రచన: జాన్ బ్రౌన్ (2018 లో ‘రెడ్ స్టార్’ పత్రికలో ప్రచురితం)
అనువాదం: శివలక్ష్మి
బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన నాలుగు భాగాల రచనలో ఇది రెండవది. 1966లో దివంగత మాల్కం X (Malcolm X) రాజకీయాల స్ఫూర్తితోనూ, చైనాలో జరిగిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవంతోనూ తీవ్రంగా ప్రభావితమై స్థాపించబడిన బ్లాక్ పాంథర్ పార్టీ ఒక నల్లజాతి విప్లవ మార్క్సిస్ట్-లెనినిస్ట్ సంస్థ. కొంతకాలం వారు అమెరికాలో నల్లజాతీయుల విముక్తి పోరాటంలో ప్రముఖంగా నాయకత్వ పాత్ర పోషించారు. విప్లవ రాజకీయాలను చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించారు. కానీ ఇది చాలావరకు శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ సమాజంలో ఐక్య సంఘటనకు పురికొల్పిన పౌరహక్కుల ఉద్యమానికి భిన్నమైనది. ఈ సీరీస్ లోని మొదటి భాగంలో నల్లజాతీయులను ఆధిపత్య శ్వేత జాతీయులు అణగదొక్కడం, హింసించడం వల్ల బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపనకు దారితీసిన పరిస్థితులను, మాల్కం స్ఫూర్తితో నాయకత్వ బాధ్యతలు తీసుకున్న వారి విధానాలను వివరిస్తే, ఈ సంచికలో బే ఏరియాలో వారి పెరుగుదల, అభివృద్ధి గురించిన విశ్లేషణలుంటాయి. వారు అమెరికా లోని అనేక ప్రధాన నగరాల్లో శాఖోప శాఖలుగా విస్తరించి దేశవ్యాప్త పార్టీగా మారుతున్న విధానాన్ని తెలుపుతుంది.
బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపన తర్వాత, మెజారిటీ నల్లజాతీయుల నమ్మకం, విశ్వాసం, మద్దతు లేకుండా, వారాలోచిస్తున్న విధానాల వల్ల గానీ టెన్-పాయింట్ ప్రోగ్రామ్ వల్ల గానీ ఏమీ ఫలిత ముండదని హ్యూ – బాబీ లు గ్రహించారు. కాబట్టి వారు వెలివాడ సమూహాలలో సంఘాలను నిర్మించడానికి కృషి చేయాలనుకున్నారు. ఆ కాలంలో మొదట కొద్దిమంది వ్యక్తులతోనే ప్రారంభించినప్పటికీ, సంస్థలలో సభ్యులుగా చేరి, సమరశీలంగా విముక్తి పోరాటాలలో పాల్గొనడానికి అనువుగా సామాజిక పరిస్థితులు పరిపక్వదశకు చేరుకున్నాయని వారికి తెలుసు. ఇప్పటి వలెనే ఆ రోజుల్లో నల్లజాతీయులు పోలీసుల చేత నిత్యం నరకాన్ని, నిరంతర వేధింపులను ఎదుర్కొంటుండేవారు. ఒక ప్రణాళిక ప్రకారం జాత్యహంకారాన్నీ, వివక్షనూ అమలు జరుపుతుండడం వల్ల నిరుద్యోగులుగా కడు పేదరికంలో మగ్గుతుండేవారు. అంతే గాక పౌర హక్కుల ఉద్యమం, నల్లజాతి వెలివాడలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటనలు ప్రజలు స్వేచ్ఛ కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారని తేటతెల్లం చేశాయి.
ప్రజలకు తమ సేవల పట్ల విశ్వాసం కలగాలన్నా, నిబద్ధతతో ప్రజల విశ్వాసాన్ని సాధించాలంటే తాము ప్రజలలోకి వెళ్ళి పని చెయ్యాలని పాంథర్లు భావించారు. బ్లాక్ పాంథర్ పార్టీని స్థాపించడానికి ముందు హూయ్ – బాబీలిద్దరూ అనేక “రాడికల్” సంస్థలలో సభ్యులుగా ఉన్నారు. నిజానికి ఈ సంస్థలు ఉన్నత, మధ్య తరగతి నల్లజాతీయులను మాత్రమే ఆకట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని వారు చూశారు, అయితే ప్రాధమికంగా ఈ దేశంలో ఉన్న నల్లజాతి జనాభాలో అత్యధికులుగా ఉన్న శ్రామిక వర్గం, నిరుపేద నల్లజాతీయుల మధ్య పని చెయ్యడానికి వారు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. మధ్యతరగతి, ఉన్నత-తరగతి నల్లజాతీయులలో ఎక్కువ మంది ప్రధానంగా తెల్లజాతి ఆధిపత్య సమాజంలో కలిసి పోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టారు, నల్లజాతీయుల జనాభాలో కొద్ది శాతం మందిని మాత్రం సుసంపన్నం చేసే “బ్లాక్ బిజినెస్” కుట్ర రాజకీయాలను కొనసాగించారు, కానీ అధికశాతం మందిని తీవ్ర పేదరికం నిరాశ, నిస్పృహలకు గురిచేసే దురభిప్రాయాలతోనే ఉంటారు.
కాబట్టి, బ్లాక్ పాంథర్ పార్టీ కమ్యూనిటీలోని సమస్యల గురించి మాట్లాడుతూ వాస్తవంగా ఆచరణాత్మకంగా ఆచరించకుండా ఉన్న సమూహాల పరిమితులను గమనిస్తూ మెజారిటీ నల్లజాతీయులను, ముఖ్యంగా పేదలు అణగారిన వర్గాల వారితో సన్నిహితంగా మెలిగింది.
వారి చర్చలను గానీ, సైద్ధాంతికంగా చేస్తున్న పని ప్రాముఖ్యతను గానీ తగ్గించాలనే ఉద్దేశ్యం లేదు. తీవ్రమైన అధ్యయనాలు, చర్చోప చర్చల తర్వాత కొన్ని నెలల సమయం తీసుకుని హ్యూయ్- బాబీలు బ్లాక్ పాంథర్ పార్టీ టెన్-పాయింట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఏది ఏమైనప్పటికీ, వారి నిరు పేద, అంచులకు నెట్టబడుతున్న సోదర – సోదరీమణులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్నితయారు చేశారు. వారు “నల్లజాతీయులలో ఉన్న స్త్రీ-పురుషులను” ఆకట్టుకోవడానికి వారు మాట్లాడే భాషను, వారి ఆలోచనా రీతులను ఉపయోగించారు. అమెరికాలో అధోగతికి నెట్టబడుతున్న వారి స్థితిగతులను స్పష్టం చేస్తూ నల్లజాతీయుల విముక్తి పోరాటం ముందుకు వెళ్లడానికి టెన్-పాయింట్ ప్రోగ్రామ్ బాగా సహాయపడుతుందని వారు భావించారు.
