రచన: జాన్ బ్రౌన్ (2018 లో ‘రెడ్ స్టార్’ పత్రికలో ప్రచురితం)
అనువాదం: శివలక్ష్మి
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన నాలుగు భాగాల రచనలో ఇది మొదటిది. 1966లో దివంగత మాల్కం X (Malcolm X) రాజకీయాల స్ఫూర్తితోనూ, చైనాలో జరిగిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవంతోనూ తీవ్రంగా ప్రభావితమై స్థాపించబడిన ఒక నల్లజాతి విప్లవ మార్క్సిస్ట్-లెనినిస్ట్ సంస్థ బ్లాక్ పాంథర్ పార్టీ. కొంతకాలం వారు అమెరికాలో నల్లజాతీయుల విముక్తి పోరాటంలో ప్రముఖంగా నాయకత్వ పాత్ర పోషించారు. విప్లవ రాజకీయాలను చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించారు. కానీ ఇది చాలావరకు శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ సమాజంలో ఐక్య సంఘటనకు పురికొల్పిన పౌరహక్కుల ఉద్యమానికి భిన్నమైనది.
అమెరికాలోనూ అంతర్జాతీయంగానూ సామాజిక తిరుగుబాట్లు ఉధృతంగా ఎగిసిపడుతున్న సందర్భంలో బ్లాక్ పాంథర్ పార్టీ 1966 లో స్థాపించబడింది. అంతకుముందు సంవత్సరమే ఇస్లాం దేశం, న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్ మెంట్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కలిసి మాల్కం X ను చంపేశాయి. 1965 లోనే పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా లాస్ ఏంజిల్స్ లోని నల్లజాతీయుల పరిసరాలైన వాట్స్ లో పెద్ద తిరుగుబాటు కూడా జరిగింది. వియత్నాం ప్రజల వీరోచిత ప్రతిఘటనతో అమెరికాలో ప్రజలు ప్రేరణ పొందుతుండడంతో అమెరికాలో పెరుగుతున్న యుద్ధ వ్యతిరేక ఉద్యమం కూడా రగులుకోవడం మొదలైంది. ఇవేగాక చైనాలో, పెట్టుబడిదారీ విధాన పునరుద్ధరణకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నవారికి వ్యతిరేకంగా మావో తన బృందంతో కమ్యూనిస్టు పోరాటానికి విప్లవాత్మక మార్గంలో పోరాడడానికి గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని ప్రారంభించారు.
ఈ రాజకీయ వాతావరణం పాంథర్స్ పార్టీ స్థాపనకు చాలా స్ఫూర్తినిచ్చింది. బ్లాక్ పాంథర్ పార్టీ వ్యవస్థాపకులు హ్యూయ్ పి. న్యూటన్ (Huey P. Newton) – బాబీ సీల్ (Bobby Seale) ల మొదటి సంభాషణ అమెరికా ప్రభుత్వానికి, పౌర హక్కుల ఉద్యమాలకు మద్దతివ్వడం సమంజసమా కాదా అనే చర్చతో ప్రారంభమైంది. బాబీ వారికి మద్దతివ్వడానికే ఎక్కువ మొగ్గు చూపినప్పటికీ, హుయ్ ఓక్లాండ్ లో మాల్కం X ప్రసంగాన్ని అంతకు ముందే వినిఉండడం వల్ల, ఆయన వాదనల నుపయోగించి బాబీని తెల్లవాళ్ళ ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో ఐక్యం చేయడం సమంజసం కాదని ఒప్పించాడు.
కొన్ని సంవత్సరాల తరువాత, వారిద్దరూ బ్లాక్ పాంథర్ పార్టీని స్థాపించడానికి కలిసి పనిచేయడం ప్రారంభించి, మాల్కం రచనలను చాలా విస్తృతంగా అధ్యయనం చేశారు. శ్వేతజాతీయుల ఆధిపత్యంపై మాల్కం స్పష్టమైన రాజకీయ అభిప్రాయాలు, విమర్శలు, హ్యూయ్ – బాబీల రాజకీయ చైతన్యానికే గాక ఇతరులకు కూడా అవసరమయ్యాయి. మాల్కం ఇస్లాం నేషన్ తో విడిపోయిన వెంటనే మరణించడంతో, ఆయన తన కొత్త రాజకీయ ఆలోచనలను అమలు చేయలేకపోయాడు. కానీ ఆ ఆలోచనలు బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపించడంలోనూ, పదునెక్కించడంలోనూ ఖచ్చితంగా తీవ్ర ప్రభావం చూపాయి. హ్యూయ్ తన ఆత్మకథ, రివల్యూషనరీ సూసైడ్‌లో ఈ విధంగా పేర్కొన్నాడు :
మాల్కం X ప్రసంగాలను, ఆలోచనలను బాబీ “ది మిలిటెంట్”, “ముహమ్మద్ స్పీక్స్” వంటి పేపర్ల నుండి సేకరించాడు. మేము వాటిని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేశాం. ఆఫ్రో-అమెరికన్ ఆర్గనైజేషన్ కోసం మాల్కం నల్లజాతీయులు ఆయుధాలు కలిగి ఉండాలని ఒక కార్యక్రమాన్ని స్పష్టంగా నిర్దేశించాడు [మాల్కమ్ మరణానికి కొంతకాలం ముందే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రో-అమెరికన్ యూనిటీ స్థాపించబడనప్పటికీ కార్యక్రమాలే మీ అమలుకాలేదు] బ్లాక్ పాంథర్ పార్టీ మీద మాల్కం ప్రభావం నిరంతరంగా ఉండేది. మాల్కం స్ఫూర్తితోనే పార్టీ పని చేస్తుందని మేము విశ్వసిస్తూనే ఉన్నాం…ఈ పేజీలోని పదాలు బ్లాక్ పాంథర్ పార్టీపై మాల్కం చూపిన ప్రభావాన్ని సంపూర్ణంగా తెలియజేయలేవు, అయినప్పటికీ, నాకు సంబంధించి నంతవరకు, అతని జీవిత ధ్యేయానికి మా పార్టీ సజీవ నిదర్శనం…మాల్కం ఆత్మ మాలో ఉంది.
కానీ పాంథర్స్ పై మాల్కం ప్రభావం మాత్రమే గాక అంతర్జాతీయంగా వెస్ట్ ఇండియన్ మార్క్సిస్ట్ విప్లవ కారులైన ఫ్రాంజ్ ఫానన్ లాంటి వారి ప్రభావం కూడా ఉంది. ఆయన అల్జీరియన్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ లో చేరి, ఫ్రెంచ్ వలస పాలన నుండి జాతీయ విముక్తి కోసం పోరాడుతూ మరణించాడు. అతని గ్రంధం, ‘ది రెచ్డ్ ఆఫ్ ది ఎర్త్’ (The Wretched of the Earth) పార్టీలో కొత్త సభ్యులకు అత్యవసరంగా తప్పనిసరిగా చదవ వలసిన అవసరం ఏర్పడింది. ఈ పుస్తకం వలసవాదం, జాత్యహంకారాల ఆధిపత్యపు భావజాలం అణచివేతకు గురైనవారిపై చూపే మానసిక ప్రభావాన్ని విశదీకరించింది. వలసవాదుల దౌర్జన్యం అణగారిన వ్యక్తులను సమాజంలో ఏ విధంగా అనివార్యంగా విలీనం వైపుగా నెట్టివేస్తుందనే విషయం గురించి వివరించింది.
