మన భారతదేశం గర్వించదగిన ముగ్గురు అద్భుతమైన మహిళా దర్శకులు!

మన భారతదేశంలో అనేకమంది మహిళలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ వారి నైపుణ్యాలు పురుషాధిపత్యం ముసుగులో బయటికి రాలేదు. నేటి అత్యాధునిక ప్రపంచంలో మూడు చిత్రాలు అంతర్జాతీయ నామినేషన్లను, అవార్డులను గెల్చుకున్న తర్వాత కూడా వారి ప్రతిభను గుర్తించడానికి స్వదేశీయులకి గొంతులో వెలక్కాయ అడ్డుకున్నట్లుగా వాటిని థియేటర్లలో విడుదల కానివ్వడం లేదు. కానీ ముగ్గురు మహిళా దర్శకులు 2024 సంవత్సరంలో సాధించిన అంతర్జాతీయ నామినేషన్లను, ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు. ఈ 2024 సంవత్సరంలో వీరు సాధించిన ఘనకీర్తిని, ప్రతిభను గుర్తించే పురుషులతో పాటు మహిళాలుగా మనందరం, శాశ్వతంగా గుర్తుంచుకుని సంబర పడదాం!  

1.“ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్” – పాయల్ కపాడియా రచన, దర్శకత్వం వహించిన తొలి చిత్రం; ఇది ఫ్రాన్స్, భారతదేశం, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, ఇటలీలతో కూడిన అంతర్జాతీయ సహ నిర్మాణం.   

2. “గర్ల్స్ విల్ బి గర్ల్స్”- శుచి తలాటి దర్శకత్వం వహించిన ఇండో-ఫ్రెంచ్ సహ నిర్మాణం.

3.“లప్పట లేడీస్” – కిరణ్ రావు దర్శకత్వం వహించిన జియో స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్, కిండ్లింగ్ పిక్చర్ సంయుక్త నిర్మాణం.   

ఈ మూడు సినిమాలలో కూడా ముఖ్యమైన అంశం ఏమిటంటే – పితృస్వామ్య ప్రవర్తనల చిత్రణ, సమాజం అలాంటి ప్రవర్తనను అంగీకరించడం, వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీల జీవితాలను ప్రభావితం చేసే అతి సూక్ష్మమైన సమస్యలు, స్త్రీల ప్రతిఘటన, ప్రేమ, కోరిక, స్త్రీ లైంగికతల భావోద్వేగాలను సరళమైన, శక్తిమంతమైన రీతిలో హృద్యంగా చిత్రీకరించారు!

మలయాళీ చిత్రం దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారతదేశానికి ఒక అద్భుతమైన అవార్డుని సంపాదించిపెట్టిన సినిమా “ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్” గురించి, అందుకు ఎంతగానో కృషి చేసిన పాయల్ కపాడియా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి!

ఇతివృత్తం; “ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్” చిత్రం గురించి చెప్పాలంటే, చిన్న గ్రామాలు, పట్టణాల నుండి పెద్ద నగరానికి వచ్చి నర్సులుగా పనిచేస్తున్న ముగ్గురు మహిళల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రామిక మహిళలకు వసతి సమస్యలు, తక్కువ జీతాలు, పని-జీవిత సమస్యల మధ్య సమతుల్యతల ఇబ్బందులు, పురుషాధిపత్యం, పెట్టుబడిదారుల అహంకారాలు-వాటిని మహిళలు ఎదుర్కొన్న విధానాలు  ఈ సినిమాలో చిత్రీకరించబడ్డాయి.

కథన శైలి; ఈ చిత్రం లోని ప్రధాన పాత్ర ప్రభ కేరళ నుంచి వచ్చి ముంబై లోని ఒక హాస్పటల్లో నర్సుగా అంకితభావంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తుంటుంది. ఎప్పుడూ అలసటగా కనిపిస్తుంది. వివాహమైన ఒక “ఒంటరి” మహిళగా నవ్వు అనేది ముఖంలో కనిపించకుండా భారంగా, దిగులుగా రోజులు గడుపుతూ ఉంటుంది. లోకల్ ట్రైన్ లో ఆఫీసుకి వెళ్ళి వస్తూ ఉంటుంది.  ఆమె భర్త భారతదేశం నుంచి వెళ్లి విదేశాలలో ఉంటాడు. అతను ఏ దేశంలో ఉన్నాడో మనకి తెలియదు. ఏమి ఉద్యోగం చేస్తున్నాడో, అతని రోజువారీ దినచర్య ఏమిటో అనే విషయాలు ఆమెకు కూడా తెలియవు. ఇక ప్రేక్షకులకు తెలిసే అవకాశమే లేదు. ఒక సంవత్సరం గడిచిపోతుంది. భర్త రాక గురించి నిరీక్షిస్తున్న ప్రభ ఉంటున్న రూమ్ అడ్రసుకి ప్రభ పేరుతో ఒకరోజు ఒక ప్రెషర్ కుక్కర్‌ పోస్ట్ లో వస్తుంది. అప్పుడు ఆమె అనుభవించే భావోద్వేగాలు ప్రేక్షకులకు చాలా బాధాకరంగా కనిపిస్తాయి. దానిని ఎవరు పంపించారు అనే సూచన ఏమీ ఉండదు. తయారీ ముద్ర నుండి, కుక్కర్ జర్మనీకి చెందినదని ప్రభకు, ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. కుక్కర్‌ ని స్పర్శిస్తున్నప్పుడు ఆమె అనుభూతి చెందుతున్న ప్రేమ, ఆందోళనల సంబంధాన్ని తెలియజేస్తుంది. తన భర్తతో ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా దూరంగా ఉండటం వల్ల ఆమెలో కలిగే బాధ ప్రభ ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఆమె హాస్పటల్లో పనిచేసే మనోజ్ అనే ఒక డాక్టర్, ఆమెకు వివాహమయిందని తెలిసినప్పటికీ అతను తన భావోద్వేగ సంబంధాన్ని ఆమెతో పంచుకుంటాడు. అప్పుడు, ప్రభ పడే ఆందోళన మరింతగా ప్రేక్షకులకు ప్రముఖంగా కనిపిస్తుంది. ఆమె వివాహిత అయినందువల్ల సున్నితంగా తిరస్కరించి, ఆమె అతని సహవాసాన్ని విడిచిపెడుతుంది. తన కంపెనీని విడిచిపెట్టమని ప్రేరేపించినప్పుడు, ఆమె ప్రేమించగలదా లేదా అనే సందిగ్ధత మనకి తెలుస్తుంది.  

ప్రభ లాగే కేరళ నుంచి వచ్చిన అను అనే యువతి కూడా ప్రభ చేసే హాస్పటల్లోనే నర్సుగా పని చేస్తూ ఉంటుంది. ఆమె ఒక ముస్లిం యువకుడు షియాజ్ ని ప్రేమిస్తుంది. ఆమె ఇంట్లో అతనితో పెళ్ళికి ఒప్పుకోరని ఆమెకు బాగానే తెలుసు. ప్రభ, అను భాగస్వాములుగా వీళ్ళిద్దరూ ఒక ఇంటిని షేర్ చేసుకుంటారు. ముంబై నగరం చాలా అట్టహాసంగా ఎవరైనా స్వేఛ్చగా ప్రవర్తించడానికి వీలుగా ఉంటుంది అన్నట్లే అందరికీ అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరికీ శారీరకంగా కలిసే వీలే ఉండదు!

వీరిద్దరిలాగే కొంకణి ప్రాంతం నుంచి వచ్చిన పార్వతి, అదే హాస్పటల్లో వంట చేస్తూ ఉంటుంది. ఆమె భర్త పనిచేసే కాటన్ మిల్లు మూతపడినప్పుడు, యజమానులు అతనికి  పేదవాళ్ళు ఉండే ఒక చౌకబారు ఇంటిని ఇస్తారు. పార్వతి భర్త చనిపోతాడు. ఆమె ఉంటున్న ఇంటిని కూల్చివేసి ఒక పెద్ద భవనం నిర్మించాలనుకునే పెట్టుబడిదారుడి దాహానికి భయపడి, ముంబైలో ఉండడానికి కనీసం తన ఇల్లయినా ఉంటుందో లేదోనని బాధపడే పార్వతిని ఒక హక్కుల లాయర్ దగ్గరికి తీసికెళ్తుంది ప్రభ. ఆమె దగ్గర అవసరమైన పేపర్లేమీ లేని కారణంగా కేసు నిలవదని తేల్చేస్తాడు లాయర్. ఇక మూటా ముల్లే సర్దుకుని పార్వతి తన ఉద్యోగాన్ని వదిలి, రత్నగిరి సమీపంలోని తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె మకాం మార్చడానికి సహాయం చేయడానికి ప్రభ, అను ఆమెతో పాటు ఆమె గ్రామానికి ప్రయాణిస్తారు. ముగ్గురు మహిళలు కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్ అద్భుతంగా వారి పాత్రల్లో జీవించారు. ఇక మిగిలిన కథనం కోసం ఇంత గొప్ప సినిమాని ప్రేక్షకులు తమ కళ్ళతో వీక్షించాల్సిందే!

ఈ చిత్రంలో పాయల్ కపాడియా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామని, పెద్ద పెద్ద మాల్స్, మెట్రో రైళ్ళూ, మహా ఆర్భాటంగా నిర్మించి, కోట్లాది సన్యాసులతో బాల శ్రీరాముడి ప్రతిష్ట చేసిన ఆలయమూ, కాశీ కారిడార్లూ, ఆకాశాన్ని తాకుతున్నట్లుండే విగ్రహాలూ చూసి దేశం అతి వేగంగా ప్రగతి పథం వైపు పయనిస్తుందని మనకి నిరంతరం ఊదర కొడుతుంటారు కదా, అసలైన    వాస్తవాలు చూడండి అని విజ్ఞప్తి చేస్తుంది పాయల్ కపాడియా! 

పాయల్ కపాడియా దర్శకత్వ ప్రతిభ గురించి; 2021 లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన, “ఏ నైట్ ఆఫ్ నోయింగ్  నథింగ్” (A night of knowing nothing) 2021 లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ చిత్రం. సినీ విమర్శకులు దీనిని డాక్యుఫిక్షన్ రచన అని అంటారు.  భారతదేశంలోని విశ్వవిద్యాలయ విద్యార్థి జీవితాన్ని గురించి అన్వేషిస్తూ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో చదువుతున్న ఎల్. అనే విద్యార్థిని తన విడిపోయిన ప్రియుడికి రాసిన లేఖల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఆమె అతని ప్రియుని కులానికి చెందినది కాకపోవడం వల్ల, అతని కుటుంబం నుండి అనుమతి లభించకపోవడం, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా అతను ఫిల్మ్ స్కూల్‌ను విడిచిపెట్టవలసి వచ్చిందనేది ఈ  చిత్ర సారాంశం! ఈ

చిత్రం కూడా 2021 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో డైరెక్టర్స్ ఫోర్ట్‌ నైట్ స్ట్రీమ్‌లో ప్రదర్శించబడి, అక్కడ ఇది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా లోయిల్ డి’ఓర్ అవార్డును గెలుచుకుంది. తర్వాత 2021 లోనే టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడి, యాంప్లిఫై వాయిసెస్ అవార్డు విజేతలలో ఒకటిగా నిలిచింది!  

పాయల్ కపాడియా పూనా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విద్యార్ధిని. 2015 లో ప్రభుత్వం గజేంద్ర చౌహాన్ ని పూనా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి కొత్త ఛైర్మన్ గా నియమించింది. అంతకుముందు ఆదూర్ గోపాల కృష్ణన్, గిరీష్ కర్నాడ్, ఆర్ కె లక్ష్మణ్, శ్యామ్ బెనెగల్, యు ఆర్ అనంత మూర్తి  మొదలైన సినీ పండితులు ఛైర్మన్లుగా పనిచేసిన స్థానంలో ఆర్ ఎస్ ఎస్ భావజాలమున్న గజేంద్ర చౌహాన్ ని నియమించడం పట్ల హర్షించని విద్యార్ధులు, ఆయన నియామకానికి వ్యతిరేకంగా నిరసన సమ్మె చేపట్టారు.  ఆ సమ్మెలో క్రియాశీలంగా పాల్గొన్న పాయల్ కపాడియాపై కేసులు నమోదు చేసి, ఆమె స్కాలర్ షిప్ ను  కూడా రద్దు చేసింది ప్రభుత్వం.

ఈ చిత్రం సాధించిన కీర్తి ప్రతిష్టలు;

1994లో స్వాహం అనే మలయాళ చిత్రం తర్వాత భారతదేశం నుండి ప్రధాన పోటీలో, పోటీ పడిన మొదటి చిత్రం ఇది.

ఈ మలయాళీ చిత్రం “ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్” 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రధాన పోటీలో ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. పామ్ డి’ఓర్‌ కు నామినేట్ అయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డు (Grand Prix Award) ను గెలుచుకుంది.

నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూలో  2024లో ఉత్తమ  ఐదు అంతర్జాతీయ చిత్రాలలో ఒకటిగా ఎంపికైంది.

ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది.

ఉత్తమ దర్శకురాలిగా పాయల్ కపాడియా రెండు నామినేషన్లను అందుకుంది.

ఇది ఆంగ్ల భాషా చిత్రం కాకపోయినప్పటికీ కూడా ఉత్తమ చిత్రంగా BAFTA అవార్డుకు కూడా నామినేట్ చేయబడింది. Rotten Tomatoes లాంటి ప్రసిద్ధ రివ్యూల వేదికలో 100 శాతం హిట్స్ కొట్టినప్పటికీ భారతదేశంలో ప్రతిస్పందనలు రావలసినంతగా రాలేదు! అసలు భారతదేశంలోని కేరళలో 21 సెప్టెంబర్ 2024న చాలా పరిమితంగా విడుదలైంది, తర్వాత 29 నవంబర్ 2024న దేశవ్యాప్తంగా విడుదలై ఎన్నో సానుకూల సమీక్షలను అందుకున్నప్పటికీ దీనికి రావలసినంత కీర్తి రాలేదు. ఎందుకంటే ఇది బిజెపి కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రామ్ కే నామ్ లాంటి సినిమాలలాంటి సినిమా కాదు కదా?

అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన తర్వాత ఇక తప్పనిసరైనట్లు, ఎంతో దయతో కేసులు ఎత్తివేయడం, మెచ్చుకోవడం లాంటి కపట చేష్టలు చేయడం మామూలే కదా?

తర్వాత కొలిమి మేగజైన్ లో శుచి తలాటి దర్శకత్వంలో వచ్చిన “గర్ల్స్ విల్ బీ గర్ల్స్”(Girls will be Girls) గురించి తెలుసుకుందాం!

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply