మధ్యతరగతి సంస్కారాలను పెంచే  కథలు

కవయిత్రిగా ప్రసిద్ధురాలైన శీలా సుభద్రాదేవి సాహిత్య సృజన వ్యాసంగం  కథ తో మొదలుకావటం విశేషం. శీలా సుభద్రాదేవి 1949 డిసెంబర్ 19 న పుట్టింది. తల్లి రాజరాజేశ్వరి. తండ్రి మల్లికార్జున స్వామి. విజయనగరంలో కలెక్టరాఫీసులో రెవిన్యూ డిపార్ట్మెంట్ లో పని. ఇద్దరు అన్నలు, ఇద్దరు  అక్కల తరువాత చివరి బిడ్డ సుభద్రాదేవి. పెద్దన్న కొడవంటి లీలా మనోహరరావు, చిన్నన్న కొడవంటి కాశీపతి, పెద్దక్క సరళాదేవి ముగ్గురూ రచయితలే కావటం సాహిత్య సృజన వైపుగా సుభద్రాదేవి ఆసక్తుల వికసనానికి దోహదకారి అయింది. అక్క సరళాదేవి కొని ఇచ్చే సోవియట్ ల్యాండ్ వారి పిల్లల బొమ్మల పుస్తకాలు బాల్యంలోనే  అధ్యయన ఆసక్తితో పాటు చిత్రకళాభిరుచికి  పాదులు తీశాయి.   సరళాదేవి ఇంట్లో  చదివిన  ఆధునిక తెలుగు వచన  సాహిత్యం, అనువాదరచనలు ఆమె ఆలోచనలకు పుష్టిని ఇచ్చాయి. కథారచనావైపుకు నడిపించాయి. అలా ఆమె తొలి కథ పరాజిత 1970 లో పొలికేక పత్రికలో ప్రచురించబడ్డది. అప్పటికి ఆమె వయసు 21. 

విజయనగరం మహారాజ కాలేజీలో బీఎస్సీ చదువు పూర్తి అవుతూనే 1971 లో మేనత్త కొడుకు శీలా వీర్రాజుతో సుభద్రాదేవికి  పెళ్లయింది. ఆయన చిత్రకారుడు. కవి  వృత్తిరీత్యా హైదరాబాద్ లో నివాసం. అందువలన  1972 లో సుభద్రాదేవి కూడా హైదరాబాద్ కు  వచ్చేసింది. ఆయన కోసం, ఆయన వేసిచ్చే ముఖచిత్రాల కోసం ఇంటికి వచ్చిపోయే కవులతో సందడిగా , కవితా సంపుటాలతో నిండుగా ఉండే ఇంట్లో సుభద్రాదేవి దృష్టి కవిత్వ సృజన వైపు మళ్లింది. ఆ రకంగా కవితా వ్యవసాయం 1975 నుండి ప్రారంభమైంది. ఆలస్యంగా వ్రాయటం మొదలు పెట్టిన కవిత్వం అయిదేళ్లకే ‘ఆకలినృత్యం’ అనే పేరుతో సంపుటి ప్రచురించేవరకు వచ్చింది. మరొక కవితాసంపుటి ‘మోళీ’  కూడా  ప్రచురించబడిన తరువాత  1990 లో  ఆమె తొలి కథల పుస్తకం ‘దేవుడు బండ’ వచ్చింది. అది వచ్చిన పద్ధెనిమిదేళ్ళకు (2008) రెక్కల చూపులు కథల పుస్తకం వచ్చింది. ఈ రెండు సంపుటాల కథలకు ఆ తరువాత అడపా తడపా వ్రాస్తూ వచ్చిన వాటిని  కూడా చేర్చి ఇప్పటికి ఒక సమగ్ర కథ సంపుటిని ప్రచురిస్తున్నారామె.  

1970 లో కథా రచన ప్రారంభించినా ఈ యాభై నాలుగేళ్ల కాలం మీద  ఇప్పటికి సుభద్రాదేవి వ్రాసిన కథలు నలభై కూడా లేవు. 1970 నుండి 1989 వరకు ఇరవై ఎనిమిదేళ్ల కాలం మీద పన్నెండు  కథలు వ్రాస్తే 1990 నుండి 2008 వరకు పద్దెనిమిదేళ్ల కాలం మీద వ్రాసినవి పద్దెనిమిది కాగా  2009 నుండి 2024 వరకు పదహారేళ్ళ కాలం మీద వ్రాసినవి తొమ్మిది.  “ఒక చిన్న స్పందన, చిన్న సూది మొనంత చురుకు గాయం , ఒకింత గుండె తడి ఒక చిన్న గాలితెర, మరో చిన్న కన్నీటి బిందువు ఏదైతేనేం కదలిక ఉంటె”  కవిత్వం రాయొచ్చు అని సుభద్రాదేవి అభిప్రాయం.  కానీ “కథ రాయాలంటే  మట్టుకు ఒక చిన్న దృశ్యమో సంఘటనో  మాత్రమే చాలదు. దాని  చుట్టూ పాత్రల్ని, సంఘటనల్ని,  సంభాషణల్ని అన్నిటినీ సహజ సిద్ధంగా ఉండేలా అల్లుకుంటూ పోవాలి. అందుకు చాలా సేపు అంతరాయం లేకుండా ఆలోచించే సావకాశం కావాలి. సమయం సమకూర్చుకోవాలి “ అని చెప్పి  అదిలేకనే తాను  కథలకు పనికొచ్చే సబ్జెక్టు మనసులో ఉన్నా ఎక్కువగా రాయ లేక పోయాను”అని  రెక్కలచూపు కథల సంపుటికి వ్రాసిన మాటలలో చెప్పుకొన్నది.   కథలు ఎన్ని వ్రాస్తేనేమి ఆకథల జీవిత సారం, దృక్పథం ఏమిటన్నది ముఖ్యం. 

