నాకు
రాయినిచూపి
రాముడని నమ్మించి
రాజ్యాలేలేచోట
నేను
రాయిని ‘రాయని’ నిజంమాట్లాడితే
వాని మనోభావాలు
దెబ్బతినవా మరీ
నాకు
మనుధర్మమే
ధర్మమని నమ్మించి
మనుషుల మధ్య
మంటల్నిసృష్టించి
రాజ్యాలేలేచోట
నేను
మనుధర్మం గుట్టువిప్పితే
వాని మనోభావాలు
దెబ్బతినవా మరీ
నాకు
అశాస్త్రీయతను
శాస్త్రీయంగా నమ్మించి
నా అణువణువున
కర్మసిద్ధాంతాన్ని కరిగించి
అందమైన రాజ్యభవనంలో
కునుకుతున్న మనువుకు
నేను
శాస్త్రీయ చెమటల పాటందుకుంటే
వాని మనోభావాలు
దెబ్బతినవా మరీ