భావోద్వేగాల సంగీతం – గ్యాబ్రియేలా మిస్ట్రాల్ కవిత్వం

1889 లో ప్రపంచ ప్రసిద్ధ కవులకు నిలయమైన చిలీ దేశంలో జన్మించిన గ్యాబ్రియేలా మిస్ట్రాల్ అసలు పేరు లుసిలా గోడోయ్ అల్కయగా. తన అభిమాన కవుల పేర్ల లోని సగాన్ని తీసుకుని తన కలం పేరైన గ్యాబ్రియేలా మిస్ట్రాల్ అని పెట్టుకున్నది. ఉపాద్యాయుడు, కవి ఐన తండ్రి స్పూర్తితో ఆమె కూడా ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకుని రాణించింది. కవిగా పేరు వొచ్చే వరకూ ఉపాస్యాయ వృత్తిలోనే కొనసాగింది. లాటిన్ అమెరికన్ దేశాలలో విద్యకు సంబంధించి నియమించిన అనేక కమిటీలలో తన సేవలు అందించింది మిస్ట్రాల్. చిలీ దేశపు ప్రతినిధిగా వివిధ దేశాలలో పనిచేసింది. యూరోపియన్ దేశాలలో వున్నపుడు స్త్రీల సమస్యల మీద విస్తృతంగా ఉపన్యాసాలు ఇచ్చింది.

మిస్ట్రాల్ కవిత్వం నిండా ప్రేమ, మోసం, ప్రక్రుతి, విచారం, పిల్లల పట్ల మమకారం నిండి వుంటాయని, ఆమె కవిత్వం తీవ్రమైన భావోద్వేగాలతో సరికొత్త ఊహలతో చదువరులను కట్టిపడేస్తుంది అని విమర్శకులు అంటారు.

మిస్ట్రాల్ మొదటి కవిత్వ సంపుటి ‘డిసోలేషన్’ 1922 లో వెలువడింది. ఆ తరువాత ‘టెండర్ నెస్’, ‘ఫెల్లింగ్’ తదితర కవిత్వ సంపుటులు వెలువడ్డాయి. 1945 లో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి దక్షిణ అమెరికా సాహితీవేత్త గ్యాబ్రియేలా మిస్ట్రాల్. 1957 లో న్యూయార్క్ లో మరణించింది.

*

విచారంలో వున్న తల్లి

నిద్రించు నిద్రించు
ప్రియమైన దానా
బాధ లేకుండా భయం లేకుండా
నా ఆత్మ నిదురించకున్నా
నేను విశ్రమించకున్నా

నిద్రించు నిద్రించు
రాత్రి నిదురలో నీ పలవరింతలు
గడ్డి ఆకులకన్నా
గొర్రెపిల్ల ఉన్నికన్నా
మృదువుగా వుండొచ్చు

నా రక్త మాంసాలను
నీలో నిదురపోనివ్వు
నా ఆందోళనను నా వొణుకును
నీలో నిదురపోనివ్వు
నా కళ్ళని కాసేపు మూసుకోనివ్వు
హృదయాన్ని కాసేపు
నిదురపోనివ్వు

*

డ్యాన్స్ చేయని వారు

ఒక కాలు లేని పిల్ల అడిగింది
‘నేనెట్లా డ్యాన్స్ చేసేది?’
‘నీ హృదయంతో’ అన్నాము

ఒక మూగ పిల్లవాడు అడిగేడు
‘నేనెట్లా పాట పాడేది?’
‘నీ హృదయంతో’ అన్నాము

అప్పుడొక వాడిన పూవు అడిగింది
‘మరి, నేనెట్లా డ్యాన్స్ చేసేది?’
‘నీ హృదయాన్ని అట్లా గాలిలో ఎగురనివ్వు’

సరిగ్గా అప్పుడే పై నుండి
దేవుడు అడిగేడు
‘ఈ నీలాకాశం నుండి కిందకు ఎట్లా దిగేది?’
‘ఈ వెలుగులో డ్యాన్స్ చెయ్యి’ అన్నాము

సూర్యుని వెలుగులో
లోయ మొత్తం డ్యాన్స్ చేస్తోంది
మాతో కలిసి డ్యాన్స్ చేయలేని
వాళ్ళ హృదయాలు
దుమ్ము ధూళిగా మారిపోయాయి

*

వ్యక్తం కాని ప్రేమ

నేను నిన్ను ద్వేషించి వుంటే
ఆ ద్వేషం సూటి పదాలతో
వ్యక్తం చేసి వుండేదానిని
కానీ నేను నిన్ను ప్రేమించాను
మాటలన్నీ నా ప్రేమకు అస్పష్టంగా
అసంపూర్ణంగా అగుపిస్తున్నాయి

నీ మీద నా ప్రేమని నేను
గట్టిగా అరిచి చెప్పాలని
ఆశపడుతున్నావని తెలుసు
లోలోపల అగ్గి వరద వలె వున్న ప్రేమ
నా గుండెనీ గొంతునీ చేరేలోగా
అది విరిగిపడి
విఫలమవుతుందని భయం నాకు

కట్టలు తెగి పారుతున్న
చెరువు వంటి నేను
మోడు వారిన వసంతం వలె
కనిపిస్తున్నానని తెలుసు
నా నిస్సహాయ నిశ్శబ్దం నా
చావు కంటే భయంకరమని తెలుసు

పుట్టింది, పెరిగింది వరంగల్ లో. హైదరాబాద్ లో నివాసం. నాలుగు కవితా సంపుటులు (వాతావరణం, ఆక్వేరియం లో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి) వెలువడినాయి. కొన్ని కథలు, పుస్తక సమీక్షలు, సాహిత్య వ్యాసాలు కూడా.

Leave a Reply