మరణం లేని మందహాసం

పదేళ్ల అత్యంత క్రూరమైన అండా సెల్ నిర్బంధం నుండి  నిర్దోషిగా 2024 మార్చ్ 5 న విడుదలైన జి ఎన్  సాయిబాబా ఏడునెలలకే అక్టోబర్ 12 న నిమ్స్ హాస్పిటల్ లో తుది శ్వాస వదిలాడు. పదేళ్ల విలువైన జీవితాన్ని అపహరించి,  శరీరం లోలోపలి నుండి  విధ్వంసం కావటానికి కారణమై ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సాయిబాబాను హత్య చేశాయి. అందుకే అందరూ అది  సహజ మరణం కాదు , రాజ్యం చేసిన హత్య అని క్రోధాన్ని వ్యక్తం చేస్తున్నారు.  అక్టోబర్ 14 న హైదరాబాద్ లో సాయిబాబా ను కడసారి చూడటానికి, నివాళి అర్పించటానికి పౌర హక్కుల సంఘాల వారు, సాహిత్యసంఘాల వారు,ప్రజాసంఘాల వారు, రచయితలు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు,  లాయర్లు, సామాజిక ఉద్యమ కార్యకర్తలు-  తెలుగు ప్రాంతాల నుండే కాదు, ఢిల్లీ, గడ్చిరోలి, నాగపూర్ మొదలైన ప్రాంతాలనుండి తరలి వచ్చినవాళ్ళెందరో. జీవిత సహచరుడిని కోల్పోయిన  వసంతనో తండ్రిని కోల్పోయిన మంజీరనో, అన్నను కోల్పోయిన రాందేవ్ నో పలకరించి  ఓదార్చటానికి వచ్చారా !? అవును కావచ్చు కానీ అదే సమయంలో ప్రతి ఒక్కరూ ఓదార్పును ఆశిస్తున్న   దుఃఖితులుగానే కనిపించారు.  ఒకరితో ఒకరు చేతులు కలుపుకొంటూ, ఒకరినొకరు కావిలించుకొని కన్నీరు పెట్టుకొంటూ సామూహిక దుఃఖమైనారు. 

సాయిబాబా అమర్ రహే … అమర్ రహే 

ప్రజా హక్కుల ఉద్యమ నాయకుడు సాయిబాబా …. అమర్ రహే, అమర్ రహే 

ఆదివాసీ ప్రేమికుడు సాయిబాబా   అమర్ రహే .. అమర్ రహే 

ప్రజా ఉద్యమాల స్వరం .. సాయిబాబా అమర్ రహే .. అమర్ రహే 

సాయిబాబాకు రెడ్ శాల్యూట్ … రెడ్ శాల్యూట్ 

ఢిల్లీ సే లాల్ సలాం … లాల్ సలాం,  లాల్ సలాం, 

ఛత్తిస్ గడ్ సే  లాల్ సలాం…  లాల్ సలాం,  లాల్ సలాం, 

బస్తర్ సే లాల్ సలాం … లాల్ సలాం,  లాల్ సలాం, 

పంజాబ్ సే లాల్ సలాం …  లాల్ సలాం,  లాల్ సలాం, 

హైదరాబాద్ సే లాల్ సలాం …  లాల్ సలాం,  లాల్ సలాం, 

లాంగ్ లివ్ సాయిబాబా  … లాంగ్ లివ్,  లాంగ్ లివ్     అంటూ   అందరూ   ఒకే స్వరమై నినదించిన ఆ దృశ్యం లో క్రోధం తరంగాలుగా వ్యాపించింది. ధిక్కారంగా ధ్వనించింది. 

అనేక పాదాలు ఒకే దిశగా సాగిన ఆ ఊరేగింపు సాయిబాబా అంతిమ యాత్ర లాగా లేదు. 

సాయిబాబా ఆశయాన్ని, ఆచరణను మునుముందుకు తీసుకుపోయే స్ఫూర్తి యాత్రలా సాగింది. 

