ఈ చిన్ని విత్తనం
ఎప్పుడు పుట్టిందో..
ఎక్కడ పుట్టిందో తెలియదు..గానీ
దీన్నిండా..
లెక్కించ నలవికాని
జీవకణాలు.. పక్కపక్కనే..!
కదలకుండా
ముడుచుకున్న ఈ మహావృక్షం
మునీశ్వరుడి సూక్ష్మరూపమేమో..
పెంకుదుప్పటి సందుల్లోంచి
తొంగి చూస్తోంది…
అంకురించాలనే తాపత్రయం..
యే చెట్టు తల్లి కలల రూపమో..
నా చేతుల్లో
వచ్చివాలిందిప్పుడు..
తపస్సు ఫలించినట్లుంది..
దూరతీరాల రెక్కలను
చేరదియ్యాలనీ..
కందిన చెమట చుక్కలకు
పందిరవ్వాలనీ..
పుడమితల్లి మెచ్చే
పచ్చంచు చీరవ్వాలనీ..
పలవరిస్తూనే ఉంది…
కలల చాంతాడుని
మా పెరటి
మట్టిపొరలు పులకించి.
పూరేకులై విచ్చుకుంటే..
చీకటి రేణువులీ పట్టు దారాలని
గుండెల్లో పొదుముకున్నయ్
మబ్బుతునకలు
పన్నీటిని చిలుకరిస్తే..!
మట్టిపరిమళం
చెట్టుతనాన్ని నింపింది
కనపడదు గానీ..
ఈ బుజ్జి విత్తనం
పరమాణువులా
ఎంత శక్తిని దాచుకుందో లోలోపల..
భూమిని చీల్చుకొచ్చి
ఆకాశానికెగ బాకుతోంది
కొమ్మల రెమ్మలతో
గొడుగు పడుతుంది
పుడమితల్లి పాదాలకి..!
తను నశించినా
మరుజన్మ మరొకరికోసమూ
ఇప్పుడు
మెత్తటి చేతులతో..
నను హత్తుకుంటోందీ
నాకు తల్లయి…!