“మావా… నాగదోసం పడితే పోద్దంటావా?” అడిగాడు శీనుగాడు!
“శాస్త్రులుగారు చెప్పిందే శాస్త్రం! దేవుడైనా శాస్త్రానికి విరుద్దంగా నడవడాకి లేదు!” కొద్దిగ గట్టిగానే చెప్పాడు మల్లిగాడు!
శీనుగాడికి ఆ క్షణంలో మల్లిగాడే పంతులూ పరమాత్ముడూ అన్నీనూ! ఆ భక్తితోనే నమ్మకంతోనే “పంతులంతటోడివి తల పండినోడివి చెప్పినావనే పంచెగ్గట్టుకొని యీ పుట్టల్లంటా చెట్టుల్లంటా నీ యెనకాల నీడలాగ తిరుగుతన్నాను గదేటి?” అన్నాడు! తను నమ్మకానికి దూరంగా నడవడం లేదని వెన్నంటి వెనకాలే నడుస్తున్నానన్న ధ్వని శీనుగాడి మాటల్లో వుంది!
“కరమ్ము కాలితే గాడిదదేదో… పామై కరిచిందని… రోజులు బాగోలేకపోతే అర్దరేత్రి పూట అడవయినా దేవాల్సిందే… సముద్రమైనా యీదాల్సిందే…” మల్లిగాడు వయసు పండించిన అనుభవంవల్ల స్వరంలో స్థిరచిత్తం తొణికిసలాడగా అన్నాడు!
ఆ అడవిలో చీకట్లో మల్లిగాడి కళ్ళు పాముకళ్ళలా మెరుస్తున్నాయి! అది చూసిన శీనుగాడికి అంతవరకూ వున్న భక్తి పోయింది! భయం కమ్మింది!
“శివుడి ఆజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు కదా?” తనకి తాను ధైర్యం చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు శీనుగాడు!
“శివుడు ఆజ్ఞాపించినాడని కాదు, సీమ బొక్కలో సెయ్యి పెట్టినాడనే కదా- సీమ కరిసింది, అలాటిది పాము బొక్కల సెయ్యి పెడితే పాము కరదా? సీమకుండే పౌరుషం పాముకుండదా?” మల్లిగాడు పకపకా నవ్వాడు!
ఆ అలికిడికి చీకట్లో చెట్టుమీది పక్షులేవో యెటుకటు యెగిరాయి! చెవుల పిల్లులో వుడతలో యిట్నుంచి అటు అట్నుంచి యిటు పరుగులు తీశాయి! తుప్పల్లోనూ సుర్రున పురుగో పుట్రో కదలింది!
ఎండని యేడు చేపల కథలో చీమ కుట్టిన పిల్లాడిలా బేమనలేకపోయాడు శీనుగాడు! రెండు క్షణాలు మాట రాలే! తరువాత తేరుకున్నాడు!
మల్లిగాడు వొక్కో అడుగూ ముందుకు వేస్తున్నాడు! లక్ష్యం మీద గురిగా వున్నాడు!
“మా పూర్వీకుల్లో పాముల్ని యెవరు చంపినారో తెలీదు, పలితం మాకొచ్చింది! అంటిన పని అంటకుండుంది… ముట్టిన పని ముట్టకుండుంది…” శీనుగాడిలో విచారం అక్కడ విస్తరించిన చీకట్లా వుంది!
మల్లిగాడు వొక్క క్షణం ఆగాడు! ఆగి “పర్ సపోజ్… యిప్పుడు పాము నీ యెదురుగుండా వస్తే- ‘నాగరాజా నా నాగరాజా’ అని పాటపాడి నాగినీ డాన్సు యేసి ఆనక నింపాదిగా ఆరతి పట్టి మాకీ నాగదోసమేటి తల్లీ?’ అని అడుగుతావా? లేకపోతే చేతిలో వున్న దుడ్డుకర్ర తీసి దాని పణత పగిలిపోయేలా వొక్క దెబ్బ యేస్తావా? యేటి చేస్తావు?” ఆ మాట అడుగుతుండగా వూహించని విధంగా సర్రున యేదో దూసుకొచ్చింది?!
అంతే… శీనుగాడు చేతిలున్న కర్రతో నేలమీద దబాదబా ఆపకుండా బాదికెలిపోయాడు!
అలా బాదుతుంటే పకపకా నవ్వాడు మల్లిగాడు!
“అందువల్ల దోసం మీ పూర్వీకులది కాదు, నీదీ కాదు, నాదీ కాదు… బయానిది! ఆ బగవంతునిది! చావయినా పుట్టుకయినా అతగాని పేరు మీదే…” నవ్వుతూ నేలమీద సొప్పకట్టలా పడివున్న పాముని తోకపట్టి తీశాడు! చెయ్యెత్తి పట్టుకున్నాడు! తలకిందులుగా వేళ్ళాడుతూవున్న పాముని నూతిలోపడ్డ చేదని తియ్యడానికి నీటిపిల్లి వేసి తిప్పినట్టు గుండ్రంగా తిప్పాడు! అయినా మల్లిగాడు ఆరడుగులున్నా దానిపొడుక్కది చితికిపోయిన దాని పడగ నేలకు తగులుతూనే వుంది! పొరడిసిన పాముకి మబ్బిడిసిన మేఘం యెదురైపోయి తెల్లగ నిగనిగలాడి వెన్నెట్ల మెరిసిపడిపోతోంది! దేవకన్నిక లాగ!
“జాతైన పాము” మెచ్చుకున్నాడో నొచ్చుకున్నాడో మల్లిగాడి మాట శీనుగాడికి అర్థం కాలేదు!
కొయ్యబారి చూస్తున్న శీనుగాడిని చూసి “లచ్చ రూపాయల పాము… బంగారమొంటి పాము… దెబ్బెట్టేసినావు” పాము బుసలు కొట్టినట్టు మల్లిగాడు నిట్టూర్పులు విడిచాడు!
“నాను నాగు పాముని చంపేసినానా?” యింకా నమ్మలేనట్టుగా కళ్ళు తేలేసి అడిగాడు శీనుగాడు!
“లేదు, నువ్వెక్కడ సంపినావు?, పచ్చడి సేసినావు గాని…” మల్లిగాడి మాటలకి వుడుక్కోకుండా “అయితే నావల్లే నా కుటమాముకి నాగ దోసం” శీనుగాడు పాము కుట్టినట్టు అయిపోయాడు!
“దోసం నీదీ కాదు, నాదీ కాదు… ఆ బగవంతునిదని చెప్పినానా లేదా? మల్ల అదే మాట…” విసుగూ కోపం కలగలిసిపోగా అన్నాడు మల్లిగాడు!
“శాస్త్రులుగారు చెప్పిందే శాస్త్రం! దేవుడైనా శాస్త్రానికి విరుద్దంగా నడవనీకి లేదు’ అని అన్నిది నువ్వేగదేటి?” తిరిగి అడిగాడు శీనుగాడు!
“అన్నాను! మనమంటే పాములు పట్టో కప్పలు పట్టో బతికేస్తాము, పాపం ఆ శాస్త్రుల్లు యేమి పట్టి బతుకుతారు? ఎలాగ బతుకుతారు? అందుకని మనం నమ్మకాల్నీ బతికించాల… మనల్ని మనమూ బతికించుకోవాల” మల్లిగాడు నలిగి చితికిపోయిన పడగని చేరదీసుకొని వుగ్గు విప్పి తల్లో పేలు చూస్తున్నట్టు వేలితో మృదువుగా చూస్తున్నాడు!
అర్థం కాని అయోమయంతో చూసి వొక్క క్షణం అలాగే వుండి పోయిన శీనుగాడు “అవునూ కప్పలంటే యాదికొచ్చింది, కాలేజీ వాళ్ళు…” అడగడం పూర్తి కాలేదు! “కప్పలు కోస్తే యెన్ని కోస్తారు? అయినా కూరకీ పులుసుకీ కాదు కదా? పిరికి సన్నాసి గుంటలు కొయ్యడానికి యెన్ని కావాల? ఇంకా మనకెన్ని డబ్బులు యివ్వాల?” అని చచ్చిన పాముని పక్కన పడేశాడు!
“పాముని కాల్చాలి గావాల” యింకా యింకిపోని పాపభీతితో శీనుగాడు అడిగాడు!
“ఆ… నెయ్యీ నూని యేసి కాల్చాలి” అని నవ్వాడు! నవ్వి “అలగ బుర్రా తోకా క్కోస్సి వర్రగుండా వుప్పురవ్వా యేసి సక్కులు కాల్చినట్టు కాల్చి తింతే- పెనం పేలిపోద్ది.. దాక మాడిపోద్ది..” అని రుచిని తలచుకొని నోట్లో వూరిన నీళ్ళను మింగాడు మల్లిగాడు! అంతలోనే “తింటే వొక్కపూటకే… మళ్ళీ పూటకి? ఆకలికి చావు లేదు, అది అమృతం తాగింది” వైరాగ్యంగా అని, “పాములు బతికితే మనుషులూ బతుకుతారు” తనలో తాను అనుకున్నట్టుగా శాస్త్రకారుడిలాగ అన్నాడు!
అంతలోనే మల్లిగాడు నిశ్శబ్దమై పోయాడు! నెమ్మదిగా వెళ్ళాడు! నేల మీద జంతువులా పాకాడు! పుట్ట మీదకి! మీది మీదికి!
“జాకర్త మావా” చెప్పబోయి మింగేశాడు శీనుగాడు!
పుట్టలో మెల్లగా చెయ్యిపెట్టాడు మల్లిగాడు!
కళ్ళలోంచి ప్రాణం పోయినట్టు చూస్తున్నాడు శీనుగాడు! అలా చూస్తుండగానే పుట్టలోంచి పాముని తీశాడు! అది మల్లిగాడిని కాటు వేయడానికి పడగని పదే పదే విసురుతోంది! కవ్వాన్ని వొంటి చేత్తో చిలికినట్టు పాముని తోకపట్టి చేత్తో సుకుమారంగా తిప్పాడు! దానికి కళ్ళు తిరిగాయేమో పడగ దించింది! పాకి పారిపోవడానికి ప్రయత్నించింది! ఎటుపడితే అటు పరుగులు తీస్తోంది! వృధా ప్రయాసలు పడుతోంది!
“బగవంతుడు చేతికి చిక్కినాడు” మల్లిగాడి ముఖంలో సంతోషం!
“బగవంతుడి దగ్గరికి పంపకుండా వుంటే చాలు” గొణుగుతున్నట్టుగా అన్నాడు శీనుగాడు! రెండు చేతులూ జోడించాడు!
“అల్లుడూ… బాగ సేస్కో బగవంతుడి దర్శనం బాగ సేస్కో…” నవ్వి పాముని బుట్టలో వేశాడు మల్లిగాడు! “మడిసినయినా యిసప్పురుగునయినా బుట్టలో యేసుకుంటే బుద్దిగా వుంటాది” గాలికి చెప్పినట్టు చెప్పాడు! “అయితే బుట్టలో యేసుకోడం కూడా విద్యే… అది మామూలు విద్య కాదు, ప్రమాదకరమైన విద్య…” అన్నాడు!
ఆ మాటలకు శీనుగాడు ఆలోచనలో పడిపోయాడు!
“వొరే నాగేస్వర్రావూ… నాగేస్వర్రావూ…” అని మల్లిగాడు పాముల్ని పిలవడం విని మళ్ళీ యీ లోకానికి వచ్చిన శీనుగాడు “మావా… అయితే పాముల్ని బుట్టల యెయ్యడం సులువా? మడుసుల్ని బుట్టలో యెయ్యడం సులువా?” తెగని విషయంలా ముందుంచాడు!
“పాముకి బుర్రల విషమేగాని బుర్ర లేదు, బుర్రల గుజ్జూ లేదు! మనిషికి బుర్రుంది, బుర్రల గుజ్జూ వుంది! వొళ్ళంతా విషమూ వున్నాది…” యెందుకో ఆ మాట అంటున్నపుడు మల్లిగాడి గొంతు వణికింది!
శీనుగాడుకి కొంత బోధపడిందేమో బుర్ర గోక్కున్నాడు!
పుట్టని కర్రతో దవ్వాడు! పుట్ట కన్నంలోకి కర్ర దూర్చాడు! కెలికాడు! చీమలు వచ్చినట్టు పాము పిల్లలు పైకి వచ్చాయి! పరుగులు తీశాయి! ఆ వెనకాలే పెద్ద పాములున్నూ! ఒకటి పుట్ట యెక్కి ‘యెవడ్రా’ అన్నట్టు చూసింది! ‘నేన్రా’ అన్నట్టు మల్లిగాడు వొడుపుగా ఆ పాముని పట్టి సంచిలో పొట్లకాయ జారవేసినట్టు వేశాడు! అంతలోనే పరుగున వెళ్ళి తుప్పల్లో చెయ్యిపెట్టి సర్రున పాముని లాగాడు!
శీనుగాడు అంతే వేగంగా వెనక్కి తగ్గాడు!
“త్రిమూర్తులు చాల్లే” అన్నాడు మల్లిగాడు!
అర్థం కానట్టు చూశాడు శీనుగాడు!
“బ్రమ్మా విష్నూ మయేశ్వరులు… త్రినాధ మేలా చేసుకోవడమే” అని మల్లిగాడు తృప్తిగా నవ్వాడు! అన్నీ మూటగట్టి భుజానికి తగిలించుకొన్నాడు! అటూ యిటూ చూశాడు! కంటితో శీనుగాడికి సైగ చేశాడు! ఇద్దరూ చప్పుడు కాకుండా అడుగులు వేశారు! భుజం మార్చుకున్నారు!
అడివిని దాటారు! అగంతరం దాటారు! చీకటిని దాటారు!
కాళ్ళూ బస్సూ ఆటో వాహనాలైనాయి!
కాలం కరిగింది!
నగర శివార్లలో తెల్లారింది!!
- * *
దాదాపు నెలన్నరకు గాని త్రిమూర్తులకు తెల్లారలే!
పెట్టే పుట్ట!
చీకటి గుయ్యారంలో ఆరు వారాలు పాటు పాములు ఆకలితో వున్నాయి! ఆవురావురమన్నాయి! అలా ఆవురావురులాడితే కదా ఆబగా తినేది? నకనకలాడితే కదా నాగుల చవితికి గుక్కెడు పాలు తాగేది?! గుడ్డు గుటుక్కున మింగేది?! వాటి కడుపులు నిండినప్పుడే కదా మన కడుపులు నిండేది! కాసులు గలగల రాలేది?!
“కాని పాములు పాలు తాగవట గదా మావా?” శీనుగాడి మాటకి మల్లిగాడు సమాధానం యివ్వలేదు!
“పాలే విషమట!” శీనుగాడి మాటకు యీసారి యెర్రగా యెర్రిగా చూశాడు! “పాములు పాలు తాగడం కాదు, నీ పిల్లల కడుపుల యిన్ని పాల సుక్కలు పడడం గురించిన ఆలోసన జెయ్యి” అన్నాడు మల్లిగాడు!
ఒక్క క్షణం శీనుగాడు ఆలోచనల్లో పడిపోయాడు!
ఊళ్ళు పట్టణాలై పట్టణాలు నగరాలై నగరాలు మహానగరాలై కాలం తెల్లమిగిలాక పుట్టలకీ కరువొచ్చింది! ఏడాదికి వొక్కసారి మాత్రమే వొచ్చిన నాగుల చవితి! చవితికి అందరూ పుట్టలకి వెళ్తారు! కుటంబాల తోటి! అదవా యెవరైనా పనుల్లో పాకుల్లో వుండిపోయినా సమయానికి వేరే వూళ్ళో వుండి రాలేకపోయినా ఆ రానోళ్ళ పేరుమీద రాలేనోళ్ళ పేరుమీద పేరు పేరునా పుట్టలో పాలు పొయ్యడం ఆనవాయితీ! మనిషికొక గుడ్డు చొప్పున వెయ్యడం విధాయకం! ధూప దీప నైవేద్యాలయితే చెప్పవసరం లేదు!
నాగుల చవితికి ప్రత్యేకంగా ప్రతొక్కరూ నువ్వుల కజ్జిం, సలివిడి, తెలకపిండి చిన్న చిన్నవి పేడ పురుగులంత వుండలు చేసి పుట్ట దగ్గర వేసేవారు! అవి చాలా రుచిగా వుండేవి! తినాలని వున్నా సరే, తినని పాములకు పెట్టేవాళ్ళేగాని తినే మాలాటి మనుషులకు పెట్టేవాళ్ళేరి? ఆశగా చూస్తే ఆబగా తామెక్కడ తినేస్తామోనని పుట్టలో మరీ వేసేవాళ్ళు! చెయ్యిపెట్టి తీసుకుతింటే తిట్టేవాళ్ళు! అంటరానివాళ్ళము కదా- కాస్త దూరంగా నిలబడ్డా సరే పుట్టలో గుడ్లు యెక్కడ తీసేస్తామన్న అనుమానంతో దూరంగా తరిమేవాళ్ళు! మళ్ళీ వస్తే చాలు, కొందరు దుందుడుకుగాళ్ళు జుట్టుపట్టి వెన్నువంచి గట్టిగా గుద్దేవాళ్ళు! కొన్నిసార్లు దవడలు వాసిపోయేవి! పల్లు రాలిపోయేవి!
కొందరు వెండివి రాగివి నాగినీలు కూడా షరాబుతో తాయారు చేయించి మొక్కుగా వేసేవాళ్ళు! ఖరీదైనవి పుట్టలో వేసినప్పుడు చూస్తే పుట్టని యెక్కడ తవ్వేస్తామోనని కనపడ్డ వాళ్ళని కర్రపట్టుకు తరిమేసేవాళ్ళు! దొరికితే వీపులు చీల్చి పేల్చేవాళ్ళు! మరోపక్క దీపావళి టపాసులు పుట్టదగ్గరే పేల్చి కాల్చేవాళ్ళు!
“ఆ శబ్దాలకి పాములు పారిపోవా?” చిన్నప్పటి నుండీ శీనుగాడికి అన్నీ అనుమానాలే! “ఒరేయదవా… పాలు మట్టిలో యింకిపోకుండా పుట్టలోపల కుండ యెలా పెట్టాలో ఆలోసన జెయ్… అలాగే యేసిన కోడి గుడ్లు పగిలిపోకుండా పుట్ట అడుగులోన గంప పెట్టి అందలో గుడ్డపరిసిన సంగతి జూడు..” అనేవాడు మల్లిగాడు!
నాగుల చవితి నాల్రోజులు వుందనగా పుట్టలు నావంటే నావని ఆస్తులు వాటాలేసుకున్నట్టు పంచుకోనేవాళ్ళు! రెండ్రోజులముందే పుట్టని వొక పక్కనుండి దవ్వి పుట్టలో అమర్చాల్సినవి అమిర్చి మళ్ళీ గడ్డీ పచ్చిక పరిచి పుట్టల్ని సిద్ధం చేసుకోనేవాళ్ళు! అలా పుట్టని అమర్చినా కొందరు తెలివైన భక్తులు అనుమానంతో గుడ్డుని కొట్టి వేసేవాళ్ళు! “అదేటి మావా?” అంటే “ఆమ్లేటు” అని మల్లిగాడు నవ్వేవాడు! శీనుగాడికి మాత్రం దుఃఖమొచ్చేది! ఏడుపొచ్చేది! ఇంకా లెక్క వేస్తే అమ్మిన గుడ్డులకి వచ్చిన డబ్బుల్లో గుడ్డుకి రెండున్నర తక్కువ వచ్చేది!
పసుపూ కుంకుమా కోడిగుడ్లకు అంటుకొనేవి! తుడిస్తే వదిలేవి కావు! రంగుల ఆనవాళ్ళు వుండేవి! హోటళ్ళ వాళ్ళు యెక్కువ తీసుకొనే వాళ్ళు! కాని తక్కువ డబ్బులు యిచ్చేవాళ్ళు! గుత్తకు తీసుకున్నప్పుడు తప్పదు అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది!
అందరూ పోసిన పుట్టల్లో పాలో గుడ్లో పోసేవాళ్ళు కాదు కొందరు! కొత్త పుట్ట కావాలని వెతికి కనిపెట్టేవాళ్ళు! కొత్త కన్నాలు చేసేవాళ్ళు! కొత్త తువ్వాలు పరిచేవాళ్ళు! ఉన్న బొక్కల్ని పెద్దవి చేసేవాళ్ళు! అక్కడ అలికి ముగ్గువేసి ఆకువేసి ప్రసాదం పెట్టి అగరొత్తులు ముట్టించేవాళ్ళు! అదవా పుట్టలోంచి అనుకోకండా యే పామో వస్తే అంతా పరిగెత్తేవాళ్ళు! అప్పుడు మాత్రం తమని పిలిచేవాళ్ళు!