వారు ప్రోగ్రామ్ రచన ముసాయిదాను పూర్తి చేసి, దాన్ని ప్రింట్ అవుట్ తీసుకున్న వెంటనే, హ్యూయ్ – బాబీలు ఓక్లాండ్ కమ్యూనిటీలోని ప్రజలతో దాని గురించి మాట్లాడటానికి వెళ్లారు. వారు వీధుల్లో, బార్లలో, ఓక్లాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నల్లజాతీయుల వద్దకు వెళ్ళి టెన్ – పాయింట్ ప్రోగ్రామ్ గురించి, బ్లాక్ పాంథర్ పార్టీ గురించి వివరించారు. వారికి విషయాలను స్పష్టం చేయడానికి చాలా సమయమే పట్టేది, హ్యూయ్ కొన్నిసార్లు ఆ ప్రజలతో మాట్లాడుతూ రోజుకు పద్దెనిమిది గంటలు గడిపేవాడు. అయితే, చివరికి ఈ సుదీర్ఘ సంభాషణల వల్ల ఫలితం లేకుండా పోలేదు. హ్యూయ్ – బాబీలు చాలామంది నల్లజాతీ యులకి పార్టీ గురించి స్పష్టంగా చెప్పగలిగారు. ఫలితంగా అనేకమంది వ్యక్తులు బ్లాక్ పాంథర్ పార్టీలో చేరడం ప్రారంభించారు. మొదటగా బాబీ పనిచేసిన నార్త్ ఓక్లాండ్ యాంటీ-పావర్టీ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో సభ్యుడిగా పని చేస్తున్న అతి చిన్న వయసు వాడైన పదిహేనేళ్ల బాబీ హట్టన్ అనే అతను చేరాడు.
ఇక అక్కడి నుంచి పార్టీ పుంజుకోవడం మొదలైంది. అది మొదటి కొన్ని నెలలు కొంచెం నెమ్మదిగా సాగింది, అయితే పాంథర్లు తమ కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడం మీద, అణచివేయబడుతున్న నిరుపేద నల్లజాతి ప్రజలతో కలిసి పనిచేయడం గురించి నిజాయితీగా ఆలోచిస్తూ, ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థం చేసుకోవడంతో ఎక్కువ మంది ప్రజలు చేరారు. సాయుధ ఆత్మరక్షణను ప్రత్యేకంగా అభ్యసించాలని, అదే అతి ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన బ్లాక్ పాంథర్ పార్టీ ప్రధాన లక్ష్యమని బలంగా ప్రత్యేకంగా బోధించారు.
మాల్కం X, అతని మరణానికి ముందు, తెల్లజాతి ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ లోని పోలీసులు, కె కె కె (KKK-Ku Klux Klan) ఇది ఒక అమెరికన్ శ్వేతజాతి ఆధిపత్య తీవ్రవాద ద్వేషపూరిత సమూహం. మన ఆర్ ఎస్ ఎస్ లాగా దీనికి అన్ని రంగుల జాతుల్ని మనతో సహా ద్వేషిస్తూ వాళ్ళను ఈ భూమ్మీద నుంచి రద్దుచేయాలని చూస్తుంది. ఇక్కడ సందర్భాన్ని బట్టి నల్లజాతి వారనుకుందాం) వంటి వివిధ జాత్యహంకార సమూహాల నుండి నల్లజాతీయులు ఎదుర్కొంటున్న నిరంతర హింస, దౌర్జన్య కాండలకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవలసిన అవసరాన్ని పదేపదే నొక్కిచెప్పాడు. ఈ విషయంపై మాట్లాడుతూ, మాల్కం “ఆత్మరక్షణ కోసం, ఎవరైనా తమను తాము రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని హింస అని అనను, నేను దానిని ఇంటెలిజెన్స్ అని పిలుస్తాను” – అని అన్నాడు. పాంథర్స్ ఈ మాటలను హృదయపూర్వకంగా తీసుకుని, ఆ యా మార్గాల్లో తమ ఆచరణను నిర్దేశించుకుని ప్రజలను ఆర్గనైజ్ చేశారు. చట్టబద్ధంగా ఉన్న హక్కును వినియోగించుకుని వారు సాయుధులై పోలీసు అధికారులను గమనించి చూడటానికి, నల్లజాతీయులను క్రూరంగా హింసించి, చంపకుండా చూసేందుకు సంఘంలో పెట్రోలింగ్ నిర్వహించారు. పాంథర్స్ పోలీసులపై గానీ, తెల్ల ఆధిపత్యవాదులపై గానీ ఎటువంటి దాడులకూ పూనుకోలేదు. దానికి బదులుగా వారు పూర్తిగా తమ ఆత్మరక్షణ విధానాన్ని అనుసరించారు. ఈ విధంగా,వారు చట్టాలను పాటిస్తామని ప్రమాణం చేసి, నిరంతరం వాటిని ఉల్లంఘిస్తూ, నల్లజాతీయులను క్రూరంగా అణగదొక్కుతున్న పోలీసుల జాత్యహంకార నేరపూరిత స్వభావాన్ని బహిర్గతం చేయడంలో వారు సఫలమయ్యారు.
ఈ విధానం జాత్యహంకార అణచివేతదారులకు వ్యతిరేకంగా నిలబడటానికి, ఎదురొడ్డి పోరాడి, విజయాలు సాధించడానికి ఒక పునాది ఉందని ప్రజలకు స్పష్టం చేయడానికి ఉపయోగపడింది. అంతులేని క్రూరమైన వేధింపులు, పోలీసులు పెట్టే విపరీతమైన క్షోభలకు వ్యతిరేకంగా బ్లాక్ పాంథర్ పార్టీ ప్రారంభంలో చేసిన పెట్రోలింగ్ పని ఓక్లాండ్ లోని నల్లజాతీయులను విద్యుచ్ఛక్తిలా ఉత్తేజపరిచి, అది అనేకమంది పార్టీలో చేరడానికి దారి తీసింది. ఉదాహరణకు, తన పుస్తకం “Seize the Time” (సీజ్ ది టైమ్) లో, బాబీ సీల్ ఓక్లాండ్లో జరిగిన ఒక సంఘటనను వివరించాడు, ఇది బ్లాక్ పాంథర్ పార్టీ వారి ప్రోగ్రామ్‌ను అమలులోకి తీసుకురావడం కోసం సాయుధులై ఆత్మరక్షణను అభ్యాసం చేయడం గురించి చాలా మంది ప్రజలకు స్పష్టం చేసింది.
హ్యూయ్, బాబీ, మరికొందరు పాంథర్లు తమ బ్లాక్ పాంథర్ పార్టీ కార్యాలయం తెరిచిన తర్వాత ఒక నెలలోనే పార్టీ ఆఫీస్ వెలుపల పోలీసుల దాడిని ఎదుర్కొన్నారు. వారు కారులో ఉండగా, ఒక పోలీసువాడు పైకి లాగి తుపాకీలతో పాంథర్లను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. జరిగిన సంఘటనను బాబీ ఆ తర్వాత ఇలా వివరించాడు:
హ్యూయ్ అప్పుడే కారు డోర్ తెరిచాడు, హ్యూకి బాగా కోపం వచ్చింది. మమ్మల్ని నేరస్తుల్ని చూస్తున్నట్లు పోలీసులు చుట్టుముట్టడం వల్ల హ్యూయ్ కి విపరీతమైన కోపంతో పిచ్చి పట్టినట్లైంది. అతను తలుపు తెరిచి, “మీ గురించి మీరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? పోలీసులలోని ఒక వ్యక్తిని చూపిస్తూ అతనిక్కడికి వచ్చి టిక్కెట్ కోసమో లేక నేనేదో కాని పని చేస్తున్నట్లు నన్నుఉదహరిస్తూ నా లైసెన్స్ కోసం నన్నడిగాడు. ఈ పోలీసు అధికారి తన విధిని సక్రమంగా నిర్వర్తించవలసి ఉంది. కానీ ఇక్కడ మీరు మా తుపాకుల గురించి మాట్లాడుతున్నారు. హ్యూయ్ తన M-1 రైఫిల్ చుట్టూ చేయి వేసి, “ఏది ఏమైనప్పటికీ, తుపాకీలను కలిగి ఉండడానికి మాకు రాజ్యాంగపరమైన హక్కు ఉంది కాబట్టి నేను మీ మాటలను ఏవీ వినదల్చుకోలేదు.” – అని అన్నాడు.