పంథొమ్మిదివందల అరవై డెబ్బై దశకాలలో కథలు వ్రాసినవాళ్లకు ముఖ్యంగా మధ్య తరగతి వర్గానికి  సంసారాలు,సరదాలు, సమస్యలు సంఘర్షణలు, ఆశలు,ఆశా భంగాలు, త్యాగాలు మొదలైనవి ప్రముఖంగా కథా వస్తువు కావటం చూస్తాం. సిల్కు చీర, మరచెంబు నుండి చిన్న ఇల్లువరకు-  ఇలాంటి వస్తు జాలాన్ని సమకూర్చుకోలేని మధ్యతరగతి జీవుల అసంతృప్తులు వస్తువుగా కథలు అనేకం వచ్చాయి కూడా.  స్త్రీల సాహిత్యం విషయం లోనైతే  అది వంటింటి సాహిత్యం అన్న వెక్కిరింపు కూడా వుంది.  కానీ ఆశ్చర్యంగా అదే సమయంలో  రచన ప్రారంభించిన  సుభద్రాదేవి సాహిత్య వస్తువును  మధ్యతరగతి స్వీయా త్మక అనుభవం నుండి స్వీకరించటాని కంటే సాహిత్య వస్తువు కాగలిగిన అంశాల కోసం సమాజంలోకి  చూడటానికి ప్రాధాన్యత ఇచ్చారు. వైవిధ్య భరితమైన జీవితాన్ని, జీవితం లోని విభిన్న పార్శ్వాలను చూపించటం,  సాధారణ మానవ  సంబంధాలపై అధికారం చలాయించే భావనలను, విశ్వాసాలను విమర్శకు పెట్టటం  సుభద్రాదేవి కథల లక్షణం.  అందుకు   ఆమె మొదటి కథ అపరాజిత ఒక నిదర్శనం. 

అందాలు, ఆకర్షణలు,ప్రేమలు, భావలోక విహారం చేయించే ఇరవైఏళ్ళ నవ యౌవనంలో సుభద్రాదేవి  అందం, అనాకారితనం మధ్య వైరుధ్యాన్ని  వస్తువుగా చేసుకొని  ‘అపరాజిత’  కథ వ్రాయటం విశేషం. అందం పుట్టుకవల్ల, పోషణకు ఉండే అవకాశాలవల్ల లభించేది, వృద్ధిపొందేది. జన్యు లోపాలవల్ల వచ్చే అనాకారితనం, అంగ వైకల్యం  సరైన ఆహారం, వైద్య అవకాశాల లేమి వల్ల మరింత కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి. సంపద లాగానే సౌందర్యం కూడా ఆధిక్యతకు, గర్వానికి కారణం అవుతున్న క్రమంలో అందవిహీనత  అవమానకారకం అవుతుంటుంది.“అందమె  ఆనందం, ఆనందమె జీవిత మకరందం” వంటి పాటలు అందం లేని వాళ్లకు ఆనందం, జీవితం లేనట్లే అని చెప్పకనే చెప్తుంటాయి. నిజానికి శారీరక వైకల్యాన్ని,ఆకారాన్ని,రంగును, జుట్టును, కట్టు బొట్టును బట్టి స్త్రీ పురుషు లెవరినైనా  అవమానపరచటం బాడీషేమింగ్ గా ఈనాడు అందరికీ తెలిసిందే.  అది గౌరవంగా జీవించటానికి మనుషులకు ఉన్న  ప్రాధమిక హక్కుకు  భంగకరం అన్న చైతన్యం ఈ నాటిది. ఆ క్రమంలోనే  బాడీషేమింగ్ కు వ్యతిరేకంగా సామూహిక చైతన్యంతో   ఉద్యమాలు  నిర్మించబడటం వర్తమాన వాస్తవం. ఆ దిశగా పెంచుకోవాల్సిన సంస్కారాల గురించిన  ఆకాంక్ష అర్థ శతాబ్ది క్రితమే(1970)  సుభద్రాదేవి వ్రాసిన అపరాజిత కథ లో ప్రతిఫలించటం ఆశ్చర్యకరం. 