పాంథర్స్ స్థాపన కూడా మావో జెడాంగ్, చైనా విప్లవం, గ్రేట్ ప్రొలెటేరియన్ కల్చరల్ రివల్యూషన్ (GPCR) రచనలచే కూడా ప్రభావితమైంది. మావో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP)లు సంయుక్తంగా జపాన్ నిరంకుశ ఫాసిస్ట్ ఆక్రమణదారులను, అమెరికా స్వార్ధంతో ప్రేరేపిస్తున్న చైనీస్ జాతీయవాద ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి 600 మిలియన్ల ప్రజల పోరాటానికి నాయకత్వం వహించారు. అంతే గాకుండా వారి అణచివేతదారులను ఓడించిన తర్వాత మావో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ బృందాలు అన్ని అడ్డంకుల్నీ అధిగమించి, విప్లవాన్ని కొనసాగించ డానికి వారు చేయగలిగినదంతా చేశారు. విప్లవాన్ని విఛ్చిన్నం చేసి, పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరించి ఒక కొత్త పాలకవర్గంగా తమను తాము స్థాపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి వ్యతిరేకంగా పోరాడేందుకు మావో, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలోని అతని మిత్రులు చేసిన కృషి ఫలితంగా గ్రేట్ ప్రొలెటేరియన్ కల్చరల్ రివల్యూషన్ (GPCR) ఏర్పడింది. ఈ పోరాటం చివరికి చైనాలో పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరించబడడంతో ఓటమి చవి చూడవలసి వచ్చింది. దాంతో అక్కడ ఒక కొత్త పెట్టుబడిదారీ వర్గం ఉద్భవించింది, ఇది దాని స్వంత ప్రజలను అణచివేయడమే కాకుండా ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికాలాంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద దేశాలలోని ప్రజలపై ఎక్కువగా ఆధిపత్యం చలాయిస్తోంది.
చైనాలోని గ్రేట్ ప్రొలెటేరియన్ కల్చరల్ రివల్యూషన్ (GPCR) ఓడిపోయినప్పటికీ, పాంథర్స్ నుండి భారతదేశంలో రైతుల తిరుగుబాట్లు, ఫిలిప్పీన్స్ లో విప్లవాత్మక ప్రదర్శనలు, ఫ్రాన్స్ లో మే 1968 నాటి విద్యార్థుల సమ్మెలు, ఎన్నో ప్రతిఘటన చర్యలు, మరెన్నో విప్లవాత్మక ఉద్యమాలను ప్రేరేపించింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక ఉద్యమాలు పురోగమిస్తుంటే సామ్రాజ్యవాద శక్తులు తిరోగమించాయి. ఈ రాజకీయ వాతావరణంలో విప్లవాత్మక పరిణామాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ, ఉత్సాహాలు పెల్లుబికాయి. వారి ముందు ఎదుర్కోవలసిన కష్టమైన పరీక్షలున్నప్పటికీ, ప్రజలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకోగలమని నిజంగా ఆశపడ్డారు. పోరాటాల ద్వారా మెరుగైన ప్రపంచం సాధ్యమవు తుందని దానిని తీసుకురాగల శక్తి ప్రజలకు ఉందని విస్తృతంగా వ్యాపించిన నమ్మకం కూడా బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపనకి అద్భుతమైన ఉత్తేజాన్నిచ్చిన గొప్ప అంశం. నిజమైన మార్పు కావాలనే ఆశ ప్రజలకు లేకపోతే, ఆ తిరుగుబాటు కేవలం ఒక కర్మకాండగా, వ్యర్థమైన వ్యాయామంగా మారుతుంది. కానీ ప్రజలకు భవిష్యత్తు మీద ఆశ ఉన్నప్పుడు, తిరుగుబాట్లు, ప్రతిఘటనలకు భూకంపం కలిగించే ప్రచండమైన శక్తి వస్తుంది. అది పర్వతాలను పెకిలించగలదు. ప్రభుత్వాలను పడగొట్టి నేలమట్టం చేయగలదు.
ఈ సందర్భంలోనే 60వ దశకంలో అమెరికా అంతటా మరీ ముఖ్యంగా అమెరికా నగరాల్లోని నల్లజాతీయుల నివాస స్థలాలలో, సామూహిక తిరుగుబాట్లు జరిగాయి. 1964 – 1965 సంవత్సరాలలో అమెరికాలోని దాదాపు ప్రతి ప్రధాన నగరానికి చెందిన నల్లజాతి వెలివాడలలో పెద్ద ఎత్తున అల్లర్లు, ప్రతిఘటనలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో ఉత్తరాన ఉన్న నగరాలు కూడా ఇప్పటికంటే చాలా ఎక్కువగా నమ్మశక్యంగాని విధంగా నల్లజాతి – శ్వేతజాతి కాలనీలుగా వేరు చేయబడ్డాయి. ఇప్పటి మాదిరిగానే, పోలీసుల క్రూరత్వంతో శ్వేతజాతీయుల ఆధిపత్య హింసతో విద్యుఛ్చక్తి లాగా ఎగిసిపడే సామూహిక పోరాటాలను అణచి వేసేవారు. క్లీవ్‌ల్యాండ్, న్యూయార్క్ నగరం, ఫిలడెల్ఫియా, రోచెస్టర్, న్యూజెర్సీ నగరం, ఇంకా అనేక ఇతర నగరాలలో గొప్ప తిరుగుబాట్లు చెలరేగాయి.
సామాజిక పరిస్థితి, మార్పు కోసం నల్లజాతి ప్రజల ఆశలేగాక, వారెదుర్కొంటున్న దౌర్జన్యాలు, క్రూరమైన అణచివేత నల్లజాతి వెలివాడలను పదునైన పోరాట స్థలాలుగా మార్చాయి. వివిధస్థలాలలో అసంఘటిత పద్ధతిలో వారి ప్రతిఘటనలున్నప్పటికీ, ప్రజలు కలిసి అన్యాయం, అణచివేతలకు వ్యతిరేకంగా స్వఛ్చందంగానే పోరాడటానికి సిద్ధంగా ఉండేవారు. లాస్ ఏంజిల్స్ లోని వాట్స్ అనే నల్లజాతి వెలివాడలో జరిగిన తిరుగుబాటు వీటన్నిటిలో చాలా ముఖ్యమైనది. వాట్స్ ప్రజలు కడు పేదవారు, వారిని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్టుమెంట్ (LAPD) అత్యంత క్రూరమైన చిత్రవధలకు గురిచేస్తుండేది. పందుల్లాంటి పోలీసులు ఒక నల్లజాతి వ్యక్తిని, అతని తల్లిని ట్రాఫిక్ జంక్షన్ దగ్గర క్రూరంగా హింసించడంతో విషయాలు బయటపడ్డాయి.
