బ్లాక్ పాంథర్ పార్టీ చరిత్ర, దాని వారసత్వ ప్రాతినిధ్యం, నిరంతర ప్రాసంగికతపై వచ్చిన ఏడు భాగాల సిరీస్‌లో ఇది నాల్గవది. దివంగత మాల్కం X (Malcolm X) రాజకీయాల స్ఫూర్తితో 1966లో బ్లాక్ పాంథర్ పార్టీ స్థాపించబడింది. చైనాలో జరిగిన గొప్ప శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవంతో అత్యంత ప్రభావితమైన బ్లాక్ పాంథర్ పార్టీ ఒక నల్లజాతి మార్క్సిస్టు-లెనినిస్టు విప్లవ సంస్థ. కొంతకాలంపాటు వారు అమెరికాలో నల్లజాతీయుల విముక్తి పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. విప్లవ రాజకీయాలను చేపట్టడానికి దేశవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించారు. శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ సమాజంలో ఐక్య సంఘటనకు పురికొల్పిన పౌరహక్కుల ఉద్యమానికి ఇది చాలావరకు భిన్నమైనది. ఇంతకుముందు సంచికలో బే ఏరియా దాటి వారి విస్తరణను, లుంపెన్ – ప్రొలిటేరియట్ పై వారి గందరగోళాన్ని గురించి చర్చించాం.
ఈ సంచికలో బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో శాఖ పనిని విశ్లేషిస్తాం. విప్లవాత్మక పద్ధతిలో లుంపెన్ – ప్రొలిటేరియట్ సమూహాలతో, శ్వేతజాతీయులతో, చీకానో సమూహాలతో పనిచేయగలిగిన వారి నిర్వహణా సామర్ధ్యాన్ని గురించి వివరిస్తాం. బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో శాఖ మీద దాడి చేసి ఫ్రెడ్ హాంప్టన్ ను ఎంత క్రూరంగా హత్య చేసిందో కూడా తెలియజేస్తాం.
ఉత్తమోత్తమంగా వ్యవస్థీకృతమైన అత్యంత శక్తిమంతమైన మిలిటెంట్ శాఖలలో బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో శాఖ ఒకటి. నల్లజాతి సమూహాలను సంఘటితం చేసి కార్యోన్ముఖులను చేయడం, వీధి ముఠాలను నేరపూరిత కార్యకలాపాలకు స్వస్తి చెప్పి, విప్లవం కోసం కలిసి పనిచేయడానికి దారి మళ్ళించడం, ప్రత్యేకించి అనేక విభిన్న దేశాల, జాతులకు చెందిన ప్రజలను ఒకచోట చేర్చే విప్లవాత్మక పనికి సంసిద్ధులను చేయడంలో ఈ శాఖ వారు భారీ విజయాన్ని సాధించారు. ఈ పని చికాగో ప్రజలనే గాక దేశప్రజలందరికీ గొప్ప స్ఫూర్తి నిచ్చింది. లుంపెన్ శ్రామిక వర్గాన్ని ఎలా గెలుచుకోవాలి వారిని విప్లవ రాజకీయాల వైపుకి ఎలా దిశానిర్దేశం చెయ్యాలి, దేశవ్యాప్త విస్తృత విప్లవోద్యమంతో నల్లజాతీయుల పోరాటానికి వారిని ఎలా ఏకం చేయాలి అనేదానికి ఇది ఒక స్పష్టమైన ఉదాహరణను అందించింది. ఈ దేశంలోని ప్రజలను విభజించి, వారి పోరాటాలను విడి విడిగా, ఒంటరిగా ఉంచడానికి ప్రయత్నిస్తున్న శ్వేత జాతీయుల ఆధిపత్య వ్యవస్థ మూలాలను బ్లాక్ పాంథర్ పార్టీ సంస్థాగత ప్రయత్నాలు నిలువరించాయి.
అయితే, పాంథర్స్ ఎక్కడెక్కడైతే ఉద్యమ విజయాలు సాధించారో అక్కడంతా ఎలాగైతే ప్రభుత్వ నిఘా కొనసాగిందో అలాగే చికాగోశాఖ కూడా అమెరికా ప్రభుత్వ దృష్టిని ఆకట్టుకుంది. ఎఫ్ బి ఐ చికాగో శాఖను నిశితంగా గమనిస్తూ, అక్కడ జరుగుతున్న పరిణామాల మీదా, అలాగే ప్రత్యేకంగా యువనాయకుడు ఫ్రెడ్ హాంప్టన్ మీద గట్టి నిఘా పెట్టింది. నల్లజాతీయులను ఉత్తేజ పరిచి, విప్లవోద్యమంలో ఐక్యం చేసి, సోషలిస్టు ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రేరేపిస్తాడని, తమ రక్షణ కోసం వచ్చిన “నల్ల మెస్సయ్యా” (క్రీస్తు) గా ఫ్రెడ్ హాంప్టన్ ను నల్లజాతి ప్రజలు భావిస్తారని, శ్వేత జాతీయుల పెట్టుబడిదారీ అధికార నిర్మాణాన్ని కూలదోసి అమెరికా ప్రభుత్వాన్ని పడగొడతాడని వారు భయపడ్డారు.
కాబట్టి, చికాగోలో పాంథర్స్ పని సమర శీలంగా కొనసాగుతున్నకొద్దీ వారి పనులను, ప్రయత్నాలను విధ్వంసం చేయడానికి, పాంథర్స్ ను అణగదొక్కడానికి పోలీసులతో కలిసి ఎఫ్ బి ఐ పని చేసింది. మరీ ముఖ్యంగా, చికాగోలో పాంథర్స్ విజయానికి ఫ్రెడ్ హాంప్టన్ విప్లవాత్మక నాయకత్వమే కీలకమైనది. అందువల్ల వారు అతనిపై దృష్టి సారించారు. చికాగోలో బ్లాక్ పాంథర్ పార్టీ చేసిన పనిని అర్ధం చేసుకోవడానికి, ఫ్రెడ్ హాంప్టన్ నేపధ్యం గురించి కొంత తెలుసుకోవడం అవసరం
ఫ్రెడ్ హాంప్టన్
ఫ్రెడ్ హాంప్టన్ కుటుంబం శ్రామిక వర్గానికి చెందినది. ఫ్రెడ్ హాంప్టన్ చికాగో నగర శివార్లలో, చికాగో వెలుపల పెరిగాడు. తల్లి ఐబెరియా మొక్కజొన్న ఉత్పత్తి చేసే ఒక కర్మాగారంలో పని చేసేది. ఇప్పుడది ప్రపంచవ్యాప్తంగా తమ వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఒక బహుళ – బిలియన్ డాలర్ల కంపెనీ. ఐబెరియా కర్మాగార యూనియన్ కార్యకర్తగా అంకితభావంతో, బాధ్యతాయుతమైన పాత్ర నిర్వహించింది. ఫలితంగా ఆమె షాప్-సేవాధికారిగా నియమితురాలైంది. ఏడు వందలమంది కార్మికులతో రెండునెలలు కొనసాగిన ఒక సుదీర్ఘ సమ్మెకు నాయకత్వం వహించింది. ఈ సమ్మె సమయంలో యూనియన్ హాల్ లో ఫ్రెడ్ హాంప్టన్ చాలా మంచి విశిష్టమైన సమయం గడిపాడు. సమ్మెలో ఉన్న కార్మికులకూ, వారి కుటుంబాలకూ ఆహారపానీయాలు అందించడం వంటి సహాయాలు చేశాడు. ఎవరైనా సమాజంలో మార్పు కోసం పనిచేయాలనుకుంటే బాధితులందరూ సంఘటితమై పోరాడితే తప్ప ఏ హక్కులయినా సాధించలేరనే విషయాన్ని ఫ్రెడ్ హాంప్టన్ తన బాల్యం నుంచే గమనించాడు. శ్రామిక ప్రజలు కలిసి పట్టు విడవకుండా పోరాడినప్పుడు వారు తమ యాజమానులపై, అణచివేతదారులపై తప్పక విజయం సాధిస్తారని అతని బాల్యంలోని ఈ ప్రత్యక్ష అనుభవం అతనికి నేర్పించింది. ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న ఉత్పత్తులను కలిగిఉన్న అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తలు కూడా చివరికి కార్మికుల న్యాయమైన డిమాండ్లకు కట్టుబడి వాళ్ళ అహంకారాలను తగ్గించుకుని దిగిరావలసి వచ్చింది. ఈ అనుభవాలు ఫ్రెడ్ హాంప్టన్ స్పష్టతను పెంపొందించడానికి సహాయపడ్డాయి. ఈ దేశాన్ని నడుపుతున్న జాత్యహంకార పెట్టుబడిదారులను నల్లజాతీయుల పట్ల కాస్త మెరుగ్గా ప్రవర్తించమని అడుక్కోవడం అర్ధరహితంగా భావించాడు; దానికి బదులుగా ఈ వ్యవస్థను కూలదోయడానికి నల్లజాతి సమూహాలను సంఘటితం చేసి విప్లవాత్మకంగా పోరాడడానికి ప్రేరేపించడమే సవ్యమైన పద్ధతిగా భావించాడు.
అతని బాల్య మిత్రుడు ఎమ్మెట్ టిల్ హత్య అతనికి మరొక సజీవమైన అనుభవం. ఫ్రెడ్ హాంప్టన్, ఎమ్మెట్ టిల్-ఇద్దరూ పసివయసునుంచి కలిసి పెరిగారు, వీరిద్దరేగాక వారి తలిదండ్రులు కూడా స్నేహితులు. వయసులో కొన్ని సంవత్సరాలు పెద్దవాడైన ఎమ్మెట్ టిల్ ని గమనిస్తూ ఫ్రెడ్ హాంప్టన్ ఎదిగాడు. 1955 లో, 14 సంవత్సరాల వయసులో ఉన్న ఎమ్మెట్ టిల్ మిసిసిపీలో ఉన్న తన కుటుంబాన్ని చూడడానికి వెళ్తున్నప్పుడు, ఒక 21 సంవత్సరాల శ్వేతజాతీయురాలు తనతో ఈలలు వేస్తూ పరిహాసమాడాడని ఆరోపించినందువలన అతన్ని పట్టుకుని దారుణంగా చిత్రవధ చేసి ఎటువంటి విచారణ లేకుండా హత్య చేసేస్తారు. కొన్నేళ్ళతర్వాత తాను అబద్ధం చెప్పానని ఆమె ఒప్పుకుంది. అయితే ఆ సమయంలో దక్షణ జిమ్ క్రో లో ఎమ్మెట్ టిల్ కి అన్యాయంగా మరణ శిక్ష విధించడానికి ఒక శ్వేతజాతీయురాలి నోటి మాట చాలు. మహిళ భర్త, ఆమె సవతి సోదరుడు కలిసి ఎమ్మెట్ టిల్ ను అతని బంధువుల ఇంటినుండి అపహరించి తీసుకెళ్ళి, విపరీతంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అతని శరీరభాగాలను ఛిద్రం చేసి, తలపై కాల్చి హత్య చేసి, అతని మృత దేహాన్ని నదిలో పడేశారు. తల్లి మామీ, అమెరికాలో తెల్లజాతి ఆధిపత్యపు దుర్మార్గాలనూ, క్రూరత్వాన్నీ ప్రపంచానికి చూపించాలనే కోరికతోనూ బహిరంగంగా శవపేటికలో ఉంచి అంత్యక్రియలు జరిపించాలనే ఉద్దేశ్యంతోనూ అతని మృతదేహాన్ని చికాగోకు తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేసింది.
