మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22న కృష్ణా జిల్లా నందిగామ తాలుకా పొక్కునూరులో వెంకటప్పయ్య – వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి గ్రామాధికారిగా పనిచేసే వారు. మాడపాటికి అయిదేళ్ళ వయసప్పుడే తండ్రి మరణించడంతో అన్న తిరుమలరావుతో కలిసి మేనమామలను ఆశ్రయించాల్సి వచ్చింది. మేనమామల సహకారంతో 1898లో ఉర్దూ 1900లో ఇంగ్లీషు మిడిల్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. హనుమకొండలోని ఉన్నత పాఠశాలలో మద్రాసు విశ్వవిద్యాలయం వారి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు.
తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించి తెలంగాణా వారి చేతనే గాక యావదాంధ్ర చేతనే ‘ఆంధ్ర పితామహ’ అనిపించుకున్న మాన్యులు మాడపాటి హనుమంతరావు. తెలుగు భాషకు తెలంగాణలో అంతగా ఆదరణలేని రోజుల్లో ఆంధ్రులలో తామంతా తెలుగువాళ్ళం అనే స్పృహను కలిగించిన మహనీయుడు మాడపాటి. అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలుగు వారి రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక, పునరుజ్జీవనానికి కృషి చేశారు. గ్రంధాలయోద్యమం, సంఘ సంస్కరణ, సాంఘికోద్యమం, సాహిత్య వికాసం, స్త్రీ విద్య, మహిళా ప్రగతి వంటి అనేక ఉద్యమాలను నడిపించిన అసామాన్యుడు. తన నడవడితో యువతను కర్తవ్యోన్ముఖులను చేసిన మార్గదర్శకుడు మాడపాటి.
1904లో మాడపాటి వారికి తమ చినమామ గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో వివాహమైంది. అప్పటికి ఆయన వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మీర్మునీష్గా పనిచేస్తుండేవారు. అయితే తన వ్యక్తిత్వ వికాసానికి గానీ, సాంఘిక సేవకు గానీ ఆ ప్రభుత్వ ఉద్యోగం ఉపకరించదని గుర్తించి, తన ఆశయ సాధనకు న్యాయవాద వృత్తే సరైనదని భావించి, ఉన్న ఉద్యోగానికి సెలవు పెట్టి హైదరాబాదులో లా కోర్సులో చేరారు. ఆ సమయంలో శాసన నిర్మాణ శాఖలో తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో అనువాదకుడిగా ఎంపికైన మాడపాటి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే లా తరగతులకు కూడా హాజరయ్యే వారు. ప్రైవేటుగా వకీలు పరీక్షకు హాజరై ‘దర్జీ అవ్వల్ వకాలత్’ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1917లో అనువాదక ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తిని చేపట్టారు. ప్రముఖ న్యాయవాది రాయ్ విశ్వేశ్వర్నాథ్ వద్ద జూనియర్‌గా పనిచేసి, సంవత్సరం లోపే హైదరాబాద్ లో స్వంత ప్రాక్టీసు ప్రారంభించారు. న్యాయవాద వృత్తిని దైవ సమానంగా
భావించే మాడపాటి వారు లాయర్ కావాలనుకున్నది లక్షలు గడించడానికి కాదు, ఉన్నత పదవులు పొందడానికి కాదు. నిజాయితీగా, అంకిత భావంతో పనిచేయడానికి. ఆయన తాను నమ్మిన కక్షిదారులకు న్యాయం జరగాలని తపించేవారు.
ఎవరైనా కేసుల నిమిత్తం తమ దగ్గరికి వచ్చినపుడు వారికి నిజాం రాష్ట్రంలోని రాజకీయ, విద్య, సామాజిక, వ్యవసాయ, వాణిజ్య పరిస్థితులను వివరించేవారు. ఫలితంగా వారు సాంఘిక, రాజకీయ స్థితిగతులను అర్థం చేసుకొని ప్రజా ఉద్యమాల్లో పాల్గొనేవారు. ఆ విధంగా మాడపాటి పౌరులను ప్రజా సమస్యల వైపు మళ్లించి వారు సామాజికాభివృద్ధిలో పాల్గొనేలా చేసేవారు. కోర్టు వ్యవహారాల తర్వాత ప్రజా సమస్యలను మంత్రులతో చర్చించే వారు.
వివిధ వ్యక్తిత్వాలు, ఉద్యమాలు, గ్రంధాలు మాడపాటి పై ప్రభావం చూపాయి. ఆంధ్ర భాషోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, భారత స్వాతంత్ర్య ఉద్యమం, ఈ మూడూ మాడపాటి హనుమంతరావును ప్రజాహిత జీవనంవైపు నడిచేలా చేశాయి. వీటివల్ల భాషా, సాంఘిక చైతన్యంతో పాటు రాజకీయ చైతన్యాన్ని కూడా ఆయన పొందగలిగారు.
తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష దుస్థితిని గుర్తించిన మాడపాటి తెలుగు భాషా వికాసానికి గ్రంధాలయాలు కీలకమని గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో గ్రంధాలయాలను నెలకొల్పి భాషా ప్రచారానికి, సాంఘిక చైతన్యానికి కృషి చేశారు. ఈ క్రమంలో ఆయన తనకు సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాల అభివృద్ధికే అందజేశారు. హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, హనుమకొండలోని రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం కూడా ఆయన అభివృద్ధి చేసినవే. శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, నిజాం పాలిత తెలుగు ప్రాంతంలోని తొలి తెలుగు గ్రంథాలయంగా ప్రసిద్ధి పొందింది. గ్రంథాలయాల ద్వారనే చైతన్యాన్ని వ్యాప్తి చేయాలన్న దృక్పథంతో సాగిన ఆయన ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది.
