(మన సమాజంలోని అసమానతలపై రాయాల్సి వచ్చినపుడు మొహమాటం లేకుండా రాయడం, మాట్లాడాల్సి వచ్చినపుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. ఆమెకా నిక్కచ్చితం సమాజంలోని వివక్షతే ఇచ్చింది. తన కథల ద్వారా ప్రశ్నల్ని సంధిస్తుంది. తన రచనల లక్ష్యం ఆత్మగౌరవం, మానవ గౌరవం నోచుకోని సెక్షన్ ల జనానికి గొడుగు పట్టి చైతన్యపర్చడం. కాలక్షేపాలు, వినోదాలు, నానా రుచుల కోసం చేసే రచనలకు ఆమె కలం కదలదు. అవమానాలు, అంటరాని చూపులు చేసే పచ్చి గాయాల సలపరింతలు మాన్పడమే తన కథా మార్గం. తన తలలో తలంపుకొచ్చింది తన తలరాత అంటుంది. ఎవరైనా తన తలరాతపై రాస్తే చెరిపేస్తుంది.
ఏదో ఊహాలోకంలో ఉండి పట్టీ పట్టనట్లు ట్రాన్స్ లో రాసేవి కాదు ఆ కథలు. పూర్తి హోష్ లో ఉండి జోష్ తో రాస్తుంది. తెలియని జీవితాలు, వాటి నేపథ్యాలు తెలియపర్చడం తన దృక్పథం. రచనలో చదువరులు లీనమై ఎక్కడో ఒక దగ్గర తమను తాము చూసుకోగలగాలి. సొంత గాథలను వినిపించే సాహసం చేయాలి అనేది తన ప్రగాఢ భావన.
అందుకే వెన్నెల ఆకాశాన పూసిన నీలి చందమామ ఆమె. సముద్రం చిలికే ఉప్పునీటి ఊట ఆమె మాట. కథల ప్రపంచంలో విరిసిన నల్ల కలువ ఆమె అస్తిత్వం. ఆ కొత్త కలం యువ నక్షత్రంతో ‘కొలిమి’ సంభాషణ…)
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.
నేను నెల్లూరు లో పుట్టి రాజమండ్రిలో పెరిగాను. ఇంటర్ మీడియట్ వరకూ అక్కడే చదువుకున్నాను. ఏలూరులోని సెయింట్ తెరెసా మహిళా కళాశాలలో ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీ, సోషల్ వర్క్ లో డిగ్రీ చేశాను. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో లింగ్విస్టిక్స్ లో పీజీ చేశాను. రాజమండ్రి వాతావరణం రకరకాల కులాలని, వివక్షలని, భాషని, యాసనీ, వెటకారాన్ని, ఆత్మీయతలని, అందమైన ప్రకృతిని, సంగీతాన్ని, సాహిత్యాన్ని పరిచయం చేస్తూ నన్ను పెంచింది.
మీరెందుకు రాస్తున్నారు? రచయితగా మీ లక్ష్యం ఏమిటి?
నన్ను నేను చూసుకోడానికే కథలు రాస్తున్నాను! నాకు చిన్నప్పటినుండి నవలలు కథలు చదివే అలవాటుంది. కాకపోతే రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి మరింత శ్రద్ధగా పత్రికల్లో వచ్చే ప్రతి కథా చదివాను, చదువుతున్నాను. నేను చదివిన కనీసం వంద కథల్లో ఎక్కడా నేనా పాత్రల్లో, ప్రదేశాల్లో, సంఘటనల్లో కనిపించలేదు. ఏ కథనూ వాటి పాత్రల్లో నన్ను నేను చూసుకుని చదవలేకపోయాను, కథల్లో ఇమడలేకపోయాను. ఒకటీ రెండు కథలు తప్ప అన్ని కథలూ బయటి మనిషిగానే చదివాను. కొన్ని కథలైనా ఏదోక పాత్రలో నన్ను చూపిస్తాయని ఆశించి చదువుతూనే ఉన్నాను. ఇక్కడ ‘నేను’ అంటే ఏకవచనం కాదు. ఒక సమూహం, ఒక వర్గం, ఒక జాతి. కథ సమాజం పై ప్రభావం చూపుతుందని కచ్చితంగా నమ్ముతాను. కానీ అది విస్తృతంగా జరగదన్నది తెలిసిన విషయమే. సమాజంలో మార్పు రావడానికి సాహిత్యం కూడా అవసరమవుతుంది తప్ప సాహిత్యం మాత్రమే సరిపోదు. పెద్దల కవితలు, కథలు చదివి మారిన వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. నా రచనల వెనుక ఉన్న లక్ష్యం కూడా ఇదే. సమాజం- వర్గాలుగా చీలి ఏం చేస్తుందో అద్దంలో చూపించడమే కథ రాయడం. మనల్ని మనం అద్దంలో చూసుకునేది సవరించుకోడానికే కాబట్టి రచనల ద్వారా అసమానతలు, అన్యాయాలు, అక్రమాలు రూపు మాపాలనే ప్రయత్నమే నా లక్ష్యం.