ఈ మొత్తం సంఘటన ఫ్రెడ్ హాంప్టన్ తో పాటు, చికాగో లోనే గాక దేశంలోని అనేక ఇతర నల్లజాతి యువకులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అమెరికా ఎంత జాత్యహంకారపూరితంగా ఉందో, బాలుడని కూడా చూడకుండా క్రూరంగా హింసించి చంపేయడానికి ఒక బుద్ధిలేని మూర్ఖపు ఆరోపణ చాలు అనే విషయం వారికి అనుభవంలో కొచ్చింది. శ్వేతజాతీయుల జ్యూరీ టిల్ హంతకులిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తుంది, తెల్లజాతి ఆధిపత్య శక్తులతో ప్రభుత్వం చేతులు కలిపి ఏ విధంగా పనిచేస్తుందో అనే విషయాన్ని ఈ సంఘటన నల్ల జాతీయులకు తేటతెల్లం చేసింది. పౌరహక్కుల ఉద్యమం ఒక కొత్త కెరటంలా ఎగిసిపడడానికి ఉత్తేజాన్నిచ్చినందుకు ఎమ్మెట్ టిల్ హత్య ప్రసిద్ధి పొందింది, అంతేగాక ఇది కేవలం చిన్న చిన్న సంస్కరణలకంటే అసలైన న్యాయాన్ని కోరుకునే విప్లవాత్మక నల్ల జాతీయుల విముక్తిని కాంక్షించే కొత్త తరం యోధులను కూడా ప్రేరేపించిందని చూడడం ముఖ్యం. ఎమ్మెట్ టిల్ హత్య లాంటి విషయాలు ఈ దేశంలోని వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయిందనీ, దానిని మొదలంటా ప్రాధమికంగా మార్చాల్సిన అవసరముందని చాలామందికి చూపించాయి. యువకుడైన ఫ్రెడ్ హాంప్టన్ కి ఈ ఆలోచన పట్ల పెద్దగా ఏమీ అవగాహన లేనప్పటికీ, అతని బాల్య స్నేహితుడి హత్య మాత్రం సమూలంగా అతనిని రాడికల్ గా మార్చడంలో గొప్ప పాత్ర పోషించింది.
యుక్త వయసులో ఫ్రెడ్ హాంప్టన్ పౌరహక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. అతను చికాగో పశ్చిమ ప్రాంతాలలో ఉన్న శివారులలో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్ (NAACP) అనే ఒక శాఖను యువతకోసం స్థాపించాడు. అతనక్కడ ఒక సంవత్సరంలో రెండు వందలమందిని ఈ నేషనల్ అసోసియేషన్ లో చేర్పించగలిగేవాడు, అంతేగాక ఈ సమీకరించిన యువకుల సర్వతోముఖాభివృద్ధి కోసం పబ్లిక్ స్విమ్మింగ్ పూల్, వినోదానికి కొన్ని వసతులు కల్పించి వరసగా రాజకీయ ప్రచారాలను ప్రారంభించాడు. ఇది చివరికి ఈ దేశంలోని శ్వేతజాతీయుల ఆధిపత్య అధికార నిర్మాణాల మూలాలను ఏ విధంగానూ కదిలించలేని ఉదారవాద సంస్థగా రూపొందింది కానీ వారి ఆధిపత్యం – ప్రజలను విభజించి పాలించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించే విధానాన్ని ఫ్రెడ్ హాంప్టన్ చాలా బాగా నేర్చుకున్నాడు.
ఫ్రెడ్ హాంప్టన్ రాజకీయంగా ఎదుగుతూ, నేషనల్ అసోసియేషన్ వారవలంభిస్తున్న నిర్వహణా విధానంతో ఎక్కువ సమస్యలను గమనించడం ప్రారంభించాడు. ఉదాహరణకు, ఫ్రెడ్ హాంప్టన్ హైస్కూల్ చదువులో ఉన్నప్పుడు, నేషనల్ అసోసియేషన్ పోలీస్ అధికారులకు మెరుగైన వేతనాలివ్వాలని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించింది. ఇది ఎక్కువమంది “ప్రొఫెషనల్” పోలీస్ అధికారులను నియమిస్తే పోలీసుల క్రూరత్వం తగ్గుతుందని వారు అభిప్రాయ పడ్డారు.
సుమారు ఈ సమయంలోనే, డాక్టర్ మార్టిన్ కింగ్ జూనియర్ తాను స్థాపించిన సంస్థ సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ (Southern Christian Leadership Conference)తో పట్టణ విభజనకు వ్యతిరేకంగా ఉత్తరాన ఉన్న వెలివాడలలో శాంతియుతంగా నిరసనలను చేపట్టడానికి చికాగోకు వచ్చారు. 1960లలో నల్లజాతీయులలో వెల్లువెత్తిన తిరుగుబాట్లకు ప్రతిస్పందనగా ఈ నిరసనలు నిర్వహించబడ్డాయి. మాల్కం, అతని అనుచరులు సమాజంలో మార్పు రావాలంటే రాడికల్ రాజకీయ పోరాటాలతో ఎటువంటి ప్రయోజనమూ ఉండదని, శాంతియుత నిరసనలతో మార్పు తీసుకురావొచ్చని ప్రజలకు నేర్పించాలని ఆశించారు. ఫ్రెడ్ హాంప్టన్, నేషనల్ అసోసియేషన్ తో కలిసి ఈ ఆశయాలకు మద్దతుగా పని చేశారు.
వెలివాడలలోని నిరుపేద నల్లజాతీయులు శ్వేతజాతి సమాజంతో ఏకీకరణే పరష్కారం అని చూపించే బదులు, 1966 లో చికాగోలో వారికి ఎదురైన అనుభవాలు మాల్కం, ఫ్రెడ్ హాంప్టన్ ఇంకా కొంతమంది రాడికల్స్ గా మారడానికి దారి తీసింది. వారు విభజనకు వ్యతిరేకంగా కవాతు చేస్తున్నప్పుడు, నాజీల వేష ధారణలో ఉన్న శ్వేతజాతీయులు కోపంతో ఊగిపోతూ, పెద్ద స్వస్తిక్ జెండాలను పట్టుకుని మార్చ్ చేస్తున్న వారిపై రాళ్ళను విసురుతూ ఇంకా అనేక మార్గాలలో దాడి చేసిన ఒక గుంపును ఎదుర్కొన్నారు. నేషనల్ అసోసియేషన్ సభ్యులు అహింసాత్మక విధానంలో నిరాయుధంగా చేస్తున్న శాంతియుత కవాతులు, శ్వేతజాతీయుల హింసాత్మక దాడులను ఎదుర్కోవడానికి వారు ఏవిధంగానూ సన్నద్ధులుగా లేరు. ఈ మార్చ్ సమయంలో, ఫ్రెడ్ హాంప్టన్ వయసు 16 సంవత్సరాలు. ఈ హింసాత్మక దాడులకు ఎదురొడ్డి నిలుస్తూ అహింసాపద్ధతిలో కవాతు కొనసాగించలేనని మాల్కంతో చెప్పాడు. చికాగోలో అత్యంత జాత్యహంకార ఇరుగు పొరుగు ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిన సిసిరో ద్వారా తర్వాత మార్చ్ చేయవలసి ఉండగా ఆ సమయంలో దానిని మాల్కం విరమింపజేశాడు. జాత్యహంకారవాదులు, నియో-నాజీలలాంటి శ్వేతజాతీయుల నుండి హింసాత్మక దాడులను ఎదుర్కోవడానికి అతను ఇష్టపడకపోవడం, కనీసం ఆత్మరక్షణను కూడా వ్యతిరేకించే అతని మధ్యతరగతి స్వభావంతో చాలామంది భ్రమలు పటాపంచలయ్యాయి.
నిజానికి మాల్కం చికాగోలో ఉన్న సమయంలో ప్రగతిశీల ఆలోచనల దిశగా తనని తాను తీర్చిదిద్దుకుంటున్న సంధికాలం. ఆ సమయంలోనే అతను అమెరికాలోని మురికివాడలు “అంతర్గత వలసవాదం” ల ప్రతిరూపాలని చెప్పాడు. అంతేగాక “చికాగో పార్కులలో స్వస్తికలు (దైవత్వం, ఆధ్యాత్మికలను సూచించే నాజీయిజం, నియో నాజీయిజం గుర్తులు) పొరపాటుగా పుట్టించిన కలుపు మొక్కల వలె వికసిస్తున్నాయి” అని కూడా పేర్కొన్నాడు. “నేను దక్షణ ప్రాంతమంతా తిరిగి అనేక ప్రదర్శనలలో పాల్గొన్నాను, కానీ నేను చికాగోలో చూస్తున్నంత తోటి మనుషులపట్ల నిలువెల్లా ద్వేషంతో నిండిన, శత్రు పూరితమైన సమూహాలను చివరికి మిసిసిపీ, అలబామాలలో కూడా చూడలేదని చెప్పగలను” – అని మాల్కం అన్నాడు. ఇది మాల్కంకి అమెరికన్ సమాజంలో నల్లజాతీయుల దీనస్థితిని అర్ధం చేసుకోవడానికి అవకాశం కలిగించిన ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. శ్వేతజాతీయుల దుర్మార్గమైన ఆధిపత్యం ఒక క్రమమైన ప్రణాళికా బద్ధమైనరీతిలో నల్లజాతీయుల ఆర్ధిక, రాజకీయ హక్కులను రద్దు చేస్తున్న విధానాన్ని అర్ధంచేసుకోవడానికి మాల్కంకి ఇది బాగా తోడ్పడింది.
ఫ్రెడ్ హాంప్టన్, చికాగోలోని నల్లజాతీయులు, అనేక ఇతర నల్లజాతి యువకుల మాదిరిగానే మాల్కం విఫలమైన ప్రచారం తర్వాత పౌరహక్కుల ఉద్యమం పట్ల ప్రత్యేకించి గొప్ప భ్రమలకు లోనయ్యాడు. సంస్కరణవాద వ్యూహాలు అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లో అహింసపై విశ్వాసం శ్వేతజాతీయుల, పోలీసుల దాడుల నుంచి ఉద్యమాన్ని ఎలా రక్షించుకో లేకపోయిందో అనే విషయాన్ని వారు ప్రత్యక్షంగా చూసి అవగాహన చేసుకున్నారు.
ఫ్రెడ్ హాంప్టన్ మాల్కం ఎక్స్, మావో జెడాంగ్ రచనల వైపుకి తన దృష్టిని సారించాడు. అతను నల్లజాతీయులకు వ్యవస్థీకృత ఆత్మరక్షణ ప్రాముఖ్యతపై మాల్కం రాసిన రచనలను చదివాడు. చైనా ప్రజలు జపనీస్ ఫాసిస్టు దండయాత్రను, అమెరికా మద్దతునిస్తున్న జాతీయవాద పార్టీనీ ఎలా తుద ముట్టించగలిగారు అనే విషయం గురించి మావో రచనలను కూడా చదివాడు. ఇవేగాక ఇతర విప్లవాత్మక రచనలు ఫ్రెడ్ హాంప్టన్ ని ఉత్తేజపరిచాయి. అమెరికాలో, ప్రత్యేకించి నల్లజాతీయులలో విప్లవాత్మక ఉద్యమ తక్షణావశ్యకత గురించి ప్రేరేపించేలా చేశాయి.
తర్వాత 1967, మే లో కాలిఫోర్నియా స్టేట్ హౌస్ దగ్గర బ్లాక్ పాంథర్ పార్టీ తమ నిరసన ప్రదర్శనను నిర్వహించింది. ఫ్రెడ్ హాంప్టన్ తో పాటు దేశంలోని నల్లజాతి యువకులందరూ దీనినుంచి గొప్ప స్ఫూర్తిని పొందారు. ఫ్రెడ్ హాంప్టన్, కొంతమంది నల్లజాతి యువకులూ కలిసి చికాగో శివార్లలో మరింత మిలిటెంట్ ఆర్గనైజింగ్ వ్యూహాలను రూపొందించారు. ఫ్రెడ్ హాంప్టన్ మేవుడ్ విలేజ్ బోర్డ్ ముందు సామూహిక పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ అవసరం గురించి గట్టిగా వివరించడానికి సిద్ధమైనప్పుడు, నల్లజాతి యువకుల వచ్చి సమూహం వచ్చి సాక్ష్యామివ్వడానికి వీలుగా అతను ఇతరులతో కలిసి తగిన ఏర్పాట్లు చేశాడు. విలేజ్ బోర్డ్ వారందరినీ లోపలికి అనుమతించడానికి నిరాకరించింది. భవనం వెలుపల వీధిలో వారు శాంతియుత నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. వందలాది నల్లజాతి యువకుల నిరసనను చూసిన పోలీసులు బహుశా భయపడి – ఆ యువకులపై టియర్ గ్యాస్ తో దాడి చేసి అనేకమందిని అరెస్ట్ చేశారు. ఫ్రెడ్ హాంప్టన్ ఆ సమయంలో లోపల మీటింగ్ లో ఉన్నాడు. కానీ తర్వాత అతన్ని నల్లజాతి యువకుల్ని ఆర్గనైజ్ చేసినందువల్ల, “మాబ్ యాక్షన్” అభియోగంతో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ “ఆందోళనలకు మూల కారకుల” (Key Agitator Index) లిస్ట్” లో ఫ్రెడ్ హాంప్టన్ ని ఎఫ్ బి ఐ ముందుంచింది. ఇక పోలీసులు వారిదైన పద్ధతుల్లో ఘోరమైన వేధింపులు కొనసాగించారు. అప్పుడు ఫ్రెడ్ హాంప్టన్ వయసు 17 సంవత్సరాలు. ఈ నిరసన వల్ల నేషనల్ అసోసియేషన్, బ్లాక్ పాంథర్ పార్టీ నుంచి స్పష్టంగా విడిపోయింది. వారు నిరసనలను స్పష్టంగా వ్యతిరేకించనప్పటికీ, ఫ్రెడ్ హాంప్టన్ – ఇతర నల్లజాతి యువకులపై పోలీసుల క్రూరత్వాన్నీ, అన్యాయమైన అసంబద్ధ అరెస్టులను ఖండించడానికి నిరాకరించారు.