ఆ మాటలకు పోలీసులు రెండు అడుగులు వెనక్కు తీసుకున్నారు. హ్యూయ్ కారు నుండి బయటకు వచ్చి, తన చేతిని తిరిగి కారులోకి పెట్టి, అతని M-1 తుపాకీని తీసుకున్నాడు “మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా హ్యూయ్ని చూసి ఉంటే, అతను నిక్కచ్చిగా ఉంటాడు, ఇంకా చెప్పాలంటే స్పష్టంగా మాట్లాడతాడు. కారులో నుంచి అతని M-1 తుపాకీతో బయటికి వచ్చి, హ్యూయ్‌కి ఈ దేశపు చట్టాల గురించి బాగా తెలుసు. కాబట్టి అతనికి కారులో ఉన్నప్పుడు M-1 తుపాకీలో బుల్లెట్స్ లోడ్ చేసి ఉండవు. అతను కారులోంచి బయటకు వచ్చిన వెంటనే ఛాంబర్లోకి ఒక రౌండ్ పేల్చాడు.
హ్యూయ్ పోలీసులతో “మీరు వీళ్ళందరిని ఎవరనుకుంటున్నారు” అని అడిగాడు. ఇతర పోలీసులు కాలిబాట పక్కన గుమికూడిన నల్లజాతి స్త్రీ-పురుషుల్ని వేధించడం మొదలుపెట్టారు. “మీరు ఎక్కడివారక్కడే నిలబడండి!” అంటూ హ్యూయ్ వాళ్ళని హెచ్చరించాడు. “మీరందరూ వీధిలోనే ఉండండి. కదలవలసిన అవసరం లేదు! ఎక్కడికీ వెళ్ళవద్దు! మీరు వాళ్ళని గమనించకుండా ఈ పోలీసులు, మిమ్మల్ని నిరోధించలేరు. ఒక అధికారి తన కర్తవ్యాన్ని సవ్యంగా నిర్వర్తిస్తున్నాడా లేదా అని గమనించే హక్కు మీకు ఉంది.” హ్యూయ్ చట్టం గురించి వివరిస్తూ మీరు సహేతుకమైనంత దూరంలో ఉండి వారిని గమనించవచ్చు. మీరిప్పుడంతే దూరంలో ఉన్నారు గనుక మీరెక్కడికీ కదిలి వెళ్లనక్కరలేదని బలంగా నొక్కి చెప్పాడు.
మేము కారులో కూర్చున్నాం, హ్యూయ్ మా అందర్నీ కారులో నిశ్శబ్దంగా ఉండమన్నాడు. ప్రపంచంలోనే అంతగా మానవత్వం లేని మనుషులుండరేమో, హ్యూయ్ చుట్టూ పదిమంది పోలీసులు గుమి కూడారు. వారిలో నలుగురు పోలీసులు పిల్లల్ని సైకిళ్లపైనుండి పడవేసే ప్రయత్నాలు చేస్తూ, ఆ ప్రాంతంలో నిలబడే హక్కు నల్లజాతి ప్రజలకు లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, హ్యూయ్ పోలీసులకి అడ్డు వెళ్లి, వారి మాటలకు అంతరాయం కలిగిస్తూ, “లేదు, మీరందరూ ఆఫీసు లోపలికి రమ్మని మమ్మల్ని” ఆహ్వానించాడు, చిన్న పిల్లలు వారి సైకిళ్ళతో ఆఫీసు లోపలికి వచ్చారు. మాముందు పెద్ద, వెడల్పాటి, స్పష్టంగా కనిపించే కిటికీ ఉంది. నల్లజాతీయులందరూ వెంటనే కిటికీ ముందు భాగంలోకి వచ్చారు. జరగబోయే దానిని చూడడానికి కిటికీని ముద్దుపెట్టుకుంటున్నట్లుగా దానిపై వాలారు. ఒక్క పెట్టున విరుచుకుపడుతూ “వెళ్ళు, బ్రదర్, బయటికి తియ్యి, అది ఎక్కడ ఉందో మీకు తెలుసు, నేను దానిని తవ్వగలను” అని కేకలు పెట్టారు. హ్యూయ్ ఆ పోలీసులకు అది ఎక్కడ ఉందో తెలియజేస్తూనే ఉన్నాడు. అందమైన నల్లజాతి హ్యూయ్ చేతిలో ఉన్న పెద్ద తుపాకీకి ఆ పోలీసులు భయపడుతున్నారని మేము గమనించాం! “నువ్వు నన్ను షూట్ చేస్తే, ఓ పందీ, నేను తిరిగి నిన్ను షూట్ చేస్తా” అని హ్యూయ్ చెప్పిన ప్రతిసారీ, అది చూస్తున్నమేమందరం , “బ్రదర్, అలా చెప్పండి, చేసి చూపించండి, – అంటూ కేకలు వేశాం. ఆ అరుపులు నల్లజాతి సంస్కృతిని విప్లవాత్మకంగా మారుస్తున్నారని హ్యూయ్‌కి తెలియజేసింది; నల్లజాతి ప్రజలను విప్లవకారులుగా తీర్చిదిద్దుతున్నామని: వారు సాయుధులై పోరాడాలని నేర్చుకుంటున్నారని హ్యూయ్‌కి తెలియజేసింది. ఆ చుట్టుపక్కల రెండిళ్ళవతల ఉన్న ఒక శ్వేత జాతీయుడు చిరునవ్వులు చిందించాడు, అక్కడ అతను మాత్రమే ఉన్నాడు కానీ అతనికి హ్యూయ్ పట్ల గౌరవ భావం ఉన్నట్లనిపించింది.
హ్యూయ్ ఆఫీస్‌లోకి వెళ్ళి ఈ ప్రదర్శన చేసిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చారు. చుట్టూ నిలబడ్డారు. పోలీసులు కూడా కదలడం లేదు. హ్యూయ్ వారిని ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉన్నాడు. హ్యూయ్ దగ్గర M-1 పెద్ద తుపాకీ ఎనిమిది రౌండ్ల బుల్లెట్ లతో సిద్ధంగా ఉంది. మీరు ఏమి చేయగలరు? మీరు చేసేదంతా బలహీనమైన నల్లజాతి మనుషుల్ని చేతులు వెనక్కి కట్టేయడం తప్ప ఇంకేమీ చేయరు. చేయలేరు. ఏదైనా జరిగిందంటే, ఇక నాలాంటి చెడ్డ వాడిని మీరు ఇప్పటివరకు చూసి ఉండరు. ఎందుకంటే, “నువ్వు చేసే పనిని నేను పట్టించుకోను” అని పోలీసులకి చెప్తూ మమ్మల్ని క్రమశిక్షణతో ఉంచాడు. ఇక మేము కారులో కూర్చున్నాం.