మీకు సాహిత్యం ఎట్లా పరిచయం అయింది?
అమ్మానాన్నల వల్ల నాకు సాహిత్యం పరిచయమైంది. నా తల్లిదండ్రులు డా. పుట్ల హేమలత, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ల పెళ్లయ్యేనాటికే రచయితలుగా పేరున్న వారు. వారిద్దరి వల్లే చిన్నతనం నుంచి చదవడం అబ్బింది. నాన్న చలం ‘మైదానం’ నా చేత ఏడో క్లాసులోనే చదివించారు. యండమూరి రచనలు స్కూలింగ్ లో చదివాను. ఎందుకో కవిత్వం చదివింది, దాన్ని ప్రేమించింది తక్కువ. చిన్నప్పడు హైకులు, చిన్న చిన్న కవితలు, కథలు నా డైరీలో రాసుకునేదాన్ని.
మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సాహిత్యం ఏది?
డిగ్రీలో ఇంగ్లీష్ లిటరేచర్ లో చదివిన పాఠ్యాంశాలు నన్ను పూర్తిగా ఒక కొత్త లోకంలోకి తీసుకు వెళ్ళాయి. ఒక కొత్త దృష్టినిచ్చాయి. హెన్రీ డేవిడ్ తోరో రాసిన ‘వాల్డన్’, కుష్వంత్ సింగ్ రాసిన ‘ట్రైన్ టూ పాకిస్తాన్’ ఆన్టన్ చెకోవ్, ఎడ్గర్ అలెన్ పో, కమలా దాస్, గిరీశ్ కర్నాడ్ రచనలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పుడే పరిచయమైన బ్లాక్ లిటరేచర్ నన్ను నిద్రలేపింది. ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ లో వచ్చిన రచనలు మనల్ని మళ్ళీ నిద్ర పోనివ్వవు. ఆలిస్ వాకర్ రాసిన నవల ‘మెరడియన్’ , టోనీ మారిసన్ రాసిన నవల ‘Beloved’ నన్ను మన దేశ వ్యవస్థ పట్ల మరింత అవగాహన ఉండాలనే స్పృహను పెంచాయి. ఇక తెలుగు సాహిత్యంలో వచ్చే ప్రతి అస్తిత్వ రచనా ఒక కనువిప్పే. టోనీ మారిసన్ ‘ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోడం కంటే ప్రాణం పోవడం పెద్ద విషయం కాదు’ అంటారు. ఈ ఒక్క మాట చాలదా ఎవరినైనా ప్రభావితం చేయడానికి.
మీ రచనల నేపథ్యం ఏమిటి?
వివక్షను భరించలేని తనమే నా కథల నేపథ్యం. కుల, మత, ప్రాంత, ఆర్ధిక పరంగా మైనారిటీల పక్షం వహిస్తూనే నా కథలు సాగుతాయి. ఇప్పుడే తమ గొంతును విప్పుతున్న sexual minorities మీద కూడా కథలు రాశాను. కానీ అవి వాళ్ళు రాయాల్సినవి. రాస్తారు. ఈలోపు నా వంతుగా నా మద్దతు తెలిపే ప్రయత్నమే ఇది.
మీ తొలి రచన ఏది? దానికి నేపథ్యం చెప్పండి?
నా మొదటి కథ ‘గౌతమి’ 2014లో ‘విహంగ’ అంతర్జాల పత్రికలో వచ్చింది. అప్పట్లో నేను తెలంగాణా రావాలని కోరుకుంటున్నా మరో పక్క రాష్ట్రం నెత్తుటి గుర్తులతో విడిపోవడం నన్ను బాగా బాధపెట్టింది. మనం శాంతంగా విడిపోలేదు. దాడులు, బలవన్మరణాలు, ద్వేషాలతో రెండు గుండెలూ రగిలిపోయాయి! ప్రాంతాలు విడిపోయినా భూమి కలిసే ఉన్నట్టు రాష్ట్రాలుగా విడిపోయినా మన మనసులు కలిసే ఉంటాయన్నది కథా వస్తువు. అది నిజంగా రాజమండ్రిలో ఉంటున్న నాకూ హైదరాబాద్ లో ఉంటున్న మా రక్త సంబంధీకుల మధ్య జరిగే అనుభవాలే.
