తొంభై ఒకటవ అకాడమీ అవార్దులలో పది నామినేషన్లు పొందిన మెక్సికన్ సినిమా “రోమా”. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా గెలుపొందిన మొదటి మిక్సికన్ చిత్రం కూడా ఇదే. ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ దర్శకత్వం కేటగిరిలో మరో రెండు అకాడమి అవార్డులు గెలుచుకున్న ఈ సినిమా ఒక చరిత్ర సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలయి ఇన్ని అవార్డులను సొంతం చేసుకున్న మొదటి సినిమా కూడ ఇదే.
1970 లలో మెక్సికోలోని “రోమా” నగరంలో నివసిస్తున్న ఓ ఉన్నత వర్గపు కుటుంబ కథ ఇది. అల్ఫాన్సో కురాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తన చిన్నతనపు అనుభవాలను ఈ సినిమాగా మలిచానని ఆయన చెప్పుకున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర “క్లియో”. ఆ ఇంట్లో పని చేస్తున్న ఓ అమ్మాయి. అల్ఫాన్సో ఈ సినిమాను తనను పెంచిన తన ఇంటి పనిమనిషి, ఆయా లిబోరియా రాడ్రెగ్వెజ్ ‘లిబో”కి అంకితం ఇచ్చారు. ఈ సినిమా తీయడం వెనుక ప్రేరణ ఆమే అని ఆయన స్పష్టం చేశారు.
సినిమా మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ లో నడుస్తుంది. ఇందులో మూడు తరాల స్త్రీలు కనిపిస్తారు. అప్పటి మెక్సికోలోని రాజకీయ అలజడులను కూడా ఈ సినిమా రికార్డు చేసింది. రోమా నగరంలో నివసించే ఓ కుటుంబం లో నలుగురు పిల్లలు. సోఫియా, ఆంటోనియోలు వీరి తల్లి తండ్రులు. పిల్లలతో పాటు వారి అమ్మమ్మ థెరీసా కూడా అదే ఇంట్లో ఉంటుంది. ఆ ఇంట్లో పని చేస్తారు క్లియో, అడెలా అనే ఇద్దరు పని వాళ్ళు. క్లియో ఆ ఇంట్లో ప్రతి పని తనదిగా చేస్తూ ఉంటుంది. ఇంట్లో అందరి అవసరాలు తీర్చే క్రమంలో ఆ ఇంటి సభ్యులను అంతగానూ ప్రేమిస్తుంది కూడా. అయినా కొన్ని సందర్భాలలో ఆమె పరిధి ఆమెకు స్పష్టమవుతూనే ఉంటుంది. సోఫియా నుండి ఆమె భర్త విడిపోతాడు. ఆఫీసు పని మీద అని చెప్పి ఆ ఇల్లు వదిలి తన ప్రియురాలి ఇంటికి మారతాడు. అతనికి అదో ఊరిలో ఉండే మరో అమ్మాయితో సంబంధం ఉంటుంది. ఈ విషయం పిల్లలకు తెలియకుండా ఉంచాలని సోఫియా చాలా ప్రయత్నిస్తుంది. ఆమె అనుభవిస్తున్న బాధను క్లియో చూచాయగా అర్ధం చేసుకుంటుంది. పిల్లల పనులన్నీ తానే చూస్తూ వారికి తల్లి పడుతున్న బాధ తెలియకుండా ఉండడానికి తన వంతుగా కూడా కష్టపడుతుంది. ఆ ఇంట్లో పిల్లలను నిద్రపుచ్చుతున్నా, నిద్రలేపుతున్నా ఎంతో భాధ్యతగా ప్రేమగా, వారి పనులు చేస్తూ ఉంటుంది క్లియో. అందుకని పిల్లలకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం.
సెలవు రోజుల క్లియో, అడిలా ఇద్దరూ తమ ప్రేమికులతో గడుపుతారు. క్లియో గర్భవతి అవుతుంది. ఇది తెలిసి ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు ఆమె ప్రేమికుడు. అతన్ని వెతికి పట్టుకుని తన పరిస్థితి వివరించిన క్లియోని అతను ఆ గర్భంతో తనకేమీ సంబంధం లేదని, తనని ఎట్టి పరిస్థితులలో కూడా ఇక కలవవద్దని గట్టిగా చెప్పి బెదిరించి వెళ్ళిపోతాడు. క్లియో ఈ విషయం యజమానురాలికి చెబుతుంది. ఆమె బాధ, ఒంటరితనం అర్ధం చేసుకున్న యజమానురాలు ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళుతుంది. ఆమె బిడ్డను కనవలసిన స్థితి. అబార్షన్ కు అవకాశం లేదు. డాక్టర్ ఇదే విషయం చెప్పి ఆమెకు మందులిచ్చి పంపిస్తుంది.
