బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర (మూడవ భాగం)

                                

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bpp1.jpg

బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది మూడవది. దివంగత మాల్కం X (Malcolm X) రాజకీయాల స్ఫూర్తితో 1966లో బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపించబడింది. చైనాలో జరిగిన గొప్ప శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవంతో అత్యంత ప్రభావితమైన బ్లాక్ పాంథర్ పార్టీ ఒక నల్లజాతి మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ సంస్థ. కొంతకాలంపాటు  వారు అమెరికాలో నల్లజాతీయుల విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. విప్లవ రాజకీయాలను చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించారు. ఇది చాలావరకు శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ సమాజంలో ఐక్య సంఘటనకు పురికొల్పిన పౌరహక్కుల ఉద్యమానికి భిన్నమైనది.  ఈ సీరీస్ లోని మొదటిభాగంలో నల్లజాతీయులను ఆధిపత్య శ్వేత జాతీయులు అణగ దొక్కడం, హింసించడం వల్ల బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపనకు దారి తీసిన పరిస్థితులను వివరించాం. రెండవ సంచికలో మాల్కం స్ఫూర్తితో నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వారి విధానాలను చర్చించడంతో పాటు, బే ఏరియాలో వారి పెరుగుదల, అభివృద్ధి గురించి విశ్లేషించాం. వారు అమెరికాలోని అనేక ప్రధాన నగరాల్లో శాఖోప శాఖలుగా విస్తరించి దేశవ్యాప్త పార్టీగా మారుతున్న విధానాన్ని కూడా తెలియజేశాం. ఈ సంచికలో మేము బే ఏరియా దాటి వారి విస్తరణను పరిశీలిస్తాం. ఈ ప్రక్రియలో వారు ఎదుర్కొన్న కొన్ని అడ్డంకుల్ని వివరిస్తాం. విప్లవంలో లుంపెన్-శ్రామికవర్గం ప్రధాన శక్తిగా ఉండాలనే పాంథర్ తీసుకున్న  లైన్ కు ఈ అడ్డంకులు ఎలా సంబంధం కలిగి ఉన్నాయో కూడా మేము అంచనా వేస్తాం.  !

కాలిఫోర్నియా స్టేట్ కాపిటల్ వద్ద పాంథర్స్ నిరసన తర్వాత, వారు చాలా త్వరగానే  జాతీయ ప్రాముఖ్యతను సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులు పాంథర్స్ పార్టీలో చేరాలని, నల్లజాతి విముక్తి పోరాటంలో పాలుపంచుకోవాలని కోరుకున్నారు. ఈ దేశంలో విప్లవం కోసం జరిగుతున్న మొత్తం పోరాటంలో నల్లజాతి విముక్తి పోరాటాలు కూడా ముడిపడి ఉన్నాయనీ, రెండింటినీ విడదీసి చూడలేమనీ పాంథర్స్ గమనించారు. ప్రధాన స్రవంతి రాజకీయాల భ్రమల్లో కొట్టుకుపోతున్న అనేకమంది, పాంథర్స్ సమరశీలమైన పౌరహక్కుల ఉద్యమాన్ని శ్వేతజాతీయుల ఆధిపత్య సంఘాలతో ఐక్యం చేసి సమాజంలో శాంతిని నెలకొల్పాలని వాదించారు. ఈ ఐక్యసంఘటన వ్యూహాన్ని మాల్కం X అసాధ్యం అని నిష్కర్షగా విమర్శించాడు. అతని మరణం తరువాత, అతని వారసత్వం నుండి ప్రేరణ పొందిన పాంథర్స్, ఆయన చెప్పిన  రాడికల్ రాజకీయ విధానాన్నే చేపట్టారు. ఈ విషయంపై పార్టీ తీసుకున్న స్పష్టమైన వైఖరి ఫలితంగా నివాస స్థలాల్లో,  ఉద్యోగాల్లో, ప్రతి విషయంలోనూ  – ఇలా అన్ని రంగాల్లో పోలీసుల హింస, క్రూరత్వం, విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్న కారణం వల్ల వాటిని అధిగమించి విప్లవాత్మక పోరాటంలో పాల్గొనడానికి నల్లజాతీయులు అన్ని ప్రాంతాల నుండి చాలా ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి దేశంలోని ప్రధాన నగరాల్లో వెంటనే తమ శాఖలను తెరవడం ప్రారంభించాలని పాంథర్స్  భావించారు.

అయితే, కాలిఫోర్నియా రాష్ట్ర రాజధానిలో జరిగిన నిరసనల ప్రాముఖ్యత వల్ల కూడా అమెరికా ప్రభుత్వం పార్టీపై నిఘా పెంచింది. ఫలితంగా అది  మరింత అణచివేతకు దారితీసింది. దీని కంటే ముందే  ఎఫ్ బి ఐ (FBI- Federal Investigation Bureau) నిఘా వల్ల స్థానిక పోలీసుల చేతిలో పాంథర్స్ వేధింపులను ఎదుర్కొన్నారు. వాస్తవానికి, స్టేట్ క్యాపిటల్ వద్ద నిరసన తర్వాత, అనేక మంది ముఖ్య నాయకులను అరెస్టు చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడం, అంతర్గతంగా విభజించడమే లక్ష్యంగా అక్రమ నిర్బంధాలు, వరస హత్యలకు నాంది పలికింది. పాంథర్స్ జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుని ప్రబలమైనశక్తిగా ఎదుగుతున్నందువల్ల, సమూహంలోకి చొరబడి పోరాటాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాజ్యం తీవ్రమైన, అధునాతన ప్రయత్నాలను మొదలుపెట్టింది. 1968 లో అప్పటి ఎఫ్ బి ఐ డైరెక్టర్ జె. ఎడ్గార్ హూవర్, “దేశ అంతర్గత భద్రతకు పాంథర్స్ అతిపెద్ద ముప్పు” అని ప్రకటించి, వారిపై రాష్ట్ర అణచివేత విధానాన్ని చాలా పెద్ద ఎత్తున భారీగా విస్తరించాడు.

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bpp2.jpg

Thousands of Black people across the country were inspired by the militant and revolutionary approach of the 

                                                         Black Panther Party.

ఈ అణచివేత ఉన్నప్పటికీ, పాంథర్స్ దేశవ్యాప్తంగా శాఖలను తెరవడం ప్రారంభించి కొన్ని సంవత్సరాల కాలంలో  అభివృద్ధి చెందుతూ వచ్చారు. నల్లజాతి విముక్తి కోసం మిలిటెంట్ పోరాటపు ఆవశ్యకతను స్పష్టంగా సూటిగా చూపించినందువల్ల ఆ సమూహాల్లో అద్భుతమైన సామూహిక ఉత్సాహం, ఉత్తేజంతో  నింపగలిగారు. అయితే, పార్టీ ఎదుగుదల ప్రక్రియలో వరస పొరపాట్లు కూడా చేసింది, అది చివరికి దాని పతనానికి దారితీసింది. ఈ కాలం చాలా వరకు వైరుధ్యాల పరిణామాలను చవి చూసింది: ఒకవైపు నుంచి పార్టీ దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందిందనడానికి నిదర్శనంగా వారి వార్తాపత్రిక ప్రచురణ వారానికి 200,000 కాపీలను దాటిపోయింది. మరొక వైపు నుంచి, పార్టీ అనేక పొరపాట్లను చేస్తూ, అది అంతర్గతంగా విచ్ఛిన్నం కావడానికి కారణమైంది. ఈ పొరపాట్లు రాజ్య అణచివేతకు దోహదపడి దాని వల్ల కలిగే అనేక సమస్యలను తీవ్రతరం చేశాయి. ముఖ్యమైన నాయకులను ఎఫ్ బి ఐ అరెస్టులు, హత్యలు చేయడంతో పాటు ఇన్ఫార్మర్‌ లను పార్టీ లోపలకు చొప్పించి విచ్ఛిన్నం చేసే కుటిల సంస్కృతికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చాకచక్యంగా బీజం వేసింది. ఇవన్నీ పార్టీపై నల్లజాతి ప్రజల విశ్వాసాన్ని, స్నేహాన్ని దెబ్బతీశాయి. పార్టీ పతనానికి దారితీసే కీలకమైన తప్పులు కూడా చేస్తున్నప్పటికీ కూడా అదే కాలంలో సమాంతరంగా పార్టీ ఎలా వేగంగా అభివృద్ధి చెందింది అనే విషయం అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం.  లేకపోతే, “నిన్న మొన్నటివరకూ పాంథర్స్ చాలా మంచివాళ్ళే, ఇప్పుడే ఇలా మారిపోతున్నారు” అని గానీ అపరిమితమైన రాజ్య అణచివేత వల్ల వారు ఓటమిని అంగీకరిస్తున్నారు అని గానీ ఆలోచించే ఒక ఉచ్చులో ప్రజలెవరైనా సులభంగా పడతారు.  అసలు నిజమేమిటంటే, రాజ్య అణచివేత పాంథర్స్‌ ను హింసించినప్పటికీ, వారు దాన్ని భిన్నంగా ఎదుర్కొన  గలిగారు. ఎఫ్ బి ఐ తో పాటు అమెరికా ప్రభుత్వ క్రూరమైన అణిచివేతను ఎదురొడ్డి పోరాడడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నారు. పాంథర్స్ ఓటమి అనివార్యం కాదు తప్పకుండా గెలుస్తారని ప్రజలు అర్థం చేసుకోవడం ముఖ్యం; లేకపోతే అరాచకంగా ఆలోచిస్తూ శూన్యవాదంలో పడిపోతారు. తమ అణచివేత దారులను ఎదిరించి గెలవడం అసాధ్యం అని నల్లజాతీయులు సులభంగా నమ్మే ప్రమాదముంది. బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు, వారు రోజురోజుకీ సంతరించు కుంటున్న చైతన్యం ద్వారా ఎదుగు తున్నప్పుడు అనేక తప్పులు చేశారని స్పష్టమవుతుంది. ఈ తప్పులే చివరికి వారి సంస్థను కుంగదీయడం ప్రారంభించాయి. ఈ విధంగా కీలకమైన విషయాలను విమర్శనాత్మక దృష్టితో చూడటం విప్లవకారులకు, కార్యకర్తలకు చాలా ముఖ్యం.  నేటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే గత ఉద్యమాల విజయాలు, వైఫల్యాలను తప్పకుండా క్రోడీకరించుకోవాలి. ఫలితంగా గత తప్పిదాలు పునరావృతం కాకుండా విజయాలను సాధించవచ్చు. 