అది బ్లాక్ పాంథర్ పార్టీ కార్యాలయం ముందు పోలీసులకు బ్లాక్ పాంథర్ పార్టీతో జరిగిన అతి పెద్ద సంఘటన. ఆ తరువాత, మేము నిజంగా పోలీసులను గస్తీ చేయడం ప్రారంభించాము, ఎందుకంటే మాకు న్యాయమైన నియామకాలు లభించాయి. ఆ రోజు పార్టీలో పది నుంచి పదమూడు మంది దాకా అదనపు సభ్యులు వచ్చి దరఖాస్తులు పెట్టుకున్నారు. మేము మళ్లీ పావర్టీ కార్యాలయానికి వెళ్ళాం – నేను ఇంకా అక్కడే పని చేస్తున్నానని బాబీ చెప్పాడు. బ్లాక్ పాంథర్ పార్టీ లోకి సభ్యత్వ నమోదు కోసం అధికారిక దరఖాస్తు ఫారమ్‌ను రూపొందించాం. అప్పటి నుండి, మేము ఏం చేశామనుకున్నారు ? కేవలం పోలీసుల పెట్రోలింగ్ చేశాం.
ఈ సంఘటన పాంథర్ల గురించే గాక వారి ఆచరణను కూడా స్పష్టం చేసింది. ఇది తమను తాము విప్లవకారులుగా చెప్పుకుంటూ నల్లజాతీయుల కోసం పని చేస్తున్నామని చెప్పుకునే అనేక ఇతర సమూహాలకు పాంథర్ల ఆచరణ భిన్నంగా ఉంది, కానీ వాస్తవానికి ఆ సమూహాలు తమలో తాము మాట్లాడుకోవడం తప్ప చేసిందేమీ లేదు. నల్లజాతి సమాజాన్ని ప్రతిరోజూ పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్న సందర్భంలో ఈ పద్ధతిలో వారికి అండగా నిలబడడం కూడా వారిని ప్రేరేపించింది. ఈ దేశంలోని పేద నల్లజాతీయులలో అత్యధికులు ఈ జాత్యహంకార పెట్టుబడిదారీ ప్రభుత్వాన్ని విప్లవాత్మకంగా త్రోసిపుచ్చడం కోసం ఐక్యంగా పోరాడడమనే తమ లక్ష్యం పట్ల నిజమైన నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్నారు. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు క్రూరంగా దెబ్బలు తింటూ, దారుణమైన హింసల బారిన పడుతున్నారు. వారు నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు. ఈ దేశంలోని శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ నల్లజాతీయులను ఒక క్రమపద్ధతిలో ఎలా రద్దు చెయ్యా లని చూస్తుందో, వారిని ఎలా పీల్చి పిప్పి చెయ్యాలని చూస్తుందో అనే విషయాలను వారు తమ అనుభవాలను పదే పదే చవి చూడడం ద్వారా చాలా బాగా అవగాహన చేసుకున్నారు.
హ్యూయ్ ఈ విధంగా పోలీసులను ఎదిరించి, చట్టంలో ఏముందో విప్పిచెప్పి, చట్టప్రకారం సంక్రమించిన హక్కులను వాడుకుంటామని వాళ్ళను వెనక్కి మళ్ళించ గలిగిన సంగతి నల్లజాతి ప్రజలలో గొప్ప ఆశలను నింపింది. హ్యూయ్ పోలీసులను బెదిరించిన సంఘటన గురించి బాబీ కథనంలో నల్లజాతి ప్రజలు అతన్ని చాలా ఉత్సాహ పరిచారనీ, హ్యూయ్ తన సాయుధ ఆత్మరక్షణ హక్కుపై గట్టిగా పట్టుబట్టడం కంటే కూడా అక్కడ పెద్ద సంఖ్యలో పోగైన కమ్యూనిటీ సభ్యుల ఉనికి చాలా కీలకమైనదనీ, పోలీసులు అందుకే వెనకంజ వేశారనీ చెప్పాడు. వారికి వ్యతిరేకంగా చాలా మంది నల్లజాతి ప్రజలు ఏకమయ్యారు. వారిలో పది మంది తుపాకీతో ఉన్న ఒకే ఒక్క వ్యక్తి (హ్యూయ్) ని పడగొట్టగలిగినప్పటికీ, వాళ్ళు ప్రజల ఐక్య ప్రతిఘటనా శక్తికి వ్యతిరేకంగా నిలబడలేరని వాళ్ళకి బాగా తెలుసు.
ఘర్షణ మధ్యలో ప్రజలను పాంథర్స్ కార్యాలయంలోకి ఆహ్వానించినప్పుడు, అతను అక్కడి కక్కడే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నానని హ్యూయ్ కి బాగా తెలుసు. పోలీసులకు వ్యతిరేకంగా తన సొంత వైఖరి ద్వారా మాత్రమే కాకుండా, పోలీసుల నుండి అన్యాయమైన చట్టవిరుద్ధమైన ఆదేశాలను వారు పాటించాల్సిన అవసరం లేదని వారిని ఒప్పించడానికి కూడా శ్రద్ధ తీసుకున్నాడు. అతను వారిని కూడా పోరాటంలో పాలుపంచుకునేలా, ఎదిరించి నిలిచేలా చేశాడు. బాబీ పేర్కొన్నట్లుగా, ఇది ఒక శక్తివంతమైన ఉదాహరణ. ఈ సంఘటన బ్లాక్ పాంథర్ పార్టీలో చేరాలనీ, నల్లజాతీయుల విముక్తి కోసం పోరాటంలో సమరశీలంగా పోరాడాలనీ చాలా మందిని నమ్మించింది, ఒప్పించగలిగింది.
పోలీసులపై పెట్రోలింగ్ కొనసాగుతున్న పనితో పాటు సమాజంలో జరుగుతున్న అనేక ఇతర ప్రయత్నాలు పాంథర్స్ గురించి ఆ ప్రాంతమంతా వ్యాపించేలా చేశాయి. పార్టీ పెరిగేకొద్దీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలతో వారి వద్దకు రావడం ప్రారంభించారు. నల్లజాతీయుల విముక్తి కోసం బ్లాక్ పాంథర్ పార్టీ తీవ్రంగా పోరాడుతుందని శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సంఘటితమవుతుందని వారు అర్థం చేసుకున్నారు.
ఉదాహరణకు, 1967లో డెంజిల్ డోవెల్ కుటుంబం బ్లాక్ పాంథర్ పార్టీని కలిసింది. వారు ఓక్ లాండ్కు ఉత్తరాన కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రం లోని రిచ్మండ్ అనే ప్రాంతంలో నివశిస్తున్నారు. డెంజిల్ ని పోలీసులు చంపేశారు కానీ పోలీసు డిపార్ట్ మెంట్ ఉరిశిక్ష వల్ల చనిపోయాడని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తుంది. అతని మరణానికి ముందు కొన్ని వారాలుగా పోలీసులు డెంజిల్‌ను, “నిన్ను పట్టుకుంటామ” ని చెప్తూ బెదిరించే వారు. అధికారిక కథనం ప్రకారం అతను ఒక దుకాణాన్ని దోచుకుంటూ పట్టుబడ్డాడు. కంచె ఎక్కి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నందు వల్ల పోలీసులు ఒక్కసారే పేలిస్తే అతను మరణించాడు. కానీ అసలు కథ పారిపోయినందుకు ఒక్కసారిగా చంపడానికి విరుద్ధంగా చాలా ఘోరంగా ఉంది.