చికాగో పార్టీ స్థాపన – పెరుగుదల
దాదాపు ఇదే సమయంలో ఎస్ ఎన్ సి సి అనే అహింసా విద్యార్ధి కోఆర్డినేటింగ్ కమిటీ (Student Non-Violent Coordinating Committee – SNCC) చికాగోలో తన కార్యాలయాన్ని స్థాపించింది. స్టోక్లీ కార్మైకల్, హెచ్.రాప్ బ్రౌన్ సమ్మర్ సందర్భంగా మిసీసీపీలో ఎస్ ఎన్ సి సి తో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో నల్లజాతీయుల ఓటర్లను అణచివేయడానికి డెమోక్రాటిక్ పార్టీ KKK తో చేతులు కలిపి ఏ విధంగా పని చేసిందో వారు బహిర్గతం చేశారు. K K K అనేది Ku Klux Klan కు కుదించబదిన పేరు. ఇది అనేక చారిత్రాత్మక, ప్రస్తుత అమెరికన్ శ్వేతజాతి ఆధిపత్యవాద, మితవాద, తీవ్రవాద, ద్వేషపూరిత సమూహాలకు సంబంధించిన పేరు (First klan:1865-1872, second Klan: 1915-1944, Third Klan: 1946/1950-present in existence). ఫ్రెడ్ హాంప్టన్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న లెక్కలేనంతమంది ఇతర నల్లజాతి యువకుల లాగా ఎస్ ఎన్ సి సి అత్యంత తీవ్రమైన పద్ధతిలో పని చేస్తుంది. వారు కూడా పౌరహక్కుల ఉద్యమంతోనూ, ఎన్నికల రాజకీయాలతోనూ విసిగిపోయి ఉన్నారు. పాంథర్స్ ప్రేరణతో స్ఫూర్తి పొంది, ఎస్ ఎన్ సి సి ఇంకా ఇతరులు విప్లవం గురించి, శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణాన్ని కూలదోయవలసిన అవసరం గురించి మాట్లాడటం ప్రారంభించారు. రాజకీయ వ్యవస్థ – ప్రభుత్వం ఈ అధికార నిర్మాణంలో ఒక భాగమని, అందువల్లే దీనిని ప్రాధమికంగా మార్చలేమని దేశవ్యాప్తంగా ప్రజలు బాగా అర్ధం చేసుకుంటున్నారు.
ఫ్రెడ్ హాంప్టన్ పాంథర్స్ లో చేరిన కొత్త ఎస్ ఎన్ సి సి సభ్యుల గురించి తెలుసుకుంటున్నాడు. ఓకలాండ్ లోని బ్లాక్ పాంథర్ పార్టీ ప్రధాన కార్యాలయంతో మాట్లాడిన తర్వాత, ఫ్రెడ్ హాంప్టన్ చైర్మన్ గా పార్టీ చికాగో విభాగాన్ని ఏర్పరిచారు. కేవలం ఆరంటే ఆరు నెలలలోనే వారు చాలా ఎక్కువ సంఖ్యలో సభ్యులను సంపాదించుకున్నారు. ఇప్పటికే ఉన్న సభ్యత్వాన్ని ఏకీకృతం చేయడమేగాక అంతర్గతంగా మరింత వ్యవస్థీకృతం చేయడంమీద దృష్టి పెట్టడానికి కొత్త సభ్యులను ఆమోదించడాన్ని వారు తాత్కాలికంగా నిలిపి వేయ వలసి వచ్చింది!
ఈ అధ్యాయంలోని వ్యాసంలో తర్వాత విశ్లేషించబడే వివిధ సమస్యలున్నాయి. కానీ దిన దినాభి వృద్ధి చెందుతున్న పాంథర్స్ కి లభించిన సామూహిక మద్దతు వారి పనితీరు నల్లజాతి ప్రజలను ఎంత ఆకట్టుకుంటుందో, చికాగో లోని ప్రజానీకం విప్లవ రాజకీయాలకు మద్దతు ఇవ్వడానికి ఏ విధంగా సంసిద్ధమయారో చూపిస్తుంది. ప్రత్యేకించి, పిల్లలకోసం అల్పాహార కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరం, మురికివాడలలో ముఠాలు పేద ప్రజలపై జరిపే హింస, మాదక ద్రవ్యాల వ్యాపారం వంటి సమస్యలను పరిష్కరించగలిగారు. అంతేగాక ఆ ప్రజల ముఖ్యమైన అవసరాలను పాంథర్స్ తీర్చగలిగారు. అమెరికా సమాజంలోని నిజమైన సమస్యలపై సరైన అవగాహన లేని మధ్యతరగతి సాంస్కృతిక జాతీయవాద సమూహాలకు వ్యతిరేకంగా కూడా పాంథర్స్ పెద్ద పోరాటమే చేశారు. ఈ సమూహాలు శ్వేతజాతి ఆధిపత్యం, పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదాల సంక్లిష్ట సంబంధాన్ని చూడడానికి బదులుగా ప్రతిదానినీ గుర్తింపు సమస్యగానూ, చర్మం రంగు సమస్యగానూ మార్చాలని చూస్తాయి.
చికాగోలో పాంథర్స్ విజయానికి చెప్పుకోదగ్గ గొప్ప కారణం ఏమిటంటే వారి అన్నీ పనులలో రాజకీయ విద్య నిరంతరంగా భాగంగా ఉంది. ఈ విద్య పార్టీ సభ్యులకు మాత్రమే గాక ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అందించారు. ఈ రాజకీయ విద్య గురించిన అవగాహన ప్రజలకు లేకపోతే విప్లవం కోసం సన్నద్ధం కాలేరని ఫ్రెడ్ హాంప్టన్ ఎల్లప్పుడూ నొక్కి చెప్పేవాడు, దాని పట్ల సరైన అవగాహన లేకపోతే శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణాలను పడగొట్టిన తర్వాత విప్లవాన్ని కొనసాగించలేరనేవాడు. అతను కెన్యా వలసవాద వ్యతిరేక పోరాటం వంటి ఉదాహరణలను చూశాడు, కెన్యాలో స్వాతంత్ర్య ఉద్యమం బ్రిటీష్ వారితో సహకరిస్తూ ఒక వర్గం ప్రజలు వారితో భాగస్వాములై పని చేశారు. చివరికి జోమో కెన్యట్టా ను వాళ్ళు ఒక నియంతగా, విదేశీ శక్తుల కీలుబొమ్మగా ప్రతిష్టించారు. “మీకు గనక రాజకీయ విద్య లేకపోతే ఇప్పుడు ఆఫ్రికాలోనూ, హైతీలోనూ ప్రజలు నియంత పాలనలో ఉన్నట్లు మీరు కూడా వలసవాదానికి బదులుగా నయా వలస వాదంలో ఇతర దేశాల నియంతృత్వంలో ఏ హక్కులూ లేకుండా ఉంటార” ని ఫ్రెడ్ హాంప్టన్ పదే పదే నొక్కి చెప్పేవాడు. ఈ పరిస్థితులు ఎప్పటికీ ఈ విధంగానే ఉండబోవడం లేదు. కానీ, “ప్రజలు నిజంగా అసలైన రాజకీయ విద్యావంతులైతే, శ్వేతజాతీయులనే గాక అణచివేతదారులు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, బ్రౌన్ గా ఉన్నా, పసుపు పచ్చగా ఉన్నా వారిని ద్వేషించి తీరాలనే విషయాన్ని కూడా ఫ్రెడ్ హాంప్టన్ పాఠం లాగా మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు.
మరీ ముఖ్యంగా ఫ్రెడ్ హాంప్టన్ అతని చికాగో శాఖలోని సహచరులు చైనీస్ విప్లవాన్ని ఒక ఉదాహరణగా చూశారు. చైనాలో పెట్టుబడిదారీ విధానాన్ని పునరుద్ధరించాలనీ, కొత్త అణచివేతదారులుగా మారాలని ఉవ్విళ్ళూరే వారికి వ్యతిరేకంగా పోరాడడానికి సాంస్కృతిక విప్లవ కాలంలో మావో, అతని అనుచరులు చేసిన కృషి ద్వారా వారు గొప్ప స్ఫూర్తిని పొందారు. తాము విప్లవానికి చాలా దూరంలో ఉన్నామని తెలిసినప్పటికీ, ప్రధానంగా చైనా విప్లవం నుంచి తాము నేర్చుకోవలసిన పాఠాలలో అత్యంత ముఖ్యమైనది అడుగడుగునా రాజకీయ విద్య అని వారు స్పష్టంగా తెలుసుకున్నారు.
అమెరికా విద్యా విధానం ఎంత అసమర్ధంగా, అసత్యంగా, లోపభూయిష్టంగా, జాత్యహంకారంతో ఉందో వారికి తెలుసు. బానిస – యజమానులైన “వ్యవస్థాపక తండ్రులు”, మూలవాసులైన రెడ్ అమెరికన్లను మారణ హోమం చేసి స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంలో సహాయ పడిన పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు – వీళ్ళ దృష్టి కోణం నుంచి పిల్లలకు చరిత్రను బోధిస్తున్నారని వారికి తెలుసు. ప్రపంచ సామ్రాజ్యంలోకి ప్రవేశించిన అమెరికా కార్పొరేట్ మీడియా, “ప్రజల మనస్సులను నియంత్రిస్తుంది” అంతేగాదు, “మీరు గనక జాగ్రత్తగా లేకపోతే వార్తాపత్రికలు అణచివేతకు గురవుతున్న వ్యక్తులను ద్వేషించేలా చేస్తాయి. అణచివేస్తున్న వ్యక్తులను ప్రేమించేలా చేస్తాయి” అని మాల్కం ఎక్స్ చెప్పిన అభిప్రాయాన్ని వారు హృదయపూర్వకంగా తీసుకున్నారు. ఈ పాఠాల కారణంగా, వారు పాంథర్ వార్తాపత్రికతో పాటు వివిధ రాజకీయ కార్యక్రమాల ద్వారా ప్రజలకు రాజకీయ అవగాహన కల్పించడానికి చాలా కృషి చేశారు.
పిల్లల అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా పాంథర్స్ నల్లజాతి కమ్యూనిటీలో ఒక ప్రధానమైన సామాజిక అవసరాన్ని తీర్చగలగడమే గాక బ్లాక్ సమాజంలోని చిన్నపిల్లలకు కూడా రాజకీయ విద్యనందించారు. చాలామంది శ్రామిక బడుగుజీవులైన నల్లజాతి తలిదండ్రులకు తమ చిన్నారులకు అల్పాహారం సమకూర్చేందుకు డబ్బూ లేదు, కాస్త వారి ఆలనా-పాలన చూసి మంచీ-చెడూ చెప్పడానికి సమయమూ ఉండదు. ఇంకా ఏమిటంటే, ఆ కాలంలో అమెరికా విద్యా వ్యవస్థ బహిరంగంగానే చాలా జాత్యహంకారంతో నిండి ఉండేది, తెల్లవాళ్ళ ఆధిపత్య పురాణాలూ, కథలూ పిల్లల పాఠ్యాంశాల్లో భాగంగా ఉన్నాయి.