వాట్స్ లో తిరుగుబాటు ఐదు రోజుల పాటు కొనసాగింది, ఆ సమయంలో 4,000 మందికి పైగా ప్రజల్ని పోలీసులు అరెస్టు చేశారు – వారిలో ఎక్కువ మంది నల్లజాతీయులే – పోలీసుల కాల్పుల్లో – 35 మందికి పైగా చనిపోయారు – అనేకమందిని పోలీసులు గాయపరిచారు. 200 మిలియన్ల డాలర్లకు పైగా విలువైన ఆస్తి నష్టం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలోని ఒక నగరంలో జరిగిన అత్యంత హింసాత్మక మైన ఘటన ఇది అని అందరూ అన్నారు. చివరికి, ఈ తిరుగుబాటును అణచివేయడానికి అమెరికా గత్యంతరం లేని పరిస్థితుల్లో జాతీయ రక్షణ దళాలను పిలవవలసి వచ్చింది. తిరుగుబాటును బలవంతంగా అణచివేసినప్పటికీ, ఇది నల్లజాతి వారి అమోఘమైన శక్తినీ, వారు న్యాయం కోసం పోరాటాన్ని ప్రారంభిస్తే అమెరికా ప్రభుత్వం వారితో వ్యవహరించిన తీరునీ, అవలంభించిన విధానాలనూ, ఆధిపత్య క్రూరత్వాన్నీ కూడా ప్రపంచానికి బహిర్గతపరిచాయి.
వాట్స్ లో జరిగిన తిరుగుబాటు నల్లజాతి సమాజంలో బ్రహ్మాండమైన ప్రభావాన్ని చూపింది.
బ్లాక్ పాంథర్ పార్టీ మాజీ సమాచార శాఖా మంత్రి ఎల్డ్రిడ్జ్ క్లీవర్, తాను ఫోల్సమ్ జైలులో ఉన్న సమయంలో ఈ ప్రభావ మార్పు గురించి తన పుస్తకంలో ఇలా వివరించారు. తిరుగుబాటుకు ముందు, చాలా మంది తాము వాట్స్ కి చెందిన వారమని చెప్పడానికి సిగ్గుపడేవారు. అతను “వాట్స్ అనేదొక సిగ్గుపడే ప్రదేశం. నగర యువకులు ‘దేశం’ అనే పదాన్ని అనాగరికమైన ఊరిజనానికి వెక్కిరింపుగా ఒక ఎగతాళి చేసే పదంగా ఎలా ఉపయోగించేవారో మేము కూడా అదే విధంగా వాట్స్ ని ఒక విశేషణంగా ఉపయోగించే వాళ్ళం.”- అని అతను చెప్పాడు. అది అతి పేద, అనారోగ్యకరమైన, దుర్భలమైన వెలివాడ కాబట్టి ప్రజలు అక్కడ నుండి వచ్చామని చెప్పుకోవడాని కిష్టపడే వారు కాదు. కానీ ఈ తిరుగుబాటు తర్వాత “ఫోల్సమ్‌లోని నల్లజాతీయు లందరిలో” ఎల్డ్రిడ్జ్ పెద్ద మార్పును గమనించాడు. చివరికి ఆ పోరాటాన్ని రాక్షస ప్రభుత్వ బలగాల నుపయోగించి బలవంతంగా అణచివేసినప్పటికీ, ప్రజలు ఆ తిరుగుబాటును వీరోచితమైన సాహసోపేతమైన పోరాటంగా చూశారు. అప్పటినుంచి వారు వాట్స్ పోరాటానికి చెందినవారమని చెప్పుకోవడం గర్వంగా భావించారు. ఫోల్సమ్‌లోని నల్లజాతీయులు “అది నిజమైనా కాకపోయినా ‘నేను’ వాట్స్ నుండి వచ్చాను’!- అని చెప్పార” ని ఎల్డ్రిడ్జ్ అన్నారు. తెల్ల ఆధిపత్య సమాజంలో నల్లజాతీయులు చిన్న చిన్న మార్పులతో సంతృప్తి చెందాలని వాట్స్ లో సమైక్యవాదులు బోధించిన విధానానికి వ్యతిరేకంగా ఒక ఖైదీ వాదించాడు. వాట్స్ లోని పోరాట యోధులు “ఆ ‘నెమ్మదిగా వెళ్లండి’ లాంటి చెత్త పద్ధతులకు స్వస్తి పలికి, స్వీట్ వాట్స్ ను ప్రపంచ పటంలో అద్భుతంగా, గొప్పగా నిలిపి ఉంచుతున్నారని ఆ ఖైదీ చెప్పాడు – ఈ ఉదయం నా నల్ల శరీరం ఫోల్సమ్‌లో ఉంది కాని నా నల్ల హృదయం వాట్స్ లో ఉంది!” అని ఈ ప్రకటన చేస్తున్నప్పుడు ఖైదీ కళ్ళ నుండి “ఆనందబాష్పాలు” కారుతున్నాయని ఎల్డ్రిడ్జ్ పేర్కొన్నాడు.
పేదరికమే గాక అన్ని రకాల అణచివేతల నుండి, అవమానాలకు గురైన సమాజానికి చెందిన నల్లజాతీయులు, ఒక సంఘంగా ఏర్పడి, శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణానికి వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు చేశారు. ఫలితంగా వారిలో వచ్చిన గర్వించదగిన మార్పు చాలా గణనీయమైనది. వాట్స్ లోని తిరుగుబాటు ఇతరులను ఆత్మగౌరవంతో నిలబెట్టడంలోనూ, ప్రతిఘటించి పోరాడేలా చేయడానికి ప్రేరేపించడంలోనూ ఘనమైన పాత్ర పోషించింది. 1967లో, రెండు సంవత్సరాల తర్వాత, జాతీయ సలహా కమిటీ (National Advisory Committee) విడుదల చేసిన నివేదిక ప్రకారం అమెరికా అంతటా పెద్ద, చిన్న నగరాల్లో 123 చోట్ల ఇలాంటి ప్రతిఘటనల “విస్ఫోటనాలు” విజృంభించాయి.
మాల్కం “గ్రాస్ రూట్స్” అని పిలిచే వెలివాడలు, జైళ్లలోని పేద ప్రజలను ప్రేరేపించడమే కాకుండా, పౌరహక్కుల ఉద్యమంలో పని చేస్తున్న కొంతమంది ప్రగతిశీల మధ్యతరగతి నల్లజాతీయులపై కూడా వాట్స్ తిరుగుబాటు పెద్ద ప్రభావాన్ని చూపింది. వారికి, అమెరికాలోని శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ శక్తి నిర్మాణంలో తాము ఐక్యం కావడమనేది ఒక భ్రమ మాత్రమేనని స్పష్టం చేయడంలో సహాయపడింది, ప్రజలు ఎన్నటికీ సాధించలేని ఒక కల కోసం వెంటబడే మార్గమేననీ, అది ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదముందని, పీడించేవాడు పీడితులకు అతి త్వరలో ఒక పీడకలగా మారతాడని వారు గుర్తించారు.