మాడపాటి వారి ప్రజాసేవ విద్యారంగంలోనూ విస్తరించింది. స్త్రీ జనాభ్యుదయానికి కూడా మాడపాటి హనుమంత రావు కృషి చేశారు. స్త్రీ విద్యా ప్రాధాన్యతకై తపించిన ఆయన భారతదేశంలో ప్రప్రథమ బాలికల పాఠశాలల్లో ఒకటైన ‘మాడపాటి హనుమంత రావు బాలికోన్నత పాఠశాలను హైదరాబాదులోని నారాయణగూడలో స్థాపించారు. ఇంకా బాలికల కోసం ఆయన ఎన్నో పాఠశాలలను నెలకొల్పారు. ఆయన పేర ఏర్పడిన ఈ పాఠశాల ఇప్పటికీ నారాయణగూడలోని ప్రసిద్ధ పాఠశాలగా మనుగడలో ఉంది.
మాడపాటి తన ప్రజా జీవితంలో ఒకే ఒక్కసారి క్రియశీల రాజకీయాల్లో పాల్గొని 1952లో శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. హైదరాబాదు నగరానికి తొలి మేయర్‌గా పనిచేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలోను ఆయనకు స్థానం దక్కింది. 1958లో శాసన మండలి తొలి అధ్యక్షునిగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఆయన మితవాది.
మాడపాటి గారు ప్రధానంగా యువతను దృష్టిలో పెట్టుకునేవారు. ఏ దేశమైనా, ఏ కాలమైనా, అక్కడి యువతే భవిష్యత్తును నిర్మించే సాధకులు అని భావించేవారు.
కవి, రచయిత అయిన మాడపాటి మొత్తం 13 కథలు రాశారు. వాటిలో 10 కథలు ‘మల్లికా గుచ్ఛం’ అనే పేరుతో పుస్తక రూపం దాల్చాయి. ఆయనకు రచయితగా శాశ్వత కీర్తిని అందించిన గ్రంథం ‘తెలంగాణ ఆంధ్రోద్యమం’. మాడపాటి హనుమంతరావు గారు బహుభాషావేత్త 1912లో రైతాంగ జీవితంపై తొలి కథానిక ‘ఎవరికి’? రచించిన మాడపాటి జీవితం కేవలం సాహిత్య రంగానికే పరిమితం కాలేదు. తెలుగు వారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవనాన్ని ఆయన గాఢంగా తన ఆచరణ ద్వారా ప్రభావితం చేశారు. పాత్రికేయునిగా, అనువాదకులుగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు.
తెలంగాణా ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను మేల్కొలిపి, సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పారు. తెలంగాణాలో చైతన్యాన్ని తెచ్చిన తొలి తెలుగు నాయకునిగా ప్రాచుర్యం పొందిన మాడపాటి విజ్ఞాన విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో ‘ఆంధ్రచంద్రికా గ్రంధమాల’ను స్థాపించారు. వారి స్వగృహమైన ‘ఆంధ్ర కుటీరం’ ఈ గ్రంథమాల కార్యాలయం.
మాడపాటి హనుమంతరావు దూరదృష్టి, స్వార్థరాహిత్యం , క్రమశిక్షణ, నిర్వహణలో దక్షత కలిగిన వ్యక్తి. వారిది అందరినీ కలుపుకుపోయే లక్షణం. వృత్తిరీత్యా తనను సంప్రదించడానికి వచ్చే క్లయింట్లతో, రాజకీయ సహచరులతో ఆత్మీయంగా వ్యవహరించేవారు. వీటితోపాటు నాటి హైదరాబాదు రాష్ట్ర స్థితిగతుల్లోని అజ్ఞానాన్ని చైతన్యంతో తొలగించే ప్రయత్నం చేసినవారు కావడం వల్ల తన జీవితం కాలంలో అపరిమితమైన గౌరవాన్ని పొందారు.
తెలంగాణా రాజకీయ రంగంలో నిర్వహించిన బాధ్యతలను పురస్కరించుకొని ‘ఆంధ్రపితామహుడు’ అన్న బిరుదును పొందిన మాడపాటి హనుమంతరావును భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ బిరుదుతోను, ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘గౌరవ డాక్టరేట్’తోనూ గౌరవించాయి.
నిద్రాణమై ఉన్న తెలంగాణాలో చైతన్యాన్ని రగుల్కొల్పి ఆ ప్రాంత సర్వతోముఖ వికాసానికి తన జీవితాన్ని ధార పోసిన మహనీయుడు. తెలుగువారి సమైక్యత, తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి, తెలుగు ప్రజల అభ్యుదయానికి, ఆంధ్రోద్యమానికి, గ్రంథాలయాల స్థాపనకూ తన జీవితాన్ని అంకితం చేసిన ‘ఆంధ్ర పితామహ’ మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్ 11న తన 86వ ఏట మరణించారు.
(నవంబర్ 11న మాడపాటి హనుమంతరావు గారి వర్ధంతి సందర్భంగా…)
good article