బహిరంగ జాత్యహంకారం ఎక్కువగా జిమ్ క్రో సౌత్ కి మాత్రమే పరిమితమైందని ఈనాడు జనాదరణ పొందిన భావన. కానీ ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. అమెరికన్ సమాజంలో ఇది మొదటినుంచీ ఉన్న సంస్థాగతమైన ఒక భాగం, అది పాఠశాల వయసునుండే పిల్లల మెదళ్ళలో ఎక్కించడానికి పాఠ్యాంశాలలో చేర్చబడిందనే విషయం ఇప్పటికీ కూడా ముమ్మాటికీ నిజం. కాకపోతే ఇప్పడు విషయాలు అంతగా ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. హూయ్ పి. న్యూటన్ ఓక్లాండ్ లోని ఒక పబ్లిక్ స్కూల్ లో తన అనుభవాలను ఈ విధంగా వివరించాడు:
ఆకాలంలో, నల్లజాతి విద్యార్ధులపై పాఠశాల పసివయసు నుంచే అమెరికన్ వ్యవస్థ దాడి గురించిన గొప్ప పరిమాణం గానీ, తీవ్రత గానీ నాకు అర్ధం కాలేదు. నల్లగా ఉన్నందుకు నన్ను నేనే నిరంతరం నిందించుకుంటూ అసౌకర్యంగా ఫీలవుతూ సిగ్గుపడుతున్నాను అని మాత్రమే తెలుసు. ఈ భావన నన్ను ప్రతిచోటా ఎడతెరిపి లేకుండా వేధించింది. శ్వేతాజాతీయులందరూ “తెలివైనవారు” అనీ, నల్లజాతీయులందరూ “మూర్ఖులు” అనీ అమెరికన్ వ్యవస్థలో నిక్షిప్తమైన నిగూఢమైన, అవ్యక్త అవగాహన ఫలితంగా ఇది జరిగింది. ప్రారంభ తరగతుల్లో చదవడానికి ఉపాధ్యాయులు “మంచిది” అని చెప్పబడేదేదైనా ఎల్లప్పుడూ తెల్లజాతీయులకు సంబంధించినదే అయి ఉంటుంది అని చెప్పే కథలిచ్చేవారు. లిటిల్ బ్లాక్ సాంబో, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్, స్నో వైట్, సెవెన్ డ్వార్ఫ్స్ ల కథలు మేము ఏమిటో మాకు తెలియజెప్పాయి .
“చిన్నారి బ్లాక్ సాంబో పట్ల నా స్పందన నాకు బాగా గుర్తుంది. సాంబో, గురించి అసలు నిజం చెప్పాలంటే అతను చాలా పిరికివాడు. అతను పులులను ఎదుర్కొన్నప్పుడు, ఎటువంటి ప్రతిస్పందన లేకుండా అతనికి తండ్రి ఇచ్చిన బహుమతులను మొదట గొడుగు, తర్వాత అందమైన కాషాయరంగు, ఫెల్ట్- లైన్డ్ బూట్లు, ప్రతిదీ తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా ఒక్కటొక్కటిగా వదిలిపెట్టాడు. తర్వాత సాంబో పాన్ కేక్ లను మాత్రమే తినాలనుకున్నాడు. అతను స్లీపింగ్ బ్యూటీని రక్షించిన ధైర్యవంతురాలైన తెల్లని గుర్రం లాగా కాకుండా పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. గుర్రం మా స్వచ్ఛతకు చిహ్నం, అయితే సాంబో అవమానానికీ, చిన్నచూపుకీ దీనత్వానికీ, తిండిపోతు తనానికీ గుర్తుగా నిలిచాడు. తరచుగా, మేము లిటిల్ బ్లాక్ సాంబో కథ వింటుండేవాళ్ళం, అందరూ నవ్వుతూంటే మాకు నవ్వడం ఇష్టం లేదు, కానీ చివరగా, సాంబో నల్లతనానికి చిహ్నంగా, మా అవమానాన్ని దిగమింగుకోవడానికి ఏడవలేక నవ్వేవాళ్ళం.
“ప్రారంభ తరగతులలో బ్రేర్ రాబిట్‌లోని సాంబో, బ్లాక్ టార్ బేబీ కథలు వినడం ద్వారా నేను చాలా బాధపడ్డాను, నాలో గొప్ప దిగులు గూడుకట్టుకోవడం ప్రారంభించింది. ఇది వ్యవస్థ మామీద విధించిన అజ్ఞానం, ఆత్మన్యూనతల బరువు. నేను చూసిన ప్రైమర్‌లలో, సినిమాలలో శ్వేతజాతీయుల హీరోలతో నన్ను నేను ఐడింటిఫై చేసుకోవాలని కోరుకునేవాణ్ణి, కాలక్రమేణా నేను నల్లజాతీయుల ప్రస్తావనతో కుంగిపోవడం మొదలైంది. ఇది ఉపాధ్యాయులకు – నాకు మధ్య శత్రుత్వాన్ని సృష్టించింది, దీన్ని చాలా వరకు అధిగమించగలిగినప్పటికీ ఇప్పటికీ అలాగే ఉంది, ద్వేషం – ప్రశంసల వింత మిశ్రమం లాగా నల్లజాతీయుల పట్ల మా ఫీలింగ్స్ సాధారణమైపోయాయి. కానీ అంత చిన్న వయసులో తెల్లజాతి పిల్లలు ఏమి నేర్చుకోగలరో వాటిని మేము కూడా నేర్చుకోగలమనే తెలివిడి రాలేదు.
ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో హ్యూయ్ అనుభవాలు ఆ సమయంలో విలక్షణమైనవి. శ్వేతజాతీయుల ఆధిపత్య భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి దేశమంతటా శ్వేతజాతి పెట్టుబడిదారీ అధికార నిర్మాణం ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను ఉపయోగించుకుంది, అది ఇప్పటికీ ఉపయోగిస్తుంది. ఆ కాలంలో అది ఇప్పటికంటే చాలా స్పష్టంగా, ప్రచ్ఛన్నంగా ఉండే ది, కానీ జాత్యహంకారం, శ్వేతజాతీయుల ఆధిపత్యం ఈనాటికీ అంతర్లీనంగా కొనసాగుతుంది. పిల్లల కోసం అల్పాహార కార్యక్రమం అనేది కేవలం పిల్లలకు పౌష్టికాహారం అందించడం కంటే కూడా వారికి తెలియని ఒక సేవను అందించడం చాలా మంచిది అని స్పష్టం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఈ రాజకీయ కార్యక్రమం శ్వేతజాతి ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలకమైన భాగం. శ్వేతజాతి ఆధిపత్య పాఠశాల వ్యవస్థను ఎదుర్కోవడానికి, ఈ దేశంలో విప్లవాత్మక మార్పు ఆవశ్యకత గురించి పిల్లలకు, యువకులకు బాల్యంనుంచే అవగాహన కల్పించే ముఖ్యమైన ప్రయత్నం. ఈ దేశ వ్యవస్థలోని జాత్యహంకార స్వభావం గురించి, పెట్టుబడిదారీ విధానం గురించి వేతన-బానిసత్వపు గొలుసులలో ప్రజలను ఎలా బంధించిందో వారు తెలుసుకున్నారు. అమెరికా సామ్రాజ్యవాదం గురించి, బానిస తిరుగుబాట్లు, తెల్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నల్లజాతీయులు చేసిన పోరాటాల చరిత్ర గురించి వారు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం ఈ విద్యార్థుల తల్లిదండ్రుల మనసులను కూడా గెల్చుకోవడానికి దోహదపడింది. తమ పిల్లలకు అల్పాహారం చేసి పెట్టడానికి పాంథర్లు ఉదయాన్నే లేచి పనులు చేస్తున్నారని వారు తెలుసుకున్నారు. వారి పిల్లలు పాఠశాలలో ఎప్పుడూ నేర్చుకోలేని విధంగా విషయాలను నేర్చుకుంటున్నారని వారు గ్రహించారు. ఫలితంగా పిల్లల కోసం విజయవంతమైన బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రామ్‌లను నిర్వహించగలిగిన ప్రతిచోటా పాంథర్‌లకు సామూహిక మద్దతు పెరిగింది. ఎఫ్ బి ఐ, అమెరికా ప్రభుత్వాలు అప్రమత్తమైపోయి గట్టి నిఘా పెట్టడం ప్రారంభించాయి. అల్పాహార కార్యక్రమాలను కించపరచడానికీ, విచ్చిన్నం చేయడానికీ వాళ్ళు చేయగలిగిన కృషి అంతా చేశారు. 1969 మెమోలో, అప్పటి ఎఫ్ బి ఐ డైరెక్టర్ జె. ఎడ్గార్ హూవర్, “బ్లాక్ పాంథర్ పార్టీ ఉత్తమమైన, అత్యంత ప్రభావవంతమైన కార్యాచరణను చేపట్టింది. బ్లాక్ పాంథర్ పార్టీని తటస్థీకరించడానికి, నాశనం చేయడానికి అధికారులు జాగ్రత్తగా ప్రయత్నాలు ముమ్మరం చేయకపోతే ఇది అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తుంది” అని ఈ కార్యక్రమం గురించి హెచ్చరించాడు. ఇది దేనిని సూచిస్తుంది?
ఎఫ్ బి ఐ పాంథర్ల పనిని అప్రతిష్ట పాలు చేయడానికి కమ్యూనిస్టు వ్యతిరేక పురాణాలను ప్రచారం చేసింది. ఎర వేసి అంటే పిల్లల అల్పాహార కార్యక్రమాల వంటి వాటి ద్వారా ప్రలోభపెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారని పాంథర్లను “ఎర్ర – ఎర” గా వర్ణిస్తూ హేళన చేయడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ, బ్లాక్ పాంథర్ పార్టీ ప్రజలతోనే ఉండి, ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీర్చడంలో చాలా విజయవంతమైంది. అనేక నగరాల్లో వారి పనిని అణచివేయడానికి చేసిన ప్రభుత్వ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అది ఎలా జరిగిందో ఫ్రెడ్ వివరించాడు:
“పిల్లల కోసం పాంథర్లు నిర్వహించే ఈ అల్పాహార కార్యక్రమం ఒక సామ్యవాద కార్యక్రమం, ఇది ఒక కమ్యూనిస్టు కార్యక్రమం” అని పోలీసులు ప్రచారం చేశారు. మహిళలు, ‘కమ్యూనిజం అంటే ఇష్టమో కాదో నాకు తెలియదు. సోషలిజం అంటే ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలియదు. కానీ అల్పాహారం కార్యక్రమం నా పిల్లలకు ఆహారం ఇస్తుందని మాత్రం నాకు తెలుసు.’ – అని మహిళలు సమాధానం చెప్పారు. చాలా మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందసేవగా భావిస్తారు. కానీ అది ఏమి చేస్తుంది? అది ప్రజలను ఒక దశ రాజకీయ అభివృద్ధి నుంచి మరొక దశకు తీసుకెళ్తుంది. విప్లవాత్మకమైన ఏ కార్యక్రమం అయినా ముందుకు మునుముందుకు సాగే కార్యక్రమమే! విప్లవం అంటేనే మార్పు. మీరు మారుతూ ఉంటే, మీకు తెలియకముందే, అది ఏమిటో మీరు తెలుసుకోవలసిన అవసరం లేకుండానే మీరు దానిని సమర్థిస్తున్నారు, దానిలో పాల్గొంటున్నారు, సోషలిజానికి మద్దతు ఇస్తున్నారని అర్ధం.
ప్రారంభదశలో ఈ కార్యక్రమంతో ప్రజలు ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నారో ఇది నిజంగా గ్రహిస్తుంది. చాలామందికి అణచివేత, దోపిడీలేని వర్గరహిత సమాజం అంటే కమ్యూనిజానికి పరివర్తన ఎలా సాధ్యమవుతుంది, సోషలిజం స్వభావమేమిటి మొదలైన పెద్ద సైద్ధాంతిక ప్రశ్నలు, విషయాలతో అంతగా పరిచయం లేదు. అయినప్పటికీ, పిల్లల అల్పాహార కార్యక్రమం నల్లజాతి సమాజంలో ఎలా సానుకూల ప్రభావాన్ని చూపిందో పాంథర్స్ ప్రత్యక్షంగా చూశారు. అక్కడ నుంచి పాంథర్స్ గురించి విస్తృత కోణంలో వారికి స్పష్టం చేయడం మాత్రమే తర్వాత కార్యక్రమం కావాలి.