తమ కుమారుడిని చంపడం గురించి పోలీసుల కథనంలోని వైరుధ్యాలను ప్రచారం చేయాలని, వాళ్ళ చేతుల్లో అతి సాధారణంగా అసంబద్ధమైన కారణాలు చెప్తూ నల్లజాతీయులను ఏ విధంగా అన్యాయంగా హత్యలకు గురి చేస్తున్నారో అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని డోవెల్ కుటుంబం బ్లాక్ పాంథర్ పార్టీని కోరింది. డెంజిల్‌ను ఒకసారి కాల్చి చంపినట్లు పోలీసు నివేదిక పేర్కొన్నప్పటికీ, డెంజిల్పై తొమ్మిది లేదా పదిసార్లు కాల్పులు జరిపినట్లు మరణ విచారణాధికారి కార్యాలయం చెబుతుందని వారు పార్టీకి వివరించారు. కుటుంబ సభ్యులు డెంజిల్‌ను చంపిన ప్రదేశానికి పాంథర్లను తీసుకెళ్లి, పోలీసులు డెంజిల్ని కాల్చి చంపిన గోడలోని బుల్లెట్ రంధ్రాలను వారికి చూపించారు, డెంజిల్‌ను తొమ్మిది, పది రౌండ్ల కంటే వారు ఎక్కువ సార్లు కాల్పులు జరిపారని చూపించారు.
డెంజిల్‌ను చంపడానికి పోలీసులు తమను తాము సమర్ధించుకుంటూ – అతను తప్పించుకోవడానికి కంచె దూకడానికి ప్రయత్నిస్తున్నాడనే వారి వాదన – కూడా ఒక కల్పిత పన్నాగమేనని కుటుంబం నిరూపించింది. బుల్లెట్ రంధ్రాలు, రక్తపు మరకలు కంచె నుండి ఇరవై అడుగుల దూరం పైనే ఉన్నాయి. కంచెకు దగ్గరగా రెండవ రక్తపు మరక ఉంది, పోలీసులు డెంజిల్‌ను ప్రాణం పోయేముందు అక్కడికి లాగారు, అతను కంచె దూకబోతున్నట్లుగా అనిపించడానికి అతన్ని హత్య చేసేముందు పోలీసులు చేసిన పనే అది.
పాంథర్స్ విచారణ మధ్యలో ఆ సమయంలోనే అక్కడికి రిచ్మండ్ నుండి నల్లజాతీయులు ఏమి జరుగుతుందో అనే కుతూహలంతో చూడటానికి వారి ఇళ్ల నుండి బయటకు రావడం ప్రారంభించారు. బాబీ సీల్ చెప్పినట్లుగా:
“మేము విచారిస్తుండగానే అక్కడున్న నల్లజాతి సమాజంలోని చాలామంది ప్రజలు బయటకు వచ్చారు. తుపాకీలతో ఉన్న మమ్మల్ని చూసి వారు మేము పాంథర్ల మని పోల్చుకున్నారు. మేము పది పన్నెండు మంది కలిసి అక్కడకు వెళ్లి, మొత్తం విచారణ ప్రక్రియను పూర్తి చేసి, ఏమి జరిగిందో పరిశీలించి, పోలీసులు, వార్తాపత్రికలు ఇచ్చిన అసత్యపు ప్రచారానికి విరుద్ధంగా ప్రజలు ఇస్తున్న సమాచారాన్ని వింటున్నాం. అదంతా అక్కడున్న ప్రజలు చూస్తున్నారు.
మేము నార్త్ రిచ్మండ్లోని ఒక మూలలో నిలబడి ఉన్నాం. మా చుట్టూ దాదాపు 150 మంది, కొందరు కార్లలో, కొందరు వీధికి అడ్డంగా నిలబడి ఉన్నారు, పదిహేను, పదహారు సంవత్సరాల బాలురు కొంతమంది, ఇంకొందరు ఇరవై ఏళ్ల వయసు యువకులు తుపాకుల గురించి అడుగుతున్నారు, మేము వారికి బ్లాక్ పాంథర్ పార్టీ గురించి వివరిస్తున్నాము. అకస్మాత్తుగా, ఒక సోదరి, “అయ్యో, ఓహ్…ఇదిగో పోలీసులు వచ్చారు.” అని అరిచింది.
సోదరి గర్జించినప్పుడు, హ్యూయ్ తన పద్దెనిమిది అంగుళాల షాట్‌గన్ తో పెద్ద శబ్దంతో ఒక రౌండ్ పేల్చాడు. అతను అలా చేసినప్పుడు, నేను నా .45 సుత్తిని పట్టుకున్న పట్టీని విప్పేశాను. వెంటనే అది కూడా శబ్దం చేస్తూ కొట్టుకుంది. ప్రజలు వెనక్కి వెళ్లడం ప్రారంభించారు. వారిలో కొందరు వీధి దాటుకుంటూ వెళ్లారు. నేను దిగి హ్యూయ్ని అనుసరిస్తూ అతని నుండి కొన్ని అడుగుల దిగువన కాలిబాట వైపు అడుగులు వేశాను. పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎవరికి వారు సిద్ధంగా ఉండి వారి కోసం అప్రమత్తంగా వాళ్ళ నెదుర్కోవడానికి రెడీగా నిలబడి ఉన్నారని గమనించారు. వాస్తవానికి వాళ్ళు కార్ వేగం పెంచి, డ్రైవ్ చేస్తూ ప్రజలను తరిమికొట్టడానికి కార్ ని నడిపిస్తూనే ఉన్నారు. అప్పుడు ప్రజలలో కొందరు వెనుదిరిగితే, వారిలో మరి కొందరు పేలుళ్ళు జరగబోతున్నాయని భావించి వీధికి అడ్డంగా క్రాస్ చేస్తూ అవతలికి దూకుతున్నారు. కాని మేము మమ్మల్నీ, మా సహోదరులందర్నీ రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారి కోసం ఇప్పటి కిప్పుప్పుడైనా సరే ఇక్కడే చనిపోవడానికి సిద్ధంగా ఉంటామని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సోదరుడు హ్యూయ్ పి. న్యూటన్తో కలిసి పార్టీ సదా తీసుకునే స్టాండ్ ఇదే!
ఈ దేశంలోని పోలీసులు నల్లజాతీయుల సమావేశాన్ని అధికార వ్యవస్థకు వాటిల్లబోయే ముప్పుగా ఎలా పరిగణిస్తారో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. నిజానికి డెంజిల్ హత్యపై దర్యాప్తు చేస్తున్న డోవెల్ కుటుంబంతో పాంథర్లు అక్కడ ఉన్నారని పోలీసులకు తెలియదు, వాళ్ళు ఆ ప్రాంతంలో గుమిగూడిన కొంతమంది నల్లజాతీయులను చూసి వారిని వేధించడానికి వెంటనే అక్కడికి వచ్చారు. అయితే, పాంథర్స్ స్పందన వారిని భయపెట్టింది. పైన ఉదహరించిన ఇంతకుముందు సంఘటనలో లాగానే, కేవలం పాంథర్ల ఉనికి మాత్రమే కాదు, అంత పెద్ద సంఖ్యలో నల్లజాతీయులు సంఘటితమవ్వడం కూడా పోలీసులకు హడలు పుట్టించింది. అణచివేత శక్తులుగా పోలీసులు వ్యక్తులు, చిన్న సమూహాలను బెదిరిస్తూ వేధించడంలో సంపూర్ణ సామర్థ్యం కలిగి ఉంటారు. అయితే అణగారిన, దోపిడీకి గురవుతున్న పెద్ద సమూహం ఒకచోట చేరి సంఘటిత మవుతున్నప్పుడు, పోలీసులు కనీసం తాత్కాలికంగానైనా వెనక్కి తగ్గవలసిందే!
పోలీసులు చుట్టుముట్టినప్పుడు మొదట కొంతమంది వెంటనే భయపడి పారిపోయారు. మరికొందరు తమ స్థానాల్లో స్థిరంగా నిలబడ్డారు. పారిపోయిన వారు కూడా పాంథర్స్ వ్యవస్థీకృత ప్రయత్నాలు, సాయుధ ఆత్మరక్షణ సాధనకు వారు చూపిస్తున్న సుముఖత పోలీసులను భయపెడుతుంది. బ్లాక్ పాంథర్ పార్టీ అంటే ఏమిటో మరింత స్పష్టం చేయడానికి ఇది సహాయపడింది: వారు వ్యవస్థీకృతంగా, నల్లజాతి ప్రజలకు నిజాయితీ, నిబద్ధతలతో సేవ చేయడానికి క్రమశిక్షణతో ఉన్నారని తెలుపుతుంది. పోలీసులు వచ్చినప్పుడు, పాంథర్లు అర్ధంతరంగా వెళ్లి షూట్ చెయ్యడం ప్రారంభించలేదు. దానికి బదులుగా వారు పోలీసులకు ఎదురొడ్డి నిలబడి ధైర్యంగా ఎదుర్కొన్నారు. అవసరమైతే బలవంతంగానైనా తమను తమ ప్రజలను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సంఘటనే గాక తర్వాత సంభాషణల ద్వారా రిచ్మండ్లో డెంజిల్ కుటుంబానికి ఏమి జరిగిందో తెలియ చేయడానికి, పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా సంఘాన్ని సమీకరించడానికి బ్లాక్ పాంథర్ పార్టీ వరుస ర్యాలీలను నిర్వహించింది. పోలీసుల దౌర్జన్యాలకు, హత్యలకు డెంజిల్ మరణం మాత్రమే ఉదాహరణ కాదు; ఇలాంటి సంగతులు రిచ్మండ్లో అతి సాధారణ సంఘటనలని తెలుసుకున్నారు. ఉదాహరణకు, డెంజిల్ హత్యకు కొన్ని నెలల ముందు మరో ఇద్దరు నల్లజాతీయులను పోలీసులు చంపేశారు. వారి చేతులను పైకెత్తి బంధించబడినట్లుగా చంకలతో సహా శరీరమంతా కాల్చి చంపబడినట్లుగా స్పష్టమయింది. పాంథర్స్ ఈ ర్యాలీలను ఆ ప్రాంతంలో పోలీసు క్రూరత్వం, తెల్ల ఆధిపత్య అణచివేతలను ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేయడాన్ని, సాయుధ ఆత్మరక్షణ కోసం ప్రజలను సన్నద్ధం చేసి ఆకట్టుకోవడానికి ఉపయోగించారు. ఈ సంఘటనలు భారీ విజయాన్ని సాధించాయి.
వందలాది మంది ప్రజలు బయటికి వచ్చి, పాంథర్స్ గురించి తెలుసుకుంటూ సంఘటితమవడం ప్రారంభించారు. బ్లాక్ పాంథర్ పార్టీ టెన్-పాయింట్ ప్రోగ్రామ్ గురించి, ఈ దేశంలో శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావం గురించి, నల్లజాతీయులు సంఘటితమై సాయుధ ఆత్మరక్షణను అభ్యసించవలసిన అవసరం గురించి మాట్లాడింది.
మొదటి ర్యాలీలో, పాంథర్స్ పోలీసులను తరిమికొట్టగలిగారు, రెండవ ర్యాలీలో రిచ్మండ్ ప్రజలతో కలిసి మొత్తం వీధిని ముందుగానే మూసివేసి, ర్యాలీకి అంతరాయం కలిగించకుండా పోలీసులను నిరోధించగలిగారు. తమ ర్యాలీలలో “మార్షల్స్” సేనలను మోహరించి, పోలీసు “ఎస్కార్ట్” లను” స్వాగతించే అనేక సమూహాలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ మార్షల్స్ వారి కోసం పోలీసులు చేసే పనిని చేస్తారు, వారు నిరసనకారులను “ఒక వరస క్రమంలో” ఉంచి, ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చూస్తారు. పాంథర్స్ దీనికి భిన్నమైన విధానాన్ని తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అది ప్రజల దృష్టిని పాంథర్స్ వైపుకి అద్భుతంగా ఆకర్షించింది.
పాంథర్స్ మొదటిసారి కనిపించి, డెంజిల్ హత్యను పరిశోధించడం ప్రారంభించినప్పుడు, పోలీసులు కనిపించగానే ప్రజలు భయపడ్డారు, పోలీసుల స్క్వాడ్ కారును చూసినప్పుడు చాలా మంది అక్కడినుంచి తప్పుకున్నారు. కానీ రిచ్మండ్లో రెండవ ర్యాలీ జరిగిన సమయానికి, ప్రజలు మిలిటెంట్‌గా సంఘటితమయ్యారు, అంతేకాదు వారికి బ్లాక్ పాంథర్ పార్టీ గురించి వారు దేని కోసం ఎదురొడ్డి పోరాడుతున్నారనే దాని గురించి మంచి అవగాహన ఏర్పడింది. వారు ట్రాఫిక్‌ను నిరోధించడానికి పాంథర్లతో కలిసి పనిచేసి ర్యాలీని సమన్వయం చేశారు, ఫలితంగా పోలీసులు రాకుండా నిరోధించ గలిగారు. డెంజిల్ సోదరులతో పాటు ఇతర కమ్యూనిటీ సభ్యులు పోలీసుల క్రూరత్వం గురించి రిచ్మండ్లోని నల్లజాతీయుల దుస్థితి గురించి మాట్లాడుతున్నారు. ర్యాలీ అంతటా చాలా మంది, బాబీ సీల్ చెప్తున్న దాని ప్రకారం 300 మందికి పైగా పార్టీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పరిణామాలన్నిటితో పాటు బ్లాక్ పాంథర్ పార్టీ సభ్యత్వం కోసం ప్రవాహం లాగా వస్తున్న ప్రజలతో, చట్టాన్ని అమలు చేసే సంస్థల, రాజకీయ నాయకుల, ఇతర అభివృద్ధి నిరోధకుల దృష్టిని పాంథర్స్ ఆకర్షించడం ప్రారంభించారు. ఇ పరిణామం పోలీసుల చేతిలో వేధింపులకంటే ఘోరమైనది, దీనివల్ల బ్లాక్ పాంథర్ పార్టీ, ఎఫ్ బి ఐ (Federal Bureau of Investigation), రాష్ట్ర శాసనసభల దృష్టికి కూడా వెళ్లింది. ఈ దేశాన్ని నడుపుతున్న శ్వేతజాతీయుల ఆధిపత్య వర్గాలకు చెందిన పెట్టుబడిదారులు, ఇతర జాత్యహంకార సమూహాలకు నల్లజాతీయులను భయభ్రాంతులకు గురిచేయడానికి తుపాకీలను ఉపయోగించడం వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయమైనప్పటికీ, పాంథర్లు ఆత్మరక్షణకోసం సాయుధమవడాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించిన తర్వాత, పోలీసులు వారికి వ్యతిరేకంగా వేగంగా కదలసాగారు.