క్లియోకి సహాయపడుతూ సోఫియా భర్త తనను వదిలి వెళ్ళిన విషయాన్ని జీర్ణీంచుకోవడానికి, తన పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి మానసికంగా కష్టపడుతూ ఉంటుంది. కుటుంబాన్ని ఇప్పుడు తానొక్కతే చూసుకోవాలని ఆమెకు తెలుసు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. భర్త వదిలి వెళ్ళినా, కారు డ్రైవింగ్ నేర్చుకుని అన్నీ పనులు తానే చూస్తూ పిల్లల విషయలు చూడడం అలవాటు చేసుకుంటుంది. సోఫియా తన ఒంటరి పోరుకు సిద్దపడుతున్నట్లే, క్లియో కూడా ఒంటరిగా ఈ బిడ్డను కనడానికి సిద్దపడుతుంది. క్రిస్మస్ సెలవులకు బంధువుల ఇంటికి వెళుతూ క్లియోని కూడా తమతో తీసుకుని వెళతారు సోఫియా, ఆమె తల్లి. అక్కడి నుండి తిరిగి వచ్చిన తరువాత ఇంకా ఆ కుటుంబంతో కలిసిపోతుంది క్లియో. తండ్రి లేకపోవడంతో ఆ పిల్లలు ఎంత అయోమయానికి గురి అవుతున్నారో ఆమె అర్ధం చేసుకుంటుంది. మౌనంగా తన పని తాను చేసుకుంటూ అవసరం ఉన్నప్పుడు అక్కడ వారి పక్కన ఉంటూ వారికి ధైర్యం అందించే ప్రయత్నం చేస్తుంది క్లియో.
జీవితంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆ వాతావరణానికి అలవాటు పడడానికి, మారిన పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడానికి మనుష్యులు కొంత సంఘర్షణకు లోనవుతారు. ధియేటర్ లో తండ్రిని ఇంకొక స్త్రీ చూసిన ఆ పిల్లలు, తండ్రి ఇక తమతో ఉండడని క్రమంగా ఆర్దం చేసుకోవడానికి, తమ జీవితాలలోనుంచి తండ్రి నిష్రమణకు అలవాటు పడడానికి వారు పడే సంఘర్షణ నిత్యం ప్రతి చర్యలోనూ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రేమలో ఓడిపోయి ఒంటరిగా బిడ్డను కనవలసిన స్థితికి అలవాటు పడుతూ క్లియో, ఒంటరి తల్లి పాత్రకు తనను తాను సిద్దం చేసుకుంటున్న సోఫియా వీరందరూ కూడా అనుభవించే ఆ పరివర్తన దశలో ఒకరి సాంగత్యం నుంచి మరొకరు పొందే ఆలంబన జీవితాన్ని ఎంతగా నడిపించగలదో అద్భుతంగా చూపిస్తారు దర్శకులు. కథ చెప్పాలంటే ఈ సినిమాలో ఏం ఉండదు. కాని ఈ పాత్రలు ఒకరితో ఒకరు తమ కష్టకాలంలో గడిపే ప్రతి నిముషం కూడా ఈ పరివర్తన దశకు తమను తాము సిద్దం చేసుకోవడమే అని స్పష్టమవుతుంది. కొన్ని సార్లు తీవ్ర విషాదాన్ని భరించవలసిన స్థితిలో మనకి దగ్గరగా కొందరు ఉండడం, వారు మనకు ఉన్నారన్న భరోసా కల్గించడమే ఎంతో పెద్ద ఊరట అవుతుంది. దాన్ని అనుభవిస్తున్న ఆ కుటుంబం సభ్యుల మధ్య పెరుగుతున్న దగ్గరితనంలోని పరిపక్వత, ప్రేక్షకులకు అర్ధం అవుతూ ఉంటుంది.
నిండు నెలలున్న క్లియో బిడ్డకు ఊయల కొనాలని ఓ షాపుకు వెళతారు అమ్మమ్మ థెరిసా, క్లియోలు. అక్కడ ఉన్నప్పుడే ప్రభుత్వ నీతికి విరుద్దంగా విద్యార్ధుల ఆందోళన మొదలవుతుంది. క్లియో ప్రేమికుడు ఈ అలజడి చేసే బృందంలో ఉంటాడు. షాపులోకి దుండగులతో దూసుకు వచ్చిన అతన క్లియోని చూసి గుర్తు పట్టి ఆమె వైపు కత్తి చూపించి బెదిరిస్తాడు. పూర్తిగా బెదిరిపోయిన క్లియో షాక్ కు గురవుతుంది. దాంతో గర్భంలోని ఉమ్మనీరు పోతూ ఉంటుంది. ఆమె పరిస్థితి గమనించి ధెరిసా అతి కష్టం మీద ఆమెను హాస్పిటల్ కు చేరుస్తుంది. అయితే అప్పటికే నీరు పోవడంతో ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తారు డాక్టర్లు. కాని బిడ్డ చనిపోయి పుడుతుంది. కొన్ని క్షణాలు ఆ బిడ్డను పట్టుకుని అయోమయంతో, భయంతో బాధతో రోదిస్తుంది క్లియో.
ఇంటికి వచ్చిన తరువాత ఆమె పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరి ప్రేమ ఉన్నా విషాదం ఆమెను అంటి పెట్టుకుని ఉన్నట్లు ఉండిపోతుంది. ఈ లోపే సోఫియా ఉద్యోగం వెతుక్కుంటుంది. కాన్పిడేంటుగా కారు నడుపుతూ పూర్తిగా స్వతంత్ర జీవితానికి అలవాటు పడడం నేర్చుకుంటుంది. ఆమెలో కొత్త ఉత్సాహం నిద్రలేస్తుంది. పిల్లలను బీచికి తీసుకు వెళ్ళే ప్రస్తావన తీసుకు వస్తుంది. పిల్లలతో పాటు క్లియోని కూడా ఆమె రమ్మని అడుగుతుంది. బీచిలో పిల్లలందరూ సరదాగా గడుపుతారు. మొదటి సారి తండ్రి లేకుండా తల్లి మధ్యన తాము జీవించడం మామూలు విషయంగా భావించే స్థితికి వారంతా చెరుకున్నామని గ్రహిస్తారు. అప్పుడు సోఫియా పిల్లలతో వారి తండ్రి తనతో విడిపోయాడని. ఇలా బీచికి రావడం వెనుక కారణం అతను ఇంటికి వచ్చి తన సామాను తీసుకువెళడం కోసమని చెబుతుంది. పిల్లలకు ఈ విషయం ఇంతకు ముందు బాధించినంతగా బాధించదు. ఒక చిన్న పనికి పిల్లలను క్లియో పర్యవేక్షణలో ఉంచి సోఫియా కొంచెం పక్కకు వెళుతుంది. క్లియోకు ఈత రాదు. కాని ఇంతలో ఇద్దరు పిల్లలు నీళ్ళల్లో కొట్టుకుపోవడం చూసి ఆమె ఆలోచించకుండా సముద్రంలోకి దూకి ఆ పిల్లలను పట్టుకుని ఒడ్డుకు తీసుకువస్తుంది. ఇది దూరం నుంచి చూసి పరుగెత్తి వచ్చిన సోఫీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డలను రక్షించిన క్లియోకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. కాని ఆ స్థితిలో క్లియో ఏడుస్తూ తన గర్భంలో బిడ్డ బ్రతకకూడదనే తాను చాలా రోజులు కోరుకున్నానని చెప్పి బాధపడుతుంది. బిడ్డ మరణించిన విషాదాని కన్నా ఆ పరిస్థితిలో బిడ్డ బ్రతికి ఉండకూడదని తాను కోరుకున్నందుకు ఆమె మనసులో పేరుకున్న అపరాధ బావాన్ని ఆమె సోఫియా దగ్గర చెప్పుకుని సాంత్వన పొందుతుంది. ఇలా మనసు విప్పి చెప్పుకున్న ఆ స్త్రీలు ఇద్దరూ, వారి మధ్య ఆ పిల్లలు కొన్ని క్షణాల పాటు ఒకరు దుఖంలో మరొకరు భాగం పంచుకున్న భావాన్ని కలిగిస్తారు. ఒకరి పక్కన మరొకరు ఉంటాం అన్న భరోసాని అందరూ కలిసి అనుభవించిన ఆ ఒక్క క్షణం, అంతరాలను, రాగ ద్వేషాలను మరిపించి కేవలం మానవత్వాన్ని నిలిపి ఒకరి దుఖాన్ని మరొకరు, ఒకరు భయాలను మరొకరు దగ్గరకు చేరి తమ స్పర్శతో మరిపించుకునే ప్రయత్నం ఈ సినిమా ఆఖరున అద్భుతంగా పండిన సీన్.
ఇంటికి వచ్చిన వారికి తండ్రి తనకు కావలసిన వస్తువులు తీసుకువెళ్ళిపోయాక బోసిగా కొత్తగా ఉన్న ఇల్లు దర్శనమిస్తుంది. తాము ఈ కొత్త జీవితానికి అలవాటుపడగలం అన్న నమ్మకం నింపుకుని ఇల్లు చేరిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరెక్కడ, ఏ గదులలో ఉండాలో నిర్ణయించుకోవడంలో పడిపోతారు. క్లియో కూడా ఆ ఇంటి పని పాటలలో మునిగిపోతుంది. గడిచిన గతాన్ని విడిచి భవిష్యత్తులోకి మానవ ఐక్యత ఇచ్చిన భరోసాతో వారు సాగిపోతారు.
సినిమాలో క్లోజ్ అప్ షాట్లు అసలు కనిపించవు. పాత్రలతో పాటు ఆ నగరం కూడా ఒక పాత్రగా మారిపోతుంది. చుట్టూ ఉన్న వస్తువులు, ప్రకృతి వారి జీవితంలో ఒక భాగం అయినట్లు కనిపిస్తాయి. క్లియో ఎప్పుడూ ఒంటరిగా కనిపించదు. ఆమె సమూహంలోనే ఉంటుంది. ఆ సమూహం మధ్యనే అన్ని దుఖాలను, సుఖాలను భరిస్తుంది. తమ జీవితంలోని అతి కష్టమైన కాలాన్ని భరిస్తున్న ఆ ముగ్గురు స్త్రీలు కూడా తమ దైనందిన జీవితాన్ని యధావిధిగా గడుపుతూ తమ భాద్యతలను నెరవేరుస్తూ వాటి మధ్య ఈ సంఘర్షణను అనుభవిస్తారు. వారిలో ఎక్కడ కూడా పలాయనవాదం కనిపించదు. తమను తాము కొత్త పరిస్థితులకు తయారు చేసుకుంటూ ఎవరికీ, ఏ రొటీన్ కూడా భంగపడకుండా తమ జీవితపు విషాదాన్ని ఎదుర్కుంటారు. ఇది కేవలం స్త్రీలలో కనిపించే మనోనిబ్బరం. సినిమా అంతా కూడా స్త్రీలలోని నిక్షిప్తంగా ఉండే ఈ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చిత్రీకరిస్తుంది. కథ పెద్దగ్గా ఉండకపోయినా ఈ పాత్రలన్నీ మనకు దగ్గరకు వచ్చినట్లు వారి మధనం మనకు అర్ధం అయినట్లు అనిపిస్తుంది. కొందరు వ్యక్తుల వ్యక్తిగత కథను తీసుకుని వారితో పాటు ఓ నగరాన్ని పాత్రగా మలచుకుని ఆ నగరంలోని రాజకీయ సామాజిక పరిస్థితులను సైతం వీరి వ్యక్తిగత దుఖంలో భాగం చేస్తూ మనిషి సామాజిక జీవితం నుండి తనను తాను ఎన్నటికీ విముక్తుడ్ని చేసుకోలేడనే సూచన దర్శకుడు ఈ చిత్రీకరణ ద్వారా ఇచ్చినట్ళు అనిపిస్తుంది. ఆ ఇంట్లో నేలని కడుగుతూ నీటిని చిమ్ముతున్న పనివారిని చూపుతూ ఆ దృశ్యంలో ఆ నీటి చలనాన్ని కూడా అంతే నిశితంగా చూపిస్తూ జీవం అంటే చలనం అన్న భావన కలగజేస్తారు దర్శకుడు. మనసులు మూగబోయినప్పుడూ, తీవ్ర విషాదాన్ని అనుభవిస్తూ కూడా ఈ చలనంలో మానవ జీవితాలు భాగం కావలసిందే. అదే జీవనం. ఈ మానవ జీవన పరిమాణాన్ని అద్భుతంగా అనుభవింపజేసే చిత్రం “రోమా.”