ఫ్రెడ్ హాంప్టన్, అతని సహచరులు ఇది స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన సేవ కాదని స్పష్టం చేయడానికి పనిచేశారు. వారు చేస్తున్న పని అవసరమైన వారికి ఆహారం ఇవ్వడం మాత్రమే కాదు. ప్రజలను రాజకీయమైన విద్యావంతులుగా చేయడం, వారిని సంఘటితపరిచి ఒక విప్లవానికి నాయకత్వం వహించే పెద్ద ప్రయత్నంలో ఇది భాగమని వివరించారు. దాతృత్వం అన్యాయమైన అసమాన సమాజపు లక్షణాలను మాత్రమే ఆవిష్కరిస్తుంది, విప్లవాత్మక సంస్థ దాని మూల కారణాలను వెతుకుతుంది. శ్వేతజాతి ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం ఆకలితో ఉన్న పిల్లలు, అనేక ప్రాథమిక అవసరాలు తీరని ప్రజలు ఉంటారని పాంథర్‌లకు తెలుసు. దాతృత్వం ఎన్ని దాతృత్వపు పనులు చేసినా అసమానతలతో నిండిన వ్యవస్థను మార్చలేదు. కానీ ఒక విప్లవోద్యమం మార్చగలదు. ఈ దేశంలోని రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ధనవంతులు మరింత ధనవంతులు కావడం, పేదలు మరింత పేదలుగా మారడంపై ఆధారపడి ఉన్నాయని పాంథర్లకు తెలుసు. కాబట్టి పిల్లలకు అల్పాహారం అందకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికే వారు కేవలం ఆహారాన్ని అందించడం లేదు, వారు విప్లవాత్మక ఉద్యమాన్ని నిర్మించడానికీ యువతకు విప్లవాత్మక విద్య నందించదడానికీ వీలైన కార్యక్రమాలను రూపొందించుకున్నారు.
ముఠా హింసల సమస్యను పరిష్కరించడం ద్వారా కూడా చికాగో నగరంలో పాంథర్స్ ప్రజల విశ్వాశాన్నీ, మద్దతునూ గెలుచుకున్నారు. ముఖ్యంగా నగరంలోని ముఠాలు కమ్యూనిటీల అంతటా మాదకద్రవ్యాలను విక్రయిస్తాయి, తరచుగా ప్రజలకు అపాయం కలిగించే సరిహద్దు యుద్ధాలతో పోరాడుతూ అణచివేతకు గురిచేస్తాయి. అలాగే, శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో వివక్ష చూపడం వల్ల – నల్లజాతి కమ్యూనిటీలో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతున్నాయి. తెల్ల జాతీయులు తమ పిల్లల్ని సంపన్నులవుతారని తప్పుడు వాగ్ధానాలు చేస్తూ ముఠాలలోకి లాగుతున్నారని చాలామంది నల్లజాతి తలిదండ్రులు ఆందోళన చెందారు.
ఈ ముఠాల్లో ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ముఠా లోని ప్రతి ఒక్కరూ వారి వారి స్వంత సమస్యలతో ఉన్నారు. వారు పాంథర్స్ ప్రయత్నాలను ముప్పుగా భావించారు. వారు తమ భూభాగంలో విప్లవాత్మకంగా సంఘటితం కావడాని కిష్టపడలేదు. కాబట్టి, ఈ ముఠాలతో ఘర్షణలను నివారించాలంటే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడమెలా అనే విషయం పాంథర్లకు సవాలుగా మారింది. ముఠాలలోని సభ్యులలో కొందరు పోలీసులతో కూడా సన్నిహితంగా పని చేస్తున్నారు. పోలీసులు నల్లజాతి సమూహాలను లాభాల వాటాలిస్తూ డ్రగ్స్ తో విషపూరితం చేస్తున్నారు.
ఈ విధమైన పరిస్థితుల్లో ముఠాలతోనూ, ముఠా సభ్యులతోనూ కలిసి పని చేయడం సాధ్యం కాదు. కానీ, చాలా విషయాల్లో పాంథర్లు కనీసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగారు. ఈ ఒప్పందాలు పాంథర్లు తమ కార్యకలాపాలను అమలు చేయడానికి, ఎటువంటి హింసాత్మక ఘర్షణలకు చోటు లేకుండా వారు తమ స్వంత ప్రాంతాలుగా భావించే పరిసరాల్లో పాంథర్ల వార్తా పత్రికను విక్రయించుకోవడానికి అనుమతించారు. ఇతర సందర్భాలలో, వారు మరింత గొప్ప విజయాలు సాధించారు. ఉదాహరణకు, ఫ్రెడ్ హాంప్టన్ బ్లాక్ డిసిపుల్స్ వీధి ముఠా నాయకుడు డేవిడ్ బార్క్స్ డేల్ (David Barksdale)ని కలిశాడు. అతను శ్వేతజాతీయుల ఆధిపత్య పెట్టుబడిదారీ వ్యవస్థలో బ్లాక్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న ప్రాధమికమైన సమస్యలను, పెద్ద సమస్యలను కూడా ప్రస్తావించి, బార్క్స్ డేల్ కు అర్ధం చేయించి ఆయనను ఒప్పించగలిగాడు. ఈ ప్రారంభ సంభాషణే బ్లాక్ డిసిపుల్ సరిహద్దును నిర్వహించడానికి పాంథర్లకు తలుపులు తెరిచింది. ఈ ముఠా తమ విధానాన్ని మార్చుకోవడం ప్రారంభించింది. తర్వాత పాంథర్లు పోలీసుల హింసలకు, క్రూరత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యకలాపాలలో కూడా వారు పాల్గొన్నారు.
అతను యంగ్ లార్డ్స్ – ప్యూర్టో రికన్ స్ట్రీట్ గ్యాంగ్ – తో కూడా ఇలాంటి చర్చలే జరిపాడు. వారు తమను తాము ఒక విప్లవాత్మక రాజకీయ యంగ్ లార్డ్స్ పార్టీగా ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శనం చేశాడు. ఇతర జాతీయతలకు చెందిన ముఠాలతో కూడా అతను ఇలాంటి ప్రయత్నాలే చేశాడు. అంతేకాదు గతంలో సమాఖ్య జెండాను ఎగరవేసిన యువ పేట్రియాట్స్ అని పిలవబడే తెల్లజాతి వీధి ముఠాపై కూడా ఫ్రెడ్ హాంప్టన్ విజయం సాధించగలిగాడు.
ఈ ముఠాల్లో చాలా వరకు తమ ముఠా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసాయి, రెయిన్‌బో కోయలిషన్ ఆఫ్ రెవల్యూషనరీ సాలిడారిటీ అని పిలవబడే వాటిలో పాల్గొనని వారు కూడా పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా బ్రోకర్‌లకు వ్యతిరేకంగా సంఘటితమయ్యారు. మాదకద్రవ్యాల వ్యాపారంతో ప్రజలమధ్య విభేదాలు సృష్టించడానికి బదులుగా వివిధ జాతుల నేపథ్యాల నుండి వచ్చిన సమూహాలు సైతం ప్రజల ఐక్యత కోసం చేసే పనుల్లో వారిని పాల్గొనేలా చేయడానికి ముఠాల మధ్య పాంథర్స్ సంధి కుదిర్చగలిగారు. ప్రజలను చీల్చిచెండాడే ప్రమాదకరమైన ముఠాలు, వ్యసనపరులై మాదకద్రవ్యాలను విక్రయించడం ద్వారా తమ జీవనాన్ని సాగించే ప్రజా-వ్యతిరేక శక్తులనుండి ముఠాలను విప్లవంలో పాల్గొనే ప్రజా-పక్ష శక్తులుగా మార్చడంలో పాంథర్స్ సాధించిన దశలలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ ప్రక్రియలోని ఉమ్మడి పోరు చాలా కష్టంతో కూడుకున్నది. కొంతమంది ముఠా సభ్యులు తిరోగమన భావాలు కలిగి ఉన్నప్పటికీ అంతులేని సహనంతో పాటు దోపిడీ ఆలోచనలకు వ్యతిరేకంగా చేసిన కొట్లాటలతో సహా చాలా పోరాటాలు ఉన్నాయి.
పాంథర్లు ముఠాలన్నింటినీ మార్చే ప్రక్రియ ఇంకా పూర్తి చేయలేనప్పటికీ విప్లవాత్మక కార్మిక వర్గ నాయకత్వం, లుంపెన్-శ్రామికవర్గ సభ్యులను విప్లవ రాజకీయాల దిశకు మళ్ళించి వారి మనసులను గెల్చుకునే స్పష్టమైన మార్గాన్ని చూపించింది. ఈ పని ముఖ్యంగా చికాగోలో గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంది, ఎందుకంటే ఇంతకుముందు ఇది విప్లవోద్యమంలో లుంపెన్ శ్రామికవర్గ సభ్యులు ఎలా చొరబడి అది విధ్వంసమవడానికి కారణమైందో చూపించింది, కానీ ఇప్పుడది విభిన్న జాతులే గాక వివిధ జాతీయ నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలను ఏకం చేసింది.
అమెరికా వంటి విస్తృతమైన వైవిధ్యభరితమైన దేశంలో రకరకాల స్వజాతీయతలకు చెందిన శ్రామిక వర్గ ప్రజలు చాలా పెద్దసంఖ్యలో ఉన్నారు, ఈ వివిధ జాతుల ప్రజలు విప్లవంలో ఐక్యంకావడానికి మార్గాలను కనిపెట్టి, వాటిని దినదినాభివృద్ధి చేయడం చాలా అవసరం. ఇక్కడ నివసిస్తున్న అన్ని దేశాల ప్రజల ఉమ్మడి కృషి ద్వారానే ఈ దేశాన్ని నడిపిస్తున్న శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ వర్గాన్ని మనం కూలదోయగలం. విప్లవం ద్వారా వాటిని పడగొట్టిన తర్వాత మాత్రమే సోషలిజాన్ని స్థాపించడం సాధ్యమవుతుంది. అప్పుడే అన్ని అసమానతలు, అణచివేతలకు మూలకారణాలైన ఆధార పీఠాన్ని ఒక క్రమపద్ధతిలో నాశనం చేయడం ప్రారంభమవుతుంది.
సామాజిక సమస్యలను అధిగమించడానికీ, ప్రజల జీవితాలను సులభతరం చేయడానికీ ముఖ్యమైన చర్యలను విప్లవానికి ముందు తీసుకోలేమని దీని అర్థం కాదు-పాంథర్స్ కార్యక్రమాలను ఎంతో నిబద్ధతతో చేసిన ఈ ప్రయత్నాలు వారి ప్రాధాన్యతలను చూపుతాయి. కానీ అణచివేతదారుల మూలాలను నాశనం చేయగలిగిన తర్వాత మాత్రమే అది చాలా సమస్యలను నూటికి నూరు పాళ్ళూ పరిష్కరించడానికి నిజంగా సాధ్యమవుతుంది! ఎందుకంటే ప్రజలపై వారి అధికారాన్ని, మితిమీరిన పెత్తనాన్ని కొనసాగిస్తూ విస్తరించడానికి, అణచివేత దారులకి వారి స్వార్థ ప్రయోజనాలూ, ఆసక్తులూ తరతరాలనుంచి పేరుకు పోయాయి. మనం వారి శక్తిని ధ్వంసం చేసి, అధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టిన తర్వాతే నిజమైన ప్రణాళికా బద్ధమైన మార్పు మొదలవుతుంది.
COINTELPRO – (Counterintelligence Programme) చికాగోలోని లుంపెన్ లైన్
చికాగోలోని బ్లాక్ పాంథర్ పార్టీ అపారమైన విజయాలు సాధించినప్పటికీ రాష్ట్ర అధికారుల దృష్టి నుంచి తప్పించుకోలేదు. ఫ్రెడ్ హాంప్టన్ తన 17 సంవత్సరాల వయసు నుండి కేవలం నేషనల్ అసోసియేషన్ (NAAC) తో శాంతియుత నిరసనలను నిర్వహిస్తున్నందుకు ఎఫ్ బి ఐ వాచ్-లిస్ట్ లో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ, కార్యకర్తలపై సాధారణ నిఘాకు అతీతంగా-ఇది ఒక ఆగ్రహం, సంస్థాగతమైన జాత్యహంకారానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు నిర్వహించే యువకులను కూడా ఎఫ్ బి ఐ పర్యవేక్షించేలా చేయడమనేది నిజమైన ప్రభుత్వ జాతి వ్యతిరేక స్వభావాన్ని చూపుతుంది – ఎఫ్ బి ఐ జాతీయ స్థాయిలో మరీ ముఖ్యంగా చికాగోలో పాంథర్స్ కు అంతరాయం కలిగించడానికి అన్ని రకాల విధ్వంసకర ప్రయత్నాలూ చేసింది.
