పవిత్ర భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఆదివాసీ మహిళల్నీ, దళిత మహిళల్నీ నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చెయ్యడం, ఆయా కుటుంబాల్లోని మగవాళ్లనూ, పిల్లలనూ దారుణంగా హత్య చెయ్యడం జరుగుతోంది. ఇలా జరిగిన ప్రతీసారీ, దేశం నివ్వెరపోతోంది. ఆ సంఘటన నుంచి సర్దుకునేలోగా మరో దారుణ సంఘటన జరుగుతోంది. గుండెని కలిచివేసే ఈ సంఘటనల్లో హింస రానురానూ భయంకరంగా ఉంటూ మనుషుల్లోని క్రూరత్వమంతా వాటిలో బయటపడుతోంది. ఇందుకు దేశ ప్రజల్లో జీర్ణించుకుపోయిన కులమత విద్వేషాలూ, దురహంకారాలూ ఒక ఎత్తు అయితే, వాటిని రెచ్చగొట్టే బి జె పి హిందూత్వ రాజకీయాల కుట్ర మరో ఎత్తు. ఈ కుట్ర ఎంత పకడ్బందీగా, సమయోచితంగా ఉంటుందంటే, కుట్ర ఫలితాలు బయటపడ్డప్పుడు ఔరా అంటూ నోరెళ్లబెట్టడమే మనకు చేతనయ్యేది. 2002 లో గుజరాత్ లోనూ, 2013లో ముజఫ్ఫర్ నగర్ లోనూ ముస్లింలపై జరిగిన హింసాత్మక అల్లర్లు బి జె పి పార్టీ అధికారంలోకి రావడనికి ఎంత దోహదపడ్డాయో మనం చూశాం. ప్రజల దృష్టి మళ్లించే ఇంకొక రకం కుట్ర ఇప్పుడు ఈశాన్య భారతదేశంలో జరుగుతోంది. ఈ కుట్రకూ, రెండు రోజుల క్రితం లోక్ సభలో ఆమోదం పొందిన అటవీ సంరక్షక అమెండ్మెట్ బిల్ 2023 కి సంబంధం ఉంది. అదేమిటో ఒకసారి చూద్దాం?
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్, ఎప్పుడోగాని మిగతా భారత దేశ ప్రజల దృష్టికి రాదు. భారత స్వాతంత్ర్యం కోసం ఈ ప్రాంతంలోని ఆదివాసీ కుకీ తెగ, బ్రిటిషర్లపై పోరాటం చేసిన వీరోచిత పోరాట గాథలు మిగతా భారతదేశ ప్రజలకు పెద్దగా తెలియదు. మేరీ కోం లాంటి క్రీడాకారులు ఎన్నో అవరోధాల్ని దాటుకుని దేశానికి ఎన్నో పతకాలు తెచ్చాక కూడా, “నేను కూడా భారతీయురాలినే” అని చెప్పుకోవలసి వచ్చిన ప్రాంతం అది.
అలాంటి మణిపూర్ ఒక్కసారిగా మిగతా భారత దేశం అంతటి దృష్టికి రావడమే కాదు, దేశం మొత్తం తలదించుకునే సంఘటనతో ప్రపంచం ముందుకు వచ్చింది. ‘మణిపూర్ లో మంటలు’ అంటూ అక్కడక్కడ ప్రొగ్రెసివ్ మీడియాలో వార్తలు వస్తున్నా, మే 3 నుంచి అక్కడ జరుగుతున్న దారుణ మారణహోమం గురించి జులై 19న దాకా దేశ ప్రజలకు తెలియదు. మణిపూర్ ప్రభుత్వానికీ, కేంద్ర ప్రభుత్వానికీ ఆ దారుణాలు తెలుసు. ఆ విషయాలు బయటకు పొక్కకుండా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ ను నిషేధించారు. మే నెలలో అల్లర్ల మొదటి రోజుల్లో ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు తీసిన వీడియో, జులైలో ఇంటర్నెట్ నిషేధాన్ని సడలించినప్పుడు బయటపడి వైరల్ అయింది. ఆ వీడియో ద్వారానే అక్కడ జరుగుతున్న మారణహోమం గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది. అలాంటి వందల సంఘటనలు ఆ గొడవల్లో జరిగాయని, గొడవలు సద్దుమణిగేలా చేయడానికే ఇంటర్నెట్ ను నిషేదించామని స్వయంగా మణిపూర్ ముఖ్యమంత్రే చెప్పినప్పుడు, తెగల మధ్య రగులుకుంటున్న అగ్నికి ఆజ్యం పోసి బాధితులపై జరిగిన హింసను ప్రపంచం కంట బడకుండా అడ్డుకున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసి దేశం మరింత నివ్వెరపోయింది.