లుంపెన్ లైన్;

పాంథర్స్ వరుస తప్పిదాలు చేసి, హాని చేసే వ్యక్తుల వల్ల  చొరబాట్లకు గురయ్యారు.  ప్రభుత్వం వారి పనిలోకి చొరబడి నాశనం చేయడానికి ప్రయత్నిస్తుందనే విషయాన్ని సీరియస్ గా అంచనా వేయలేదు. పార్టీ సభ్యులెవరో పోలీసులకు తెలిసిపోయేలా బహిరంగంగా పనిచేసి దాడులు, హత్యలకు బలి చేశారు. బ్లాక్ పాంథర్ పార్టీ  లక్ష్యాలను తెలుసుకుని నిబద్ధతతో పనిచేసే సామర్ధ్యం ఉందా లేదా అని వారి స్థాయిని అర్ధం చేసుకోకుండా వ్యక్తులను పార్టీలో ఇష్టపడి  చేర్చుకోవడం, పోరాటం పట్ల నిజాయితీ, పార్టీ రాజకీయ సూత్రాలపై పట్టు లేకపోవడం  వంటి తప్పులు చేశారు.  ఈ లోపాలన్నీ లుంపెన్-శ్రామిక వర్గం, అత్యంత విప్లవాత్మకమైన వర్గం అని పార్టీ తీసుకున్న లైన్కు సంబంధించినవే.

లుంపెన్ అనే పదం ఇతరులను మోసం చేయడం ద్వారా, భారీగా దగా చేయడం ద్వారా జీవించే సామాజిక వర్గానికి వర్తిస్తుంది. ఈ వర్గంలో పెద్ద ఎత్తున దొంగతనాలు చేసే వ్యవస్థీకృత నేరస్థుల నుండి, తక్కువ స్థాయి మాదకద్రవ్యాల వ్యాపారులు, అకారణంగా నిందలు వేసి విమర్శించే తార్పుడు గాళ్ళు, పేద ప్రజలను చీల్చి చెండాడుతూ పీడించుకు తినే  కళాకారుల వరకు అందరూ ఉంటారు.

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bpp_lumpen.jpg

                               The Panthers’ funk band was called “The Lumpen”

ఫ్రాంజ్ ఫానన్ గ్రంధాల నుండి నేర్చుకున్న పాంథర్స్ లుంపెన్ వర్గ స్వభావాల గురించి, అర్ధం చేసుకోవడంలో గందరగోళానికి గురయ్యారు. ఈ గందరగోళం కారణంగా శ్రామిక నేపథ్యాల నుండి వచ్చిన చాలామంది సభ్యులు పార్టీలో నాయకత్వ స్థానాల్లోకి వచ్చి వారి జీవితాల నుండి అభివృద్ధి చేసుకున్న మోస పూరితమైన కపటపు దొంగ ఆలోచనలను ప్రదర్శించారు. 

లుంపెన్-శ్రామికవర్గం నుండి వచ్చిన ప్రజలకు విప్లవ రాజకీయాలలో పాల్గొనడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక పునాది ఉంటుంది. కానీ, శ్రామికుల ఆలోచనలు గానీ, రాజకీయాలు గానీ విప్లవ ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించలేవు, ఎందుకంటే రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ పేదల బతుకులు దోపిడీ విధానాలకు బలి అవుతూ ఉంటాయి. ఇతరులను దోపిడీ చేయడం అవసరమవుతుంది. లేకపోతేవారికి  బతుకే ఉండదు. స్కామ్‌లు నడిపే శ్రామిక ప్రజలైనా, బలవంతంగా వేశ్యలుగా పని చేయవలసి వచ్చిన స్త్రీలను అణచివేయడం, లేదా వ్యసనపరులైన ప్రజలకు మాదకద్రవ్యాలను విక్రయించడం వంటివి చేస్తూ, ఇతరుల ఖర్చుతో తన బతుకును వెళ్ళదీసే పరాన్నజీవులుగా శ్రామికవర్గం సమాజంలో ఉనికిలో ఉంది.  ఈ వర్గ సభ్యులు విప్లవ ఉద్యమంలో పాలు పంచుకోవాలనుకున్నప్పుడు సహ కళాకారులుగా అంతకు ముందు తమ జీవితంలో భాగంగా అలవాటైన వివిధ దోపిడీ ఆలోచనలు, దృక్పథాలకు వ్యతిరేకంగా తమతో తాము పోరాడాల్సిన అవసరం ఉంది.

దురదృష్టవశాత్తూ, పాంథర్‌లు ఈ పోరాటాన్ని నిర్వహించవలసిన అవసరాన్ని పూర్తిగా గ్రహించలేదు, ఎందుకంటే వారు లుంపెన్-శ్రామికవర్గాల స్వభావాలు, వ్యక్తిత్వాల గురించి గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళం ఎందుకంటే లుంపెన్ భారీ మోసాలు కుంభకోణాలు చేసేవారితో మాత్రమే కాకుండా నిరుద్యోగులు, చిరుద్యోగులతో కూడుకున్నదని వారి నమ్మకం. ఈ గందరగోళం బాబీ సీల్  పుస్తకం “సీజ్ ది టైమ్‌” (Seize the Time) లో వ్యక్తమయింది.  దీనిలో అతను లుంపెన్-శ్రామిక వర్గంలో “నీచమైన పనికిమాలిన పనులు చేసేవారు, అనవసరమైన హడావిడి చేసేవారు, నిరుద్యోగులు, అణగారిన వారు, బ్యాంకులను దోచుకునేవారు, రాజకీయ స్పృహ లేనివారు  ఉన్నారు”. ఈ తరగతి గురించి బాబీ యొక్క అవగాహన రాజకీయ స్పృహ వంటి ఆత్మాశ్రయ అంశాలతో పాటు – జీవనాధారాల వంటి ఆబ్జెక్టివ్ లక్ష్యాలను సమ్మిళితం చేసింది. ఇంకా ఏమిటంటే, ఈ నిర్వచనం ఆధారంగా, లుంపెన్-శ్రామికవర్గం దేశంలో విప్లవకారులు కాని దాదాపు ప్రతి పేద వ్యక్తిని కలిగి ఉంటుంది.

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bpp_lumpen2.jpg

ఈ గందరగోళం కారణంగా, బాబీ, పాంథర్స్‌ లోని ఇతరులు లుంపెన్‌ శ్రామిక వర్గాన్ని మార్క్స్ ఎంగెల్స్ లు “సామాజిక కట్టుబాట్లు,  పాత సమాజంలోని అతి స్వల్పమైన పొరలచేత  నిష్క్రియాత్మకంగా కుళ్ళిపోతున్న ద్రవ్యరాశి” గా తొలగించడంతోనూ, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా, “లంచాలు పొందే, మోసాలు చేసే కుట్రదారులుగా భావించడంతోనూ చాలా ఆందోళన చెందారు. నల్లజాతీయులలో అత్యధికులు లుంపెన్-శ్రామికవర్గానికి చెందినవారని, వారు విప్లవోఉద్యమంలో పాల్గొనే అవకాశాన్ని మార్క్సిస్ట్ విశ్లేషణ సమర్థవంతంగా రద్దు చేస్తుందని పాంథర్స్ విశ్వసించారు. 1968లో చివరికి బాబీ, “బ్లాక్ పాంథర్ పార్టీ సిద్ధాంతాన్ని పాటించిన శ్రామికవర్గ ఆఫ్రో-అమెరికన్లను  మార్క్స్ లెనిన్ లు చూడగలిగితే బహుశా వారు తమ సమాధుల్లోకి మారిపోతారు” అని చెప్పేంత వరకు వెళ్ళాడు.  

ఏది ఏమైనప్పటికీ, బాబీ ఇంకా అతనితో పాటున్న ఇతర  పాంథర్లు  అర్థం చేసుకోలేని విషయమేమిటంటే, నిజానికి లుంపెన్-ప్రోలేటేరియట్ లను – శ్రామికవర్గ సభ్యులను వారి విశ్లేషణ ఒకచోట చేర్చింది. నిరుద్యోగులు, చిరుద్యోగులు, వివిధ స్వల్ప సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడి జీవించేవారు – వీరందరూ కూడా శ్రామిక వర్గం కిందికే వస్తారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లోనూ, ఋతువులు మారే సమయాల్లోనూ క్రమం తప్పకుండా ప్రతిసారీ కార్మికులను పనిలో నుంచి తొలగిస్తారు. కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాల తరబడి జీవనోపాధి అనేది  లేకుండా బతక వలసి వచ్చిన వీళ్ళు కూడా శ్రమజీవుల కిందికే వస్తారు. మార్క్స్ ప్రకారం, లుంపెన్‌ వర్గంలో నీచమైన, మాదకద్రవ్యాల వ్యాపారం వంటి వివిధ వ్యాపారాల ద్వారా జీవించే వారి మీద ఆధారపడి వాళ్ళని  ప్రార్థిస్తూ, అణచివేతకు గురవుతూ పరాన్నజీవులుగా జీవించే పేదలు మాత్రమే అయి ఉంటారు. ఎందుకంటే క్యాపిటల్: వాల్యూమ్ 1లో, మార్క్స్ లుంపెన్-ప్రోలెటేరియట్‌లను “సంచారులు, నేరస్థులు, వేశ్యలు” అని వర్ణించాడు, కానీ అతను వారిని నిరుద్యోగులు, చిరుద్యోగుల నుండి వేరు చేయడంలో చాలా జాగ్రత్తగానే  ఉన్నాడు.

