భా.వి.యు.సం.

‘గలీ గలీమే నారాహై భారత్ హమారా మహాన్ హై’
‘గలీ గలీమే నారాహై భారత్ హమారా మహాన్ హై’….
ర్యాలీ సాగుతూ సమీపిస్తూంది.
‘ఏందిరా జాన్, మన కాలనీల కొస్తున్నట్లుంది ఏందో ర్యాలీ?!’
‘ఔనక్కా, నాకూ కొత్తగనే ఉంది! ఆ బ్యానర్..?, ‘భా. వి. యు. సం.’ దగ్గెర కొస్తుంటే ర్యాలీ ముందు పట్టుకున్న బ్యానర్ మరింత స్పష్టంగ కనిపిస్తుంటే చదవడం పూర్తి చేసిండు జాన్.అంతలో
‘హాయ్ హలో తమ్మీ జాన్ భారత్… నమస్తే’
‘న్.. న్నమస్తే అన్నా.. ‘ఇదేం కొత్త పిలుపు! నాపేరు కు కొత్త తోక !? ఆశ్చర్యపోతూ’… వికాస్ రెడ్డన్నా’
‘తమ్మీ జాన్ భరత్, ఇగనుంచి నేను వికాస్ రెడ్డి గాదు, వికాస్ భరత్. మనమంతా భారతీయులం. ధర్మగంగ బిందువులం, భారతీయులం అంతే. రెడ్డీ లేదు, రావు లేదు, చారి లేదు, స్వామి లేద్. అందరి పేరాకర్న ‘భారత్’ అని చేర్చుకోవాలె. పిల్చుకోవాలె’
‘మరి ఎప్పట్నుంచో మనమంతా భారతీయులమే. గిప్పుడైతే గ్లోబలీకులం.’ తమ్ముని భుజాల మీన చేతులు పెట్టి చెప్పింది విమల.
‘అదేం కొత్త మాట! ‘వికాస్ రెడ్డి పక్కనున్న రాజారామ్ అనే యువకుడు.
‘అదేమన్నా నీకు తెల్వని దేముంది. గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచమంతా ఒకే ఒక కుగ్రామం అన్నారు గద! అందుకే గ్లోబలీకులం అంటాన !’ కులం పదాన్ని నొక్కిపట్టి.
”ఔనూ భా వి యు సం అంటేందన్నా.”
”భారతీయ విద్యార్థి యువజన సంఘం సెల్లే.”
‘అన్నా ఔనన్నా భారద్దేశంల ఇపుడైతె ఆన్నిదేశాలోల్లు మతాలోల్లున్నరు. ఇది బాగానే ఉంది’ క్రిష్ణ అనే మరొక అనుయాయుడు రాజారామ్ చెవిలో సణుగుతుంటే
“అరే ఎ ద్ద వ్వా, గిప్పుడియన్నీ మాట్లాడుకొనీకె సవరించి కొత్తపేరు పెట్టుకోని, బ్యానర్ జేయనీకె యాడైతది. ఏదో పెట్టుకున్నమైపాయె. ఇప్పటికైతె నడవనీ!” వవ్ మని ఖసిరిండు రాజారామ్!
ర్యాలీగా వచ్చిన గుంపులోని ప్రతి ఒక్కరి కదలికలను, మాటలను తీక్షణంగా గమనిస్తున్నది విమల.
‘తమ్మీ జాన్, చెల్లే విమల మెంబర్ షిప్ రాయిండ్రి’ అంటూ మెంబర్ షిప్ బుక్ ముందుకు చాచిండు రాజారామ్.
‘మా సంఘం మాకుంది గదన్నా’ జాన్.
‘మీ సంఘం మీ కులపోళ్ళకే పరిమితం, ఈ సంఘం భారతదేశానికంతా వర్తించేది. మీ సంఘం ఈ మన సంఘంలో ఒక ఉప సంఘం… ‘వికాస్ రెడ్డి కల్పించుకుని వివరిస్తూ, ‘… రాయిండి రాయిండ్రి జస్ట్ పదిరూపాలే’ ఆదేశించిండు.
జాన్ రాసి, జేబులో నుంచి పది రూపాయల నోటుతో పుస్తకం తిరిగిస్తూంటే
”విమల చెల్లెకీయ్ బుక్” వికాస్ రెడ్డి
”నేను రాయనన్నా ఏందట్లంటవ్! మాది కుల సంఘమా, అంబేద్కర్ ఏ ఒక్క కులానికీ చెందినోడు గాదు. భారద్దేశంలోని పీడిత శ్రమజీవులందర్కీ చెందినోడు. మాదీ దేశ వ్యాప్తంగా ఉన్న సంఘమే!” విమల.
”పైసలిప్పుడే ఇవ్వనౌసరం లేదు సిస్టర్.”
”నిజమే. పది రూపాల పైసల్దేముంది. పైసలిచ్చినా ఈయకున్నా, రాసిన్నంటే మెంబర్ నైనట్లే గదన్నా!”
ఓరగంటతో అసహనంగా చూస్తూ జాన్ వైపు తిరిగి
”అన్నా జాన్ ఇంకేమన్నుంటే అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ఒస్తం ఇంగా షానా గల్లీలు తిర్గాలె. జై భారత్ భారతీయ యువజన సంఘం…”
”వర్ధిల్లాలే… ఏ..” కోరస్ తో కదిలింది ర్యాలీ.
*

