మరి కొన్ని అడుగులు

చిన్నా మరి కొన్ని రోజులు
నువ్వక్కడ నేనిక్కడ
వేళ్ళతో వేదనాభరిత ఘడియలను
భారంగా లెక్కగట్టుకుంటూ….
మైళ్ళ దూరాన్ని చెరిపేస్తూ
ఆలోచనల అలలపై
తేలుతున్న చిన్నారి కాగితపుపడవని
నేను ప్రేమగా ముద్దాడుతూ…
మన గదులను ముంచెత్తేంత
సముద్రమంత సంపద కోసం కాదురా
నేను తీరాలను దాటి తరలివచ్చింది
గుప్పెడంత నీ పొట్టకు
పరమాన్నపు పలుకుని కాలేను
పిడికెడు మెతుకుల
అక్షరాలను నెత్తికెత్తుకుంటే
నేనిక్కక నీ కలలను నేస్తూ నెమరేస్తున్నా
తూరుపుతల్లి సూర్యుడిని ఎత్తుకోక మునుపే
ఎన్నో చీకట్లను జేబులో కుక్కుకుని
తెల్లవారతాను
దారిలో ఆగిన వాహనంలోంచి
వికసించిన లేలేత పూలు
అందంగా తొంగి చూస్తుంటే
నీ తలపు
కన్నీటిచుక్కై చెంపపైనుండి
అరచేతిపై రాలిపడుతుంది
నిన్న నేల నిన్ను గాయపరచినపుడు
పగిలిన నీ పెదవి
అప్పటికే పగుళ్ళిచ్చిన నా బ్రతుకువాకిట్లో
నెత్తుటి కళ్ళాపి చల్లింది
నిన్ను వెంటనే చూడాలనే ముచ్చటనూ
నీ కంఠంలో ఉదయించిన
దిగులుచారికనూ
కౌగిలించుకోవాలని ఉన్నా
మహమ్మారి గీసిన
సరిహద్దురేఖ దాటలేని
ఈ అశక్తుడిని క్షమించవూ
ఈ కొన్ని రోజులలో
మరి కొన్ని అడుగులు
మనవాళ్ళందరూ మూకుమ్మడిగా వేస్తే
నేను చేతులను
రెక్కలుగా మలుచుకుని
ఎగిరివచ్చి నీ ముంగిట్లో వాలిపోతాను
చిన్నా
నా చిన్నారిపిట్టా
నా భుజంకొమ్మపై
నువ్వొకసారి తల తాటిస్తే చాలు
నేను ఆ అనుభూతినదిలో
నా సమస్త జీవిత దుఃఖాలను
కడుగేసుకుంటాను

ఊరు విశాఖపట్నం. కవయిత్రి. కథలు, కవిత్వం, నవలలు చదవడం ఇష్టం. కవిత్వమంటే మరింత మక్కువ. వివిధ పత్రికల్లో కవిత్వం ప్రచురితమైంది. త్వరలో ఓ కవిత సంకలనం రానుంది.

2 thoughts on “మరి కొన్ని అడుగులు

Leave a Reply