వాట్స్ తిరుగుబాటు ప్రత్యేకంగా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి ముందు మార్టిన్ లూథర్ కింగ్ ఎక్కువగా సమైక్య సంఘటన విధానాన్ని అనుసరించాలనుకున్నాడు. అయినప్పటికీ, వాట్స్ సంఘటనకు కొన్ని నెలల ముందు మాల్కం X మరణం, 1964లో వారి సంభాషణ మార్టిన్ లూథర్ కింగ్ పై గొప్ప ప్రభావ ముద్ర వేసింది. వాట్స్ తిరుగుబాటు తర్వాత మాల్కం నల్లజాతీయుల వెలివాడను “అంతర్గత వలసవాద వ్యవస్థ” గా వర్ణించాడు. ఆ తర్వాత సంవత్సరం, “ఏ రకమైన అధికారం లేకుండా చేసి వారికి హద్దులు నిర్ణయించి వారిని నిర్బంధించడం, వారి శక్తిహీనతను శాశ్వతం చేయడమే మురికివాడల ఉద్దేశం… మురికివాడ అనే దాన్ని నౌకర్ల కాలనీ కంటే కొంచెం ఎక్కువగా చూపిస్తూ, అందులో నివసిస్తున్న వాళ్ళమీద రాజకీయంగా ఆధిపత్యం చేస్తూ, ఆర్థికంగా దోపిడీ చేస్తూ, వాళ్ళను అన్నీ విధాలుగా ఒంటరులను చేస్తూ అవమానిస్తున్నారు. “మార్పును నిరోధించే శక్తులు – మార్పును కోరే శక్తుల మధ్య ఘర్షణకు ఇది సమయం” అని చెప్తూ అతను బలంగా ప్రతిఘటించమని బోధించాడు.
ఏది ఏమైనప్పటికీ, వాట్స్ ఒక ప్రధానమైన మలుపుగా మరియు అనేక మందికి ప్రేరణగా ఒక దీపస్తంభంలాగా నిలిచినప్పటికీ, అది చివరికి అమెరికా ప్రభుత్వ బలమైనశక్తితో అణచివేయబడింది. ఆకస్మికంగా మొదలైన ఉద్యమానికి కొన్ని పరిమితులుంటాయి. హ్యూయ్ పి. న్యూటన్ తన ఆత్మకథలో, వాట్స్ తిరుగుబాటు వైరుధ్య స్వభావాన్ని గురించి ఈ విధంగా రాశాడు. తిరుగుబాటు అపారమైన శక్తిమంతమైనది, స్ఫూర్తిదాయకమైన దైనప్పటికీ, దృఢమైన వ్యవస్థీకృత ఉద్యమం, నిజమైన విప్లవాత్మక నాయకత్వం లేకపోతే – సైన్యం, పోలీసులు ఇలాంటి తిరుగుబాట్లను పదే పదే అణిచివేయగలవని కూడా ఇది నిరూపించింది. అంతేగాక, 1965లో కూడా, ఉద్యమానికి విప్లవాత్మక నాయకత్వాన్ని అందించగల, అటువంటి పనులను నిర్వహించగల ఒక్క సంస్థ కూడా ఉద్భవించలేదు. మాల్కం ఎక్కువ కాలం జీవించి ఉంటే ఆఫ్రో-అమెరికన్ యూనిటీ సంస్థ అలాంటి పని చేయగలిగేది, కానీ అతని మరణం తర్వాత అది కూలిపోయింది.
హ్యూయ్ – బాబీ ఆ సమయంలో ఈ సమస్యల గురించి నిరంతర చర్చల్లో ఉన్నారు:
మా సంభాషణలో ఎక్కువ భాగం శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, బర్కిలీ ప్రాంతాల్లోని నల్లజాతి సమూహాల ప్రజల చుట్టూ తిరిగింది. వారికి చెందిన వ్యక్తుల గురించి తెలుసుకోవడం, వారి గురించిన సానుకూల అంశాలను, ప్రతికూల అంశాలను, వారి సంస్థల స్వభావాన్ని అంచనా వేయడానికి మేము … కసరత్తు ప్రారంభించాం. ఈ సమూహాలలోని ఎవరూ కూడా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకునే వ్యక్తులను నియమించుకోలేక పోయారు – కమ్యూనిటీలోని ఈ పేద ప్రజలు ఎప్పుడూ కళాశాలలకు వెళ్లలేదు, కనీసం హైస్కూల్ చదువులు కూడా పూర్తి చేయలేకపోయారు. అయినప్పటికీ వీరు మా ప్రజలు; వారు ఆ యా ప్రాంతాలలోని నల్లజాతి జనాభాలో అత్యధికులు. నల్లజాతీయుల గురించి మాట్లాడే ఏ సమూహమైనా, ఏ సంస్థైనా వాస్తవానికి నిచ్చెనమెట్ల వ్యవస్థలో అందరికంటే కిందున్న వారి శ్రేయస్సు, ఆత్మగౌరవం, వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఎటువంటిది మొదలైన విషయాల గురించి మాట్లాడుతుంది. మేమందరం ఆ విషయాల గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నాం, కానీ వాస్తవానికి ఎవరూ వారి నింకా చేరుకోలేదు.
దీంతో వారు సంకట పరిస్థితుల్లో కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు, తెల్లజాతి ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నల్లజాతీయులు పోరాడుతున్నారు. మరోవైపు, వారి ఆకస్మిక తిరుగుబాట్లు పకట్బందీగా ఉన్న ఈ అధికార వ్యవస్థల నిర్మాణాన్ని అధిగమించలేకపోయాయి. నల్లజాతి జనాభాలో అత్యధికులుగా ఉన్న పేదలు, అట్టడుగు వర్గాలకు చెందిన వారికి నిర్వహించగలిగే రాజకీయ సంస్థ ఏదీ అప్పటికి సిద్ధంగా లేదు. ఈ పరిస్థితికి ప్రతిస్పందనగా, హ్యూయ్ – బాబీలు నిరాశ పడడానికి బదులుగా గొప్ప ఆశావహదృక్పథంతో వారు నల్లజాతీయుల విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలనీ, దానిని తక్షణం పరిష్కరించాల్సిన సమస్యగా భావించారు.
మొదట వారు ఇప్పటికే ఉన్న కొన్ని సంస్థలను మరింత రాడికల్‌గా మార్చడానికి ప్రయత్నించారు. కానీ వారు త్వరలోనే అనేక అడ్డంకులను ఎదుర్కోవలసి వచ్చింది. ఉనికిలో ఉన్న సంస్థల ప్రతినిధులు చాలా ఎక్కువగా మాట్లాడారు, కాని వారు నల్లజాతీయుల మధ్య ఐక్యతను నిర్మించడానికి గానీ ఆర్గనైజ్ చేయడానికి గానీ ఎటువంటి ఆసక్తి చూపలేదు. ఇవన్నీ వారికంతకుముందే స్థిరపడిన, అలవాటైన ధోరణులలోనే పని చేసేటట్లున్నారు గానీ వారు కొత్త పనులు చేయడానికి ఏమాత్రం ముందుకి రాలేకపోయారు. అప్పుడప్పుడు సవ్యంగానే వాదించినప్పటికీ – నల్లజాతి సమాజంలో సాయుధ ఆత్మరక్షణ అవసరమైనప్పటికీ – వారు ప్రత్యేకించి విప్లవ రాజకీయాలను వ్యతిరేకించారు. మళ్లీ వారికొక ఎదురుదెబ్బ తగిలినప్పటికీ హ్యూయ్- బాబీలు ఆశలొదులుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంస్థలలో ఏదీ విప్లవాత్మక మైనది కానప్పటికీ, వారు నల్లజాతివారి కొక విప్లవాత్మక సంస్థ ఎప్పటికైనా నిశ్చయంగా అవసరం ఉంటుందని గ్రహించారు. కాబట్టి, ఒక కొత్త సంస్థను స్థాపించి క్రియాశీలంగా పని మొదలు పెట్టి చేయడమే సరైన పరిష్కారమని వారిద్దరూ బలంగా నమ్మారు.