తెగలమధ్య గొడవలకు ప్రభుత్వం అండ:
మణిపూర్ దాదాపు 90% కొండప్రాంతం. రాష్ట్ర జనాభాలో దాదాపు 25% ఉన్న కుకీలు, 15% ఉన్న నాగాలు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. 50% పైగా జనాభా ఉన్న మెయితీలు అభివృధి చెందిన లోయ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మెజారిటీ మెయితీలు హిందువులైతే, మెజారిటీ కుకీలు క్రిస్టియన్లు. మెయితీలు ముఖ్య ప్రభుత్వ పదవులతో సహా అన్ని రంగాల్లోనూ ముందుంటే, కుకీలు కనీస సదుపాయాల కోసం కష్టపడుతున్నారు.
ఇప్పటికైతే కొండల్లోని అడవులమీద హక్కులు షెడ్యూల్ తెగగా గుర్తింపు పొందిన కుకీ, నాగా వంటి ఆదివాసీ తెగలకు మాత్రమే ఉన్నాయి. ఇతర్లు అడవిలోని వనరులను గానీ, అటవీ ప్రాంతాన్ని గానీ వాడుకోలేరు. BCలుగా, OBCలుగా గుర్తింపు పొందిన మెయితీలను కూడా షెడ్యూల్ తెగల కిందికి తీసుకు వచ్చే ప్రయత్నాలు ఇప్పుడు మొదలయ్యాయి. కోర్టు దానికి ఉన్న అవకాశాల్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని మే నెలలో ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయితే మెయితీలు అడవిని ఆక్రమించుకోవడం మొదలవుతుంది. అందువల్ల కుకీల నుంచి ఆందోళనలు పెల్లుబికాయి. ఆ ప్రదర్శనల్లో మెయితీలకూ కుకీలకు మధ్య జరిగిన గొడవల్లో మెయితీలకు చెందిన ఒక అమ్మాయిని కుకీ తెగ మనుషులు గ్యాంగ్ రేప్ చేశారని ఫేక్ న్యూస్ వచ్చింది. ఆ మెయితీ అమ్మాయీ, ఆమె తండ్రీ అలాంటిదేమీ జరగలేదని పోలీసులకు చెప్పినా అప్పటికే రగులుకున్న మంటలు ఇప్పటికీ రాజుకుంటున్నాయి. ఈ గొడవల్లో 100 మందికి పైగా మృతిచెందారు, దాదాపు 60,000 మైంది నిరాశ్రుయులై ఇతర రాష్ట్రాల్లోనూ, మణిపూర్ లోనే ఏర్పరచిన శిబిరాల్లోనూ తలదాచుకుంటున్నారు. భారతదేశ పౌరసత్వాన్ని నిరూపించుకునేదాకా నిర్వాసితులైన కుకీలను వారి ఊళ్లలోకి తిరిగి వెళ్లనివ్వవద్దని మెయితీలు డిమాండ్ చేస్తున్నారు.
