హ్యూ గాంట్జర్, కొలీన్ గాంట్జర్
తెలుగు: శివలక్ష్మి
(హ్యూ గాంట్జర్ (Hugh Gantzer), కొలీన్ గాంట్జర్ (Colleen Gantzer) అనే ఇద్దరు యాత్రా రచయితలు రాసిన “Women’s Bill, Through Our Travels” కు నా స్వేఛ్చానువాదం. హ్యూ, కొలీన్ దేశ, విదేశీ ప్రయాణాల ద్వారా వారు పొందిన అవగాహనతో వివిధ దేశాల్లోని మహిళల స్థితిగతుల్ని, 33 శాతం, అదికూడా అమలుకి నోచుకోని మన మహిళా బిల్లుతో సమన్వయిస్తూ మన కందిస్తున్నారు.)
*
ఇలా జరుగుతుందని మాకు ముందే తెలుసు!
మేము ట్రావెల్ రైటర్లుగా మారడానికి ముందు, మాలో ఒకరికి సదరన్ నేవల్ కమాండ్‌కు న్యాయవాదిగా పని చేసిన అనుభవముంది. మేము ఆ చట్టపరమైన శిక్షణను మా ప్రయాణ రచనలలో తీసుకువస్తున్నాం. మేము ప్రయాణిస్తున్నప్పుడు, కోర్టులలో ఎగ్జామినేషన్-ఇన్-చీఫ్ చేసినట్లుగా మేము మా మొదటి అభిప్రాయాన్ని నమోదు చేశాం. మేము ఇంటికి తిరిగి వచ్చాక, డిఫెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో దాని నిపుణులైన సాక్షులను పరిశోధన చేసినట్లుగా మా పరిశీలనలను పరిశోధించాం. మేము ఇవన్నీ విశ్లేషించి ఒక నిర్ధారణకు వచ్చాం.
నాగరికతకు ప్రాతిపదిక అయిన జననం, సంతానం, గృహనిర్మాణం ఇత్యాది విషయాల్లో ఇతర స్త్రీలతో కలిసి సమస్యలను పంచుకోవడంలో స్త్రీలు పోషించే ప్రాథమిక పాత్రను సమాజాలు అంగీకరించినప్పటికీ, పురుషులు తమకున్న శరీర దారుఢ్యం, కండరాల శక్తి, పురుషాహంకారం వల్ల మహిళల ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికి, వారి శక్తి సామర్ధ్యాలను అంగీకరించడానికి సిద్ధంగా లేరని, స్త్రీల కృషిని తరతరాలుగా స్థిరంగా నిరాకరిస్తూ వచ్చారని ఈ వ్యవస్థ నమ్ముతుంది. కానీ సమాజం మనుషుల భుజబల శక్తి నుండి యాంత్రిక శక్తికి, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సుకి క్రమక్రమంగా పరిణామం చెందుతుండడంతో, సమాజంలో పురుషుల ప్రధాన పాత్ర తగ్గిపోతూ వస్తోంది. తమ పౌరులకు అత్యంత పసితనపు ఊయల దశ నుండి చిట్టచివరి సమాధి దశ వరకూ రక్షణ కల్పిస్తున్న మహిళలకు, స్కాండినేవియన్ సమాజాలలో, పౌర వ్యవహారాలలో మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మేము ఫిన్‌లాండ్‌లో పర్యటించినప్పుడు, దీనిని గ్రహించి మా అనుభవంలోకి తెచ్చుకున్నాం!