‘అన్నా వికాస్ హింద్ తాసిల్దార్ ఆఫీస్ల ఈబీసీ సర్టిఫికేట్ కు అప్లైజేసి నెల దాటిందన్నా. ఎప్పుడు వోయినా, ఆరై లేడనొగసారి, సూపరింటెండెంట్ లేడనోసారి, తాసిల్దార్ లేడంటనోపారి రేపంటని మాపంటని తిప్పుతాండ్రన్నా!’
‘నిజమే నన్నా, నేనూ నేటివ్ సర్టిఫికెట్ కోస్రం నాల్గు నెల్లు దిర్గిన. ఏప్పుడు ఆయనో ఈయనో ఇంకెవరో టూర్ లో ఉండరనో తిప్పిండ్రు. ఆకర్కి ఐదొందలు అటెండర్ సేతుల వెట్టినంక మూడు దినాల్లనే తెచ్చిచ్చిండు అటెండర్ !’
‘ఔ భాయ్ గాడ్దికొడ్కులు, ఎంప్లాయిస్ మోత్తం అవినీతి పరులై పోయిండ్రు. తమ్మీ రాజారాం ఒగనాడు అవినీతి వ్యతిరేక ర్యాలీ తీసి దిష్టిబొమ్మను కాలవెడ్దం మనోల్లాందర్ని గ్యాదర్ జెయ్ రా’
‘సరే నన్నా గనీ మనోల్లూర్కెనే ఒస్తరాన్న. మా అంటే ఒగ పదిపన్నెండు మందొస్తరు ?’
‘హరే… ఏ…, ర్యాలీ ఐనంక మాంచి పార్టీ ఉంటదంటని చెప్పు తమ్మీ’
‘బిస్కెట్లూ చాయ్ లు చీప్ ఐపోయినవన్నా…’ ఫిర్యాదు లాగా రాజారాం
‘నాకు తెల్వదార బయ్, ర్యాలైపోయ్ నంక తాళ్ళల్లకు వోదం. గా ఒక్క హింట్! ఈ అటెంకంతా వాళ్లకర్థమైతది’
‘మరి నా ఓబీసీ.. ఈ..’
‘గీ ఒక్కపారి ఏదో సర్దుకో తమ్మీ. వాన్కి నేం జెప్త తీ ఓ మూడొందలకు సరిపెట్కోంటని.’
‘హంతేనంటవాన్నా! సరే మంచిదన్నా’ముఖం మాడ్చుకొని వెను తిరిగి వెళుతుండగా… ‘తమ్మీ నీ పని మూడు దినాల్లైతది, నేన్ గ్యారెంటీ ఇస్తాన. ర్యాలీకి మనోల్లను గ్యాదర్ జెయ్’ చెయ్యాలన్నట్లుగ గుర్తు చేసిండు వికాస్ రెడ్డి.

                                  * 

‘నమస్తే సార్’
‘న నమస్తే!’ ముందస్తు సమాచారం లేకుండా దూసుక వచ్చిన ఆగంతకుడి పిలుపు విని తలెత్తి చూస్తూ, ‘నమస్తే వికాస్ భాయ్ రా కూచో’చిరు నవ్వుతో
ఆహ్వానిస్తూ కుర్చీ చూపించిండు తహసీల్దార్. ‘ఆఁ. చెప్పు వికాస్ ఎటో ఒస్తిరి !?’ ఫైళ్ళపై సంతకం చేస్తూ అడిగిండు.
‘ఆ ఏం లేదు నెక్స్ట్ సండే అవినీతి వ్యతిరేక ర్యాలీ తీస్తున్నం. చందా కోస్రమ్…’
రెండు ఐదొందల నోట్లు ఇస్తుండగా..
‘ర్యాలీ పెద్ద ఎత్తున తీస్తున్నం. దిష్టి బొమ్మను కూడా కాలవెడ్తున్నాం’ సరిపోవన్నట్లుగ చేయి చాచకుండా తహసీల్దార్ కండ్ల లోన్కి సూటిగా చూసిండు వికాస్ హింద్.
‘మీ యసొంటోళ్ళేగాక మా పై అథారిటీస్ అకేషన్లు గుడ ఉంటాయ్ గద భయ్యా’ అంటూ మరో రెండు ఐదొందల నోట్లు జతచేసి, ‘ఇక సర్దుకోండి’అంటూ
ముందుకు వొంగి వికాస్ రెడ్డి ఎద దగ్గరికి ముందుకు అందేటట్లు చేయి చాచి బతిమిలాడి నట్లు తహశీల్దార్.
*

‘అన్నా రంగన్నా నమస్తే.’
‘నమస్తే నమస్తే రాజన్నా బాగుండవా, చెప్పు తమ్మీ ఎటో ఒస్తివి ?’
‘ఏం లేదన్నా, అవినీతి అవినీతీ యనెక్కడచూసినా ఒకటే వార్తలు, గోల…’ ఏదో యాదికొచ్చి గొంతులో వెలక్కాయ పడినట్లు గతుక్కుమన్నడు ఎరువుల విత్తనాల వ్యాపారి రంగయ్య,
‘…మేం అవినీతి వ్యతిరేక ర్యాలీ తీసి దిష్టిబొమ్మ తగలబెట్టాలనుకుంటున్నం, వందలమందితో ర్యాలీ కార్యక్రమం, చానాఖర్చు
ఐతది. విరాళాలు కలెక్ట్ చేస్తున్నం’ అంటూ చందా పుస్తకం ముందుంచిండు.
పుస్తకం తీసుకొని రాసి, గల్లపెట్టెలో నుంచి తీసిన నోట్ల వైపు చూసి, ‘ఏంది రెండు వేయ్ లా, నెలగుడెల్లలే గద రంగన్నా మీ సీడ్ పండక గా తండ బాలు
నాయక్ ఆత్మహత్య జేసుకుంటె, నీ మీద కేసు గాకుండ వాల్ల ఫ్యామిలీ మెంబెర్స్ నొప్పించి సెటిల్ జేయించింది. అప్పుడే మర్సితివాన్న!’
‘వాల్లకేం తక్కువకు సెటిల్ జేపిచ్చిండ్రా తమ్మీ, రొండు లక్షలిప్పిస్తిరి గదబ్బ!’ ఏడుపు ముఖంతో.
‘ఇంగా తక్కువకే సెటిల్ ఐందన్నా. తెల్వదా వాళ్ళు,తమకు పైసలవసరం లేదు, కేసు పెడ్తమంటె పెడతమని పట్టు వట్టిన సంగతి! వాల్లను, వాల్లెన్కుల్లను సల్లబర్చనీకె ఎంత ప్రయత్నం జేసినమో !ఇగమాట్లాడకు రాయ్ రాయ్ పదివేలు’
‘తమ్మీ తమ్మీ ఇంకేం మాట్లాడకు, ఇగో ఈ ఐదువెయ్ లు తీస్కో’ చేతుల పెట్టి చేతులు జోడించిండు రంగయ్య.
‘ఓకే అన్నా, ఇగో ఆ బుక్కుల మార్చి సైన్ చేయన్నా’
‘ఇగ మార్చుడు గీర్చుడెందుకు ఉండనీ తమ్మీ’ నవ్విండు రంగయ్య ఏదో రకంగా చూస్తూ.
‘మెనీ థాంక్సన్నా’ కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించి తృప్తిగా నవ్వుతూ చేయి కలిపి వెనుదిరిగిండు రాజారాం.
*

ర్యాలీ వందల సంఖ్యతో మధ్యాహ్నం ఒంటి గంట కే విజయవంతమైంది. ర్యాలీ తర్వాత సాయం కాలం ఐదు గంటలకు ఎంపిక చేసుకున్న గుంపు క్యాడర్ ముప్పై పై చిలుకు మంది మండల కేంద్ర పట్నానికి సుదూరంగానున్న తాళ్ళవనంలోకి చేరేవరకు, అక్కడ కొందరు స్త్రీలు వేపుతున్న చేపల ముక్కల వేపుళ్ల ఘుమ ఘుమలు వాళ్ళ ముక్కు పుటాలచేరి ఊరిస్తుండగా నల్గురైదుగురు గౌండ్లు, రాండి రాండ్రి అన్నట్లు చిరునవ్వుతో ఆహ్వానించిండ్రు.
ర్యాలీ విజయోత్సవ విందు పూర్తై తిరిగొస్తుండగా, ద్విచక్ర వాహనం పై నున్న ఒక యువజంట ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలై ఆస్పత్రి పాలయ్యిండ్రు.
*

‘అరేయ్ కార్తీ ఈ పారి ఆ భాయుసం వాళ్ళకేమాత్రం తగ్గకుండా వినాయక విగ్రహం పెట్టి, మస్తు అట్టహాసంగా సెయ్యాలె వినాయక నవరాత్రి పండుగ’ బీసీ సంఘ భవనం ముందు సాయంకాలం కూచున్న యువకుల్లో ఒకడు.
‘నిజమన్నా మన బలమెంతనో సూపియ్యాలె.’ మరో ఇద్దరు వంత పాడిండ్రు.
‘ఖర్సెక్కణ్ణుంచి కలెక్ట్ జెయ్యాలె?’ మరొకడి సందేహం.
‘మనమూ ఇంటింటికీ తిరుగుదం, మన సర్పంచ్ సాబ్ నూ అడ్గుదం, భాయుసమోల్లు, వాళ్ళు సేకరించిన చందాలు గాక,వాళ్ళపార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ బండి అరవిందన్న గుడ బాగనే ఇచ్చిండంట’
‘ఔ ఔ ఇదీ బాగనే ఉంది. ఎలక్షన్ టైం గద, మన సర్పంచ్ సాబ్ గుడ ప్రిస్టెజ్ కోసమన్నా బాగనే ఇస్తడు.’
సర్పంచ్ చందా ఇస్తున్నపుడు పెట్టిన షరతు ప్రకారం వినాయకుడి విగ్రహాన్ని గులాబీ రంగుతో తీర్చి దిద్ది,మండప ప్రాంగణమంతా గులాబీ రంగు
జెండాల గులాబీ రంగు పరదాలమయం మయం చేసిండ్రు.
చివరి రోజున నిమజ్జన యాత్రలో ప్రధాన వీధిలో ఇరువాడల ప్రతిమల వాహనాలు ఒకే సారి ఎదురెదురై,మేం ముందంటే మేం ముందు అని ఘర్షణ చెలరేగి,దాడులు చేసుకోడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయవలసొచ్చింది.
‘బ్రదర్స్ మీరంతా చదువుకున్నోళ్ళు. దేవుడు అదే, వినాయకుడు అందరి దేవుడు…’ ఎస్సై సముదాయించి సర్ది, రెండు వినాయక
రథాలను స్వాధీనం చేసికొని తన పోలీసు బలగాలను ముందు వెనుకల నడిపిస్తూ మమ అనిపించి ఊపిరి పీల్చుకున్నడు.

‘ఇగో పండుకుంటివా’
‘ఆ ఆ ఇప్పుడే. ఏంది నీ వింకా పండుకోలేదా’
‘నిమజ్జనానికి వోయిన పిలగాడింక రాలేదెందుకో !’
‘ఒస్తడుతీ, యాడ్కి వోతడు! పండుకో. ఈయాల కొత్తనా రాతిరికి రాకుండా తెల్లారెప్పుడో ఒచ్చుడు! ఏమన్న సిన్న పిలగాడా’ ‌
పెండ్లాన్కి చెప్పిండే గాని ఆయనకూ ఏదో చిన్న ఆందోళనుంది. ఇద్దరికీ తెల్లారే ఝాము ఎప్పుడో మామూళ్ళు నిదుర పట్టింది.
తెల్లవారుతుండగా పక్కింటి ఆడోళ్ళిద్దరు వాకిలూడ్వడం ఆపి,
‘ఇగో ఇన్నవా ఒదినా రాత్రి నిమజ్జనానికి వోయిన గుంపుల ఇద్దరు పిల్లలు చెర్లనుంచి
బైటకు రాలేదంట. పోలీసులు ఈతగాళ్ళను వెట్టి సెర్వుల దేవులాడిపిస్తున్నరంట.’
‘ఔనా! ఒదినా ఏం నిమజ్జనాలో, ఏం సోకుల ఎచ్చుల శాష్టలో యాడాదిక్యాడాది వొయిసు పోరగాండ్లకు హద్దులు లేకుండ బయం లేకుండ వోతుంది. వాళ్ళ పానాలమీద లేకుంటె వాయ్,వాల్లను నమ్ముకున్న ఇంటోల్ల మీద ఖాయిల్ లేకుండ వోతాంది.’
అంతలో,
“ఇగోమ్మా, ఈడ కాపు మొగిలయ్య ఇల్లేది?”
“ఆ. ఏంది సారూ !” తన ఇంటికే ఒచ్చి తన మొగుడి పేరు అడుగుతున్న పోలీసు తో రాములమ్మ, ఏదో భయంతో, “ఇదే ఏంది ముచ్చటసారూ!”
“నిన్ను వినాయక నిమజ్జనానికోస్రం ఐదార్గురు పిలగాండ్లు చెర్లదిగిండ్రు..”
” ఆ.”
“ముగ్గురే బైటకొచ్చిండ్రు. మిగిలిన ఇద్దరికోస్రం, అప్పటికప్పుడు ఎవ్వరు జూస్కోలే. తర్వాత శాన సేపట్కి పార్టీ జేస్కునేటప్పుడు జూస్కుంటె, ఆ ఇద్దరు చేరుకుని తెలిసి మాకు జెప్పితె, మేమురికినం. ఎతికి పిచ్చినం.
“మా ఓడు గుడున్నడా ఆ ఇద్దట్ల! నిమజ్జనమైపోయినంక పాల్టీ ఏంది సారూ!?”
“వసూలు జేసిన చందాల పైసలు బాగనే మిగుల్తయ్. బస్, వాటితో తాగుడు పార్టి, తినుడు పార్టీ! “పోలీసు అసలు విషయాన్ని, ఉద్దేశపూర్వకంగానే వెంటనే చెప్తలేడు.
“అయ్యో ఇదేంటి బకితి! బకితా, సంబరాలా! ఇంతకు మావోడూ…..”
“వెతికిపిస్తె దొర్కిన సచ్చి దొరికినోల్లల్ల మీ కిరణ్ గుడ ఉండడు. చూడమ్మా. నర్సంపేట హాస్పిటల్ కు బాడీని పోస్టు మార్టంకు పంపినం. పదకొండు పన్నెండు వరకు శవాలొస్తయ్.”
” కొడ్కా…ఆ కిరణూ అన్నేలం జేసినవ్ రా….ఆ…” ఎదలు బాదుకుంటూ వాకిట్ల కుప్పకూలింది రాములమ్మ.
ఆవిడ ఆక్రందనల చప్పుడుకు, అంతకు కొద్దిమందే మంచి నిద్రలోకి జారిన మొగులయ్య లేచి, పరుగున బైటకొచ్చిండు. తను భయపడ్డంతా ఐంది
అనుకుంటూ, భార్యవద్ద కూలబడి నిశ్శబ్ధంగా ఏడ్వవట్టిండు..
*

