పుర్రెనిండా
పరాయితనం దాచుకొని
ఎన్నాళ్ళు నన్ను కౌగిలించుకున్నా ఎప్పటికీ నేను నీకు
గులాబీనే చేతికివ్వాలనే అనుకుంటాను
పువ్వు కింద ముళ్లు నా కుట్ర అంటావు
గుచ్చుకునే ముళ్లు వెతుక్కుంటూ
విచ్చుకునే పూలపరిమళాలు నువ్వెప్పటికీ స్వాగతించలేవ్…
నేనీదేశపు పౌరునిగా నిలబెట్టుకోడానికి
నన్ను నేను ఎన్నిసార్లు కూల్చుకున్నానో
నీ మనువు ముందు ఎన్నిసార్లు రాజీపడిపోయానో
శతాబ్దాల సాహచర్యంలో
నేను ప్రకటించిన ప్రేమను
నువ్వు లొంగుబాటని అనుకొనివుంటావ్
నాకు తెలుసు
నన్ను వెతుక్కుంటూ
ఏదోఒక రోజు వస్తావ్
ఘర్ వాపస్ రమ్మంటానికో
దేశం విడిచి పొమ్మంటానికో
శరణార్ధి శిబిరాలలోకి విసిరేయటానికో
నాకు తెలుసు
నన్ను వెతుక్కుంటూ
ఏదో ఒకరోజు వస్తావ్
పాకిస్తాన్కొ లేదంటే
ఆఫ్ఘనిస్తాన్ కొ
నాదికాని ఏ దేశానికో
నా వాళ్లులేని ఏ ప్రదేశానికో నువ్వు వెళ్లమంటావ్
ఎప్పుడూ టైలర్ గానే మిషను తొక్కాను
నా పూర్వీకుల దారంపోగుల అల్లికనెలా నిరూపించుకోగలను?
ఎప్పుడూ నా రైంచీల బిగింపులకొ సమ్మెట దెబ్బలలో మసకబారిన
నా జిందగీకి జుర్మానాలా
దృవీకరణ ప్రత్రాలు ఎక్కెడ నుంచి తెగలను?
ఖాన్దాన్ అంతా కిరాయ్ మకాన్ లోనే వున్నవాళ్లం
ఇప్పుడు నా దేశమే నాకు కిరాయ్ మకాన్ అంటే ఎక్కడికెళ్లగలను ?
అడుగడుగునా అమానవీయ అగాధాలు దాటి నన్ను నేను ప్రతీ పూటా
నా భారతీతను నిరూపించుకోలేను
ఇప్పుడు నేను నా తల్లి కడుపులోకి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నాను
మా మేరే వతన్ తేరే సీనేపే ముఝే జాగా నహీ
తేరే పేట్మే ముఝే లేలే…