మాదక ద్రవ్యాలు:
కుకీలూ, నాగాలూ, ఇంకా ఇతర తెగలు జీవనంకోసం ఆడవి వనరులతోపాటు, పోడు భూముల్లో వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటలు పండించేవారు. అంతగా దిగుబడీ ఆదాయమూ రాని ఆ పంటలను పక్కన పెట్టి, కొన్నేళ్ల నుంచి గంజాయి పండించడం మొదలుపెట్టారు. గంజాయి పంట పండించి, మాదక ద్రవ్యాలు తయారు చెయ్యడం చట్టవిరుద్దం. 2017 నుంచి 2023 దాకా, దాదాపు 18,000 ఎకరాలలో గంజాయి పంటను ప్రభుత్వాధికారులు ధ్వంసం చేశారు. ఇతర తెగలు కూడా ఈ పంట పండిస్తున్నా, మాదక ద్రవ్యాల వ్యాపారం ముఖ్యంగా మెయితీల చేతుల్లోనే ఉన్నా, మాదక ద్రవ్యాల తయారీ నేరమంతా పూర్తిగా కుకీలదే అంటుంది ప్రభుత్వం. అసలు కుకీలు భారతదేశానికి చెందినవారు కాదనీ, పక్క దేశాల నుంచి వలస వచ్చిన వాళ్లనే అబద్ధం కూడా ప్రచారమవుతోంది. పంటలను ధ్వంసం చెయ్యడంతోపాటూ కొంతమంది కుకీలను వాళ్ల ఊర్లనుంచి వెళ్లగొట్టారు. వాళ్లకు పునరావాసం కల్పించడం గానీ, ప్రత్యామ్నాయ పనులు చూపించడం గానీ ప్రభుత్వం చెయ్యలేదు.
అటవీ నిర్మూలనకూ, గంజాయి పంటకూ మయన్మార్ నుంచి వలస వచ్చిన కుకీలే కారణమని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ట్వీట్ల ద్వారా చెప్తున్నారు. ఇందులో గుర్తుంచుకోవలసిన విషయం, బి జె పి కి చెందిన ఈ ముఖ్యమంత్రి కూడా మెయితీనే. కుకీలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, పాలసీలు చేస్తున్నందుకు యాంటీ-కుకీ అని పేరు తెచ్చుకున్నాడు.
ఇంతకీ కుకీలమీద ఇలాంటి దాడి ఎందుకు జరుగుతోంది? కుకీలు నివసించే అటవీ కొండ ప్రాంతంలో ఎన్నో ఖనిజ నిక్షేపాలున్నాయి. వాటిని మెయితీల అధికారంలోకి తీసుకువచ్చి, మల్టీ నేషనల్ కంపెనీలకు అమ్మాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం.
అటవీ (పరిరక్షణ) అమెండ్మెంట్ బిల్లు 2023:
మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం మెయితీలను షెడ్యూల్ తెగగా గుర్తిస్తూ వాళ్లకు అడవి మీద అధికారాన్ని ఇస్తున్నప్పుడే, కేంద్ర ప్రభుత్వం అటవీ (పరిరక్షణ) అమెండ్మెంట్ బిల్లును, మార్చి నెలలో లోక్ సభలో ప్రవేశ పెట్టింది. దేశ ప్రజల దృష్టంతా మణిపూర్లో జరుగుతున్న దారుణమైన సంఘటనలపైన ఉన్నప్పుడే, పర్యావరణవేత్తలూ, ప్రతిపక్షాలూ ఎన్ని అభ్యంతరాలు లేవనెత్తినా, వాటిని ఖాతరు చెయ్యకుండా లోక్ సభలో జులై 26న ఆమోదింపజేసింది కేంద్ర ప్రభుత్వం. ఏ అడవినైతే కుకీలు ధ్వంసం చేస్తున్నారని అభియోగం మోపుతోందో, అదే అడవి నిర్వచనాన్ని మార్చేస్తోంది, అడవి ప్రాంతాన్ని కుదించేస్తోంది.
ఇప్పుడు అమలులో ఉన్న అటవీ పరిరక్షక చట్టాలేవీ ఇక ఈ ప్రాంతానికి వర్తించవు. ఈ బిల్లు ప్రకారం భారతదేశ సరిహద్దు ఆనుకుని 100 కిలో మీటర్ల దాకా ప్రాంతాన్ని ‘నేషనల్ సెక్యూరిటీ’ ప్రాంతంగా గుర్తిస్తారు. ఈశాన్య భారతదేశంలోని అటవీప్రాంతం దాదాపు అంతా ఈ 100 కి మీ లోకే వస్తుంది. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవి మీద ఏ హక్కులు ఉండవు. పునరావసమేదీ కల్పించకుండానే వాళ్లను అక్కడునించి వెళ్లగొట్టడం సులభమైపోతుంది.
ఈ బిల్లుతో భారతదేశంలోని దాదాపు 28% అడవి ప్రాంతం రక్షణ కోల్పోతుంది. ఇంత అడవిని పోగొట్టుకుంటే వచ్చే పర్యావరణ విపత్తుకు మొదట బలయ్యేది స్థానిక ప్రజలే.
పర్యావరణ పతనాన్ని ఆపడం కోసం ఇంకా ఎక్కువ భూమిని అడవిగా మార్చాల్సిన సమయంలో, ఉన్నదాన్ని ధ్వంసం చేసేందుకు ఈ చట్టం దోహదం చేస్తుంది. మణిపూర్ లోనూ, ఒడిస్సా, ఛత్తీష్గడ్ వంటి ఎన్నో ప్రాంతాల్లోని అడవిని ఆక్రమించి అక్కడి విలువైన ఖనిజ నిక్షేపాలను కాజెయ్యాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కుమ్మక్కైన మల్టీ నేషనల్ కంపెనీలు ఉవ్విళ్లూరుతున్నాయి. నామమాత్ర ప్రజామోదంతో లేదా, అసలేమాత్రం ప్రజామోదం లేకుండా జారీ చేసిన ఎం ఓ యూ లు ఇప్పటికే తయారై ఉన్నాయి.
దేశ అభివృద్ధి పేరిట ప్రభుత్వం చేస్తున్న ఈ దోపిడీని దేశ సామాన్య ప్రజానీకం అడ్డుకోడం జరగదు. ప్రకృతి వైపరిత్యాలు దేశమంతటా అల్లకల్లోలం సృష్టిస్తున్నా, తమకు అప్పటికప్పడు దొరికే ఆదాయ అవకాశాలనే సామాన్యులు పట్టించుకుంటారు. మల్టీ నేషనల్ కంపెనీలూ, రాజకీయ నాయకులూ దేశ ప్రకృతి సంపదను దోచుకుంటారే గానీ ఆ లాభాల్ని తమ దాకా రానివ్వరని జనం తెలుసుకోలేరు.
ఈ బిల్లు రాజ్య సభలోనూ ఆమోదం పొందితే, ఇది మణిపూర్ అడవులకే కాదు, దేశంలోని అన్ని అడవులకూ గొడ్డలి పెట్టు అవుతుంది. దశాబ్దాలుగా అడవిని రక్షించుకోవడానికి పోరాడుతున్న ఆదివాసీ తెగలకే కాదు, దేశమంతటి పర్యావణానికీ ఇది పెద్ద ముప్పు అవుతుంది. పర్యావరణ పరిరక్షణ ఆదివాసి ప్రజల ప్రత్యేక బాధ్యత కాదు. అడవులు, మైదానాల ప్రజలందరి బాధ్యత. పర్యావరణం పాడైతే బాధితులు ఆదివాసులు మాత్రమే కారు. పట్టణాలూ నగరలాలోని మనందరమూ.