   1

సాయిబాబాను నేను కలిసింది ఒకే ఒక్కసారి. 2016 జనవరి 20 అని గుర్తు.మావోయిస్టుల తో సంబంధాలున్నాయన్న నెపం మీద   2014 మే 9 న కిడ్నాప్  చేయబడి ఆ తరువాత తప్పుడు ఆరోపణలతో నాగపూర్  జైలు నిర్బంధంలో ఉంచబడిన సాయిబాబా  బెయిల్ మీద వచ్చి  వైద్యం కోసం కేర్  ఆసుపత్రిలో ఉన్నప్పుడు చూడటానికి ప్రరవే మిత్రులం కొందరం కలిసి వెళ్ళాం. ఆసుపత్రి పడకమీద అనారోగ్యాన్ని ధిక్కరించే చిరునవ్వు ముఖంతో ఆయన మాతో మాట్లాడాడు. అప్పుడు కూడా ఆయన  వూరికే లేడు. గుగి వా థియాంగో రచన – డ్రీమ్స్ ఇన్ ఏ టైమ్ అఫ్ వార్- చైల్డ్ హుడ్ మెమరీస్ – కు నాగపూర్ జైలు అండా సెల్ లో ఉండి తాను చేసిన తెలుగు అనువాదం తొలి ప్రూఫ్ లు చూసుకొంటున్నాడు. 

జీవిత ఖైదు శిక్ష ఖరారై సాయిబాబా  నాగపూర్ జైలు అండా సెల్ నిర్బంధం అనుభవిస్తున్న తొలినాళ్లలో (2017 సెప్టెంబర్)  “యుద్ధకాలం లో స్వప్నాలు బాల్య జ్ఞాపకాలు” అనే పేరుతో ఆ అనువాదం మలుపు ప్రచురణగా  వచ్చింది. దానికి ‘వలసభావ సంకెళ్లు తెంచిన  గుగి తో నా పరిచయం’  అనే శీర్షికతో సాయిబాబా వ్రాసిన ముందుమాట చదివి గుగి గురించే కాదు సాయిబాబా గురించి కూడా ఎన్నో విషయాలు తెలుసు కొన్నాను. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను.  

సాయిబాబా 1990 లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంగ్లీషు సాహిత్య విద్యార్థి అని తెలిసినప్పుడు ఆ సమయంలో స్త్రీల సమస్యలపై సమావేశాలకోసమో, సాహిత్య సదస్సుల కోసమో సెంట్రల్ యూనివర్సిటీ కి తరచు వెళ్తుండే నాకు సాయిబాబా ఎక్కడైనా తటస్థపడి ఉంటే, పరిచయం అయి ఉంటే ఎంత బాగుండేది! అనిపించింది.  ఆయన చదువుతున్న సమయంలోనే నేనూ  గుగి ని చదివాను కదా అని సంతోషం వేసింది. మట్టికాళ్ళ మహారాక్షసి నన్ను మరీ వెన్నాడిన నవల. నా స్నేహితురాలు జ్యోతిరాణి నేనూ ఆ నవల గురించి ఎంత ఇష్టంగా, ఎంతగా  మాట్లాడు కున్నామంటే మహిళాచైతన్య కోణం నుండి ఒక వ్యాసం వ్రాయకుండా ఉండలేకపోయాం. 

ఢిల్లీ లో జాతుల సమస్య పై ఎ ఐ పి ఆర్ ఎఫ్ సంస్థ నిర్వహించిన సదస్సులో( 1996 ఫిబ్రవరి) సాయిబాబా అధ్యక్షతలో  గుగి ప్రసంగించాడు. అప్పుడే గుగి  ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి ఉత్తర తెలంగాణలో పర్యటించాడు. కాకతీయ యూనివర్సిటీలో కాసేపు ఆగి, విద్యార్థులను, అధ్యాపకులను సంబోధించి మాట్లాడి వెళ్ళాడు. అలా నేను కూడా అప్పుడే గుగిని చూసాను. విన్నాను. ఆ విధంగా గుగి సాహిత్యం  సాయిబాబా వ్యక్తిత్వంతో, దృక్పథంతో  కలిసే నాకు గుర్తుండి పోయింది. 

1997 డిసెంబర్ 28 నాడు  ప్రజాస్వామిక ఆకాంక్షగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆశిస్తూ ‘వరంగల్ డిక్లరేషన్’ ను ఆవిష్కరించిన చారిత్రాత్మక  వరంగల్ సదస్సు నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రాంతీయ అసమానతల గురించిన అధ్యయనాల వైపు నా చూపు తిప్పింది. నా కార్యరంగం సాహిత్య బోధన, పరిశోధన కనుక మూడు నెలలు తిరగకుండా 1998 లో కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగంలో తెలంగాణ సాహిత్యం మీద ఒక సదస్సు నిర్వహించటానికి  అది నాకు తక్షణ ప్రేరణ అయింది. ఆ సదస్సులోనే మేము తెలుగు విభాగంలో ప్రాంతీయ సాహిత్య అధ్యయనం ఒక పేపర్ గా ప్రవేశ పెట్టటానికి  తీర్మానం కూడా చేసాం. ఆ ప్రకారమే  సిలబస్ రూపొందించి తరువాతి విద్యా  సంవత్సరం నుండి  తెలంగాణ సాహిత్యం పేపర్ బోధించటం మొదలుపెట్టాం. అప్పటినుండి తెలంగాణ సాహిత్యానికి విద్యావిషయక గౌరవం కల్పించటానికి, తెలుగు సాహిత్య చరిత్రలో ఖాళీలను తెలంగాణ సాహిత్య సేకరణ విశ్లేషణల ద్వారా పూరించటానికి పని చేస్తూనే వచ్చాం. నన్ను అంతగా ప్రభావితం చేసిన 1997 డిసెంబర్  వరంగల్ డిక్లరేషన్ సదస్సు నిర్వహణలో కీలకపాత్ర  సాయిబాబా ది అని  ఆలస్యంగా  తెలిసింది. అప్పుడే తెలిసి ఉంటే తెలుగువిభాగం నిర్వహించిన తెలంగాణా సాహిత్యం సెమినార్ వేదిక మీద వరవరరావు, కాళోజి తో పాటు ఆయన కూడా ఉండేవాడు కదా అనిపించింది. 

2

సాయిబాబా కంటే ముందే  నేను వసంతకుమారి గురించి విన్నా. 2014 సెప్టెంబర్ 13, 14 తేదీలలో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఢిల్లీ లో స్థానిక సాహిత్య సంస్థల సహకారంతో , కేంద్ర సాహిత్య అకాడెమీ సౌజన్యంతో “భారతీయ భాషలలో స్త్రీల సాహిత్యం – నిన్న – నేడు- రేపు” అనే అంశంపై రెండు రోజుల సాహిత్య సదస్సు నిర్వహించింది. ఆ సందర్భంలో ఢిల్లీలో ప్రరవే  కలుపుకొనిరావలసిన  స్త్రీలలో వసంతకుమారి పేరు చెప్పింది రత్నమాల. మహిళా సంఘాలలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉందని కూడా అప్పుడే తెలిసింది. అందరం ఆమెను కలుసుకొనటానికి ఉత్సాహపడ్డాం. మరి అప్పుడు వసంత వూళ్ళో లేదో ఏమో మేము ఆమెను కలవనే లేకపోయాం. మరో ఆరు నెలలకు  కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం పై  సదస్సు కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను,  మల్లీశ్వరి, ఎన్. వేణుగోపాల్  కలిసి వసంత ఇంటికి వెళ్ళాం. అప్పటికి సాయి బెయిల్ మీద వచ్చినట్లు లేదు. వసంతతో, మంజీర తో కాసేపు మాట్లాడి వచ్చాం. మళ్ళీ వసంతను కేర్ హాస్పటల్ లో కలవటమే. ఆ తరువాత సాయిబాబా విడుదలను కోరుతూ తెలుగు ప్రాంతాలల్లో జరిగిన అనేక సభలకు వసంత వచ్చేది. అలా వరంగల్ కు కూడా వచ్చింది. అప్పుడు తనతో పాటు  నేనూ వున్నాను. అప్పుడప్పుడు ఫోన్లు, మెసేజ్ లు..  నాగపూర్ కు ఢిల్లీకి హైద్రాబాదుకు  ఆమె చేసిన ఎడతెగని ప్రయాణాలు, సాయిబాబా ఆరోగ్య పరిస్థితిని, జైలు దుర్భరత్వాన్ని తెలియ చేస్తూ పెట్టె పోస్థులు సామాజిక మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉండేవి.  

ఆరడుగుల అండా సెల్ లో కనీస అవసరాలు తీర్చుకొనటానికి, కనీస సౌకర్యాలు,  అవసరమైన వైద్య సహాయం పొందటానికి నిరాకరించబడిన సాయిబాబా మృత్యువు సరిహద్దులకు నెట్టబడుతూ  కూడా జీవితాన్ని గురించి ఆలోచించటానికి, బతకటానికి మానసిక శక్తులను  కూడగట్టుకొని  చేసిన ఆంతరిక  పోరాటం అద్భుతమైంది. “సౌందర్యంతో ప్రేమ బంధం ఉన్నవాళ్లు ప్రజలతో రక్తబంధం ఉన్నవాళ్లు”  బతకటం గురించి ఆలోచిస్తారని, ఆలోచించాలని తెలిసిన యుద్ధకాలపు మానవుడు అతను. ఆ సౌందర్యత్మక తాత్విక జీవిత దృక్పథమే ఆయన ను కవిని చేసింది. 

తెలుగు వాడై జైలు నిబంధనల కారణంగా ఇంగ్లీష్ లో ఆయన వ్రాసిన కవితలు తెలుగు చేయబడి  ‘ నేను చావును నిరాకరిస్తున్నాను” అనే సంపుటిగా 2019 ఫిబ్రవరిలో అచ్చయింది.  అదే నెల చివరిలో  సాయిబాబా కవిత్వంతో పాటు వరవరరావు సహచరులు పుస్తకాన్ని ఆవిష్కరించటానికి విరసం వరంగల్ లో ఒక సభ పెట్టింది. వరంగల్ కవులు రచయితలు అధిక సంఖ్యలో వచ్చిన ఆ సభను జరగకుండా చేయటానికి  సమావేశ స్థలం ఇచ్చిన ప్రెస్ క్లబ్ వారు హాల్ ప్రవేశ ద్వారానికి తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. జైలులో ఉన్న సాయిబాబాకు, వరవరరావు కు ప్రభుత్వం ఎంత భయపడుతున్నదో, వాళ్ళ పేరు మీద రచయితల సమీకరణ వాళ్లకు ఎంత ఆందోళన కారకామో స్పష్టమైన సందర్భం అది. అయినా ప్రభుత్వం సృష్టించిన ఆ అవరోధాల మధ్యనే తాళాలు  వేసిన తలుపుల ముందర పుస్తకావిష్కరణ చేసి బిల్డింగ్ బయట ఖాళీ స్థలంలో కుర్చీలు, మైకు వంటివి లేకపోయినా వచ్చిన వాళ్లంతా అలాగే నిల్చుని వింటుండగా రెండుగంటలకు పైగా ఆ రెండు పుస్తకాల గురించి మాట్లాడుకున్న ఆ నాటి అనుభవం ఇప్పటికీ , ఎప్పటికీ మర్చిపోలేనిది. 

