భూగర్భ సముద్రం

అలల హోరు వినబడని సముద్రాలుంటాయా?
ప్రకృతి పాటలు పాడని పక్షులుంటాయా
అడవిని వెంట పెట్టుకోని నడవని మూలవాసులుంటారా?
మేమూ అంతే – ఈ నేల బిడ్డలం కదా మరి!

ఒక్కసారి మీ గుండె చప్పుడు మీరే వినండి
మాపై మీరు అనధికారంగా పేర్చిన
అధికారాల దాహపు చితి చిట్టా
వినబడుతుందా?!

అద్దంలో ముఖం చూసుకోండి
మా చిక్కటి రక్తాన్ని ఐశ్వర్యం విస్కీ గ్లాసులో పోసుకుని..
మా అమాయకత్వాన్ని ఐస్ ముక్కలుగా చేసుకుని
తాగుతున్న రక్త పింజర్లు కనిపిస్తాయి

యంత్రాలన్నీ మా రక్తంతో తడిచి
రంగురంగుల వువ్వుల్లా మీ జీవితాలను అలంకరించినవే
మా శ్వాసతో మా ఖాళీ కడుపులతో
మా చెమట గ్రంధులతో
ఊపిరి పోసుకున్న సహజ వనరులన్నీ ..
అంటరానితనాన్ని మాకంటగట్టి
మీకు సింహాసనాల్ని నిర్మించినవే

మీరు పైపైకి ఎగబాకటం కోసం
మా ముఖాన మీరు పడేసిన భిక్షేగా సంక్షేమం?
ఇది మా స్వేచ్ఛను హరించి
ప్రశ్న గొంతును నులిమేసే కుతంత్రమే కావొచ్చు

ఇంకా ఎన్నాళ్లనీ ..
మా తలల్ని మేమే పాతాళంలోకి తొక్కుకొని
వెన్నుపూసల మీద మిమ్మల్ని జెండాలుగా ఎగరేయగలం?

తెగిన బొటన వేలు నేల మీద పడి స్వేచ్ఛ కోసం
ఇంకా కొట్టుకుంటేనే ఉంది…
దాని రక్తపు తడి ఇంకా ఆరనేలేదు

భూగర్భంలో సముద్రం పోటెత్తుతోంది..!
అలల హోరు వినబడుతోందా?!

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

2 thoughts on “భూగర్భ సముద్రం

  1. అధికారాల దాహపు చితి చిట్టా

Leave a Reply