పోస్ట్ మార్టం మైన శవాలొచ్చేవరకు, ఊర్లోని ముఖ్య కూడళ్ళలో, మరణించిన ఇరువురి దోస్తుల బృందం, ‘కిరణ్ సతీష్ లకు శ్రద్ధాంజలి’ అని, కిరణ్ సతీష్ లు అమర్ హై’ అంటూ ఫ్లెక్సీ బేనర్ లు కట్టిండ్రు. ఫ్లెక్సీలకు చావు ఊరేగింపువంటి అంత్యక్రియలన్నింటికి, స్థానిక భావియు సం నాయకుడు ఖర్చు భరించిండు. జిల్లా స్థాయి సంఘనాయకులూ వచ్చిండ్రు. సంఘ జిల్లా నాయకులతో పాటు భారతీయ హింద్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కూడా హాజరవడం చూసి, జనానికంతానే గాదు, పిల్లలను కోల్పోయిన
తల్లిదండ్రులకూ, బంధువులకు కూడా ఏదో తెలియని ఉపశమనం, గొప్ప అనిపించే సంతృప్తి!
*

”అన్నా వికాస్ భరత్.. ”రాజారాం.
“ఏందిరా మావా”
“మా రెండెకురాల భూమి పట్ట కాయితాలు, పాస్ బుక్ లు ఇయ్యనీకె వాడు రవీందర్ వీఆర్వో అంటాండు, తాసిల్దార్ పది
వేలు అడ్గుతుండడంటని!”
“అర్రే… ఏ, ఈ బాడ్కావ్ లు మారరు. ఈ పారికి ఐదువేలిచ్చి నాపేరు జెప్పమంటని జెప్పు పో.”
“పట్టుకుందం లేదా పట్టిద్దమన్నా!”
“తీస్కునే టోడు డైరెక్ట్ గ తీస్కోడు. ఎట్లవట్టిస్తవ్, ఎవర్ని వట్టిస్తవ్ రా నాయిన! పో పో ఇపుడైతె పనిగానీ. ఈ అవినీతిని ఊడ్చేయనీకె ఇంగే ఉపాయం లేదు పోరా బై! ఈ అన్నలుంటెనన్న బాగుండు. యాడ జచ్చిండ్రో !”.
*

“అవినీతి పరులనింక సహించం”
“సహించం సహించం” కోరస్ నినాదాలు.
అవినీతిపరులను హెచ్చరిస్తూ, ‘భా.యు.సం.’, ‘లోక్ సత్తా’ పార్టీ, ‘జ్వాల’ స్థానిక సంస్థల ఉమ్మడి కలయికతో సాగుతున్నది ర్యాలీ. ర్యాలీలో సుమారు ఇరవై ఇరవైఐదు మందికి మించి లేరు.
ర్యాలీముందు ఒక కిరాయి అనామక అమాయకుడు సగం కొరిగిన తొలి, సీఎం మీసం కొరిగిన, ఒళ్ళంతా బూడిద పూసిన సుమారు నలభై ఏళ్ళ
మనిషి గాడిద పై కూచొని ఉన్నడు.
“ఇకముందెవడన్నా చేసిండో..”
“ఇగో ఇదే గతి పడుతది” కోరస్ నినాదం.
ర్యాలీ సాగుతున్న ప్రధాన రోడ్డు పక్కనే పబ్లిక్ గార్డన్ లోకి వ్యాహ్యాళికి వచ్చి బెంచీల మీద కూచుని మాట్లాడుకుంటున్న ముగ్గురు పెద్ద మనుషులలో
ఒకరు, నవ్వుతూ,”వాడు దొరకడు. దొర్కకూడదు గుడ. ఈ శూరులకాపని చేసే ఆయాసం తప్పుతది. ‘ఆయాసం’ మాటను అదోరకంగా ఒత్తి పలికిండు.
“పేపర్ లో మాత్రం ఫోట్వతో ఒస్తది. అది చాలు వాళ్ళ ఉట్టుట్టి ఉద్దెర ఉద్దెమం ఫోకస్ కానీకె” రెండవతను.
“పేపర్ ల వేయించినందుకు విలేఖరికి తృణమో ఫణమో జేబునుంచి కర్సయితయ్! వాళ్ళంతా అవినీతి వ్యతిరేకులే గాని అవినీతిపరులకు వ్యతిరేకులు కాదు మరి!” మూడో మనిషి.
వాళ్ళను కున్నట్లే, మరునాడు పేపర్ స్థానిక టాబ్లాయిడ్ లో ఫోటోతో సహా ప్రచురితమైంది. పాల్గొన్న పార్టీ, సంస్థల నాయకుల హెచ్చరికల స్టేట్ మెంట్ లూ వచ్చినయ్.
*