అపరాజిత అనే పేరును బట్టి మాటలతో చేతలతో ఎవరినైనా పరాజితులను చేయ గలిగిన ఒక మెరుపు తీగ వంటి  అందాల రాశిని ఊహించుకున్న సుమ చేతులూ వేళ్ళూ వంకర్లు తిరిగి పైకి ఉబికిన కనుగుడ్లతో, వంకర ముఖంతో , కొంచెం గూనితో, నెరిసిన వెంట్రులతో నాలుగడుగుల ఎత్తులో ఉన్న అమ్మాయిని చూసి అవాక్కు అవటం దగ్గర మొదలైన కథ మూడుసంవత్సరాల కాలేజీ చదువు కాలంలో ఆమెను పన్నెత్తి పలకరించక పోవటంలో అందం గురించిన భ్రమలు మానవజీవితాన్ని శాసిస్తూ అమానవీకరించటమే కనబడుతుంది. అదే క్రమంలో తమ ఇష్టంతో, కృషితో సంబంధం లేకుండా సంక్రమించిన అనాకారితనం అవమానంగా జీవితాన్ని వెన్నాడుతుంటే వ్యక్తులు పడే హింస కూడా ఈ కథలో భాగమైంది. ఈ రెండింటినీ ఒక ఫ్రెమ్ లో చూపించటం ద్వారా అందం అంటే శారీరకమా, మానసికమా అన్న ప్రశ్నను, అందానికి అనితర ప్రాధాన్యత ఇయ్యటంలో మానవత్వానికి జరుగుతున్న అపచారాన్ని పాఠకుల ముందుకు తెచ్చింది రచయిత్రి. సుమకు పెళ్లి కానుకగా ‘కురూపి’  నవలను పంపిన అపరాజిత  రూపం వల్ల మనుషులు దూరం పెట్టవలసిన వాళ్ళు కాదు అన్న సూచనను  ఇయ్యగలిగింది. ఆ నవల పంపుతూ ఆమె వ్రాసిన ఉత్తరం స్నేహాన్ని పంచి, అపరాజిత నిలబడటానికి కావలసిన నైతిక ధైర్యాన్ని ఇయ్యలేకపోవటంలో మనిషిగా తాను  ఓడిపోయిన సంగతిని సుమకి  స్ఫురింప చేసింది. అందుకే ఆమె కన్నీళ్లు కార్చింది. సుమ కార్చిన కన్నీళ్లు మనుషుల అంత రంగాలను  ఆలోచనలను మసకబార్చిన  అందాన్ని గురించిన భ్రమలు, మకిలి  ప్రక్షాళన  చేసుకోవలసినవి అని సూచిస్తాయి.  

ఇలాంటి కథ వ్రాయటానికి తాత్విక పరిణితి కావాలి. అది సుభద్రాదేవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, కొడవటిగంటి కుటుంబరావు వంటి వాళ్ళ సాహిత్య పఠనం వల్ల పొందగలిగారు.  కురూపి 1963 లో కొడవటిగంటి కుటుంబరావు వ్రాసిన నవల. అందమంటే శారేరకమైనదే కాదు. మానసికమైనది. వ్యక్తిత్వ సంబంధమైనది. చుట్టూ వాతావరణాన్ని శుభ్రంగా ఉంచటం మొదలు పిల్లల పట్ల అపేక్ష చూపటం, బాధితుల కోసం దుఃఖించటం, స్నేహ హస్తం అందించటం మొదలైనవన్నీ అందమే అని ఆ నవల చెప్తుంది. ఆ నవల సుభద్రా దేవి  వ్యక్తిత్వాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే మరో ఏడేళ్లకు అపరాజిత కథ వ్రాయటానికి ప్రేరకమైంది.   

దేవుడు బండ కథల సంపుటికి ‘చిన్న మజిలీ’ అనే శీర్షికతో  ముందుమాట వ్రాసిన మధురాంతకం రాజారాం “లోకానికెక్కడ జబ్బుచేసిందో కనిపెట్టటానికి”పూనుకొన్న రచయిత్రి  సుభద్రాదేవి అన్నారు. సుభద్రాదేవి కథలు చదవటానికి ఈ వాక్యం ఒక మార్గ దర్శక సూత్రం. సామాజిక రుగ్మతలలో పేదరికం ఒకటి. తిండికి, బట్టకు , విద్యకు చిన్న చిన్న అవసరాలకు ఆర్ధిక వసతి లేని  స్థితిలో మనుషుల జీవనయానం ఎంత దుర్భరమో గుర్తించి  దేవుడు బండ, వానావానా కన్నీరు, ఊబి, వంటి కథలు వ్రాసారు సుభద్రాదేవి.   

పేదరికం ఎంతటి సామాజిక రుగ్మత అంటే అది మనుషులను సహజ హక్కులకు, జీవితానందాలకు పరాయీకరించి లోలోపలి నుండి ధ్వంసం చేస్తుంటుంది. వానావానా కన్నీరు కథలో పిల్లలు బట్టకు,చదువుకు దూరమై బాల్యాన్ని కోల్పోయి  బతుకుతెరువు బరువును ఎత్తుకొనవలసిన స్థితిలో చెత్తకాగితాలు ఏరుకొనే వాళ్లు.గోచీ పాతలకు కరువైన వాళ్లు. ఎన్నికల సమయంలో కట్టబడే బ్యానర్ గుడ్డలకోసం వాళ్లు పడిన ఆరాటం, చేసిన జీవన పోరాటం – నలభై ఏళ్ళ స్వతంత్ర భారతంలో పార్లమెంటరీ  ప్రజాస్వామ్యం సాధించినదేమిటి అని సవాలు చేస్తాయి.  ‘దేవుడు బండ’ కథ కూడా  రాళ్లుకొట్టి రోళ్ళు చేసి అమ్ముకొనే రోడ్డుపక్క కుటుంబాలలో బాల్యం,చదువు కోల్పోయి తల్లిదండ్రుల శ్రమ జీవితంలో సై దోడుగా ఉండే  పిల్లల బతుకు చిత్రమే.  