అలా పిలిస్తే యిలా పలికినవాడు యానాది వీరాసామి! పాములు పట్టడంలో వీరుడు! ఆడి వెనకాలే నీడలాగ ఆడి పెళ్ళాం అంటుకు తిరిగీది! అడవిలోనే ఆవాసం! అడవి రక్షణ కోసమని అడవిలోంచి తరిమేసినాక వూరురు తిరిగి పాములూ యెలకలూ ఈసుళ్ళూ పట్టేవాడు! పంట కాపాడుకోవడానికి ప్రాణాలు పెట్టోడు! ఎవరి పొలంల పడితే ఆల గుమ్మంలో కంచం పెట్టేవాడు! ఆడితో మల్లిగాడికి స్నేహం కుదిరింది! ఆడిదగ్గరే పాములు పట్టే విద్య నేర్చుకున్నాడు! మొదట సరదాగా నేర్చుకున్నాడు! అదే బతుకు తెరువు అయ్యింది!
“ఈరాసామి యేమయిపోనాడు మావా?” వున్నట్టుండి అడిగాడు శీనుగాడు!
“పాములు పట్టినోడు పాము సేతిలే సస్తాడని అందరూ అన్నారు… కాని సర్కారు కూడా పెద్ద పామే, పుట్టలోంచి పాముని తీసేసినట్టు, అడవిలోంచి యానాదోన్ని తీసేసిన తరువాత ఆడి తిండీ వేటా బతుకూ అన్నీ మాయమైపోనాయి…” అని యేదో గుర్తొచ్చినట్టు మల్లిగాడు వొక్క క్షణం ఆగి “అమ్మ దగ్గరికి వెళ్ళినట్టు అప్పుడప్పుడూ అడవికి వెళ్ళేవాడు… పుట్టిళ్ళు వాసనలు పోవు కదా?” పరధ్యానంగా అన్నాడు!
“మనిసి యేటయినాడయితే?” శీనుగాడు పాముల పెట్టె మూతపెట్టి అడిగాడు!
“చచ్చినాడో బతికినాడో తెలీదు” యెటో చూస్తూ అన్నాడు మల్లిగాడు!
“ఉన్నాడో లేడో తెలీకపోతే యేటయినట్టు? ఆడి పెళ్ళామో?” శీనుగాడు ఆసక్తిగా చూశాడు!
“ఆ మద్దిన గందపు చెక్కల దొంగతనం కేసుల ఈరాసామిని పోలీసులు జైళ్ళ పెట్టీసినారని ఆడి పెళ్ళమే చెప్పింది! అది మొగుడు లేకంటా పిల్లలతోటి బతకలేనని పోలీసులతో కొట్లాడి నేరం మోపేసుకొని జైళ్ళోనే వుంటంది!” నెమరేసుకుంటూ చెప్పాడు మల్లిగాడు!
కొద్దిసేపు యిద్దరి మధ్యా నిశ్శబ్దం!
పాము బుసతో తలతిప్పి చూసిన శీనుగాడు “మావా” అన్నాడు! మల్లిగాడు పాముని యెత్తి బుట్టలో వేసినాడు!
“పాములు పాలు తాగవు, గుడ్లు తినవు… అనీసి యీదుల్లోకి వొచ్చి చెపుతన్నారు” స్నేక్ లవర్స్ నోట విన్నదే శీనుగాడు చెప్పాడు!
“గుద్దకాలితే గుర్రం వరిగడ్డి తిన్నాదని సామెత” అన్నాడు! “ఆరు వారాలు ఆకలితో వుంచితే కొబ్బరికాయా అరటిపళ్ళూ పెట్టినా లొట్టలేసుకు తింటాది” అని పడిపడి నవ్వాడు మల్లిగాడు! ‘చదివితే వున్న మతి పోడమంటే యిది కాదూ?’ నవ్వాపుకుంటూ రింగవుతున్న ఫోను యెత్తాడు!
“హలో బాబూ… అలగే బాబూ… మీరెలాగ చెప్తే అలగే” అని ఫోను కట్ చేసి “అడివి రాముడు” అని శీనుగాడి వంక చూశాడు!
“డబ్బులేటి మాట్లాడినావా?” శీనుగాడు అనుమానంగా చూశాడు! పాత అనుభవాన్ని యింకా మర్చిపోలేనట్టుగ!
“ఏటి మాట్లాడుతాంరా… యిప్పుడు అలగే అనీసి, ఆనక పోలీసులకింత యీలకింత ఆలకింత అని చేతిలో యేది పెడితే యేటి చెయ్యగలం చెప్మీ?” అన్నాడు మల్లిగాడు! అయినా మల్లిగాడి మాట మల్లిగాడికే రుచించలేదు! అందుకే “అలగని వదిలీమనుకో” అని తనే మళ్ళీ అన్నాడు!
శీనుగాడు చేతగాని వానిలా చూశాడు!
“పాముల్ని పట్టి తెచ్చినప్పుడు కూడా బయ్యిం లేదు గాని మన డబ్బులు మనం తెచ్చుకోడాకి బయ్యిం పడాల్సి వస్తన్నాది” గొణుక్కున్నట్టుగా అన్నాడు మల్లిగాడు!
“అడివిలో రహస్యంగా పాముల్ని పట్టి తేవడం అంత సులువు కాదు, మీరూ ప్రాణాలకి తెగిస్తన్నారు! మరి మేమూ యిక్కడ అంతే రహస్యంగా భక్తుల్ని పట్టుకోవడానికి ప్రాణాలకి తెగిస్తన్నాం” యెప్పుడూ అన్నమాటే అడవిరాముడి మాట అప్పుడూ చెవిలో వినపడింది!
ఆలోచనలో వుండి పోయిన మల్లిగాడిని “లేరా మావా” అని భుజం పట్టుకు తోసిన శీనుగాడు అప్పటికే తెచ్చిన సన్నని యినుప తీగని చేతికి అందించాడు!
ఆ తీగని వొంచి తిన్నగ చేసి మూడు చిన్న చిన్న ముక్కలుగా విరిచాడు మల్లిగాడు! ఆ ముక్కల్ని గుండ్రంగా చేశాడు, వొక్కోటి వుంగరం చుట్టు అంత! రెండు చుట్లు! వొక కొన మాత్రం పక్కకు వుంచాడు!
ఆసక్తిగా చూస్తున్న శీనుగాడు “సరాబువి కూడా అయిపోనావు మావా” అని నవ్వాడు! “గరీబు అయ్యాక వొక్క సరాబేటి, యేదయినా అవాల్సిందే!” అన్నాడు మల్లిగాడు!
“నోరు పట్టుకుని అందిస్తావా? లేకపోతే నోరు కుడతావా?” అడిగాడు మల్లిగాడు! దేనికీ ‘వూ’ అనలేదు శీనుగాడు! కాని ఆ జంకడాన్ని యిట్టే కనిపెట్టాడు మల్లిగాడు! అర్థం చేసుకున్నట్టు తనే బుట్టలోని పాముని తియ్యబోతే బుస్స్ మంది!
“ఒంట్ల వోపిక లేకపోయినా పౌరుషానికి తక్కువలేదు, నాగుపామా మజాకా?” అన్నాడు మల్లిగాడు!