ఎన్నికలు ప్రకటించ బడ్డయ్. తాటి వనంల భా.యు.సం. సభ్యులందరినీ సమావేశపరిచిండు వికాస్ భరత్. దాదాపు డెబ్బయ్ ఎనభైమందున్నరు.
అంతలో విమల జాన్ లు మరో ఇద్దరు యవకులతో వచ్చిండ్రు. అనుకోకుండా ఒచ్చినోళ్ళను చూసి మొదట పరిషాన్ ఐండు వికాస్ భరత్.
వెంటనే తేరుకొని “రా చెల్లే రాండి తమ్ముండ్లూ రాండి కూకోండి. ” చేసేది లేక ఆహ్వానించిండు.
“తమ్ముండ్లూ చెల్లెండ్లూ ఎన్నికలు ప్రకటించబడ్డయ్. మనమంతా ఒక నిర్ణయానికి రానీకెనే ఇప్పుడిక్కడ సమావేశమైనం……”
*

“తమ్మీ జాన్,ఓట్ల పండ్గ ఏలాన్ జేసిరి దొంగలు.”
“అట్లంటవేందక్కా. ఓట్లు ఒచ్చేటివే గద! మనకు నచ్చినోల్లకు ఓటెయ్యవలసిందే గద!’
“మనకు నచ్చినోళ్ళు ఎవరూ గెల్వరు. గెల్వనీయరు. అసలీ ఎలక్షన్ విధానమే తప్పు.”
“అదేందక్కా కొత్తగ మాట్లాడుతుండవ్! మనకు కొందరికి ఓటేసే వయసు ఒచ్చి, ఓటేసే అవకాశమే ఒచ్చిందిప్పుడు! అసలేం జెయ్యాలంటవిపుడు!”
“అంత జెప్త. నావెంట నీవు ఇంకో ఇద్దరుండుండి. మీ భావియుసం లీడర్ మీటింగుకు వోతుండర్ గద. పాండి నేనూ ఒస్త. ఆడ అన్ని మాట్లాడ్కుందం పాండి”
*

మీటింగ్ కు మద్యలో మధ్యలో ఒచ్చిన వాళ్ళతో పాటు వచ్చిన విమల ను చూసి, వికాస్ భరత్ తో పాటు అందరూ ఒకింత ఆశ్చర్యపోయి,
చూసిండ్రు. తన ప్రసంగం క్షణాలకాలం ఆపేసి,”రండి రండి మీకోస్రం ఎదురు చూసి, గింతకు ముందే మొదలువెట్నం. కూకోండి”అని ఆహ్వానించి మళ్ళీ షురూ జేసిండు.
వికాస్, రాజారాం లు ప్రసంగాలు పూర్తయ్యేదాన్క ఓపిగ్గా విని,
“అన్నా వికాసన్నా, రాజన్నా నేను జెరసేపు మాట్లాడొచ్చా?”
“అదేం చెల్లే నీవొచ్చుడే మాకు సంతోషం. మాట్లాడు. ఈడ అందరిముందుకొచ్చి మాట్లాడు.”అందరి ముందు నిలబడి మాట్లాడమని ఆహ్వానించిండు వికాస్.
“అన్నలందరికీ నమస్తే. అక్కలు లేరు!…”చిన్నగా నవ్వి,”…. అన్నలూ, ఒగడు యాడాదికి రెండు కోట్ల ద్యోగాలనే. ఇంకోడు ఇంటికో ఉద్యోగమనె. ఇద్దరూ గద్దెనెక్కి ఎన్మిదేండ్లు గడిసె! సూస్తిరా మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ రిటైర్మెంట్ వయసును పెంచిరి. ఇంకో చిత్రం గుడ మీకు తెల్సిందే, కొన్ని సర్కారు విద్యా సంస్థల్ల రిటైరైనోల్లను తీస్కున్రి! వాళ్ళకు వేలకు వేల పెన్షన్ పెన్షన్ బరాబరే, మల్ల ఈ కన్సాలిడిడేట్ వేతనాలంట! గింత మందిమి క్వాలిఫైడ్ వాళ్ళు రోడ్ల మీద ఉండంగ ఉద్యోగాల ప్రకటనలులేవు, గీ రిటైర్మెంట్ వయసు పెంచకుండ ఖాళీలను అరకొర జీతాలు నౌకర్ల నియామకాలకన్న క్వాలిఫైడ్ నిరుద్యోగులను తీస్కోక పోయిరి! రాండ్రన్నాకనీసం ఈ వయసు మళ్ళిన దొంగ నాకొడుకులను తన్ని తరిమి నౌకరి జేయకుండ ఆపుదం.మరొకవంక ఉద్యోగ ప్రకటనలకు డిమాండ్ చేదం.అట్లైతెనే ఓట్లు వేస్తం.లేకుంటె ఎవ్వరికీ ఓటెయ్యమంటని జెప్పి బహిష్కరిద్దం.”
“అడిగేది అడిగేదే గాని, అసలు ఓటే దెయ్యమంటే ఎట్ల?….”వికాస్,

“….. ఓటు రాజ్యాంగం మనకు అంబేద్కర్ ఇచ్చిన వజ్రాయుధం,కులం మతం సదువున్నోళ్ళకు,సదువులేనోల్లకు ఏ భేదం లేకుండా పద్దెందేండ్లు
నిండిన స్ర్రీలు పురుషులకు అందరికి ఇచ్చిన స్వేచ్ఛ ఆయుధం! పైగా ఓటెయ్యకుంటె సచ్చిందాంట్లనే లెఖ్ఖ.

“అక్కడనే ఉంది కిటుకు! ఈ దేశంల మతముంది కులముంది. ప్రాంతముంది.పేద ధనిక వర్గాలున్నయ్.వీటన్నిటినుపయోగించుకోని,మన పేద అమాయక కష్టజీవులను ముఖ్యంగా డబ్బు,తాయిలాలతో ఎక్స్ ప్లాయిట్ చేసి మల్ల ఆ ఉన్నోల్లే పెద్దోళ్ళే దొంగలే అధికారంలకొస్తాండ్రు! మన దేశ ప్రజలకు విచక్షణతో ఓటు వేసే చైతన్యం రాలేదు, రానీయరు. మీకు తెల్వనిదేముంది అంబేద్కర్ నే ఓడించిండ్రు. ఇగ ఈ ఎన్నికలల్ల గెల్సుడు అధికారానికొచ్చుడు మనవల్ల కాదంటని, రాజకీయాలనే వదిలి, బౌద్ద సన్యాసం తీస్కున్నడు. అందుకే అంటున్న ఈ ఎన్నికల సిస్టంల మన కులపోడైనా,మన మతమోడైనా, ధనికవర్గమే, లేదా వాళ్ళే మన పేద, నిమ్నకులపోన్ని నిలవెట్టి రకరకాల మాయలు, అక్రమాలు జేసి, గెలిపిస్తరు. గెల్సినంక వాడే పెట్టుబడి దారీ ఆస్తిపర దళారీ దొంగల మనిషైతడు.వాడూ మంచిగా సంపాయించుకుంటడు. ఎంతమందిని జూస్తలేం. అందుకే అంటాన ఈ ఎన్నికల సిస్టంలనే తప్పుంది. ఆలోచించుండన్నా.”
చేతులు పైకెత్తి దండం బెట్టి కూచున్నోళ్ళందరి వెనుకకెళ్ళి కూచున్నది.”

“ఈ చెల్లె మాటలు వింటుటె నాకేందో అనుమానమొస్తాంది. ఈమె మనందరి చుట్టున్న మనుషుల్ల మనిషి కాదు. ఒద్దన్నలూ వాళ్ళ ముచ్చట
మనకొద్దన్నలూ. కాకుంటె ఇచ్చినోన్దగ్గెరల్ల ఇచ్చినంత తీస్కుందం. ఎక్వ ఇచ్చినోన్కి ఓటేద్దం. లేకుంటె ఇష్టమొచ్చినోన్కైనా తప్పకుండ వేయాలె. మనం ఓటెయ్యకుంటె రాజ్యమాగిపోతదా ఏం!” రాజారాం మాట్లాడిండు.
“అన్నలూ మీరంతా మాఓళ్ళే. మన బాధలన్నీ ఒకటే అంటని, చెప్పేకాడ్కి చెప్పిన. ఆలోచించుండ్రి.మీ ఇష్టం ఆ మీద.మేమైతె ఓట్లను
బహిష్కరించమంటని, ఎందుకు బహిష్కరించాలెనో గుడ ఇల్లిల్లూ వాడ వాడా తిరిగి సెప్పుతం. మా పని మేం జేస్తం.ఒస్తమన్న!” అంటూ విమల
తోడొచ్చినోళ్ళతో కలిసి నిష్క్రమించింది.
”వీల్లు మావోయిస్టులున్నట్లున్నారు” సభలో ఒకడు.
”ఆయుధాలు లేవు గద. కాకపోఒచ్చు మామా” మరొకడు.
”లేకుండొచ్చు. ఐనా గని వీళ్ళసంగతి మన ఎస్సై గారికి చెప్పి ఓ కన్నేసుంచమని చెప్పాలె…. వీళ్ళు ఉంటే ఇగ దేశమంతా నాశనమే… “వికాస్ భరత్ కొనసాగించిండు,” … ఓట్లెయ్యాలె. ఇపుడు మన ముందున్నవి రొండే రొండు పార్టీలు. భారతీయ హింద్ పార్టీ, ఇపుడధికారంలున్న తెలంగాణ అధికార పార్టీ. నేనైతె బి హెచ్ పి పార్టీకేస్త. మీరూ ఏయిడంటని అడ్గుతాన. ఓటుకు ఐదువేలు, ఇంట్లెన్ని ఓట్లుంటె అన్ని ఐదులిప్పిస్త.”
”మంచిదన్నా, నోటికాడికొచ్చిన కూడునెందుగ్గాదనాలె. ఎవరిచ్చినా తీస్కుందం. ఎవలికిష్టమొచ్చి నోల్లకు వాల్లం తప్పకుండ ఏద్దం. ఓటును మురిగిపోనీయొద్దు. పాండి. పాండి లేద్దం,కల్లు జెప్పినవా అన్నా.”
”గుడాలు గుడ సిద్ధం జేపిచ్చినం పాండిలేవుండింక.”
*
”గుడాలు సిద్ధంగా…… ఉన్నయ్” తర్వాతనే.
ఎన్నికల ఓటింగ్ ముందు రోజు ఉదయమే వికాస్ రెడ్డి, ఇద్దరు జతగాల్లతో, పోలీస్ స్టేషన్ కు వచ్చిండు.
‘నమస్తే సర్’
‘నమస్తే వికాస్ రెడ్డి. ఎటో ఒస్తిరి ఏం పని ‘
‘సర్, ఎస్సీ కాలనీల బాగా చదూకున్న యువ బృందం, అంబేద్కర్ యువజన సంఘం అని పేరుతో ఉంది గని, వాళ్ళు మావోయిస్టుల ఆలోచనలతో ఉన్నరు!’
‘మీరెట్ల చెప్పగలరు?’
‘మొన్న మా సంఘమోల్లమాంత మరికొందరు కొత్తగా ఈ సారే ఓటు హక్కు ఒచ్చిన యువజనంతో మీటింగ్ బెట్టుకుని మాట్లాడుకుంటాంటె ఎవరికి ఓటెయ్యాలె, ఎందుకెయ్యాలెనో మాట్లాడుకుంటాంటె మేం పిల్వకుండనే ఇద్దరు ఒచ్చిండ్రు !’
‘ఆఁ… ‘ ఎస్సైలో ఆసక్తి ఉబికింది, కొంచెం ఆందోళన కూడా!’… ఒచ్చి…?’
బాజ్జాప్తా పర్మిషన్ అడిగి మరీ ఓట్లు వేయగూడదనీ, ఎందుకు వేయగూడదో చెప్పి బహిష్కరించమనీ చెప్పిండ్రు. గడప గడపకు తిరిగి, అట్లా ప్రచారం చేస్తమనీ చెప్పి వెళ్ళిండ్రు.’
‘ఔనా ఎవరు వాళ్ళు, వాళ్ళ పేర్లేంది?’
‘విమల, జాన్ సర్. వాళ్ళ సంఘ లీడర్లు. ఆ విమల మరీ కొరకరాని కొయ్య సార్.’
‘ఔనా,వాళ్ళపని మేం జూస్తం పోండి’
వెంటనే నల్గురు సిబ్బందితో జీపు తీసుకొని బైలు చేరినాడు ఎస్సై. దారిలో సిబ్బందితో, ‘ … జాగ్రత్త అసలే ఎస్సీ, అంబేద్కర్ యువజన సంఘం పేరు. మాన్ హ్యాండ్లింగ్ వద్దు. ఆ ఇద్దర్ని దొర్కవట్టి, ఇప్పట్నుంచి, రేపు పోలింగ్ ఐపోయేదాన్క ఈడ, ఔసరమైతేనే సెల్ లో కూసో వెడ్దం. హక్కుల సంఘాలున్నయ్. మన పని అడకత్తెర్ల పోకసెక్కలైంది.’ జాగ్రత్తలు చెప్పిండు.
కాలనీలో ప్ర వేశించే దారిలోనే ఎదురైండ్ర్రు నల్గురు బృందం.
అనుమానమొచ్చి జీపు ఆపి “ఏయ్ ఎవరు మీరు, ఎందుకు తిర్గుతాండ్రు?”
“అంబేద్కర్ యువజన సంఘం” ఎద మీద బ్యాడ్జి చూపిస్తూ విమల.
”ఇందుల జాన్ ఎవడు?”
”నేనే”ఎదమీద బ్యాడ్జి చూపిస్తూ.
”పదండి మీరిద్దరు స్టేషన్ కు. ఎక్కుండి జీపు”
”మేమెక్కం. ఎందుకు రావాలె.” ఇద్దరూ ముక్త కంఠంతో.
”స్టేషన్ కు వోయినంక జెప్తం. ఏయ్ కానిస్టేబుల్స్, మనం ఐదుగురం. వాళ్ళిద్దరు, సుబ్బరంగ ఎత్తి కూసోవెట్టుండ్రి జీబుల. మీరెల్లండి. నేనటు కాలనీలకు పోయొస్త. నేన్జెప్పిన దాంత గుర్తుంది గద”
విమలా జాన్ లతో పోలీసు బృందం జీపు స్టేషన్ కు. ఎస్సై కాలనీకి.
*

Leave a Reply