మృత్యువుతో నేను మరణిస్తానని చెప్పిందెవ్వరు
నేనొక నదిని, సముద్రంలోకి ప్రవహిస్తాను
– నదీమ్ కాశ్మీ
‘అగ్గో గా బాగోతులాయన గిట్ట కొట్టుకుంటు వస్తుండు సూడు.’ ఆ బాగోతులాయన నాలుగు సంవత్సరాల క్రితం మే 5 న ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో గుండెపోటుతో చనిపోయాడు. ఆ మరణం అనేకమందిని నివ్వెరపరిచింది. కుదిపివేసింది. అకస్మాత్తుగా అలా తాను కన్నుమూస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ‘బాగోతులాయన’ అని అరుణోదయ రామారావుకు పేరుపెట్టిన మనిషి ఓంకార్. అట్లా ఆయన అనేకమందికి పేర్లు పెట్టాడు. ఆయన పెట్టిన పేర్లు వాళ్లకు సరిగ్గానే నప్పేవి కూడా. ఆ ఓంకార్ మే 1 న నిమ్స్ ఆసుపత్రిలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడంతో చనిపోయాడు. మోకాలు కింద వరకూ తన కాలును తీసేశాక, ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో తాను కన్నుమూశాడు. ఓంకార మరణం కూడా తనని అభిమానించే మిత్రులు అనేక మందిని దిగ్భ్రాంతికి లోను చేసింది. ఆ మిత్రులలో కొంతమంది తనని ముందు రోజే ఆసుపత్రిలో కలిశారు. చనిపోయిన ఆ రోజే, కొన్ని గంటల ముందే కలిసిన మిత్రులు కొందరున్నారు. కొన్ని నిమిషాల ముందే మాట్లాడిన వాళ్ళున్నారు. కాలు కొంత తీసేయాల్సి వచ్చినా, తాను ఇంకా కోలుకుంటాడనే అందరూ భావించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి బయటకు రావలసిన మనిషి తిరిగి రాకుండా తుది శ్వాస విడిచాడు. వాళ్ళు ఇద్దరూ చనిపోయిన ఆ రెండు రోజులకూ చారిత్రక ప్రాధాన్యత ఉండడమన్నది యాదృచ్చికంగా విషయమే. అరుణోదయ రామారావు చనిపోయిన మే 5, కార్ల్ మార్క్స్ జన్మదినం కాగా, ఓంకార్ కన్ను మూసింది అంతర్జాతీయ కార్మిక దినం మే 1 న.
ఓంకార్ చనిపోయిన ఆ రోజు ఉదయాన ఆరు గంటలకే నాకు ఫోన్ చేశాడు. టీ తాగావా, ఈ రోజు డిశ్చార్జ్ అవుతున్నట్లేనా అని నేను అడిగాను. ముందు రోజున, మేము తనని కలిసినప్పుడు రెండు యూనిట్ల రక్తం ఎక్కించిన విషయం మాత్రమే చెప్పాడు. తన గొంతు కొంత బలహీనంగా అనిపించింది. ఉదయాన్నే ఎందుకు ఫోన్ చేశాడో నాకు అర్ధం కాలేదు. ఆ తర్వాత నలభై ఐదు నిముషాలలోనే మరో ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడాడు. వెళ్ళిపోబోయే ముందు వీడ్కోలు పలకడానికా? ఏదో కీడును శంకించిన అనుమానమా? ఒక కవి చెప్పినట్లు, ‘చావు అంటే భయం లేదు నాకెన్నడూ, నిన్ను విడిచి పోవాలంటేనే భయం’. ఎడమ పాదంలో కొంత భాగాన్ని తొలగించిన తర్వాత ఆ విషయాన్ని అంగీకరించడానికి ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ మోకాలు కింది భాగాన్ని తొలగించడంతో బాగా కుంగిపోయాడు. తాను చనిపోయాడన్న వార్త అందగానే, ఆ సాయంత్రం హడావుడిగా ఐదుంబావుకు ఆసుపత్రికి చేరుకున్నాక ఛాతీ కదులుతున్నట్టు కనిపించింది. చివరి ఆశతో డాక్టర్లని చూడమని అడిగితే, హృదయ స్పందన ఆగిపోయిన విషయం రూఢి అయింది. తనని కాపాడడానికి వాళ్ళు ప్రయత్నం చేసినా లాభం లేక పోయింది. తాను ఇక తిరిగి రాడు. ఒక అద్భుతమైన మనిషినీ, స్నేహితుడినీ మనమంతా పోగొట్టుకున్నాము.