ఆ నాటి నుండి నిర్బంధంలో నానాటికి దిగజారిపోతున్న సాయిబాబా, వరవర రావుల ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ విడుదలకు ఒత్తిడి తేవలసిందిగా రచయితల సంతకాల సేకరణ చేయటం,  ముఖ్యమంత్రికి , తెలంగాణా ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు, అధికారులకు వినతి పత్రాలు సమర్పించటం మిగిలిన ప్రాంతాలలో వలెనె వరంగల్ లోనూ ఒక నిరంతర  కార్యక్రమం అయింది. ఆ రకంగా  సాయిబాబా మా ఆలోచనలో, అంతరంగం లో అత్యంత సన్నిహితుడయ్యాడు. ఆయన విడుదల తీర్పు వచ్చాక కూడా బయటకు వచ్చేవరకు సంతోషపడటానికి కూడా సందేహించామంటే, విడుదలయ్యాక  నిర్బంధం అపహరించిన ఆయన  పదేళ్ల విలువైన జీవితం గురించి దిగులుపడ్డామంటే  అది సాయిబాబా హృదయానికి దగ్గరైనవాడు కనుకనే. 

నిర్బంధాన్ని ధిక్కరించటానికి, చావును నిరాకరించటానికి సర్వశక్తులు కూడగట్టుకొని చేసిన పదేళ్ల పోరాటం గురించి చెప్తూ సాయిబాబా ఒక ఇంటర్వ్యూ లో పదేళ్లు అనేది ఒక మనిషి జీవితంలో పెద్ద భాగమే అని అందులో తనలాంటి శారీరక వైకల్యం, అనారోగ్యం ఉన్నవాడికి ఒక నెల అంటే  ఒక ఏడాది కింద లెక్క అని, ఆ రకంగా తన నిర్బంధ కాలం  ఏడాదికి పన్నెండు చొప్పున పదేళ్లకు ఎన్ని సంవత్సరాలు అవుతుందో చూసుకోమన్నాడు. ఆ సుదీర్ఘకాలపు శారీరక మానసిక ఒత్తిడిలో కూడా  మెదడును  దృఢంగా, సృజనాత్మకంగా మరింత పదునెక్కించుకోగలిగాడు కానీ లోలోపల నుండి శిధిలమవుతున్న శరీరాన్ని కాపాడుకొనటం ఆయన చేతుల్లో లేకపోయింది. తత్ఫలితమే ఆయన అకాల మరణం. 

జాతుల సమస్య , ప్రాంతీయ అసమానతలు మాత్రమే కాదు, ఆదివాసీల హననం అన్నీ సహజ వనరుల పంపిణీ అసమానతల దోపిడీ మూలాలే అని గుర్తించి అంతర్జాతీయ స్థాయి చర్చకు వాటిని తీసుకువెళ్లిన వాడు సాయిబాబా. సమీకరణ, నిర్వహణ, సందేశాన్ని గురిచూసి ప్రజా సమూహాల లోకి  వ్యాపింపచేయటం సాయికి పట్టుబడ్డ విద్యలు అని క్రమంగా తెలుస్తూ వచ్చింది. పుట్టుకతో వచ్చిన కోస్తాఆంధ్ర మూలం నుండి తెలంగాణ కోసం నిలబడటం, ఆదివాసీలను నిలబడ్డ నేలకు పరాయీకరించే  మైదానప్రాంత బహుళ జాతి కంపెనీల కొండచిలువ  తత్వానికి ఎదురొడ్డటం, దేశీయ ఉద్యమాలకు అంతర్జాతీయ లంకెలు ఏర్పరచటం సాయిబాబాను విశ్వనరుడిగా చేశాయి. అంతర్జాతీయ పీడిత ప్రజా ప్రతిఘటనలలో భాగమైనవాళ్లు, వాళ్ళ పక్షాన నిలబడిన విద్యావంతులు, అధ్యాపకులు, మేధావులు , రచయితలు, కళాకారులు ఏదేశం వాళ్ళైనా సాయిబాబాను తమవాడనే అనుకొంటారు. అటువంటి వ్యక్తిత్వం తో జీవించిన సాయిబాబా ‘మరణం లేని మందహాసం’.  ‘మొలకెత్తే గడ్డి సవ్వడులు’ లో   సాయిబాబా సర్వనామమై నిత్యం ఉదయించే సూర్యుడౌతాడు. 

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply