జీవితాన్ని ప్రేమించని వాళ్ళెవ్వరు…!!!?
జీవితానుభవాల వాలుల్లో వికసించే జీవనపుష్పాలపై మనం యెలాంటి సీతాకోకచిలుక ప్రభావం కమ్ముకోవాలనుకొంటాం… !!!?
జీవితారంభంలో మనకి యే దారి మన దారని స్పష్టంగా తెలిసే అవకాశం వుండకపోవచ్చు… లేదా వుండొచ్చు… బై ఛాయిస్ మనం యెంచుకొనే దారి వెలుగుల దారి అయినప్పుడు ఆ ప్రకాశం సమాజంలో అత్యంత దోపిడీకి ఆకలికీ లోనైనా జీవితాలపై విరజిమ్మితే అలాంటప్పుడు సుదీర్ఘమైన తన మనోప్రయాణపు రంగురంగులని వొకానొక ప్రభాతాన వొక్కో రేకు మెల్లగా మెల్లమెల్లగా విప్పారుతున్నట్టు మనకి అందిస్తే… ఆ విచ్చుకోవటంలో సంతోషముంది. దుఖం వుంది. అన్యాయంగా కోల్పోయిన గాయాలున్నాయి. భీతావహామ్ యెంత కనిపిస్తోన్నా తిరిగితిరిగి ప్రతి ప్రభాతం వాగ్ధానం చేస్తోన్న విప్పారే అరణ్యముంది.
అసలీ…
‘నేనూ
నా మబ్బుతునక
యింకా
వో వొంటి రెక్క సీతాకోకచిలుకని’ మనకి యిచ్చిన సందర్భం యేమిటి…
అసలు యెందుకు యీ వొంటి రెక్క సీతాకోకచిలుక…
వొక తరం చరిత్రని చెప్పడానికి రాస్తారు. వొక జాతి చరిత్రని వొక బిగిని చెప్పాల్సి వచ్చినప్పుడు రాస్తారు. వొక ఐడియా యెక్కడా తెగకుండా కంట్రోల్ పోకుండా చెప్పగలమన్న ధైర్యం వున్నప్పుడు రాస్తారు.
అనామధేయుడు గారి కవిత్వాన్ని చదువుకొన్నవారెవరికైనా భిన్న సందర్భాల్లో వారు రాసిన లాంగ్ పోయెమ్స్ అస్సలు మర్చిపోడానికి వీలులేనంత బలంగా వుంటాయి అన్న విషయం యెరుక వుంటుంది. అవి మనల్ని వెంటాడతాయి. సుడిగాలిలా మన లోలోపల సుళ్ళు తిరుగుతాయి.
వొక తరం తరంగం యెప్పుడూ వంటరిగా వుండవు. వంటరిగా రావు.
వొక తరం తలెత్తుకునే లోపల మరికొన్ని తరాలు శెలవు తీసుకోవాలి. మరికొన్ని తరాలు తలెత్తుకొంటున్న తరంతో ఘర్షించాలి. యిది నిలకడగా వుంటుంది అనుకునే లోపల మళ్ళీ కొత్త తరాలు వస్తాయి.
చిన్ని అలలను తనతో పాటు తీసుకొంటూ తన ముందుకొచ్చిన అలల్ని దాటుకొంటూ తీరం నుంచి తిరిగి వస్తోన్న అలలను యెదుర్కొంటూ యిలా వొక్క అల విడిగా చూపించటం కుదరని పని. అల పైకి యెగసినప్పుడో విరిగి కుదేలైనప్పుడో ఆ వొక్క క్షణాన్ని పట్టుకొని వొక పద్యమో చిన్ని కవితో రాయవచ్చును కానీ అందులో కెరటాలను బంధించలేము. దీర్ఘ కవితలో జీవితకాలాన్ని వొడుపుగా వొక కిటీకీ గుండా చూపించొచ్చును కానీ ఆ పని చెయ్యడానికి చాల నిజాయితీ కావాలి. దక్షత కావాలి.
వో 50 యేళ్ళ సమయంలో యే మనిషి పేరు, యే ప్రాంతపు ఆనవాలు దేనికి ప్రతీక అవుతుంది అన్నది ఆ 50 యేళ్ళ జీవితంతో సంబంధము వున్న వాళ్ళకే తెలుస్తుంది. అది లేని వారికి కవితతో పాటు దాని అర్థం విడమర్చి చెప్పే సందర్భ సూచిక అవసరం అవుతుంది.
అలలకి వొక సుస్థిర అస్థిత్వం అంటకట్టటం పొరపాటు. వొక అల వొక తరం యెక్కడ ఆగిపోతుంది అని ప్రశ్నించటం పొరపాటు. వొక అల తన అంశని తన ముందు అలల్లోనూ తన తరువాత అలల్లోను చూసుకుంటుంది. తన గతం తన భవిష్యతు రెంటిని తనలోనే ప్రతిక్షణం యిముడ్చుకొని వుంటుంది – అదే అల.
వందేళ్ళ క్రితం పుట్టిన చారుదా ఆ తరువాత పుట్టిన కాను సన్యాల్ ఆ తరువాత పుట్టిన పార్వతీపురం స్కూల్ మాస్టార్లు ఆ తరువాత పుట్టిన శివసాగర్ గారు… వివి సర్… అజ్ఞాత సూరీడు గారు… కౌముది గారు… జలజలలాడుతూ ప్రచండ వేగంతో వచ్చిన వారెందరో… ఆ తరువాత వచ్చిన అనామధేయుడు గారు… ఆపై రాబోయే మరొకరెవరో వీళ్ళందర్ని కలిపే వొక సూత్రం వొక ఆశయం యేమై వుంటాయి అన్న ప్రశ్నకి నిర్దిష్టంగా యిదే ఆఖరి జవాబు అని చెప్పటానికి నిరాకరించే ‘నేనూ నా మబ్బు తునక యింకా వో వొంటి రెక్క సీతాకోకచిలుక’.
యీ ‘వొంటి రెక్క సీతాకోకచిలుక’ని యెలా సమీపించాలి… యెలా ఆ యెగిరే జ్వాలారంగులన్ని నింపుకోవాలి… కవిత్వమంటే యేమిటని మనం పెద్దగా తడుముకోకొండానే యీ ధగధగ మెరిసే సమ్మోహక కవి…
“కవిత్వం అంటే దొంగ నిద్ర నటించే సముద్రం
కవిత్వం అంటే సీసపు పెంకులు నమిలి తినే వొంటరి పక్షి” అని నిఖార్సు గా చెపుతోంటే వీరి కవిత్వాన్ని తూచగలిగే శక్తి సామర్ద్యాలు లేవు. అంతటి శక్తీ నాకు లేదు. కానీ వారి కవిత్వం మృదుల నేత్రమై పలకరిస్తుంది. సంజగాలుల్లోని బెంగని నరనరాల్లో కుమ్మరిస్తోంది. వొక నినాదంగా వొక పతాకాన్ని అందుకోమంటుంది. నిర్లజ్జాకరమైన దోపిడీనీ హింసనీ రాజ్యంరెక్కల నీడల్లో సంచరిస్తూ వెంటతరుముతోంటే అమ్మలా చేతులడ్డుకాచిన ప్రాణదీపంలా హత్తుకొని దారి చూపిస్తూనే వుంటుంది. దురాధిక్యతని సహించలేని మనశాకాశంలో ప్రకాశవంతమైన కలల్ని కానుక చేసే వీరి లాంగ్ పోయెమ్…
‘నేనూ
నా మబ్బుతునక
యింకా
వో వొంటిరెక్క సీతాకోకచిలుక’ అంటుందీ…
‘యింత మోసపూరిత కాలాన్ని యే తరమూ చూసి వుండదు
యింత విఫల జీవనాన్ని యే నాగరికతా యెలుగెత్తి వుండదు’ –
యెటువంటి కాలమిది…
అన్నిటా అయోమయపు ఆకాంక్షలూ యేవి యెవరి దారులో యే దారి తమ దారో యేది భవిష్యత్తో యేది వర్తమానమో యేది గతమో అవగతం కానీ సమయాల్లో యేది నిర్భామందమో యేది స్వేచ్చో తెలియని తికమకకాలమిది.
చారుదా శతజయంతి, విరసం యాభై వసంతాల సందర్భంగా వచ్చిన యీ దీర్ఘ కవితని…
‘యీ బీళ్ల నేలమీద
సుడులు తిరుగుతున్న
గ్రీష్మ గానానికి
అతడు
వో వర్ష పరిమళాన్ని
వాగ్దానం చేసి వెళ్ళాడు.
యీ బానిసల దేశం
యెండిన పెదాల
యెడారి దాహగీతం మీద
అతడు
వో విముక్తి వాక్యాన్ని తడిగా రాసి వెళ్ళాడు.
యీ దారి యెప్పటికీ
చారుమజుందారే!’
అని ప్రేమగాచెపుతూ…
అలానే
‘యాభై వసంతాల కోసం
యాభై శిశిరాల్ని
దాటి వచ్చిన’
విప్లవ సాంస్క్రతిక సైన్యం విరసంకి ప్రేమతో అర్ధశత వార్షికోత్సవాల సందర్భంగా అంకితం యిచ్చిన యీ దీర్ఘ పోయెమ్ ఆద్యాంతమూ చారూదా దారే తన దారి అని వుద్యమ దారి ఆ త్యాగాల దారి ఆటుపోట్ల దారిలో అడివి పాడుకునే ఆత్మగీతాలున్నాయి అని నిక్కచ్చిగా చెపుతోన్న యీ దీర్ఘకవితలో మూడు స్టాంజాలున్నాయి.
“యీ దారిలోనే
నా కలలున్నాయి
నా కన్నీళ్లున్నాయి…” అని తన దారిని ప్రకటించుకొన్న కవి యేమంటున్నారంటే
“యీ దారిలోనే
నా గాయాలున్నాయి
నా గానాలున్నాయి…
యిదిగో… యిక్కడే
నెత్తురు రాలి
నెత్తావి అయిన దారిలోనే
నేనూ
నా మబ్బుతునక
యింకా వో వొంటి రెక్క సీతాకోకచిలుక!”
యే నేల విముక్తిని అతను కలగని తరతరాలుగా తల్లిబిడ్డలకు కలగనటాన్ని నేర్పించినప్పటి నుంచి అతను తన దారి యెలా అయ్యారో… యెలా క్రాంతిదర్శి అయ్యారో మొదటి స్టాంజాలో చెపుతారు.
రెండవ స్టాంజాలో…
“యిదిగో… యిక్కడే
వేకువరాలి
నెగళ్లు రగిలిన దారిలోనే
నేనూ నా కలల మబ్బు తునక
యింకా
వో వోడిపోని వొంటి రెక్క సీతాకోకచిలుక!”
నాగేటి చాళ్ళని అతనెలా యుద్దక్షేత్రాలుగా మల్చారో నాగళ్ళు పట్టిన చేతులకి ఆయుధ శిక్షణనిచ్చిన ఆ వడిసెల గానం రువ్విన ఆ ఆదివాసీ తుడుం ఝుంకారం ఆ తెల్లటి పావురాయి నయనపు స్వరాన్ని అతడెప్పుడూ వినలేదు… ఆ సమక్షాన్ని యెప్పుడుపొందక పోయినా అతడి స్వప్నాన్ని నిలువెల్లా నింపుకోవటమే కాదు గమ్యనిర్దేశాన్ని గమనంగా చేసుకొన్న తరమది. యేమంత సులువూ సులభం కాని ఆ దారినే యెంచుకొని ఆకలి మంటలపై యుద్ధం చేయ్యటానికి జీవితాన్ని వెలిగించే ప్రేమనిచ్చిన అతనే అతని గురి. అతనే వుపాధ్యాయుడని అవాజ్యమైన గౌరవంగా చెపుతారు.
మూడవ స్టాంజాలో…
“యిదిగో… యిక్కడే
తూర్పు రగిలి
తుపాకుల వనమైన దారిలోనే
నేనూ
నా కురుసే మబ్బుతునక యింకా
వో సాయుధమైన వొంటిరెక్క సీతాకోకచిలుక!
అంటూ యిప్పుడు మాకు కావాల్సింది అగ్ని…
యిప్పుడు మాకు కావాల్సింది అతడు
అతడు నా బరి
అతడు చారుమజుందారి!”
అంటూ తన జీవిత దృక్పధపు అంతరంగంలో బాహ్యజీవితపు సంవేదనల సుందర దృశ్యజగతి గాఢాతీతమై సహస్ర బంధనాల్లోనే యీ లోకపు నికార్సైన విముక్త దిక్సూచి యీ ‘వొంటి రెక్కల సీతాకోచిలుక’ అని కవి స్పష్టం చేస్తారు.
వున్మత్త సమయాలు పూర్తిగా రెక్కలు విప్పుకొన్న యీ కాలంలో మనముందుకు వచ్చిన యీ ‘మబ్బుతునక’ దీర్ఘ కవిత చరిత్రలో నిలిచిపోయే నిత్యవసంతం.
చారుమజుందార్ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రణాళిక రచించిన వుద్యమకారులని పుస్తకాలు చదువుకొన్న వొక తరం వాళ్లకి తెలియకుండా వుండదు. కొత్తగా తలెత్తుతోన్న తరానికి తరంగానికి అదే మజుందార్ వొకటే వూపిరితిత్తితో గాలిని మళ్లించిన స్వాప్నికుడన్న విషయం వొంటి రెక్క సీతాకోకచిలుక అన్న ప్రతీకతో అందుతోంది. యిది కవి మార్మిక జ్ఞానంతో వేసిన మంత్రం.
రండి… యీ కవి స్వప్నించిన ‘నేనూ నా మబ్బుతునక యింకా వో వొంటి రెక్క సీతాకోకచిలుక’ అని కలవరించి పలవరించి శ్వాసిస్తూ ‘మనం రాలిపోతా ఆగిన చోట కొన్నిసార్లు కన్నీళ్ళకూ దార్లుండవు. యింత గాలి చాలు… వొకింత వేకువచాలు వొకే వొక్క వీరుడు చాలు చరిత్రకు అతడు చాలు చరిత్రయి అతడు చాలు!’ అంటూ అపురూమైన అనేకానేక రంగురంగుల కవిత్వాన్ని అందించినందుకు అనామాధేయుని గారికి హృదయపూర్వక అభినందనలు. కృతజ్ఞతలు.
అనామధేయుడి కవితలు చాలా కొద్దిగానే చదివాను. పోరాట నినాదమైనా, గ్రీష్మ గానమైనా ఆయన సంతకం ప్రత్యేకం. కవిత్వం గురించిన పోలికలూ, కవిత్వంలో వాడిన ప్రతీకలూ పాఠకులపై గాఢ ముద్ర వేస్తాయి. అనామధేయుడి కవిత్వం గురించిన మీ విశ్లేషణ.. మీ రచనా శైలితో మిళితమై ఆకర్షణీయంగా కనిపిస్తోంది!