ప్రారంభంలో ముఖ్యంగా వారిద్దరూ మాత్రమే ఈ ఆలోచనల్లో ఉన్నందువల్ల, ఇది చాలా కష్టమైన, భయపెట్టే పనిగా వారికి అనిపించింది. అయితే ఇందులో భాగస్వాములు వారిద్దరే అయినప్పటికీ, ఇంతకు ముందు ఎవరూ విప్లవాత్మకసంస్థలో భాగం కానప్పటికీ, లెక్కలేనన్ని ఇతర అడ్డంకులు ఎదురైనప్పటికీ, హ్యూయ్- బాబీలు ధైర్యంగా ముందుకు కొనసాగాలనే అనుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక విప్లవాత్మక సంస్థను స్థాపించడానికి శాయశక్తులా కృషి చేశారు.
వాట్స్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరిగిన సంఘటనలు వారిద్దరినే గాక నల్లజాతీయులను కూడా ఎలా ప్రభావితం చేశాయో వివరిస్తూ హ్యూయ్ ఇలా పేర్కొన్నాడు:
రోజురోజుకీ పెరుగుతున్న నల్లజాతీయుల చైతన్య స్పృహ దాదాపు పరిపక్వదశకు చేరిందని మేము గుర్తించాము. ఒక జాతి చరిత్ర ఆ సంఘ చరిత్రతో దాని భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉండాలి. మేము చూస్తున్న ప్రతి విషయం పరిపక్వదశకు చేరుకుందని మాకు నమ్మకం కలిగించింది. ఈ అవసరం నుండి బ్లాక్ పాంథర్ పార్టీ ఉద్భవించింది. బాబీ – నేను కలిసి అట్టడుగు వర్గాల సోదరుల కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయడం తప్ప వేరే మార్గం లేదనే దృఢనిశ్చయానికొచ్చాం.
ఈ పరిస్థితి వాస్తవికతను మాత్రమే గాక హ్యూ – బాబీల స్థిరమైన రాజకీయ విశ్వాసాలను కూడా తెలియజేస్తుంది. నల్లజాతి విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, కొత్త సంస్థను ఏర్పాటు చేయాలని
వారు గుర్తించారు. అది తప్ప అందుకు వేరే మార్గం లేదనుకున్నారు.
ఈ సంస్థను మరింత మెరుగ్గా నిర్మించడానికి వారు ఫ్రాంజ్ ఫానన్, మావో జెడాంగ్ వంటి విప్లవకారుల రచనలను చదివారు. హ్యూయ్, బాబీలకు ఈ విప్లవకారుల రచనలు బ్లాక్ పాంథర్ పార్టీ నిర్మాణం, అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపాయి. విముక్తి కోసం చాలా మంది తమకంటే ముందే పోరాడారని వారు గుర్తించారు. ఈ పోరాటాల గురించి చదవడం ద్వారా వారు విలువైన పాఠాలను నేర్చుకున్నారు, ఆ పాఠాలను వారు అమెరికాలోని తమ సొంత పరిస్థితుల కనుగుణంగా అన్వయించుకున్నారు. హ్యూయ్ చెప్పినట్లుగా:
వారి రచనలను చదువుతున్నప్పుడు మేము వారిని ఆత్మబంధువులుగా భావించాం; వారిని నియంత్రించిన అణచివేతదారుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా మమ్మల్ని కూడా నియంత్రిస్తున్నాడని గుర్తించాం. మా స్వాతంత్ర్యం పొందడానికి ముందు వారు వారి స్వేచ్ఛను ఎలా పొందారో తెలుసుకోవడం చాలా ముఖ్యమైన అవసరమని మేము విశ్వసించాం. అయితే, మేము కేవలం ఆలోచనలు, వ్యూహాలను దిగుమతి చేసుకోవాలనుకోలేదు; మేము నేర్చుకున్న వాటిని మా నల్లజాతి సోదరుల పరిస్థితులకు అనుగుణంగా ఆమోదయోగ్యమైన సూత్రాలు, పద్ధతులుగా మార్చాలనుకున్నాం.
బ్లాక్ పాంథర్ పార్టీ విజయానికి ఈ పద్ధతి చాలా అవసరం: ఇతర విప్లవ పోరాటాల ప్రత్యేకతల నుండి సాధారణ పాఠాలను నేర్చుకోవడం, పాంథర్స్ తమను తామున్న నిర్దిష్ట పరిస్థితికి ఈ సాధారణ పాఠాలను తమకు వర్తింపజేసుకోవడం. వాస్తవానికి, సరిగ్గా ఈ విధానమే పాంథర్స్ స్థాపన, టెన్-పాయింట్ ప్రోగ్రామ్ సృష్టికి దారితీసింది. హ్యూయ్ బాబీలు క్యూబా, చైనా విప్లవాల కార్యక్రమాలను నిశితంగా అధ్యయనం చేశారు, అయితే వారు అభివృద్ధి చేసిన కార్యక్రమం అమెరికాలోని పరిస్థితులకు ఉన్నదున్నట్లుగా వర్తింపజేయలేమని ఇక్కడ పరిస్థితులని ప్రత్యేకంగా ఎదుర్కోవాల్సి ఉందని, అందువల్ల ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో విప్లవకారులు అనుసరించే వాటికి ఇది భిన్నంగా ఉంటుందని కూడా గ్రహించారు. ఈ ఎరుకతో వారు పార్టీ కార్యక్రమాన్ని అభివృద్ధి చేశారు, ఇది దేశవ్యాప్తంగా వేలాది మందికి స్ఫూర్తినివ్వడమే గాక పార్టీ ప్రణాళికను బ్లాక్ పాంథర్ పార్టీ సభ్యులందరూ ఖచ్చితంగా చదవవలసిన అవసరం ఏర్పడింది.
పది పాయింట్లతో ప్రోగ్రామ్ ప్రణాళిక రూపొందించి, ప్రతి పాయింట్ లోనూ “మనకేం కావాలి?”, “మనమేమి నమ్ముతున్నాం” అనే రెండు ముఖ్యమైన భాగాలుగా విభజించబడింది. ఈ విధంగా పార్టీ ప్రాథమిక లక్ష్యాలు వివరించబడ్డాయి. వాటి వెనుక ఉన్న నమ్మకాలు దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులను నేరుగా ఆకర్షించే విధంగా స్పష్టంగా ఉన్నాయి. ఉదాహరణకు, కార్యక్రమంలో వారు “నల్లజాతీయులు సైనిక సేవ నుండి మినహాయించాలని” కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. “మమ్మల్ని రక్షించని జాత్యహంకార ప్రభుత్వానికి మద్దతివ్వడానికి నల్లజాతీయులను సైనిక సేవలో పోరాడటానికి బలవంతం చేయరాదని మేము కోరుకుంటున్నాం” అని స్పష్టంగా రాయబడింది. అమెరికాలోని శ్వేత జాత్యహంకార ప్రభుత్వం చేత నల్లజాతీయుల మాదిరిగానే అణచివేతకు గురవుతూ బలిపశువులవుతున్న ప్రపంచంలోని ఇతర రంగులవారితో మేము పోరాడము, వారిని చంపము”.