ఆ వేగానికి అనుగుణంగా తీసుకున్న ఒక రూపం ముల్ఫోర్డ్ చట్టం. అది నిజానికి 1967లో కాలిఫోర్నియా రిపబ్లికన్ అసెంబ్లీ సభ్యుడు డాన్ ముల్ఫోర్డ్ ప్రతిపాదించిన బిల్లు. ఈ బిల్లు పౌరులు తుపాకీలను బహిరంగంగా తీసుకెళ్లే హక్కుని పరిమితం చేయడం ఈ బిల్లు లక్ష్యం. ఇది ప్రత్యేకంగా పాంథర్స్ కమ్యూనిటీ పెట్రోలింగ్‌ను లక్ష్యంగా చేసుకుంది. కాలిఫోర్నియా అసెంబ్లీలో ఈ బిల్లుకి విస్తృతంగా ద్వైపాక్షిక మద్దతు లభించడమే గాక ఎన్ ఆర్ ఏ (National Rifle Association) కూడా దానికి ఆమోదముద్ర వేసింది. చివరికి ఈ బిల్లుని అప్పటి – కాలిఫోర్నియా గవర్నర్ రోనాల్డ్ రీగన్ చట్టంగా ఆమోదించి సంతకం చేశాడు.
ఆ సమయంలో దేశంలోని కఠినమైన తుపాకీ నియంత్రణ చట్టాలలో ఇది ఒకటి, జాత్యహంకార అధికార యంత్రాంగం లోని అనేక విభిన్న సమూహాలు దీనికి మద్దతుగా కలిసి రావడం ముఖ్యంగా గమనించదగిన అంశం. దేశాన్ని నడుపుతున్న పెట్టుబడిదారీ మృగాలు పాంథర్స్ గురించి నిజంగా ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని ఇది సూచించింది. జాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకునే నల్లజాతి వ్యక్తుల సామర్థ్యాన్ని పరిమితం చేసే లక్ష్యంతో ముల్ఫోర్డ్ చట్టపు దౌర్జన్య స్వభావాన్ని కప్పిపుచ్చడానికి బిల్లుకు మద్దతు ఇచ్చిన వారు చాలా రహస్యమైన కోడెడ్ భాషలను ఉపయోగించారు.
ఉదాహరణకు, “ఈ రోజుల్లో వీధిలో ఒక పౌరుడు బుల్లెట్లు నింపిన తుపాకులను వీధిలో మోసుకెళ్ళడానికి ఎటువంటి కారణం కనిపించదు”, అనీ ఆయనే మళ్ళీ ముల్ఫోర్డ్ చట్టం “నిజాయితీగల పౌరునికి ఎటువంటి కష్టాన్ని కలిగించదు” అనీ పేర్కొన్నాడు. ఈ స్పష్టమైన జాత్యహంకార భాషతో చేసే ఇలాంటి ప్రకటనలు సాయుధ ఆత్మరక్షణ ప్రమాదకరమైనది, “మంచిది కాదు” అని వాదించే వారిని రూపొందించడానికి ఉద్దేశించబడ్డాయి.
ఇంకా ఏమిటంటే, రీగన్ ప్రకటనల్లో “నిజాయితీగల పౌరులు” పోలీసుల నుండి తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం లేదని వాదించాడు, అంటే ఆయన ప్రకటన పోలీసులచే చంపబడిన వారు చంపడానికి అర్హులని పరోక్షంగా సూచిస్తుంది. రాజకీయ నాయకులు, ఇతర తిరోగమన పోలీసులు ఈనాటికీ ఇలాంటి అర్ధంలేని మాటలు చెప్తూనే ఉన్నారు. అయితే, ఆ సమయంలో బ్లాక్ పాంథర్ పార్టీ రోజు రోజుకీ పెరుగుతున్న అనేకమంది సభ్యులతో స్థాపించబడి, బలమైన సంస్థగా ఎదిగింది. అందువల్ల వారు ముల్ఫోర్డ్ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికీ, అ చట్టాన్ని రద్దు చేయించడానికీ ఒక ప్రణాళికను అభివృద్ధి చేశారు. శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ శక్తులు తమ పార్టీపై దుష్ప్రచారం, లేని పోని అభాండాలు, దుష్ప్రచారాలు కొనసాగిస్తారని వారికి తెలుసు. వారు బే ఏరియాలో కొంత విజయం సాధించారు, రాజకీయ నాయకులు ఇతర పోలీసులు చేస్తున్న అబద్ధాల ప్రచారాలద్వారా పేద, నల్లజాతి వర్గాలకు చెందిన ప్రజలు ప్రభావితమవుతున్నారని గమనించినందువల్ల, పాంథర్లు తమ సందేశాన్ని జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం జేయాలని గ్రహించారు. వారు ప్రెస్‌లో కవరేజీని పొందినప్పుడు, అవన్నీ అబద్ధాలనీ, వారిని “జాత్యహంకారవాదులు” గా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. వారు శ్వేతజాతీయులను అసహ్యించు కుంటారనీ, పొరుగునున్న తెల్లజాతీయులను తుపాకీలతో కాల్చి చంపే భయంకర దుర్జనులనీ, నేరస్థులనీ శక్తివంచన లేకుండా అసత్యాలను ప్రచారం చేశారు.
పార్టీ నాయకత్వం ఏకకాలంలో మల్ఫోర్డ్ చట్టాన్ని నిరసించడంతో పాటు, పాంథర్స్ దేని కోసం నిబద్ధతతో నిలబడి పనిచేస్తున్నారో స్పష్టంగా వివరిస్తూ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికి పార్టీ ఒక ప్రణాళికను రూపొందించింది, స్టేట్ క్యాపిటల్ సిటీ శాక్రమెంటో లోని అసెంబ్లీ ఫ్లోర్లో ముల్ఫోర్డ్ చట్టం గురించి చర్చించబోతున్నారని వారికి తెలుసు. కాబట్టి వారు అసెంబ్లీని పరిశీలించడానికి, మీడియాతో మాట్లాడటానికి శాక్రమెంటోకు ముప్పైమంది వరకు పాంథర్లను పంపారు. హ్యూయ్, బాబీ, ఎల్డ్రిజ్ క్లీవర్ మరికొంతమంది ఇతర నాయకులు ఎగ్జిక్యూటివ్ మాండేట్ నంబర్ వన్ అని పిలిచే ఒక ప్రకటనను రూపొందించారు, అది టీవీ కెమెరాల ముందు మీడియాకు బాబీ చదవి వినిపించాలి. ఈ విధంగా, వారు తమ సందేశాన్ని ప్రజలకు అందజేయగలరనీ, శ్వేత పెట్టుబడిదారీ ఆధిపత్య వర్గాల అధికార నిర్మాణంలో భాగమైన పత్రికల చేతుల్లో వక్రీకరణకు బలయ్యే పద్ధతుల్ని కనీసం పాక్షికంగానైనా నివారించవచ్చని భావించారు.
మొదటి కార్య నిర్వాహక వర్గ ఆదేశం ఇలా పేర్కొంది:
సాయుధ ఆత్మరక్షణను సమర్ధిస్తున్న బ్లాక్ పాంథర్ పార్టీ మొత్తంగా అమెరికన్ ప్రజలను, అందులోనూ మరీ ముఖ్యంగా నల్లజాతీయులను జాత్యహంకార కాలిఫోర్నియా శాసనసభను జాగ్రత్తగా గమనించాలని పిలుపునిస్తుంది, అది ఇప్పుడు నల్లజాతి ప్రజలను నిరాయుధులుగా, శక్తిహీనులుగా ఉంచడానికి ఉద్దేశించిన చట్టాన్ని పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా జాత్యహంకార పోలీసు ఏజెన్సీలు నల్లజాతీయులపై భీభత్సం, క్రూరత్వం, హత్యలు, అణచివేతను తీవ్రతరం చేస్తున్న సమయమిది.