నిజానికి పాంథర్స్ ను చికాగో అధ్యాయం ఏర్పడినప్పటి నుండి ఎఫ్ బి ఐ నిశితంగా పరిశీలించింది. బ్లాక్ పాంథర్ పార్టీ పెరుగుదల, దాని విస్తృతమైన వ్యాప్తి గురించి ఎఫ్ బి ఐ చాలా ఆందోళన చెందింది, 1967 చివరికి చికాగో శాఖ ఏర్పడినాక, వాస్తవానికి తన మొదటి సభ్యులలో ఒకరిగా ఒక ఇన్‌ఫార్మర్ ను ఎఫ్ బి ఐ బ్లాక్ పాంథర్ పార్టీలో చొప్పించ గలిగింది. విలియం ఓ’నీల్ (William O’Neal) యుక్తవయసునుండే వరుస నేరాలకు పాల్పడేవాడు. అతను కార్లను దొంగిలించేవాడు, ప్రజల విలువైన వస్తువులను దొంగిలించడానికి వారి ఇళ్లలోకి చొరబడేవాడు, అలాంటి మరెన్నో దుష్టపు పనులు చేసేవాడు. చివరికి అతను ఎఫ్ బి ఐ కి పట్టుబడ్డాడు, అప్పుడు ఎఫ్ బి ఐ అతనికి ఒక ఒప్పందం చెప్పి దానికి ఒప్పుకునేలా బలవంతం చేసింది. ఆ ఒప్పందమేమిటంటే అతను వారితో సహకరించి, ఇన్‌ఫార్మర్‌గా మారి బ్లాక్ పాంథర్ పార్టీలో చేరినట్లయితే, అతనింతకుముందు చేసిన నేరాల అభియోగాలన్నీ రద్దు చేస్తామనీ, అంతేగాక అతనికి వారానికి వంద డాలర్లు చెల్లిస్తామన్నారు. అది ఆ కాలానికి చాలా మంచి జీతం, ఇప్పటి ఏడువందల ఇరవైరెండు డాలర్లకు సమానం. ఎఫ్ బి ఐ పేరోల్ లో చేరిన కొద్దిసేపటికే వాళ్ళు ఓ’నీల్ ని వెళ్లి బ్లాక్ పాంథర్ పార్టీలో చేరమని ఆదేశించారు. ఆ రకంగా ఓ’నీల్ చికాగో శాఖలో ఐదవ సభ్యుడు అవుతాడు.
చికాగో పోలీసు డిపార్ట్ మెంట్, ఎఫ్ బి ఐ లు ఫ్రెడ్ హాంప్టన్ ని మోసపూరితంగా వశం చేసుకుని అతన్ని హత్య చేయడానికి వీలుగా ఆ రాత్రి అతనికి మత్తుమందు ఇచ్చింది ఇతనే!
ఓ’నీల్ కథ చాలా ముఖ్యమైనది ఎందుకంటే చికాగో పాంథర్స్ లుంపెన్-ప్రోలెటేరియట్‌లను విప్లవ రాజకీయాల వైపు దిశానిర్దేశం చేయడంలో చాలా విజయాలు సాధించినప్పటికీ, వారు కొంతమేరకు పార్టీలో లుంపెన్ లైన్ ద్వారా కూడా ప్రతికూలంగా ప్రభావితమయ్యారని తెలుస్తుంది. ఓ’నీల్ మొదట పార్టీలో చేరడానికి కార్యాలయానికి వచ్చినప్పుడు అతనికి ఏర్పడిన అభిప్రాయం గురించి చెప్పడం కష్టమైనప్పటికీ, కాలక్రమేణా అతనికి విప్లవ రాజకీయాల పట్ల అసలు ఆసక్తి లేదని పాంథర్స్ కు స్పష్టమై ఉండాలి. అతని ధైర్య సాహసాలు జరుగుతున్న దోపిడీలు, ఇతర నేరాల గురించి గొప్పగా చెప్పుకునే ధోరణి కూడా ప్రధాన గుర్తులుగా ఉండాలి. ఓ’నీల్, ఒక ఇంటర్వ్యూలో బాల్యం నుంచి తాను పోలీసుల పట్ల ఆరాధనతో పెరిగానని వాళ్ళలాగా “గౌరవం” పొందడం కోసం తానే ఒక పోలీసు కావాలని కోరుకుంటున్నానని అంగీకరించాడు. పోలీసు కావడం సాధ్యం కానప్పుడు, అతను నేరాల వైపుకి మళ్ళాడు. ఎఫ్ బి ఐ కి గూఢచారి అయిన తర్వాత “అమెరికాలో అత్యుత్తమమైన పోలీసు సంస్థ కోసం ఎంతో కొంత మంచిపని చేస్తున్నందుకు అతను “చాలా గర్వంగా” భావిస్తున్నానని చెప్పాడు.
ఓ’నీల్ కలిగి ఉన్న ఈ వినాశనకరమైన అంగుష్ఠమాత్రపు అభిప్రాయాలు వివిధ మార్గాల్లో బయటకు వచ్చాయి. పీపుల్స్ లా ఆఫీస్ వ్యవస్థాపక సభ్యుడు, పాంథర్స్ కు కూడా రాడికల్ లాయర్ అయిన జెఫ్రీ హాస్, ఫ్రెడ్ హాంప్టన్ ను ఎఫ్ బి ఐ ఎలా హత్య చేసిందో బహిర్గతం చేసిన కీలక న్యాయవాదుల్లో ఒకరు. ఆయన తన పుస్తకం “ది అసాసినేషన్ ఆఫ్ ఫ్రెడ్ హాంప్టన్”(The Assassination of Fred Hampton) లో ఓ’నీల్ వైఖరిని వివరించాడు:
ఓ’నీల్ దొంగతనాలు చేస్తూ దొరకకుండా దెబ్బలనుంచి ఎలా తప్పించుకునేవాడో అనే విషయాన్ని చెప్తూ అతను తన గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాడు. నేర కార్యకలాపాల పట్ల అతనికున్న వ్యామోహం అతను ఇన్‌ఫార్మర్ గా నిలకడగా ఉండలేడేమోననుకుని అతను ఇన్‌ఫార్మర్ కాకపోవచ్చునని ఊహించాను; అతని ముఖం అలా తోచలేదు ఓ’నీల్ ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడలేదు గానీ అతను తరచుగా ఆయుధాలను ప్రయోగించే చర్యలను ప్రతిపాదిస్తుండేవాడు. అతను ఎఫ్ బి ఐ కి పనిచేస్తున్న ఒక గూఢచారి అనే వెలుగులో నేను ఓ’నీల్ ప్రవర్తనను పునఃపరిశీలించాను. ఇది కాస్త అసౌకర్యంగా బాగానే సరిపోయింది. అతని వాలెట్ లో ఎప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండేది; అతను తన పెద్ద కారులో షికార్లు చేస్తూ ఫ్రెడ్ హాంప్టన్, రష్, డెబోరాలను అతని కారులో తనతో రమ్మని ఆహ్వానిస్తుండేవాడు; రాజకీయ విద్యా తరగతులకు అతను ఏనాడూ హాజరుకాలేదు, ఆలోచించి చర్యలకు సిద్ధమవ్వాలని చెప్తూ, రాజకీయాల్లో అతను అత్యంత సైనిక రేఖను సమర్థించేవాడు; అతను తరచుగా తుపాకీని వెంట తీసుకువెళ్ళేవాడు; ఇతర పాంథర్లను నేర కార్యకలాపాలలో పాల్గొనాలని అతను నిరంతరం సూచిస్తూ ఉండేవాడు.
ఓ’నీల్ ప్రవర్తనలో అనేక ఉపరితల అంశాలకు సంబంధించిన గందరగోళంగా హెచ్చరించే సంకేతాలు మాత్రమే ఉన్నాయని హాస్ వర్ణన స్పష్టం చేస్తుంది. ఒక రాడికల్ లాయర్ ఈ విషయాలను అవి ఉన్నవి ఉన్నట్లు చూడకపోవచ్చు. అయితే, హాస్ వివరించే ప్రవర్తన ప్రతి-విప్లవాత్మకమైనది, ప్రజలకు వ్యతిరేకమైనది అని విప్లవకారులు స్పష్టంగా తెలుసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ, ఈ విధమైన ప్రవర్తనలో ఖచ్చితంగా మోసగాళ్ళనూ, ఏజెంట్లనూ రెచ్చగొట్టేవారి లక్షణాలే ఉంటాయి. ఓ’నీల్ మొదటిసారిగా పాంథర్స్ స్థానిక చికాగోశాఖలో చేరినప్పుడు ఎలక్ట్రానిక్స్, ఫైర్ ఆర్మ్స్ కి సంబంధించిన వాటిపై తన విషయ పరిజ్ఞానాన్ని సెక్యూరిటీ నాయకుడిగా స్థానం సంపాదించడానికి ప్రదర్శించాడు. విమర్శల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఈ నాయకత్వ స్థానాన్ని తర్వాత ఉపయోగించుకున్నాడు.
ఇవన్నీ చికాగో శాఖ అధ్యాయాన్ని ఈ లుంపెన్ లైన్ ఎలా ప్రభావితం చేసిందో చూపుతాయి. లుంపెన్-శ్రామికవర్గం అత్యంత విప్లవాత్మకమైన తరగతి అని పార్టీ సమర్థించినందువలన, దోపిడీలు, దొంగతనాల వంటి కార్యకలాపాలను పాంథర్స్ తగినంత విమర్శనాత్మకంగా చూడలేదు. ప్రజలు అనేక విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారు, ఆఖరికి-సాయుధ దోపిడీ చరిత్ర ఉన్నవారు కూడా తమ మార్గాలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే రాజకీయాల్లో చేరవచ్చు. అయితే, ప్రజలు విప్లవ రాజకీయాలలో పాల్గొంటున్నప్పుడు కూడా దోపిడీల వంటి ఇతర సారూప్య కార్యకలాపాలలో నిమగ్నమైతే, దానిని ప్రధానమైన ప్రమాద సంకేతంగా గుర్తించాలి. ప్రత్యేకించి ఓ’నీల్ విషయంలో అతను వ్యక్తిగత లాభం కోసం దోపిడీలు చేస్తూ, ఇతరులను అతనితో చేరమని ప్రోత్సహించడానికి ప్రయత్నించినప్పుడు, బ్లాక్ పాంథర్ పార్టీ వాటిని ప్రధాన హెచ్చరిక సంకేతాలుగా భావించి ఉండవలసింది.
అదీ గాక, అతను అన్ని రాజకీయ తరగతులను ఎగ్గొట్టడం, నిరంతరం సాయుధ చర్యలను, విప్లవ రాజకీయాలపై మిలిటరిస్టిక్ రేఖను సమర్ధించే ఓ’నీల్ ధోరణి, ప్రజలకు సేవ చేయడం, విప్లవాత్మక చరిత్ర నుండి నేర్చుకోవడం వంటి విధులను విస్మరించడమేగాక వాటిపై అతనికి ఆసక్తి లేదని కూడా గమనించాలి. దానికి బదులుగా అతను రాజకీయాలను ప్రధానంగా ధైర్యసాహసాలు అధికారులతో సాయుధ సంఘర్షణగా రూపొందించడానికి ప్రయత్నించాడు. రాష్ట్రం నుండి, దాని దుండగుల హింసాత్మక దాడుల నుండి తనను తాను రక్షించుకోవడానికి ఒక విప్లవ పార్టీకి ఆయుధాలవసర మవుతాయి, కాబట్టి ఆయుధాలు కలిగి ఉండటమనేది దానికదే చెడు విషయం కాదు. నిజానికి అవసరమైనప్పుడు ఆయుధాలుపయోగించి పాలకవర్గాన్ని దానితో మమేకమైన శ్వేతజాతి ఆధిపత్య వ్యవస్థను కూలదోయవలసిన అవసరం కూడా ఉంది. ఈ దేశాన్ని నడుపుతున్న జాత్యహంకార పెట్టుబడిదారీ వర్గాలను సమరశీల పోరాటాలు లేకుండా గద్దె దింపలేవు, కాబట్టి విప్లవంలో వాటిని విజయవంతంగా పడగొట్టడానికి సైనిక వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో సమస్య లేదు. అయితే, ఇది ఖచ్చితంగా ఓ’నీల్ చేస్తున్న విధానం ద్వారా మాత్రం కాదు.
