భయం ‘కరోనా’

చూడలేనిదీ చూస్తున్నం
వినలేనిదీ వింటున్నం
బతుక్కి భయం పట్టుకుంది

దర్వాజా వైపు దీనంగా
చూస్తూ కలుషితం లేని
కాలాన్ని స్వాగతిస్తున్నం

తలుపులు మూసినా
కిటికీలు తెరిచినా
నిద్ర పట్టక, రాక
కంటికి కనపడని గత్తర
ఏ ఇంటి తలుపు తడుతుందో…!

భయాన్ని చవిచూస్తున్నం
ఊరుకు దేశానికి అసలీ ప్రపంచానికే
అంటుముట్టు వచ్చింది
కరచాలనం మరిచి
దండం పెట్టుకుంటున్నం

ముఖ మాస్కులతో
ఎవరి ముఖ కవళికలెలా ఉంటాయో…
కన్నుల భాష తోనే తెలుసుకోవాలి
మనిషి ఏ దుఃఖ విషాదఛ్ఛాయల్లో
మునిగి పోతున్నాడో తెలియదు
మనోడో… పరాయోడో…
తెలుసుకోవాలే…

సానిటైజర్ ఎట్లుంటదో
ఏం పని చేస్తుందో తెలియని
మా మూర్ఖత్వానికి
ఆధునిక పద్ధతుల్ని అంటు కడుతుంది

యాంత్రికంగా సాగిపోయే
మా నడకలకు నడవడికకు
గుణపాఠం నేర్పిన విపత్తు

శబ్ద కాలుష్య లోహ యంత్రాల్లో
ఒంటికి కందెన పూసుకుని
చేతిలోని జోటలతో
“రాత్ పైలీ దివస్ పైలీ” ల్లో
సహవాసం చేసేవాళ్లం
కండ్లను కాలానికతికించి
పోగు పోగు అతుకుతూ
కార్ఖానాల్లో నిమగ్నమయ్యే వాళ్ళం
ఇప్పుడు భయంకర నిశ్శబ్దం

ఆకలి అన్వేషణలో
చీకటి సమూహంలోకి విసిరేయబడ్డాం
దిక్కుతోచని వ్యవస్థలో అలమటిస్తున్న
నేత కార్మికులం

భౌతిక దూరాన్ని పాటిస్తూ
మనిషిని మనిషి నమ్మలేని దూరం

ఉంటామో పోతామో తెలియని
భయాన్ని ఆవహించింది
ఉరుకుల పరుగుల జీవనానికి
ఒక హెచ్చరికను పంపి ఆగిపొమ్మంది

ఇల్లు ఇప్పుడు క్వారంటైన్
నాకు నేను లాక్ డౌన్
బతుకు ఎప్పటిదాకో…
యుద్ధం ముచ్చట తెలియదు
ఎంతమంది విగతజీవులవుతారో తెలియదు

కంటికి కనబడని కరోనా
మనిషి మీద రణం ప్రకటిస్తుందని తెలియదు
సైనిక బలగంతోనూ ఆయుధాలతోనూ
అవసరం లేని రణరంగం అని మాత్రమే తెలిసింది

యుద్ధ వీరులు నేడు వైద్యులు, నర్సులు
మా దరికి రాకుండా చేసే సఫాయిలు
మా అడుగుజాడల్ని పసిగడుతున్న రాడార్లా
హెచ్చరించే పోలీసులు
వీళ్లు మా ప్రాణదాతలు

సబ్బుతో చేతులు కడుక్కోవడమంటే
చేతులు పిసుక్కుంటూ ఉండడం కాదు
కరోనా భూతాన్ని మెస్మరైజ్ చేసి
పంపడమే మన ముందున్న లక్ష్యం

పుట్టింది సిరిసిల్ల. తొమ్మిదో తరగతి వరకు చదివారు. కవి, నేత కార్మికుడు. పవర్ లూమ్ నేత వృత్తి కార్మికుడిగా పని చేస్తూ కవిత్వం రాస్తున్నారు. రచనలు: 1. 'రాత్ పైలీ దివస్ పైలీ', 2. 'సిరిసిల్ల నానీలు' కవితా సంపుటాలు ప్రచురించారు. 'కామ్ గార్' కవిత్వం త్వరలో రానుంది.

Leave a Reply