కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్

( భూమయ్య, కిష్టాగౌడ్ లు ఆదిలాబాద్ జిల్లా రైతాంగ కార్యకర్తలు. కిష్టాగౌడ్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, తొడలో తూటా ఉన్నవాడు. భూమయ్య జంగాల కులంలో పుట్టి ఉద్యమంలోకి వచ్చినవాడు. ఆదిలాబాద్ జిల్లాలో అప్పటి పార్టీ అవగాహన మేరకు 1971లో జరిగిన ఒక వర్గశత్రు నిర్మూలన కేసులో ఉరిశిక్ష పడింది. ఆసిఫాబాద్ కోర్టు ఉరిశిక్ష వేయగా హైకోర్టు, సుప్రీం కోర్టులు నిర్ధారించాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష నిరాకరించాడు. చివరికి డిసెంబర్ 1, 1975న ముషీరాబాద్ జైలులో ఉరితీశారు. )

కామ్రేడ్స్ భూమయ్య, కిష్టాగౌడ్ లు కళ్ళల్లో ఆడుతున్నారు. బట్టతల, పెద్ద మొహం, దృఢకాయం, కొంచెం పొట్టి, నిదానం, సౌమ్యత- భూమయ్య. ఉంగరాల జుత్తు, మీసం, ఆవేశం, నిర్లక్ష్యం చెరలాడే కళ్ళు- కిష్టాగౌడ్. ఈ ఇద్దరూ చూసిన వాళ్ళందరి మనసుల్లోనూ మనోచిత్రాలుగా వుండిపోవలసిందే ఇంక. చూడని వారికి రెండు పేర్లు. రెండు ఎర్రని పేర్లు. ఆ పేర్ల చుట్టూ తెలుగు దేశంలో ముప్పది సంవత్సరాల వీర తెలంగాణ, పది సంవత్సరాల నక్సల్బరీ, శ్రీకాకుళ జ్ఞాపకాలు… రెండు సంవత్సరాలు ఆ యిద్దరి గూర్చి సాగిన ప్రజా ఆందోళన. ఒక సంవత్సరం పాటు దేశాన్ని ఆందోళన పరచిన ఉరిశిక్ష… చివరకు ఎమర్జెన్సీ చీకటి తెరమాటున ఉరికంబానికి వేలాడిన రెండు సజీవ వర్గ చైతన్య ప్రాణాలు… ఈనాడు ఆకాశంలో అరుణతారలు.

ఎక్కడా వాళ్ళదొక్క ఫొటో కూడ లేదు… మొదటిసారి వాళ్ళ ఉరిశిక్ష తేదీ నిర్ణయమై వాళ్ళకా విషయం తెలియజేసిన రోజు నవంబర్ 25, 1974. దినమంతా ఎలాగైనా వాళ్ళ ఫొటోలు తీయించాలని ప్రయత్నించాం అదే జైల్లో వేరే బ్యారక్స్ లో వున్న విరసం వాళ్ళం. జెయిల్లో, అందులోనూ ఉరిశిక్ష పడి గంజ్ లో వుండే వారి ఫొటోలు తీయించడం ఎంత కష్టమో ఊహించవచ్చు. ఆ మొదటి ప్రమాదం తప్పి పోయింది. తర్వాత వాళ్ళ రేఖా చిత్రాలయినా చంద్రతో వేయించాలనుకున్నాం. కానీ, చంద్ర వాళ్ళను చూసేదెట్లా? వాళ్ళతో కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇచ్చినా వాళ్ళున్న సెల్స్ దగ్గరికి వెళ్ళాల్సిందే. భూమయ్య, కిష్టా గౌడ్ లను – ఈనాడు ప్రపంచంలోని పీడిత ప్రజలందరికీ, పరిచయమయిన ఆ ఇద్దరినీ వారుండగా సికిందరాబాదు జైలుకు ఖయిదీలుగా వెళ్ళిన ఏ కొద్దిమందో చూసివుంటారు. బయటవున్న శ్రీశ్రీ, పత్తి పాటి, కన్నభిరాన్ చూసివుంటారు. మానవజాతి స్వేచ్ఛ కోసం కలలుగని, పోరాడిన కామ్రేడ్స్ జెయిలు పాలయ్యారు, ఉరితీయబడ్డారు. స్వేచ్ఛ కోల్పోయి జెయిలు పాలయినవారు మాత్రమే వాళ్ళను చూడగలిగారు. స్వేచ్ఛ ఎంత విలువయినది!

***

ఆ రోజు మే 10, 1975. అంతకు 15 రోజులముందే విడుదలయి కండిషనల్ బెయిలు మీద హైదరాబాదులో వుంటున్నాను. ఖైరతాబాద్ లో విరసం యూనిట్ సమావేశమై నేనూ రంగనాధం సీతారాంబాగ్ వెళ్ళిపోయాం . మాతో పాటు నడచి వచ్చి రేడియో స్టేషను ముందు బస్సెక్కాడు నగ్నముని. బస్సులో కొందరు విద్యార్థులు ‘భూమయ్య, కిష్టా గౌడ ల ఉరిశిక్షలు రద్దుచేయాలి’ అని నినాదాలు యిస్తున్నారు, కరపత్రాలు పంచుతూ. తానూ గొంతు కలిపిన నగ్నమునికి అప్పటికింకా తెలియదు ఆరాత్రి వేకువగా మారకముందే ఆ ఇద్దరి గొంతులూ నొక్కడానికి ప్రభుత్వం కుట సిద్ధం చేసిందని. ఆ విద్యార్థులు చెప్పారు ఆ విషయం నగ్నమునికి. వాళ్ళు డి.ఎస్.ఓ విద్యార్థులు… వాళ్ళ చేతుల్లో కరపత్రం పౌరహక్కుల పరిరక్షణ సంస్థ (ఓ పి డి ఆర్) వేసింది. హుటాహుటిని పరుగెత్తుకొచ్చాడు మా దగ్గరికి నగ్నముని. నేరుగా హైకోర్టులో నక్సలైట్ల డిఫెన్స్ కమిటీ బాధ్యుడైన న్యాయవాది యింటికి వెళ్ళాం. ఆయన దగ్గరే కన్నభిరాన్ చేస్తున్న ప్రయత్నాల గురించి విన్నాం. ఆయన కళ్ళు అన్ని ప్రయత్నాలు విఫలమయి అలసిపోయాయి. ఎప్పుడు చిరునవ్వు తొణికే ఆ ముఖంలో విషాదం. అక్కడి నుంచే రాష్ట్ర సిపిఐ కార్యదర్శికి ఫోన్ చేసాం- ఢిల్లీలో రాజేశ్వరరావుతో మాట్లాడవలసిందిగా. మేమప్పటికే ఇతనికే నిద్రాభంగం చేసాం. రాజేశ్వరరావు పాట్నాలో వున్నాడన్నాడు. అయితే అక్కడికే ఫోన్ చేయమన్నాం. అక్కడి అడ్రసు తెలియదన్నాడు. పార్టీ ఆఫీసుకు చేయమన్నాం. వీలుకాదన్నాడు. అయితే ఢిల్లీలో భూపేశ్ గుప్తా ప్రయత్నాలు చేస్తూ వున్నాడని, ఆయనే రాజేశ్వరరావును కాంటాక్ట్ చేస్తాడని చెప్పాడు. మాకు సంతృప్తి కలగలేదు. అక్కడి నుంచి కన్నభిరాన్, దగ్గరికి వెళ్ళాం. అప్పటికే తాను చేయవలసిన, గలిగిన ప్రయత్నాలన్నీ చేసి సెలవుల్లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తున్న చిన్నపురెడ్డి, గంగాధరరావుల దగ్గరికి ముగ్గురు న్యాయవాదులను పంపించి ఎదురుచూస్తున్నాడాయన. అందరం కలిసి జెయిలు దగ్గరికి వెళ్ళాం. అప్పటికే ఆ రోడ్డంతా అక్కడక్కడా చెదరి చెదరి విద్యార్థులున్నారు. ఎక్కువగా పిడిఎస్‌యు, డిఎస్ఓ విద్యార్థులు. రోడ్డంతా పోలీసుల కాపలా. ‘మేం కోర్టులో రిట్ దాఖలా చేసాం. దానిమీద తీర్పు వచ్చేదాకా ఉరిశిక్ష ఆపండి- కోర్టు సెలవుల్లో వుంది గనుక వెనుకాముందు కావచ్చు…’ అని జెయిలు సూపరింటెండెంట్ కు చెప్పాలని మా ఆవేదన. మాకు మిగిలిన ఆఖరి గడ్డిపోచ అది. కాని మమ్మల్నసలు పోలీసులు ఆ పరిసరాలకు పోనిస్తే గదా. ఇంతలో స్టే ఉత్తర్వులు పట్టుకొని హైకోర్టు అధికారితో పాటు వచ్చారు నరసింహాచారి, ఓపిడిఆర్ మెకటకృష్ణ, వెంకటరెడ్డి, (వీళ్ళే న్యాయవాద త్రయంగా తర్వాత ప్రసిద్ధమైన వాళ్ళు) మళ్ళీ రెండవసారి ఈ రెండు ప్రాణాలు నిలిచాయి. ఈ వార్త బయటికి ఎట్లా వచ్చింది ? ఉరిశిక్ష పడిన వారికి 24 గంటలకు ముందు ‘రేపు మిమ్ములను ఉరితీస్తారు’ అని జెయిలు సూపరింటెండెంట్ స్వయంగా తెలపాలి. జెయిల్లో ఒక విషయం ఒక ఖయిదీకి తెలిసిందంటే జెయిలంతా తెలిసినట్లే. కాని బయటికి తెలిపేదెట్లా ?

10 మే మధ్యాహ్నం 3 గం. ప్రాంతంలో ఒక పీడీఎస్‌యు విద్యార్థి ఆ జెయిలు ముందుగా సైకిల్ మీద హైదరాబాదు వైపు వస్తున్నాడు. అధిక ధరలు, బస్సు రేట్లు, ఆర్ఎస్ఎస్ తో ఘర్షణలు వంటి పోరాటాల సందర్భాల్లో ఆ జెయిలుకు వస్తూ పోతూ వున్న వాడు గనుక అక్కడ జవాన్లతో చనువూ పరిచయము వుంది. గేటు ముందువుండే జవాన్ ను పలకరించడానికి దిగాడు. ఆ జవాన్ మెల్లగా చెవిలో ఊదాడు… రేపు ఉదయమే ఉపద్రవం జరుగబోతున్నదని. వెంటనే ఆ విద్యార్థి పత్తిపాటి ఇంటికి ఉరికాడు. కోర్టు సెలవులు. ఆయన ఊళ్ళోలేడు. కన్నభిరాన్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఆయన గవర్నర్ (అపుడు యాక్టింగ్ గవర్నర్ ఓబుల్ రెడ్డి) దగ్గరికి వెళ్ళి ఆడిగాడు . ఆయన తన అసహాయత వ్యక్తం చేసాడు. ఒపిడిఆర్ వాళ్ళు అప్పటికప్పుడు కరపత్రం వేసారు. ఏమయితేనేం ఆ రాత్రికి కోర్టు వాళ్ళ ప్రాణాలు నిలిపింది. మళ్ళీ ఉరి శిక్షల రద్దు ఉద్యమం ప్రారంభమైంది. ఎన్నో ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, ప్రజాతంత్ర వాదులు కలిసి ‘భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు కమిటీ’ ఏర్పడింది. ఈసారి ఉద్యమం దేశవ్యాప్తమయింది. జయప్రకాశ్, ఫెర్నాండెస్, చంద్రశేఖర్ లు మొదలుకొని పార్ల మెంటు సభ్యులు, సుప్రీం కోర్టు న్యాయవాదులు, రిటైరైన న్యాయమూర్తులు, వివిధ జీవనరంగాల్లో నున్న వాళ్ళు ఉరి శిక్షల రద్దు కోసం ఆందోళన చేసారు. ఒక నెల పదిహేను రోజులు ఏ ఒక్కరోజు విడుపు లేకుండా సభలు, సమావేశాలు ఆందోళనలూ కొనసాగాయి. (1) జూన్ 25 రాత్రి, జూన్ 26 ఉదయం భూమయ్య కిష్టా గౌడ్ లు వున్న జెయిలుకు వందల సంఖ్యలో, దేశంలోని వివిధ జెయిళ్ళకు వేలు, పది వేలు, లక్షలసంఖ్యలో ఇందిరా రాజకీయ ప్రత్యర్థులు వెళ్ళవలసి వచ్చింది. లేదా అజ్ఞాతంలోకి వెళ్ళవలసి వచ్చింది. ఒక నిశ్శబ్దమైన నిరసనభావం గుండెల పై ఒక భయంకరమైన ఇనుప గజ్జెల తప్పెట మోగింది.