మీకు బాగ గుర్తింపు తీసుకువచ్చిన రచన ఏది? అది ఏ సందర్భంలో రాసారు?
‘బొట్టు భోజనాలు’ కథ ఆదివారం ఆంధ్రజ్యోతి 2016 లో వచ్చింది. ఆ కథ చాలామంది చర్చించారు. వనభోజనాలు వాస్తవానికి కుల భోజనాలు అని చెప్పుకోడం మనకు తెలిసిన విషయమే. అయితే ఒక దళిత క్రైస్తవరాలి కోణం నుంచి ఈ భోజనాలు ఎలా కనిపిస్తాయి అన్నది ఈ కథా నేపధ్యం. ఎన్నో ప్రశంసలు, ఘాటు విమర్శలు వచ్చాయి. ఎంతోమంది పెద్దలు మెచ్చుకున్నారు. కొంతమంది పైకులస్తులు వాస్తవాన్ని ఒప్పుకున్నారు. అదే సంవత్సరం చినుకు పత్రికలో ‘అమ్మకో లేఖ’ కథ ఎంతోమందిని కదిలించింది. వేశ్యా గృహంలో ఉన్న ఒక అమ్మాయి కథ. అప్పట్లో ఈ కథను ఫేస్బుక్ లో కొన్ని వేలమంది షేర్ చేశారు. ఆ తర్వాత నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ‘నవ లేఖన’ పేరుతో యువ రచయితల కథా సంకలనాన్ని తెచ్చారు. అందులో ఈ కథ ఎంపికైంది. ఆ సంకలనం ఆంగ్లంతో సహా 18 భారతీయ భాషలలోకి అనువాదం అవుతున్నాయి. 2017లో త్రిపుర రాజధాని అగర్తలాలో కేంద్ర సాహిత్య అకాడెమీ ఆల్ ఇండియా యంగ్ రైటర్స్ ఫెస్ట్ కు ఆహ్వానం అందినప్పుడు ఈ కథను ఇంగ్లీష్ లో చదివాను. అనువదించిన వారు ఎన్ ఎస్ మూర్తి. ఆ కథ చదువుతున్నప్పుడే తోటి భాషల రచయితలు కన్నీళ్ళు పెట్టుకోడం చూశాను. అదొక మరచిపోలేని సందర్భం.
మీ సాహిత్య దృక్పథం ఏమిటి? దాన్ని ఎవరు ప్రభావితం చేసారు?
దేన్నైనా కులం కోణం, స్త్రీ కోణంలోంచే చూస్తాను. ఈ దేశమే కుల వ్యవస్థ మీద నిలబడినప్పుడు ప్రతి ఒక్క అంశం, చర్య, ఆలోచన అన్నీ కులాన్ని బట్టే ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా అణచివేయబడుతున్న కులానికి, genderకి చెందినదానిగా ఒక స్త్రీ ఎన్ని కోణాల నుంచి ఇబ్బందులు ఎదురుకుంటుందన్నది అనుభవిస్తూనే ఉన్నాను. స్త్రీగా పుడితే తప్ప అది తెలీదు. ఈ దృక్పధాన్ని నా చుట్టూ ఉండే వాతావరణం, జరిగే ఘటనలే ప్రభావితం చేస్తాయి. కొన్ని వేల పుస్తకాలు చదువుతాం కానీ మన వ్యవస్థలు, అక్రమాల గురించి తెలసుకునే ప్రయత్నమే చేయం.
మీరు చూసిన జీవితం మీ రచనల్లో ఎట్లా ప్రతిబింబిస్తుంది? మీ రచనా వస్తువులేమిటి? అవి ఎట్లా ఎంచుకుంటారు?
