మానవీయ విలువల స్ఫూర్తి పతాక గీతం ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’

ప్రకృతి పాఠశాలలో పాటను దిద్దుకున్న సహజకవి అందెశ్రీ. పరిసరాలలోని పరిణామాలకు పాటగా పరిఢవిల్లిన ప్రజాకవి అందెశ్రీ. పసితనంనుండే పశువులకాపరిగా పనిచేసినా, తాపీమేస్ర్తీగా, రోజువారీ కూలీగా శ్రమించినా మనసుమాత్రం పదాల అల్లికల చుట్టూ పరిభ్రమించేది. జూలై 18, 1961లో వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన అందేశ్రీకి పాట ఒక ఊరట నిచ్చింది. ఏ బడిలో చదువుకోకపోయినా లోకమనే విశ్వవిద్యాలయంలో లోతైన తాత్త్విక విషయాలను అవగాహన చేసుకున్నారు. ఆ వెలుగులలోంచే మనిషి తనం కోసం తపించిపోయారు. మనిషిని కేంద్రకంగా చేసుకుని మానవీయ జీవన విలువల కోసం అన్వేషణ చేసాడు. ‘మాయమైపోతున్న మనిషి’ కోసం భూగోళమంతా ప్రతిధ్వనించేలా తన పాటను వినిపించాడు. లక్షలాది హృదయాలను కదిలించిన అలాంటి ఆర్ధ్రత, ఆవేదన, చింతనలతో నిండిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ అనే గీతాన్ని మరోసారి ఇక్కడ మననం చేసుకుందాం.


‘మాయమైపోతున్నడమ్మా..’ పాటలో కవి కనిపించకుండా పోతున్న మనుషులకోసం దేవులాడుతున్నాడు. మనుషులతో కిక్కిరిసిపోయిన ఈ భూమ్మీద ఒక మనిషికోసం వెతుకులాడడం ఆశ్చర్యమే. నిజానికి కవి ఎదురుగా అసంఖ్యాకమైన మానవులు తిరుగులాడుతూనే వున్నారు. కవికి కావలసింది కేవలం భౌతికమైన మనుషులే కాదు. ఆ మనుషుల మనసులు మానవత్వంతో నిండిపోయి మరో మనిషిపట్ల ప్రేమతో స్పందించగలిగే నిజమైన మనిషికోసం ఆవేదనతో ఆలపిస్తున్నాడు. సమాజంలో క్షీణించిపోతున్న మానవ సంబంధాలపట్ల కవి విలాపమే ఈ గీతమంతా విస్తరించింది. ఎనిమిది విభిన్న విషయాలను ప్రస్తావిస్తూ నలబై ఎనిమిది చరణాలలో లోకాన్ని ప్రశ్నిస్తూ ఒక విశ్వమానవ ప్రేమికుడిగా మానవీయతను ప్రతిష్టింపజేస్తాడు కవి.
కవి మనిషిలోని నిలువెత్తు స్వార్థాన్ని అసహ్యించుకుంటున్నాడు. ఒక్కక్షణం కూడా స్వార్థరహితంగా నడచుకోలేకపోతున్న మనిషిలోని విడదీయలేని స్వార్థాన్ని అతని నీడతో పోల్చుతూ ఎంతగా దిగజారిపోయాడో చూపిస్తున్నాడు. మనిషిలో అవినీతి అత్యాశ పెరిగిపోవడాన్ని సహించలేకపోతున్నాడు. అలాంటి అంధకారాల్లో చిక్కిపోయి శిథిలమైపోతున్న మనిషిని చూస్తూ తీవ్రకలత చెందుతున్నాడు కవి.
కవి దైవాన్ని మనసారా నమ్ముతాడు. కాని దైవరూపాలు, అవతారాలు అనే పేరుతో కుక్క నక్కలను, పంది నందులను గుడ్డిగా పూజించే మనుషుల అవివేకాన్ని అసహ్యించుకుంటాడు. చీమలకు చెక్కర, పాముకు పాలుపోసి అదే జీవకారుణ్యం, దాన్నే అమూల్యమైన పుణ్యఫలంగా మార్చుకుంటున్నామనే మనిషి అజానాన్ని చూసి నవ్వుకుంటాడు. తనమీద ఆధారపడిన తోడబుట్టిన వాళ్ళందరినికాదు తోటి మనుషులను అంటరానివారిగా చూసున్న తీరుకు నివ్వెరపోతాడు కవి. కులం పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలు, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఊరవతలి వెలివాడల బాధలతో మమేకమైపోతాడు అందెశ్రీ.


అందెశ్రీ ఒక ఆధ్యాత్మిక బాటసారి. దారి పొడుగునా పాటతోడుగా నడిచిపోయె జానపదుడు. ఆధ్యాత్మికతకు అర్థం తెలుసుకోలేక అంధులైపోతున్న అన్ని మతాలవారిని ఈసడించుకుంటాడు. మనుషుల మధ్య మమేకత భావనలు నింపే మతాన్ని సైతం కలుషితం చేసిన మనిషి మతోన్మాదాన్ని చూసి భయపడిపోతాడు. లోకహితము కోరుకునేదే తనమతం. తన పాట కోరుకునేది అదే అభిమతం. ఈ సరిహద్దుల రేఖమీద నిలబడి తను అనుకునే ఆ మనిషికోసం నిరీక్షిస్తున్నాడు కవి.
కవి మనిషి చేస్తున్న కొన్ని కీలకమైన పనులను వ్యంగ్యంగా శ్యాఖ్యానిస్తాడు. ‘ఇరవైఐదు పైసలు అగరువత్తులు కాల్చి అరవైఐదు కోట్ల వరములడిగే’ బేరసారాల పిసినారి లౌక్య భక్తుల మనస్తవాన్ని ఎండగడుతాడు. దేవుడిపేరుతో చందాల దందాచేసే దాదాగిరి భక్తుల దుష్టవర్తనను నిర్భీతిగా ఆవహేళన చేస్తాడు. భక్తి పేరుతో దొంగ బాబాలు, సన్యాసులుచేసే అరాచకాలు, అకృత్యాలను వదలకుండా కవి తీవ్రంగా విమర్శిస్తాడు. సమాజంలోని భక్తులు, బాబాల నగ్నస్వరూపాన్ని నిర్మొహమాటంగా బట్టబయలు చేస్తాడు కవి.


కవికి ధనం విలువ తెలుసు. అంతకుమించిన ఆత్మాభిమాన ప్రాధాన్యం తెలుసు. మన అవసరాలకోసం మనం సృష్టించుకున్న రూపాయి కాగితం మనిషిని ఎంతో పాపాత్ముడిగా దుర్మార్గుడిగా మార్చిన వైనాన్ని అందెశ్రీ జీర్ణించుకోకపోతున్నారు. రూపాయికోసం ఎంతటి పాపానికైనా ఒడిగట్టెమనిషి స్వభావాన్ని ఈ సడించు కుంటున్నాడు. గుప్పెడు మెతుకులతో కడుపు నింపుకోవడంతో సంతృప్తి చెందడం లేదు. ఎవరికి చెప్పలేనంత ధనం సంపాదించి దాచిపెట్టుకోవాలనే మనిషి దురాశకు దు:ఖిస్తాడు. రూపాయి ఆసరా లేకుండానే నగరాన్ని ఈదిన కవి పోరాట జీవన శైలి ఈ చరణంలో అవగతమవుతుంది.


ఈ పాటలో అందెశ్రీ మనిషి సంస్కారతీరుకు ఒక ప్రణాళికను రూపొందించారు. ఆదర్శనీయమైన జీవన గమనానికి పూలబాటలు పేర్చినాడు. స్త్రీలపై జరిగే అత్యాచారాల పట్ల గుండెలవిసెలా గొంతు పెగల్చి అరిచారు. కామంతో కళ్ళుమూసుకుని పోయిన మగవారి లైంగిక దౌర్జన్యాల్ని, అమానుష అకృత్యాల్ని తీవ్రంగా ప్రతిఘటించాలంటున్నాడు. కన్నవాళ్ళను సైతం నిరాదరించే సంతానంపట్ల ఎహ్యభావాన్ని ప్రకటిస్తాడు. మద్యానికి బానిసలై వావివరసలు మరచిన నరుడి దుష్టత్వాన్ని, కృరత్వాన్ని నాశనం చేయాలని తలుస్తున్నాడు కవి.
కవులకు రాజకీయచైతన్యం పాలకుల పనితీరుపై ధిక్కారాన్ని ప్రదర్శించడం అనివార్యమైన అంశం. అందెశ్రీ సైతం ఈ పాటలో మనిషి రాజకీయం పేరుతో అనుసరిస్తున్న అరాచకీయ పద్ధతుల్ని ఖండిస్తున్నాడు. ఉత్తమమైన నిర్మాణాత్మక కార్యక్రమాలను చేయవలసిన నాయకులు ఆధిపత్యపు గొడవల్లో కూరుకుపోయి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న వైనాన్ని విమర్శిస్తాడు కవి. ప్రజాస్వామిక రాజ్యం కోసం కలలుగంటున్న లోకంలో రాజకీయం అనే పదం అమానీయతకు పర్యాయపదంగా మారడం శోచనీయం. ఆ దుస్థితిని మనముందుచుతున్నారు అందెశ్రీ. కవిలోని సమకాలీన రాజకీయస్పృహ మనల్ని ఆలోచింపజేస్తుంది.


అందెశ్రీ లోకంలో విభేదించడం లేడు. లోకులతో వైరం పెట్టుకోవడం లేదు. ఈ భూమిని మాతృమూర్తి ఒడిలా భావించిన కవికి అనుభవానికి వచ్చిన చేదునిజాలు వేరు. ఈ మట్టిని ప్రేమించిన మనిషికి ఆ మట్టిమీద మనుషులతోనే గొడవ మొదలయింది. బౌద్ధిక తత్వ్తాన్ని, జాతక కథల సారాన్ని ఒంటపట్టిచ్చుకున్న కవిలో ఏదో కలత మొదలయింది. ప్రపంచీకరణ విషగాలులకు కంటి ముందే భూగోళాన్ని చుట్టిముట్టిన అనెకానేక అనెకానేక అణుధార్మిక వాయువుల్లాంటి అమానవీయ ధోరణులతో మనిషి ప్రాణభీతితో విలవిల్లాడుతున్నాడు. ఆకాశమే హద్ధుగా ఆశయాలు సాధించగల మనిషి నిష్క్రియ పరుడిగా మారిపోతున్నాడు. అంతుచిక్కని అనంత విశ్వరహస్యాల్ని విప్పగలిగిన మేధస్సున్న మనిషి అహంకారపు వలలోపడి కనుమరుగైపోతున్నాడు. నిఖార్సైన మనిషి కనిపించకుండా పోతున్నాడని కవి గాఢంగా తాననుకున్న మనిషికోసం అక్షరాలా కన్నీరు కార్చుతాడు.

‘జయజయహే తెలంగాణ’ అనే మార్చ్ పాస్ట్ లాంటి ఉద్యమగీతంతో తెలంగాణా జాతికి పోరాటపథ నిర్దేశాన్ని చేసిన వాగ్గేయకారుడు అందెశ్రీ. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు’ పాట ప్రతిరోజు ప్రతిక్షణం అందెశ్రీ ప్రాసంగికతను పెంచుకునిపోతున్న పాట. ఏ మనిషికి ఆ మనిషి తన ఆత్మవిమర్శకు ఒకరింట్యూన్ మార్చుకోవాల్సిన పాట ఇది. పల్లె పొత్తిళ్ళలోంచి పుట్టిన మట్టి పరిమళపు కవి, పలుకులమ్మ ప్రియ పుత్రుడి శాశ్వత చినామా ఈ గీతం.

పల్లవి: మాయమైపోతున్నడమ్మా
మనిషన్నవాడు ఓ….ఓ….ఓ….
మచ్చుకైనా లేడు చూడూ
మానవత్వం వున్నవాడూ
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు
యాడవున్నాడో కాని క౦టికీ కనరాడు !! మాయమై !!


చరణం 1. నిలువెత్తుస్వార్ధము నీడలాగొస్తుంటే
చెడిపోకఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల
దిగజారు తున్నడోయమ్మా
అవినీతి పెను ఆశ అంధకారములోన
చిక్కిపోయి రోజు శిధిలమౌతున్నాడు !! మాయమై !!


చరణం 2. కుక్కనక్కల దైవరూపాలుగా కొలిసి
పంది నందిని జూస్తే పడి మొక్కుతుంటాడు
చీమలకు చక్కెర పాములకు పాలోసీ
జీవకారుణ్యమే జీవితము అంటాడు
తోడబుట్టిన వాళ్ల ఊరవతలికి నెట్టి
కులమంటు ఇల మీద కలహాల గిరిగీసి !! మాయమై !!


చరణం: అధ్యాత్మికత కున్న అర్ధమె తెలియక
అంధుడై పోతున్నడమ్మా
హిందు ముస్లిం క్రీస్తు సిక్కుపార్శీ నంటూ
తనను తా మరిచేనోయమ్మా
మతము లోకహితము అన్న మాటా మరిచి
మత ఘర్షణల మధ్య మనిషి కనుమరుగౌతు !! మాయమై !!


చరణం 4. ఇరవై ఐదు పైసల గరు వత్తులు గాల్చీ
అరవై ఐదు కోట్ల వరములడుగూతాడు
దైవాల పేరుతో చందాలకై దంద
భక్తి ముసుగూ తొడిగి భలె ఫోజు బెడతాడు
ముక్తి పేరా నరుడు రక్తిలో రాజయ్యి
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు !! మాయమై !!


చరణం 5. అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి
చుట్టూ దిరుగూతున్నడమ్మా
రూపాయి కొరకు ఏ పాపానికైతేమి
ఒడిగట్టే నదిగో చూడమ్మా
కోటి విద్యలు కూటి కోసమన్నది బోయి
కోట్లకూ పడుగెత్తా కోరికలు చెలరేగి !! మాయమై !!


చరణం 6. కండ్ల పొరలగమ్మి కామముతో ఊరేగి
వెకిలి చేష్టల తోటి వేధిస్తు వున్నాడు
కన్నవాళ్లకు రోజు కన్నీల్లె మిగిలించి
కౌగిలే స్వర్గమని కలలు గంటున్నాడు
చీకటైతె చాలు చిత్తుగా తాగేసి
వావి వరుసలు కాస్త మరిచి పోతూ నరుడు !! మాయమై !!


చరణం 7 . పార్టీ సిద్దాంతాల పరగణాలా
గొడవలోన పడి చస్తున్నడమ్మా
ఆధి పత్యపు పోరు అలజడె చిరునామ
అంటు జైకొడుతున్నడమ్మా
రాజకీయాలల్లో రాటు దేలి తుదకు
మానవతా విలువల్ని మంట గలుపుకుంట !! మాయమై !!


చరణం 8. ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు
కోడిపిల్లై చిక్కికొట్టు కుంటున్నాడు
ఉట్టికి స్వర్గానికంద కుండగ తుదకు
అస్తి పంజరమయ్యి అగుపించనున్నాడు
కదిలె విశ్వం తనా కనుసన్నలో నడువా
కనుబొమ్మ లెగరేసి కాలగమనం లోనా !! మాయమై !!

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

2 thoughts on “మానవీయ విలువల స్ఫూర్తి పతాక గీతం ‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’

  1. పల్లె పొత్తిళ్ళలో జన్మించి నిత్యం మానవత్వాన్ని శ్వాసిస్తున్న అచ్ఛ తెలంగాణ ప్రజాకవి అందెశ్రీ.
    నాటి తత్వవేత్తలంతా సత్యానికై అన్వేషణ కొనసాగించినట్లుగానే ఈ పల్లె కవి మాయమైపోతున్న మనిషి కోసం దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి పాడిన ఈపాట స్వార్థపూరితమైపోతున్న నేటి మనుషుల హృదయాలను మేల్కొల్పేలా ఉంది

    డా.ఎస్.రఘు గారు అందెశ్రీ గారి హృదయంలో పరకాయ ప్రవేశంచేసి కవి ఆత్మఘోషను తన లోతైన విశ్లేషణతో వాఖ్యానించిన విధానం చాలా బాగుంది.

    కవి గేయంలో మానవీయ జీవనవిలువల కోసం, మానవ సంబంధాల కోసం, మనిషితనం కోసం అంగలార్చిన విదానాన్ని వెంటాడే పాట ద్వారా కవి,రచయిత డా.రఘు గారు మనిషితనాన్ని కప్పేస్తున్న స్వార్థం, భూగోళాన్ని కబళించివేసే అణుధార్మిక వాయువులతో పోల్చి ప్రమాద ఘంటికలను మోగించడం పాఠకుల మనసులను కదలించింది. ఈ విశ్లేషణ ద్వారా మానవీయ విలువల స్ఫూర్తి పతాకాన్ని మరొకసారి ఎగురవేసినందుకు కవి,రచయిత డా. రఘు గారికి మరొక్కసారి హేట్సాఫ్..

    సి.వి శ్రీనివాస్

  2. పాట అంతరంగం ఆవిష్కరించిన విశ్లేషణ ఇది. చాలా స్పష్టంగా కవి దృక్పథాన్ని వెల్లడించిన తీరు ఆకట్టుకున్నది. పాట పరిపక్వత ఈ వ్యాసంలో తెలుపబడింది.
    అందెశ్రీ గారు అదృష్టవంతులు.
    ఇటువంటి సమీక్షల ద్వారా మా వంటి లేత పరిశోధకులకు పరిశోధన, విమర్శ శాఖల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
    థాంకింగ్ యూ రఘు సార్ గారు అండ్ ‘కొలిమి’.
    – నర్రా

Leave a Reply