారు. మా అమ్మను చంపేశారు.” నాకేం మాట్లాడాలో తెలియలేదు.

అంతలో పిల్లలలో ఒకరు నన్ను “అంకుల్, నీ కల ఏమిటి?” అని అడిగారు.

నేను ఒక్క క్షణం ఆగి, “మీ కలలన్నీ నిజం కావాలనేదే నా కల” అని జవాబిచ్చాను.

మామూలు కోరికలు

తరువాత, నా సహోద్యోగులు కొందరు తమ కలలను పంచుకోవడం నేను విన్నాను. ప్రశాంతమైన, సున్నితమైన, మామూలు కోరికలు: తమ కుటుంబంతో కలిసి మళ్ళీ తాజా భోజనం తినడం, తమ స్వంత పడకలలో పడుకోవడం, సురక్షితంగా ఉన్నామనే భావన కలిగివుండడం.

ఒక ఇంజనీర్ అయిన సహోద్యోగి, గాజాను పునర్నిర్మించడానికి సహాయం చేయాలని కలలు కన్నాడు. ఇంకొకతను ఏదో ఒక రోజు ఈజిప్టులోని పిరమిడ్లను చూడాలనుందని చెప్పాడు. మూడవవాడు తన కూతురును ఐఫిల్ టవర్ చూడటానికి తీసుకెళ్లాలని కోరుకున్నాడు. ఆపై, ఎవరో మెల్లగా, “నా పిల్లలకు మళ్ళీ చక్కిలిగింతలు పెట్టాలనేదే నాకున్న ఒకే ఒక్క కల” అని అన్నారు.

మేము స్పందించేలోపే, అతను ఇలా అన్నాడు, “కానీ ఆ కల అసాధ్యం. ఈ యుద్ధంలో నా పిల్లలందరినీ పోగొట్టుకున్నాను, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి.”

లానా చాక్లెట్ కోరిక, బంగారు రంగు జుట్టున్న పిల్లవాడి గొంతు, ఇజ్రాయెల్ కారణంగా మా మామూలు కలలు ఎలా అసాధ్యమయ్యాయో నాకు గుర్తుకొచ్చాయి.

నా కల

ఆ రాత్రి నేను నా స్వంత కల గురించి చాలా ఆలోచించాను, ఇజ్రాయెల్ రెండు సంవత్సరాలుగా నా నుండి లాక్కున్న నా బిడ్డ ఫురాత్ గురించి ఒక సాధారణ కల.

ఈ జాతి విధ్వంసక యుద్ధం మొదలైనప్పుడు నా భార్య ఇస్లాం, కొడుకు ఇయాద్‌తో విదేశంలో ఉన్న నా నాలుగేళ్ల ఫురాత్ నన్ను బాబా అసూమి అని పిలిచేది. ఆమె పేరు, అరబిక్ లో యూఫ్రటీస్ నది అని అర్థం. అంటే స్వచ్ఛమైన నీరు అని.

నేను ఆమె జీవితంలోని మొదటి రెండు సంవత్సరాలు దాదాపు ప్రతి గంటను ఆమె పక్కన గడిపాను. నాకు ఇప్పటికీ అన్ని విషయాలూ గుర్తున్నాయి: ఆమెకు ఏది నచ్చేదీ, ఆమెకు ఎప్పుడు నచ్చేదీ, ఆమె చిరునవ్వు ఎంతటి చీకటి రోజునైనా ఎలా ప్రకాశవంతం చేసేదీ.

నేను ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆమెకు స్నానం చేయించేవాడిని, ఆ తర్వాత ఆమె నా ఒడిలో నిద్రపోయేది. ఆమెను హత్తుకుని, ఆమె జుట్టు సువాసనను పీల్చుకుంటూ గడిపిన ఆ క్షణాలు నా జీవితంలో అత్యంత విలువైనవి. నాకు ఇప్పటికీ ఆ సువాసన స్పష్టంగా గుర్తుంది: తాజాగా, తీయగా, ప్రత్యేకంగా.

ఆమె నుండి దూరంగా గడిపిన దాదాపు 750 రోజులలో ప్రతి రోజు గురించీ నేను బాధ పడుతున్నాను.

నా కల చాలా మామూలుది: ఆమె జుట్టు సువాసనను మరోసారి ఆస్వాదించడం. కానీ ఈ కల కూడా ఇజ్రాయెల్ కారణంగా నెరవేరడం లేదని నాకు తెలుసు.

ఇప్పుడు గాజాలో మా కలలు ఇవే: ఒక చాక్లెట్ బార్, ఒక గ్లాసు శుభ్రమైన నీరు, తల్లి గొంతు, పిల్లల జుట్టు వాసన, ధ్వంసమైపోయిన ఇంట్లో నవ్వుల వెచ్చదనం.

ఇవి విలాసాలు కావు. ఇవి మనల్ని మనుషులను చేసే విషయాలు. ఇజ్రాయెల్ మొదట మా నుండి దొంగిలించేవి ఇవే.

కానీ మేము ఎప్పటికీ మా ఆశలను వదులుకోము. మా కలలు నిజమవుతాయి: చిన్ని లానాకు తన చాక్లెట్‌ దొరుకుతుంది. నేను నా బిడ్డ సువాసనను మళ్ళీ చూస్తాను. పాలస్తీనా స్వేచ్ఛను సాధిస్తుంది.

(https://electronicintifada.net సౌజన్యంతో)

ఆసెమ్ అల్నబిహ్ ఇంజనీర్, పిహెచ్‌డి పరిశోధకుడు. ప్రస్తుతం గాజా నగరంలో నివసిస్తున్నాడు. అతను గాజా మునిసిపాలిటీకి ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అరబిక్, ఇంగ్లీష్ రెండింటిలోనూ అనేక వేదికలకు రాశాడు.

Leave a Reply