” నాన్న నన్ను ఒగ్గేయ్… పట్నం బోయి ఏదొక పాసి పని సేసుకుంటా నా బతుకు నే బతుకుతా. నా బిడ్డను సూసుకుంటా… కాళ్లావేళ్లా పడి గింజుకుంటా బతిమాలతోంది సిన్ని”.
”నోర్మూసుకుని పడుండు”… జుట్టు పట్టుకుని గది తలుపు తెరిసి లోపలికి తోసి గడెట్టి కల్లు దుకాణానికి బోయాడు. ఆ ఊర్లో ఆడంత దుర్మార్గుడు లేడని అందరికీ తెలుసు. కాని ఆడ్ని ఎదిరించే దమ్ము ఎవురికీ లేదు. ఆ రోజు రాత్రి తాగితాగి ఇంటికొచ్చే దారిలో రోడ్డు మీద సోయలేకుండా పడిపోయాడు. తెల్లారాక గాని తెలివి రాలేదు. తాగిందంతా దిగీసినాక ఇంటికి లగెత్తాడు. గడేసిన తలుపు తెరిసుండేసరికి గుండెలు బాదుకున్నాడు. చుట్టూ చూశాడు.
”ఒసేయ్ సిన్నీ ఏడసచ్చినవే… నన్ను మాయసేసి ఏడికి బోయినవే. కనబడవేమే” ఈధుల్లో అరుసుకుంటా ఈసురుగా వుక్రోసంగా కచ్చతో నడుస్తున్నడు. దీన్దుంపతెగ. ఆడు ఇప్పుడు దీని గురించి అడిగితే యాం జెప్పాలా… అనుకుంట అరుసుకుంట ఎల్తన్నాడు… ఇంతలో అటుగా ఒక ముసిలోడు ఎల్తా ఎల్తా ”అరే నీ సిన్ని ఆ బస్‌స్టేషన్ల కూకుండాది… నా టీ కొట్టు కట్టేసొత్తాంటే కనబడ్డది” అనేసరికి ”నీ తల్లి! అక్కడ తగలడ్డావా… అచ్చేత్తున్నా… నీ తోలు తీసి ఉప్పుకారం వేసి బడితె పూజ చేస్తాను” అనుకుంటూ ఎద్దులా రంకెలేస్తూ లగెత్తుతున్నాడు.
బస్‌స్టేషన్‌లోకి దూరి అంగుళం అంగుళం ఎతుకుతున్నాడు. ఒక మూల చీర కొంగు ముసుగేసుకుని కూర్చున్నామె దగ్గరకు పోయి ముసుగెత్తాడు. అంతే లేడిలా వణుకుతున్న సిన్నీ తలెత్తి సూసి కన్నీళ్లు పెట్టుకుంది.
”అయ్యా! దయసేసి నన్ను ఒగ్గెయ్యె. నేబోతా… నా సావు నే సస్తా…” కాళ్లు పట్టుకుని బతిమాలుతోంది.బస్‌స్టేషన్‌లో ఉన్నోల్లంతా ఎవరి పనుల్లో యాల్లున్నారు. కొందరు మాకెందుకులే అని, కొందరు సూసీసూడనట్టు బోతున్నారు. కాని అక్కడ పెద్ద రాద్దాంతమే జరుగుతోంది… సాసి సెంప మీద ఒక్కటిచ్చాడు. అంతే. అల్లంత దూరంలో పడింది సిన్నీ. అంతలో అటుగా వచ్చిన ఒక తెల్లమ్మాయి ఆ హఠాత్పరిణామానికి అవాక్కైంది. అంతలో తేరుకుని చేతిలో లగేజీ కింద పెట్టి ఆమెను భుజాలు పట్టుకు లేపింది. సిన్నీ ఆమె వెనకన నక్కింది వెళ్లి.