లుంపెన్ లైన్‌కు భిన్నంగా, మార్క్సిస్టులు కార్మికవర్గం అత్యంత విప్లవాత్మకమైన వర్గం అని వాదిస్తారు, ఎందుకంటే కార్మికవర్గ విముక్తి అణగారిన దోపిడీకి గురైన ప్రజలందరి సామూహిక విముక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల ఒక వర్గంగా, అది ప్రతి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటంలో అన్ని బంధనాలను బద్దలు కొట్టడమే దాని అంతిమ లక్ష్యంగా గొప్ప  ఆశయాన్ని కలిగి ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యుడు అజిత్ ఈ విషయాన్ని చక్కగా వివరించారు:

 “పెట్టుబడిదారీ విధానాన్ని(సామ్రాజ్యవాదపు అత్యున్నత దశ) నాశనం చేసే చారిత్రక ఉద్యమంలో సామాజిక వర్గాలు, ఇతర తరగతుల వారు చాలా ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నప్పటికీ వారు నాయకత్వాన్ని అందించలేరు.  ప్రతి సందర్భంలోనూ విముక్తి సమస్య చాలా నిర్దిష్టంగా ఉంటుంది. […] అది నిర్దిష్టంగా ఉండడం వల్ల అవి మొత్తం విప్లవాత్మక వ్యవస్థ సందర్భంలో పాక్షికంగా కూడా ఉంటాయి. కానీ శ్రామికవర్గ పరిస్థితి అలా కాదు. కుల-భూస్వామ్యం వంటి మునుపటి దోపిడీ వ్యవస్థలకు  పెట్టుబడిదారీ బానిసత్వం భిన్నంగా ఉంటుంది. ఈ బానిసత్వం కార్మికులపై ఆకలి బాధలు, వేదనలు తప్ప మరే ఇతర ఒత్తిడిని విధించదు. ప్రాధమికంగా, [కార్మికులు] స్వేచ్ఛగానే  ఉన్నందువల్ల, వారికి సరైన నిర్దిష్ట విముక్తి అనేదేదీ ఉండదు. అన్ని రకాల దోపిడీలు, అణచివేతలను అంతం చేయాలి.  ఈ విధంగా మొత్తం మానవాళి విముక్తి ఈ తరగతి విముక్తికి ఒక ముందస్తు షరతుగా మారుతుంది. శ్రామికవర్గపు ప్రధాన పాత్ర సమాజంలో ఈ లక్ష్యం నుండి ఉద్భవించింది. ప్రపంచం దోపిడీ నుండి విముక్తి పొందేవరకూ విప్లవాన్ని కొనసాగించాలని ఇది శ్రామికవర్గాన్ని నిర్బంధిస్తుంది. 

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/fanon.jpg

అయితే, కార్మికవర్గ ప్రజలు వారంతట వారే విప్లవకారులుగా మారతారని దీని అర్థం కాదు. వర్గ సమాజంలోని  ప్రతి ఒక్కరూ పాలక, ఉన్నత వర్గాల వారు అతి చాకచక్యంతో రూపొందించే  కుతంత్రాల  భావజాల ప్రచారంతో తలమునకలవుతుంటారు. ఫలితంగా, చాలామంది ప్రజలు అణచివేత సమాజంలోని పోటీకి తట్టుకోలేక, క్రూరమైన తర్కాలను  అంతర్గతంగా  అంగీకరించే మానసిక స్థితిలో ఉంటారు.  ప్రజల్లో ఉండే ఈ ధోరణులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూ, పాలకవర్గ సైద్ధాంతిక ఆధిపత్యాన్ని ఎదురొడ్డి నిలవడానికి ఒక విప్లవ సంస్థ అవసరం. ఈ ప్రయత్నంలో సామూహిక స్థాయిలో విజయం సాధించాలంటే, పెట్టుబడిదారీ దేశాలలో కార్మిక, శ్రామిక-తరగతి ప్రజలు అత్యధిక జనాభాగా ఉన్నచోట – శ్రామిక వర్గంలో తమను తాము స్థిరంగా నిలబెట్టుకుని తమ వర్గ లక్ష్య ప్రయోజనాలకు అనుగుణంగా కార్యోన్ముఖులుగా చేస్తూ విప్లవ కార్యశీలురను

చెయ్యడంలో విప్లవాత్మక  సంస్థలు నిర్వహించవలసిన పాత్ర  చాలా ముఖ్యం.   

దీనికి విరుద్ధంగా, పెద్దసంఖ్యలో లుంపెన్, సెమీ-లుంపెన్ వ్యక్తులను పార్టీలో నాయకత్వ స్థానాల్లోకి పాంథర్స్ లైన్ ఆహ్వానించింది. లుంపెన్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం గురించి కూడా వారికి ఆ సమయంలో స్పష్టత లేదు. అందువల్ల పార్టీలో దోపిడీకీ, దుస్సంఘటనలకూ పెట్టుబడిదారీ ఆలోచనల పెరుగుదలకూ దారితీసింది.

లుంపెన్-శ్రామికవర్గం గురించిన ఈ గందరగోళం చాలావరకు ఫ్రాంజ్ ఫానన్ (Frantz Fanon) ‘The Wretched of the Earth’ గ్రంధం నుండి వచ్చింది, దీని నుండి హ్యూయ్, బాబీలు అత్యంత గాఢమైన  ప్రభావానికి లోనయ్యారు. పార్టీకి  టెన్-పాయింట్ ప్రోగ్రామ్ రాసే ముందు వారిద్దరూ దానిని శ్రద్ధగా అధ్యయనం చేశారు. నిజానికి లుంపెన్-శ్రామికవర్గం అంటే ఫానన్ పుస్తకంలో “మోసకారులు, పోకిరీలు, నిరుద్యోగులు, చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారని స్వంత నిర్వచన మిచ్చారు. బాబీ, ఫానన్ ఇచ్చిన ఈ నిర్వచనానికి  ఎక్కువగా ప్రభావితమయ్యాడు.

ఫానన్ దృష్టిలో, ఈ వ్యక్తులు “బలమైన శ్రామిక పురుషుల వలె తమకు  తాము విముక్తి కోసం పోరాటంలోకి వస్తారు”.  అంతేకాదు, పట్టణాల్లో జరిగే విప్లవ పోరాటాలలో ప్రముఖ పాత్ర పోషిస్తారు అని ఫానన్ అల్జీరియన్ విప్లవ అనుభవాల నుండి ఈ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు,  కానీ ఇది వేరే దిశలో కూడా పని చేస్తుంది.  వ్యవస్థీకృత నేరస్థుల ప్రజా-వ్యతిరేక ఆలోచనల కారణంగా, పేదలకు మాదకద్రవ్యాలను విక్రయించే కాన్-ఆర్టిస్టులు, లంపెన్ శ్రామిక వర్గాలు సాధారణంగా ఫ్రెంచ్ వలసవాద ప్రభుత్వంతో ఒప్పందాలను తగ్గించు కోవడానికి చాలా ఇష్టపడేవారు, విప్లవ పోరాటాన్ని విధ్వంసం చేయడానికి తరచుగా పనిచేసేవారు కూడా ఉండవచ్చు 

ఈ  విధంగా, లుంపెన్-ప్రొలెటేరియట్‌లో సభ్యులుగా ఉన్న చాలామందిలో  ఎఫ్ బి ఐ  కోసం పనిచేసేవారుగా,  రహస్య సమాచారమిచ్చేవాళ్ళుగా, రెచ్చగొట్టే-ఏజెంట్స్ గా మారారు. ఉదాహరణకు, లాస్ ఏంజిలస్ లో ఇన్‌ఫార్మర్ అయిన లూయిస్ టాక్‌వుడ్, లాస్ ఏంజిలస్ పోలీస్ డిపార్ట్ మెంట్ కి ఇన్‌ఫార్మర్ గా, ఏజెంట్ గా మారడానికి ముందు ఒక చిన్న నేరస్థుడు.  అతను ఎన్నడూ పార్టీ సభ్యుడు కానప్పటికీ, అతను పాంథర్స్‌ తో అనుబంధం కలిగి ఉన్నాడు. పార్టీకి దగ్గరవ్వడానికి అతను క్రమశిక్షణ లేకుండా అజాగ్రత్తగా ఉండి వీధిలో చిత్తశుద్ధి లేని విమర్శలను తిప్పికొట్టడానికి తన అనుభవాలను ఉపయోగించాడు. అతను లుంపెన్-ప్రొలెటేరియట్ సభ్యుడయిన విలియం ఓనీల్ వలె చాలా విధ్వంసక పాత్రను పోషించాడు; అతను కారును దొంగిలించి, ఫెడరల్ అధికారి వలె నటించాడు. ఇదే అదనుగా  ఆ సమయంలో అతన్ని బ్లాక్ పాంథర్ పార్టీలో చేరి ఇన్‌ఫార్మర్‌గా మారాలని పోలీసులు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.  విలియం ఓ’నీల్ చికాగో పాంథర్స్‌ లో చేరి,  చికాగో శాఖ పార్టీ నాయకుడిగా ఉన్న ఫ్రెడ్ హాంప్టన్‌ ను చంపడానికి పోలీసులకు, ఎఫ్ బి ఐ కి  సహాయం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/huey.jpg

పాంథర్స్ తీసుకున్న ఈ లుంపెన్ లైన్ వారి సంస్థలోకి చొరబడిన అటువంటి ఇన్‌ఫార్మర్‌లకు దారిని తెరిచింది.

ఒకరకంగా చెప్పాలంటే  మొద‌టి నుంచి పార్టీలో ఇదే రకమైన తంతు ఉంది. పార్టీ స్థాపనకు ముందు హ్యూయ్ తన ఆత్మకథలో “తాను నివసిస్తున్న బ్లాక్‌లో ఉన్న నల్లజాతి సోదరులతో కలిసి పరిగెత్తే వాడినని” “ఏదైనా కొంత డబ్బు  [అతనికి ] చిన్న నేరాల నుండి వచ్చేదని, అది తన  పాత పద్ధతి”- అని చెప్పాడు8.  ఓక్లాండ్ లోని మెర్రీట్ కాలేజీలో హ్యూయ్ చదువుతున్నప్పుడు, “ఆ సమయంలో తాను వెర్రి కోపంతో, ఉద్రేకంతో ఊగిపోయే యువకుడనని, వైన్ తాగుతూ బ్లాక్‌లో ఉన్న వారందరితో పోట్లాడుతుండేవాడినని, బెర్కిలీ హిల్స్ లోని ఇళ్లలో దొంగతనాలు చేస్తూ ఉండేవాడినని” అతనే చెప్పుకున్నాడు. బ్లాక్ పాంథర్ పార్టీని స్థాపించిన తర్వాత కూడా హ్యూయ్ ఈ ఆలోచనలను కొంతవరకు కొనసాగించాడు.  “బ్లాక్‌లో ఉన్న సోదరులతో” పాంథర్ పార్టీకి సంబంధం ఉండాలనీ, వారి ప్రోద్బలంతో విజయం సాధించాల్సిన అవసరం ఉందనే ఆలోచనలతో అతను పూర్తి ఏకీభావంతోనే ఉన్నాడు, అందువల్ల అతను పింప్‌లు, చిన్న నేరస్థులు, మాదకద్రవ్యాల వ్యాపారుల పట్ల సదభిప్రాయంతోనే  ఉన్నాడు. బెర్కిలీ హిల్స్ లోని ధనవంతుల ఇళ్ళ నుండి మాత్రమే హ్యూయ్ స్వయంగా దొంగిలించగా, లుంపెన్ నేపథ్యం నుండి పార్టీలో చేరిన కొంతమంది నల్లజాతి వర్గాలు కూడా పేద ప్రజలను వేటాడే చరిత్రను కలిగి ఉన్నారు.

విప్లవ సంస్థలు అత్యంత అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాలలోనే  తమ స్థావరాన్ని ఆధారం చేసుకుని పని చెయ్యాలి. ఆ విధంగా పని చేస్తున్న క్రమంలో వారు నివసిస్తున్న సొంత సమాజపు ప్రజలను వేధిస్తూ, తద్వారా జీవనోపాధి పొందుతున్న ప్రజా వ్యతిరేక సమూహాలపై కూడా విజయం సాధిస్తారు. ఈ వ్యక్తులు, సంస్థలు కూడా విప్లవాత్మక పోరాటంలో భాగంగా తమ చర్యలను, చేస్తున్న తప్పొప్పులను  స్వీయ విశ్లేషణాల ద్వారా ఎంచి చూసుకుంటూ తమ తమ దృక్పథాలను సవ్యమైన దిశలోకి మార్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, ఒక విప్లవాత్మక సంస్థ ప్రధానంగా లుంపెన్-శ్రామికవర్గం మధ్య స్థిరపడటం అసాధ్యమవుతుంది. ఈ వర్గం, సామాజిక దోపిడీ ద్వారా తన ఉనికిని చాటుకుంటున్నందువల్ల, విప్లవోద్యమంలో ప్రముఖ వర్గంగా తన మనుగడ సాగించలేదు.  మహా అయితే  కొంతమంది సభ్యులు మిత్రపక్షాలుగా మారవచ్చు, కానీ ఈ వర్గం ప్రాథమికంగా సహకారానికి బదులుగా పోటీపై ఆధారపడిన పెట్టుబడిదారీ ఆకాంక్షలను కలిగి ఉంటుంది. చారిత్రాత్మకంగా చూస్తే వారు విప్లవ ఉద్యమానికి పదే పదే ద్రోహం చేశారు. వారు సాధారణంగా పాలకవర్గంతో రాజీపడి బతకడానికి, అమ్ముడు పోవడానికి  సిద్ధంగా ఉంటారు.

లుంపెన్-శ్రామికవర్గపు  రాజకీయ స్వభావం గురించి  పాంథర్స్ గందరగోళం కేవలం సైద్ధాంతిక ప్రశ్న మాత్రమే కాదు, ఇది తక్షణం ఆచరించ వలసిన రాజకీయ ప్రాముఖ్యత ఉన్న ప్రశ్న కూడా. లోతైన ప్రజావ్యతిరేక ఆలోచనలు కలిగిఉన్న అనేకమంది సభ్యులకు ఆశ్రయమిచ్చే లుంపెన్ వైఖరిని పార్టీ అనుసరించింది. అందువల్ల అది బ్లాక్ పాంథర్ పార్టీ అభివృద్ధిపై గొప్ప ప్రభావాన్ని చూపడానికి దోహదం చేసింది. ఈ ప్రతికూల ప్రభావం విపరీతంగా, తిరిగి సరిచేసుకోలేనంతగా  విస్తరించింది; సానుకూల శక్తులతో ఐక్యం కావడానికి, వారి లోపాలను స్వీయ-విమర్శనాత్మకంగా అంచనా వేసుకోవడానికి, పాత ప్రపంచాన్ని రద్దు చేసే లక్ష్యంతో  అణచివేత, దోపిడీలు లేని కొత్త సమాజాన్ని సృష్టించడానికి జీవిత పర్యంతం నిబద్ధతతో, నిజాయితీతో అంకితభావంతో పని చేయగలిగిన విప్లవకారుల సంస్థను అభివృద్ధి చేయడానికి ఈ లుంపెన్ వైఖరి బ్లాక్ పాంథర్ పార్టీ సామర్థ్యాన్ని పరిమితం చేసింది.

బ్లాక్ పాంథర్ పార్టీ ఎదుగుదల –ఎదురు దెబ్బలు 

కాలిఫోర్నియా క్యాపిటల్ వద్ద నిరసన తర్వాత, పాంథర్స్ పార్టీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిం ది.  ఈ ప్రదర్శన దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులకు స్ఫూర్తినిచ్చింది. జాతీయ స్థాయిలో బ్లాక్ పాంథర్ పార్టీ ప్రాముఖ్యతను పెంచింది. ఇది దేశవ్యాప్తంగా నూతనోత్తేజాన్నిచ్చింది. ఫలితంగా ప్రధాన నగరాల్లో పార్టీ శాఖల పెరుగుదలకు ఊతమిచ్చింది. నిరసన జరిగిన ఒక సంవత్సరంలోనే రిచ్‌మండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజిల్స్, న్యూయార్క్ నగరాలలో బ్లాక్ పాంథర్ పార్టీ కొత్త శాఖలు స్థాపించబడ్డాయి. తన పదిహేనేళ్ల వయసులో ఫిలడెల్ఫియాలోని పాంథర్స్‌ లో చేరిన ముమియా అబు-జమాల్, అతి వేగంగా పార్టీ ప్రజల్లోకి దూసుకుపోయిన విధానాన్ని  ఈ విధంగా వివరించాడు:

బ్లాక్ పాంథర్ పార్టీకి ఇంకా ఒక సంవత్సరం వయసు కూడా లేదు. ఉధృతమైన ప్రవాహంలాగా నలుదిశలకూ వ్యాపించింది. తర్వాత మూడేళ్ళలో అనూహ్యంగా విపరీతంగా విస్తరించింది. ఇది మొదట రిచ్ మండ్ (కాలిఫోర్నియా) కి, తర్వాత బే మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకి, అక్కడనుండి దక్షిణం వైపు లాస్ ఏంజెల్స్ కు వ్యాపించింది. కాలిఫోర్నియా నుండి నల్లజాతి సమూహాలు ఎక్కడికైతే పార్టీ యువశక్తికి ఆహ్వానం పలుకుతుందో అక్కడికంతా సాధ్యమైన ప్రతి ప్రాంతానికీ బ్లాక్ పాంథర్ పార్టీ విస్తరించింది. ఉత్తరాన సియాటెల్ కి; తూర్పున కాన్సాస్  నగరానికి; చికాగో లోని బ్లాక్ మక్కాకి; బోస్టన్ కి; న్యూయార్క్ లోని హార్లెం, బ్రాంక్స్, బ్రూక్లిన్ బారోగ్ లు;విన్స్ టన్-సేలం, నార్త్ కరోలినా; బాల్టిమోర్; నాష్ వీల్లే; టెన్నెస్సీ; న్యూ ఆర్లీన్స్.” – మొదలైన  సాధ్యమైన అన్నీ ప్రాంతాలకీ విస్తరించింది.   

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/mumia.jpg

                      Mumia takings calls at the Philadelphia Panther office in 1969.

1969 నాటికి, దేశవ్యాప్తంగా నలభైకి పైగా శాఖలు ఏర్పడ్డాయి. పార్టీ సభ్యత్వం 4,000 కి పెరిగింది. ఈ నగరాల్లో, పాంథర్స్ నల్లజాతి సమూహాలను చైతన్యీకరించడానికి అవసరమైన విప్లవాత్మక రాజకీయ విద్యను అందించడానికి ఉద్దేశించిన రాజకీయ కార్యక్రమాలను వరసగా నిర్వహించారు. అదే సమయంలో, లంపెన్-శ్రామికవర్గంలోని చాలా మంది సభ్యులు దొంగతనాలు, దోపిడీలు చేస్తున్న క్రమంలో ఏర్పరచుకున్న వివిధ ఆలోచనలను పంచుకుంటూ వారితో కూడా పని చేశారు. 

రోజు రోజుకీ సంఖ్యాబలాన్నీ, ప్రాముఖ్యతనూ పెంచుకుంటున్న పాంథర్స్ వియత్నాం యుద్ధ – వ్యతిరేక ఉద్యమంతో కూడా జతకట్టడం ప్రారంభించారు. దేశంలోని వివిధ యూనివర్సిటీలు, రాజకీయ కార్యక్రమాల్లో మాట్లాడేందుకు పార్టీ నాయకులను ఆహ్వానించారు. ఇది వారి సందేశాన్ని సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేయడానికి, విస్తృత జనాభాలో విప్లవానికి మద్దతునిచ్చే మార్గాలను వారికి అందించింది. “ది బ్లాక్ పాంథర్” వార్తాపత్రిక  పాఠకుల సంఖ్య ఈ కాలంలో కూడా విపరీతంగా పెరిగింది.

అయితే ఈ  పెరుగుదల అణచివేత శక్తుల దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది.  1967 ఆగస్టులో అప్పటి ఎఫ్ బి ఐ డైరెక్టర్ జె. ఎడ్గార్ హూవర్ నల్ల జాతీయులను “నల్ల జాతీయవాద ద్వేషపూరిత సమూహం” గా

పేర్కొని  పాంథర్‌ల శక్తి యుక్తులను, వారి పార్టీ  లక్ష్యాలను “తటస్థీకరించడానికి” ప్రభుత్వపు కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ (COINTELPRO) పై దృష్టి పెట్టాలని ఏజెన్సీని ఆదేశించాడు. వాస్తవానికి అమెరికాలోని కమ్యూనిస్ట్ పార్టీని నాశనం చేయడానికి, కార్మిక ఉద్యమాన్ని అణిచివేయాలనే లక్ష్యాలతో మెక్‌కార్తీ-యుగం కార్యక్రమంగా కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ రూపొందించబడింది. అయినప్పటికీ, దక్షిణాదిలో జిమ్ క్రో విభజన (Jim Crow Segregation), ఉత్తరాన ఘెట్టో విభజనలకు వ్యతిరేకంగా సామూహిక పౌరహక్కుల ఉద్యమం పెరుగుతున్నకొద్దీ, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ను ఆ యా ప్రాంతాలకు విస్తరించారు. 1960ల చివరలో బ్లాక్ లిబరేషన్ ఉద్యమాలు, కొత్త కమ్యూనిస్ట్ ఉద్యమాలు చెలరేగినప్పుడు, ఎఫ్ బి ఐ వెంటనే తన దిశను మార్చుకుని పాంథర్స్, రివల్యూషనరీ యూనియన్ వంటి కొత్త విప్లవాత్మక సమూహాలపై గట్టి నిఘా పెట్టి కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ను అమలు చేస్తూ, వారిని అణచివేయడంపై తన దృష్టిని కేంద్రీకరించింది.

పాంథర్స్ విషయంలో ఒక సభ్యుడిని రకరకాల ప్రలోభాలకు గురిచేసి, ఒత్తిడి చేసి  బలవంతం చేయడం ద్వారా ఇన్‌ఫార్మర్‌గా మార్చుకోవడంతో  ఎఫ్ బి ఐ కార్యక్రమం ప్రారంభమైంది. ఎర్ల్ ఆంథోనీ అనే అతను పార్టీ వయస్థాపక సభ్యుడు, అతను న్యాయశాస్త్ర విద్య నభ్యసించడానికి కళాశాలలో చేరాడు. పార్టీలో చేరిన తర్వాత వియత్నాం యుద్ధంలో పాల్గొనవలసిందిగా అతని పేరును  నమోదు చేశారు. యుద్ధానికి వెళ్ళే అవసరం లేకుండా నిర్బంధించబడకుండా ఉండటానికి అతను “పూర్తి బ్లాక్ పాంథర్ యూనిఫాంతో పాటు పార్టీ గుర్తింపు  రెగాలియా” ధరించి డ్రాఫ్ట్ బోర్డు విచారణకు వెళ్ళాడు. అతను నేను కమ్యూనిస్ట్ నని, పాంథర్స్ సభ్యుడనని డ్రాఫ్ట్ బోర్డ్‌ కు చెప్పాడు. “వాళ్ళు గనక నన్ను వియత్నాంకు పంపితే, నేను యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత నేను నా లెఫ్టినెంట్, సార్జెంట్‌ లను తలపై పేల్చి వేసి ఉత్తర వియత్నాంకు తప్పించుకుని పారిపోతాను అని డ్రాఫ్ట్ బోర్డుకి చెబుతున్నాను … కాబట్టి ఆ  నరకానికి నేను వెళ్ళను గాక వెళ్ళను” అని హెచ్చరించాడు. 

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/earl_bpp.jpg

After leaving the Panthers Earl Anthony went on to publish a book (with the help of the U.S. government) that spread lies and rumors aimed discrediting the Panthers.

ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, అతను పార్టీలో చేరాడు.  లా స్కూల్‌లో కలిశారని  చెప్పిన అతని స్నేహితులు అతని అపార్ట్మెంట్‌లో కనిపించసాగారు. అలా నమ్మించారే తప్ప, వాళ్ళు నిజంగా అతని స్నేహితులు కాదు, వాళ్ళు లా స్కూల్‌ విద్యార్ధులు కూడా కాదు. వాళ్ళు ఎర్ల్ ఆంథోనీ మీదా, బ్లాక్ పాంథర్ పార్టీ కార్యకలపాల మీదా నిఘా పెట్టడానికీ, పర్యవేక్షించడానికీ వీలు కలిగేలా న్యాయ విద్యార్ధులుగా నటించిన ఎఫ్ బి ఐ ఏజెంట్లు. ఆ రోజు వారు తనను ఇన్‌ఫార్మర్‌గా పని చేయాలని ఎలా బలవంతం చేశారో ఆంథోనీ ఇలా వివరించాడు:

“వారు సూటిగా అసలు విషయానికి వచ్చారు: వాన్ న్యూస్ డ్రాఫ్ట్ బోర్డ్‌ పై బాంబు దాడికి సంబంధించి నేను విచారణలో ఉన్నాను. నేను షాక్ తగిలినట్లుగా అంతులేని ఆశ్చర్యానికి గురైనట్లుగా చలించిపోయాను. బాంబు దాడి గురించి నాకు ఏమీ తెలియకపోవడమే కాదు, ఆ స్థలంలో బాంబు దాడి జరిగిందని కూడా నాకెవరూ చెప్పలేదు, దాని గురించి నేను వినను కూడా లేదు. 

“అయితే నిజానికి వాళ్ళు నన్ను నమ్మడం లేదని, కానీ నాతో ఒక రహస్య ఒప్పందాన్ని చేసుకుందామని చెప్పారు. నేను బ్లాక్ పాంథర్ పార్టీలో ఉంటూ  ఎఫ్ బి ఐ  కి ఇన్‌ఫార్మర్‌ గా మారితే వారు నాపై ఉన్న ఆరోపణలను తొలగిస్తామన్నారు. నేను నవ్వడం మొదలుపెట్టాను, వెంటనే ఓ’కానర్(O’Connor) నా దవడపై కుడి పిడికిలితో బలంగా విసిరి కొట్టి, నన్ను గోడకు ఆనించి శక్తి కొద్దీ తన్నాడు. కిజెన్స్కీ (Kizenski)  నన్ను గట్టిగా పట్టుకున్నాడు, ఓ’కానర్ కుడి నుంచి  ఎడమ నుంచి వరస బెట్టి కొడుతూ, నేను  స్పృహ కోల్పోయేలా చేశాడు.

“నేను స్పృహలోకి వచ్చి చూసినప్పుడు, వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, నాపై తుపాకులు గురి పెట్టి కూర్చున్నారు. కిజెన్‌స్కీ వారు వియత్నాంలో పశువైద్యులు కావడం గురించి ప్రస్తావించాడు. నా ‘అతి తెలివి’ వైఖరి వాళ్ళకి నచ్చలేదని చెప్పారు. వాళ్ళు నాకు తమ ఒప్పందాన్ని మళ్లీ ప్రతిపాదించారు. నేను గనక బ్లాక్ పాంథర్ పార్టీలో ఎఫ్ బి ఐ ఇన్ఫార్మర్ – ఏజెంట్ – గూఢచారిగా మారితే, డ్రాఫ్ట్ బోర్డ్‌ లో ఇంతవరకూ ఎవరూ చంపబడలేదు కాబట్టి, దానిపై నేను బాంబు దాడి చేసినట్లు  నా మీద  ఉన్న ఆరోపణలను వాళ్ళు రద్దు చేస్తా మన్నారు. 

“నేను వాళ్ళ డీల్ కి అంగీకరించాను, నాకు తెలిసినంత వరకు, కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్  డివిజన్ నుండి నాలాగే ఒకే రకమైన ఒప్పందాన్ని అంగీకరించిన డజన్ల కొద్దీ బ్లాక్ పాంథర్‌ పార్టీ సభ్యులలో నేనే మొదటి వ్యక్తిని అయ్యాను. మరికొందరు స్థానిక పోలీసు ఇన్‌ఫార్మర్లుగా మారారు. త్వరలో ఈ  విధంగా మాలో  చాలామందిని బలవంతంగా ఒప్పించారు, మేమందరం ఒకరి గురించి ఒకరు కుతూహలంతో  పరిశీలనగా తెలుసుకోవడం మొదలు పెట్టాం.”

ఎర్ల్ ఆంథోనీ, అనేక ఇతర మోసగాళ్ళ మాదిరిగానే, పార్టీ చరిత్రలో చాలా దుర్మార్గమైన విధ్వంసక పాత్ర పోషించాడు. అతను ఇన్ఫార్మర్ అయ్యాడనే విషయం స్పష్టంగా తెలియకముందే, పార్టీ అతన్ని లాస్ ఏంజెల్స్‌కు పంపి అక్కడ ఒక శాఖను ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేయమని పంపింది. తర్వాత  రెండు సంవత్సరాలలో, అతను జాతీయంగానే గాక  అంతర్జాతీయంగా లాస్ ఏంజెల్స్‌ లో పార్టీ ఎదుగుదలను తీవ్రంగా అడ్డుకునే అనేక వివాదాలు, సంఘటనలకు కేంద్రంగా మారాడు. పార్టీకి ఈ లాస్ ఏంజిల్స్‌ నగరంలో తప్పనిసరిగా ఒక శాఖను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండగా, అతను మొదటి నుంచే ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు.  ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతే కాకుండా  కొన్ని సంవత్సరాల క్రితం వాట్స్ తిరుగుబాటులో చెలరేగిన  అణచివేతపై ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ పార్టీ తక్షణం ఒక శాఖను ఏర్పాటు చేయాలని భావించింది.

ఈ తిరుగుబాటు నుండి “యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్” అని పిలువబడే ఒక సంస్థ ఏర్పడింది. ఇది  ఒక పరిశీలనాత్మక సంస్థ, మిశ్రమ పరిశోధనలు, విమర్శలు చేసే ఒక విశేషమైన సంస్థ. యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్, లాస్ ఏంజెలస్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ (UCLA) లో ‘బ్లాక్ స్టడీస్ డిపార్ట్‌ మెంట్’ కోసం బలంగా వాదించి సాధించడం వంటి కొన్ని ప్రగతిశీలమైన పనులు చేసింది. సభ్యులు తమ నాయకుడు మౌలానా “రాన్” కరెంగా (Maulana “Ron” Karenga) మీసాలను అనుకరించడం వంటి మరికొన్ని వింత పద్ధతులను పాటిస్తారు. ఈ సంస్థ సభ్యులందరూ విధిగా కిస్వాహిలి (KiSwahili) భాష నేర్చుకోవాలి. వారి పూర్వీకులు ఆఫ్రికాలోని ఈ భాష మాట్లాడని భాగానికి చెందిన వారైనా, కిస్వాహిలి భాషలోనే తమ పేర్లను పెట్టుకోవాలి. మొత్తంమీద యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక నల్లజాతి సాంస్కృతిక జాతీయవాద సంస్థ. ఇది విప్లవాత్మక పోరాటానికి బదులుగా ప్రజలను విముక్తి చేయడానికి ప్రత్యేకమైన సంస్కృతిగా వారి భాష, దుస్తులు,  ఆచారాలను తమ వ్యక్తీకరణలుగా చేపట్టింది. యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ విద్యార్ధులకు సామాజిక అవసరాల కనుగుణమైన జ్ఞానాన్ని నిరంతరం బోధిస్తూ అభివృద్ధి చేస్తుండడమే గాక, విభిన్న దృక్కోణాలతో సుసంపన్నమైన విశ్వవిద్యాలయాన్ని సృష్టించింది. దీనిలోని వ్యక్తులందరూ అభివృద్ధి చెందే ప్రణాళికల్ని రూపొందించింది. 