రచన, మరీ ముఖ్యంగా నాకు కథ అంటేనే జీవితం. నేను ఇప్పటివరకు ఒక్క కథ కూడా జరగబోయేది రాయలేదు, రాయలేను. జరిగిన వాటికి సాక్ష్యాలే నా కథలు. నాకు పాతికేళ్లు వచ్చాక కథలు రాయడం మొదలు పెడతానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ మొదలు పెట్టాక నా చిన్నతనం నుంచి చూసినవి నాకు ఎదురైన సందర్భాలనే కథలుగా రాశాను. అవన్నీ గుర్తున్నట్టుగా కూడా అప్పటి వరకూ తెలియలేదు. ఒక స్త్రీగా ఎదురుకున్న కుల వివక్షను బొట్టు కోణం నుంచి నాలుగు కథలు రాశాను. నాకు తెల్సిన క్రైస్తవ జీవనాన్ని జీవితాలని రాసే ప్రయత్నం చేశాను. LBGTQ కథలు కూడా వాళ్ళను కలిసి మాట్లాడాకే రాశాను.
మీ రచనలు తొలి నాటి నుండి ఇప్పటికి ఎట్లా పరిణామం చెందాయో చెప్పండి.
నేను కథలు రాయడం మొదలు పెట్టినప్పుడు, ఎన్నో కథలు రాసేయాలి అనే దూకుడు ఉండేది. అదే క్రమంలో ఒకే నెలలో ఏడు కథలు ప్రచురణ అయ్యాయి కూడా. పాటించాల్సిన జాగ్రత్తలు పాటించలేదు. చెప్పాల్సినంత లోతుగా చెప్పలేదు. ఆ తర్వాత కథలన్నీ ‘మిళింద’ గా ఒక సంపుటి తెచ్చాక రాయడం కాస్త తగ్గించాను. ఇప్పుడు కూడా ఇంకా స్థిమితంగా రాయాల్సిన అవసరమే ఉందని తెలుసు. ప్రయత్నిస్తున్నాను.
వర్తమాన సామాజిక సందర్భంలో రచయితగా మీ స్పందన ఏమిటి?
ఏదైనా ఘటన జరిగినప్పుడు వెంటనే కథా రాయడం కాస్త కష్టమే అనిపిస్తుంటుంది. స్పందించి కవిత రాసినట్టు కథను అల్లలేం. పత్రికల్లో కచ్చితంగా నా అభిప్రాయాలను పంచుకుంటాను. చర్చల్లో నా స్వరం వినిపిస్తాను.
ఈ యధాతధ సమాజంపైన, సాహిత్య కళారంగాలు, కవులూ, రచయితలూ, కళాకారులు, మేధావులపైన మీ అభిప్రాయం.
అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పలేని తరుణంలో అసలంటూ అభిప్రాయాలు కలిగి ఉన్నామా అనిపిస్తుంది. అభిప్రాయాల కంటే observation కలిగి ఉంటాను. ఎదుటి మనిషిని, వారి సామాజిక ఆర్ధిక రాజకీయ నేపధ్యాన్ని బట్టి తమ అభిప్రాయాలు ఇట్టే మారిపోయే రచయితలు, మేధావులను చూశాక ఇంకేం అభిప్రాయాలు ఉంటాయి. స్పందించాలి కాబట్టి రాస్తున్నట్టు, పాడుతున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఉంటుంది తప్ప లోతుగా చూస్తే అంతా కులమయమే. అంతటా వ్యక్తి పూజలే. అయినా కూడా జరగాల్సిన మంచి కొంతైనా జరుగుతుందనే నమ్మకముంది. సమాజం ఎప్పుడూ యధాతధంగా ఉండదనే అనుకుంటాను. మంచో చెడో, తప్పో ఒప్పో మారుతూనే ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆలస్యంగా కొన్ని విషయాల్లో అతి వేగంగా.
రోజుకు రోజు మారడంలో వింతేమీ లేదు. కానీ ఒక సృజనకారుడు అనేవాడు ప్రతి రోజు ఆలోచనతో మారాలి. ప్రతి పూట ఒక భావనాత్మక అస్త్రమై సంఘపు సమస్యలపై సంధించాలి. సాహిత్యమంటే వినోదం కోసం కాదు. భారంగా నత్తనడకలా సాగుతున్న కాలాన్ని గడపడానికి కాలక్షేపమూ కాదు. సాహిత్యమంటే సమస్యను ఆకాశానికి ఎత్తి చూపుతూ, అంతే ఎత్తులోంచి పరిష్కారాన్ని కూడా చూపడమేననే తనదైన సిద్ధాంతాన్ని నమ్ముతూ తమ కలాన్ని ఝళిపిస్తున్న
రచయిత్రి ఎండ్లూరి మానస గారికి అభినందలు.