తెల్లారకముందే మైసడు సచ్చిండని గూడెం అంతా ఎరుకైంది. ఇంటి దగ్గరి మొగోళ్లు ఐదారుగురు ఉరికిర్రు. మైసని పెండ్లం భీమి ఇంటికాడ ఇద్దరు పోరగాండ్లను ఇడిసి, మంచాల ఉన్న సిన్నపోరీని సంకలేసుకొని ఆల్లెంబడి ఉరికింది. బిర్రబిర్ర ఉరుకుడే గానీ.. గుడ్లనిండ నీళ్ళతోటి తొవ్వ కవడ్తలేదు ఆ మసుకు రాత్రిల. సంకల ఉన్న పొల్ల ఇంక అట్లనే పండుకుంది. శేన్లు దాటి పెద్ద కాలువ దాటి ఎత్తుగడ్డ ఆవల ఉన్న జొన్నసేన్ల ఉన్న మంచె కింద సచ్చి పడి ఉన్నడు మైసిగాడు.
ఆన్ని సూడంగనే ‘నాయిన్నో నన్ను ఇడిసి పోతివా.. నాకేవలు దిక్కే నాయిన్నో..మైసా లెవ్వురో.. నీ బిడ్డను సూడురో..” అని మైసని మీద పడి ఏడుస్తంది.
భుజంమీది పొల్ల లేసి ఏడుస్తంది దాని మొత్తుకునుడుకు. దానికంటే ముంగట అచ్చిన గూడెపోల్లు ఎవ్వలు దగ్గరికి వస్తలేరు. మైసని కాళ్ళు సేతులు అంకర అయినయ్, దవడ తోలు ఊసిపోయి పండ్లు రాలి రక్తం కారి గడ్డ కట్టింది. కాలు ఇరిగి ఎనుకకు తిరిగింది. పెయ్యిమీది బనీను మొత్తం సినిగిపొయ్యి పక్కబొక్కల పొంటి దెబ్బలు బయటికి కనవడుతున్నయ్.
ఈ సావు ముందుగాళ్ళ సూసిన సేను సెంద్రయ్య పటేలు అప్పటికే సర్పంచికి ఫోను జేసుడు, ఆ సర్పంచి పోలీసులకు ఫోన్ జేసుడు జరిగింది. జరసేపట్ల సర్పంచి దేవ్ వచ్చిండు బండిమీద. మైసని శవాన్ని సూసి..రెండు గెట్ల ఆవల కూసున్న సెంద్రయ్య పటేలు దగ్గరికి పోయిండు.
“రా ..రా దేవు…!” దేవ్ అచ్చి పటేలు ముంగట నిలవడ్డడు.
“సూసినవా మైసన్ని.. ఘోరంగ సంపిర్రు..”.
“ఆవు పటేలా..ఆ పీనుగును సూత్తెనే భయమయితుంది”.
“భయమెందుకురా అందరం పొయ్యేటోళ్ళమే.. ఒకలు ముందు ఒకలు ఎనుక.. గంతే”.
“ఆవు..గంతే పటేలా.. “
అంతట్లకు పోలీస్ జీప్ వచ్చింది. సివిల్ డ్రెస్సుల ఉన్న ఎస్ఐ.. సరాసరి సెంద్రయ్య పటేల్ దగ్గరికి పోయిండు. కానిస్టేబుళ్లు మైసని శవం దగ్గరికి పొయ్యి ఆని పెండ్లాన్ని పక్కకు నూకిర్రు. అది ఏడ్సి ఏడ్సి.. ఆ మంచె గుంజెకు ఒరిగింది. ఓసారి ఎస్ఐ శవం దగ్గరికి వచ్చి చూసి పొయ్యి, ఫోన్లు జేత్తండు.