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bunchy-john7852.jpg

లాస్ ఏంజెలస్ లో బ్లాక్ పాంథర్ పార్టీ శాఖను స్థాపించిన తర్వాత, ఎర్ల్ ఆంథోనీ పార్టీని యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సంస్థతో చాలా ఎక్కువగా భీకరమైన సంఘర్షణలోకి నెట్టాడు. చివరికి అది డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్ ఆల్ప్రెంటిస్ “బంచీ” కార్టర్ (“Bunchy” Carter), ఇన్ఫర్మేషన్ డిప్యూటీ మినిస్టర్ జోన్ హగ్గిన్స్ (John Huggins) అనే ఇద్దరు బ్లాక్ పాంథర్ పార్టీ కీలక సభ్యుల మరణానికి దారి తీసింది. యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ పరిశీలనాత్మక, సాంస్కృతిక జాతీయ వాదం అయినప్పటికీ, పాంథర్స్ కి  ఈ గ్రూపుతో కలిసి పనిచేయడం కష్టతరమైనప్పటికీ, సంస్థల మధ్య హింసాత్మకమైన, ఘోరమైన ఘర్షణ అనివార్యమైనప్పటికీ, తీవ్రమైన విరోధపు భావనల విత్తనాలు వెదజల్లే ఇన్ఫార్మర్ల పాత్ర లేకపోయి ఉండి ఉంటే  దానిని నివారించ గలిగే  వీలుండేది. 

ఎర్ల్ ఆంథోనీకి, ఎఫ్ బి ఐ రెండు గ్రూపుల మధ్య విబేధాలు సృష్టించాలని ప్రత్యేకంగా సూచించింది. యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సంస్థ నుండి పాంథర్స్‌ కు, పాంథర్స్‌ నుండి యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సంస్థకూ విరోధాన్ని మరింత ముమ్మరం చెయ్యడానికి నకిలీ మరణ బెదిరింపులను పంపడం వంటి అనేక పద్ధతులను మాయోపాయాలను ఎఫ్ బి ఐ ప్రయోగించింది. వారు రెండు సంస్థలకు అవమానకరమైన, హేళన చేసే రెచ్చగొట్టే కార్టూన్‌లను కూడా ఒకరి నుండి మరొకరికి చేరేటట్లుగా సృష్టించి పంపారు, పాంథర్స్ – యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సంస్థ రెండింటికీ ఒకరి మీద మరొకరు సాయుధ పోరాటాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా  కుట్రలను ప్రేరేపించి రెచ్చిపోవడానికి దోహదం చేశారు. 

పాంథర్స్‌ లో పెద్ద సంఖ్యలో మాజీ ముఠా సభ్యులు ఉండటంతో ఈ వివాదం తీవ్రమైంది.  బంచీ సాల్సన్ స్ట్రీట్ గ్యాంగ్ మాజీ సభ్యుడు, అతను సాయుధ పోరాటానికి  అనుకూలంగా ఉన్నాడు.  జైలులో అతను ‘నేషన్ ఆఫ్ ఇస్లాం’ అనే పార్టీలో చేరాడు, అక్కడే ఎల్డ్రిడ్జ్ క్లీవర్‌ ను కలుసుకున్నాడు, బ్లాక్ పాంథర్ పార్టీ  సమాచార మంత్రి ఎల్డ్రిడ్జ్ క్లీవర్‌ తో సంభాషణల ద్వారా, ప్రభావితమై అతను తర్వాత, ఇస్లాం నేషన్ ను  విడిచిపెట్టి పాంథర్స్‌ లో చేరాలని నిర్ణయించుకున్నాడు. బంచీ లాస్ ఏంజెలస్ లో బ్లాక్ పాంథర్ పార్టీ శాఖను ఏర్పరచడంలో చాలా కృషి చేశాడు, లాస్ ఏంజెలస్ పాంథర్ పార్టీలో అనేకమంది సభ్యులను చేర్చడంలో చాలా విశేషమైన పాత్ర పోషించాడు. అయినప్పటికీ, అతను సాల్సన్ స్ట్రీట్ గ్యాంగ్‌తో సంబంధాలను కొనసాగిస్తూ, ఆ గ్యాంగ్‌ సభ్యులను కూడా పార్టీలో చేర్చుకున్నాడు. వారిలో కొందరు పదునైన విప్లవాత్మకమైన భావాలతో ఉన్నారు అయితే, చాలామంది మాత్రం ఇప్పటికీ వివిధ లుంపెన్ సిద్ధాంతాలను నిలుపుకుంటూ బ్లాక్ పాంథర్ పార్టీ – యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ మధ్య వైరాన్ని త్వరగా పెంచారు; వీటన్నిటి వెనుకా అసలైన సూత్రదారి ఎఫ్ బి ఐ,  తెర వెనుక మంటలు  రేపుతున్నదని రెండు పార్టీల వారూ కూడా  గ్రహించలేకపోయారు.

ఇన్‌ఫార్మర్ ఎర్ల్ ఆంథోనీ మాత్రమే గాక తీవ్రమైన ఘర్షణలకు దారితీసిన సంఘటనలకు, యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్‌లో కూడా ఇన్‌ఫార్మర్లు ఉన్నారు. పాంథర్స్‌ పార్టీలో ఎఫ్ బి ఐ కోసం పని చేస్తున్న మరొక సభ్యురాలు కూడా ఉంది, ఎలైన్ బ్రౌన్, అనే ఒక మహిళ, పార్టీలో చీలికకు మాత్రమే గాక చివరికి దానిని  విధ్వంసం చేయడంలో కూడా కీలకమైన పాత్ర పోషించింది. పార్టీలో చేరడానికి ముందు, ఎలైన్ బ్రౌన్, ‘ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్’ (OSS) లో ఒక మాజీ అధికారిగా పని చేసిన జే రిచర్డ్ కెన్నెడీ తో సహజీవనం చేస్తుండేది. ఆ సమయంలో ఆమె ఎఫ్ బి ఐ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) ఇన్‌ఫార్మర్‌గా పనిచేసింది. వారు కలిసి ఉన్నప్పుడు ఆమె మావో జెడాంగ్‌ను హత్య చేసే పనిలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గురించి ఒక నవల రాసింది. ఎలైన్ బ్రౌన్ తన పుస్తకం, ఏ టేస్ట్ ఆఫ్ పవర్‌” (A Taste of Power) లో, కెన్నెడీ తనకు ఒక “మహిళగా” ఉండమని ఎలా నేర్పించాడో, “ఉద్యమంలో” చేరడానికి ఆమె ఆసక్తిని ఎలా పెంచాడో వివరిస్తుంది.

ఎల్‌డ్రిడ్జ్ క్లీవర్‌ ను  లైంగికంగా రెచ్చగొట్టడం ద్వారా ఎలైన్ బ్రౌన్ మొదట పార్టీలో చేరింది. జాన్ హగ్గిన్స్ భార్య ఎరికా గర్భవతిగా ఉన్నప్పుడు, ఎలైన్ బ్రౌన్  జాన్ హగ్గిన్స్ కలిసి నిద్రించడం ప్రారంభించారు. ఈ సమయంలో పాంథర్స్ పార్టీ – యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ మధ్య ఘర్షణ పరిస్థితులు చాలా తీవ్రంగా, ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు గ్రూపులు అనేక రంగాల్లో పోరాడుతున్నాయి. పాంథర్స్ పార్టీ – యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ మధ్య కొత్తగా స్థాపించబడిన కాలిఫోర్నియా యూనివర్సిటీ లాస్ ఏంజెలస్ బ్లాక్ స్టడీస్ విభాగానికి డైరెక్టర్ నియామకం ఒక సమస్యగా పరిణమించింది. దానికి డైరెక్టర్ గా ఎవరిని నియమించినా ఆ ప్రాంతంలోని బ్లాక్ కమ్యూనిటీపై పెద్ద ప్రభావం ఉంటుందని పాంథర్స్ గ్రహించారు, ఎవరైనా విప్లవాత్మక ఆలోచనాపరుడు  ఆ స్థానాన్ని పొందితే బాగుంటుందని ఆశించారు. బంచీ కార్టర్, జాన్ హగ్గిన్స్ ఇద్దరూ కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులు కావడం వల్ల ఆ విశ్వ విద్యాలయం గురించి వారికి మంచి అవగాహన ఉంది. యు ఎస్ ఆర్గనైజేషన్ ఒక బలమైన సాంస్కృతిక జాతీయవాదిని  డైరెక్టర్‌ గా  నియమించాలనే  లక్ష్యంతో ఉంది.

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_two/elaine_brown.jpg

              Bobby Seale and Elaine Brown ran for political office together in 1973. She was instrumental in pushing the Party 

                                        away from revolutionary politics and towards electoral reformism.