ఐదు దశాబ్దాలుగా మేము అనేక దేశాల చుట్టూ తిరుగుతూ, మన దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలను సందర్శిస్తున్నప్పుడు, మేము రికార్డ్ చేయడానికి, పరిశోధన చేయడానికి, విశ్లేషించడానికి మేము చెప్పిన పరిశోధనా పద్ధతినే ఉపయోగించుకున్నాం. ఆయా రంగాలలో వివిధ నిపుణులు రాసిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగలిగితే, విషయాలను నిర్ధిష్టంగా నిర్ధారించడానికి ఎవరికైనా సోషల్ సైకాలజీ లేదా పొలిటికల్ సైన్స్ లో డాక్టరేట్ డిగ్రీలు ఉండవలసిన అవసరం లేదు. ఇటువంటి పరిశోధనలు మమ్మల్ని అనేక ఆకర్షణీయమైన దిశల్లో నడిపించాయి. అందుకు ఈ వ్యవస్థకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేము కేరళలో మా పరిశీలనా దృక్పధాన్ని ప్రారంభించినప్పుడు స్త్రీ శక్తి గురించి గొప్ప అంతర్దృష్టిని పొందాం. అక్కడ, నాయర్స్ మార్షల్ కమ్యూనిటీ, ఆసియాలోని ‘కలరిప్పయాట్’ లాంటి పూర్వీకుల సకల యుద్ధ కళలను కనిపెట్టింది. నాయర్ సమాజంలో, వారసత్వం మాతృవంశం ద్వారా వస్తుంది. ఈ మాతృస్వామ్య వారసత్వం గురించి వారి తర్కం చాలా సులభంగా ఉంటుంది: ప్రపంచంలోని ఎవరైనా, ఎంత గొప్పవారైనా వారు, వారి తల్లి నుండి జన్మించారనే వాస్తవమే దానికి నిదర్శనం. అయితే ఒక మనిషిగా రూపుదిద్దుకోవడానికి గుడ్డు దశ నుండి ఫలదీకరణం కావడానికి బాధ్యులేవరనేది వారి వారి విశ్వాసాలకు సంబంధించిన విషయం.
అందువల్ల, ‘తల్లి’ మొత్తం మానవ సమాజానికి కాంక్రీట్ సిమెంట్ లా బలంగా కలిపి ఉంచే బ్రహ్మాండమైన బంధం. ఈ ప్రాథమిక వాస్తవాన్ని నాలుగు ప్రాచీన భారతీయ మతాలు హిందూమతం, జైనమతం, బౌద్ధమతం, బాన్ – దాని వివిధ అనుయాయి చిన్న చిన్న మతాలు గుర్తించాయి: విశేషమేమిటంటే, శక్తి అనే పదం స్త్రీత్వానికి కూడా పర్యాయ పదం!
గర్భధారణ – శిశు జననాల రహస్యాలు ఎల్లప్పుడూ ఒక ఐంద్రజాలిక తేజస్సుతో స్త్రీలను ఆవరించి ఉంటాయి. 25,000 బి సి నుండి 30,000 బి సి సంవత్సరాల నాటి అతి ప్రాచీనమైన, మతపరమైన విగ్రహాలలో ఒకటి విల్లెన్ డార్ఫ్ వీనస్ (Venus of Willendorf). ఈ విగ్రహం స్త్రీలింగ లక్షణాల అతిశయోక్తితో కళ్లకు నీళ్ళు తెప్పించే స్త్రీ రూపాన్ని కలిగి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఆదిమ మానవులకు స్త్రీ పట్ల కలిగి ఉన్న ప్రత్యేక గౌరవాన్ని తెలియజేస్తాయి! మగవారికి దృఢమైన శరీరాలుంటాయి; స్త్రీలు మానవ సమాజానికి అవసరమైన, భవిష్యత్ సమాజాలను సృష్టించి, వృద్ధి చేయగల మార్గాలను కలిగి ఉన్నారు. ఇది స్త్రీలకు వారి తెగలపై ప్రత్యేక అధికారాన్ని ఇచ్చింది. లక్షద్వీప్‌లోని మినీకాయ్ ద్వీపంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. అయినా తాలిబన్ల క్రూరమైన పురుషాహంకార సమాజంలోవలె కాకుండా, ఇక్కడ పూర్తిగా మహిళలతో కూడిన ప్రత్యేకమైన పౌరసంస్థలు ఉన్నాయి. అదే విధంగా, మేము ముస్లిం దేశమైన టర్కీలో పర్యటించినప్పుడు, మా గైడ్ ఒక యువతి. ఆమె తన పురుష సహోద్యోగులతో సమానమైన హోదా ననుభవిస్తూ స్వేచ్ఛగా, కలిసిపోయి పని చేయడం మేము చూశాం. టర్కిష్ సమాజం ఇస్లామిక్ మత విశ్వాసాన్నే అనుసరిస్తుంది, కానీ అందులోని లింగ సమానత్వాన్ని గుర్తించి గర్వంగా గౌరవంగా అమలుపరుస్తుంది!
కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ అధికార వర్గం ఏర్పాటు చేసిన కమీషన్ ద్వారా, మేము మణిపూర్ ని సందర్శించినప్పుడు, ఆ రాష్ట్ర సంప్రదాయాలలో అక్కడ ప్రత్యేకంగా సందర్శించవలసిన వాటిలో మహిళల మార్కెట్ ఒకటి అని మేము తెలుసుకున్నాం. ఇది 16వ శతాబ్దంలో ప్రారంభించబడింది. 500 సంవత్సరాల నాటి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతి పెద్ద పురాతనమైన మార్కెట్ ని మహిళలు మాత్రమే నడుపుతున్నారు. ఇక్కడి స్త్రీలు 500 ఏళ్ళనుండి గొప్ప ఐకమత్యంతో కలిసిపోయి వ్యాపారాలు చేసుకుంటున్నారు. స్వావలంబనతో తమ జీవితాలను సకల వర్ణ శోభితంగా, కళలమయంగా గడుపుతున్న అద్భుతమైన మహిళల మార్కెట్ గా ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ మార్కెట్ 5,000 నుండి 6,000 మంది వివాహితులు, విడాకులు తీసుకున్న మహిళా విక్రేతలను కలిగి ఉంది. ఇందులో ప్రత్యేకమైన తల్లుల మార్కెట్ కూడా ఉంది. వారు ఆహార పదార్థాల నుండి హస్తకళల వరకు వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తారు.
విక్రయదారులు మార్కెట్‌లో తమకున్న సభ్యత్వాన్ని తమ కుటుంబంలోని అర్హులైన సభ్యులకు అందజేసే హక్కును కలిగి ఉంటారు. ఒక కుటుంబంలోని ఒకే తరం సాధారణంగా 25 సంవత్సరాలు లేదా ఒక శతాబ్దంలో నాలుగు సార్లు సభ్యత్వాన్ని తీసుకుంటారు. 20 తరాలుగా మార్కెట్‌లోని కుటుంబాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని దీని అర్థం. అలాంటప్పుడు, ఒక జాతి – ఒక సెక్టేరియన్ సమూహంలోని పురుషులు మరొక జాతి స్త్రీలపై చేసిన క్రూరమైన దాడిలో, 20 తరాలకు పైగా స్థాపించబడిన తోటి విక్రేతలతో ఉన్న సంబంధాలు అంత సులభంగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందా?
మన ఇండియా-పాకీస్తాన్ విభజన సమయంలో ఇలాంటి అమానవీయమైన దుర్మార్గపు చర్యలను మనం చూశాం. కానీ ప్రజలు తమ ప్రియమైన ఇళ్ల నుండి, పరిసరాలనుండి నిర్మూలించబడుతున్నప్పుడు, సహజంగానే భావోద్వేగాలు అధికంగా వ్యక్తమవుతాయి. మణిపూర్‌లో ఒక వర్గపు స్త్రీలు అనుభవించిన భయాందోళనలకు కారణమైన తీవ్రమైన చీకటి భావోద్వేగాలు ఎందువల్ల సృష్టించ బడ్డాయి? ఎవరు సృష్టించారు? 20 తరాల మణిపురి మహిళలు ప్రత్యేకమైన మహిళల మార్కెట్‌లో కలిసి మెలిసి తమ జీవిక కోసం వ్యాపారాలు చేసుకున్నారు. తరతరాల అపూర్వ సోదరీమణుల మధ్య ఈ ఆకస్మిక, దుర్మార్గపు పోట్లాటలు పెరగడానికి, అవి చివరికి క్రూరమైన రూపం తీసుకోవడానికి ఎవరు కారణం? మాకు సమాధానాలు లేవు, ఎవరూ సహేతుకమైన, సబబయిన పరిష్కారాలు అందించలేదు.
ఆశ్చర్యకరంగా, చాలా బాధాకరమైన ఈ సమస్య మనదేశపు పౌరచర్చలలో ప్రముఖంగా కనిపించలేదు. ఢిల్లీలో ఓ మహిళపై జరిగిన అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. మణిపూర్‌లో అనేక మంది మహిళలపై జరిగిన అత్యాచారాలు, మరణించినట్లు నివేదించబడిన బహిరంగ అవమానాలు జాతీయ ఆగ్రహాన్ని కలిగించలేదు. ఇది ఈవిధంగా ఎలా జరిగింది? ఎందుకు జరుగుతోంది?
పార్లమెంటులో మహిళా ఓటు శక్తి మెరుగుపడినప్పుడు, ఈ లోతైన సమస్యాత్మక ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లభిస్తుందని మేము ఆశిస్తున్నాం!