సాలోడికి ఎందుకురా ఇంత పెద్ద చేప?
అన్నాడట కామందు కాపోడొకడు-
మా తాత ఆ మాటనే తల్చుకుని తల్చుకుని
చచ్చిపోయాడంట
బతికినంత కాలం గుండెకాయకు
చేప ముల్లు గుచ్చుకున్నట్టు గిలగిల్లాడిపోయాడంట
ఆ తర్వాత మా తమ్ముడెప్పుడూ
చేప ముట్టుకోలేదని నానమ్మ అన్నప్పుడు
ఆమె కళ్ళలోంచి పేద్ద చేప ముల్లేదో వేలాడేది
ఆ ముచ్చట చెప్పినప్పుడల్లా మా నాన్న
కొల్లేటి సరసులో
అప్పుడప్పుడూ అమాంతం పైకెగిరే
బొచ్చు చేపలా రెచ్చిపోతాడు
నానమ్మ తమ్ముడు మాంచి నేతగాడు
అతను నేసిన చీరల మీదా.. పంచెల మీదా
అంచులన్నీ చేప బొమ్మలే ఉండేవి
అందుకేనన్న మాట
ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు తాత
ఊరి దేహం మీద
బతుకంతా చేప బొమ్మలే అతికించి
ఎండిన చేపముల్లయి వెళ్ళిపోయాడు
మొల చుట్టూ ఓ గోచి పాతతో
మగ్గం గోతిలో రుషిలా కూర్చుని తాత
ఏరా మనవడా అని నవ్వేవాడు
అప్పుడు తాత
బతుకు చేప కొరికేసిన ఎర్రలా ఉండేవాడు
నేను కవిని కావాలని తాత కోరుకున్నాడో లేదో
నేను మాత్రం అక్షరాల మీద తాత బొమ్మనే అచ్చు గుద్ది
వాటిని ఎప్పుడూ నూరుతూనే ఉంటాను
ఎప్పటికైనా మత్స్య యంత్రాన్ని కొట్టకపోతానా…!
మాట కసి యై అంచులమీద చేపబొమ్మలై