వియత్నాంలో అమెరికా ప్రభుత్వం జాతి వివక్షతో కూడిన మారణహోమ యుద్ధం చేస్తున్న సమయంలోనే, రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అమెరికన్లను నిర్బంధించిన నిర్బంధ శిబిరాలు పునరుద్ధరించబడ్డాయి, విస్తరించబడ్డాయి. అమెరికా శ్వేతజాతీయేతరుల కోసం చరిత్రాత్మకంగా అత్యంత అనాగరికమైన చికిత్సలను అమలు చేసి ఉన్నందువల్ల, తమ స్వేచ్ఛను ఏ విధంగానైనా పొందాలని నిశ్చయించుకున్న నల్లజాతీయుల కోసం ఈ నిర్బంధ శిబిరాలను సిద్ధం చేస్తున్నాయని మేము నిర్ధారించవలసి వచ్చింది. ఈ దేశంలో మొట్టమొదటి నుంచీ నల్లజాతి ప్రజలను బానిసలుగా మార్చడం, అమెరికన్ మూలవాసులయిన రెడ్ ఇండియన్లపై మారణహోమాలు జరపడం, వారి బతుకులను రిజర్వేషన్లకు కుదించి నిర్బంధించడం, వేలాది మంది నల్లజాతీయులు, మహిళలను పాశవికంగా హత్యలకు గురి చెయ్యడం, హిరోషిమా నాగసాకిలపై అణు బాంబులు వేయడం, ఇప్పుడు వియత్నాంలో జరిపిన పిరికి మారణకాండ-ఈ చర్యలన్నీ కూడా శ్వేత జాత్యహంకార ఆధిపత్య నిర్మాణం నల్ల రంగుల ప్రజల పట్ల అణచివేత, పెద్దన్నగా ప్రపంచ దేశాలపై కర్రపెత్తనం చేస్తూ మారణహోమం, భీభత్సాలు సృష్టించడమనే ఒకే ఒక విధానాన్ని అమెరికా కలిగి ఉందని స్పష్టమవుతుంది.
చారిత్రాత్మకంగా వారికి వ్యతిరేకంగా శ్వేత జాతి అధికార యంత్రాంగం చేసిన తప్పులను సరిదిద్దడానికి నల్లజాతీయులు తమ శాయశక్తులా చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తూ వారిని కాళ్ళా వేళ్ళా వేడుకున్నారు, ప్రార్ధించారు, పిటిషన్లు వేశారు, నిరసనలు ప్రదర్శించారు. ఈ ప్రయత్నాలన్నింటికీ వాళ్ళు మరింత అణచివేత, మోసం, వంచనల ద్వారా సమాధానం ఇచ్చారు. వియత్నాంలో జాత్యహంకార అమెరికన్ ప్రభుత్వపు దూకుడు పెరగడంతో, అమెరికా పోలీసు ఏజెన్సీలు అమెరికాలోని నల్లజాతీయుల వెలివాడలలో అణచివేతను పెంచాయి. దుర్మార్గపు పోలీసులు, వాళ్ళ పెరుగుతున్న పెట్రోలింగ్ నల్లజాతి ప్రజలకు సుపరిచితమైన దృశ్యాలుగా మారాయి. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ భీభత్సం నుండి ఉపశమనం కోసం నల్లజాతి ప్రజలు సిటీ హాల్ కి ఎన్నో అభ్యర్ధనలు చేసుకున్నప్పటికీ వాళ్ళు వాటికి చెవిటి చెవిని అప్పగించారు.
ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నల్లజాతీయులు తమను తాము ఆయుధాలుగా చేసుకోవలసిన సమయం ఆసన్నమై పోయిందని ‘బ్లాక్ పాంథర్ పార్టీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్’ నమ్ముతోంది. పెండింగ్‌లో ఉన్న ముల్ఫోర్డ్ చట్టం విధ్వంసక సమయాన్ని మరింత దగ్గరగా ఒక అడుగు ముందుకి నెడుతుంది. జాత్యహంకార ఆధిపత్య సమాజంలో చాలా కాలంగా అష్ట కష్టాలు అనుభవిస్తున్న ప్రజలు ఎక్కడో ఒక చోట ఆ హింసలకు ముగింపు పలకాలి.
అమెరికాలోని నల్లజాతి సంఘాలు తమ సంపూర్ణ వినాశనానికి అనివార్యంగా దారితీసే ముల్ఫోర్డ్ చట్టం లాంటి ధోరణుల పురోగమనాన్ని ఆపడానికి ఒక ఐక్య సంఘటనగా ఎదగాలని మేము నమ్ముతున్నాం.
ఈ ప్రకటనతో పాటు కాపిటోల్‌లో జరిగిన నిరసన దేశవ్యాప్తంగా సముద్ర తీరాల వెంబడి మూల మూలలనూ ఏకం చేస్తూ వార్తలు పాకిపోయాయి. ఫలితంగా బ్లాక్ పాంథర్ పార్టీ గురించి ప్రజలకు మంచి అవగాహన కలిగింది. పోలీసులు చివరికి క్యాపిటల్‌లోకి కవాతు చేసిన అనేక మందిని మోసపూరిత నేరారోపణలపై అరెస్టు చేశారు, అయితే ఈ అరెస్టులు కూడా నిరసన ప్రకటనల ప్రభావాన్ని అరికట్టలేకపోయాయి. ఆదేశాల స్పష్టమైన విశ్లేషణ అమెరికా పరిస్థితులు ఈ దేశంలోని ప్రణాళికాబద్ధమైన జాత్యహంకారమే దేశవ్యాప్తంగా ఉన్న నల్లజాతీయులను పాంథర్స్ తో భాగస్వాములుగా చేసింది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బ్లాక్ పాంథర్ పార్టీ కొత్త శాఖలు త్వరగా పుట్టుకొచ్చాయి.
పౌరహక్కుల ఉద్యమం చేపట్టిన అహింసా విధానంతో చాలా మంది ప్రజలు నిరాశా నిస్పృహలతో విసిగిపోయి ఉన్నారు. వారు శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ శక్తులకు లొంగిపోయి నిష్క్రియాపరంగా ఓడిపోవాలనుకోవడంలేదు. సంఘటితమై పోరాడాలని కోరుకుంటున్నారు. మాల్కం X స్ఫూర్తితో నిబద్ధతగా పని చేస్తున్న ఒక పాంథర్స్ సమూహం ఉందని, వారు నల్లజాతి విముక్తి కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమై సమరశీలంగా పోరాడతారని జాతీయ మీడియా కూడా ప్రచారం చేసింది.
అదే సమయంలో, బ్లాక్ పాంథర్ పార్టీ అభివృద్ధి, దానిపై జాతీయ ప్రభుత్వం దృష్టి సారించడం, పార్టీ కొత్తగా ప్రధాన నగరాలకు విస్తరించడంతో కొత్త వైరుధ్యాలను తెచ్చిపెట్టాయి. పాంథర్స్ కు రకరకాలుగా చికాకులు పెట్టడంలో అమెరికా ప్రభుత్వం చేసిన గొప్ప కృషి కూడా ఒక కారణం. ఇందులో FBI కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, పోలీసు శాఖల దాడులు, బూటకపు ఆరోపణలపై కీలక నాయకులను బెదిరించడాలు, పోలీసులు, ఆధిపత్య శ్వేతజాతీయులచే పాంథర్స్ పై చేసే “విజిలెంట్” దాడులు ఉన్నాయి. ఈ సిరీస్‌లోని తర్వాతి కథనంలో దేశవ్యాప్తంగా బ్లాక్ పాంథర్ పార్టీ వ్యాప్తిని, వారు ఎదుర్కొన్న సాహసోపేతమైన సవాళ్ల గురించి చర్చిస్తాం.