ఈ విధంగా, వారు పార్టీ కోరుకుంటున్న, దాని ఏర్పాటు వెనుక ఉన్న పెద్ద రాజకీయ సమస్యలను స్పష్టం చేయగలిగారు. అమెరికాలోనే గాక అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితుల విశ్లేషణలలోని తమకు వర్తిస్తున్న అత్యవవసరమైన – చాలా సమస్యలనే గాక – ఇతర నల్లజాతి సమూహాలలో, వాట్స్ వంటి సామూహిక తిరుగుబాట్లలో ముందుకు వచ్చిన అత్యంత అధునాతనమైన ఆలోచనలను – వ్యవస్థీకృత పద్ధతిలో స్పష్టంగా వ్యక్తీకరించారు.
ప్రణాళిక అంశాలలో అత్యంత ప్రసిద్ధమైన, పూర్తిగా అపార్ధం చేసుకున్న, తప్పుగా సూచించబడిన విషయాల్లో నల్లజాతి ప్రజలు ఆత్మరక్షణకి తమను తాము ఆయుధాలుగా చేసుకోవాలనే పిలుపు ఒకటి. రెండవ సవరణ హక్కుల కోసం పురికొల్పే సంప్రదాయవాదులు, ప్రతిచర్యలకు వ్యతిరేకంగా మరింత తుపాకీ నియంత్రణను సమర్ధించే ప్రగతిశీల వ్యక్తుల పరంగా తుపాకీ నియంత్రణ ప్రశ్న సాధారణంగా రూపొందించబడినప్పటికీ అది ఈనాడు ప్రత్యేకంగా వర్తిస్తుంది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్, (తుపాకీలను కలిగి ఉండటానికి అమెరికన్ పౌరుల హక్కులకు మద్దతు నిస్తున్న సంస్థ) సంప్రదాయవాద తుపాకీ సొంతదారులు ఖచ్చితంగా ప్రజలకు స్నేహితులు కానప్పటికీ, సమకాలీన తుపాకీ నియంత్రణ చర్చలలో చాలావరకు ఈ దేశంలోని అణగారిన ప్రజలను క్రమం తప్పకుండా జాత్యహంకార పెట్టుబడిదారీ ప్రభుత్వపు బలగాలు సాయుధమై “శిక్షించే” అధికారులు, పోలీసుల చేత దారుణమైన అణచివేతకు, నీచమైన హింసలకు గురవుతున్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు.
అణగారిన వర్గాలు తమ అణచివేతదారుల నుండి తమను తాము రక్షించుకోవడానికి సాయుధ మార్గాన్ని అనుసరించడమనే పద్ధతి చరిత్రాత్మకంగా రుజువైన వాస్తవం అని అర్థం చేసుకోవడంలో చాలామంది ఉదారవాదులు తరచుగా విఫలమవుతుంటారు. అటువంటి విధానం లేకుండా, అణచివేతదారులను అధిగమించడం అసాధ్యం, వారు తమ సాయుధ ప్రతినిధులద్వారా అణచివేత, దోపిడీలకు గురవుతున్న ప్రజల తిరుగుబాట్లను పూర్తిగా నామరూపాలు లేకుండా అంతమొందించేందుకు అత్యంత క్రూరమైన హింసను ప్రయోగిస్తారు. చాలా మంది “సదవగాహన” తో ఉన్నామనుకుంటున్న ఉదారవాదులు కూడా అమెరికా ప్రభుత్వం ప్రజల కోసం కాదనే వాస్తవాన్ని అంగీకరించడానికి ఇష్టపడటంలేదు, కానీ ఈ దేశ ప్రజలనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కూడా అణచివేత, దోపిడీ, పీడనలకు గురి చేస్తూ వారి నుండి అంతులేని లాభాలను పిండుకునే పెట్టుబడిదారీ పొగరుబోతుల కోసం నడుస్తున్న జాత్యహంకారంతో నిండిన నేర రాజ్యం అమెరికా అనే తిరుగులేని నిజాన్ని గమనించడం లేదు.
పాంథర్స్ కాలంలో కూడా ఇలాంటి ఉదారవాదులు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ, అస్పష్టంగా, గందరగోళంగా ఉండే ప్రగతిశీల మధ్యతరగతి అమెరికన్ల భ్రమలకు అనుగుణంగా తమ కార్యక్రమాన్ని రూపొందించుకోలేమని హ్యూయ్, బాబీలకి తెలుసు. దానికి బదులుగా, వారు నేర్చుకున్న విప్లవాత్మక చరిత్ర పాఠాలను, నల్లజాతీయుల విముక్తి కోసం, నల్లజాతి ప్రజల అత్యంత అధునాతనమైన ఆలోచనలతో ప్రతిధ్వనించే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకు పోవాలనుకున్నారు. ఈ విషయం గురించీ, సాయుధ ఆత్మరక్షణావసరం గురించి కూడా మాట్లాడుతూ హ్యూయ్ ఇలా వ్రాశాడు:
మావో, ఫానన్, చే గువేరా మొదలైనవారందరూ హరించబడ్డ ప్రజల జన్మహక్కులు, వారి గౌరవాలను ఏ తత్వశాస్త్రం ద్వారా గానీ, గొప్ప మాటల ద్వారా గానీ కాకుండా కేవలం తుపాకీతో మాత్రమే సాధించారని వారు స్పష్టంగా చూశారు. వారు బందిపోట్లు, గూండాల చేత పట్టుబడి, ఘోరమైన అత్యాచారాలకు బలయ్యారు; స్వేచ్ఛను గెలుచుకోవడానికి వారి ముందున్న, ఏకైక మార్గం రాక్షసశక్తిని పరాక్రమంతో ఎదుర్కోవడమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆత్మరక్షణకు వారెంచుకున్న ఒక మార్గం. ఆ రక్షణ కొన్నిసార్లు దురాక్రమించే లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, తుది విశ్లేషణలో అసలు ఈ హింసను ప్రజలు ప్రారంభించరు; వారు కేవలం వారిపై అమలవుతున్న ఘోరమైన చిత్రహింసలకు మాత్రమే ప్రతిస్పందిస్తారు. ఆయుధాల ద్వారా హింసలు ప్రయోగిస్తున్న వారికి తలవంచడానికి నిరాకరించే వ్యక్తులు చేసే బలప్రదర్శనలను ప్రజలు గౌరవిస్తారు.
ఈ విప్లవ పోరాట స్ఫూర్తితో సాయుధ ఆత్మరక్షణ ప్రాముఖ్యతపై ఆధారపడిన స్పష్టతతో, హ్యూయ్ – బాబీలు బ్లాక్ పాంథర్ పార్టీని స్థాపించారు. వారి కమ్యూనిటీ కార్యక్రమం పోలీసులను ఆయుధాలతో పహారా కాయడంతో మొదలైంది. వారు ఈ కార్యక్రమంతో ప్రారంభించారని హ్యూయ్ నొక్కి చెప్పాడు, ఎందుకంటే ఇది సమాజం దృష్టిని ఆకర్షిస్తుంది, నల్లజాతి వారికోక గుర్తింపు తెస్తుంది. పోలీసుల, తెల్ల ఆధిపత్యవాదుల దాడులని నిష్క్రియంగా అంగీకరిస్తున్న అహింసా పౌరహక్కుల సమూహాలు – పాంథర్స్ మధ్య వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తుంది.
సాయుధ గస్తీలు మొదట్లో భారీ విజయాన్ని సాధించాయి. కొంతమంది పాంథర్లు తమ తుపాకీలతో పరిసరాల చుట్టూ తిరుగుతున్నప్పుడు పోలీస్ ఎవరినైనా ప్రశ్నిస్తున్నప్పుడు ఆగిపోతారు. ఆ రోజుల్లో చట్టం, “సురక్షితంగా ఉన్న కొంత దూరం” నుంచి పోలీసులను ప్రజలు గమనించ వచ్చని, “పోలీసులు తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకోనంత వరకు” ఆయుధాలు ధరించి కూడా వారిని పర్యవేక్షించడానికి అనుమతించింది. కమ్యూనిటీ సభ్యుడిని ప్రశ్నిస్తున్న పోలీసును వారు గనక చూస్తే, ఆ వ్యక్తిని పాంథర్లు “పోలీసులు నిన్ను నిందిస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారా?” అని కూడా అడగవచ్చు. వారు తమ హక్కుల గురించి ప్రజలకు తెలియజేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ వారికి అండగా ఉండే శిక్షాస్మృతిలోని సంబంధిత భాగాలను ధైర్యంగా పోలీసులను నిలువరించగలిగేలా పఠిస్తారు.
ఈ పెట్రోలింగ్ సమాజంలో చాలామంది దృష్టిని ఆకర్షించింది. పోలీసులచే వేధింపులకు గురైన వారి కోసం పాంథర్స్ నిలబడినప్పుడు, వారి సంస్థ గురించి, టెన్-పాయింట్ కార్యక్రమం గురించి దానిలో ఎలా పాల్గొనాలనే విషయాల గురించి వినడానికి చాలా మంది ఉత్సాహంగా ఉండేవారు. హ్యూయే చెప్పినట్లుగా, “పోలీసులకు వ్యతిరేకంగా సమాజ భద్రతను బోధించడమే పెట్రోలింగ్ ముఖ్య ఉద్దేశ్యం” అది భారీ విజయాన్ని సాధించింది. పోలీసుల క్రూరత్వం, హత్యలు నల్లజాతీయులు పెట్రోలింగ్ చేసే సంఘాలలో నాటకీయంగా పడిపోయాయి. ఫలితంగా చాలా మంది పార్టీలో చేరారు.
పార్టీ అభివృద్ధి చెందడంతో పాటు దాని కార్యక్రమాలను విస్తరించడంతో, చుట్టుపక్కల ప్రాంతాలలోనే గాక దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులు పార్టీలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారు. పౌరహక్కుల సమూహాల మధ్యతరగతి సమైక్యవాద రాజకీయాలతో పాంథర్స్ నిజమైన విభిన్నతకు ప్రాతినిధ్యం వహించారు. ఇతర తెల్ల ఆధిపత్యవాదుల నుండి పోలీసు దెబ్బలు, దాడులను నిశ్శబ్దంగా అహింసాపద్ధతిలో అంగీకరించే బదులు, ప్రతిఘటించి ఆయుధాలు ధరించి, పాంథర్స్ గా ఈ దాడులకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకున్నారు. తెల్ల ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మాణంలో నెమ్మదిగా-పురోగతి సాధిస్తూ ఐక్యం కావడానికి బదులుగా పాంథర్స్ నల్లజాతి సమాజం, జాతీయ విముక్తి కోసం, సామ్యవాద విప్లవం కోసం, స్వీయ-నిర్ణయాధికారం కోసం చేయాల్సిన కృషిని సమర్ధించారు.
ఈ ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న శ్రామిక వర్గం, పేద నల్లజాతీయుల హృదయాల్లో ప్రతిధ్వనించాయి, వారు తమ రోజువారీ అనుభవాల నుండి ఆధిపత్యవాదులు చేసే సమైక్య వాగ్దానాలు తమను ప్రసన్నంగా ఆత్మసంతృప్తితో విధేయంగా ఉంచడానికే గాని అవి నిలకడలేని, నమ్మలేని మోసగించే భ్రమలని తెలుసుకున్నారు. బహుశా వారి మధ్య-తరగతి, ఉన్నత-వర్గాల సోదర సోదరీమణులు పాక్షికంగా తెల్ల ఆధిపత్య సమాజంలో కలిసిపోవచ్చు, కానీ పేద శ్రామిక-వర్గ నల్లజాతీయులకు అటువంటి ఆశ లేశమాత్రమైనా లేదు. ఒకవేళ వారెప్పుడైనా దానిని మరచిపోదామనుకుంటే కూడా, అధికారులు, జాత్యహంకారవాదులు, పోలీసుల కాల్పులు, అకారణమైన చావు బాదుళ్ళు, అరెస్టుల లాంటి చేతల ద్వారా పేద అట్టడుగు వర్గాలకు, నల్లజాతీయులకు “సమాజంలో వారి అధమస్థాయి స్థానం” గురించి తెలియపరిచేవారు.
అటువంటి శ్రామిక-తరగతి నల్లజాతి వ్యక్తి ఫిలడెల్ఫియాకు చెందిన రెగ్గీ షెల్. రెగ్గీ ఒక షీట్ మెటల్ ప్లాంట్‌లో అనేక సంవత్సరాలు పనిచేశాడు. ఆ ప్లాంట్ కూడా రెండు భాగాలుగా విభజించబడింది. ప్లాంట్‌లోని పై అంతస్తులో శ్వేతజాతీయులు యంత్రాలపై పనిచేసే నైపుణ్యం కలిగిన కార్మికులుగా, సాంకేతిక నిపుణులుగా పనిచేశారు, వారు నల్లజాతీయుల కంటే మెరుగైన వేతనం పొందేవారు. నల్లజాతీయులందరూ ప్లాంట్ దిగువ భాగంలో ఫౌండ్రీ, షీట్ మెటల్ డిపార్ట్ మెంట్, పంచ్ ప్రెస్‌లలో తక్కువ వేతనానికి పనిచేసేవారు.
అవి నల్లజాతి కార్మికుల భద్రతకు ఏమాత్రం హామీ పడని, కర్మాగారాలలో శరీర శ్రమ చేసే కష్టజీవుల ప్రాణాలకు విలువ లేని ప్రమాదకరమైన రూపాలు. పగటిపూట పనిలో ఉన్న వ్యక్తులు తరచుగా చేతివేలు కోల్పోవడం, ఇంకా అంతకంటే ఘోరంగా ఉద్యోగంలో ఉన్నప్పుడే గాయపడినప్పటికీ అలాంటి కార్మికులను కంపెనీ చులకనగా చూస్తూ చాలా తక్కువ మొత్తం చెల్లించేది. కొన్నిసార్లు అసలు మద్దతనేదే ఇవ్వదు, వాళ్ళవి ప్రాణాలే కాదన్నట్లు కొన్నిసార్లు అసలు పట్టించుకోదు. ఈ ప్రమాదకరమైన పరిస్థితులు, యాజమాన్యాల జాత్యహంకార వైఖరులు, తెలుపు – నల్లజాతి కార్మికుల మధ్య వేతన వ్యత్యాసాలకు నిరసనగా, రెగ్గీ ప్లాంట్ లోని కార్మికులను యూనియన్ ద్వారా సంఘటితం చేయడానికి నాయకత్వం వహించాడు. ఈ రకమైన కృషి నిజమైన వర్గ స్పృహను సూచిస్తుంది, శ్రామిక ప్రజలు సంఘటితమై తమను అణచివేస్తూ దోపిడీ చేసేవారిపై తిరిగి పోరాడవలసిన అవసరాన్ని శ్రామికులు అర్థం చేసుకున్నారు.
అలబామాలోని సెల్మాలో శాంతియుత నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. నిరసనలపై కొట్టిన దుర్మార్గపు దెబ్బలు పౌర హక్కుల ఉద్యమపు అహింసా విధానం లోని అనేక పరిమితులను ప్రదర్శించాయి.
అయితే, అలబామాలోని సెల్మాలో జరిగిన సంఘటనలే తన చైతన్యానికి గొప్ప దృక్పధాన్నిచ్చాయనీ, రాజకీయ స్పృహను మరింతగా పెంచాయని రెగ్గీ చెప్పారు. 1965లో మాల్కం, పౌర హక్కుల ఉద్యమంలోని ఇతర మిత్రులు సెల్మా నుండి అలబామా రాష్ట్ర రాజధాని మోంట్‌గోమెరీ వరకు అనేక వరుస కవాతులను నిర్వహించారు. ఈ కవాతులు దక్షిణాదిలో నల్లజాతి ప్రజల ఓటింగ్ హక్కులను అణిచివేస్తున్నందుకు నిరసనగా జరిగాయి. పోలీసులు, ఇతర తెల్ల ఆధిపత్య వాదులచే హింసాత్మకమైన వ్యతిరేకతను నిరసనకారులు ఎదుర్కొన్నారు. నల్లజాతీయులపై దాడి చేసినందుకుగానూ వారికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు పోలీసులు అనేకమంది శ్వేతజాతీయులను వారికి ప్రతినిధులుగా “ఉపయోగించుకున్నారు”. అయినప్పటికీ, ఆ సమయంలో మాల్కం, ఇతర కవాతు నాయకత్వాలు అహింసాత్మక విధానాన్నే సమర్ధించాయి, కాబట్టి పోలీసులు, ఇతర శ్వేతజాతి ఆధిపత్యవాదులు వారిపై అమానుషంగా దాడి చేయడంతో, వారిలో కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కవాతులు చేస్తున్న వారి నెందరినో తీవ్రంగా కొట్టి చాలామందిని చంపేశారు. వారు తిరిగి పోరాడలేదు, తమను తాము రక్షించుకోలేదు. ఈ సంఘటనలు గమనించినప్పుడు అవి తనపై చూపిన ప్రభావాన్ని రెగ్గీ ఈ విధంగా వివరించాడు:
నేను పని నుండి ఇంటికి వచ్చిన తర్వాత, పోలీసులు మహిళల్ని పిల్లల్ని ఏ విధంగా కొట్టేవారో చూస్తూ ఉండేవాడిని. మీరు నమ్ముతారో నమ్మరో గాని ప్రతిరోజూ నేను ఆ హింసను చూడాలని ఎదురుచూసేవాడిని, ఎందుకంటే అది నాలోలోపల ఏదో అంతుచిక్కని బాధని కెలుకుతున్నట్లుండేది. నేను చెప్తున్నట్లుగానే, నేను నా ఉద్యోగంలో ఒక రకమైన మిలిటెన్సీని ప్రారంభించాను. అప్పుడు నేను కొంతమందిని కలుసుకున్నాను. ఈ దేశంలో నల్లజాతీయుల పరిస్థితిని మార్చడంలో సహాయపడుతుందని మేము భావించిన ఏదో ఒకటి చేయాలని ప్రయత్నించడం గురించి మాట్లాడటం ప్రారంభించాను. కొన్ని నెలల పాటు మనసులో అవే ఆలోచనల చుట్టూ తిరుగుతుండడంతో ఒంటరిగా అధ్యయనం చెయ్యడం, కొందరితో కలిసి అధ్యయనం చెయ్యడం తర్వాత ఈ కొత్త గ్రూప్, బ్లాక్ పాంథర్ పార్టీ సరైనదని మేము నిర్ణయించుకున్నాము.
పాంథర్స్ తుపాకీలతో శాక్రమెంటోపై దాడి చేసినప్పుడు మేము వారి గురించి మొదటిసారి విన్నాం. టీవీల్లోచూసి, పేపర్లలో చదువుకున్నాం. సెల్మా బర్మింగ్‌హామ్‌లను చూసిన తర్వాత, ఏళ్ళ తరబడి నిరంతరం ప్రజలు చిత్రహింసల బారిన పడడమే గాని వాళ్ళు తిరిగి పోరాడటం లేదని మాకు తెలుసు – నన్ను నిజంగా ఉత్తేజపరిచిన విషయం (నేను పాంథర్స్ లో చేరడం), కనీసం మేము ఇప్పుడు తిరిగి పోరాడే అవకాశం ఈ పార్టీ ద్వారా కలిగిందని సంతోషపడ్డాను.
రెజ్జీ బ్లాక్ పాంథర్ పార్టీ ఫిలడెల్ఫియా శాఖను కనుక్కుని, చివరికి ఆ శాఖకు డిఫెన్స్ కెప్టెన్ అయ్యాడు. అతని విలక్షణమైన కథ దేశంలోని పాంథర్స్ లో చేరిన చాలా మంది నల్లజాతీయులకు ఆదర్శ మైంది. వారు ఇప్పటికే కొన్ని మంచి ఆలోచనలను కలిగి ఉన్నారు, పౌర హక్కుల ఉద్యమ ఐక్య సంఘటన విధానం, అహింసాత్మక ప్రతిఘటనల పరిమితులను వారు చూసి ఉన్నారు, నల్లజాతీయులు విముక్తిని సాధించాలను కుంటే శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ శక్తి నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడాలని వారికి తెలిసిపోయింది. పాంథర్స్ ఈ ఆకాంక్షలకు ఒక సంస్థాగత రూపాన్ని ఇచ్చారు, కాబట్టి వారు పోరాటంలో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా వేలాదిమందిని ప్రేరేపించారు, ఉద్యమాల్లో పాల్గొనేలా ఉత్తేజపరిచి ఆలోచనల్ని పదునెక్కించారు. దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతి వర్గాల్లో రాజకీయ పోరాటాలకు చాలా అవసరమైన నాయకత్వాన్ని అందించారు.
ఈ సిరీస్‌లోని తర్వాతి విభాగంలో, ఓక్లాండ్లోని స్థానిక సమూహం నుండి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో శాఖలు కలిగిన జాతీయ సంస్థగా వారు ఎలా ఎదిగారు అనే దానిపై దృష్టి సారించి, బ్లాక్ పాంథర్ పార్టీ అభివృద్ధిని మరింత వివరంగా చర్చిస్తాము.