“కోరలు పీకిస్తే సరి” పరిష్కారంగా అన్నాడు శీనుగాడు!
“దాని కోరలు పీకితే మన కోరలు పీకినట్టే! కోరలు తీసిన పాముకి దర పడిపోదూ?” అన్నాడు శీనుగాడు! “అప్పుడు యెంత నాగుపామయినా మంటిబుక్కడం అయిపోద్ది” అన్నాడు!
శీనుగాడు తలూపుతుంటే, బుట్టలోని పాము తోకని పట్టి లేపాడు మల్లిగాడు! నాగుపాము పడగ యెత్తింది! పడగ ముందు బుట్ట మీది మూతని యెదురు వుంచాడు! మరో అరచేతిని దాని నెత్తిమీద అలాగే పెట్టాడు! తాకించి చూశాడు! టక్కున తల పట్టేశాడు, వూహించని విధంగా! శీనుగాడి చేతికి జాగర్తగా అందించాడు! శీనుగాడు యెంత జాగ్రత్తగా పట్టుకున్నా అతని చేతికి పాము తోక చుట్టుకుపోతోంది!
“బయపడకు అల్లుడూ… పెళ్ళాం కోడె తాచు! అలగని పెళ్ళాడ్డం మానేస్తావా? సంసారం చెయ్యడం మానేస్తామా?” అని పకపక నవ్వాడు! శీనుగాడు మాత్రం నవ్వలేదు!
అప్పుడు పాము పై దవడనీ కింది దవడకీ కలిపేలా తీగని గుచ్చి చుట్టుగా చేసి సరి చేశాడు!
“ఎవులయినా ముక్కు కుట్టిస్తారు! చెవులు కుట్టిస్తారు! కానీ మావా నువ్వు నోరు కుట్టిస్తన్నావు!” అని నవ్వాడు శీనుగాడు!
“జీవిత కాలంల మీ అత్తకి మాత్రం నోరు కుట్టించలేకపోన్ను” అని పగలబడి నవ్వి వొడుపుగా శీనుగాడి చేతిలోని పాముని అందుకొని బుట్టలో వేశాడు!
పాముకి కళ్ళెం పడింది! దాని నోరు కొద్దిగా విచ్చుకుంటుందే కాని పూర్తిగా తెరచుకోవడం లేదు! దాని నీరసం యెలా వున్నా కొత్త గాయంతో పడగ యెత్తలేకపోయింది!
అలాగే మిగతా రెండు పాములకీ నోటికి కుట్లేసిన పని ముగించాడు మల్లిగాడు! దీర్ఘమైన ఆలోచనలో పడ్డ శీనుగాడ్ని యేమైందన్నట్టు చూశాడు!
“మరేటి లేదు మావా… దేవుడు మీద బక్తీ గిక్తీ వుంటే గింటే పుట్టకు పోయి పాలేసుకోవాల గాని యిళ్ళకు పాముల్ని తీసుకెళ్ళి యీ పూజలేటో అస్సలు తెల్డం లేదు” అన్నాడు శీనుగాడు!
“డోర్ డెలివరీ తెల్దేటి?” అదీ తెలీదా అన్నట్టు చూశాడు మల్లిగాడు!
“ఓస్… బక్తికున్నా?” అడిగాడు శీనుగాడు!
“ఏమి… శ్రీశైలంల నాగదోస నివారణ పూజలుకి రొండువేలు కడితే చాలు! మనం టిక్కట్లు తీసుకోని అంతదూరం యెల్లక్కర లేదు! మన పేరున పూజలు జరిపించి తీర్ధప్రసాదాలు యింటికే పంపిస్తారు… అలగే యిదున్నూ…” చెప్పాడు మల్లిగాడు!
అర్థమయినా యెందుకో సిగ్గుతో తలదించుకున్నాడు శీనుగాడు!
- * *
“నాయమ్మవు కదా… తాగీయమ్మ పాలు తాగీ… నా బంగారు కొండవి కదూ?” శీనుగాడు పాము తోకని కదుపుతూ ముద్దు చేస్తున్నాడు!
వెండి గిన్నెలో పాలు! పక్కనే కోడి గుడ్లు! ఆ పక్కనే నువ్వుల కజ్జిం! సలివిడి! తెలకపిండి! ఉండలు గోళీల్లాగ చుట్టి అందంగా అమర్చి పెట్టారు! కొత్త పట్టు దుస్తులు కూడా!
పాము పసుపు కుంకుమల వానలో తడిచినట్టుంది! అక్షింతలు పడుతుంటే మరింత ముడుచుకుపోతోంది!
అడివిరాముడు కళ్ళతో కోరికేసేలా కొరకొరా చూస్తున్నాడు మల్లిగాడిని!
మల్లిగాడు నిదానంగా వున్నాడు! ‘తాగుతుంది..’ అన్నట్టుగా తలూపుతున్నాడు! ‘ఎప్పుడు?’ అన్నట్టుగా చూస్తున్నాడు అడివిరాముడు!
“జనానికి బెదిరిపోయింది బాబూ” అన్నాడు మల్లిగాడు!
బంధుమిత్రులు ఆ మాట విని ముఖాముఖాలు చూసుకొని అంతా కొంచెం వెనక్కి తగ్గినట్టు వొక అడుగు వెనక్కి వేసి రెండడుగులు ముందుకువేశారు!
ఆ యిల్లూ ఆయింటి యజమానీ అతగాడి భార్యా పట్టువస్త్రాలు ధరించి పోటీపడుతూ ధగధగలాడిపోతున్నారు!
“అమ్మా నాగమ్మా… యేమి అయ్యగారి మీద అలిగినావా? అమ్మగారు అంత అదయిపోతుంటే యింక ఆలోచన దేనికి? తాగీ తల్లీ?” శీనుగాడి మాటలకి బడీడు పిల్లలూ కొందరు పేరంటం ఆడాళ్ళూ పుసుక్కున వవ్వీసి తరువాత చేతులు నోటికి అడ్డం పెట్టుకున్నారు!
సియ్యై బాబు ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్?’ అని పల్లు కొరుకుతూ గొణుగుతున్నాడు!
అడవిరాముడు మలబద్దకం ముఖం పెట్టి సియ్యైగారి వైపు చూసి గౌరవంగా నవ్వుతున్నాడు! ఇటు మల్లిగాడి కేసి ముఖం తిప్పి మండిపడుతున్నాడు! అడివిరాముడి పేరు యేమిటో యెవరికీ తెలీదు! పాములు పట్టేవాళ్ళంతా ‘అడివిరాముడు’ అనే అంటారు! అతగాడు నాగుల చవితికి తమ పాలిట నాగాదేవతలా ప్రత్యక్షమవుతాడు! బేరాలు తెచ్చేది వచ్చేది ఆయన వల్లే! సగం డబ్బు అతగాడే లాగేసుకుంటాడు! ఏర్పాట్లన్నీ అతనే చూసుకుంటాడు!
చిక్కిశల్యమైన పాముకి యివేవీ పట్టనట్టున్నాయి, మట్టి ముద్దలా పడివుంది!
“అక్కడ యస్సైగారింట్లో తాగింది సార్…” అన్నాడు అడివిరాముడు, వుషారుగా!
“ఏం సియ్యైగారింట్లో తాగదా?” బాబుకి కోపం వచ్చింది! అతగాడు ముడ్డికి పుండయినట్టు కూర్చున్నచోట కూర్చోలేక అటూ యిటూ కాలుగాలిన పిల్లిలా నిలవకుండా తిరుగుతున్నాడు!
మల్లిగాడికయితే యేమీ బోధపడ్డం లేదు! “బ్రమ్మని లోపలపెట్టు… విష్నూని తియ్యి” అన్నాడు! శీనుగాడు అంతవరకూ పాలు తాగకుండా వున్న పాముని బుట్టలోపెట్టి- మరో బుట్టలోని మరో పాముని తీశాడు!
“ఇంటిల్లిపాదికీ సంపూర్ణ ఆయురారోగ్యాన్ని యియ్యి తల్లీ నాగమ్మ తల్లీ…” అని అడివిరాముడు చేతులు జోడించాడు! ఆ యింటి యజమానురాలితో “పసుపూ కుంకుమా వేసి అక్షింతలు చల్లండమ్మా…” అన్నాడు! ఆవిడగారు కాస్త వంగాలేక అలాగని నిలబడాలేక చేతిలో వున్న పసుపూ కుంకుమా పిడికెడేసి తీసి పామ్మీదకి విసిరింది! పాము కళ్ళలో పడి భగ్గున మండిందేమో దిగ్గున పైకి లేచింది! యజమానురాలు వెనక్కి జరగబోయి తూలి దబ్బున పడింది! ఆవిడని లేవనెత్తడానికి చాలామంది మర్యాదతో పోటీ పడ్డారు! పోటీపడి మళ్ళీ ఆవిడ్ని కింద పడేశారు!
ఇదంతా చూసిన యజమానిగారికి చిరాకు పెరిగిపోతోంది! అప్పుడే మరో పక్కనుండి డియ్యస్పీ ఫోనులో దొబ్బుతున్నాడు!
యజమనురాల్ని పక్కన కూర్చోబెట్టాక, పైకి నిలబడిపోతున్న పాముని వుద్దేశించి “అసలదండీ… అసలుది” ఆనందంగా ముఖంపెట్టి అన్నాడు అడివిరాముడు!
ఆ మాట విన్న మల్లిగాడికి ‘అసలు విషయం’ వొక్కొక్కటిగా గుర్తుకు వచ్చింది! అడివిరాముడు తెచ్చిన పార్టీల లిస్టు ప్రకారమే అందరి యిళ్ళకు ఆటోల్లో టాక్సీల్లో వెళ్ళారు! రానూపోనూ ఖర్చులు యెలాగూ ఆళ్ళవే! ఒక్కో నాగపూజకీ దర్శనానికీ మూడువేలు! లేనోళ్ళని చెప్పి పదిమందిలో నలుగురి దగ్గర వెయ్యి లెక్క మాత్రమే తీసుకున్నాడు! కాని వెనకనుండి వాళ్ళ వొక్కొక్కరి దగ్గర మరో వెయ్యి అయినా నొక్కేసి వుంటాడని శీనుగాడు అంచనా వేశాడు!
పాపం పుణ్యం పరమేశ్వరుడికే తెలియాలనుకుంటూండగా- పరమేశ్వరుడి సంగతి యేమోగాని పోలీసులకి తెలిసిపోయింది! దిగిపోయారు! పదివేలు కానిస్టేబుళ్లకు ప్రసాదం పంచినట్టు పంచితే, యింకెవరూ రారని వరమిచ్చి వెళ్ళారు! కాని యస్సై దిగిపోయాడు! సీరియస్ కేసన్నాడు! ‘వన్యప్రాణి సంరక్షణ చట్టం – పంతొమ్మిది వందల డబ్బైరెండు’ ప్రకారం పాముల్ని బంధించడంగాని- వెంట తిప్పుకోవడం గాని- యిబ్బందులకు గురిచేయ్యడం గాని- విషప్రయోగం చెయ్యడం గాని- నేరం! నేరం చేసిన వారికి పాతికవేలు జరిమానా – మూడేళ్ళ వరకూ జైలు’ అని చెప్పాడు!
అప్పటిదాకా మేమింత నేరస్తులమా అన్న సంగతి మల్లిగాడికీ శీనుగాడికీ తెలీలేదు!? తెలిసాక నోరెళ్ళబెట్టారు! “మీరుండగా మేమెందుకు నేరస్తులమవుతాము సారూ?” అడివిరాముడు అతివినయంగా నవ్వి చేతులు నొక్కుకున్నాడు!
ప్రతిదానికీ విరుగుడు వుంటాది! ఆ విషయం లేతవయసయినా యస్సైగారికి బాగా తెలుసు! అందుకే విరుగుడు కింద ఆయనింట్లో నాగపూజ చెయ్యమన్నారు! సరికి సరి అన్నారు!
వీళ్ళూ సరేనన్నారు! అనాల్సొచ్చింది!
రహస్యంగా అది కూడా తప్పు చేసినట్టుగా గుట్టుగా పూజలు చేసుకోవడం యస్సైగారి అమ్మగారికి ససేమిరా నచ్చలేదు! ఆవిడ పూజని గొప్పగా గౌరవంగా నలుగురికీ తెలిసేలాగ అంగరంగ వైభవంగా చేయాలనుకుంది! చేయించుకుంది! ఊరూ వాడా అమ్మలక్కలంతా ముత్తైదువలై కలిసి వచ్చారు! ఫలానా వారి యింట నాగపూజ నభూతో నభవిష్యత్ అన్నట్టు చేశారని నలుగురూ చెప్పుకోవాలని ఆమె ఆశపడింది! మేళతాళాలతో నెరవేర్చుకుంది! అయితే పాములు పాలలో మూతి కూడా పెట్టకపోవడంతో ఆవిడగారు దిగులు పడలేదు! దీనంగా ముఖం పెట్టలేదు! యస్సైగారికి తగ్గ తల్లిగారని మాత్రం అనిపించుకుంది! పాములు నోళ్ళు కుట్టేసి వుండడం ఆవిడగారికి మా చెడ్డ అనుకూలం అయ్యింది! పిల్లలకి పట్టిన పాల గోకురుతో పాములకి కడుపునిండా పాలు పట్టింది… నోళ్ళల్లో పోసింది! శీనుగాడు, మల్లిగాడు యిద్దరూ ఆమెకి సహకరించవలసి వచ్చింది! ‘ఆవిడగారి దగ్గర నాగు పాములు రొన్నాలు వుంటే కొండచిలువలు అయిపోతాయి’ అంటే, ‘కాదు, అనకొండలు అయిపోతాయి’ అని కొందరు గుసగుసలాడుకు నవ్వుకున్నారు!
ఫోటోలూ వాట్సప్పులూ వీడియోలూ… వుత్సవమే నడిచింది! ఆనోటా ఆనోటా విద్యుత్తు అంత వేగంగా ప్రవహించింది! క్షణాల్లో సియ్యైగారి ఆవిడగారికి తెలిసిపోయింది! పట్టుపట్టింది! అంతే!
శీనుగాడు గిల్లడంతో మల్లిగాడు యీ లోకానికి వచ్చాడు! ఇప్పుడు పాములు కక్కకుండా వుంటే పాలు తాగినట్టేనని అనుకున్నాడు! అంతే కాదు, మాటిమాటికి ఫోను వస్తుంటే ఆఫీసరు సారే అవతలాయణ్ణి ‘సారూ’ అని ‘యస్సారూ’ అని అంటుంటే పెనంమీంచి పొయ్యిలోంచి యెక్కడికో జారిపోతున్నట్టు అనిపించింది! ఇంక యెక్కడి దాకా దేకరాలో అనుకున్నాడు!
“విష్ణు వొద్దుగాని ఆ మయేశ్వరాన్ని తియ్యి” అన్నాడు అడివిరాముడు, యేదోలా బయటపడాలని! డబ్బులు వస్తాయో రావో అని శీనుగాడూ మల్లిగాడూ లోలోపల ఆందోళన పడుతూ ముఖాన నెత్తురుచుక్క లేకుండా వున్నారు! ఎందుకో తామున్న యిల్లు యిల్లులా అనిపించలేదు?! పాముల పుట్టలా అనిపించింది! తాము పాములై యెవరి చేతిలోనో తమ తోకలు వున్నట్టుగా ఆడిస్తే ఆడలేనట్టుగా అనిపించింది!
“చిన్ని కృష్ణుడు అలిగితే వెన్నబువ్వ తినిపించకుండా వుంటామా? నాగ దేవత తినకుండా వుంటే పాలు పట్టకుండా వుంటామా?” అని అడివిరాముడు అటు అనేసి యిటు కళ్ళతో హెచ్చరికలు చేశాడు! అర్థం చేసుకున్నట్టు శీనుగాడు తల వూపితే, మల్లిగాడు యెటూ తేల్చుకోలేక అలాగే కొరకొయ్యలా వుండిపోయాడు!
క్షణాల్లో ఆల్చిప్ప సహా ఆవుపాలు సిద్ధం చేశారు! శీనుగాడు మయేశ్వరాన్నిబుట్టలోంచి తీశాడు! అది బుసలు కొట్టకుండా యెటు వేస్తే అటు పడుతూ చేతన లేకుండా బుద్ధిగా వుంది! దాంతో పాలు పట్టడం సులువయ్యింది!
ఇదే అనుకూలమైన సమయమని భావించిన అడివిరాముడు “అయ్యా అమ్మా… మీరొచ్చి మీ దేవతకి మీ చేత్తో మీరే స్వయంగా పాలు పొయ్యండి… పుణ్యం పొందండి… యిలా రండి…” అని సాదరంగా ఆహ్వానించాడు!
సియ్యైదంపతులు వొకరి తరువాత వొకరూ యిద్దరూ కలిసి పుట్టలో పాలు పోసినట్లే పామునోట్లో పాలు పోశారు! పాము నోరు తెరచి జాగ్రత్తగా పట్టుకున్నాడు శీనుగాడు! మల్లిగాడు పాము కళ్ళలోకి చూశాడు! ఎందుకో అది చెప్ప నోరులేక విలవిలలాడుతున్నట్టు అనిపించింది! గమనిస్తే తోకలో తప్ప యెక్కడా జీవం తొణికిసలాడే కదలిక కనిపించలేదు! సన్నటి పాముకు సంచి వేళ్ళాడుతున్నట్టుగా వుండి అది అంతకంతకూ పెరుగుతోంది! అడ్డు చెపుదామని అన్నా యేదో అడ్డం పడింది!
అడివిరాముడి ముఖంలో మాత్రం ఆనందం!
పరమానందంతో సియ్యైగారి బంధుమిత్రులంతా అవకాశం పోతే మళ్ళీ రాదన్నట్టుగా- పుణ్యం మూటకట్టుకోవడానికి సదావకాసంగా భావించి క్యూ కట్టేశారు! అందరూ కలిసి బిందెడు పాలు ఖాళీ చేసి పాము పుట్టలో కాదు, పొట్టలో నింపేశారు!
ఎవరో సాహసించి పామును తాకి ఆ చేతిని హారతి చేతిగా భావించి నెత్తిన పెట్టి రాసుకుంటే- భక్తులైన అందరూ అదేపని చేశారు! మల్లిగాడు వారించి లాభం లేకపోయింది! అంతా అయిపోయింది!
మరోపక్క శీనుగాడు గబగబా మూటా ముల్లె సర్దుతూ వున్నాడు!
అడివిరాముడు సియ్యైగారి దగ్గరకు వెళ్ళి వినయంగా వంగాడు! అప్పుడే ఆ సారు ఫోను మోగింది! “యస్సార్… స్యూర్ సార్…” అని మాటే కాదు, మనిషీ వినయంగానే తన బాడీని ఆటోమేటిక్కుగా మార్చుకున్నాడు!
“డియ్యస్పీ గారింటికి వెళ్ళాలి!” ఆర్డర్ వేసేశాడు!
పిడుగు పడింది!
మల్లిగాడూ శీనుగాడూ ముఖాముఖాలు చూసుకున్నారు! అడివిరాముడు ముఖం గంటు పెట్టుకున్నాడు! “పాములు బాగా అలిసిపోయాయి సార్” అన్నాడు!
“పాములా? నువ్వా?” గద్దింపు స్వరంతో సియ్యై!
లేదన్నట్టు అడ్డంగా తలాడించాడు అడవిరాముడు!
“పాములు బతకవు సార్…” మల్లిగాడు చెప్పబోతే “పాములు కాదు, నువ్వు.. నువ్వు… మీరు బతకరు” అన్నాడు!
మల్లిగాణ్ని వెనక్కిలాగి “మీరెలగ చెప్తే అలగే సార్…” చేతులు జోడించాడు అడవిరాముడు!
“అదికాదు…” మల్లిగాడు యేదో చెప్పబోయాడు! “నా నెత్తిమీద కూర్చున్నాడే ఆడికి నేనేం చెప్పాలి? ఆ? బొక్కలో తోస్తాడు మిమ్మల్నందరినీ…” అంటూ కళ్ళెగరేస్తున్న సియ్యైగార్ని సున్నితంగా ఆపి “నువ్వు నోర్ముయ్యరా బాడుకోవ్…” అని మల్లిగాణ్ని తిట్టాడు అడివిరాముడు!
“మాటలు మర్యాదగా మాట్లాడండి” మల్లిగాడు అడవిరాముడ్ని అనకుండా వుండలేదు!
“నీకు మర్యాదేంట్రా లంజాకొడక…” మీదకి వచ్చాడు సియ్యై! ఇల్లైనా అది పోలీస్టేషన్ అయిపోయింది! అది తెలుగయినా వృత్తి భాషయ్యింది!
“సార్… మీరు పెద్డోలు… నోరుంది కదా అని మాట తూలితే బాగోదు మల్ల…” మల్లిగాడి మాట పూర్తి కాలేదు! చెంప చెళ్ళుమని పేలిపోయింది! అప్పటిదాకా యెక్కడ వున్నాడో తెలీకుండా మూల కూర్చొని వున్న యస్సై… పూజ చేయించుకున్న కుర్ర యస్సై మీదపడి కొట్టాడు! మల్లిగాడు లాఠీ తనచేత్తో కదలకుండా గట్టిగా పట్టుకున్నాడు! అంతే అతని అహమే కాదు, మొత్తం డిపార్ట్మెంటు ఆత్మగౌరవమే కూలిపోయినట్టయింది! దాంతో అంతకు మునుపే పదివేలు లంచాలు తీసుకున్న పోలీసులు మీద పడి కుమ్మేశారు! అడ్డుకోబోయిన శీనుగాడ్ని కూడా చితకబాదేశారు! తన వొంటి మీద దెబ్బ పడకుండా అడవిరాముడు కూడా పోలీసులతో కలసి తనూ వొక చెయ్యీ కాలూ వేశాడు!
బట్టలూ వొళ్ళూ చిరిగిపోయాయి! రూపు రేఖలు గుర్తు పట్టకుండా అయిపోయారు! మల్లిగాడి ముఖం చిట్లిపోయింది! కన్ను లొట్టబోయింది! శీనుగాడి ముక్కు దూలాము విరిగిపోయింది! శ్వాస తీసుకోవడం కష్టమయింది! మల్లిగాడు అన్ని దెబ్బలు తిని కూడా అలాగే యెండు కర్రలా వున్నాడు! నిండుగున్న శీనుగాడు మాత్రం వలవలా పసిపిల్లాడిలా కుమిలి కుమిలి యేడుస్తున్నాడు!
“ఈ లంజా కొడుకుల్ని వేనెక్కించండి…” తిడుతూనే వున్నాడు యస్సై!
“అక్కడ నా మొగుడికి యేమి చెప్పాల?” కోపంగా చూశాడు సియ్యై!
“వస్తారు సార్… నేను దగ్గరుండి తీసుకెళ్తాను సార్… సారీ సార్…” అడవిరాముడు అన్నాడు!
ఎవ్వరి మాటలని విననట్టు తమ బుట్టలు సర్దుకుంటున్నారు మల్లిగాడూ శీనుగాడూ! వాళ్ళని చూస్తుంటే తమనీ తమ మాటనీ లెక్కచేయనట్టు అనిపించింది! అహంకారం కూడా బలిసినట్టు తోచింది! అంతే- యస్సై వొక్క వుదుటన వెళ్ళి వెనుకమారుగా వున్న మల్లిగాణ్ని కాలితో గట్టిగా తాపు తన్నాడు!
ముందుకి… మయేశ్వరం పాము మీద పడ్డాడు మల్లిగాడు! దాంతో పాము కొన ప్రాణం పోవడమే కాదు, దాని నిండుకుండలాంటి పొట్ట అమాంతం పడ్డాడేమో దాని బలహీనమైన చర్మం చిట్లిపోయి అంతవరకూ దాని పొట్టలో వున్న పాలన్నీ బయటకు వచ్చాయి! మార్బులు నేలమీద విస్తరిస్తూ మడుగయ్యాయి!
అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు!
శీనుగాడు నిర్జీవంగా వున్న పాముని పట్టుకొని చూసి “మావా… మయేశ్వరం మనకిక లేదుమావా…” యేడుస్తూ చెపుతుంటే, మల్లిగాడు చూడకూడనిది చూస్తున్నట్టు అలాగే కుప్పకూలిపోయాడు!
భక్తులూ ముత్తైదువలూ పిల్లలూ పల్చగా వుండి యెటు వాళ్ళటు జారుకుంటున్నారు!
గాఢమైన నిశ్శబ్దం!
శీనుగాడికి బుట్టలోని పాముల్ని అక్కడ విసిరేసి “లెగు మావా” అని మల్లిగాడ్ని లేపాడు! ఇద్దరూ వొక్కో అడుగు బయటకు వేస్తున్నారు!
అడవిరాముడు పాముల్ని ముట్టాలని ప్రయత్నిస్తున్నా చేతకావడం లేదు!
“నాగుల చవితినాడు నాగు పాము యింట్లో చనిపోవడం యింటిల్లిపాదికీ అరిష్టం…” తలపండిన ముసలాడి మాట గుండులా దూసుకుపోయింది!
సియ్యై ఫోను మోగింది!
“ముహూర్తం దాటిపోతోంది… కమ్ ఫాస్ట్…”
ఆ నిశ్శబ్దంలో వాయిస్ స్పష్టంగా వినిపించింది!
సియ్యై యస్సై వంక కోపంగా చూశాడు! యస్సై కోపంగా అక్కడే వున్న అడవిరాముడి వంక చూశాడు! “నేను యిప్పుడే వేరేవాళ్ళని పిలుస్తాను సార్…” అని ఫోను డైల్ చేస్తూ పక్కకు వెళ్ళిపోయాడు!
ఇంటి ఆవరణ దాటుతున్న మల్లిగాడి మీదా శీనుగాడి మీదా కుక్కలు పడ్డట్టుగా పోలీసులు పడ్డారు! కొట్టారు! రేవు పెట్టారు!
మాంసపు ముద్దలుగా మిగిలిన యిద్దర్నీ వేన్ యెక్కించారు!
వన్యప్రాణి సంరక్షణా చట్టం కింద అరెస్టు అయిన వారిలో యీ అనామకుల కథ అనామకంగానే వుండిపోయింది!*
Snakes are saved finally !!! Nice ! Thoughtful andi .. presented very well as usual !!
బ్రహ్మ విష్ణు మహేశ్వరం మొత్తం మూడు పాములు కథలో. మూడో పామైన మయేశ్వరం మీద మల్లిగాడు పడడంతో దాని చర్మం చిట్లి పొట్టలోని పాలన్నీ బయటకు వచ్చాయి. అంటే ప్రాణం కూడా! ఇక కథలోని మిగతా రెండు పాములు మాత్రమే కాదు, బందీయై ఆకలితో వున్న యే పామైనా పాలు తాగితే విషం తాగినట్టే అయి చనిపోతాయి! కాకపోతే వొకటీ రెండు రోజుల సమయం పడుతుందంతే! ఇక్కడ బ్రహ్మ అని పేరు పెట్టిన మొదటి పాము అందుకే చలనం లేకుండా వుంది, చివరి క్షణాలు అన్నట్టు! ముఖ్యంగా యీ సమాజం పుట్ట అనుకుంటే మల్లిగాడు, శీనుగాడు కూడా పాములే! (యానాది వీరాస్వామి లాంటి వాళ్ళు పురుగులే! కింది కులాలు యెప్పుడూ అంతే!) వారి బతుకులు కూడా యిక్కడ వేరేవాళ్ళ చేతుల్లో వున్నాయి! కాకపోతే తమ స్థానంలో వేరేవాళ్ళు వచ్చారు! నిచ్చెనమెట్ల వ్యవస్థకు నిదర్శనంగా! ఆదిపత్య వ్యవస్థకు ఆనవాళ్ళుగా! అంతే!