ప్రజలను విద్యావంతులను చేయడానికి వ్యవస్థీకరించడానికి అవసరమైన రాజకీయ అవగాహన నివ్వకుండా, చివరికి ఓ’నీల్ వంటి వారు పాలక వర్గాన్ని పడగొట్టడానికి సాయుధ తిరుగుబాటుకు సిద్ధంగా ఉంటారు, ఆయన పోలీసులతో అపరిపక్వ దశలో హింసాత్మక ఘర్షణలకు ప్రేరేపించాడు. ఈ విరమణ ప్రయత్నాలు కౌంటర్ ఇంటలిజెన్స్ ప్రోగ్రామ్ ఎత్తుగడలలో కనిపించిన వాటి కంటే కూడా పాంథర్స్ పై భారీ అణిచివేతకు దారితీయవచ్చు. బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో అధ్యాయం గరిష్టంగా 500 మంది సభ్యులకు చేరుకుంది, పాంథర్స్ వార్తాపత్రిక వారానికి పది వేల కాపీలు అమ్ముడవుతుండేవి. అయినప్పటికీ, ఇంత గణనీయమైన సంఖ్యాబలం కూడా చికాగోలో అధికార-నిర్మాణాన్ని కూలదోయడానికి అవసరమైన సంఖ్యకు దరిదాపుల్లో కూడా ఎక్కడా ఉండదు, మొత్తం దేశం గురించి ఆలోచించే సమస్యే లేదు.
ఈ పరిస్థితిలో, పోలీసులు, ఇతర ఆధిపత్య శ్వేతజాతీయుల సమూహాల నుండి దాడులను ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ తప్ప తాత్కాలికంగానైనా “లెఫ్ట్” – సాహసవాదాన్ని బాహాటంగా సమర్ధించడం మాని తమ దిశను మార్చుకోక తప్పని సరైంది. ఇది పాంథర్స్ కు మరింత భారీ ఎదురుదెబ్బలకు దారితీసే ప్రమాదముంది. సాధారణంగా రాజ్యం విప్లవాత్మక సంస్థల పట్ల తమ హింసాత్మక దాడులను కొనసాగించడానికి ఈ విధమైన చర్యలకు పూనుకోవాలని కావాలనే ఇన్‌ఫార్మర్లు, మోసగాళ్ళకు సూచిస్తుంది. ప్రభుత్వ వర్గాలు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడి, తర్వాత ప్రజా సమూహాలకు “ముప్పు” వాటిల్లే ప్రమాదముంటుంది కాబట్టి అవసరమైన “ఉగ్రవాద వ్యతిరేక” చర్యలు చేపట్టామని సమర్థించుకోవచ్చు. ప్రత్యేకించి ఓ’నీల్ ఒక విధ్వంసకరమైన ఇన్‌ఫార్మర్, కానీ అతనొక్కడే కాదు. బ్లాక్ పాంథర్ పార్టీ చికాగో శాఖను విచ్ఛిన్నం చేయడానికి అత్యనిలాంటి మోసగాళ్ళు పది నుంచి పదిహేను మంది దాకా ఎఫ్ బి ఐ ఏజెంట్లు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక రహస్య సమాచారాన్ని అందిస్తారు.
ఇందులో విలియం ఓ’నీల్ పాత్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఫ్రెడ్ హాంప్టన్ అపార్ట్ మెంట్ గురించి ఎఫ్ బి ఐ కి సమాచారమందించి, అతనిని హత్య చేయడానికి ప్రధానమైన పధక రచన చేసి, ఫ్రెడ్ హాంప్టన్ ను చంపిన రాత్రి అక్షరాలా మత్తుమందు ఇచ్చిన వ్యక్తి కూడా అతనే. కానీ పార్టీ ఇన్‌ఫార్మర్లలో అతను విలక్షణమైనవాడుగా గుర్తింపు పొందాడు. అతని ధైర్యసాహసాలు, సైనిక వైఖరి, స్నేహభావం లేని నిర్లిప్త లుంపెన్ సరళి, రాజకీయ విద్య పట్ల నిరాసక్త ధోరణి వంటి చాలా స్వభావాలు పార్టీలో అనేక ఇతర మోసగాళ్ళ మాదిరిగానే ఉన్నాయి. ఇది అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే చికాగోలో, అలాగే దేశంలోని ఇతర ప్రాంతాలలో పాంథర్స్ తీసుకున్న లుంపెన్ లైన్ వారిని ఎలా చొరబాట్లకు దారి తీసిందో తెలియజేస్తుంది.
చికాగోలో పాంథర్స్ వేగంగా అభివృద్ధి చెందుతుందడంతో, వారి మీద మరింత నిఘా పెట్టి, వారు సాధిస్తున్న విజయాల గురించి ఎఫ్ బి ఐ మరింత ఆందోళన చెందింది. మాదకద్రవ్యాల వ్యాపారం, సరిహద్దు యుద్ధాల లాంటి అల్ప విషయాల జోలికి పోకుండా, పోలీసు క్రూరత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక రాజకీయ పోరాటంలో చేరాలని అనునయంగా చెప్పి, పాంథర్స్ అనేక వీధి ముఠాలను ఒప్పించారు. పాంథర్స్ ప్రజలలో చైతన్యాన్ని పెంచుకుంటూ పోతున్న కొద్దీ, ఎఫ్ బి ఐ తనదైన పద్ధతిలో నిఘా పరిధిని విపరీతంగా విస్తృతం చేసింది. ఎఫ్ బి ఐ, పాంథర్స్ – రెయిన్ బౌ కూటమిలకు బ్రౌన్ మెయిల్ అని పిలువబడే నకిలీ లేఖలను ఇరువర్గాలకూ ఒకరినొకరు టార్గెట్ చేస్తూ పంపడం ప్రారంభించారు. రెయిన్ బౌ కూటమి అనే సంస్థ అప్పటికింకా బ్లాక్‌స్టోన్ రేంజర్స్ లో పాల్గొనని చివరి పెద్ద స్ట్రీట్ గ్యాంగ్. ఈ నకిలీ లేఖలలో పాంథర్స్ – బ్లాక్‌స్టోన్ రేంజర్స్ మధ్య హింసాత్మక సంఘర్షణలు చోటు చేసుకోవాలనే లక్ష్యంతో మరణ బెదిరింపులు, తప్పుడు సమాచారాలను ఎఫ్ బి ఐ సృష్టించింది.
చాలా సూత్రబద్ధంగా పని చేయడం ద్వారా, పాంథర్లు సంఘర్షణలను అధిగమించగలిగారు, కానీ చివరికి వారు బ్లాక్‌స్టోన్ రేంజర్స్ తో కలిసినప్పుడు, వారి పోరాటాలలో భాగమయ్యేలా పాంథర్లు వారిని ఒప్పించలేకపోయారు. దానికి బదులుగా, బ్లాక్‌స్టోన్ రేంజర్స్ నాయకుడు, జెఫ్ ఫోర్ట్ ఫ్రెడ్ డ్రగ్స్ అమ్మమని పాంథర్స్ ను బలవంతంగా ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అతను అతి త్వరలో ధనవంతుడవవుతావని ఫ్రెడ్ హాంప్టన్ కు వాగ్దానం చేశాడు. ఫ్రెడ్ హాంప్టన్ తో పాటు పాంథర్స్ ఆ ప్రతిపాదనను పూర్తిగా నిరాకరించారు. సభ్యులెవరూ డ్రగ్స్ వాడకూడదనేది పాంథర్స్ విధానం. ఆల్కహాల్, అప్పటికి అమెరికాలో పూర్తిగా నిషేధించబడనప్పటికీ, పాంథర్స్ కార్యాలయంలో నిషేధించబడింది.
బ్లాక్‌స్టోన్ రేంజర్స్ తో కలిసి పనిచేయమని ప్రోత్సహించడంలోనూ, వారిని మార్చడానికి చేసిన ప్రయత్నాలతోనూ ఎఫ్ బి ఐ పాంథర్స్ ను కొంతవరకూ నాశనం చేయగలిగినప్పటికీ, బ్లాక్ పాంథర్ పార్టీ వేగవంతమైన అభివృద్ధిని ఎఫ్ బి ఐ ఆపలేకపోయింది. హ్యూయ్, బాబీ సీల్ ల స్వేచ్చ కోసం పాంథర్స్ చేసిన ప్రచారాలు వారిని ప్రధాన స్రవంతిలోకి తెచ్చి జాతీయ ప్రాముఖ్యతను సంపాదించి పెట్టాయి. చికాగో అధ్యాయం ఈ ప్రచారాల చుట్టూ కొన్ని భారీ నిరసనలను నిర్వహించింది. ఆ సమయంలోనే ఫ్రెడ్ హాంప్టన్ పార్టీ సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యాడు, అతను బ్లాక్ పాంథర్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా పని చేయబోతున్నాడు. ఫ్రెడ్ హాంప్టన్ నల్లజాతి విముక్తి పోరాటానికి జాతీయ నాయకుడు అవుతాడని ఎఫ్ బి ఐ భయపడింది. వారు ముఖ్యంగా నల్లజాతి జనాభాను పోరాటాలకు ప్రేరేపించడానికి ఫ్రెడ్ హాంప్టన్ అపారమైన సామర్ధ్యం గురించి మాత్రమే కాకుండా, శ్వేతజాతీయులతో కలిసి పని చేయడం, పాంథర్స్ ఇతర నల్లజాతీయేతర సమూహాల మధ్య బలమైన పొత్తులను విద్యుత్ వేగంతో అభివృద్ధి చేయగల ఫ్రెడ్ హాంప్టన్ ఫ్రెడ్ పని విధానం గురించి కలవరపడింది. శ్వేత ఆధిపత్య పెట్టుబడిదారీ అధికార నిర్మాణానికి ఇది ఒక పెద్ద ముప్పుగా ఎఫ్ బి ఐ భావించింది, ఎందుకంటే ఇది అమెరికాలో మనుగడ సాగిస్తున్న అనేక జాతీయతలతో ఏకీకృత కార్మిక-వర్గ విప్లవాత్మక ఉద్యమానికి దారితీయవచ్చు. ఈ విధమైన ఉద్యమం చివరికి ఈ దేశాన్ని నడుపుతున్న పెట్టుబడిదారీ వర్గాలను పడగొట్టి, సోషలిజాన్ని స్థాపించగల సామర్థ్యంగా ఎదగగలదని భావించి ప్రభుత్వ వర్గాలన్నీ భయపడ్డాయి.
ఎఫ్ బి ఐ ఏజెంట్లకు ఒక మెమోలో, అప్పటి ఎఫ్ బి ఐ డైరెక్టర్ జె. ఎడ్గార్ హూవర్, “బ్లాక్ నేషనలిస్ట్ హేట్ గ్రూప్స్” అని పిలిచే పాంథర్స్ వంటి బ్లాక్ రాడికల్ గ్రూపుల పెరుగుదలను ఎలా ఎదుర్కోవాలో వారికి సూచించాడు. ఎఫ్ బి ఐ గనక కీలకమైన వ్యక్తులు, సమూహాలను “అపఖ్యాతి” పాలు చేయడం “తటస్థీకరించడం”, వంటి పనులు చేయలేకపోతే నిజంగానే అమెరికాలో “నిజమైన నల్లజాతి విప్లవం” సంభవిస్తుందని ఈ ఎడ్గార్ హూవర్ మెమో ఏజెంట్లను హెచ్చరించింది. అతను ముఖ్యంగా నల్లజాతి విప్లవ సమూహాల ఐక్యత గురించే గాక శ్వేతజాతీయులను కూడా ఏకం చేయగల పాంథర్స్ సామర్థ్యం గురించి అతను ప్రత్యేకంగా ఆందోళన చెందుతున్నాడని, విప్లవ రాజకీయాలను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలకమైన చర్య అని భయపడ్డాడని హూవర్ మెమో వెల్లడించింది. పాంథర్స్ సమరశీల పోరాటాలు ఈ కార్యాన్ని సాధించగలవని అతను స్పష్టంగా చూశాడు. ఎఫ్ బి ఐ లోని హూవర్ తో పాటు ఇతరులు కూడా చికాగోలో ముఖ్యంగా రెయిన్‌బో కోయలిషన్ ఫర్ రెవల్యూషనరీ యాక్షన్ లో ఏమి జరుగుతుందో చూసి చాలా భయపడ్డారు.
అదే ఎఫ్ బి ఐ మెమో నల్లజాతి విముక్తి పోరాటాన్ని “ఐక్యం చేసి విద్యుదీకరించగల ‘మెస్సయ్య’ విస్తృత పెరుగుదల” గురించి హెచ్చరించింది. ముఖ్యంగా హ్యూయ్ పి. న్యూటన్, బాబీ సీల్ లు ఇద్దరూ హత్యారోపణలు ఎదుర్కొంటున్నారు. ఎల్డ్రిడ్జ్ క్లీవర్ దేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఫ్రెడ్ హాంప్టన్ బ్లాక్ పాంథర్ పార్టీ సెంట్రల్ కమిటీకి, జాతీయ స్థాయికి ఎదగడం వలన దేశవ్యాప్తంగా శక్తిమంతమైన పోరాటాలకు నాయకత్వం వహించగల సమర్ధుడని ఎఫ్ బి ఐ ఆందోళన చెందింది. హూవర్ తన ఎఫ్ బి ఐ ఏజెంట్లకు “క్రియాశీలురైన ప్రతిభా సామర్ధ్యాలతో సమస్యలను సృష్టించే వారిని గుర్తించి, హింసించే ముందు వారిని తటస్థీకరించమని” ఆదేశాలిచ్చాడు. ఈ ఆదేశం ఎఫ్ బి ఐ ఏజెంట్లకు ఫలానా పాంథర్లు హింసకు పాల్పడవచ్చు లేదా ఉపద్రవాలు సృష్టించబోతున్నారు అనే సాకుతో వారు కోరుకున్న పాంథర్లను “ముందస్తుగానే” చంపడానికి లైసెన్స్ ని అందించింది. ఈ విధంగా ఫ్రెడ్ హాంప్టన్ ని ఎఫ్ బి ఐ ప్రధానమైన లక్ష్యంగా ఎంచుకుని చికాగో పోలీస్ డిపార్ట్ మెంట్ సహకారంతో అమలు చేయడానికి పూనుకుంది.
డిసెంబర్ 3, 1969 రాత్రి ఫ్రెడ్ హాంప్టన్ స్థానిక చర్చిలో కమ్యూనిటీ పొలిటికల్ ఎడ్యుకేషన్ క్లాస్ బోధించిన తర్వాత, అనేకమంది పాంథర్లు కలిసి నివసిస్తున్న పాంథర్ ప్యాడ్ అనే తన అపార్ట్ మెంట్ కి తిరిగి వెళ్లాడు. విలియం ఓ నీల్ అక్కడే ఉండి అతనే అందరికీ డిన్నర్ సిద్ధం చేశాడు. ఫ్రెడ్ హాంప్టన్ అక్కడ ఉండబోతున్నాడని తెలిసి, అతను సెకోబార్బిటల్ – “రెడ్ పిల్” (అని పిలుస్తారు) అనే శక్తిమంతమైన నిద్ర మాత్రను ఫ్రెడ్ హాంప్టన్ పానీయంలో కలిపాడు. ఆ రాత్రి ఫ్రెడ్ హాంప్టన్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడుతూ మాట్లాడే వాక్యం పూర్తి చేయకుండానే మధ్యలోనే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు. ఆ సమయంలో అతను గర్భవతి అయిన తన ప్రియురాలి పక్కన మంచం మీద పడుకుని ఉన్నాడు, తెల్లవారుజామున 4 గంటలకు, భారీగా సాయుధులైన ఎనిమిది మంది పోలీసు అధికారులు అపార్ట్ మెంట్ ముందు తలుపును, ఆరుగురు ఇతర పోలీసులు వెనుక తలుపును ఒకేసారి పగలగొట్టారు. దాడి సమయంలో పోలీసులు అపార్ట్ మెంట్ లోకి తొంభై నుంచి తొంభై తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు. అపార్ట్ మెంట్‌లో ఇతర పాంథర్లు కూడా ఉన్నారు, ఫ్రెడ్ హాంప్టన్‌తో సహా ముగ్గురు వ్యక్తుల్ని చంపారు. పోలీసులు వారికలవాటైన ఎప్పుడూ చెప్పే పద్ధతిలోనే ఈ సంఘటనను “ఎదురుకాల్పులు” గా అభివర్ణించినప్పటికీ, స్వతంత్ర దర్యాప్తులో పాంథర్స్ ఒక్క షాట్ మాత్రమే కాల్చారని కనుగొన్నారు, అది కూడా మార్క్ క్లార్క్ అనే పాంథర్ అతని షాట్‌గన్ తో సీలింగ్ పైకి కాల్పులు జరిపాడు, కానీ అతనికి వెంటనే పిస్టల్ గుళ్ళు తగిలి చనిపోవడం వల్ల నేలకొరిగిపోయాడు. ఓ’నీల్ నుండి అపార్ట్ మెంట్‌కు వచ్చి దాడి చేయడానికి ముందస్తు ప్రణాళికలు ఉన్నందువల్ల, అతను దుర్మార్గంగా ఫ్రెడ్ హాంప్టన్‌కు మత్తుమందు ఇచ్చినందువల్ల ఈ దాడి పోలీసులకు విజయవంతమైంది. అయినప్పటికీ, పాంథర్స్ కు కూడా కొన్ని అంతర్గత సమస్యలు, గుడ్డి నమ్మకాలు ఉన్నాయి, అందువల్లే ఈ రకమైన దుర్భలమైన దాడికి దారి తీసి వారికీ తీరని హాని కలిగింది. ఇప్పటికే పేర్కొన్నట్లుగా, ఓ’నీల్ అతని వంటి గూఢచార వ్యక్తులు ఉత్తమంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నవారిలా నటిస్తున్నప్పటికీ వాళ్ళని విమర్శనాత్మకంగా చూస్తూ, పూర్తిగా నమ్మకుండా బహుశా వాళ్ళు మోసపూరిత స్వభావాలతో ఉన్నారా అనే స్పృహతో నిరంతరం గమనించి ఉంటే పాంథర్స్ కు మరింత స్పష్టంగా వాళ్ళ గురించి తెలిసే అవకాశముండేది. ఏకంగా ఒక శాఖకే భద్రతా అధిపతిగా నియమిస్తున్నప్పుడు అలాంటి స్పృహతో జాగ్రత్తగా ఉండాలి కూడా. ఓ’నీల్ దుష్టపాత్ర పాంథర్లకు అనేక అంశాలలో పూడ్చుకోలేని నష్టం కలిగించింది.
పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ, వాళ్ళు తమ మొదటి రౌండ్ కాల్పుల్లో ఫ్రెడ్ హాంప్టన్ ను చంపలేదు. అతను అతని రక్తపు మడుగులోనే మంచం మీద పడున్నప్పుడు, ఇద్దరు పోలీసు అధికారులు అతని వద్దకు వెళ్లారు. ఊపిరి తీసుకోవడానికి తన్నుకులాడుతున్న అతని శ్వాసను వాళ్ళు విన్నారు. ఒకడు, “అతను దాదాపు చివరి క్షణాల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుటూ ఇంకా సజీవంగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు ఛస్తాడు.” అని అంటాడు, మరొకడు ఫ్రెడ్ హాంప్టన్ తలపై తుపాకీ మొనని ఎత్తిపట్టి రెండుసార్లు కాలుస్తాడు. దుష్టుడైన మళ్ళీ వాళ్ళలో ఒక పోలీసు వాడు “అతను ఇప్పుడు చాలా మంచివాడు, చనిపోయాడు!” అని అంటాడు. అ దుష్టులకు మనుషుల ప్రాణాలతో చెలాగాటమాడే వికృత మనస్తత్వాల వినోదాపు క్రీడలా ఉంది. ఈ నీచమైన పోలీసులే హత్య జరిగిన ప్రదేశం నుండి ఫ్రెడ్ హాంప్టన్ భౌతిక శరీరాన్ని తీసుకువెళుతున్నప్పుడు విషపు నవ్వులు చిందిస్తూ ఫోటోల్లో ఉన్నారు. 1990 లో విలియం ఓ’నీల్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ డే నాడు, ఫ్రెడ్ హాంప్టన్‌కు మత్తుమందు ఇవ్వడంలో, హత్యను ఏర్పాటు చేయడంలో తాను పోషించిన పాత్రను చివరకు అంగీకరించాడు. పాంథర్స్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఎప్పుడూ “మేము” అనే పదాన్నే ఉపయోగించాడు. అదే రోజు రాత్రి అతను నడిరోడ్డు మీద ప్రయాణిస్తున్న కారు ముందుకి పరిగెత్తి, నలభై సంవత్సరాల వయస్సులో ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు.
ముగింపు
చికాగో పాంథర్స్, మరీ ముఖ్యంగా ఫ్రెడ్ హాంప్టన్ ప్రజలకు నిజమైన ప్రేరణలుగా నిలిచారు. ఈ దేశంలోని శ్వేతజాతీయ పెట్టుబడిదారీ అధికార వ్యవస్థను కూలదోయడానికి విప్లవాత్మక పోరాటంలో ప్రజల్ని ఐక్యం చేయగలిగితే ఎంత అద్భుతమైన విజయాల్ని సాధించవచ్చో వారు చాలా తక్కువ వ్యవధిలో చేసి చూపించారు. వారు ముఖ్యమైన రాజకీయ పోరాటాలలో ప్రజలను పాల్గొనేలా చేయడం, చరిత్ర, విప్లవం గురించి వారికి రాజకీయ తరగతుల్ని నిర్వహించి అవగాహన కల్పించడం, సమాజంలోని పేద ప్రజల ప్రధాన సమస్యలను పరిష్కరించడం వంటి ముఖ్యమైన కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ప్రారంభించి, గొప్ప సమర్ధతతో నిర్వహించగలిగారు. పాంథర్స్ అలుపనేది లేకుండా ఎడతెగని పనిచేశారు. ప్రజలకు సేవ చేయడానికి గొప్ప స్ఫూర్తి నిచ్చే వ్యక్తిగత త్యాగాలు చేశారు. ఇవన్నీ వారికి ప్రజల విశ్వాసాన్ని, మద్దతుని కూడాగట్టాయి.
ఇతర శాఖలు కొన్ని ప్రాంతాల్లో ముందుకి పోలేక గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కాలంలో కూడా వామనుడు మూడు అంగల్లో మూడు లోకల్ని చుట్టేసినట్లుగా నల్లజాతి సమాజంలో పెద్ద పెద్ద కుదుపులతో గొప్ప పురోగామి మార్పులతో బ్లాక్ పాంథర్ పార్టీకి చికాగో పాంథర్స్ ప్రగతి సాధించి పెట్టారు: నల్లజాతీయేతర సమూహాలతో పాంథర్స్ స్థాపించిన యునైటెడ్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ లాంటి క్రియాశీలక సంస్థలను స్థాపించారు. ఇటువంటి ప్రయత్నాలు ఈనాటికీ చాలా ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. ఈ విజయాలన్నీ సాధించినప్పటికీ, చికాగోలోని పాంథర్స్ కి లుంపెన్-శ్రామికవర్గం స్వభావాలపై స్పష్టమైన అవగాహన లేకపోవటం, వాళ్ళపై విమర్శనాత్మక దృష్టితో గమనించకపోవడం లాంటి లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఎఫ్ బి ఐ, పోలీసులు, గుర్తించకుండా రహస్యంగా చాపకింద నీరులా ప్రజలతో కలిసి పనిచేయడానికీ, వాళ్ళ దాడులనుండి అరెస్టులనుండి తప్పించుకోవడానికీ, నైపుణ్యం కలిగిన వృత్తి విప్లవకారులకు సంబంధించిన రహస్య సంస్థ సలహాలు పొందవలసిన అవసరాన్ని అర్థంచేసుకోకపోవడం వంటి అనేక తప్పులు చేశారు. చికాగోలోనూ, దేశవ్యాప్తంగానూ ఉన్న పాంథర్‌లు ఈ తప్పులను గుర్తించి పూర్తిగా సరిదిద్దలేకపోయి నందువల్ల, వారు మరిన్ని సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇవి చివరికి ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసి, ఫ్రెడ్ హాంప్టన్ లాంటి అద్భుతమైన నాయకుడితో పాటు, మార్క్ క్లార్క్ వంటి ఇతర ముఖ్య నాయకుల మరణంతో సహా చికాగోలో తీవ్రమైన ఎదురుదెబ్బలకు దోహదం చేసి తీరని నష్టం కలిగించాయి.
రెడ్ స్టార్ తదుపరి సంచికలో, కీలకమైన పాంథర్‌ల అరెస్టులు, హత్యలు సంస్థను ఎలా దెబ్బతీశాయో, అప్పటి ఉద్రిక్తతలను ఎలా తీవ్రతరం చేశాయో-ఫలితంగా పార్టీలో చీలికకు దారితీసిన పరిస్థితుల్ని గురించి చర్చిస్తాం.