పేదరికం  ఒక ఊబి.  అందులో కూరుకుపోవటమే కానీ బయటపడే అవకాశాలు లేని ఒక విషాదాన్ని ఊబి కథలో చూస్తాం.అల్లుడు కోరినసరుకులను సమకూర్చగల స్థాయికి, సమకూర్చలేని దయనీయతకు మధ్య భూకామందు కూతురి జీవితానికి కూలివాని కూతురి జీవితానికి  మధ్య వ్యత్యాసం ఎంత తీవ్రంగా ఉంటుందో చూపటమే కాదు,  కూలివాని కొడు కులు అనివార్యంగా కూలివాళ్ళుగా చేయబడుతున్నఅసమ అవకాశాల  సమాజం గురించి ఆలోచించ మంటుంది ఈ కథ. 1987, 1988 లలో వచ్చిన కథలివి. ఇప్పటికి 37 ఏళ్ళ క్రితపు ఈ పరిస్థితులు ఏమైనా మారాయా అంటే లేదనేది స్పష్టం.  2000 నాటికి అది సమస్యే.

 అంతర్జాతీయ స్థాయిలో నూతన సహస్రాబ్ది సాధించవలసిన లక్ష్యాలుగా ప్రకటించబడిన వాటిలో  మొదటిది తీవ్రమైన ఆకలిని, పేదరికాన్ని నిర్మూలించటం. ఇది 2015 నానాటికి సాధించ వలసిన లక్ష్యం. అది దాటి పదేళ్లు ముందుకువచ్చాం. అయినా 2023 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం పేద జనాభాలో 3వ వంతు (389 మిలియన్లు) దక్షిణ ఆసియాలో ఉంటే  వారిలో 70 శాతం మంది భారతీయులే అని తేలింది. సమాన అవకాశాలు, విద్య వైద్య సౌకర్యాలు సమృద్ధి అయ్యే క్రమంలో ఆమేరకు  పేదరికం తగ్గుతుంది అని అమర్త్యసేన్ వంటివాళ్ళు అభిప్రాయం. దానికి మనం ఎంత దూరంలో ఉన్నామో వర్తమానం చెప్తూనే ఉంది. 1997 లోనే ఈ అవగాహనతో సుభద్రాదేవి అంగడి అనే కథ వ్రాయటం విశేషం. విద్య ప్రవేటీకరణ చెందుతూ ఉన్నత మధ్యతరగతి వర్గాలు తమపిల్లలకు డబ్బు పెట్టి చదువులకు వేరేఊళ్ళకు , దేశాలకూ కూడా పంపుతున్న సందర్భంలో పేదవర్గాల ఆడపిల్లలు చదువులు  మానేసి పాచి పనులకు వెళ్లే దుస్థితి గురించిన వేదన ను ప్రతిఫలించింది అంగడి కథ. చదువుకూడా అంగడి సరుకైన ఈ రోజుల్లో ప్రతిభ ఉన్నా చంద్రికలాంటివారు ఎక్కడ కొనుక్కోగలరు అన్న ప్రశ్నను సంధించిన ఈ కథ లో వెనుకబడిన దళిత గిరిజన సమూహాలకు ఉన్న రిజర్వేషన్ విధానంపట్ల వ్యతిరేకత , అక్కసు వెళ్లగక్కే వర్గాల స్వభావం పై విమర్శ కూడా భాగం కావటం చూస్తాం. 

నూతన ఆర్ధిక విధానాలకు ద్వారాలు తెరిచాక ‘అభివృద్ధి’ తారకమంత్రం అయింది. అయితే అభివృద్ధి దీపపు నీడలో సన్నజీవుల కదలికలను, ఆక్రందనలను ఆర్. ఎస్ . రావు వంటి రాజకీయార్థిక శాస్త్ర వేత్తలు వేటినైతే చూడగలిగారో వాటిని చూడగలిగిన సాహిత్య నేత్రం సుభద్రాదేవిది. సంపన్న వర్గాల, వ్యాపార వర్గాల అవసరాలు, ప్రయోజనాల రీత్యా నిర్వచించబడే అభివృద్ధి బృహన్నిర్మాణాలను ఆహ్వానిస్తుంది. అవి అపార్టుమెంట్లు కావచ్చు. పెద్దపెద్ద బహుళ జాతి కంపెనీల సరుకుల అమ్మకాల సెంటర్లు – మాల్స్ – కావచ్చు, భారీ ప్రాజెక్టులు కావచ్చు. ఏవైనా పక్కన ఉన్న గుడిసెలను, స్థానిక చిన్న దుకాణాలను, గ్రామాలను ఆక్రమించక , ధ్వంసం చేయక సాధ్యం అయ్యేవి కావు అన్న అవగాహన సుభద్రాదేవికి ఉన్నది. కనుకనే  అభివృద్ధి ప్రవాహం  ఒడ్డున విడిచిన చెత్త వలే    అనాథలుగా, బిచ్చగాళ్లుగా , కూలివాళ్లుగా ఉపాంతీకరించబడే వాళ్ళవైపు పాఠకుల దృష్టిని తిప్పే కథలు చితికిన కల (1994), ఆరోహణలో అవరోహణ( 2008) రేపటి ప్రతిధ్వని(2017) వ్రాయగలిగారు. 

కులం,మతం జీవితంలో నిర్వహించే  పాత్ర గురించి ఎక్కువగా వ్రాయకపోయినా ఆ విషయంలో సుభద్రాదేవి దృష్టి కోణాన్ని పట్టిచ్చే కథలు దేవుడు బండ(1987) మెట్టు (1989) నివురు (1990). కులాన్ని బట్టి మనుషులను హీనంగా చూడటం గౌరవంగా జీవించే హక్కును   ఉల్లంఘించటమే అవుతుంది. పెళ్ళిళ్ళల్లో మేజువాణీ కట్టే కులమింటి ఆడబిడ్డ చదువుకొని ఉద్యోగానికి వస్తే ఆమెను చవకగా చూచి మాట్లాడే సహోద్యోగుల కుసంస్కారాన్ని విమర్శకు పెడుతూ మనిషిని మనిషిగా గుర్తించి స్నేహం చేయగల సంస్కారం అభివృద్ధి చేసుకోవలసినదని చెప్పే కథ నివురు.  దేవుడు బండ కథలో మూడు  దృశ్యాలు వున్నాయి.  రోడ్డు పక్క బండరాళ్లు పోగేసుకొని పిల్లల మొదలు పెద్దలదాకా కుటుంబమంతా  పాటుపడి  రోళ్ళు  చేసి అమ్ముకొన్నా అవసరాలు తీరని  సన్నజీవుల దైన్యం ఒక  దృశ్యం.   రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం  రోడ్డువార గుడిసెలను పీకేసి కుటుంబాలను తరిమేసిన దృశ్యం మరొకటి. మనుషులు తరిమేయ్యబడ్డ చోట బండరాళ్లు దేవుళ్ళై కొలుపులు అందుకొనటం మూడవ దృశ్యం. ఈ దృశ్యాలను ఒక క్రమంలో చూస్తే  పేదలను మరింత పేదరికంలోకి నెట్టేసే ప్రభుత్వ అభివృద్ధి విధానాల గురించి,మతంతోటి దాని బాంధవ్యం గురించి సూచన అందుతుంది. అదే సమయంలో గురజాడ అన్నట్లు ‘మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతు  మనుషులంటే రాయి రప్పలకన్నా కనిష్టంగా చూసే’ తత్త్వమేదో  దానిలో ఇమిడి ఉందన్న  ఆలోచనకు పాఠకులను మేల్కొల్పటం అనే అదనపు ప్రయోజ నాన్ని సాధించింది ఈ కథ.  బండ దేవుడైనప్పుడు దేవుడు శ్రమజీవుల సమస్య పట్టని బండే అవుతాడు కదా అన్న తర్కం వల్లనే కథా శీర్షిక ‘దేవుడు బండ’ అయిందనిపిస్తుంది.  

 గుడి, చర్చి , మసీదు ఎక్కడైనా ఏ మతం వాడైనా  అక్కడి దైవాన్ని పటం కట్టి పెట్టుకొని స్మరిస్తూ భక్తుల దయను కోరుతూ  మెట్ల దగ్గర అడుక్కునే బిచ్చగాడు , భిన్న మతవిశ్వాసాలు గల ప్రజల ఓట్లను ఆశించి ఆయా మత ప్రార్ధనా మందిరాల దగ్గర ఆ విశ్వాసాలను గౌరవించే రాజకీయ నాయకుడు పాత్రలుగా నడిపిన మెట్లు కథలో ఉత్తమ పురుషలో కథ చెప్పే రచయిత్రి ఆయా సందర్భాలకు ప్రత్యక్ష సాక్షిగా చేసే వ్యాఖ్యానాలు  కీలకమైనవి . మత ప్రాతిపదికమీద ఇతరులుగా కొందరిని వేరు చేసి చూడటం, మనుషుల పట్ల   అసహనం,  2002 తరువాత భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయాలను బలంగా ప్రభావితం చేస్తున్న విషయాలు. అయితే 1989 నాటికే పరమత సహనం అభావం  కావటం గురించిన ఎరుక నుండి సుభద్రాదేవి మెట్లు కథను వ్రాయటం జీవితంలో సాంస్కృతిక చలనాలను ఆమె ఎంత  నిశితంగా పరిశీలిస్తున్నదో తెలుపుతుంది.   ‘చదువూ సంస్కారం ఉన్న వాళ్ళు కూడా మరో మతం గురించి గానీ , దేవుడి గురించిగానీ సహనం ప్రకటించటం మాట అటుంచి కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చూపని సమకాలపు సంకుచిత మనస్తత్వాల గురించిన వేదన రచయిత్రి అంతరంగాన్ని ఎక్కడో మెలిపెడుతుండగా దానికి సమాధానం కనుక్కొనే క్రమంలో ఆమె చేసిన ప్రయాణమే ఈ కథ.

ఒకే వ్యక్తి దేవాలయం దగ్గర వెంకటేశ్వర స్వామి భక్తుడుగా, చర్చి దగ్గర క్రీస్తు పట్ల విశ్వాసుడుగా కనిపిస్తే కథకురాలికి ముచ్చట వేసింది. ఆ బిచ్చగాడు ఏ మతస్థుడో తెలియక పోయినా రెండు సందర్భాలలోనూ మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నట్లే తోచి ఆమె సంతోష పడింది. బతుకు తెరువు కోసమే కావచ్చు కానీ మత సహనం జీవితంలో భాగం కావటం ఆమె దృష్టిలో హర్షించదగినదే. కానీ దేవుడిపేరు చెప్పి మనుషులను మోసం చేయటంగా దాన్ని చూసి వాళ్ళను ఆలా వదిలెయ్య కూడదు అంటూ ఆగ్రహాన్ని ప్రకటించేవాళ్లే ఎక్కువ. ఆ ఎక్కువమంది అభిప్రాయం అర్ధరహితమైనది, అన్యాయమైంది అని కూడా రచయిత్రి భావన. కథ ముగింపులో అది సూచితం. ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు పక్కన మసీదు నుండి  నమాజు జరుగుతుండటం వినిపించి తాను ప్రసంగం ఆపి తలపై రుమాలు వేసుకొని నమాజు చేస్తున్న ఫోటో ప్రస్తావన అందుకోసమే ఉపయో గించబడింది.మత సహనాన్ని ఆచరించి చూపిన నాయకుడుగా ఆయన కీర్తనీయుడు అయ్యాడు. అడుక్కొనటం ఒకరికి పొట్టకూటికి. మరొకరికి అధికారం పొందటానికి. ఇద్దరికీ మతమే ఆశ్రయం అయింది. అయితే బిచ్చగాడు ఎందుకు మోసగాడు అయ్యాడు? రాజకీయనాయకుడు ఎలా మతసహనమూర్తి అయ్యాడు అన్నది ప్రశ్న. సాంఘిక స్థాయిని హోదాను బట్టి ఇద్దరు చేసిన ఒకే పనికి విలువలను వేరువేరుగా నిర్ణయించే అసమ  సామాజిక  న్యాయం వైపు చూపు తిప్పటం ఈ కథకు కొసమెరుపు. 

స్త్రీ పురుష సహజ ఆకర్షణలను, అనుబంధాలను, కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలను గుర్తిస్తూ ఒక మహిళా రచయితగా సుభద్రాదేవి వ్రాసిన కథల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ప్రపంచీకరణ పరిణామాలలో పెరిగిన వస్తువినిమయ సంస్కృతి లో గిరికీలు కొడుతూ స్త్రీలు తమను తాము కోల్పోతూ  కేవలం వినిమయ దారులుగా మిగిలి పోవటాన్ని రంగుల కల ( 2000) కథలో చిత్రించిన  సుభద్రాదేవి ఆ క్రమంలో  స్త్రీ తనంతట తానే ఒక  వినిమయ వస్తువుగా చేయబడుతున్నవాస్తవాన్ని గోవు మాలచ్చిమి (2008 ) కథలో చూపించారు. స్త్రీ అంటే పురుషుడి వంశాన్ని నిలిపే సంతానాన్ని కని  ఇచ్చే పునరుత్పత్తి పరికరం అన్న భూస్వామిక పితృస్వామిక సంప్రదాయానికి  ఆధునిక వైజ్ఞానిక అభివృద్ధి తోడైనప్పుడు  స్త్రీల గర్భం సంతాన ఉత్పత్తికి అద్దెకు దొరికే  వసతి స్థాయికి దిగజారడం గోవు మాలచ్చిమి కథలో చూస్తాం.  అక్కడైనా ఇక్కడైనా స్త్రీ గర్భం ధరించటం , నవ మాసాలు మోయటం, కనటం స్వీయ మాతృత్వ కాంక్షా పరితృప్తికి కాదు.పితృస్వామిక కుటుంబ ఆకాంక్షలకు, అభివృద్ధికి కాకపోతే ధనిక వర్గాల  అవసరాల ఆకాంక్షల పరితృప్తికి . అంతే.  స్త్రీకి తన, శరీరం మీద,  పునరుత్పత్తి శక్తి మీద  అధికారాన్ని నిరాకరించే పితృస్వామిక ధనస్వామ్య విధానాలు సామాజిక రుగ్మత  కాక మరేమీ  కాదు.  స్త్రీని అవసరాలకు, అనుభ వానికి  వాడుకొని వదిలేసే మగవాడి తెంపరి తనం కూడా  ఒక సామాజిక రుగ్మత అని సూచించే కథ చెత్తకుండి(1978). 

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు. ఆ పెళ్లి తో లభించే సంసారం స్త్రీకి మోయలేని బరువు , హృదయవేదన ఎందుకు అవుతున్నది? విసుగు కలిగించే వ్యవహారం ఎందుకు అవుతున్నది? భర్త ప్రేమ లభించకపోవటం,  ఇద్దరి అభిరుచులలో సారూప్యం లేకపోవటం, భర్త ఇష్టాన్ని బట్టి తన ఇష్టాలు వదులుకోవలసి రావటం, ఆసక్తులు అణిచేసుకోవలసి రావటం , ఇల్లు , భర్త , పిల్లలు, ఇంటి పని  తప్ప మరొక ప్రపంచంతో సంబంధమే లేక పోవటం – ఇలాంటి కారణాలు ఎన్నో. ఈ విధంగా స్త్రీలకు స్వతంత్రమైన స్వంత జీవితంలేకుండా పోవటానికి కారణమైన మగ అహంకారం, స్త్రీల జీవితంపై సర్వాధికారాలు దఖలు పరిచిన పితృస్వామిక నీతి సంసార సారాన్ని పీల్చేసే విషక్రిములని  సూచిస్తాయి విశాల ప్రపంచం(1997), అనుభవానికి కథకీ నడుమ (2002) వంటి కథలు. యి విధమైన వ్యతిరేక పరిస్థితులతో ఘర్షణ , రాజీ రెండూ కూడా స్త్రీల జీవితంలో భాగమే అవుతాయి. ఘర్షణ తీవ్రమైతే భర్త నుండి  విడిపోవటం ఒంటరి జీవితాలను నిర్మించుకొనటం. 1976 నాటి ‘ఈ దారి ముందుకే’  కథ  అందుకు ఉదాహరణ. సంఘర్షిస్తూనే  వైరుధ్యాలను సమన్వయిం చుకొంటూ భవిష్యత్తు మీద ఆశతో  జీవించాలనుకొనే స్త్రీల  సర్దుబాటు  ప్రయత్నాలు స్పెస్ , అద్దంలో ఒకరోజు (2024) వంటి కథలలో కనిపిస్తాయి. 

పెళ్లయిన మగవాడికి  కుటుంబానికి అవతల మరొకస్త్రీతో సంబంధం ఏర్పరచుకొనే అవకాశాన్ని మిగిల్చిన పితృస్వామిక సంప్రదాయంలో కుటుంబంలో స్త్రీకైనా , అవతలి స్త్రీ కైనా అంతులేని హింస, అవమానం అనుభవానికి వస్తుంటాయి. అయితే చాలావరకు కథలకు  కుటుంబంలో అనాదృత భార్య అవస్థ  వస్తువు అయినట్లు అవతలి స్త్రీల సమస్య వస్తువు కాలేదు. అది అనైతికతగా హేళన కు గురైంది. తెలుగునాట స్త్రీవాద సాహిత్యోద్యమ చైతన్యం కుటుంబానికి అవతల పురుషులతో  సంప్రదాయబద్ధ చట్టబద్ధ సంబంధం లేని స్త్రీల జీవిత సంఘర్షణ లకు సాహిత్య వస్తు గౌరవం ఉందన్న ఎరుకను కలిగించాయి. అయితే అంతకు రెండు దశాబ్దాల ముందే   సుభద్రాదేవి   ‘పచ్చగడ్డిలో పల్లేరు కాయలు’  (1976) కథ ను  అవతలి స్త్రీ కోణం నుండి  వ్రాయటం గమనించవచ్చు.ఈ వరుసలో  ఆతరువాత వ్రాసిన కథ మూసిన తలుపులు (1998). 

కుటుంబంలో స్త్రీలకు ఎదురయ్యే మరొక సమస్య వైధవ్యం. భార్య మరణం వలన భర్త జీవితంలో ఏ మార్పూ ఉండదు కానీ భర్త మరణం భార్య జీవితాన్ని తలకిందులు చేస్తుంది. భర్త మరణం కారణంగా  స్త్రీల జీవితంచుట్టూ అల్లబడిన  సాంస్కృతిక మాయాజాలం  స్త్రీల జీవిత విధ్వంసానికి దారితీసే సామాజిక రుగ్మత. దాని పట్ల నిరసన  స్వరంతో సుభద్రాదేవి  గుండెల్లో గాయం (2016) నేనున్నాను కనుకే, గోడలు వంటి కథలు వ్రాసారు.  

మధ్యతరగతి మనస్తత్వంలోని జబ్బును కూడా సుభద్రాదేవి గుర్తించారు.  ఆ జబ్బులలో ఒకటి స్వార్ధం. తమకష్టాలను భూతద్దంలో చూసి తమగురించి తామే జాలి పడటం అందులో భాగమే.ఎదుటివాళ్ళ కష్టాన్ని గుర్తించక పోవటం, పట్టించుకోక పోవటం దానికి మరో ముఖం.   అయితే అదే సమయంలో మధ్యతరగతి  అంతో ఇంతో చదువు, ఆలో చించే మెదడు, సామాజిక జీవితం,  ఆర్ధిక వెసులుబాటు ఉన్న వర్గం. ఆ క్రమంలో సమాజంలో ఇతరుల సమస్యలను, దుఃఖాన్ని అరుదుగానైనా గుర్తించే అవకాశం ఉంది. అందువల్ల స్పందనకు అక్కడ తావు ఉంటుంది. అయితే ఆ స్పందన తరచు జాలిగా వ్యక్తమవుతుంది.అదిక్రియాత్మకం కావటం అరుదు. ఈ రకమైన మధ్యతరగతి మనస్త త్వాన్ని సుభద్రాదేవి అనేక కథల లో భిన్నకోణాలనుండి చిత్రించారు. 

బరువెక్కిన పూలు (1977) ఆ కోవలో కథ.   స్నేహితురాలి పెళ్ళికి పూలదండలు అల్లి తీసుకువెళ్లాలనుకొన్న ఇద్దరు చదువుకున్న యువతులు  – పూలు తేవలసిన అతని ఆలస్యానికి అసహనపడుతుండగా కూతురి భర్తను ఎవరో చంపేశారని తెలిసి అతను వెళ్లాడని చెప్తూ  అంత దుఖంలోనూ ఆ పూలు తీసుకువచ్చిన  అతని భార్యతో  గీచిగీచి బేరాలు ఆడటం ఇందులో విషయం. పూలతో ప్రయాణమైన ఆ యువతులు తమకు పూలమ్మిన స్త్రీ బస్సు టిక్కెట్టుకు డబ్బులు సరిపోక  కండక్టర్ కాళ్లావేళ్లా పడటం చూసి అపరాధ భావానికి లోనవుతారు. కానీ చేసిన తప్పును సవరించుకోగల వివేకం ప్రదర్శించకపోవటం  మధ్య తరగతి మనస్తత్వం కారణంగానే కావాలి. జాలి ఖరీదు( 1977) కథ కూడా అంతే. స్నేహితురాలి పెళ్ళికి వెళ్లిన ఒక యువతికి ఎదురైన అనుభవం చుట్టూ అల్లబడింది. తల్లి చనిపోయి సవతి తల్లి ప్రేమ దొరకక పిచ్చివాలకం పడిన చిన్నపిల్ల తనప్రేమ కోరి ఒడిని చేరితే లాలించటం , ఆ పిల్ల సంగతి తెలిసి జాలిపడటం వరకు ఆ యువతి  చేయగలిగింది. ప్రేమగా చూస్తే ఆ పిల్ల బాగుపడుతుందేమో తీసుకెళ్లి పెంచుకుందామా అన్న ఆలోచన వచ్చి కూడా ఒంటరి కన్నె పిల్లగా ఈ సమాజంలో  తాను ఆ పని చేయగలనా అన్న సందిగ్ధంలో పడి ఆగిపోవటం చూస్తాం. నిష్క్రియాత్మతకు సంబంధించిన అపరాధ భావం ఆమెను కూడా వేధించేదే. 

కంచికి పోని కథ(1980) కూడా ఈ వరుసలోదే. స్త్రీలైనా పిల్లలైనా పిచ్చివాళ్ళు ఎందుకవుతారు? ప్రేమరాహిత్యం వల్లనే. అత్త ఆడబిడ్డ భర్త చూపే తిరస్కారం, పెట్టె హింస భరించలేని స్థితిలో తిరగబడిన స్త్రీని పిచ్చిదని  సర్టిఫికెట్ పుట్టించి మరొక పెళ్లి చేసుకొన్నాడు ఆమె భర్త.  పుట్టింటి ఆసరా లేక  దయాధర్మ భిక్షంగా భర్త పెట్టె నాలుగు మెతుకులకోసం  కొడుకుతో  అతని పంచన పడివుండవలసిన దుర్భర స్థితి ఆమెది. అది ఆమెనే కాదు , కొడుకును కూడా పిచ్చివాడి వాలకం పడేట్లు చేస్తుంది. ప్రేమరాహిత్యమే కాదు, అన్నిటా అనుభవమయ్యే అసమానత కూడా అందుకు కారణమే. దీనికి ప్రత్యక్ష సాక్షులైన ఆ కంపౌండ్ లో మరొక గదిలో అద్దెకున్న ఆమ్మాయిలిద్దరూ ఆమె నుండి విడాకులకు భర్త కోర్టులో కేసు వేసాడని తెలిసినప్పుడు కోర్టుకు వెళ్లి ఆమె పక్షాన సాక్ష్యం చెప్పాలని అనుకొని కూడా మధ్యతరగతి ఆడపిల్లలుగా భవిష్యత్తులో రానున్న సమస్యలను తలచుకొని మౌనం వహించటం అసలు విషయం. అన్యాయాలను గుర్తించగలిగినా వాటిని ఎదిరించాటానికి, న్యాయం కోసం పోరాడటానికి సంశయించే మధ్యతరగతి మనస్తత్వాన్ని ఇలా కథలలో భాగం చేసిందంటే రచయిత్రి దానిని మధ్యతరగతి వదిలించుకోవలసిన ఒక దుర్గుణంగా భావించిందన్నమాటే.  

సుభద్రాదేవి కథలు ఏవైనా అవి స్త్రీలను కేంద్రంగా చేసుకొని  వ్రాసినవి. దాదాపు అన్ని కథలలో స్త్రీలే కథకులు. ప్రధాన పాత్రలు కూడా. సమస్య ఏదైనా  దానిని నిర్వచిం చటంలో, వివరించటంలో స్త్రీల కోణం ప్రధానం. స్త్రీల సంభాషణ నుండే  జీవితాన్ని వ్యాఖ్యానించటం. స్త్రీల ఆలోచనలను అవగాహనను, మనస్తత్వాలను వాస్తవిక భూమిక నుండి ప్రదర్శించటం, స్త్రీల బలం ఏమిటో, బలహీనత ఏమిటో నిరూపించటం స్త్రీలు తమను తాము సంస్కరించుకొనటానికి దోహదం చేసేవి.మొత్తంగా మధ్యతరగతి మనుషుల చైతన్యాభివృద్ధికి తోడ్పడేవి.  ఆ రకమైన మంచికథల మంటపం లోకి  పాఠకులను ఆహ్వానించే పని పెట్టిన సుభద్రాదేవిగారికి ధన్యవాదాలు. అభినందనలు. 

(త్వరలో రానున్న సుభద్రా దేవి సమగ్ర కథా సంపుటికి వ్రాసిన ముందుమాట ఇది.)

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply