మతకం

రూన్త సలికే
యీదుల్లో సలిమంటలేసుకుని
కాగుతున్నాం గదా!

దుప్పటి కప్పుకొని
సలి దూరకుండా చెవుల చుట్టూ
తలపాకు సుట్టుకొని చెరువుసాయ
సేతులు బిగించుకుని నడుస్తూ
యెన్ని యార్పాట్లు?

రూన్త సలికే
పొద్దట్ట మొలిస్తే పారిపోయే సలికే
యెన్నెన్ని జాగర్తలు.!

సలి కంటే
సలి కోరలకంటే పదునయింది
పెను ప్రెమాదమయింది
బకితి పూనిన
ఇల్లంతా ముసురుకునే
సాంబ్రాణి కడ్డీల పొగలా
వూళ్ళనిండా కమ్ముకుంటున్నదేదీ
మనకంటెందుకు బడటంలేదొ?

సలి కన్నా తీవ్రమయింది
సలి కన్నా క్రూరమయింది
సావుకూతల మద్దె సంకలెగరేసేది
మన్సుకెందుకు ఆనడంలేదొ?
మన్సులకెందుకు అగుపడటం లేదొ?

మతకం బట్టినట్టు
యీమాదిరి తాచారమ్యేవిటి?

పూర్తిపేరు ప‌ల్లిప‌ట్టు నాగ‌రాజు. చిత్తూరు జిల్లా ‘అరవై నాలుగు పెద్దూరు’లో తెలుగు ఉపాధ్యాయుడు. శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆరువంద‌ల‌కు పైగా కవితలు, మినీ కవితలు, 6 కథలు రాశారు. చిత్తూరు జిల్లా ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘ఈ తరం కవితా వేదిక’లో కార్యవర్గ స‌భ్యుడిగా ప‌నిచేస్తున్నారు.

One thought on “మతకం

Leave a Reply