ఎలైన్ బ్రౌన్, ఎర్ల్ ఆంథోనీల పని కారణంగా, పాంథర్స్ – యు ఎస్ ఆర్గనైజేషన్ ల మధ్య వివాదం తీవ్రమై, పోరాటం హింసాత్మకంగా ప్రమాదకరంగా మారింది. వేడెక్కుతున్నఈ వాతావరణ పరిస్థితుల వల్ల, ఉద్రిక్తతలను  తగ్గించడానికి పాంథర్స్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గెరోనిమో జి-జగా  అనే ఆయన లాస్ ఏంజెలస్  శాఖలో డిఫెన్స్ డిప్యూటీ మినిస్టర్‌గా ఉన్నారు. అతను వియత్నాం యుద్ధంలో  పని చేసిన అనుభవజ్ఞుడు. అతని సైనిక అనుభవం, విప్లవ పోరాటానికి అంకితమై పనిచేసిన విధానం లాస్ ఏంజెలస్ శాఖ పెరుగుదలకు, ప్రత్యేకించి పోలీసులు పాంథర్స్‌ పై తీవ్రమైన దాడులు ప్రారంభించినప్పుడు, పార్టీ విజయం సాధించడంలో అతను ప్రధానంగా చాలా కీలకమైన  పాత్ర పోషించాడు. అతన్ని తర్వాత కౌంటర్ – ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లక్ష్యంగా చేసుకుంది. హత్య చేశాడనే తప్పుడు ఆరోపణలపై 27 సంవత్సరాలు నేరారోపణ రద్దు చేయబడేవరకు జైలుశిక్షకు బలయ్యాడు. జాన్ హగ్గిన్స్, బంచీ కార్టర్‌ ల మరణాలకు దారితీసిన యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ సంస్థతో 1969లో జరిగిన సంఘర్షణను అతను ఈ విధంగా వివరించాడు:

“కాలిఫోర్నియా యూనివర్సిటీ క్యాంపస్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ – పాంథర్స్ మధ్య జాగ్రత్తగా ముందుగా ఏర్పాటు చేయబడిన సమావేశంలో […] ఎలైన్ బ్రౌన్ ఆమెతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ సభ్యులలో ఒకరిని కొట్టి, గొడవను ప్రేరేపించింది.  ఆ తర్వాత  ఆమె అరుస్తూ జాన్ హగ్గిన్స్ వద్దకు పరిగెత్తి, యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ సభ్యుడు తన మీద  దాడి చేశాడని ఆరోపించింది! జాన్ హగ్గిన్స్ వెంటనే తన నడుము నుండి 357 మాగ్నమ్‌ తుపాకీని తీసి యూ ఎస్ సభ్యునిపై కాల్పులు జరిపాడు, అతను తప్పించుకుని తిరిగి జరిపిన కాల్పుల ఫలితంగా జాన్ హగ్గిన్స్, బంచీ కార్టర్‌  ఇద్దరూ మరణించారు.”10 

ఎలైన్ బ్రౌన్ ఈ విషయంపై కోర్టుకి స్వచ్ఛందంగా వెళ్ళి, కేసు గురించి అసలు నిజం చెప్పకుండా అబద్ధాల సాక్ష్యమివ్వడానికి పార్టీ నిబంధనలను ఉల్లంఘించింది. ఈ వినాశనకరమైన సంఘటన తర్వాత, యునైటెడ్ స్టేట్స్ ఆర్గనైజేషన్‌తో పాంథర్స్ పార్టీకి బహిరంగ వివాదం కొనసాగింది, అది తరచూ తగాదాలకు దారితీస్తూనే ఉంది.

జాన్ హగ్గిన్స్, బంచీ కార్టర్‌ ల మరణానికి ముందే లాస్ ఏంజెలస్  శాఖలోని ఇతర సభ్యులు ఎలైన్ బ్రౌన్ – ఎర్ల్ ఆంథోనీల పట్ల విమర్శనాత్మకంగానే ఉన్నారు. అయితే, ఈ విమర్శలు ఉన్నప్పటికీ, 1968లో కాథ్లీన్ క్లీవర్‌తో కలిసి జపాన్ పర్యటనకు ఎర్ల్‌ ఆంథోనీని పంపాలని హ్యూయే నిర్ణయించాడు. పాంథర్స్ పనితో పాటు, చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం ద్వారా ప్రేరణ పొందిన విప్లవ విద్యార్థులు బ్లాక్ పాంథర్ పార్టీని జపాన్‌కు ఆహ్వానించారు. అయితే, అమెరికా ప్రభుత్వం కాథ్లీన్ వీసాను నిలిపి వేసి, ఆమెను జపాన్ వెళ్ళకుండా అడ్డుకుంది.

ఎర్ల్ ఆంథోనీ ఒంటరిగా జపాన్‌కు వెళ్ళినప్పుడు, అతను పార్టీని అప్రతిష్టపాలు చేసే లక్ష్యంతో అన్ని రకాల అసత్యాలు, అర్ధంలేని మాటలు మాట్లాడాడు. తన ఆత్మకథ, రివల్యూషనరీ సూసైడ్‌లో, హ్యూయ్ పి. న్యూటన్

ఇది ఎలా జరిగిందో వివరించాడు:

ఎర్ల్ ఆంథోనీ బ్లాక్ పాంథర్ పార్టీ ప్రతినిధిగా జపాన్‌కు వెళ్ళి, ప్రతి విషయాన్నీ కూడా చాలా కుట్రపూరితంగా తప్పుగా ప్రతిపాదించాడు. పార్టీ లక్ష్యాలను, పరిస్థితిని, వివరించడానికి బదులుగా, అతను వక్రీకరించి తన వ్యక్తిగత అభిప్రాయాల నివేదికను సమర్పించాడు. తెలుపు నలుపులు కలగలిసిన అమెరికా రంగుల సమాజంలో నల్లజాతి ప్రపంచం, ఆధిపత్య తెల్ల ప్రపంచంతో ఎదురొడ్డి పోరాడగలగడమనేది సాధ్యం కాదు, చివరికి అది ఖచ్చితంగా నల్లజాతి ముగింపే  అవుతుంది. అతని మొత్తం చర్చ చాలా సరళంగా ఉంది. స్టోక్లీ కార్మైకేల్ లైన్‌ను అనుసరించాడు. అతను వర్గ సమస్యలపై ఎటువంటి అవగాహన చూపించలేదు, వాటిని అమెరికా దేశ పరిస్థితుల పరంగా వివరించడానికి కూడా ప్రయత్నించలేదు. అతనికి మొత్తం సమస్య జాతి వివక్షకు సంబంధించినదని, అది వేర్పాటువాదం కోసం అరిచి గీపెడుతున్నట్లు, కేకలు వేస్తున్నట్లుగా కనిపించింది.

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/geromino.jpg

కొన్ని జపనీస్ సెషన్‌ల టేప్ రికార్డులను నేను విన్నాను – ఒక స్నేహితుడు వాటిని నా దగ్గరకు తెచ్చాడు-నాకు చాలా కోపం వచ్చింది. జపనీస్ విద్యార్థులు ఆంథోనీని ఎడమ వైపు నుంచి కుడి వైపు నుంచి అర్ధవంతంగా ప్రశ్నిస్తూ ఎదుర్కొన్నారు. వారు వైరుధ్యాలను మాండలిక పద్ధతిలో పరిష్కరించే మంచి ప్రశ్నలను – సంధించారు. అయితే ఆంథోనీ వైరుధ్యాలను వాస్తవంగా విశదపరచకుండా సంపూర్ణంగా తనదైన శైలిలోనే వ్యవహరించాడు. అతనికి ఎంతసేపూ నల్లజాతీయులపై శ్వేత ప్రపంచపు అణచివేత మాత్రమే అర్థవంతంగా కనిపించింది.   ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సమస్యే, కానీ ఇది ఒక పెద్ద సందర్భానికి మాత్రమే సరిపోతుంది. హాస్యాస్పదంగా శ్వేత జాతీయులు, నల్లజాతీయుల జీవన స్థితిగతుల్ని దుర్భరంగా క్లిష్టతరం చేసే ఇతర ప్రధానమైన కారణాలను పరిస్థితులను ఎత్తి చూపడం ద్వారా పార్టీ వాస్తవస్థితిని జపనీస్ విద్యార్థులే స్పష్టంగా పేర్కొన్నారు.  పార్టీ ప్రతినిధిగా ఒంటరిగా జపాన్ వెళ్ళిన ఆంథోనీ వాస్తవ స్థితిని విద్యార్థులకు వివరించకుండా అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టే ప్రయత్నమేదీ చేయకుండా సందర్శన లక్ష్యాన్ని మోసపూరితంగా సర్వనాశనం చేశాడు. జపాన్ విద్యార్థులు పార్టీ గురించి అపార్ధం చేసుకోవడంలోనూ, దాని పట్ల  భ్రమపడ్డారనడంలోనూ ఆశ్చర్యం లేదు[…]

“ఏమైనప్పటికీ, టేపులను విన్నప్పుడు, మేము ఆంథోనీని చాలా అసహ్యించుకున్నాము. సెంట్రల్ కమిటీ ఆంథోనీని నిందించి, గట్టిగా చివాట్లేసింది. సున్నితమైన సమస్యలతో వ్యవహరించవలసిన అన్ని విధుల నుండి అతన్ని తప్పించింది. అతను లాస్ ఏంజిల్స్‌ కు తిరిగి వెళ్లి కొంతకాలం పాటు పార్టీలో పనిచేశాడు, కానీ చివరికి తప్పుకున్నాడు. పార్టీ గురించి ఒక నిస్సారమైన, అవకాశవాద పుస్తకాన్ని కూడా రాశాడు.”

ఆ సమయంలో హ్యూయ్‌కి తెలియని విషయం ఏమిటంటే, జాన్ హగ్గిన్స్, బంచీ కార్టర్ ల  మరణం తర్వాత ఎర్ల్ ఆంథోనీ పార్టీ నుండి వైదొలిగాడు. ఎందుకంటే అతను పచ్చి మోసగాడిగా  విమర్శలకు,  అనుమానాలకు గురయ్యాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, తాను ఎఫ్ బి ఐ  ఇన్ఫార్మర్ నని ఎర్ల్ ఆంథోనీ బహిరంగంగా అంగీకరించాడు. ఆ రోజు వరకూ కూడా, ఎలైన్ బ్రౌన్ తాను ఒక ఇన్‌ఫార్మర్ నని గానీ, లాభదాయకమైన ప్రభుత్వ-నిధులతో పని చేస్తున్నానని గానీ చెప్పడానికి నిరాకరిస్తూనే ఉంది.

యుఎస్ ఆర్గనైజేషన్‌తో జరిగిన ఘర్షణల్లో ఇలాంటి ఇన్‌ఫార్మర్లు చేసిన ద్రోహం, విధ్వంసాల తర్వాత కూడా, గెరోనిమో వంటి సభ్యుల అంకితభావం, సూత్రబద్ధమైన కృషి కారణంగా లాస్ ఏంజిల్స్‌ లోని బ్రాంచ్ కొంత కాలం పాటు సంఖ్యలోనూ, సంస్థాగత సామర్థ్యంలోనూ వృద్ధి చెందుతూనే ఉంది. అయితే, ఇన్ఫార్మర్లు  చేసిన ఈ తప్పులు పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించాయి. జపాన్‌కు ఆంథోనీ వినాశనకరమైన పర్యటన తర్వాత అతను బహుశా పార్టీ నుండి బహిష్కరించబడి ఉండవచ్చు. అతను మోసగాడు అని పార్టీకి తెలియక పోయినా, అతను కనీసం పాంథర్స్ ప్రోగ్రామ్‌ను అర్థం చేసుకోలేదని లేదా అంగీకరించలేదని జపాన్‌ పర్యటనలో  ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి స్పష్టమైంది.