ఇంక జరసేపట్ల ఆంబులెన్సు వచ్చి పోలీస్ జీప్ వెనుక ఆగింది. ఇంక మంది కుప్పైతుర్రు. శవం ఉన్న కాన్నే ఉంది. ఈగలు, శీమలు సేరుతున్నయ్. ఇంక గంటల జిల్లా పోలీస్ ఆఫీసర్ సీఐ తో సహా వచ్చిండు. గప్పుడు సెంద్రయ్య లేశి జిల్లా ఆఫీసర్ దగ్గరికి వచ్చిండు. పక్కన నుంచి ఎస్ఐ జిల్లా ఆఫీసర్ శెవుల ఏదో జెప్పిండు. సెంద్రయ్య ఆఫీసర్ షేకండ్ ఇచ్చుకున్నరు.
“ ఏమైంది పటేల్..?”
“రోజులెక్కనే మబ్బుల పొలాలు శేన్లు సూసుకుంట అచ్చుడు అలువాటు. గట్లనే ఇయ్యల్ల కూడా వచ్చిన. ఐదేండ్ల నుంచి రాత్రి శేను కావలి వంటందు ఈ మైసడు. రోజూ నేను రాకముందే లేసి నాకోసం ఎదురు సూసేటోడు. ఇయ్యల్ల శేను మొత్తం తిరిగి అచ్చేవరకు కూడా లెవ్వలేదు. దూరం నుండే కేకేసుకుంట అచ్చిన. ఇంకా లేత్తలేడు ఏందని మంచె కిందికి అచ్చి లైటు వట్టి సూసేవరకు ఇట్ల వడుండే. సర్పంచికి గూడెంల ఒకళ్లిద్దరికి ఫోన్ జేసి జెప్పిన. అది జరిగింది” అన్నడు.
మైసని పెండ్లాన్ని తీసుకచ్చిండు.
ఆఫీసర్ ఒకసారి దాన్ని సూసిండు. నల్లగ ఎత్తుగా కోల మొఖం శరీర పుష్టితో మంచిగనే ఉంది అనుకున్నడు లోపట.
“ఏం పేరు..?”
“భీమి అయ్యా” సంకల పిల్లతోటి రెండు సేతులు జోడిచ్చి చెప్పింది.
“ఈడు ఎప్పుడు ఎల్లిండు ఇంట్ల నుంచి”
“బువ్వ తిని, తొమ్మిదిటికి అట్ల ఎల్లిండయ్యా”
“కల్లు తాగుతడా..?”
“తాగుతడు అయ్యా”
“ఎవలితోని గిట్ల లొల్లీలు ఉన్న యా..?”
“లేవు సారూ”
“ఎవలి మీదనన్నడౌటు ఉందా..”
“అయ్యా మేము పొద్దంత గొడ్లు కాసుకుంట జెంగళ్లనే ఉంటం, పొద్దుగూకి ఇంత తిన్నంక ఈడికి కావలికి అత్తడు ఈడు. మాకు ఏం లొల్లీలు ఉంటయయ్యా..? మాకు ఏం దిక్కు లేదిగ, మీ కాళ్ళు మొక్కుత బాంచెన్ ముగ్గురు పోరగండ్లు ఆళ్ళను ఎట్ల సాదుడు, మీరే ఏదన్న దారి వెట్టాలె సారూ..” ఆఫీసర్ కాళ్ళ మీద వడ్డది భీమి.
కానిస్టేబుళ్లు దాన్ని లేపి పక్కకు తీసుకపోయిర్రు.
మైసని దగ్గరికిపొయ్యిమల్ల ఏడుస్తంది భీమి. మల్లగంటకు డాగ్ స్క్వాడ్ టీమ్ రావడం, శవాన్ని రెండుసార్లు వాసన చూసి… ఓసారి పెద్ద కాలువ ఎంబటి పొయ్యి ఓ సెట్టు కింద ఆగింది. అక్కడ ఒక తెగిన చెప్పు దొరికింది. దాని వాసన చూసి సీద గూడెంలో ఓ ఇంటి ముంగట పారేసిన కట్టెల దగ్గరికి ఉరికి, ఇంట్లకు పోయింది. ఆడికెళ్ళి ఇంకో మూడు ఇండ్లళ్లకు పొయ్యి ఆగింది. ఆ ఇండ్లల్ల పోశిగాన్ని, సిన్నమైసన్ని, గంగులును, అసందులను ఎక్కిచ్చుకొని స్టేషన్ల ఏసి అడిగితే అవు..మేమే సంపినం, ఆడు మా గూడెంల మంత్రాలు జేస్తుండు అందుకే సంపినం అని ఒప్పుకున్నరు. పోలీసు వాళ్ళకు ఒక పెండింగ్ కేసు తగ్గింది. పేపర్ వాళ్లకు రాసుకోవడానికి ఒక మంచి న్యూస్ దొరికింది. కానీ….
*** *** ***
అది హోలీ పండుగ.
పొద్దుగాల ఓ నాటుకోడిని పట్టుకొని ఇంటికి తేరా అని మైసనికి నిన్నసెంద్రయ్య పటేలు చెప్పింది గుర్తు వెట్టుకొని, ఓ మంచి పుంజును పాత సంచిల వెట్టుకొని తీసుకుపోయిండు. కోన్ని దొడ్లె గంప కింద కమ్మి పాలేరు రాజిగాని తోని “ రాజులూ…ఇయ్యల్ల పండుగు కదా..కల్లు తాగద్దా..”
“ ఓ..మెల్లగ అను…పటేలు ఇన్నడంటే తంతడు ఇద్దర్నీ”
“ పని ఒడిసినంక తానం జేసి జెప్పనరా… ఇప్పకల్లుంది, మీ సెల్లెను మెకం వరుగులు అండుమంటా..” అని గుసగుస జెప్పిండు.
“నేను ఇంత ఎర్ర మందు తెత్తా అచ్చేటప్పుడు” అని మొకం ఎలిగిపోంగ జెప్పిండు రాజిగాడు.
“ నేను వోతన్న మరి బిరాన రా” అని బయటికెల్లంగ…
”మైసిగా..” అన్న పటేలు బిడ్డ పిలుపుకు ఎనుకకు అచ్చి నిలవడ్డడు.
“ సాయే వోసిన… తాగు. ఇగో ఈ రొట్టెలు నీ పిలగాండ్లకు తీసుకపో” అనంగనే… ఆ చాయ్ గ్లాసు, రొట్టెలు అందుకున్నడు. ఇది సూసిన పటేలు వచ్చి మైసన్ని దౌడ మీద ఒక్కటేసిండు. దెబ్బకు చాయ్ గ్లాసు అటుపడ్డది, రొట్టెలు సేతులకెళ్లి మట్టిల పడ్డయ్. మైసడు కిందవడ్డడు. ‘లంజకొడుకా… నా బిడ్డను ముట్టుకుంటవారా… ‘అని కాలువట్టి ఇష్టమచ్చినట్టు తన్నిండు. బిర్రన లేసిన మైసడు “ ఏంది పటేలా..నేనేం జేసినా..” అని గట్టిగ అరిసిండు. ఆ అరుపుకు ఇంట్లకెళ్లి పటేలు పెండ్లం, పటేలు ఇద్దరు కోడండ్లు, దొడ్లె ఉన్న రాజిగాడు ఉరికచ్చిర్రు. ‘ఇంక నోరు లేపుతున్నవా?’ అని పటేలు ఇంకో రెండు కొట్టంగనే… మైసడు పటేలు సేతులు గట్టిగ ఇరిసిండు. నొప్పికి గిలగిల కొట్టుకుంటున్న పటేలు దగ్గరి నుండి మైసన్ని ఇంటిబయటికి ఇగ్గుకపోయిండు రాజిగాడు.
పొద్దంత భయపడుకుంట ఇంట్లనే పడుకున్నడు మైసడు. ఒక పూట తింటే ఇంకో పూటకు ఏం తినాల్నో ఎతికేటోళ్లకు ఎందుకు పెద్దోళ్ళతోటి లొల్లి, నా పోరగండ్లు భీమిని సాదుకోవాలె. తప్పయిందని పటేలు కాళ్ళు మొక్కుత అని అనుకొని, లేసి తానం జేసి ఇంత బువ్వతిని… సర్పంచి దేవ్ దగ్గరికి పోయి జరిగింది చెప్పిండు. ‘సేతులకెళ్లి చాయ్ తీసుకునుడు నాదే తప్పు. పొయ్యి పటేలును తప్పయింది అని అడిగి కాళ్ళు మొక్కుత నువ్వు జర నాతో రా బావా’ అని అడిగిండు.
దేవ్ మైసని నాయకపు కులమే. మైసనికి దూరం సుట్టం కూడా. ఈసారి రిజర్వేషన్లో ఊరి పటేళ్లు వాళ్లకు చెప్పు సేతల్లో ఉంటడని నాయకపు కులంల దేవ్ ను నిలవెట్టిర్రు.
పటేలు ఇంటికి పోవుడుతోటే పొయ్యి పటేలు కాళ్ళు పట్టుకున్నడు మైసడు. ‘తప్పయింది… ఇంకోసారి అట్ల జెయ్యా… అసలు ఇంటిదిక్కే రాను పటేలా…’ అని ఏడిసిండు.
‘సరే పో… మల్ల ఈ ఇంటిదిక్కు కనవడ్డవో శీరి శింతకు కడుత…’ అని బెదిరిచ్చి తోలిండు.
బయటకు వచ్చిన మైసనికి, దేవుకు గింత జెప్పన పటేలు సల్లవడ్డడు ఎట్లనో అని లోపట అనుకొని, బయిటికి సరే తియ్యి గండం తీరిందని ఎవలి ఇంటికి వాళ్ళు అచ్చి పడ్డరు.
ఇంట్ల పెండ్లం కోడండ్ల ముందు నా మీదికి శెయ్యి లేపిండు మైసడు అని లోపట పటేలుకు మెసులుతుంది. రెండునెలలు గడిసినంక… ‘ఊర్ల ఉన్న ఆర్ఎంపీ డాక్టరుకు లక్షరూపాల కట్ట ఇచ్చి గూడెంల రెండు ముసలి పాణాలు లెవ్వాలే. పదిమందికి కక్కుడు గావర కావాలె’ అని చెప్పిండు. ‘గూడెం నుంచి ఎవ్వలు అచ్చినా.. ఇది రోగం కాదు మంత్రం తీరు ఉందని చెప్పు’ అన్నడు. నాయకపు గూడెంల మొక్కే ఆ గూడెపు పెద్దను పిలిసి యాభైవేలు శేతిలో పెట్టి… ‘మైసడే అందరికీ మంత్రాలు చేస్తండనే పుకారు లేపు’మన్నడు.
ఇదంతా జరిగిన పదిహేను రోజులకు మైసడు శేన్లకు రాత్రికావలి వోతే సంపేసిర్రు అక్కన్నే.
మైసడు సచ్చిన రెండురోజులకు పటేలు ఇంటికి వొయ్యి మరీ భీమికి ఐదువేలు… బియ్యం ఉప్పులూ… పప్పులూ… నూనె ఇచ్చిండు. నువ్వు దేవునివి పటేలా అని భీమి శెంద్రయ్య పటేలు కాళ్ళు మొక్కింది.
మస్తు చెప్పినవు బుజ్జే.. కళ్ళకు కట్టినట్టు తెర మీద బొమ్మలాడుతున్నట్టు జబర్దస్త్ ఉంది పో…
నాకెక్కడ రాసినట్టు అనిపియ్యలే, అమ్మ ఒడిలో తల పెట్టుకొని ఆకాశంలో సుక్కలు లెక్కబెట్టుకుంటు అమ్మజెప్పే నిజంగా జరిగిన ముచ్చట ఇంటన్నట్టు ఉంది.
Thank you…🌷🌷🌷🌷
Kathanam baavundi. Kaallu mokkina bhimi kaallu gunji bhoomila paathipette roju raavaale
👏🏼👏🏼👏🏼👏🏼
మస్త్ రాశినవ్ చెల్లె…
కథ బావుంది
Excellent
మరిల రాత్తనె వుండాల బిడ్డా