”అమ్మగోరు! నన్ను కాపాడండి. మా అయ్య నన్ను సంపేత్తన్నాడు” అంది బెక్కుతూ. ”ఏంటే దానికి సెప్తున్నావ్. ఆ పిల్ల ఈ దేశంది కాదల్లే ఉంది. అగుపడట్లా ఆ రంగు. నీ బాస ఏం అర్ధమైతాదనే ఓ సెప్తున్నావ్. ఇటు రాయే… సిన్ని” జుట్టు పట్టుకుని ఇవతలికి లాగబోయాడు. అంతే.చెత్తో చెంప ఛెళ్లుమనిపించింది ఆ తెల్లమ్మాయి. ఆ దెబ్బకు బోర్లా పడ్డాడు సిన్ని వాళ్ల అయ్య. అంతలోనే లేచి ఉక్రోషంతో ఏంటే నీలుగుతున్నావ్… నా కూతురు నా ఇట్టం. మజ్జలో నువ్వెరివే… అంటూ జుట్టు పట్టుకోబోయే సరికి కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన ఆ తెల్లమ్మాయి ఆడ్ని మట్టికరిపించింది. తేరుకుని అలుపు తీర్చుకుంటుండగా ఒకడు అక్కడికి వగర్చకుంట వచ్చాడు. ఏరా! ఏదిరా నీ కూతురు. నాకు తాకెట్టు బెట్టి డబ్బులు తాగేసి దాన్ని నైస్‌గా ఊరు దాటించేత్తన్నవా… నీ అయ్య. ఇవ్వాళ నువ్వో నేనో తేలిపోవాలి రారా… అంటున్నాడు. అదేం కాదు దొరా… చేతులు జోడించి జరిగిందంతా సెప్పుకొచ్చాడు. ఇదేనా? అంటూ తెల్లమ్మాయి వైపు వేలు బెట్టి అడిగాడు… ఔ … అదే… దొరా… అన్నాడు… ఏమేవ్… ఏ దేశం నుంచి ఊడిపడ్డావ్? మాగొడవల్లోకొత్తే ఎవుకలు మిగిలవ్. పో నీ దారిన గట్టిగా అరిశాడు…
అసలు ఎవర్రా మీరంతా? అందరూ కలిసి ఎందుకా అమ్మాయిని కొడుతున్నారు? అని ఎదురుతిరిగింది. అవునే అవును. అది… అదే ఆ సిన్ని గురించి సెప్తా విను… దాని మీద నాకు విపరీతమైన మోజు. పెండ్లి సేస్కుంటా బంగారంలా సూస్కూంటాననినా… ఇంటేనా నా మాట. ఆడెవడితోనే తిరిగింది… కులం తక్కువ సన్నాసి… కడుపుసేసి పరారైనాడు… ఆడు ఉన్నా, సచ్చినా అది మాత్రం నాకు కావాలి… అనేసరికి సిన్ని మధ్యలో అడ్డుతగిలింది. నేదమ్మ… నేను ఆడికి దక్కనేదని నావోణ్ణి ఈడే లారీ ఎక్కించి సంపించిసినాడు… అంది ఏడుస్తూ…
నిజమా… హౌ శాడ్… ఆమెకు కన్నీళ్లోచ్చేసాయ్ ఒక్కసారిగా… ఇప్పుడు ఈ కుటుంబానికి దిక్కు లేదు. తింటానికి తిండి లేదు. నేనే దీని కుటుంబాన్ని సూత్తన్నా. అందుకు బదులుగా దీనయ్య… దీన్ని దీని కడుపులోని బిడ్డను నాకు తాకెట్టు పెట్టాడు. బోల్డంత డబ్బు ఇచ్చినానాడికి… తెల్సా నీకు… అన్నాడు… తాకట్టా ఈమెనా? ఈమె కడుపులోని బిడ్డనా? వాట్ నాన్సెస్ ఈస్ థిస్? ఏ కాలంలో ఉన్నాం మనం… అంది ఆవేశంగా తెల్లమ్మాయి… ఇంతే ఇక్కడ ఇంతే. అయినా గిదంతా నీకెందుకు… నీదారిన నువ్ పో… అన్నాడు ఇసురుగా…