అదేవిధంగా, ఎలైన్ బ్రౌన్ అటువంటి విధ్వంసక పాత్రను పోషించకుండా నిరోధించడానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండవలసింది. గెరోనిమో  ప్రయత్నించాడు కానీ లాస్ ఏంజిల్స్  లో స్థానిక నాయకుడిగా, అతనికి ఎలైన్ బ్రౌన్ ఇతర ప్రదేశాలలో పెంచుతున్న విధ్వంసం నుండి ఆమెను నిరోధించే శక్తి, సామర్ధ్యాలు అతని పరిధిలోనివి కావు గనుక ఏమీ చేయలేక పోయాడు. అదీ గాక  జాన్ హగ్గిన్స్,  బంచీ కార్టర్ హత్యలు జరిగిన కొద్దిసేపటికే గెరోనిమో, అన్యాయంగా ఆరోపించబడిన  నేరారోపణలతో నిర్బంధించబడ్డాడు. ఎలైన్ బ్రౌన్ చివరికి హ్యూయ్‌తో డేటింగ్ చేస్తూ బ్లాక్ పాంథర్ పార్టీ  సభ్యులందరినీ వారి స్థానిక శాఖలను రద్దు చేసుకుని ఓక్‌ల్యాండ్‌కు రావాలని ఆదేశమివ్వమని  అతనికి చాలా అనునయంగా చెప్పి ఒప్పించింది.

వీటన్నిటికీ తోడుగా లుంపెన్, సెమీ-లుంపెన్ వ్యక్తులు, మాజీ మెరైన్, పోలీసు అధికారి కూడా అయిన జూలియో బట్లర్‌ తో సహా అనేకమంది మోసగాళ్ళు లాస్ ఏంజిల్స్  శాఖ లోకి చొరబడి రావడం వల్ల,  యు ఎస్ ఆర్గనైజేషన్‌ తో బ్లాక్ పాంథర్ పార్టీ కున్న వివాదాన్ని తగ్గించగలిగిన వారి సామర్థ్యాన్ని దెబ్బతీసింది.  అందులోనూ గెరోనిమో మీద నేరారోపణల అభియోగాన్ని రూపొందించడంలో కీలకమైన రాష్ట స్థాయి ప్రధానమైన సాక్షి జూలియో బట్లరే! లాస్ ఏంజిల్స్  అధ్యాయంలోని కమాండ్‌ లో మరొక మూడవ మోసగాడు మెల్విన్ “కాటన్” స్మిత్ (Melvin “Cotton” Smith). అతను పాంథర్స్‌ తో తన యోగ్యతలను నిరూపించుకుని అధికారాలను సంపాదించు కోవడానికి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఆయుధాలను వాడడానికి ఒక మార్గాన్ని సాధించాడు. మొదటినుండి మెల్విన్ “కాటన్” స్మిత్ ఒక ఇన్ఫార్మర్. లాస్ ఏంజిల్స్ బ్లాక్ పాంథర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ప్రధానమైన ప్రణాళికలను, పోలీసులకు వారి దాడులలో సహాయం చేయడానికి ఎఫ్ బి ఐ కి, లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ కి అవసరమైన సమాచారాన్ని అందించాడు. అతను దాడులకు ముందు భవనంలో అక్రమ తుపాకీలను కూడా అమర్చాడు. ఇది అక్రమ ఆయుధాల ఉనికిని స్పష్టంగా అందుబాటులో ఉన్నట్లు తెలిపే “చిట్కా”. 

https://revolutionaryunitedfront.com/images/red_star_issue_three/bunchycarter.jpg

దీని ఆధారంగా ప్రధాన కార్యాలయంపై దాడి చేయడానికి లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్ మెంట్ తన  సమర్థనను ఇచ్చింది. ఈ విధమైన అనేకమంది ఇన్‌ఫార్మర్‌ల విధ్వంసక పాత్రను దృష్టిలో ఉంచుకుని, పాంథర్స్ ఏ తప్పులు చేసారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. జాగ్రత్తగా గమనించుకుంటూ ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా నివారించవచ్చు, అందుకు సంబంధించిన అడ్డంకులను కూడా తొలగించు కోవచ్చు. ఈ తప్పులపై స్పష్టమైన అవగాహన గనక పెంపొందించుకుంటే ప్రజలలో పాంథర్స్ ఓటమి అనివార్యమనే భ్రమల్నీ, వారి మనసు లోలోపలి భయాలను కూడా పూర్తిగా తొలగిస్తుంది. దానికి సంబంధించిన నిరాశావాదంతో చేసే ఎలాంటి ప్రతిఘటననైనా రాజ్యం స్వయంగా నాశనం చేస్తుంది. ప్రజలకు విజయం అసాధ్యం అని తప్పుగా నిర్ధారిస్తుంది. 

పాంథర్‌లు నిరుద్యోగులు, స్థిరమైన ఉపాధి లేని  కార్మికులను లుంపెన్-శ్రామికవర్గంలో భాగంగా భావించారు, వారు నల్లజాతి శ్రామిక వర్గ సభ్యులలో బలమైన సామాజిక స్థావరాన్ని కూడా అభివృద్ధి చేశారు. అసంఘటిత, రాజకీయేతర కింది స్థాయి వర్గాలకు వారి దృష్టంతా ఏపూట కాపూట ఆకలి తీర్చుకోవడం మీదే ఉంటుంది కాబట్టి వారి కంతగా విప్లవ పురోగతిమీద ఆసక్తి ఉండదు. ఈ పరిణామాలన్నీ అర్ధమయ్యాక కొంత కాలానికి ఇది సంస్థలోని లుంపెన్ ఆలోచనలను ఎదగనీయకుండా  ప్రతిఘటించింది. అయితే, ఈ గందరగోళమంతా  పార్టీ తమ లోపాలను, ఇతర సంబంధిత తప్పిదాలను స్వీయ-విమర్శనాత్మకంగా అంచనా వేయకుండా నిరోధించాయి, చివరికి తప్పులమీద తప్పులు జరిగిపోయాయి.

1973 నాటికి ఈ ఆలోచనలు పార్టీలో ఇరువైపులా చీలికకు ఎక్కువగా ఆధిపత్యం చెలాయించాయి. హ్యూయ్ తన ఆత్మకథ, ‘రివల్యూషనరీ సూసైడ్’ లో మిఖాయిల్ బకునిన్  ను ఉదహరిస్తూ, “దొంగ [బందిపోటు].. నిజమైన, అసలైన విప్లవకారుడు” అని రాశాడు. బకునిన్, “మొదటి ఇంటర్నేషనల్ లోని సమరశీలమైన మిలిటెంట్ విభాగం కోసం మాట్లాడాడు” అని  వాదించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, పార్టీ పాలక వర్గాన్ని పడగొట్టడానికి, ఈ దేశంలోని శ్రామిక ప్రజల పక్షాన నిలిచి విప్లవాత్మకంగా వారికి అవగాహన కలిగిస్తూ పోరాడడం కంటే, ధనవంతులను దోచుకోవడమే అత్యంత, ఏకైక విప్లవాత్మకమైన పని అని వాదించాడు. పెట్టుబడిదారులు దోచుకున్నప్పుడు ఏ విప్లవకారుడు కన్నీళ్లు పెట్టడు, దొంగతనానికి (దోపిడీలో కొంత భాగాన్ని పేదలకు పంచినప్పటికీ) – విప్లవ పోరాటానికి చాలా తేడా ఉంది. మొదటిది వ్యక్తిగత పెట్టుబడిదారీ సంపదలో కొంత భాగాన్ని దొంగిలించగా, రెండోది మొత్తం పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోయడం లక్ష్యంగా పెట్టుకుంది. దొంగతనాన్ని కొందరు వ్యక్తుల చిన్న సమూహాలు చేయవచ్చు, కానీ విప్లవ పోరాటంలో జనాభాలో భారీ భాగాన్ని ఏకం చేయడం అవసరమవుతుంది. పార్టీ విప్లవ పోరాటానికి దూరమై ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలోనే హ్యూయ్ ఈ రాబిన్-హుడ్ రాజకీయాల ఆలోచనను ప్రోత్సహించడం యాదృచ్చికం కాదు.

బ్లాక్ పాంథర్ పార్టీలో దినదినాభివృద్ధి చెందిన ఇటువంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ, నల్లజాతి విముక్తి పోరాటంలో పాంథర్స్ అనేక సంవత్సరాలు విప్లవాత్మక శక్తిగా కొనసాగారు. పార్టీ ఎదుగుదలలో వరసగా జరిగిన లోపాలు, ఎదురుదెబ్బలున్నప్పటికీ, ఘన విజయాలు ముందడుగులు కూడా చాలానే ఉన్నాయి. తప్పులు చేయడం, సమీక్షించుకోవడం ఎదురొడ్డి పోరాడడం విప్లవ పోరాటాలలో అనివార్యమైన భాగం. విప్లవ సంస్థలు తమ తప్పులను స్వీయ విమర్శనాత్మకంగా అంచనా వేసుకుని, చేసిన తప్పులను సరిదిద్దు కోగలిగితే, ఎంత గొప్ప  భారీ ఎదురుదెబ్బలనైనా అధిగమించవచ్చు. కొంతకాలం పాటు పాంథర్స్ దీన్ని చాలా సమర్ధవంతంగా చేయగలిగారు, కానీ చివరికి తీవ్రమైన పొరపాట్లు జరగడం వల్ల వారు విడిపోయారు, చివరికి పార్టీ కుప్ప కూలింది.   

తదుపరి కథనం చికాగోలోని బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర గురించి చెబుతుంది. ఇక్కడ ఫ్రెడ్ హాంప్టన్, ఇతరులతో కలిసి విప్లవాత్మక పోరాటంలో నల్లజాతీయులను, లాటినోలను, శ్వేతజాతీయులను ఏకం చేయడంలో పెద్ద పురోగతిని సాధించగలిగారు.

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply