(జాన్ బర్జర్
అనువాదం: సుధా కిరణ్)
(1984 మార్చి 6 వ తేదీ నుంచి, 1985 మార్చి 3 దాకా, దాదాపు ఒక ఏడాది కాలంపాటు బ్రిటిష్ గని కార్మికుల చారిత్రాత్మకమైన పోరాటం కొనసాగింది. మితవాద ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా, హింసాయుతంగా గని కారికుల సమ్మెను అణచివేసింది. గని కార్మికుల సంఘటిత శక్తి దెబ్బతీయాలని మితవాదులు సుదీర్ఘ మైన ప్రణాళికలు రచించారు. 1977లో తయారు చేసిన రిడ్లీ ప్లాన్ ని సమర్ధవంతంగా అమలుచేశారు. కార్మికుల సమ్మె పోరాటాన్ని దెబ్బతీయడానికి అనుసరించని పధ్ధతి లేదు. దుష్ప్రచారం, హింసాయుత సంఘటనలని రెచ్చగొట్టడం, పోలీసులని పురికొల్పడం, యూనియన్లలోకి ఏజెంట్లను ప్రవేశపెట్టడం, కార్మికుల్ని చీల్చడం – వీటన్నిటి మధ్యన సమ్మె సుదీర్ఘంగా కొనసాగింది. 20,000 మంది కార్మికులు పోలీసుల దాడులలో గాయపడ్డారు, ఆసుపత్రుల పాలయ్యారు. 13,000 మందిని అరెస్టు చేశారు. 200 మందిని జైళ్లలో బంధించారు. ఈ సమ్మె ఓటమి కార్మిక పోరాటాలలో కీలకమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. బ్రిటన్ లో కీలకమైన రాజకీయ, ఆర్ధిక మార్పులకు సమ్మె ఓటమి ఒక ప్రారంభబిందువుగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. నలభై ఏళ్ల తర్వాత ఈ సమ్మె ఇప్పటికీ ఉద్వేగభరితమైన చర్చలకు కేంద్ర బిందువుగా ఉంది. సమ్మె నేపథ్యంలో జాన్ బర్జర్ రాసిన ఒక చిన్న వ్యాసం ఇది. బ్రిటిష్ గని కార్మికుల సమ్మెకు 40 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఇటీవల ప్రచురించిన ‘ది అండర్ గ్రౌండ్ సీ’ పుస్తకం నుంచి ఈ వ్యాసాన్ని తీసుకున్నాం.)
ఒక న్యాయమైన లక్ష్యం ఓటమి పాలైనప్పుడు, ధైర్యవంతులని అవమానాల పాలుజేసినప్పుడు, గనుల బయటా, లోపలా మనుషులని అధములుగా పరిగణిస్తున్నపుడు, మంచితనాన్ని పనికిరానిదిగా తృణీకరించినప్పుడు, న్యాయస్థానంలో న్యాయమూర్తులు అబద్ధాలని నమ్ముతున్నప్పుడు, సమ్మెలో ఉన్న డజను మంది గనికార్మికుల కుటుంబాల పోషణకి సరిపడే మొత్తాన్ని దుష్ప్రచారం కోసం ఒక్కొక్క అబద్ధాలకోరుకి నజరానాగా చెల్లిస్తున్నప్పుడు, రక్తసిక్తమైన లాఠీలు పట్టుకున్న బలిసిన పోలీసులని విచారించకుండా పతకాలతో గౌరవిస్తున్నపుడు, గతాన్ని తిరస్కరించి, గతకాలపు వాగ్దానాలనీ, త్యాగాలనీ వంకర నవ్వులతో, అజ్ఞానంతో తూలనాడుతున్నపుడు, అధికారంలో ఉన్నవాళ్లు మంచిమాటని వినిపించుకోరనీ, ఏ విజ్ఞప్తులనీ పట్టించుకోరని కుటుంబాలు మొత్తం నమ్ముతున్నప్పుడు, న్యాయం కోసం తలుపుతట్టడానికి తావేలేదని నమ్ముతున్నప్పుడు, నిఘంటువులో ఎన్ని పదాలు ఉన్నా, ఇంగ్లాండు మహారాణి ఏమి చెప్పినా, పార్లమెంటరీ ప్రతినిధులు ఏ నివేదికలు ఇచ్చినా, తన సిగ్గుమాలిన తనాన్నీ, అహాన్ని కప్పిపుచ్చుకోవడంకోసం వ్యవస్థ తనకి తాను ఏ పేరు పెట్టుకున్నా, ఉన్నమాట మనకి మెల్లగా అర్ధమౌతున్నప్పుడు, వాళ్ళు మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మనకి మెల్లగా అర్ధమౌతున్నప్పుడు, మన వారసత్వాన్నీ, మన నైపుణ్యాలనీ, మన సముదాయాలనీ, మన కవిత్వాన్నీ, మన క్లబ్బులనీ, మన ఇంటినీ, ఇంకా వీలయితే మన అస్థికలను సైతం నాశనం చేయజూస్తున్నారనే విషయం మనకి మెల్లగా అర్ధమౌతున్నప్పుడు, జనాలు అంతిమంగా దీనంతటినీ గ్రహించినప్పుడు, వాళ్ళకి ఒకమాట వినిపించవచ్చు. హత్యల ఘడియలు, న్యాయమైన ప్రతీకారం ఆలోచనలు వాళ్ళ మెదళ్ళలో మెదలవచ్చు. గడచిన కొన్ని సంవత్సరాల కాలంలో, స్కాట్లాండులో, సౌత్ వేల్స్ లో, డెర్బీషైర్ లో, కెంట్ లో, యార్క్ షైర్ లో, నార్తంబర్లాండ్, లాంకాషైర్ లలో నిద్రలేని రాత్రులు గడుపుతూ, పక్కమీద పడుకుని ఆలోచిస్తున్న చాలామందికి ఆ ఆలోచనలు, ఆ మాటలు, ఆ గొంతులు వినిపించే ఉంటాయని నా నమ్మకం. దయనీయమైన దుస్థితిలో వున్నవాళ్ళు జాలిలేని కర్కశ హృదయులైన కఠినాత్ములని వధించాలన్న ప్రతిపాదనకంటే మానవీయమైన, సున్నితమైనదేదీ ఉండబోదు. సున్నితమైనదని మనం అభిమానించే మాట ఆ కర్కశ హృదయులకు ఎన్నటికీ అర్ధం కాదు. దాని అర్థమేమిటో వాళ్ళకి తెలియనే తెలియదు. ప్రపంచమంతా ఇవే ఆలోచనలు ఉదయిస్తున్నాయి. ప్రతీకారం తీర్చుకునే వీరులగురించి ఇప్పుడు కలలుగంటున్నారు, అలాంటి వీరులకోసం ఎదురుచూస్తున్నారు.
అలాంటి వీరులు ఎవరినైనా నేను నా నాశక్తియుక్తులన్నిటినీ వెచ్చించి సమర్ధిస్తాను, ఆశ్రయమిచ్చి కాపాడుకుంటాను. అయితే, నేను అటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన సమయంలో, అతను బొమ్మలు గీయడం తనకి ఇష్టమనీ, లేదంటే ఆ ఆశ్రయం తీసుకున్న వ్యక్తి ఒకవేళ స్త్రీ అయివుండి తనకి బొమ్మలు వేయాలని ఎప్పటినుంచో కోరిక వున్నా అందుకు అవకాశం, సమయం ఎప్పుడూ దొరకలేదని నాతో చెప్పారనుకుందాం. నేను వాళ్ళకి ఈ రకంగా సమాధానం చెబుతాను. మీరు కావాలనుకుంటే, మీరు చేయాలనుకున్న పనిని మరొక మార్గంలో సాధించవచ్చు. మీ సహచరులతో విభేదాలకు తక్కువ అవకాశం ఉండేలా, తక్కువ గందరగోళం ఉండేలా మీ పనిని మీరు మరొక మార్గంలో సాధించవచ్చు. కళ ఏమి చేస్తుందో, ఆ చేసే పని ఎలా చేస్తుందో నేను చెప్పలేను. కానీ చాలాసార్లు అది తీర్పులు ప్రకటించేవాళ్ళపై తీర్పు చెబుతుందని మాత్రం నాకు తెలుసు. అన్యాయానికి గురైన అమాయకుల కోసం ప్రతీకారాన్ని కోరుకుంటుంది కళ. గతం ఎలాంటి అన్యాయానికి గురయ్యిందో భవిష్యత్తుకు తెలియజేసి, ఆ అన్యాయాన్ని ఎప్పటికీ మరువకుండా చేస్తుంది కళ. బలవంతులు, శక్తివంతులు కళలు అంటే భయపడతారని కూడా నాకు తెలుసు. కళలు ఏ రూపంలోనైనా బలవంతులని భయపెట్టినప్పుడు, కొన్నిసార్లు అవి ఒక వదంతిగా, ఒక వీరగాథగా పరీవ్యాప్తమౌతాయి. ఎందుకంటే, జీవితపు కఠోర చిత్రహింసలు, దారుణాలు తెలియజేయలేని విషయాన్ని అవి తేటతెల్లంగా వెల్లడిచేస్తాయి. అంతిమంగా న్యాయం నుండి విడదీయలేనివిగా కళలు మనల్ని ఐక్యం చేస్తాయి. అలా పనిచేసినప్పుడు అవి కళ్ళకు కనిపించనివాటిని, నాశనం చేయలేని వాటిని, ఓర్పు, సాహసం, హాస్యం – కళలు వీటన్నిటినీ ఒక దగ్గరకు చేర్చుతాయి.