తాను ఒక అద్భుతమైన మనిషి కాబట్టే, తన గురించీ, తన జీవితం గురించీ, తన కృషి గురించీ మనం మాట్లాడుకోవాలి. నేను మొదటిసారి ఓంకార్ ని ఎప్పుడు కలుసుకున్నానో నాకు గుర్తులేదు. జాగ్రఫీ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో చేరిన 1970ల చివరలోనే మేము కలిసి ఉండాలి. నేను 1971-73 మధ్య గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్నప్పుడు, జాగ్రఫీ నేను చదువుకున్న అంశాలలో ఒకటి. జాగ్రఫీ డిపార్టుమెంట్ లో విద్యా బోధనా గురించి నేనూ ఓంకార్ ఆ తర్వాత రోజులలో మాట్లాడుకున్నాం. ప్రొఫెసర్ మన్సూర్ ఆలం ఆ సబ్జెక్టును అద్భుతంగా బోధించేవాడని ఇద్దరమూ అనుకున్నాము.
చాలామంది లాగా, ఓంకార్ తో నా పరిచయం కూడా ఆ నాడు విద్యార్థి ఉద్యమాన్ని నడిపించిన పి డి ఎస్ యు సంస్థ ద్వారానే జరిగింది. ఉపన్యాసాలు ఇవ్వడం, ఊరేగింపులు నాయకత్వం వహించడం చేసిన నాయకుడు కాదు ఓంకార్. ఒక భిన్నమైన కోవకు చెందిన, వాల్ రైటింగ్, బ్యానర్లు, పోస్టర్లు రూపొందించే కృషిలో ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పనిచేసిన ప్రచార కార్యకర్త తాను. విపరీతంగా శ్రమించాల్సిన కృషి ఇది. పి డి ఎస్ యు బిగి పిడికిలి గుర్తును చిత్రించింది ఓంకారేనన్నది మనందరికీ తెలిసిన విషయం. 1990 లలో మా అనుబంధం మరింత పెరిగింది. మా సంస్థ, 1989 అసెంబ్లీయే ఎన్నికలలో సిరిసిల్ల నియోజక వర్గం నుంచి ఎన్ వి కృష్ణయ్యని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది. ఎన్ వి కృష్ణయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 168 వ నెంబరు క్వార్టర్ తనకు కేటాయించారు. ఈ ఆఫీసు బాధ్యతలను ఎవరు నిర్వహించాలనే చర్చ వచ్చింది. ఓంకార్ పేరు అందుకు ఎవరు ప్రతిపాదించారో నాకిప్పుడు గుర్తు లేదు కానీ, ఆ బాధ్యత నిర్వహించాలనే ప్రతిపాదనతో నేను తనతో మాట్లాడినప్పుడు తాను అందుకు అంగీకరించాడు. తర్వాతి కాలంలో నన్ను తాను తిట్టుకొని ఉండవచ్చు గానీ, ఆ నాలుగైదు సంవత్సరాల కాలం మాత్రం ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి. అదొక కీలకమైన దశ. ఓంకార్ ఆ కీలక దశలో తన బాధ్యతలని నిర్వహించాడు. కమ్యూనిస్టు విప్లవ సంస్థలు కొన్ని సిపిఐ(ఎం.ఎల్) జనశక్తిగా ఐక్యమయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత సమస్య నుండి, అధిక ధరల దాకా అనేక ప్రజా సమస్యలపై హైదరాబాద్ లో భారీ ప్రదర్శనలూ, బహిరంగ సభలూ జరిగాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే క్వార్టర్ జనంతో నిండి కిటకిటలాడేది. అక్కడే ఉండే ఓంకార్ కి ఒక్కోసారి ముందు గదిలో కూర్చునే చోటు కూడా ఉండేది కాదు. విప్లవ కార్యకర్తల ఎన్ కౌంటర్ హత్యలు నిత్యం వరసగా జరుగుతూ ఉండేవి. ఆ వార్తలు, సమాచారం ప్రభావం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసుపైనా ఉండేది. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసు బాధ్యతలతో ఉన్న ఓంకార్ ఈ ఘటనలకు ఎన్నడూ చెదిరిపోలేదు, బెదిరిపోలేదు. ఆ కాలం సంస్థలో చీలికలతో నిర్మాణం దెబ్బతినడం మొదలైన సమయం కూడా. అది ఎందరో కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసింది. 1994 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసు లేకుండా పోయింది. నాలుగైదు సంవత్సరాలు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆఫీసు బాధ్యతల నిర్వహణతో అకడమిక్ ఉద్యోగ ప్రయత్నాలని పక్కన పెట్టిన ఓంకార్ తిరిగి ఆవైపు ప్రయాణం సాగించాడు.