ఇది తప్పు… ఇది అమానవీయం… అమానుషం… మీరు చేస్తోంది చాలా పెద్ద నేరం. పోలీసులకు చెబితే ఏమౌతుందో తెలుసా… అంది… ఏమౌద్ది… అహ ఏమౌవుద్ది… నాలుగు పచ్చనోట్లు తీస్కెళ్లి తాగి తందనాలాడతారు… అంతే అన్నాడు ఎకసెక్కంగా నవ్వుతూ… చప్పట్లు కొడుతూ జనం గుంపులోంచి ఒకమ్మాయి వచ్చి తెల్లమ్మాయికి తను సెల్‌లో షూట్ చేసిన ఈ తతంగమంతా
చూపించింది. వెరీగుడ్… మంచిపని చేశావ్ శ్యామల… నా స్నేహితురాలివనిపించుకున్నావ్… ఈ ఏరియా పేరు, ఈ ఊరి పేరు, ఈ ఏరియా ఎస్సై పేరు కనుక్కుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చెయ్… ఇమ్మీడియెట్లీ… అంది… ఏంటే ఇంగిల్‌పీసులో ఏం కూస్తున్నావే… అదేంటో ఇద్దరూ తెగ నవ్వీసికుంటున్నార… అన్నాడు… మీ గురించే ఈ సెల్‌లో అంతా రికార్డ్ చేసింది నా ఫ్రెండ్… ఇప్పుడు వస్తారు… మీ మావయ్యలు ఎక్కడ వున్నా… నీకు చుక్కలు చూపిస్తారు… అంది… ఏంటే వాగుతున్నావ్… ఎవరే మీరిద్దరూ… అంటూ మీదికి లంఘించబోయాడు… అక్కడున్నోళ్లందరిలో అప్పుడొచ్చింది చలనం. ఆణ్ణి పట్టుకుని బాది పక్కన కూర్చోబెట్టారు.
ఇప్పటి వరకూ అందరూ చోద్యం చూస్తూ ఎవరి పని వాళ్లు చేసుకున్నారు. మాకెందుకంటే మాకెందుకంటూ నోరు మూసుకుని వెళ్లిపోయారు… ఒక ఆడపిల్లను వాళ్ల అయ్య, కొనుకున్నానంటూ ఇంకొకడెవడో వచ్చి కొడుతుంటే ఏమైపోయారు మీరంతా? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదా? అందరం సమాజంలో బతుకుతున్నాం. ఏ అడవిలోనే బతకట్లేదు కదా… ఈమె కూడా మీ బిడ్డ లాంటిదే కదా… కఠువుగా వస్తున్న ఆమె మాటలకు అందరూ తలలు దించేసారు… అక్కడి వాతావరణమంతా నిశ్శబ్ధంగా మారిపోయింది… అప్పుడు ఆ దెబ్బ తిన్న లేడిపిల్ల సేద తీరి లేచి నిలబడింది… ఇంతలో గుంపులోంచి ఒక పిల్లాడు సోడా కొట్టించుకొచ్చి ”అమ్మా … తాగమ్మా…” అన్నాడు… ఆ పిలుపుకు కన్నీళ్లొచ్చేశాయామెకు… ఏడుస్తూనే వాడి తలను నిమిరి సోడా తాగింది…”
మాది బస్టాండ్ పక్కన చివరకు విసిరేసినట్టుండే ఒక మారుమూల పల్లె… సిన్నప్పుడే అమ్మను మా నాన్నే సంపేశాడు… తాగి తాగి ఇలా రోడ్డున పడుతూనే ఉంటాడు… నా గురించి పట్టించుకున్న రోజు లేదు… నేను తిన్నానా… లేదా… సూడడు. ఆడపిల్ల పెద్దదైనప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు సెప్పేవాల్లే లేరు నాకు… ఆ సుట్టుపక్కల అందరికీ మా నాన్నంటే భయం… వణుకు… నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు… అగో అప్పుడే… యాడు పరిసయమయ్యాడు… ఆడే నా రంగడు … ఇంచుమించు నా వయసే కాని రెండేళ్లు పెద్దోడు… నేనంటే శానా ఇట్టం… నాతో బాగా ఉండేవాడు… నన్ను