***

1975 డిసెంబర్ 1వ తేదీ ఉదయం వరంగల్ జెయిలు, అనూహ్యంగా జెయిల్లో జవాన్ల కట్టుదిట్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజూ చనువుగా మాట్లాడే జవానులు ఆ రోజు సీరియస్ గా, రిజర్వ్‌డ్ గా దూరంగా వున్నారు. పత్రికలొచ్చాయి. ఒక్క ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో మాత్రం ఒక పిడుగులాంటి వార్త. న్యూఢిల్లీ, డేట్ లైన్ నవంబర్ 30, మర్నాడు అమలు జరుగనున్న భూమయ్య కిష్టాగౌడ్ ఉరిశిక్షలు ఆపవలసిందిగా రాష్ట్రపతికి, ప్రధానికి సిపిఐ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు విజ్ఞప్తి చేసినట్లు, ఫలితం ఏమయిందో తెలియదు. విఫలమై వుంటే ఈ పాటికి వాళ్ళను ఉరి తీసేవుంటారు. ఎట్లా తెలియాలి. జెయిలు అధికారుల రౌండ్ వచ్చింది. ఎప్పుడో కాని రాని సూపరింటెండెంట్ కూడ వచ్చాడు. మొత్తం ఆధికారులు వచ్చారు. ‘ముషీరాబాదు జెయిల్లో భూమయ్య కిష్టాగౌడ్ లను ఉరితీసినట్లు మీకేమయినా తెలిసిందా!’ అని అడిగాము. ‘లేదు’ అని ముక్తసరి జవాబు. పత్రికల ద్వారా, రేడియో ద్వారా కూడ మాకు తెలియని ఎన్నో విషయాలు ఎంతో ఆతురతతో పరుగెత్తుకొచ్చి మాకు చెప్పే ఒక జెయిలు అధికారి (2) కూడ ఆరోజు మౌనంగా వున్నాడు. రౌండ్ వెళ్ళిపోతుంటే అందరికన్న వెనుకవున్న ఆయనను మెల్లగా అడిగాము ‘నిజం చెప్పండి, మీకేమీ తెలియదా!’ తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పి వెంటనే మొహం తిప్పుకొని వెళ్ళి పోయాడు. ఆయన మొహంలో విషాదం కనిపిస్తూనే వుంది. మాకు అనుమానంగానే వుంది. వరంగల్ జెయిల్లోనే నక్సలైట్ బ్యారక్ లో ఖయిదీలుగా వున్న బర్ల యాదగిరి రాజు మొదలయినవారు ఏదో కేసుకోసం హైదరాబాదుకు వెళ్ళి వచ్చి తెచ్చారు వార్త “వాళ్ళను డిసెంబర్ 1 ఉదయం ఉరితీసారు.”

నాలుగు సంవత్సరాలు ఉరి కొట్లలో ఏరోజుకారోజు మృత్యు ఆహ్వానం కోసం నిరీక్షిస్తూ, రెండుమార్లు మృత్యు ముఖంలోకి వెళ్ళి కూడ మళ్ళీ బతికిన కామ్రేడ్స్ ఉరిశిక్షలను తప్పించలేక పోయాం. ఇది ప్రజాతంత్ర శక్తులకు బాధాకరమైన విషయమే. కాని ఈ ఇద్దరు కామ్రేడ్స్ విషయంలో ఒక్క మాట మాత్రం చెప్పగలను. ఎమర్జెన్సీ లేకపోతే ఇందిరా వెంగళరావు క్రూర పాలకవర్గం ఈ పిరికి పనిని ఇంత నిస్సిగ్గుగా చేసివుండేదికాదు. (3) అయితే అందాకా ఈ సమస్య ఎందుకు నానింది అంటే మాత్రం అందులో నా బాధ్యత, నీ బాధ్యత, ప్రజాతంత్రవాదులందరి బాధ్యత వుందని తలదించుకుంటాను.

  1. అలాంటి ఒక అపూర్వమైన సమావేశం 1975, మే 17 న హైదరాబాదు క్లాక్ టవర్ దగ్గర భూమయ్య కిష్టా గౌడ్ ల ఉరిశిక్షరద్దు కమిటీ ఏర్పాటు చేసింది. అందులో పాల్గొనని వాళ్ళు ఒక్క అధికార పార్టీ వాళ్ళే. ఎమర్జెన్సీలో పోలీసులు కాల్చిచంపిన జంపాల ప్రసాద్ తో నేను కలిసి పాల్గొన్న ఆఖరి సభ అది.
  2. ఇతని పేరిప్పుడు దాచనక్కర్లేదు. జెయిలు అధికారుల ముఖ్యంగా ఒక జెయిలర్ దౌష్ట్యానికి గురయి ఎమర్జెన్సీలో చాల ఇబ్బందులు పడ్డాడు. ఎమర్జెన్సీలోనే గుండె ఆగి చనిపోయాడని తర్వాత తెలిసింది. యువకుడు. ఆయనకు చిరునవ్వులాంటి చిన్నపిల్లలు. ఆయన పేరు శ్రీ శౌరయ్య.
  3. ఈ వ్యాసం 1977 నవంబర్ లో రాయబడింది. అప్పుడీ మాట రాయగలిగాను కాని అంతకన్నా నిస్సిగ్గుగా మొరార్జీ – ఎం జి ఆర్ ప్రభుత్వాలు కృష్ణన్ చెట్టిని ఉరి తీసాక ఏమో ఎమర్జెన్సీ లేకున్నా ఇది ఆపగలిగామా అని ఆలోచనలో పడ్డాను. అయితే భూమయ్య, కిష్టాగౌడ్ ల విషయంలో జరిగిన ప్రజాందోళనతో పోల్చినపుడు కృష్ణన్ చెట్టి పేరు అసలెవరూ వినలేదు .

(‘సృజన’ డిసెంబర్ 1978)

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

Leave a Reply