ఏదో ఒక సభ కోసం పెదాల మధ్య వెలుగుతున్న సిగరెట్, చేతిలో కుంచెతో బ్యానర్ పై అక్షరాలకి రంగులు దిద్దేపని నిమగ్నమైన ఓంకార్ ని ఇప్పటికీ చాలా మంది గుర్తుచేసుకుంటారు. తన పనిలో ఎవరైనా వేలు పెట్టే ప్రయత్నం చేసినవాళ్ళెవరైనా, తనతో తిట్లు తినవలసిందే. ఆ రోజులలో పనిగట్టుకుని తనని రెచ్చగొట్టి తనదైన శైలిలో ఓంకార్ తిడితే, తనతో తిట్టించుకోవాలని ఉబలాటపడే యువ కార్యకర్తలు కూడా కొందరు ఉండేవాళ్ళు. సామెతలు, వ్యంగ్యం కలగలిసిన ఆ పరుషపు మాటల వెక్కిరింతలని వినడం ఒక ముచ్చట. మాటకు మాటతో తిప్పికొట్టే ఆ సంభాషణలలో ఏదో సౌందర్యం ఉట్టిపడేది.
అవసరమైన వాళ్లకి సహాయం చేయడానికి ఓంకార్ ఎంతటి శ్రమకైనా సిద్ధంగా ఉండేవాడు. యూనివర్సిటీలో సహాయం ఏదైనా కావాలంటే ఓంకార్ ఆ పని చేసి పెట్టేవాడు. 1975లో యూనివర్సిటీలో ఎం ఏ పూర్తిచేసిన స్నేహితురాలు ఒకరు పదిహేను సంవత్సరాల క్రితం తన డిగ్రీ సర్టిఫికెట్ అవసరమై అడిగితె, ఓంకార్ ఆ సర్టిఫికెట్ సంపాదించి ఆమెకు తెచ్చి ఇచ్చాడు. 1969లో బి.టెక్ పూర్తి చేసిన ఒక స్నేహితుని బంధువుకు డిగ్రీ సర్టిఫికెట్ అవసరమైంది. ఆ సర్టిఫికెట్ ను ఆయన యూనివర్సిటీ నుంచి తీసుకోనేలేదు. ఓంకార్ ని అడిగితె, ఆ సర్టిఫికెట్ కూడా సంపాదించి పెట్టాడు.
ఓంకార్ ఒక ప్రత్యేకమైన కోవకు చెందిన వ్యక్తి. ఆ ప్రత్యేక వ్యక్తిత్వమే తనకు సహాయపడే అనేకమంది మిత్రులని సంపాదించిపెట్టింది. ఓంకార్ వామపక్ష విప్లవ రాజకీయాలను నమ్మిన వ్యక్తి. అయితే, తన మిత్రులలో అందుకు భిన్నమైన భావాలను విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు. అవతలి శిబిరంలో కూడా ఓంకార్ ని గౌరవిస్తారు.
ఓంకార్ నిన్ను నిన్నుగానే గుర్తుంచుకుంటాము, తలచుకుంటాము. నిన్ను చూస్తాము, నీ మాటలు వింటాము, నీ ముచ్చట్లని, జవాబులని ప్రోది చేసుకుని, గుర్తు చేసుకుంటూ ఉంటాము. మిత్రమా, నీకు వీడ్కోలు.. కానీ నీకిది వీడ్కోలు పలకడం కాదు కూడా..
నీకిదే వీడ్కోలు, కానీ ఇది వీడ్కోలు కాదు
నీ గురించిన ప్రియమైన తలపులు అన్నీ
నా హృదయంలో నిలిచి ఉంటాయి
ఆ జ్ఞాపకాలే నను ఓదార్చుతాయి
– ఆన్ బ్రాన్ట్