సంటిపిల్లలా సూసుకునేవాడు… నాకు కావల్సినవి ఇచ్చేవాడు… నన్ను పెళ్లి సేసుకుని ఎలాంటి కట్టం రాకుండా సూసుకుంటానన్నాడు… ఆడికి సదువంటే పిచ్చి… పదో తరగతి సదివాడు… అదేదో కూడా సదవడానికి పట్నం పోదామన్నాడు… ఏవో పరీచ్చలకి సదుతున్నాడు కూడా. ఆడికి అమ్మానాన్న లేరు… ఆడు కూడా గాలికీ ధూళికి పెరిగినోడే… పెబుత్వ బల్లో కట్టపడి సదివాడు… ఏ పుత్తకమైనా, ఏ కాయితం దొరికినా ఇడవడు… ఏమోకటి సదుతానే ఉంటాడు… ఏమోమో, ఎవలెవలో పెద్ద మగాత్ములు సెప్పారంటాడు… ఆడపిల్లల్ని బాగా సూసుకోవాలని… నన్ను పట్నం తీస్కపోయి సదివిత్తానన్నాడు… నేనంటే పేణం… ఆడు సదుకునే పుత్తకాలు దగ్గరెట్టుకుని ఆ మగాత్ముల పటాల ముంగర నా మెడలో దండేసినాడు… పట్నం పోయేదాకా ఈ విషయం ఎవరికీ సెప్పద్దన్నాడు… నేనెవరికీ సెప్పలేదు… కానీ మేం కలవని రోజే లేదు… ఇగో సూసారా… నాకు ఎనిమిదో నెల ఇప్పుడు… అసలు నా గురించే పట్టించుకోని ఈ అయ్యకి తెలిసిపోనాది. నన్ను ఇంసించి ఇంసించి, సావగొట్టి నా ఇసయం నా సేతే సెప్పించుకుని నా పెనిమిటిని లారీతో గుద్దించి సంపీసీనాడు… ఇంత పెపంచంలో ఒంటరినైపోయాను… ఐనా నాకేం బాదనేదు… ఆడ్నే నా కడుపులో మోత్తన్నా… ఇగో ఆడు సదివినా పుత్తకాలు… సూడండి… సూడండి. సంకలో సివికిపోయిన ఓ సంచిలోంచి పుస్తకాలను దబాదబా కిందేసింది… జాషువా… వీరేశలింగం పంతులు… మహాత్మాగాంధీ జీవిత చరిత్ర పుస్తకాలవి… ఇంకా సాలా ఉన్నాయి… అందరూ ఒక్కసారిగా నోళ్లెళ్లబెట్టారు… వాళ్ల అయ్య కూడా ఇంటన్నాడు… ఈడు సూసారా ఈడున్నాడే… నేనంటే మోజు… నన్ను మనువాడతానన్నాడు… మానవత్వం లేని మృగం… నా గురించి తెలుసుకుని నన్ను ఆడు ఉంచుకుంటానని మా అయ్యతో బేరం కుదుర్చుకున్నాడు… నన్ను నా కడుపులో బిడ్డకు ఖరీదు కట్టి అమ్మేశాడు మా అయ్య… .ఎందుకంటే మా అయ్యకు డబ్బు, మందు తప్ప నేనక్కర్లేదు… ఆడు నన్ను కొనుక్కుని ఇంకెవరికి అమ్మేస్తాడో తెలీదు… అందుకే నే పట్నంపోదామనుకున్నే… కాని ఏంసేయను… మళ్లీ ఈళ్ల సేతుల్లోనే పడ్డా… అంటూ వెక్కివెక్కి ఏడుస్తోంది…” అక్కడున్న అందరికీ కళ్లల్లో నీళ్లూరాయి…
ఇంతలో ఆ బస్టాండ్‌లోకి మీడియా మొత్తం పోగయ్యింది… పోలీసులు చేరుకున్నారు… సోషల్ మీడియా మహత్యం… అంటూ ఆ తెల్లమ్మాయి గట్టిగా అరిచింది… అంటే చుట్టూ ఎవరికి ఏం జరిగినా పట్టించుకోరు… పోలీసులు రారు… న్యాయం జరగదు… సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టేసరికి అందరూ అలెర్ట్ అయిపోయారు… పరిగెత్తుకుంటూ వచ్చేశారు… వెరీగుడ్… ఇప్పటికైనా కళ్లు తెరిచినందుకు… ఆ అమ్మాయికి సంబంధించిన కంప్లైంట్ నేను రాసిస్తాను… వాళ్ల నాన్నను, ఆ మృగాన్ని తీసుకెళ్లండి అంటూ వాళ్ల వైపు వేలెత్తి చూపించింది… సిన్నీ వాళ్లయ్య కాళ్ల మీద పడ్డాడు… సిన్నీ నన్ను సెమించవే తల్లి… ఇంకెప్పుడూ తాగను… నన్ను మన్నించవే… అంటూ కాళ్లావేళ్లా పడ్డాడు… పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారు. ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు…
మీడియా ఆ తెల్లమ్మాయి ముందుకొచ్చింది… .ప్రశ్నలు మీద ప్రశ్నలు అడుగుతున్నారు రిపోర్టర్లు… మీరడిగినన్నింటికీ సమాధానాలు చెప్తాను… ”మా అమ్మ ఓ పల్లెటూరి అమ్మాయి… పదో తరగతే… మా అమ్మమ్మా వాళ్లు అమెరికా సంబంధం వచ్చిందంటూ అమ్మకు 18 ఏళ్లకే పెళ్లి చేసి పంపేశారు. మా అమ్మకు ఏమీ తెలియనితనంతో అమెరికాలో అడుగుపెట్టింది. మొదట్లో బానే ఉండేవారట నాన్న. రాన్రాను నాన్న విషయం నెమ్మదిగా అమ్మకు తెలియసాగింది… నాన్నకు ఒక్కటే పిచ్చి… ఎప్పుడూ అమ్మ తనతో ఉండాలని… నాన్నకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ వచ్చి తనతో గడపాలని గొడవ చేశావారట… ఒంట్లో బాగున్నా, లేకున్నా, ఇష్టం ఉన్నా, లేకున్నా సంబంధం లేకుండా నాన్న మాటను పాటించాలంటూ గొడవ చేసేవాడట… అమ్మ చాలా రోజులు బాధపడింది… నచ్చజెప్పింది… వినలేదు… అమెరికా కల్చర్ ఇంతే… ఒక పల్లెటూరి మొద్దును చేస్కున్నానంటూ అమ్మను రోజూ కొట్టేవాడట… అందరి ముందు పరువు తీసేవాడట… అలాంటి సమయంలోనే నేను ఈ భూమ్మీద పడ్డానట…
అమ్మ నాతోనే ఎక్కువ సమయం గడుపుతోందని నాన్న ఆగడాలు ఇంకా ఎక్కువ చేసేవాడట… ఇటు అమ్మమ్మ దగ్గరకు వచ్చేయడానికి వీల్లేకుండా పోయింది… అమ్మ పాస్‌పోర్ట్ నాన్న దాచేశారు. అమ్మను, నన్ను ఒక బంగారు పంజరంలో బంధించేశారు… నాకు ఊహ తెలిసే సమయానికి నాన్న ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చేవారు… అమ్మ పట్టించుకునేది కాదు… నాతో ఏవో ఒక పుస్తకాలు చదివిస్తుండేది… తెలుగు భాష నేర్పించేది… తనకు తెలిసినవన్నీ చెప్పేది…
ఇంతలో ఒకరోజు అనుకోని పెద్ద ఘటన. రోడ్ యాక్సిడెంట్… తాగి డ్రైవ్ చేస్తూ నాన్న యాక్సిడెంట్ చేశారు. అమ్మకు కోలుకోలేని దెబ్బ… అంత విదేశంలో అమ్మకు తెలిసిన వాళ్లే తక్కువ. ఆ టైంలో మా ఇంటి పక్కన ఒక పెద్దాయన ఉండేవారు… ఆయనే నన్ను ఒక స్కూల్లో చేర్పించారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో మా అమ్మను ఆయన సొంతకూతురిలా చూసుకేనేవారు. అమ్మకు చదువు నేర్పించారు. ఆయన వల్ల మా అమ్మ అన్నీ తెలుసుకోగలిగింది… తర్వాత మా అమ్మ లా పూర్తిచేసింది… ఎందరివో మహాత్ముల జీవితాలను గురించి చెప్పింది… తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే అందుకు మా అమ్మే కారణం. ఎంత ముందుకు మనం వెళ్తున్నా ఆ మహనీయులు వేసిన దారిలోనే నడుస్తూ మన ఉనికిని కాపాడుకోవాలి, మన దేశ గౌరవాన్ని కాపాడుకోవాలి… స్త్రీలకు చేయీతనివ్వాలి, ముందుగా మనం మనిషిగా స్పందించాలి అంటూ ఎప్పుడూ నాకు చెబుతూ ఉండేది… మారుమూల పల్లెటూళ్లకు వెళ్లి అక్కడి వారు జీవితాలను చదవమనేది… తిండి లేక, బట్టల్లేక అల్లాడే మహిళలు, పసిపిల్లలకు చెయ్యందించమని నన్ను ప్రేరేపించేది… బాల్య వివాహాలను గురించి చెప్పేది… ఒక్క నిమిషం ఆగి కన్నీళ్లు తుడుచుకుంది… అలాంటి మూర్తి ఇప్పుడు నా దగ్గర లేదు… కొంతకాలం క్రితమే గుండెపోటుతో చనిపోయింది… ఆమె ఆశయం నెరవేర్చడం కోసం ఆ మహనీయులు వేసిన దారిలో నడుస్తూ మా అమ్మ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను, నా పక్కన ఉన్న ఈ అమ్మాయి సౌమ్య… సోషల్ మీడియాలో సిన్ని బతుకుచిత్రాన్ని పోస్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రప్పించేలా చేసిందే ఆమె నేను కలిసి మానవి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటుచేశాం… మారుమూల ఊళ్లకు వెళ్తున్నాం… అక్కడి వారి గాధల్ని డాక్యుమెంటరీలుగా తీసి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం… మహిళలకు చేయూతనందిస్తున్నాం…” అంటూ ఆగింది…
అక్కడున్న వారందరూ ఒక్కసారిగా చప్పట్లు కొట్టడం మొదలెట్టారు… సిన్నీ లాంటి వారెందరినో మేం కాపాడాం… వారికి జీవితం మీద ఆశలు కల్పించాం… యాసిడ్ దాడి బాధితుల్లో చైతన్యం నింపాం… అంటూ ఆగింది ఆ ఆమెరికా అమ్మాయి చైత్ర… అంతలో సిన్ని వచ్చి ఆమె చేతులు పట్టుకుంది… అమ్మ నన్ను మీతో తీస్కపోండమ్మ… నేను ఎంతో కొంత మీకు సాయపడతా… అంది… సిన్నీ నువ్వు ఈ రోజు ఎంతో ధైర్యంగా అందరి ముందు నీ జీవితాన్ని వివరించి అందరిలో కనువిప్పు కలిగించావ్… మా అమ్మ కలగన్నది ఇలాంటి స్త్రీనే… నిన్ను మాతో తీసుకెళ్తాం… అదిగో నీ జీవితాన్ని మలుపుతిప్పిన నీ మహనీయుడు చదివిన ఆ మహాత్ముల పుస్తకాలను అందుకో… ఆ బాటలో మనమందరం ముందడుగేద్దాం” అంటూ పుస్తకాలను తీసుకుని అలా నడుచుకుంటూ సాగిపోయారు. రేపటి నవశకాన్ని చూసిన అక్కడి వారంతా చప్పట్లతో సాగనంపారు…